రేకు: 0029-01 శ్రీరాగం సం: 01-176 వైరాగ్య చింత
పల్లవి: |
కోరికె దీరుట యెన్నఁడు గుణమును నవగుణమునుఁ జెడి
వూరక యీమది నీపై నుండుట యెన్నఁడొకో
|
|
చ. 1: |
చిత్తం బాఁకలి దీరదు, చింత దలంపునఁ బాయదు
యెత్తిన పరితాపమునకు నేదీ మితిమేర
హత్తిన పుణ్యము బాపము నప్పటి సుఖముల కొరకే
వత్తికి నూనెఁకు గొలఁదై వడిఁ జనె దివసములు
|
|
చ. 2: |
జీవుఁడె పరతంత్రుఁడుగన చింతింపఁడు నిన్నెప్పుడు
చావునుఁ బుట్టుగు సహజము శరీరధారులకు
శ్రీవనితాహృదయేశ్వ ర శ్రీవేంకటగిరివల్లభ
పావనమతిమైప్రాణులు బ్రదుకుట యెన్నఁడొకో
|
|
రేకు: 0029-02 కాంబోది సం: 01-177 వైరాగ్య చింత
పల్లవి: |
గడ్డపార మింగితే నాఁకలి దీరీనా యీ-
వొడ్డినభవము దన్ను వోడ కమ్ముఁగాక
|
|
చ. 1: |
చించుక మిన్నులఁ బారేచింకలను బండిఁ గట్టి
వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వెరికి నేల చిక్కు
పొంచి పొంచి వలపులు బొండఁబెట్టుఁగాక
|
|
చ. 2: |
మంటమండేయగ్గి దెచ్చి మసిపాఁత మూఁటగట్టి
యింటిలోన దాఁచుకొన్న నితవయ్యీనా
దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు
బంటుఁజేసి ఆసలనే పారఁదోసుఁగాక
|
|
చ. 3: |
పట్టరాని విషములపాముఁ దెచ్చి తలకిందఁ
బెట్టుకొన్నా నది మందపిలి వుండీనా
వెట్టసంసార మిది వేంకటేశుఁ గొలువని-
వట్టిమనుజుల పెడవాడఁబెట్టుఁగాక
|
|
రేకు: 0029-03 కన్నడగౌళ సం: 01-178 వైరాగ్య చింత
పల్లవి: |
కటకటా దేహంబు గాసిఁబెట్టఁగ వలనె
నిటువంటి దెసలచే నిట్లుండవలనె
|
|
చ. 1: |
చంపనొల్లక కదా సంసారమనియెడి-
గంపమోఁపు గడించె కర్మసంగ్రహము
లంపటము విరియించ లావుచాలక తుదిని
దింప నొకకొంతైన తెగుదెంపులేదు
|
|
చ. 2: |
మనుపనోపకకదా మాయవిలంబమున
కనుమూసి కాంక్ష మఱి కట్టె దైవంబు
దినభోగములు విడువఁ దెఱఁ గేమిటను లేక
తనివిఁబొందించ నెంతయు వసముగాదు
|
|
చ. 3: |
తెలుపనోపకకదా తిరువేంకటేశ్వరుఁడు
వెలలేనివేదనల వేఁచెఁ బ్రాణులను
బలిమి నజ్ఞానంబుఁ బాయలే కితనినే
తలఁచి భవబంధముల దాఁటంగరాదు
|
|
రేకు: 0029-04 సామంతం సం: 01-179 వైరాగ్య చింత
పల్లవి: |
అయ్యోపోయఁ బ్రాయముఁ గాలము
ముయ్యంచు మనసున నే మోహమతినైతి
|
|
చ. 1: |
చుట్టంబులా తనకు సుతులుఁ గాంతలుఁ జెలులు
వట్టి యాసలఁ బెట్టువారే కాక
నెట్టుకొని వీరు గడు నిజమనుచు హరి నాత్మఁ
బెట్టనేరక వృధా పిరివీకులైతి
|
|
చ. 2: |
తగుబంధులా తనకుఁ దల్లులునుఁ దండ్రులును
వగలఁ బెట్టుచుఁ దిరుగువారే కాక
మిగుల వీరలపొందు మేలనుచు హరినాత్మఁ
దగిలించ లేక చింతాపరుఁడనైతి
|
|
చ. 3: |
అంత హితులా తనకు నన్నలునుఁ దమ్ములును
వంతువాసికిఁ బెసఁగువారే కాక
అంతరాత్ముఁడు శ్రీవేంకటాద్రీశుఁ గొలువ కిటు
సంత కూటముల యలజడికి లోనైతి
|
|
రేకు: 0029-05 లలిత సం: 01-180 వైరాగ్య చింత
పల్లవి: |
మనసున నెప్పుడు మానదిది
దిన బాధెటువలె దీఱీనో
|
|
చ. 1: |
చిత్త వికారము జీవుల పాపము
తత్తరపరచక తడయ దిది
కత్తులభొనీ కాయపు వయసున-
నెత్తినమదమున కేదిగతో
|
|
చ. 2: |
అసలుఁగంబ మీయాశాదోషము
విసిగిన నూరక విడువ దిది
వసులమూఁట మోపఁగఁ బడవేయఁగ
వసము గాని దెటువలనౌనో
|
|
చ. 3: |
పాము చెలిమి రంపపుసంసారము
గాములమోఁచిన గంప యిది
కామించుచు వేంకటపతిఁ దలఁపక
యేమరివుండిన నేమౌనో
|
|
రేకు: 0029-06 ధన్నాశి సం: 01-181 వైరాగ్య చింత
పల్లవి: |
ఎంత విభవము గలిగె నంతయును నాపదని
చింతించినది గదా చెడనిజీవనము
|
|
చ. 1: |
చలముఁ గోపంబుఁ దనుఁ జంపేటిపగతులని
తెలిసినది యదిగదా తెలివి
తలకొన్నపరనింద తనపాలి మృత్యువని
తొలఁగినది యదిగదా తుదగన్నఫలము
|
|
చ. 2: |
మెఱయు విషయములే తనమెడనున్నవురులుగా
యెఱిఁగినది యదిగదా యెరుక
పఱివోనియాస దనుఁ బట్టుకొను భూతమని
వెఱచినది యదిగదా విజ్ఞానమహిమ
|
|
చ. 3: |
యెనలేని తిరువేంకటేశుఁడే దైవమని
వినఁగలిగినదిగదా వినికి
అనయంబు నతని సేవానందపరులయి
మనఁగలిగినదిగదా మనుజులకు మనికి
|
|