తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 300
రేకు: 0300-01 దేసాక్షి సం: 03-578 అధ్యాత్మ
పల్లవి:
ఇందరు నెఱిఁగినదీ బదుకు
పొందినదాఁకా భోగించవలయు
చ. 1:
పొట్టఁ బొరుగులివె పుణ్యపాపములు
నట్టనడుమనే నా బదుకు
వెట్టిమోపువో వెడ సంసారము
ముట్టినదాఁకా మోవఁగవలెను
చ. 2:
తోడునీడ యిది తొలఁగని జన్మము
యేడకుఁ బోరాదు యీ బదుకు
వీడని కట్లు వెడవెడ యాసలు
వూడినదాఁకా నుండఁగవలెను
చ. 3:
చేతిలో ధనము శ్రీవేంకటపతి
యీతని తోడిదె యీబదుకు
ఆతుమలోనే యల వైకుంఠము
ధాతు మాతుగని తలఁచఁగవలెను
రేకు: 0300-02 లలిత సం: 03-579 విష్ణు కీర్తనం
పల్లవి:
నీవే యంతర్యామివి నీ వున్నదే వైకుంఠము
ఆవలఁ బరమపదమన నింకాఁ గలదా
చ. 1:
యిందరు జంతువులు నీ విచ్చిన రూపులు మోచి
బొందితో నీకే నెలవై పుట్టినారు
కందువ నీ ప్రపంచపు కైంకర్యములు సేసి
అందిరి జీవన్ముక్తు లదివో చాలదా
చ. 2:
యేలిక వంచిన పనే యింద్రియభోగములెల్ల
తోలితోలి రాచాజ్ఞ తోయకున్నారు
కాలము నిన్నుఁ బాయరు గర్భగోళమం దున్నారు
యీ లోకమే సాలోక్యమిది యింత చాలదా
చ. 3:
జ్ఞానము నజ్ఞానమేది స్వామికార్యములోన
మానక నీ పనులలో మత్తులైనారు
శ్రీనాథుఁడవు నీవే శ్రీవేంకటేశ్వర
నీ నాటకములోనే నిత్యులైరి చాలదా
రేకు: 0300-03 ధన్నాసి సం: 03-580 శరణాగతి
పల్లవి:
పరిణామమే మాకుఁ బతివి నీవు గలుగ
శరణాగతే మాకు సకలరక్షయ్యా
చ. 1:
నుదుటి వ్రాసిన వ్రాఁత నూఁటికి నీ తిరుమణి
యెదురేది మాకు నేఁడు యేఁడులోకాల
పెదవి మీఁదటి తేనె పేరుకొనే నీ జపము
అదన మాకు నదివో అక్కరలేదయ్యా
చ. 2:
చేతికి వచ్చిన సొమ్ము చేరె నీ శంఖుచక్రాలు
ఘాతల మా కిఁక నేది గడమ లేదు
నీతితో వెనుబలము నీ దాసుల సేవ
రాతిరిఁబగలు నిదె రాజుల మోయయ్యా
చ. 3:
తొల్లిఁటి పుణ్యఫలముతోడనే నీ సంకీర్తన
తల్లిదండ్రి నీవు నీ తరుణియును
యెల్లగా శ్రీవేంకటేశ యిన్నియుఁ గలిగె మాకు
చల్లఁగా బ్రతికితిమి జయ మందవయ్యా
రేకు: 0300-04 పాడి సం: 03-581 శరణాగతి
పల్లవి:
ఇందులోన నే నెవ్వరిఁబోలుదు
అంది వీవాఁడ నే ననుకొంటిఁ జుమ్మీ
చ. 1:
జలజనాభ నీ శరణనువారలు
అల నారదసనకాదులు
కెలన మరియు నీ కింకరవర్తులు
తెలిసిన బ్రహ్మాదిదేవతలు
చ. 2:
నోరార హరి నిను నుతించువారలు
చేరువ నుండేటి శేషాదులు
ధారుణిలో నీదాసాన(ను?)దాసులు
మారుతిముఖ్యులు మహామహులు
చ. 3:
బడి నీచే ముక్తి వడసినవారలు
సుడిగొను మునిజన శుకాదులు
కడఁగిన శ్రీవేంకటపతి నీవే
తడవి నన్ను దయదలఁచుమీ
రేకు: 0౩00-05 శుద్ధవసంతం సం: 03-582 అధ్యాత్మ
పల్లవి:
అక్షయంబగు మోక్ష మందుటే తగుఁగాక
భక్షించు పండ్లకు బ్రాణ మీఁదగునా
చ. 1:
కొండంత పసిఁడి కలగూరకె వెల యిడిన-
నిండిన వివేకులకు నేరమిది గాదా
దండమిడి హరి నిన్ను దలఁచిన ఫలంబెల్ల-
నండ పాపము వాపు మనుట కిది దగునా
చ. 2:
గుఱుతు గల రత్నంబు గుగ్గిళ్లు గొనఁగ వెల-
పఱచుటే తన బుద్ధి పాడౌట గాదా
అఱిముఱి హరి నిన్నునర్చించు ఫలమెల్ల
కఱకుఁ దన దేహభోగముల కనఁదగునా
చ. 3:
కామ ధేనువు దెచ్చి కాసుకె వెలకొసగ
కామించి నధికులకు కడుఁ గొరత గాదా
శ్రీమంతుఁడై నట్టి శ్రీవేంకటేశ నిను
సేమమునఁ గొలిచి తుచ్చెము లడుగఁదగునా
రేకు: 0300-06 దేసాళం సం: 03-583 అధ్యాత్మ
పల్లవి:
ఎవ్వరము నేమి సేసేమేమి గడమలు నీకు
రవ్వగా శరణంటే రక్షించుటింతే
చ. 1:
అందరుఁ జేసిన కర్మములవి నీకు జీవనమై
అంది జీవించేవంటే నదియూఁ గాదు
కొందరు సురల(లు?)తోడై కూడి రాఁగా నసురల-
యిందరి గెలిచేవంటే నిదియూఁ గాదు
చ. 2:
వొకచోటఁ గలవు వేరొక చోట లేవంటే-
నకటా యెంచి చూచిన నదియూఁ గాదు
మొకమిచ్చి వొక గుణమునఁ దిరిగేవంటే
సకలగుణుఁడ వాజాడయుఁ గాదు
చ. 3:
కపట మిదనరాదు కడునవు ననరాదు
వుపమించరాదు వొల్లకుండఁగరాదు
యెపుడును శ్రీవేంకటేశ నీ చిత్తమింతే
విపరీతములు లేవు వెలితీ లేదు