తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 248

వికీసోర్స్ నుండి


రేకు: 0248-01 ధన్నాసి సం: 03-272 భక్తి

పల్లవి:

అంతరాత్మ నీ యాధీన మింతయు
చింతలు సిలుగులు జీవులకెల్లా

చ. 1:

చిత్తంబనియెడి సింహాసనమది
వుత్తమ పురుష నీవుండెడిది
హత్తి యింద్రియములందుఁ బ్రధానులు
ప్రత్తెక్ష రాజ్యము ప్రకృతియుఁ గలిగె

చ. 2:

కన్నులుఁ జెవులును ఘ్రాణము నాలికె
వన్నెమేను నీ వాహములు
పన్నిన కోర్కులు భండారంబులు
సన్నుతి సంసారసంపద గలిగె

చ. 3:

పుట్టిన పుట్టుగు భోగపుకొటారు
పట్టము కర్మానుబంధంబు
గట్టిగ శ్రీవేంకటపతి వేలిక-
విట్టి నీ మహిమ లిన్నిటఁ గలిగె


రేకు: 0248-02 ముఖారి సం: 03-273 వైరాగ్య చింత

పల్లవి:

మొదలే తెలియవలె మోసపోక మానవలె
పదిలపు యోగికైనా బ్రహ్మకైనాను

చ. 1:

అలుగులపైఁ బడితే నాయాలు దాఁకకుండునా
కలికి సతుల చూపు కాఁడకుండునా
యిలఁ దోఁడుదొక్కితేను యెండించకుండునా(?)
చెలుల యిండ్లకుఁ బోతే చిక్కించకుందురా

చ. 2:

చిచ్చు గాఁగలించుకొంటే చిమిడించకుండునా
గచ్చుఁ బరస్త్రీలపొందు కాఁచకుండునా
తచ్చి విషము మింగితే తలకెక్కకుండునా
పచ్చి సతులవలపు భ్రమయించకుండునా

చ. 3:

తెగి సముద్రము చొచ్చితే లోఁబడకుండునా
మొగి నింతులమాటలు ముంచకుండునా
తగు శ్రీవేంకటేశ్వరుదాఁసుడై గెలిచితేనే
పగటున నివియెల్లా బంపుసేయకుండునా


రేకు: 0248-03 నాట సం: 03-274 ఉత్సవ కీర్తనలు

పల్లవి:

వీదివీది వాఁడేవాఁడే వీఁడేవీఁడే చెలఁగీని
ఆదిదేవుఁడు శ్రీవేంకటాద్రిమీఁదటను

చ. 1:

గరుడధ్వజంబదె ఘనవిష్ణురథమదె
సరి శంఖచక్రములు శార్ఙ్గమునదె
హరి యందుమీఁదటను ఆయిత్తమై యున్నాఁడదె
అరులనెల్ల గెలిచి అమరులఁ గావను

చ. 2:

సారథి యల్లవాఁడె చాలి రణభేరి యదె
ఆరయ నిరుమేలా బ్రహ్మాదులు వారే
పేరుకొన్న వేదముల బిరుదుపద్యములవె
శ్రీరమణుఁడు మెరసె చిక్కులు వాపఁగను

చ. 3:

ఆటలుఁబాటలు నవె అచ్చరలేమలు వారె
చాటువ నలమేల్మంగ సంగడి నదె
యీటులేని శ్రీవేంకటేశుఁ డేఁగీ నల్లవాఁడె
కోటానఁగోటి దాసులకోరిక లీడేర్చను


రేకు: 0248-04 భైరవి సం: 03-275 శరణాగతి

పల్లవి:

జీవుఁడ నేనొకఁడను సృష్టికిఁ గర్తవు నీవు
యీవల ధర్మపుణ్యములివివో నీచేతివి

చ. 1:

పుట్టినయట్టి దోషాలు పురుషోత్తమా నీవు
పట్టి తెంచివేయక పాయనేరవు
గట్టిగా సంసారములోఁ గలిగిన లంపటాలు
ముట్టి నీ వల్లనేకాని మోయరావు

చ. 2:

పంచభూత వికారాలు పరమాత్ముఁడా నీవే
కొంచక నీయాజ్ఞఁగాని కొద్ది నుండవు
అంచెల జగములోని ఆయా సహజములు
వంచుక నీవల్లఁగాని వైపుగావు

చ. 3:

చిత్తములో విజ్ఞానము శ్రీవేంకటేశ నీవె
హత్తించి చూపినఁగాని యంకెకురాదు
సత్తుగా నిన్నిటికి నీశరణుచొచ్చితి మిదె
నిత్తెముఁ గావఁ బ్రోవ నీయిచ్చే యిఁకను


రేకు: 0248-05 లలిత సం: 03-276 మనసా

పల్లవి:

వెఱవకు మనసా విష్ణుని యభయము
నెఱవుగ నెదుటనె నిలిచినది

చ. 1:

శ్రీపతి కరుణే జీవరాసులకు
దాపును దండై తగిలినది
పైపై దేవుని బలుసంకల్పమే
చేపట్టి రక్షించఁ జెలఁగేది

చ. 2:

నలినోదరు నిజనామాంకితమే
యిలపై దాసుల నేలేది
కలిభంజను శంఖచక్రలాంఛన-
మలవడి శుభముల నందించేది

చ. 3:

శ్రీవేంకటపతి సేసిన చేఁతలే
వేవేలు విధుల వెలసేది
భూవిభుఁ డీతఁడు పూఁచినమహిమలే
కైవశమై మముఁ గాచేవి


రేకు: 0248-06 బౌళి సం: 03-277 కృష్ణ

పల్లవి:

కనియుఁ గానరు నీమహిమ కౌరవకంస జరాసంధాదులు
మనుజులు దనుజులఁ జంపిరనఁగ విని మరి నీశరణము చొరవలదా

చ. 1:

పుక్కిటనే లోకములు చూపితి పూతకి చన్నటు దాగితివి
పక్కననే బండి దన్ని విరిచితివి బాలులు సేసేటి పనులివియా
అక్కరతో తృణావర్తు నణఁచితివి ఆఁబోతుల కీటణఁచితివి
చిక్కించి యనలము చేత మింగితి శిశువులు సేసేటి పనులివియా

చ. 2:

తొడిఁబడ మద్దులుభువిపై గూలఁగదొబ్బియఘాసురుఁ జంపితివి
బడినే గోవర్ధనగిరి యెత్తితి పడుచులు సేసేటి పనులివియా
అడరి బ్రహ్మమాయకుఁ బ్రతిమాయలు అట్టే గడించి నిలిచితివి
పిడికిట చాణూరు నేనుగఁ గొట్టితి పిన్నలు సేసేటి పనులివియా

చ. 3:

కాళింగుని మద మణఁచి దవ్వుగా కడగడలకుఁ బోఁజోఁపితివి
గోలవై యజ్ఞఫలము లిచ్చితివి గోవాళు సేసేటి పనులివియా
యీలీల శ్రీవేంకటాద్రిమీఁదనే యిందరికిని పొడచూపితివి
బేలుదనంబుల నెంచిచూడ పసిబిడ్డలు సేసేటి పనులివియా