తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 251
రేకు: 0251-01 ముఖారి సం: 03-290 వైరాగ్య చింత
పల్లవి:
హేయము తన వాసనలేల మానును
చీ యన్న మానదిదే చెప్పరాని మాయ
చ. 1:
జంగిలిమనుజునకు సరుఁస బాపమే చవి
అంగవించవలదంటే నగ్గలమౌను
ముంగిట నిల్లాలుండఁగ ముట్టగోరుఁ బరస్త్రీల
యెంగిలి కీరెండు సరే యిదివో మాయ
చ. 2:
పరగిన జీవునికి పంచేంద్రియాలే సుఖము
ధర నెంత గాలమైన తనివి లేదు
సిరులు దనకుండినాఁ జేయిచాఁచుఁ బరులకు
యిరువు లెరఁగరాదు యిదివో మాయ
చ. 3:
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యాత్మలో నుండఁగ
భావించు నితని కృప ఫలించునాఁడు
పూవువంటి సంసారము పొదుగుక వుండఁగాను
ఆవటించుఁ బుణ్యఫలాలదివో మాయ
రేకు: 0251-02 రామక్రియ సం: 03-291 వైష్టవ భక్తి
పల్లవి:
ఆతఁడు సేసే చేఁత లన్యులు సేయఁగలరా
జాతుల మనుజులెల్లా సతమయ్యేరా
చ. 1:
దిక్కులేనివారికెల్లా దేవుఁ డొక్కఁడే దిక్కు
చిక్కినవారికినెల్లా శ్రీపతే గతి
తక్కిన అనాథులకు దైవమే రక్షకుఁడు
యెక్కడా నాతఁ డుండఁగా నేఁటి కిఁక చింత
చ. 2:
బలిమి లేనివారికి పరమాత్ముఁడే బలిమి
కలిమి చాలనివారి కలిమి హరె
యిల నేరనివారికి నిందిరానాథుఁడే నేర్పు
వెలసీతనికే విన్నవించుటింతే కాక
చ. 3:
పొందులేనివారికెల్లాఁ బురుషోత్తముఁడే పొందు
విందును వేడుకయు శ్రీవేంకటేశుఁడే
యెందరెందరుండినాను యీతఁడు గలఁడు మాకు
సందడి నాతఁడే అన్ని చక్కఁబెట్టీఁ బనులు
రేకు: 0251-03 సామంతం సం: 03-292 విష్ణు కీర్తనం
పల్లవి:
ధ్రువ విభీషణాదులు సాక్షి
వివరపు జీవులు వెదకేదిది
చ. 1:
దేవేంద్ర సంపద దిక్కుల కెక్కుడు
కావిరినది యొక కాలముది
తావున శ్రీహరిదాసుల సంపద
తేవల నెన్నఁడుఁ దీరనిది
చ. 2:
బలువుగ నడచేటి బ్రహ్మపట్టమును
తొలు బ్రహ్మాండము తోడిది
జలజాక్షుని నిజశరణాగతి యిది
కలకాలమునకుఁ గాణాచి
చ. 3:
వైకుంఠమున కివ్వలిలోకంబులు
రాకలపోకల రచనలవి
యీకడ శ్రీవేంకటేశ్వరు సన్నిధి
పైకొని దొరకిన బ్రదికేదిది
రేకు: 0251-04 వరాళి సం: 03-293 అధ్యాత్మ
పల్లవి:
బయలీఁ దించీ నదివో ప్రాణులను హరిమాయ
క్రియ దెలుసుకొనేటి కీలింతే కాని
చ. 1:
పెక్కుపరుషులలోన బెరశొకసతి యుంటే
యిక్కువై యందే నాఁటు నిందరిచూపు
దక్కి యందరి కాఁగిళ్ల తరుణి యుండుట లేదు
గక్కన వట్టియాసలఁ గరఁగుటే కాని
చ. 2:
చింతకాయ కజ్జాయము చేరి యిసుమంతవుంటే
అంతటనే నోరూరు నందరికిని
పొంతనే నాలుకలకు పులుసై యుండుటే లేదు
కొంత భావించి మింగేటి గుటుకలే కాని
చ. 3:
శ్రీవేంకటేశుతేరు దీసేటి మనుజులెల్లాను
సేవగా నేమే తీసితిమందురు
ఆవల నాతఁడే తమ అంతరాత్మయైయుండి
కావించుట యెరఁగరు గర్వములే కాని
రేకు: 0251-05 పూర్వగౌళ సం: 03-294 విష్ణు కీర్తనం
పల్లవి:
ఏమని చెప్పీనో కాక యిలఁగల శాస్త్రాలు
కామించి వాదించేవారి కడ మేదో
చ. 1:
అంచెల జగములకు హరియే ఆధారము
యెంచఁగ నాధారము యితని కేదో
పొంచిన వేదార్థముల పురుషార్థ మీతఁడు
నించిన యర్థము యీతనికి నేదో
చ. 2:
పొందిన ప్రాణులకెల్లా పుట్టుగైనాఁ డితఁడు
యెందును తనకుఁ బుట్టుగిఁక నేడో
చందపుఁ గర్మములకు సాధన మీదేవుఁడు
మందలించ సాధనము మరి తనకేదో
చ. 3:
కలయన్ని మాయలకుఁ గారణ మీ మూరితి
తలపఁగ కారణము తనకేదో
యెలమి శ్రీవేంకటేశుఁ డితఁడే సర్వసాక్షి
మలసి యీతని కిఁక మరి సాక్షి యేదో
రేకు: 0251-06 సామంతం సం: 03-295 అధ్యాత్మ శృంగారము
పల్లవి:
ఎక్కడఁ గడచేరీ నరులు
తక్కులఁ బెట్టేరు తరుణులు భువిని
చ. 1:
కన్నుల చూపులు గాలపు చిలుకులు
వెన్నెలనవ్వులే వెలితెరలు
మిన్నక పురుషామృగముల వేఁటలు
పన్నుక యాడేరు పడఁతులు భువిని
చ. 2:
ముంచిన మాఁటలే మోహనఘంటలు
మంచియధరములే మచ్చులవి
మించిన పురుషామృగముల వేఁటలు
అంచెల నాడేరు అతివలు భువిని
చ. 3:
కట్టువగట్లు కందువ కుచములు
పట్టు శ్రీవేంకటపతి మాయ
మెట్టుగ పురుషామృగముల వేఁటలు
నెట్టన నాడేరు నెలఁతలు భువిని