తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 298

వికీసోర్స్ నుండి


రేకు: 0298-01 దేవగాంధారి సం: 03-566 వైరాగ్య చింత

పల్లవి:

మాయామోహము మాన దిది
శ్రీయచ్యుత నీ చిత్తమే కలది

చ. 1:

యెంత వెలుఁగునకు నంతే చీఁకటి
యెంత సంపదకు నంతాపద
అంతటా నౌషధ మపథ్యమును సరి
వింతే మిగిలెను వేసటే కలది

చ. 2:

చేసిన కూలికి జీతమునకు సరి
పూసిన కర్మభోగము సరి
వాసుల జన్మము వడి మరణము సరి
ఆసల మిగిలిన దలపే కలది

చ. 3:

మొలచిన దేహము ముదియుటకును సరి
దలఁచిన దైవము తనలోను
యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ-
గలిగిన మాకెల్ల ఘనతే కలది


రేకు: 0298-02 సాళంగనాట సం: 03-567 నృసింహ

పల్లవి:

చేకొని కొలువరో శ్రీనరసింహము
శ్రీకరమగు నిదె శ్రీనరసింహము

చ. 1:

వెడలేటి వూర్పుల వేఁడిమి చల్లీ
చిడుముడి కోపపు శ్రీనరసింహము
గడగడ వడఁకేటి గండస్థలములు
జెడలు గదలిచీ శ్రీనరసింహము

చ. 2:

వంకరగోళ్ల వైపులు వెదకీ
చింకచూపులను శ్రీనరసింహము
హుంకారంబుల నుదధులు గలఁచీ-
నంకెల శ్రీపతియగు నర సింహము

చ. 3:

వదనము దిప్పుచు వడి నసురమేను
చిద్రుపలు చేసెను శ్రీనరసింహము
అదివో శ్రీవేంకటాద్రి యెక్కి యిటు
చెదరక నిలిచెను శ్రీనరసింహము


రేకు: 0298-03 వరాళి సం: 03-568 ఉపమానములు

పల్లవి:

అతనిలోనే యణఁగె నన్నియును
కతలెన్నైనాఁ గలవు కమలాక్షుఁ గనరో

చ. 1:

యిసుక లెక్కవెట్టితే నెంతై నాఁ గలదు
అసముదించని పుణ్యా లటువంటివే
వసగాని పెక్కు దేవతలఁ గొలుచుకంటే
సుసరాన హరివారై సుఖియించరో

చ. 2:

గోడ గడుగఁగఁ బోతేఁ గొనదాఁకా రొంపే
ఆడుకోలు తర్కవాదా లటువంటివే
వాడిక నారుమతాలవాఁడై తిరుగుకంటే
యీడనే శ్రీపతివారై యీడేరరో

చ. 3:

మనసునఁ బాలు దాగితే మట్టు లేదు మేర లేదు
అనుగు సంసారభోగా లటువంటివే
దినదిన తపముల దీదీపులవుకంటే
తనిసి శ్రీవేంకటేశుదాసులై బ్రదుకరో


రేకు: 0298-04 సౌరాష్ట్రంసం: 03-569 విష్ణు కీర్తనం

పల్లవి:

మరల విచారించితే మంచము కిందే నుయ్యి
శిరుల హరివారైరి శివాదులు

చ. 1:

ఆడేటి మాటలకెల్ల నాది నంతము లేదు
వీడని కర్మములకు విధి లేదు
తాడుపడ్డ మనసుకు దైవము విష్ణుఁడేయని
పాడి కొలిచిరి తొల్లి బ్రహ్మాదులు

చ. 2:

వుట్టిపడే జన్మముల కూరట యెందూ లేదు
కట్టడి ఇంద్రియాలకు గతి లేదు
తట్టువడ్డ జీవునికి దైవము శ్రీహరియని
యిట్టె మొర యిడిరి యింద్రాదులు

చ. 3:

కప్పిన యీ మాయలకు కడవ రెందూ లేదు
తిప్పని హరిభ క్తికిఁ దిరుగు లేదు
వొప్పుగా శ్రీవేంకటేశుఁ డొక్కఁడే దైవమని
చొప్పువట్టి కొలిచిరి శుకాదులు


రేకు: 0298-05 సామవరాళి సం: 03-570 మాయ

పల్లవి:

ఏ వల్ల నౌఁగాము లిఁక నేవి అన్నియు నీలోనే
శ్రీవల్లభుఁడ నిన్నుఁ జేఱితిమి నేము

చ. 1:

సగుణనిర్గుణములును సావయవనిరవయవ-
మగుఁ దర్కవాదకలహములు ఘనము
జగములో చదువులును సంశయంబే కాని
తెగనీదు నీ మాయ తెలియ వసమా

చ. 2:

వేదమార్గము గొంత వేదబాహ్యము గొంత
పోది మతములవారి పోరు ఘనము
పాదైన మునిరుషులు బహుముఖములే కాని
సోదించి వొకమాట చూపంగ లేరు

చ. 3:

వెస గర్మ మొకవంక విజ్ఞాన మొకవంక
వసగావు రెంటి బలవంతములును
వసుధ శ్రీవేంకటేశ్వర నీవు గావు మిఁక
ముఁసుగు వెట్టినవాదు ముగియదెంతైనా


రేకు: 0298-06 బౌళి సం: 03-571 వేంకటగానం

పల్లవి:

సర్వాత్మకుఁడవు సర్వేశ్వరుఁడ నా-
పూర్వాపరాలు నీకే భువి సమర్పయామి

చ. 1:

వేగిలేచి నేఁ జేసేవెడచేఁత నీ చేఁతే
ఆగడపు మాటాడిన నది నీ మాటే
ఆగము భోగములు నా యన్నపానాదులు మరి
శ్రీగురుఁడ నాలోని చింతయు నీ చింతే

చ. 2:

కోపము శాంతములును గుణావగుణము నా-
రూపును నీ సాకారరూపమే
పాపపుణ్యములు నా ప్రాణవాయువులును
శ్రీపతి నా సంసారసేవయు నీసేవే

చ. 3:

ఉదయాస్తమపు దినా లున్నాఁడ నీ దినములే(?)
యెదురు నేను నీ వాఁడ నింతా నీదె
అదివో శ్రీవేంకటేశ అంతరియామివి నీవే
నిదుర మేల్కొనుటయు నీమహిమే