తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 289
రేకు: 0289-01 సాళంగనాట సం: 03-512 తేరు
పల్లవి:
చూడరో చూడరో నేఁడు సురలార నరులార
దాడివోయి దనుజుల దండించి తా వచ్చె
చ. 1:
వాయు వేగమున వచ్చె వనజాక్షు నరదము
వేయిసూర్యుల ప్రతాపవిభవముతో
చాయల చక్రవాళాద్రి సముద్రాలు దాఁటి వచ్చె
ఆయితమై పైఁడిటెక్కే లవే కానవచ్చె
చ. 2:
మునుకొని మనో వేగమున వచ్చె హరితేరు
తనరారు కోటిచంద్రప్రభలతో
వెనుకొని దిక్కులెల్లా విజయము సేసి వచ్చె
కనకాచలముతో గక్కన సరివచ్చె
చ. 3:
గరుడవేగాన శ్రీవేంకటేశు రథము వచ్చె
మరగిన యల మేలుమంగసిరితో
ధరలోన వీధులేఁగి తన నెలవుకు వచ్చె
పరగ హరిదాసుల పంతములు వచ్చె
రేకు: 0289-02 సామంతం సం: 03-513 నృసింహ
పల్లవి:
నానాభరణముల నరసింహా
పూనిన ప్రతాపముల నరసింహా
చ. 1:
నగవుల నెమ్మోము నరసింహా
పొగరుమించు టూర్పుల నరసింహా
నగముమీఁది ఘన నరసింహా
తగుకాంతుల యందపు నరసింహా
చ. 2:
నలిననేత్ర శ్రీనరసింహా
పొలుపొందు నఖంబుల నరసింహా
నలుదెసల మెఱయు నరసింహా
వెలయు మూఁడుగన్నుల నరసింహా
చ. 3:
నమిత సురాసుర నరసింహా
కమనియ్యగుణాకర నరసింహా
నమోస్తు తే శుభ నరసింహా
కమలాంక శ్రీవేంకటనరసింహా
రేకు: 0289-03 శంకరాభరణం సం: 03-514 నృసింహ
పల్లవి:
నమితదేవం భజే నారసింహం
సుముఖకరుణేక్షణం సులభ నరసింహం
చ. 1:
విజయ నరసింహం వీర నరసింహం
భుజబలపరాక్రమస్ఫుట నృసింహం
రజనీచరవిదళనవిరాజిత నృసింహం
సుజనరక్షక మహాశూర నరసింహం
చ. 2:
దారుణనృసింహం ప్రతాప నరసింహం
చారుకల్యాణ నిశ్చల నృసింహం
ధీరచిత్తావాస దివ్య నరసింహం
సారయోగానందచతుర నరసింహం
చ. 3:
విమల నరసింహం విక్రమ నృసింహం
కమనియ్యగుణగణాకర నృసింహం
అమితసుశ్రీవేంకటాద్రి నరసింహం
రమణియ్యభూషాభిరామ నరసింహం
రేకు: 0289-04 వరాళి సం: 03-515 దేవుడు-జీవుడు
పల్లవి:
దేవుఁడవు నీవు జీవులు నీ బంట్లు
చేవదేరి నీ సేఁతే శేఖరమై నిలిచె
చ. 1:
చేరి నేరమి సేసేది జీవునికి స్వభావము
నేరిచి రక్షించేది నీ స్వభావము
ధారుణి లోపల మరి తప్పులెంచఁ జోటేది
మేర మీరి నీ మహిమే మిక్కుటమై నిలిచె
చ. 2:
మత్తుఁడై వుండేదే మనుజుని స్వభావము
నిత్తెపుజ్ఞాన మిచ్చేది నీ స్వభావము
వొత్తి గుణావగుణాలు వొరయఁగఁ జోటేది
సత్తుగా నీ కరుణే సతమయి నిలిచె
చ. 3:
చెలఁగి నీ శరణు చొచ్చేదే నా స్వభావము
నెలవై యేలుకొనేది నీ స్వభావము
మలసి శ్రీవేంకటేశ మనసు సోదించ నేది
చలిమి బలిమిని నీస్వతంత్రమే నిలిచె
రేకు: 0289-05 సాళంగనాట సం: 03-516 రామ
పల్లవి:
సీతాసమేత రామ శ్రీరామ
రాతి నాతిఁ జేసిన శ్రీరామ రామ
చ. 1:
ఆదిత్యకులమునందు నవతరించిన రామ
కోదండభంజన రఘుకుల రామ
ఆదరించి విశ్వామిత్రుయాగము గాచిన రామ
వేదవేదాంతములలో వెలసిన రామ
చ. 2:
బలిమి సుగ్రీవుని పాలి నిధానమ రామ
యిల మునుల కభయమిచ్చిన రామ
జలధి నమ్ముమొనను సాధించిన రామ
అలరు రావణదర్పహరణ రామ
చ. 3:
లాలించి విభీషణుని లంక యేలించిన రామ
చాలి శరణాగతరక్షక రామ
మేలిమి శ్రీవేంకటాద్రిమీఁద వెలసిన రామ
తాలిమితో వెలయు ప్రతాపపు రామ
రేకు: 0289-06 దేసాళం సం: 03-517 దశావతారములు
పల్లవి:
కోనేటి దరులఁ గనుఁగొనరో మూఁడుదేరులు
నానాదేవతలార నరులార మీరు
చ. 1:
తెంకిగా ముందర నొక్క తేరెక్కె శ్రీకృష్ణుఁడు
వేంకటేశుఁ డెక్కె నదె వేరొక్క తేరు
లంకెలై శ్రీభూసతులు లలి నొక్క తేరెక్కిరి
కొంకక వీధుల నడగొండలో యనఁగను
చ. 2:
యిరవై శ్రీకృష్ణునిది యిదె వానరధ్వజము
గరుడధ్వజము శ్రీవేంకటపతిది
కరిలాంఛన ధ్వజము కమలకు మేదినికి
అలరి చూపట్టెను బ్రహ్మాండాల వలెను
చ. 3:
చెలఁగి చెఱకువిల్లు చేతఁబట్టె శ్రీకృష్ణుఁడు
బలు శ్రీవేంకటేశుఁడు పట్టెఁ జక్రము
అలమేలుమంగ భూమి యంబుజాలు చేఁబట్టిరి
కలసి మెలసేరు బంగారుమేడ లనఁగ