తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 291

వికీసోర్స్ నుండి


రేకు: 0291-01 దేసాక్షి సం: 03-524 అధ్యాత్మ

పల్లవి:

ఇది యెరిఁగినవారె యెంచఁగ నీ దాసులు
వెదకి తెలుసుకొంటే వేదాంతాల నున్నవి

చ. 1
పట్టితే నీ స్వరూపము బయలు లోపల నిండి
అట్టే సర్వశక్తితో సాకారముతో
యెట్టు దలఁచినాఁ జిత్తాయిత్తమై వున్నాఁడవు
వొట్టి ప్రకృతిపురుషు లొగి నీ దేహములు

చ. 2

అనంతమైన ప్రకృతి అఖిలవికారములై
పనివడి నీ మాయయై ప్రపంచమై
వొసరి జడమై యుండ నొకచో దివ్యమై యుండు
నినుపై ఇహపరాలు నీయైశ్వర్యములు

చ. 3:

జీవుఁ డణువు జ్ఞానము చింతించగా విభువు
యీ విధము నానాజీవులివె నీ యందె
శ్రీవేంకటేశుఁడ నీవే చేకొన్నచైతన్యమవు
కావింపఁ గర్మభక్తులే కారణఫలములు


రేకు: 0291-02 పాడి సం: 03-525 జోల

పల్లవి:

కొలువు విరిసె నిదె గోవిందుఁడు పొద్దువోయ
వెలుపట నుక్కళాలు వేగుదాఁకా నుండరో

చ. 1:

యీ పొద్దుకుఁ బోయిరారో ఇంద్రాది దేవతలు
శ్రీపతి పవ్వళించెను శేషునిమీఁద
తీపులఁ బ్రసాదమీరో దేవమునులకు నెల్ల
వైపుగఁ దెల్లవారఁగ వత్తురుగాని

చ. 2:

పాళెలపట్టుకుఁ బోరో బ్రహ్మరుద్రాదు లిందరు
పాలసముద్రాన హరి పవ్వళించెను
వేళగాదు లోనికిట్టె విచ్చేసె హరి ద్వార-
పాలకులు వాకిళ్ళఁ బదిలము సుండో

చ. 3:

గీత మొయ్యనే పాడరో కిన్నర కింపురుషులు
యీతల శ్రీవేంకటేశుఁ డెక్కెను మేడ
ఘాత నెడనెడ నూడిగకాండ్లు నిలువరో
రాతిరెప్పుడైనా మిమ్ము రమ్మనునో యతఁడు


రేకు: 0291-03 లలిత సం: 03-526 నామ సంకీర్తన

పల్లవి:

ఇతరుల నడుగము యితఁడే మా దాత
యితని యీవి వొరు లియ్యఁగఁ గలరా

చ. 1:

దేవ దేవుఁ డాదిమపురుషుఁడు హరి
శ్రీవత్సాంకుఁడు చిన్మయుఁడు
యీవల నావల యిలువేలుపతఁడు
భావజగురుఁడు మా పాలిటివాఁడు

చ. 2:

జగదేకగురుఁడు శాశ్వతుఁ డచ్యుతుఁ-
డగజకు వరదుఁడు అనంతుఁడు
తగి మము నేలిన దైవము యేలిక
నిగమమూర్తి మా నిజబంధువుఁడు

చ. 3:

కలిదోషహరుఁడు కైవల్యవిభుఁడు
అలరిన శ్రీవేంకటాధిపుఁడు
చలిమి బలిమి మా జననియు జనకుఁడు
అలమి యితఁడు మాయంతర్యామి


రేకు: 0291-04 భైరవి సం: 03-527 నామ సంకీర్తన

పల్లవి:

శ్రీహరి నిత్యశేషగిరీశ
మోహనాకార ముకుంద నమో శ్రీహరి

చ. 1:

దేవకీసుత దేవ వామన
గోవిందా గోపగోపీనాథా! శ్రీహరి
గోవర్ధనధర గోకులపాలక
దేవేశాధిక తే నమో నమో

చ. 2:

సామజాన (వ?)న సారంగ(శార్జ్గ?) పాణి
వామనా కృష్ణ వాసుదేవా! శ్రీహరి
రామనామ నారాయణ విష్ణో
దామోదర శ్రీధర నమో నమో

చ. 3:

పురుషోత్తమ పుండరీకాక్ష
గరుడధ్వజ కరుణానిధి! శ్రీహరి
చిరంతనాచ్యుత శ్రీవేంకటేశ
నరమృగ తే నమో నమో


రేకు: 0291-05 దేవగాంధారి సం: 03-528 శరణాగతి

పల్లవి:

వేసరితేనే లేదు విచారించితేఁ గద్దు
మూసినదిదే కీలు ముంచి వివేకులకు

చ. 1:

యెవ్వరు మనసులోన నిందిరేశుఁ దలఁచిన
అవ్వలఁ బాయక వుండు నదియే వైకుంఠము
దవ్వులకు నేఁగవద్దు తపము జపము వద్దు
యివ్వలనిదే కీలు యెరిఁగినవారికి

చ. 2:

నాలుక నెవ్వరైనాను నారాయణుఁ బొగడిన
చాలి యాతఁ డాడనుండు జగములూ నుండును
కాలమూ నడుగవద్దు కర్మమూ నడుగవద్దు
పోలింపనిదే కీలు పుణ్యమానసులకు

చ. 3:

శ్రీవేంకటేశ్వరునిఁ జేరి యెవ్వరు నమ్మినా
కైవసమై యాతఁ డింటఁ గాచుకుండును
సావధానములు వద్దు శరణంటేనే చాలు
భావింపనిదే కీలు పరమయోగులకు


రేకు: 0291-06 శంకరాభరణం సం: 03-529 విష్ణు కీర్తనం

పల్లవి:

దనుజులు గనిరి తత్త్వమిది
వనజాక్షుని కృప వసించనేలా

చ. 1:

హరి పరమాత్ముఁ డనాదిపురుషుఁడు
సురలకు నరులకు సులభుఁడు
హరి కోపముతో నన్యులవరములు
సరిగా వెంచఁగ జగములలోన

చ. 2:

వేదాంతవిదుఁడు విష్ణుఁడు కృష్ణుఁడు
శ్రీదేవికిఁ బతిశేఖరుఁడు
పోదిఁ బరస్తుతి పుణ్యముకంటే
పాదుగ హరిఁ దిట్టే పాపము మేలు

చ. 3:

నారాయణుఁ డున్నతుఁ డచ్యుతుఁ డుప-
కారుఁడు శ్రీవేంకటవిభుఁడు
చేరి యీతఁడే శిక్షించ రక్షించ
వూరదయివములు వొగి నితనిసరా