తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 36

వికీసోర్స్ నుండి

రేకు: 0036-01 పాడి సం: 01-220 వైరాగ్య చింత


పల్లవి: ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
       ఆడుకొన్న మాటలెల్లా నవి నిజాలా

చ.1: తొలుకారు మెఱుపులు తోచి పోవుఁగాక
      నెలకొని మింట నవి నిలిచీనా
      పాలఁతుల వలపులు పొలసిపోవుఁగాక
      కలకాలం బవి కడతేరినా

చ.2: యెండమావులు చూడ నేరులై పారుఁగాక
       అండకుఁబోవ దాహ మణఁగీనా
       నిండినట్టి మోహము నెలఁతల మదిఁ జూడ
       వుండినట్టేవుండుఁగాక వూఁతయ్యినా

చ.3: కలలోనిసిరులెల్ల కనుకూర్కులేకాక
      మెలఁకువఁ జూడ నవి మెరసీనా
      అలివేణులమేలు ఆసపాటేకాక
      తలఁపు వేంకటపతిఁ దగిలీనా

రేకు: 0036-02 ఆహిరి సం: 01-221 అధ్యాత్మ


పల్లవి:ఏమి సేయఁగవచ్చు నీశ్వరాధీనంబు
       తామసపుబుద్ధి కంతలు దూరవలసె

చ.1:తెగి దురాపేక్షఁబడ తివియ గతిలేదుగన
      పగగొన్న వగలకూపములఁ బడవలసె
      తగుమోహసలిలంబు దాఁట మతి లేదుగన
      మగుడఁబడి భవముతో మల్లాడవలసె

చ.2:పాపకర్మములఁ జంపంగ శక్తిలేదుగన
      కోపబుద్ధులచేత కొరమాలవలసె
      రూపములఁ బొడగాంచి రోయఁదరిలేదుగన
      తాపములచేఁ బొరలి తగులుగావలసె

చ.3:తిరువేంకటాచలాధిపుఁగొాలువలేదుగన
      గరిమెచెడి విషయకింకరుఁడు గావలసె
      పరతత్వమూర్తిఁ దలఁపఁగఁ బ్రొద్దులేదుగన
      దొరతనం బుడిగి యాతురుఁడు గావలసె

రేకు: 0036-03 వరాళి సం: 01-222 వైరాగ్య చింత


పల్లవి: తనవారని యాస దగిలి భ్రమయనేల
        తనువు బ్రాణునికంటె తగులేది

చ. 1: తనువుఁ బ్రాణుడు రెండు తగిలి గర్భమునందు
        వొనర నేకమై యుదయించి
        దినములు చెల్లిన తివిరి యాప్రాణుఁడు
        తనువువిడిచిపోయ దయలేక

చ. 2: ప్రాణికై దేహము పాపపుణ్యముసేయు
        ప్రాణి వెంటనె బొంది పాశుండదు
        ప్రాణి యచ్చటనైన బాధలఁ బడకుండ
        ప్రాణి రక్షించు బొందిబడి దాఁ బోయనా

చ. 3: యెరవుల దేహలివి నిజమని నమ్మి
        యెరిఁగీనెఱుఁగలే రిది యాలా
        అరయఁ బరమునకు నాది పురుషుఁడై
        పరగుశ్రీ వేంకటపతి గలిగుండఁగా

రేకు: 0036-04 సామంతం సం: 01-223 అధ్యాత్మ


పల్లవి :

సకల భూతదయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహ సంభవమైన ఫలము


చ. 1:

తలకొన్నఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైనఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృపగలిగినఫలము


చ. 2:

యెప్పుడుఁ దిరివేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైనఫలము
కప్పినసౌఖ్యదుఃకర్మములు సమముగా
నొప్పుట విజ్ఞానమొదవినఫలము

రేకు: 0036-05 వరాళి సం: 01-224 అధ్యాత్మ


పల్లవి:అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
       వన్నెల నప్పులుగొన్నవారువో వీరు

చ.1:తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి | వారు
      తగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగి
      వెగటునఁ బారిపోఁగా వెంట వెంట | పెక్కు
      పగల నప్పులుగొన్న వారువో వీరు

చ.2:సేయరానిపనులెల్లఁ జేసిచేసి | తవ-
      రాయడికి లోలోనే రాసిరాసి
      కాయములోచొచ్చిచొచ్చి కాఁచికాఁచి | మున్ను
      వ్రాయనిపత్రాల కాఁగేవారువో వీరు

చ.3:దొరయై యప్పులవారిఁ దోసితోసి | యీ-
      పరిభవములనెల్లఁ బాసిపాసి
      సిరులవేంకటపతిఁ జేరిచేరి | యిట్టి ...
      వరుసనే గెలిచినవారువో వీరు


రేకు: ౦౦36-06 కన్నడగౌళ సం: 01-225 వైరాగ్య చింత

పల్లవి:

ఏది కడ దీని కేది మొదలు | వట్టి ...
వేదనలు తన్ను విడుచు టెన్నఁడు

చ. 1:

తొడరినహృదయమే తోడిదొంగయై
వడిగొని తన్ను వలఁబెట్టఁగాను
కడఁగి కర్మములఁ గడచు టెన్నడు
నిడినిబంధముల నీఁగు టెన్నఁడు

చ. 2:

తతిగొన్న తలఁపులే దైవయోగమై
మతినుండి తన్ను మరిగించఁగాను
ప్రతిలేని యాపదఁ బాయు టెన్నఁడు
ధృతిమాలిన యాస దీరు టెన్నఁడు

చ. 3:

పొదలిన మమతయే భూతమై తన్నుఁ
బొదిగొని‌ బుద్ధి బోధించఁగాను
కదిసి వేంకటపతిఁ గసుట యెన్నఁడు
తుదలేనిభవములఁ దొలఁగు టెన్నఁడు

రేకు: 0036-07 శుద్దవసంతం సం; 01-226 భగవద్గీత కీర్తనలు


పల్లవి: కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు
        కడలేని మనసునకుఁ గడమ యెక్కడిది

చ.1: దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న
       దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు
       దేహంబుగలయన్ని దినములకుఁ బదార్థ-
       మోహమేలుడుగు దా ముదమేల కలుగు

చ.2: ముంద రెరిఁగిన వెనుక మొదలు మరచెదనన్న
       ముంద రేమెరుఁగుఁ దా మొదలేల మరచు
       అందముగఁ దిరువేంకటాద్రీశు మన్ననల
      కఁదువెరిఁగినమేలు కలనైన లేదు