తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 290

వికీసోర్స్ నుండి


రేకు: 0290-01 నాట సం: 03-518 నృసింహ

పల్లవి:

దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
కేరలీఁ బంతముల సుగ్రీవ నారసింహము

చ. 2:

నిక్కిన కర్ణములతో నిట్టచూపు గుడ్లతో
మిక్కుటమైన పెద్దమీసాలతోడ
వెక్కసపు నోరితోడ వెలయు బుగ్గలతోడ
క్రిక్కిరిసీ నవ్వుల సుగ్రీవ నారసింహము

చ. 2:

చల్లు నూరుపులతోడ సంకుఁజక్రములతోడ
మొల్లమైన సహస్రకరములతోడ
తెల్లని మేనితోడ దిండైన పిరుఁదుతోడ
కెల్లు రేఁగీఁ గరుణ సుగ్రీవ నారసింహము

చ. 3:

విరుల పాదాలతోడ వెలయు సొమ్ములతోడ
తిరమైన కోటిసూర్యతేజముతోడ
విరుల దండలతోడ వేడుక శ్రీవేంకట-
గిరిమీఁద వెలసె సుగ్రీవ నారసింహము


రేకు: 0290-02 బౌళి సం: 03-519 హనుమ

పల్లవి:

వీఁడిగో నిలుచున్నాఁడు విజనగరములోన
పేఁడుకొన్న ప్రతాపానఁ బెద్ద హనుమంతుఁడు

చ. 1:

ఇదె పుట్టు గౌపీనము హేమ కుండలములతో-
నుదయించినాఁ డితఁ డుర్విమీఁదను
పదరి బాలార్కుని పండనుచుఁ బట్టినాఁడు
వదలక దేవతల వర మందినాఁడు

చ. 2:

నులిచి తా వాలము మిన్నులు మోవఁ జూఁచినాఁడు
జలధి దాఁటఁగ జంగ చాఁచినాఁడు
ఇల నసురలమీఁద వలచెయ్యెత్తినవాఁడు
నిలువెల్ల సాహసమై నిండుకొనున్నాఁడు

చ. 3:

పెక్కు పండ్ల గొలలు పిడికిలించినవాఁడు
మిక్కిలి లంక సాధించి మించినవాఁడు
ఇక్కువతో శ్రీవేంకటేశ్వరు బంటైనవాఁడు
తక్కక లోకములెల్లా దయఁ గాచేవాఁడు


రేకు: 0290-03 సామంతం సం: 03-520 నృసింహ

పల్లవి:

అనిశముఁ దలఁచరో అహోబలం
అనంతఫలదం బహోబలం

చ. 1:

హరినిజనిలయం బహోబలం
హరవిరించినుత మహోబలం
అరుణమణిశిఖర మహోబలం
అరిదైత్యహరణ మహోబలం

చ. 2:

అతిశయశుభదం బహోబలం
అతులమనోహర మహోబలం
హతదురితచయం బహోబలం
యతిమతసిద్ధం బహోబలం

చ. 3:

అగు శ్రీవేంకట మహోబలం
అగమ్య మసురల కహోబలం
అగపడుఁ బుణ్యుల కహోబలం
అగకులరాజం బహోబలం


రేకు: 0290-04 పాడి సం: 03-521 హనుమ

పల్లవి:

కలశాపురము కాడ గంధపు మాకుల నీడ-
నలరేవు మేలు మేలు హనుమంతరాయ

చ. 1:

సంజీవికొండ దెచ్చి సౌమిత్రి బ్రతికించితి
భంజించితి వసురుల బలువిడిని
కంజాప్తకుల రాఘవుని మెప్పించితివి
అంజనీతనయ వో హనుమంతరాయ

చ. 2:

లంక సాధించితివి నీ లావులెల్లాఁ జూపితివి
కొంకక రాముని సీతఁ గూరిచితివి
లంకెల సుగ్రీవునికి లలిఁ బ్రధాని వైతివి
అంకెలెల్లాఁ నీకుఁ జెల్లె హనుమంతరాయ

చ. 3:

దిక్కులు గెలిచితివి ధీరతఁ బూజ గొంటివి
మిక్కిలి ప్రతాపాన మెరసితివి
ఇక్కువతో శ్రీవేంకటేశ్వరు బంట వైతివి
అక్కజపు మహిమల హనుమంతరాయ


రేకు: 0290-05 రామక్రియ సం: 03-522 హనుమ

పల్లవి:

అఖిలలోకైకవంద్య హనుమంతుఁడా సీత-
శిఖామణి రామునికిఁ జేకొని తెచ్చితివి

చ. 1:

అంభోధి లంఘించితివి హనుమంతుఁడ
కుంభినీజదూతవైతి గురు హనుమంతుఁడ
గంభీరప్రతాపమునఁ గడఁగితివి
జంభారిచే వరములు చయ్యన నందితివి

చ. 2:

అంజనీదేవికుమార హనుమంతుఁడ
కంజాప్తఫలహస్త ఘన హనుమంతుఁడ
సంజీవని దెచ్చిన శౌర్యుఁడవు
రంజిత వానరకులరక్షకుఁడ వైతివి

చ. 3:

అట లంక సాధించిన హనుమంతుఁడ
చటుల సత్త్వసమేత జయ హనుమంతుఁడ
ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశుకుఁ
దటుకన బంటవై ధరణి నిల్చితివి


రేకు: 0290-06 గౌళ సం: 03-523 దశావతారములు

పల్లవి:

త్రిజగముల నెరుఁగు దేవదేవుఁడు
అజుని జనకుఁడైన ఆదినారాయణుఁడు

చ. 1:

గరుడని మీఁదనెక్కి ఘనచక్రము చేఁబట్టి
పరమపదాన నుండి పరతెంచి
మురిపేన కరిఁ గాచి మొసలిఁ దుంచినవాఁడు
అరుదైన ప్రతాపపు ఆదినారాయణుఁడు

చ. 2:

కనకాంబరము గట్టి కౌస్తుభము మెడఁ బెట్టి
వెనువెంట శ్రీసతి సేవించుచుండఁగా
పనివూని జయముతో పాంచజన్యము వట్టి
అనిశముఁ గరుణించీ నాదినారాయణుఁడు

చ. 3:

త్రిదశులు నుతియించ దిక్కులెల్లా నుల్లసిల్ల
ముదమున దాసులెల్లా మొక్కఁగాను
వదల కెల్లవారికి వరములిచ్చీవాఁడే
అదె శ్రీవేంకటవిభుఁ డాదినారాయణుఁడు