తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 299

వికీసోర్స్ నుండి


రేకు: 0299-01 శంకరాభరణం సం: 03-572 శరణాగతి

పల్లవి:

తన చిత్తము కొలఁది తమకించ నిఁకనేల
మనసు వచ్చినప్పుడే మన్నించీఁ గాక

చ. 1:

కొండలందు నదులందుఁ గోరి యాకసాన భువి
నిండియున్నాఁడు తొలుతే నీలవర్ణుఁడు
అండనే నాయందు లోకులందు నుండుటరుదా
గండికాఁడై తన మాయ గాననీఁడుఁ గాక

చ. 2:

గాలియై పంచమ(?) వాద్యగతులై శబ్దములై
ఆలకించి పలికీని యాదిమూరితి
నాలుక కొననే వుండి నానాభాష లాడీని
కాలముతో నెదిరికిఁ గాననీఁడుఁ గాక

చ. 3:

వేదమందు శాస్త్రమందు వేవేలు వాదములందు
పాదుకొని బోధించీఁ బరమాత్ముఁడు
యీదెసనే శ్రీవేంకటేశుఁడై పొడచూపె
గాదిలి తన దాసులఁ గరుణించీఁ గాక


రేకు: 0299-02 లలిత సం: 03-573 శరణాగతి

పల్లవి:

శ్రీపతి యొకఁడే శరణము మాకును
తేప యితఁడె మఱి తెరఁగేది

చ. 1:

ఆసలు మిగులా నాతుమ నున్నవి
యీసు లేని సుఖ మెక్కడిది
చేసిన పాపము చేతుల నున్నది
మోసపోని గతి ముందర నేది

చ. 2:

కోపము గొందుల గుణముల నున్నది
యేపున నిజసుఖ మిఁక నేది
దీపనాగ్నితోఁ దిరిగెటి దేహము
పైపై విరతికిఁ బట్టేది

చ. 3:

పంచేంద్రియముల పాలిటి బదు కిది
యించుక నిలుకడ కెడ యేది
యెంచఁగ శ్రీవేంకటేశ్వరుఁ డొకడే
పంచిన విధులను పాలించుఁ గాక


రేకు: 0299-03 మాళవిగౌళ సం: 03-574 నామ సంకీర్తన

పల్లవి:

నారాయణ నీ నామమహిమలకు
గోరఁ బోవుటకు గొడ్డలి దగునా

చ. 1:

హరియని నొడిగిన నణఁగేటి పాపము
సిరుల నేను నుతిసేయఁగఁగలనా
పరగిన పిచ్చుకపై బ్రహ్మాస్త్రము
దొరకొని వూరకె తొడిగినయట్లు

చ. 2:

అచ్చుత యనఁగా నందెటి సంపద
యిచ్చల నెంచిన నిలఁగలవా
కొచ్చికొచ్చి యొక కొండంత కనకము
వెచ్చపుఁ బోఁకకు వెల యిడినట్లు

చ. 3:

యెదుటనే శ్రీవేంకటేశ్వర యనఁగాఁ
బొదిగెటి తపముల పుణ్యము గలదా
కదిసి సముద్రము గడచి వోడలోఁ
జిదిసి యినుము దెచ్చినయట్లు


రేకు: 0299-04 లలిత సం: 03-575 శరణాగతి

పల్లవి:

నీవెటు దలఁచిన నిఖిలము నట్టౌ
యేవల స్వతంత్ర మింతా నీది

చ. 1:

యేఁటి పురాకృత మెక్కడి కర్మము
దాఁటక హరి నీ దయ గలిగితే
నీటున నిన్నియు నీ కల్పితములు
పాటించి నీవే పాపఁగలేవా

చ. 2:

యెక్కడి జన్మము లెక్కడి మరణము-
లొక్కఁడవె నీవు వొద్దంటే
యెక్కువ నిందరి నేలెటివాఁడవు
యిక్కడఁ గొలిచితి మితరము లేలా

చ. 3:

యేది పాపము యేది పుణ్యము
పోదిగ నీవే పొమ్మంటే
చేదో డిందుకు శ్రీవేంకటేశ్వర
ఆదె నిను శరణంటిమి గొంత


రేకు: 0299-05 ముఖారి సం: 03-576 వైరాగ్య చింత

పల్లవి:

నానాఁటి బదుకు నాఁటకము
కానక కన్నది కైవల్యము

చ. 1:

పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమి పని నాఁటకము
యెట్టనెదుటఁ గలదీ ప్రపంచమును
కట్టఁగడపటిది కైవల్యము

చ. 2:

కుడిచే దన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాఁటకము
వొడిఁ గట్టుకొనిన వుభయకర్మములు
గడి దాఁటినపుడే కైవల్యము

చ. 3:

తెగదు పాపమును తీరదు పుణ్యము
నగినగి కాలము నాఁటకము
యెగువనె శ్రీవేంకటేశ్వరుఁ డేలిక
గగనము మీఁదిది కైవల్యము


రేకు: 0299-06 సాళంగనాట సం: 03-577 కృష్ణ

పల్లవి:

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీఁడు
తిద్దరాని మహిమల దేవకిసుతుఁడు

చ. 1:

అంతనింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూఁడులోకాల గరుడపచ్చఁబూస
చెంతల మాలోనున్న చిన్నికృష్ణుఁడు

చ. 2:

రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ముఁ గాచేటి కమలాక్షుఁడు

చ. 3:

కాళింగుని తలల పైఁ గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాలజలనిధిలోనఁ బాయని దివ్యరత్నము
బాలుని వలెఁ దిరిగీఁ బద్మనాభుఁడు