Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 15

వికీసోర్స్ నుండి


రేకు: 0015-01 ఆహిరి సం: 01-089 వైరాగ్య చింత


పల్లవి:
ఊరికిఁ బోయెడి వోతఁడ కడు-
చేరువతెరు వేఁగి చెలఁగుమీ

చ.1:
ఎడమతెరువువంక కేఁగిన దొంగలు
తొడిఁబడ గోకలు దోఁచేరు
కుడితెరువున కేఁగి కొట్టువడక మంచి-
నడిమితెరువుననే నడవుమీ

చ.2:
అడ్డపుఁ దెరువుల నటునిటుఁ జుట్టాలు
వెడ్డువెట్టుచు నిన్ను వేఁచేరు
గొడ్డేరేచిన్నదిడ్డితెరువు వోక
దొడ్డతెరువువంక తొలఁగుమీ

చ.3:
కొండతెరువు కేఁగి కొంచపుసుఖముల
బండై తిరుగుచు బడలేవు
అండనుండెడిపరమాత్ముని తిరుమల-
కొండతెరువు తేఁకువ నేఁగుమీ


రేకు: 0015-02 ఆహిరి సం: 01-090 వైరాగ్య చింత


పల్లవి:
అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి
కుక్కనోరికళాసమై కొల్లఁబోయ బతుకు

చ.1:
ఎండచేత నీడచేత నెల్లవాఁడు నిట్లానే
బండుబండై యెందుఁ గడపల గానక
వుండగిలి నరకాల నుడుకబోయెద మింక
వండఁ దరిగినకూరవలెనాయ బతుకు

చ.2:
పంచమహపాతకాలబారిఁ బడి భవములఁ
దెంచి తెంచి ముడివేయ దీదీపులై
పొంచినయాసలవెంటఁ బొరలఁబోయెద మింక
దంచనున్న రోలిపిండితలఁపాయ బతుకు

చ.3:
యీదచేత వానచేత నెల్లవాఁడు బాయని-
బాదచేత మేలెల్ల బట్టబయలై
గాదిలివేంకటపతిఁ గానఁగఁబోయెద మింక
బీదగరచినబూరెప్రియమాయ బ్రదుకు

రేకు: 0015-03 సామంతం సం: 01-091 వైష్ణవ భక్తి


పల్లవి :

నాఁటికి నాఁడే నా చదువు
మాటలాడుచును మఱచేటి చదువు


చ. 1:

ఎనయ నీతని నెఱుఁగుటకే పో
వెనకవారు చదివినచదువు
మనసున నీతని మఱచుటకే పో
పనివడి యిప్పటిప్రౌఢలచదువు


చ. 2:

తెలిసి యితనినే తెలియుటకే పో
తొలుతఁ గృతయుగాదులచదువు
కలిగినయీతనిఁ గాదననే పో
కలియుగంబులోఁ గలిగినచదువు


చ. 3:

పరమని వేంకటపతిఁ గనుటకే పో
దొరలగు బ్రహ్మాదులచదువు
సిరుల నితని మఱచెడికొరకే పో
విరసపుజీవులవిద్యలచదువు


రేకు: 0015-04 నాట సం: 01-092 ఉత్సవ కీర్తనలు


పల్లవి: ఇటు గరుడని నీవెక్కినను
పటపట దిక్కులు బగ్గనఁ బగిలె

చ.1: ఎగసిన గరుడని యేపున 'ధా' యని
జిగిదొలఁక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమ సంఘములు
గగనము జగములు గడగడ వడఁకె

చ.2: బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరుపున నలుగడ దిరదిరఁ దిరిగె

చ.3: పల్లించిన నీ పసిఁడి గరుడనిని
కెల్లున నీ వెక్కినయపుడు
ఝల్లనె రాక్షస సమితి నీ మహిమ
వెల్లి మునుఁగుదురు వేంకటరమణా


రేకు: 0015-05 నాదరామక్రియ సం: 01-093 భక్తి


పల్లవి:
ఈ సురలీ మునులీ చరాచరములు
యీ సకలమంతయు నిది యెవ్వరు

చ.1:
ఎన్నిక నామము లిటు నీవైయుండఁగ
యిన్నినామముల వారిది యెవ్వరు
వున్నచోటనే నీవు వుండుచుండఁగ మరి
యిన్నిటాఁ దిరుగు వారిది యెవ్వరు

చ.2:
వొక్కరూపై నీవు వుండుచుండఁగ మరి
తక్కిన యీరూపములు తా మెవ్వరు
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ
మక్కువ నుండువారు మరి యెవ్వరు

చ.3:
శ్రీవేంకటాద్రిపై చెలఁగి నీవుండఁగా
దైవంబులనువారు తా మెవ్వరు
కావలిసినచోట కలిగి నీ వుండఁగ
యీవిశ్వపరిపూర్జు లిది యెవ్వరు


రెకు: 0015-06 లలిత సం; 01-094 అధ్యాత్మ


పల్లవి:
తాప లేక మేడ లెక్కఁదలఁచేము
యేపులేని చిత్తముతో యీహీహీ నేము

చ.1:
ఎఱుకమాలినబుద్ది యెవ్వరైనాఁ బతులంటా
తెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేము
పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా
వొఱపు నిలిపిన ట్లోహోహో నేము

చ.2:
యిందరును హితులంటా యెందైనా సుఖమంటా
పొందలేనిబాధఁ బొరలేము
మందమతిఁవాడు యెండమావులు చెరువులంటా
అందునిందుఁ దిరిగిన ట్లాహాహా నేము

చ.3:
మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటా
నాటకపు తెరువుల నడిచేము
గూటిలో దవ్వులవాఁడు కొండలెల్ల నునుపంటా
యేటవెట్టి యేఁగిన ట్లీహీహీ నేము