రేకు: 0017-01 ఆహిరి సం: 01-101 భక్తి
పల్లవి: |
ఏఁటికి దలఁకెద రిందరును
గాఁటపు సిరులివి కానరో ప్రజలు
|
|
చ. 1: |
ఎండలఁ బొరలక యేచిన చలిలో
నుండక చరిలోనుడుకక
అండనున్న హరి నాత్మఁదలఁచిన
పండిన పసిఁడే బ్రతుకరో ప్రజలు
|
|
చ. 2: |
అడవుల నలియక ఆకునలముఁదిని
కడుపులు గాలఁగఁ గరఁగక
బడి బడి లక్ష్మిపతికి దాసులై
పొడవగు పదవులఁ బొందరో ప్రజలు
|
|
చ. 3: |
పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ
దిక్కులనంతటఁ దిరుగక
గక్కన తిరువేంకటగిరిపతిఁ గని
వొక్క మనసుతో నుండరొ ప్రజలు
|
|
రేకు: 0017-02 బౌళి సం: 01-102 వైరాగ్య చింత
పల్లవి : |
ఏది తుద దీనికేది మొదలు
పాదుకొను హరి మాయఁ బరగు జీవునికి
|
|
చ. 1: |
ఎన్ని బాధలు దనకు నెన్ని లంపటములు
యెన్ని వేదనలు మరియెన్ని దుఃఖములు
యెన్ని పరితాపంబు లెన్నిదలపోఁతలు
యెన్ని చూచిన మరియు నెన్నైనఁ గలవు
|
|
చ. 2: |
యెన్ని కొలువులు దనకు నెన్ని యనుచరణలు
యెన్ని యాసలు మరియు నెన్ని మోహములు
యెన్ని గర్వములు దనకెన్ని దైన్యంబులివి
ఇన్నియునుఁ దలఁప మరి యెన్నైనఁ గలవు
|
|
చ. 3: |
యెన్నిటికిఁ జింతించు నెన్నిటికి హర్షించు
నెన్నిటికి నాసించు నెన్నిటికిఁ దిరుగు
యిన్నియును దిరు వేంకటేశులీలలు గాఁగ
నెన్ని చూచినను దా నెవ్వఁడునుగాఁడు
|
|
రేకు: 0017-03 సామంతం సం: 01-103 అధ్యాత్మ
పల్లవి : |
చక్కఁదనములువారి సతులాల
యిక్కువ తెక్కువల మీ రేమిసేసే రిఁకను
|
|
చ. 1: |
ఒప్పుగా నరకము మాకు బళిచ్చి మనమెల్ల
కప్పము గొంటిరిగా యంగనలార
అప్పుడే గోవిందునికి ఆహి వెట్టితిఁ జిత్తము
యుప్పుడు యెమ్మెల మీ రేమి సేసేరిఁకను
|
|
చ. 2: |
పంచమహాపాతకాలబారిఁ దోసి మాసిగ్గులు
లంచము గొంటిరిగా నెలఁతలార
వంచనతోడుత హరివారమైతి మిఁక మీ
యుంచుకగుట్టుల మీరెందు చోచ్చే రిఁక
|
|
చ. 3: |
దొంగిలి మాగుట్టులెల్లా దోవ వేసి మరుబారి
భంగ పెట్టితిరిగా వోభామలార
చెంగలించి వేంకటేశుసేవకుఁ జొచ్చితిమి
యెంగిలి మోవులును మీ రేడఁబడే రిఁకను
|
|
రేకు: 0017-04 బౌళి సం: 01-104 వైరాగ్య చింత
పల్లవి : |
ఎట్టుచేసినఁ జేసె నేమి సేయఁగవచ్చు
చుట్టపువిరోధంబు సునాస్త్రుచ్రెలిమి
|
|
చ. 1: |
ఒడలిలోపలిరోగ మొనరఁ బరితాపంబు
కడుపులోపలిపుండు కడలేనియాస
తడిపాఁత మెడగోఁత తలఁపు విషయాసక్తి
గుడిమీఁదితరువు ఆలకులము ప్రాణలకు
|
|
చ. 2: |
నీడలోపల యెండ నెలకొన్న బంధంబు
గోడపై సున్నంబు కొదలేని యెఱుక
పాడూరిలో బ్రదుకు పాపకర్మపుబుద్ధి
తాడుపై తపసు తమధనము ప్రాణులకు
|
|
చ. 3: |
మంటఁజేసిన బొమ్మమనికి సంసారంబు
రెంటికినిగాని వీరిడికొలువు బ్రదుకు
యింటివేలుపు వేంకటేశుఁ గొలువక పరుల-
వెంటఁ దిరుగుట వోడ విడిచి వదరిడుట
|
|
రేకు: 0017-05 వరాళి సం: 01-105 దశావతారములు
పల్లవి : |
తలఁపు కామాతురత్వముమీఁదనలవడిన
నిల నెట్టివారైన నేలాగు గారు
|
|
చ. 1: |
ఓలినిరువురుసతుల నాలింగనముసేయ
లోలుఁడటుగానే నాలుగుచేతులాయ
వేలసంఖ్యలు సతుల వేడుకల రమియింపఁ
బాలుపడెఁగాన రూపములు పెక్కాయ
|
|
చ. 2: |
పొలయలుకకూటముల భోగి దా నటుగాన
మలసి యొక్కొకవేళ మారుమొగమాయ
లలితలావణ్యలీలావిగ్రహముగాని
కొలఁది వెట్టఁగరానిగోళ్ళు నిడుపాయ
|
|
చ. 3: |
చిరభోగసౌఖ్యములఁ జెంద ననుభవిగాన
తిరువేంకటాచలాధీశ్వరుండాయ
పరగ సంసారసంపదకు బద్ధుఁడు గాన
అరుదుగా సకలాంతరాత్మకుండాయ
|
|
రేకు: 0017-06 లలిత సం: 01-106 వైరాగ్య చింత
పల్లవి : |
ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ
జిక్కి జీవుఁడు మోక్షసిరిఁ జెందలేఁడు
|
|
చ. 1: |
ఒడలు మంసపూర మొక పూఁటయిన మీఁదు
గడుగకున్నఁ గొరగాదు
కడలేనిమలమూత్రగర్హిత మిది, లోను
గడుగరాదు యెంతగడిగినఁ బోదు
|
|
చ. 2: |
అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁ
గలసిన పెనుగాలి గనము
మెలుపులేనిచిచ్చు మీఁదమిక్కిలిఁ గొంత
నిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు
|
|
చ. 3: |
తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద-
కరుఁడు జీవునకు రక్షకుఁడు
కరుణించి యొకవేళఁ గాచినఁగాని మేను-
చొరకమానెడు బుద్ది చోఁక దెవ్వరికి
|
|