తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 247
రేకు: 0247-01 దేసాక్షి సం: 03-266 దశావతారములు
పల్లవి:
నీదాసుల భంగములు నీవు చూతురా
యేదని చూచేవు నీకు నెచ్చరించవలెనా
చ. 1:
పాలసముద్రముమీఁద బవ్వళించినట్టి నీకు
బేలలై సురలు మొరవెట్టినయట్టు
వేళతో మా మనవులు విన్నవించితిమి నీకు
యేల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాదా
చ. 2:
ద్వారకానగరములో తగ నెత్తమాడే నీకు
బీరాన ద్రౌపది మొరవెట్టినయట్టు
ఘోరపు రాజసభలఁ గుంది విన్నవించితిమి
యే రీతి పరాకు నీకు నిఁక రక్షించరాదా
చ. 3:
యెనసి వైకుంఠములో నిందిరఁ గూడున్న నీకు
పెనఁగి గజము మొరవెట్టినయట్టు
చనవుతో మా కోరికె సారె విన్నవించితిమి
విని శ్రీవేంకటేశుఁడ వేగ రక్షించరాదా
రేకు: 0247-02 సామంతం సం: 03-267 శ్రీహరి పరివారము
పల్లవి:
దాసవర్గముల కెల్లా దరిదాపు మీరె కాన
వాసికి నెక్కించరాదా వసుధలో మమ్మును
చ. 1:
సేనాధిపతి నీవు చేరి విన్నవించరాదా
శ్రీనాథునికి నేము సేసే విన్నపము
ఆనుక భాష్యకారులు అట్టే మీరుఁ జేయరాదా
మానక విన్నపము మా మనవి చనవులు
చ. 2:
వేయినోళ్ల భోగి నీవు విన్నపము సేయరాదా
వేయేసి మా విన్నపాలు విష్ణునికిని
ఆయితమై గరుడఁడ అట్టే మీరుఁ జేయరాదా
యేయెడ విన్నపము మా కేమి వలసినాను
చ. 3:
దేవులమ్మ యిందిర మాదిక్కై విన్నవించరాదా
శ్రీవేంకటపతికి చిత్తమందను
ఆవేళ శేషాచలమ అట్టే మీరుఁ జేయరాదా
యీవేళ మా విన్నపము లీడేరె నిఁకను
రేకు: 0247-03 లలిత సం: 03-268 అధ్యాత్మ
పల్లవి:
ఒక్కఁడే యీ జీవుఁడు వొడలు మోపనినాఁడు
యెక్కడి కెక్కడి మాయ యేమి గట్టుకొనెనో
చ. 1:
పొంచి గర్భమున మాసు పొదిగి వుండిననాఁడు
యెంచుకొని ముచ్చటాడ నెవ్వరున్నారు
అంచలఁ బరఁదు(?) కొనెయట్టి సంసారమిదియు
అంచుమోచి తానెందు అణఁగుండెనో
చ. 2:
నిచ్చనిచ్చ రాతిరులు నిద్దురవోయేవేళ
యిచ్చలఁ దాఁ జేసే పనులేమున్నవి
కచ్చుపట్టి తన మేనఁ గాచుకున్నకర్మములు
యెచ్చుకుందుల నాచోట నెందు వోయనో
చ. 3:
బుద్ధెరఁగక బాలుఁడై పొత్తులలోనున్నపుడు
కొద్దిలేక తా నెవ్వరి గురుతెరుఁగు
అద్దుక శ్రీవేంకటేశుఁ డంతర్యామై వుండి
తిద్దుక రాఁగానే కాక తెలివెందు నున్నదో
రేకు: 0247-04 కన్నడగౌళ సం: 03-269 శరణాగతి
పల్లవి:
ఈయపరాధములు సహించవయ్యా
పాయక మమ్ము రక్షించేపని నీదే కాదా
చ. 1:
ఆకడ నీకడ మాలో నంతర్యామివి నీవు
నీకుఁ జేసే విన్నపాలు నీవెరఁగవా
పైకొని వోరువలేక పదరితి మింతేకాక
రాకపోక నీవు మమ్ము రక్షించకుండేవా
చ. 2:
ఱట్టు కెక్కి దాసుల మఱవక రక్షించే నీవు
గుట్టుతో మమ్ము వహించుకొనకుండేవా
పట్టలేక వేగిరించి పైపై దూరితిమిఁ గాక
ఇట్టే మాకీ సిరులు నీవిచ్చినవే యెపుడు
చ. 3:
యిదె శ్రీవేంకటేశ మమ్మేలినవాఁడవు నీవు
వదలకుండ నీవు నావాఁడవే కావా
అదన మన్నించఁగానే ఆసఁజే చాఁచితిఁగాక
చెదరక నాఁడే నాకుఁ జేతిలోనివాఁడవు
రేకు: 0247-05 నారాయణి సం: 03-270 అంత్యప్రాస
పల్లవి:
ఇందాఁకా వచ్చెఁ జేఁతలు యిఁకనో బుద్ధి
యెందుకు నీవే కర్తవు యిఁకనో బుద్ధి
చ. 1:
పుట్టితి నీయాజ్ఞను భుజించితిఁ గర్మమెల్లా
ఇట్టె జీవుఁడ నాకు నిఁకనో బుద్ధి
కట్టుకొంటి సంసారము కలిగెఁ బంచేంద్రియాలు
యెట్టనెదిటి పనుల కిఁకనో బుద్ధి
చ. 2:
వున్నాఁడ నీమాయలోనె వొట్టుకొంటి ఆసలెల్లా
యెన్నికె యీప్రాణికి నిఁకనో బుద్ధి
పన్నుకొంటి సంపదలు పంచభూతాల లోనైతి
యిన్నిటా నీపంపుననే యిఁకనో బుద్ధి
చ. 3:
భూమిపై నన్నేలితివి భోగములకు గురైతి
యేమనేవు యీదేహి కిఁకనో బుద్ది
శ్రీమంతుఁడ విన్నిటాను శ్రీవేంకటేశ్వర నీవు
యీమహిమలెల్లా నీవే యిఁకనో బుద్ధి
రేకు: 0247-06 పాడి. సం: 03-271 దశావతారములు
పల్లవి:
ఈతఁడు బలువుఁడౌట కివియే సాక్షి
యీతఁడు బ్రహ్మమౌట కీతఁడే సాక్షి
చ. 1:
అమరుల మొరాలించి అసుర బాధలు మాన్పె
అమరుల కెక్కుడౌట కదియే సాక్షి
అమృతము పంచిపెట్టి యాదిలక్ష్మిఁ గైకొనె
అమృతమథనమే అన్నిటికి సాక్షి
చ. 2:
యిందరుండే బ్రహ్మాండాలు యిదె కుక్షి నించుకొనె
యిందరి కెక్కుడగుట కిదియే సాక్షి
కందువ వరములిచ్చు కడ నెన్నఁడు జెడవు
కందువ పురాణాలలో కథలే సాక్షి
చ. 3:
ఆది బ్రహ్మఁ బుట్టించె మఱ్ఱాకుమీఁదఁ దుదఁ దేలె
ఆదినంత్య మీతఁడౌట కదివో సాక్షి
పాదుగా శ్రీవేంకటాద్రిపై మహిమ వెదచల్లె
పాదుకొన్నయీతని శ్రీపాదములే సాక్షి