Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 16

వికీసోర్స్ నుండి


రేకు: 0016-01 శ్రీరాగం సం: 01-095 వైరాగ్య చింత

పల్లవి:
ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె
వేదువిడిచిన కూడు వెదకినను లేదు

చ.1:
ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకు
పైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాక
యేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికి
కైకొన్నదురితములు కలపాటిగాక

చ.2:
హితవైనమమకార మెందుఁగల దిందరికి
ప్రతిలేని విరహతాపము కొలఁదిగాక
మతిలోని వేడుకలు మరియేమి మనుజులకు
జితమైన దైవమిచ్చిన పాటిగాక

చ.3:
యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకు
పరిమైనకర్మంబు పరిపాటిగాక
యెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁ
దిరువేంకటేశుకృప తిరమైనఁ గాక


రేకు: 0016-02 బౌళి సం; 01-096 వైరాగ్య చింత


పల్లవి:
చూడరెవ్వరు దీనిసోద్యంబు పరికించి
చూడఁజూడఁగఁ గాని సుఖమెఱఁగరాదు

చ.1:
ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపు
కడలేని యాస చీఁకటి దవ్వుకొనుట
నిడివైన కనుచూపు నీడనుండిన యెండ
వడిచెడని తమకంబు వట్టితాపంబు

చ.2:
బుద్ధిమానిన చింత పోనియూరికిఁ దెరువు
పొద్దువోవని వలపు పొట్టపొంకంబు
యెద్దుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియము
లొద్దిక విహారంబు లుబ్బుఁగవణంబు

చ.3:
తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని-
చూపు దనుఁ బొడగనని చూపు లోచూపు ,
ఆపదలువాయు నెయ్యపుఁ దలఁపులీతలఁపు
రూపైన రుచిలోని రుచి వివేకంబు


రేకు: 0016-03 నాట సం; 01-097 వైరాగ్య చింత


పల్లవి:
ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ-
నెవ్వరికి నేమౌనో యీ జీవుఁడు

చ.1:
ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక
కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు
యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-
మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు

చ.2:
యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-
కెక్కడో తనజన్మ మీ జీవుఁడు
యెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యొప్పు-
డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు

చ.3:
ఎన్నఁడును జేటులేనీ జీవుఁడు వెనక-
కెన్నిదనువులు మోవఁడీ జీవుఁడు
యెన్నఁగల తిరువేంకటేశు మాయలఁ దగిలి
యెన్నిపదవులఁబొందఁ డీజీవుడు


రేకు: 0౦16-౦04 సామంతం సం; 01-౦98 వైరాగ్య చింత

పల్లవి:
ఎంత చేసిన తనకేది తుద
చింత శ్రీహరిపైఁ జిక్కుటే చాలు

చ.1:
ఎడపక పుణ్యాలెన్ని చేసినాఁ
గడమే కాకిఁక గడ యేది
తడఁబడ హరియే దైవమనుచును మది
విడువక వుండిన వెరవే చాలు

చ.2:
యెన్నితపము లివి యెట్లఁ జేసినా
అన్నువ కథికము కలవేది
వన్నెలఁ గలఁగక వనజాక్షునిపై
వున్న చిత్తమది వొక్కటే చాలు

చ.3:
యిందరివాదము లెట్ల గెలిచినా
కందే గాకిఁక గరిమేది
ఇందరినేలిన యీ వేంకటపతి
పొందగు మహిమల పొడవే చాలు


రేకు: 0016-05 నారణి సం: 01-099 వైరాగ్య చింత


పల్లవి:
ఏణ నయనల చూపులెంత సాబగ్రైయుండు
ప్రాణ సంకటములగు పనులు నట్లుండు

చ.1:
ఎడలేని పరితాప మేరీతిఁ దానుండు
అడియాస కోరికలు నటువలెనె యుండు
కడలేని దుఃఖసంగతి యెట్లుఁ దానుండు
అడరు సంసారంబు నట్లనే వుండు

చ.2:
చింతా పరంపరలఁ జిత్తమిది యెట్లుండు
వంతఁ దొలఁగన మోహవశము నట్లుండు
మంతనపుఁ బనులపయి మనసు మరియెట్లుండు
కంతుశరమార్గముల గతి యట్లనుండు

చ.3:
దేవుఁడొక్కఁడె యనెడి తెలివి దనకెట్లుండు
శ్రీవేంకటేశు కృపచేత లట్లుండు
భావగోచరమైన పరిణతది యెట్లుండు
కైవల్యసౌఖ్య సంగతులు నట్లుండు

రేకు: 0016-06 గీతం - నాట 01-100 వేంకటగానం


పల్లవి :

ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగ
త్రిలోకపావనము చేయను త్రిపథగామిని ఆయను
యేదైవమునాభి నలినంబున జనియించిన అజుండు
అఖిలాండంబులు సృజియింప నధిపతి ఆయను


చ. 1:

యేదైవమువురస్థలంబు దనకును మందిరమైన యిందిర
మాతయయ్యే యీజగంబుల కెల్లను
యేదైవము అవలోకన మింద్రాదిది విజగణంబుల
కెల్లప్పుడును సుఖంబు లాపాదించును


చ. 2:

యేదైవము దేహవస్తువని అనిమిషులందరుఁ గూడి
శ్రీనారాయణ దేవుండని నమ్మి యుండుదురు
ఆదేవుఁడే సిరుల కనంతవరదుఁడు తిరువేంకట-
గిరినాథుఁడుభయ విభూతినాథుఁడే నానాథుఁడు