తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 253

వికీసోర్స్ నుండి

రేకు: 0253-01 గుండక్రియ సం: 03-302 హనుమ


పల్లవి :

ఘనుఁడాతఁడా యితఁడు కలశాపురము కాడ
హనుమంతుఁ డితఁడా అంజనాతనయుఁడు


చ. 1:

పెడచేత లోచేత బెరసి కొందరిఁ గొట్టె
అడరి దానవుల హనుమంతుఁడు
బెడిదంపుఁ బెనుదోఁక బిరబిరఁ దిప్పి మొత్తె
అడఁగ మాల్యవంతు హనుమంతుఁడు


చ. 2:

దాకాల మోఁకాలఁ దాటించెఁ గొందరి
ఆకాశవీధినుండి హనుమంతుఁడు
పైకొని భుజములఁ బడఁదాఁకెఁ గొందరి
ఆకడ జలధిలోని హనుమంతుఁడు


చ. 3:

అరుపుల నూరుపుల నందరిఁ బారఁగఁ దోలె
ఔరా సంజీవికొండ హనుమంతుఁడు
మేరతో శ్రీవేంకటాద్రిమీఁది దేవుని బంటు
ఆరితేరిన బిరుదు హనుమంతుఁడు

రేకు: 0253-02 బౌళి సం: 03-303 అధ్యాత్మ, గురు వందన


పల్లవి :

హరి దగ్గరనే వున్నాఁ డందాఁకఁ బారనీదు
కురచలోనే మగుడు గోవిందు మాయ


చ. 1:

చెనకి పంచేంద్రియపు చెరువు లైదింటికి
మనసనెడి దొకటి మహా ప్రవాహము
దినముఁ బారుచునుండు దిగువకు వెళ్లలేదు
తనలోనే తానిగురు దైవమాయ


చ. 2:

తూలని పంచభూతాల తోఁట లైదింటికి
కాలమనియెడి దొక్కకాలువ వారుచునుండు
నేలాఁ దడియదు నీరూఁ దివియదు
తోలుఁదిత్తికే కొలఁది దొరకొన్న మాయ


చ. 3:

ముట్టి పంచప్రాణముల మొలక లైదింటికి
పుట్టుగులనియేటి యేరు పొదలి పారుచునుండు
చెట్టుచెట్టుకే కొలఁది శ్రీవేంకటేశ్వరుఁడు
నట్టనడుమ నున్నాఁడు నాననీదు మాయ

రేకు: 0253-03 పాడి సం: 03-304 రామ


పల్లవి :

రామభద్ర రఘువీర రవివంశతిలక నీ-
నామమే కామధేనువు నమో నమో


చ. 1:

కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత
భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ
రాసికెక్క(క్కు?)కోదండరచన విద్యాగురువ
వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా


చ. 2:

మారీచసుబాహుమర్దన తాటకాంతక
దారుణవీరశేఖర ధర్మపాలక
కారుణ్యరత్నాకర కాకాసురవరద
సారెకు వేదవిదులు జయ వెట్టేరయ్యా


చ. 3:

సీతారమణ రాజ శేఖరశిరోమణి
భూతలపు టయోధ్యాపురనిలయా
యీతల శ్రీవేంకటాద్రి నిరవయిన రాఘవ
ఘాత నీ ప్రతాపమెల్లాఁ గడు నిండెనయ్యా

రేకు: 0253-04 బౌళి సం: 03-305 అధ్యాత్మ


పల్లవి :

ఎట్టు వలసినాఁ జేయు మేమీ నననేరమయ్య
వొట్టిన నామనసు నీకొప్పన సుమ్మయ్యా


చ. 1:

అదిగో శ్రీహరి నీ వంపిన యింద్రియాలకు
చెదరక నేము పంపు సేతుమయ్యా
వెదకి యాసలకెల్లా వెట్టియుఁ జేతుమయ్య
మదిమది నే నీ మాయకు లోనయ్యా


చ. 2:

దేవ నీవిచ్చినయట్టి దేహపుటూరిలోన
చేవమీరఁ గాఁపురము సేసేమయ్య
ఆవల నీ కర్మముల కప్పనము నత్తుమయ్య
ఆవటించి కామాదుల కాన మీరమయ్యా


చ. 3:

నిన్నుఁ దలచుటకంటే నీవుచెప్పిన పనులే
యెన్నికఁ జేసినదే యెక్కుడయ్యా
అన్నిటా శ్రీవేంకటేశ ఆత్మలో నున్నాఁడవు
విన్నపములేల యిది విడువమయ్యా

రేకు: 0253-05 గుజ్జరి సం: 03-306 వైరాగ్య చింత


పల్లవి :

ఇతని మఱచితిమి యెదుటనే యుండఁగ యిన్నాళ్లును నే మెరఁగక
ప్రతిలేదితనికి జీవకోట్లకుఁ బ్రాణబంధుఁ డితఁడు


చ. 1:

ముందు నేను ఘనగర్బనరకమున మునిఁగియున్ననాఁడు
బొందితోడనే సుఖదుఃఖంబులఁ బొరయు తోడునీడితఁడు
అంది స్వర్గనరకాదులు చొచ్చిన అక్కడఁ దా వెనువెంటనే
చందపు నాయాతుమలోఁ బాయని సర్వాత్మకుఁ డితడే


చ. 2:

ఆని పట్టి నేఁ బాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు
మానుపనొల్లఁడు తాఁ బెరరేఁచును మతి కనుకూలం బితఁడు
నానావిధులనుఁ బొరలి యలపుతో నలి నే నిద్రించేటప్పుడు
తానును ఆపరిణామంబులకు తగులైవుండును యీతఁడు


చ. 3:

తలఁచిన దగ్గరుఁ దడవక యుండిన దవ్వయివుండు నితఁడు
కలసి మెలసి ఇహపరము లొసంగఁగఁ గాచుకవుండును యీతఁడు
మెలఁగుచు సాకారముతో నున్నాఁడు మేటిశ్రీవేంకటపతి యీతఁడు
వలసిన వావులరూపులు దాల్చినవాఁ డొకఁడేపో యీతఁడు

రేకు: 0253-06 గుండక్రియ సం: 03-307 విష్ణు కీర్తనం


పల్లవి :

కడనుండి రావు కానివి నైనవి
వుడుగని దయ నీ దొకటే కలది


చ. 1:

హరి నీ చక్రంబంటిన యపుడే
సొరిది నసురలే సురలైరి
నిరతపు చీఁకటినిండిన మింటను
వెరవున రవిచే వెలుఁగైనట్లు


చ. 2:

తతి నీ నామము దలఁచినవారిఁ
అతిపాపమె పుణ్యంబాయ
గతియై పరుసముఁ గదిసిన లోహమె
ప్రతిలేక ధరణిఁ బసిఁడియైనట్లు


చ. 3:

కొంకక నిను నిటు గొలిచిన మనుజులె
అంకెల శుకాదులైనారు
యింకను శ్రీవేంకటేశ నీజగము (?)-
సంకల్పమే మోక్షంబై నిలిచె