తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 249
రేకు: 0249-01 దేవగాంధారి సం: 03-278 అధ్యాత్మ
పల్లవి:
ఎదుటనే వున్నవి యిన్నియును
యిది కైవసమగు టెన్నఁడో కాని
చ. 1:
ఆకసమొకటే అల భూమొకటే
లోకములు పెక్కు లోలోనే
శ్రీకాంతుఁ డదివో చిత్తములోననె
యేకచిత్తమగు టెన్నఁడోకాని
చ. 2:
యిరవగు కాలం బెప్పటి సహజమె
అరుదగు దినములు అనంతము
పరమాత్ముఁడు లోపల వెలుపల నిదె
యెరవుమాని చేరు టెన్నఁడోకాని
చ. 3:
భావించఁగ నొకబ్రహ్మాండంబే
జీవరాసులే సేసలివే
శ్రీవేంకటేశుఁడు సృష్టించినవాఁడు
యీవిధిఁ గని మను టెన్నఁడో కాని
రేకు: 0249-02 ముఖారి సం: 03-279 భక్తి
పల్లవి:
సులభపు మార్గములు చుట్టిరానే వుండఁగాను
బలు ప్రయాసపు కర్మబద్దులైరి జీవులు
చ. 1:
శ్రీపతిభక్తియనేటి చింతామణి వుండఁగాను
యేపున మోసపొయ్యేరు యేలో జీవులు
చేపట్టి నామాంకితపు సిద్ధరసము గలిగి
కోపుల నుడిగి పనిగొనరేలో జీవులు
చ. 2:
అక్కడనే శరణాగతనే వోడ వుండఁగాను
యెక్కి భవవార్ధి దాఁటరేలో జీవులు
తక్కక దాస్యమనేటి ధనము దమకుండఁగా
లెక్కించి కూడపెట్టుకోలేరు యేలో జీవులు
చ. 3:
అటె శ్రీవేంకటేశుఁ డంతరాత్మై వుండఁగాను
పట్టి కొలువరేలో పైపై జీవులు
పట్టపు హరిదాసులు ప్రత్యక్షమై వుండఁగాను
యిట్టే వారికృప చేరుటెన్నఁడో యీజీవులు
రేకు: 0249-03 శంకరాభరణం సం: 03-280 విష్ణు కీర్తనం
పల్లవి:
ఆడరో పాడరో ఆనందించరో
వేడుక మొక్కరో విజ్ఞానులు
చ. 1:
హరి రక్షకుఁడై యందరి కుండఁగ
పరగఁగ బదికేరు బ్రహ్మాదులు
గరిమ నతఁడే చక్రము చేఁబట్టగ
సురిగి పారిరదెం చూడుఁడు సురలు
చ. 2:
పదిలపు విష్ణుడె ప్రాణమై యుండఁగ
యిదివో మెలఁగేరు యీజీవులు
మొదలను యితఁడే మూలమై యుండఁగ
పొదలె నీతని పంపున లోకములు
చ. 3:
శ్రీవేంకటాద్రిని శ్రీపతి యుండఁగ
తావుల నిలిచెను ధర్మములు
యీవల నితఁడే యిచ్చేటి వరముల
పావనులైరిదే ప్రపన్నులు
రేకు: 0249-04 మాళవి సం: 03-281 దశావతారములు
పల్లవి:
అందరికి సులభుఁడై అంతరాత్మ యున్నవాఁడు
యిందునే శేషగిరిని యిరవై విష్ణుఁడు
చ. 1:
యోగీశ్వరుల మతినుండేటి దేవుఁడు క్షీర-
సాగరశాయియైన సర్వేశుఁడు
భాగవతాధీనుఁడై న పరమపురుషుఁడు
ఆగమోక్తవిధులందు నలరిన నిత్యుఁడు
చ. 2:
వైకుంఠమందునున్న వనజనాభుఁడు పర-
మాకారమందునున్న ఆదిమూరితి
ఆకడ సూర్యకోట్లందునున్న పరంజ్యోతి
దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము
చ. 3:
నిండువిశ్వరూపమై నిలిచిన మాధవుఁడు
దండి వేదాంతములు వెదకే ధనము
పండిన కర్మఫలము పాలికివచ్చిన రాసి
అండనే శ్రీవేంకటేశుఁడైన లోకబంధుఁడు
రేకు: 0249-05 సాళంగనాట సం: 03-282 శ్రీహరి పరివారము
పల్లవి:
నమో నమో దానవవినాశ చక్రమా
సమరవిజయమైన సర్వేశు చక్రమా
చ. 1:
అట్టే పదారుభుజాల నమరిన చక్రమా
పట్టినాయుధముల బలుచక్రమా
నెట్టన మూఁడుగన్నుల నిలిచిన చక్రమా
ఱట్టుగా మన్నించవే మెఱయుచు చక్రమా
చ. 2:
ఆరయ నారుగోణాల నమరిన చక్రమా
ధారలు వేయిటితోడి తగు చక్రమా
ఆరక మీఁదికి వెళ్లే అగ్నిశిఖల చక్రమా
గారవాన నీ దాసులఁ గావవే చక్రమా
చ. 3:
రవిచంద్రకోటితేజరాసియైన చక్రమా
దివిజసేవితమైన దివ్య చక్రమా
తవిలి శ్రీవేంకటేశు దక్షిణకర చక్రమా
యివల నీదాసులము యేలుకోవే చక్రమా
రేకు: 0249-06 వరాళి సం: 03-283 వైరాగ్య చింత
పల్లవి:
హరిహరి నాబదుకు ఆశ్చర్యమాయ నాకు
శరణంటి నిన్నిటికి సెలవుగా నీకును
చ. 1:
వున్నతి జలధిఁ గల వుప్పెల్లాఁ దింటిఁగాని
యెన్నిక సుజ్ఞానమింతా నేఱఁగనైతి
దిన్నగా భూమి వేరుగ దేహములెత్తితిఁగాని
పన్నిన నాభోగకాంక్షఁ బాయఁగలేనైతిని
చ. 2:
నాలికఁ బేలితిఁ గాని నానాభాషలెల్లా
తాలిమి హరినామము దడవనైతి
నాలిసంసారము బ్రహ్మనాఁటనుండి జేసేఁగాని
మేలిమి మోక్షముతోవ మెలఁగఁగనైతిని
చ. 3:
వూరకే దినదినాల యుగాలు దొబ్బితిఁగాని
నేరిచి వివేకము నిలుపనైతి
మేరతో శ్రీవేంకటేశ మీరే దయఁజూడఁగాను
దారదప్ప కిట్టే మీదాఁసుడ నైతిని