Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 254

వికీసోర్స్ నుండి

రేకు: 0254-01 లలిత సం: 03-308 అధ్యాత్మ



పల్లవి :

ఇవ్వల వెదకితేనే యేమి లేదు
అవ్వలికి దాఁటి మీరు అందుకోరో శుభము


చ. 1:

కనురెప్పల తుదలఁ గట్టువడెఁ గాలము
ఘనమై చేతులతుదఁ గర్మమున్నది
మనసు కొట్టఁగొననే మరి దైవమున్నాఁడు
చెనకి యిఁక నెన్నఁడు సేయరో పుణ్యములు


చ. 2:

కనకము దాఁటితేనే ఘన సుఖమున్నది
వెనక చీఁకటికొన వెలుఁగున్నది
వనితల అవ్వలనే వరవిజ్ఞాన మున్నది
పనిగొని యితవైతే బ్రదుకరో జీవులు


చ. 3:

కాయము కొట్టఁగొననే ఘన వైకుంఠమున్నది.
బాయట శ్రీవేంకటపతి వున్నాఁడు
మాయలకొనలనెల్లా మనము నున్నారము
పాయక తెలుసుకొని పట్టరో యీతెరువు

రేకు: 0254-02 దేసాళం సం: 03-309 శరణాగతి


పల్లవి :

ఇంతగా మన్నించి నన్ను నేలుకొంటి విలలోన
వింతగా నెవ్వరినిఁక వేఁడఁబొయ్యేనయ్యా


చ. 1:

కలవారిలోన నీవు గలవాఁడవని నేను
కలసి లేనివారిలో కర్మములేనివాఁడను
బలువులలో నీ దాస్యబలవంతుఁడ నేను
యెలమి మాకిఁకఁ జూడనేమి గడమయ్యా


చ. 2:

నెమ్మది లోనివారిలో నీకుక్షి లోపలివాఁడ
నమ్మని వెలివారిలో నాస్తికుల వెలివాఁడ
పమ్మి పదస్థులలోన పరమపదమువాఁడ
ఇమ్మని నిన్నడిగేది ఇఁక నేఁటిదయ్యా


చ. 3:

ధర్మపువారిలో నీ దయాధర్మపువాఁడ
మర్మపువారిలో నీమాయలమర్మమువాఁడ
అర్మిలి శ్రీవేంకటేశ అంతర్యామివి నీవు
నిర్మించినవాఁడ నేను నెలకొంటినయ్యా

రేకు: 0254-03 గుండక్రియ సం: 03-310 గురు వందన, నృసింహ


పల్లవి :

అందాఁకా వైష్ణవ మటకటకే
నిందకుఁ బాసిన నిర్మలుఁ డగును


చ. 1:

పాపపురాసులు పరిహరమైతే
దీపించు హరిభక్తి వొడమును
చేపట్టి పుణ్యము చేరువలయితే
శ్రీపతిదాసుల సేవే దొరకు


చ. 2:

కొట్టఁగొనకు మతి గోరి పారితే
జట్టిగ హరికథ చవిగలుగు
పట్టిన జన్మము పావనమైతే
మట్టులేని తిరుమంత్రము దొరకు


చ. 3:

గురుకటాక్ష మొకకొంత సోఁకితే
శరణాగతి నిశ్చల మవును
యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితే
పరమపదమునకుఁ బాత్రుండవును

రేకు: 0254-04 ఆహిరి సం: 03-311 గురు వందన, శరణాగతి


పల్లవి :

సేయరాని చేఁతలెల్లాఁ జేసితి నేను నీ-
గా(కా?)యగంటివాఁడ నేను గతిచూపవయ్యా


చ. 1:

శరణాగతులఁ గూడి జ్ఞానము దొంగిలినాఁడ
అరిది నీ కర్మపుటానాజ్ఞలు మీరినవాఁడ
సరిఁ బ్రపంచకులముజాడ వాసినవాఁడ
ధరణి నీతప్పులకు దండన యేదయ్యా


చ. 2:

బహుసంసారములెల్లఁ బంచలఁ దోసినవాఁడ
సహజపింద్రియముల జారినవాఁడ
మహి నాపుట్టుగులకే మరి బొమ్మఁబెట్టినాఁడ
విహిత మిందుకు నేది విధి చెప్పవయ్యా


చ. 3:

గురుమంత్రమునకుఁ గొండెము చెప్పినవాఁడ
పరకాంతఁగూడే లోకభయము మానినవాఁడ
సిరుల మించినయట్టి శ్రీవేంకటేశ నిన్ను
మరిగి శరణంటిని మన్నించవయ్యా

రేకు: 0254-05 గుండక్రియ సం: 03-312 విష్ణు కీర్తనం


పల్లవి :

ఇదిగా దదిగా దిన్నియు నింతే
పదిఁబది హరి నీపదమే నిజము


చ. 1:

సురలును నసురలు చూపట్టు రాజులు
అరసి కనక(ఁగ ?) గతమగువారె
సిరుల వీరిఁ గొలిచెదమంటే మఱి
కెరలి పరుల రక్షింపఁగఁగలరా


చ. 2:

పదునాలుగవది బ్రహ్మలోకమును
కదిసి నీరుమునుకల పొలము
చెదరక యిఁకఁ దముఁ జేరినవారల
వుదుటున నిముడుక వుండఁగఁగలరా (దా?)


చ. 3:

అచ్చుతుఁడవు నీయచ్యుతపద మది
యిచ్చట శ్రీవేంకటేశుఁడవు
చొచ్చిరి నీశరణు శుకసనకాదులు
మచ్చిక నిదిగని మరిగితిమయ్యా

రేకు: 0254-06 వరాళి సం: 03-313 వైరాగ్య చింత


పల్లవి :

పెట్టిన దైవ మెరుఁగు బీరకాయలోని చిక్కు
దిట్ట కూళప్రాణులమై తిరుగుతఁ గాకా


చ. 1:

కాయము మోచి పుట్టి కర్మమున కొడిగట్టి
రోయఁబోతే మేనిలోని రోఁత వోయీనా
పాయపువలఁ దగిలి పాపపుణ్యములఁ జిక్కి
తీయఁబోతే వచ్చునా తెగరాని బంధము


చ. 2:

జగములోఁ గటువడి సంసారదుఃఖమంది
నగఁబోతేఁ గొంతైనా నవ్వు వచ్చీనా
చిగురుటాసఁ దగిలి చింతాజలధిఁ బడి
యెగదిగఁ జూడఁబోతే యెందుకు నెక్కినది


చ. 3:

పరమాత్ము మతిఁ గని భవములెల్లఁ గడచి
ధరణి మాయలతోడి తగులున్నదా
సిరుల మించినయట్టి శ్రీవేంకటేశ్వరుని
మరిగి కొల్చిన మాకు మరి చింతలేలా