Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 293

వికీసోర్స్ నుండి


రేకు: 0293-01 లలిత సం: 03-536 విష్ణు కీర్తనం

పల్లవి:

ఈతని నెఱఁగకుంటే నిల స్వామిద్రోహము
ఘాతల నేఱు గుడిచి కాలువ పొగడుట

చ. 1:

హరిపాదముననే యడఁగె లోకములెల్ల
హరినాభినే పొడమి రదివో బ్రహ్మాదులు
హరినామము వేదాల కాదియు నంత్యమునాయ
హరిదాసులే వశిష్ఠాదు లిందరును

చ. 2:

విష్ణుఁడే యమృత మిచ్చె విష్ణుడే ధరణి మోఁచె
విష్ణువాజ్ఞ నడచేది విశ్వ మింతాను
విష్ణుచక్రమున దైత్యవీరులెల్లా నడఁగిరి
విష్ణువు ముఖమునందే విప్రులు జనించిరి

చ. 3:

పరమపు శ్రీపతివే భారతరామాయణాలు
పరమాత్ముఁ డితఁడే పలుజీవుల యందెల్లా
పరము చేచేతఁ జూపె పట్టి శ్రీవేంకటేశుఁడు
పరమానంద మొసఁగు భక్తులకు నితఁడు


రేకు: 0293-02 శుద్ధవసంతం సం: 03-537 శరణాగతి

పల్లవి:

నిండిన జగములెల్లా నీయాధీనము
బండు జన్మములవాఁడ భయమేమీ నెరఁగ

చ. 1:

పాతకపు దేహమిది ప్రకృతి యాధీనము
ఆతుమ శ్రీహరి నీయాధీనము
యీతల నాతల నేనెవ్వరి నేమనలేను
చేతనుఁడ నింతే నేను చిక్కిన వేమెఱఁగ

చ. 2:

వెలయు నా కర్మము నీ వేదశాస్త్రాధీనము
నిలిచిన జ్ఞానమెల్లా నీయాధీనము
తలఁచి యెవ్వరి నేఁ దగు దగదనలేను
కొలఁది జీవుఁడనింతే కొనమొద లెఱఁగ

చ. 3:

అక్కడ నా మనసిక నాచార్యాధీనము
నిక్కపు నామోక్షము నీయాధీనము
యెక్కువ శ్రీవేంకటేశ యెవ్వరి నేమనలేను
పక్కన నీ బంటనింతే పరచింత లెఱఁగ


రేకు: 0293-03 రామక్రియ సం: 03-538 వైరాగ్య చింత

పల్లవి:

ఏమి సేయఁగలఁడు తానీ జగమెల్లాను
కోమలపు దేహి కొక్కకోకే కలది

చ. 1:

మించిన కోరికలివి మిన్నుల పొడవులు
కొంచపు దేహము దనకొలఁది గాదు
యెంచరాని సిరు లవి యెన్ని గలిగినా
కంచములోని కూడే కలిగినది

చ. 2:

గోరపడి గడించేవి కోట్ల కొలఁదులు
తారితూరి నోటికిఁ దగ్గంత గాదు
యేరుపరచి యింతుల నెందరిఁ బెండ్లాడినాను
కూరిమి సతి యొకతె కూటమికిఁ గలది

చ. 3:

తలఁచి మొక్కే సురలు తలవెంట్రుకలందరు
యిలఁ దన బతుకెంతో యెరఁగరాదు
చెలఁగి రక్షించేవాఁడు శ్రీవేంకటేశుఁ డొకఁడే
కల డంతరంగమునఁ గైవల్యమే కలది


రేకు: 0293-04 లలిత సం: 03-539 వైష్ణవ భక్తి

పల్లవి:

వీరు వారనేటివింతేల
శ్రీరమణుని కృప సిద్ధముఁ గాక

చ. 1:

యెక్కడి పాపము యెక్కడి పుణ్యము
దక్కిన శ్రీపతిదాసునికి
పక్కన లోహముఁ బరుసము దాఁకిన
యెక్కువనంతా హేమమే కాదా

చ. 2:

యేది హీనము యేది యధికము
పాదుగ నడచు ప్రపన్నునికి
మేదినీశుఁ డేమెలుఁతఁ బెండ్లాడిన
సాదించ నేలికసానే కాదా

చ. 3:

యేడ నింద లిఁక నేడ సంస్తుతులు
జాడల శ్రీవైష్ణవునికిని
యీడనే శ్రీవేంకటేశుఁ డాత్మయట
యీడులేని యతఁ డెక్కుడే కాదా


రేకు: 0293-05 రామక్రియ సం: 03-540 మాయ

పల్లవి:
 
నేనా గెలువలేను నీమాయ
శ్రీనాథ నీవు సేసే చేఁతలే నీమాయ

చ. 1:

తమకము గడు రేఁచు తలఁపు ఉఱ్ఱూఁతలూఁచు
నిమిష మూరకుండదు నీమాయ
తిమిరము బుద్ధిఁ గప్పు తెఱవల వెంటఁ దిప్పు
అమరి తోడునీడ ఆయఁబో నీమాయ

చ. 2:

పట్టినందుకెల్లాఁ దీసు పాపమే చవులుసేసు
నిట్టి(ట్ట?) పిడిఁ బోనీదు నీమాయ
కొట్టఁగొన కెక్కించుఁ గోరి మొదలికి దించు
మట్టులే దింతింతని మరియు నీమాయ

చ. 3:

పలు లంపటాల ముంచు భావజుచే భ్రమయించు
నిలిచిన చోటనెల్లా నీమాయ
యెలమి శ్రీవేంకటేశ యిటు నిన్నుఁ గొలువఁగా
మలసి సొలసి నన్ను మన్నించె నీమాయ


రేకు: 0293-06 సామవరాళి సం: 03-541 అధ్యాత్మ

పల్లవి:

తనుఁదా నేమఱక దైవము మఱవకుంటే
మనసులోనే కలుగు మహామహిమ

చ. 1:

కనురెప్ప మూసితేనే కడ దాఁగె జగమెల్ల
కనుదెరచినంతనే కలిగెఁ దాను
ననిచివుండుట లేదు నమ్మకపోవుట లేదు
తనతోడిదే యిన్నిఁ దాఁ గలితేఁ గలవు

చ. 2:

కడుపు నిండినంతనే కైపాయ రుచులెల్లా
బెడిదపు టాఁకలైతేఁ బ్రియమాయను
యెడనెడఁ జేఁదు గాదు యింతలోనే తీపు గాదు
వొడలితోడివే యివి వుండినట్టే వుండును

చ. 3:

అద్ధములోఁ దననీడ అంతటా మెరసినట్లు
పొద్దువొద్దు తనతోనే భోగాలెల్లా
అద్దిన శ్రీవేంకటేశుఁ డంతరాత్మయైనవాఁడు
కొద్ది లేదాతనిమాయ కొనసాగుచుండును