Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 292

వికీసోర్స్ నుండి


రేకు: 0292-01 మలహరి సం: 03-530 కృష్ణ

పల్లవి:

విశ్వమెల్ల నీ విరాడ్రూపము
శాశ్వతహరి నీ శరణులము

చ. 1:

కన్నులఁ సూర్యుఁడు కమలాప్తుఁడు నీ-
పన్నిన మోమున బ్రాహ్మణులు
వున్నతి వైశ్యులు వూరువు లందును
యెన్నఁగ శూద్రులు యిదె పాదముల

చ. 2:

యింద్రాది దేవతలీశాన బ్రహ్మము-
నీంద్రు లంగములు నెసఁగిరదే
సాంద్ర లోకములు జఠరంబున నవె
రుంద్ర తేజ మదె రోమముల

చ. 3:

కాలముఁ గర్మముఁ గైవల్యంబును
ఆలోను వెలియునది నీవు
శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర
కోలు ముందు నినుఁ గొలిచితిమయ్య


రేకు: 0292-02 దేవగాంధారి. సం: 03-531 వైష్ణవ భక్తి

పల్లవి:

కలదు తిరుమంత్రము కల దిహముఁ బరము
కలిమి గలుగు మాకుఁ గడమే లేదు

చ. 1:

కమలాక్ష నీవు మాకుఁ గలిగియుండఁగ భూమి
నమరలేని దొకటి నవ్వల లేదు
నెమకి నాలుకమీఁద నీ నామము మెలఁగఁగ
తమితోఁ బరుల వేఁడ దాఁ జోటులేదు

చ. 2:

శౌరి నీ చక్రము నాభుజముమీఁద నుండఁగాను
యీరసపుఁబగ లేదు యెదురూ లేదు
చేరువ నీసేవ నాచేతులపై నుండఁగాను
తీరని కర్మపువెట్టి దినమూ లేదు

చ. 3:

అచ్చుత నీపై భక్తి యాతుమలో నుండఁగాను
రచ్చలఁ బుట్టిన యపరాధమూ లేదు
నిచ్చలు శ్రీవేంకటేశ నీ శరణాగతుండఁగా
విచ్చిన విడే కాని విచారమే లేదు


రేకు: 0292-03 దేసాక్షి సం: 03-532 శరణాగతి

పల్లవి:

దేవుఁ డొక్కఁడే మాకు దిక్కుగాని
కావ నెవ్వరును లేరు కతలింతే కాని

చ. 1:

పచ్చివొళ్లు మోచితిమి పాపమెల్లాఁ జేసితిమి
హెచ్చిన మీఁదటి సుద్దు లేఁటివో కాని
రచ్చలఁబడె మా గుట్టు రమణుల చేఁత బెట్టు
అచ్చమై యిందుకుఁ బరిహరమేదో కాని

చ. 2:

గాలిమూఁటఁ జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి
ఆలించి యేమిటివారమయ్యేమో కాని
మైల గొంత మనసూ మణుఁగు గొంతానాయ
తాలిమి నా విధి యేమి దలఁచీనో కాని

చ. 3:

మాయలఁ బొరలితిమి మరచితి మింతలోనే
చాయల శ్రీవేంకటేశు శరణంటిమి
రోయఁజొచ్చె జగమెల్లా రుచియాయ వైరాగ్య-
మాయము నాలోపలి అంతరాత్మేకాని


రేకు: 0292-04 వసంతవరాళి సం: 03-533 వేంకటగానం

పల్లవి:

అతని నమ్మలే రల్పమతులు భువి
నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు

చ. 1:

సకలలోకపతి సర్వేశ్వరుఁడట
వొకఁడిఁక దొర మరి వున్నాఁడా
ప్రకటించఁగ శ్రీపతియే దాతట
వెకలి నియ్యఁగొన వేరే కలరా

చ. 2:

దివిజవందితుఁడు దిక్కుల హరియట
యివల మొక్క సురలిఁక వేరీ
కవ నంతర్యామి కరుణాకరుఁడట
వివిధభంగులను వెదకఁగనేలా

చ. 3:

వేదాంగుఁడు శ్రీవేంకటపతి యట
ఆదిమతము లిఁక నరసేదా
యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁ-
డీదేవుఁడె మన కిహపర మొసఁగ


రేకు: 0292-05 సాళంగనాట సం: 03-534 శరణాగతి

పల్లవి:

ఒకరిఁ గానఁగ నొడఁబడదు మనసు
సకలము హరియని సరిఁదోఁచీని

చ. 1:

అంతరాత్మ శ్రీహరి యతఁ డొకఁడే
జంతువులన్నియు సమములే
బంతులఁ బాత్రాపాత్రము వెదకిన
అంతట హరి దాస్యమేపో ఘనము

చ. 2:

జగమును నొకటే చైతన్య మొకటే
తగిన పంచభూతము లొకటే
నగుతా నెదిరిని నన్నును నెంచిన
మొగి నాపై హరి ముద్రలె ఘనము

చ. 3:

కారు స్వతంత్రులు కడపట నొకరును
యీరీతి నౌఁగాము లిఁక నేలా
శ్రీరమణీపతి శ్రీవేంకటేశుఁడే
కారణము శరణాగతియే ఘనము


రేకు: 0292-06 సాళంగనాట సం: 03-535 దశావతారములు

పల్లవి:

వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా

చ. 1:

తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలుని
వేలుపులరాయఁడైన విష్ణుని నెఱఁగరా

చ. 2:

తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జలధమ్ముమొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కసపుదైవమైన విష్ణుని నెఱఁగరా

చ. 3:

భేదించె రావణాది భీకరదైత్యుల నెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీదివీది మెరసేటి విష్ణుని నెఱఁగరా