Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 250

వికీసోర్స్ నుండి


రేకు: 0250-01 సామవరాళి సం: 03-284 వైష్ణవ భక్తి

పల్లవి:

దైవమా నీ వెలితేది తమ వెలితేకాని
జీవుల(లు?) పట్టిన కొల్ల చేతిలోనే వున్నది

చ. 1:

నిండినవి జగముల నీ నామము లనంతము-
లండఁ దలఁచేవార భాగ్యమే కాని
పండియున్నదిదె దేవభక్తి యెందు చూచినాను
దండితోడఁ బనిగొనే తమ నేర్పేకాని

చ. 2:

మనసులలో నున్నది మరి నీపై జ్ఞానము
వొనరఁ దెలిసేవారి వోపికేకాని
ఘనమైన మున్నిటి నీ కథలెల్లా నున్నవి
విన నేరిచినవారి వివేకమే కాని

చ. 3:

శ్రీవేంకటేశ మీ ముద్ర చెల్లుబడై వున్నది
వేవేగ ధరించేవారి వేడుకే కాని
తావుకొని చేరువ నీదాస్యమిట్టే వున్నది
భావించి నమ్మేటివారి పని యింతే కాని


రేకు: 0250-02 దేవగాంధారి సం: 03-285 విష్ణు కీర్తనం

పల్లవి:

ఎన్నఁడొకో బుద్ధెరిఁగి యీడేరేది జంతువులు
యిన్నిటా నీమహిమలు యెదిరించి వున్నవి

చ. 1:

కావించి నీ పాదతీర్థగంగ ప్రవాహమైనది
పావనులై యిందరిని బ్రదుకుమని
లావుగా నీ ప్రసాదతులసి నారువోశున్నది
వేవేలు పాతకాలెల్ల విదలించుమనుచు

చ. 2:

చెంతల నీమూర్తులు శిలాశాసనాలైనవి
పంతముతోఁ గొలిచిట్టె బ్రదుకుమని
బంతినే నీనామములు ప్రతిధ్వనులై వున్నవి
దొంతులైన భవముల తుద గనుమనుచు

చ. 3:

అందరికి నీసేవలు హస్తగతాలై వున్నవి
బందెదీర నీకు మొక్కి బ్రదుకుమని
అందపు శ్రీవేంకటేశ అంతరాత్మవై వున్నాఁడ-
వెందు చూచిన విజ్ఞానమింద కొండో యనుచు


రేకు: 0250-03 బౌలి సం: 03-286 విష్ణు కీర్తనం

పల్లవి:

మమ్ముఁ జూడ నేమున్నది మావంకనీకే లాభము
కమ్ముక దయదలఁచి కరుణింతుఁ గాక

చ. 1:

శ్రీకాంతుఁడ నీపాదసేవకులయినవారు
పాకశాసనాదులను బ్రహ్మాదులు
పైకొని నరుఁడ నేను బంటఁగాఁగ నెంతవాఁడ
కైకొని నీపుణ్యానకుఁ గాచుటింతే కాక

చ. 2:

నారాయణుఁడ నిన్ను నమ్మినట్టి దాసులు
నారదాది సనకసనందనాదులు
వీరిలో నేనెంతవాఁడ వికటపుజీవుఁడను
యీరీతి నీమూఁకఁ గూడ నేలుటింతే కాక

చ. 3:

శ్రీవేంకటేశ నీపైచేరి భక్తిసేసేవారు
కావించి యనంతముఖ్య గరుడాదులు
దేవ నేనొక్క నీచుఁడ దీనరక్షకుఁడవు నీ-
వీవిధమెంచుక మమ్ము నీడేరింతుఁ గాక


రేకు: 0250-04 దేసాళం సం: 03-287 దశావతారములు

పల్లవి:

కాదన్నవారికి వారికర్మమే సాక్షి
యేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి

చ. 1:

వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమై
ఆదటఁ దెచ్చి నిలిపెనది సాక్షి
ఆదిఁ గర్మములు సత్యమౌటకు బ్రహ్మాయఁగాన
పోదితో నీతఁడు యజ్ఞ భోక్తౌటే సాక్షి

చ. 2:

అదె బ్రహ్మము సాకారమౌటకు పురుషసూక్తఁ
మెదుట విశ్వరూపము యిది సాక్షి
మొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకు
పొదిగొన్న యాగములే భువిలో సాక్షి

చ. 3:

బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు
పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి
యిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతఁడనుటకు
వరమిచ్చే శ్రీవేంకటేశ్వరుఁడే సాక్షి


రేకు: 0250-05 దేసాక్షి సం: 03-288 వైరాగ్య చింత

పల్లవి:

దాఁటలేను యీమాయ దైవమా నేను
నీటునఁ జేసేవాఁడవు నీవె నీవెకా

చ. 1:

యీ మురికి దేహమేకా యెంతగాలమైన నేను
వోముకొంటా భువిమీఁద నుండఁగోరేది
దోమటినింద్రియాలేకా తోడునీడయై నన్ను
వేమరు భోగించఁజేసి వెనుబలమైనవి

చ. 2:

పొంచిన నా కర్మమేకా పుట్టించి పుట్టించి
పంచల సంసారము పాలు సేసేది
అంచెల నీ చిత్తమేకా ఆసలాసలనుఁ దిప్పి
చంచుల నా కేపొద్దు చనవరియయ్యేది

చ. 3:

చుట్టుకొన్న సంపదేకా సూటియైన నాఁటికి
జట్టిగొని లోలోనే చవి సేసేది
అట్టె శ్రీవేంకటేశ అంతరంగాన నీవెకా
పట్టుఁగొమ్మవై యుండఁగ బదికేది నేను


రేకు: 0250-06 శంకరాభరణం సం: 03-289 నామ సంకీర్తన

పల్లవి:

ఇతరము లేదిఁక నెంచి చూచితేఁ
బ్రతివచ్చు నితఁడు ప్రత్యక్షమై

చ. 1:

సకలలోకములు చర్చించి వెదకిన
వొకఁడేపో పురుషోత్తముఁడు
ప్రకటము బహురూపములయి నాతఁడు
అకుటిలమహిమల యనంతుఁడే

చ. 2:

పర్విన జీవుల భావించి చూచిన
సర్వాంతరాత్ముఁడు సర్వేశుఁడే
వుర్విని వెలుపలనుండిన యాతఁడు
నిర్వహించె నీ నీరజాక్షుఁడే

చ. 3:

చన్నకాలమున మన్నకాలమున
నున్నవాఁడు యీవుపేంద్రుఁడే
కన్నులెదుట నిఁకఁ గల కాలంబును
అన్నిటా శ్రీవేంకటాధీశుఁడే