తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 294
రేకు: 0294-01 శంకరాభరణం సం: 03-542 విష్ణు కీర్తనం
పల్లవి:
చవిచేసుక యిటు జరగెదము
జవదాఁటకురో సంసారులార
చ. 1:
యేదిచూచినా నెరవెరవే
పోదిఁ గూడఁగా పొదపింతే
ఆదికినాది హరి యొకఁడే
పాదుగఁ బుట్టెడి భవములె వేరు
చ. 2:
కలుములు లేములు కతలింతే
నిలుకడ గలచో నిజమౌను
యిలయును జగమును యిదే యిదే
తెలిసి చూడఁగా దినములే ఘనము
చ. 3:
చెంతల నిందరు జీవులే
బంతులఁ బుణ్యముఁ బాపమునే
యింతట శ్రీవేంకటేశ్వరుఁడే
కాంతలుఁ బురుషుల గతులై నిలిచె
రేకు: 0294-02 భూపాళం సం: 03-543 మేలుకొలుపులు
పల్లవి:
హరికృష్ణ మేలుకొను ఆదిపురుషా
తరవాత నా మోము తప్పకిటు చూడు
చ. 1:
మేలుకొను నాయన్న మెల్లనే నీ తోడి
బాలులదె పిలిచేరు బడి నాడను
చాలునిఁక నిద్దురలు చద్దికూళ్ళపొద్దు-
వేళాయ నాతండ్రి వేగ లేవే
చ. 2:
కనుదెరవు నా తండ్రి కమలాప్తుఁ డుదయించె
వనిత మొకమజ్జనము వడిఁ దెచ్చెను
మొనసి మీ తండ్రి యిదె ముద్దాడఁ జెలఁగీని
దనుజాంతకుండ యిఁకఁ దగ మేలుకోవే
చ. 3:
లేవె నా తండ్రి నీ లీలలటు వొగడేరు
శ్రీవేంకటాద్రిపతి శ్రీరమణుఁడా
దేవతలు మునులుఁ జెందిన నారదాదులు
ఆవలనుఁ బాడేరు ఆకసమునందు
రేకు: 0294-03 లలిత సం: 03-544 విష్ణు కీర్తనం
పల్లవి:
విశ్వాత్మ నీ కంటె వేరేమియునుఁ గాన
ఐశ్వర్యమెల్ల నీ యతివ చందములే
చ. 1:
కలవు మతములు పెక్కు కర్మభేదములగుచు
కలవెల్ల నీయందె కల్పితములే
కలరు దేవతలు బహుగతుల మహిమల మెరయు
అలరి వారెల్ల నీ యంగభేదములే
చ. 2:
ఘనమంత్రములు పెక్కు గలవు వరముల నొసఁగు
ననిచి యవియెల్ల నీ నామంబులే
పెనగొన్న జంతువులు పెక్కులెన్నే గలవు
పనిగొన్న నీ దాసపరికరములే
చ. 3:
యెందును దగులువడ కేకరూపని నిన్ను
కందువఁ గొలుచువాఁడే ఘనపుణ్యుఁడు
అందపు శ్రీవేంకటాద్రీశ అన్నిటా-
నందినపొందినవెల్లా హరి నీయనుమతే
రేకు: 0294-04 సామంతం సం: 03-545 అంత్యప్రాస
పల్లవి:
ఇహపరములకును యిది సుఖము
సహజావస్థే జరగేటి సుఖము
చ. 1:
శ్రీరమణుఁడే చింతాయకుఁడని
వూరక వుండుట వొక సుఖము
కోరకుండఁగా గూడిన యర్థము
ఆరయఁ గైకొను టది సుఖము
చ. 2:
వసముగాని పని వడిఁ దలకెత్తుక
అసురుసురుగాని దది సుఖము
యెసరెత్తుక లేళ్లేవని తోలక
పసఁ దనవిధిఁ గల పాటే సుఖము
చ. 3:
పెక్కు చంచలము పెనచుక తిరుగక
వొక్క సుఖంబౌ టురుసుఖము
యెక్కువ శ్రీవేంకటేశ్వరు శరణని
నిక్కితిమిదె మా నిజమే సుఖము
రేకు: 0294-05 లలిత సం: 03-546 విష్ణు కీర్తనం
పల్లవి:
వింటిమి నీ కతలు కంటిమి నీమాయలు
బంటుల మచ్యుత నీ పాలివారమయ్యా
చ. 1:
కలిగిరి నీవల్లనే కడఁగి బ్రహ్మాదులు
నిలిచిరి సురలెల్లా నీవల్లనే
తెలిసిరి మునులెల్లా దేవుఁడవు నీవేయని
చలపట్టి హరి నీకు శరణనేమయ్యా
చ. 2:
నుతియించీ వేదములు నోరార నీ మహిమ
గతియాయ వైకుంఠమే ఘనులకెల్లా
ప్రతిలేని నీ రూపే భావించేరు యోగీంద్రులు
తతితో శ్రీపతి నీకే దాసులమయ్యా
చ. 3:
అదె నీ చక్రముచేత నడఁగి రసురలెల్లా
బదికిరి విప్రులు నీపాద సేవను
పొదలి శ్రీవేంకటేశ పొంది నీ కరుణ చేత
మొదల వెనక నీకే మొక్కేమయ్యా
రేకు: 0294-06 గుండక్రియ సం: 03-547 శరణాగతి
పల్లవి:
ఎట్టొకో దైవమా ఇదె నీకు శరణంటి
తొట్టిన నా బ్రదుకుకుఁ దుదయు లేదు
చ. 1:
నాని యీజన్మమెత్తి నాటివెల్లా మఱచితి
పూని యేమిటా విరతి పుట్టనేరదు
కానను ముందర వచ్చే ఘనకర్మపాశములు
పానిపట్టి(?)యించుకంతా భయమూలేదు
చ. 2:
పంచేంద్రియములఁ జిక్కి భావమెల్లాఁ జిక్కువడె
అంచెల మోక్షముతోవ అరయలేను
యెంచి నాదేహములోని హేయమును సాత్మించె
చంచలపు దుర్గుణాలు చక్కనైనాఁ గావు
చ. 3:
నగు సంపదల చేత నన్ను నేనే మరచితి
తెగువది వివేకించఁ దీరదెప్పుడు
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలఁగాను
జగమెల్లా నెరఁగ నే సాత్వికుఁడనైతి