తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 218

వికీసోర్స్ నుండి


రేకు: 0218-01 గుండక్రియ సం: 03-096 అధ్యాత్మ

పల్లవి:

వివరము మాలినట్టి వెఱ్ఱిదేహి తొల్లి
జవకట్టినంతే కాక చండ పోరనేఁటికే

చ. 1:

మనసంతే మంగళము మరి యెంత పొరలినా
తనువు కొలఁదియే సత్వములెల్లాను
తన కలిమెంచుకోక తగని మురిపెముల
పెనఁగఁబోతే తీపు పిప్పిలోనఁ గలదా

చ. 2:

చెంది విత్తిన కొలఁదే చేరి మొలచేటి పైరు
అంది ఆఁకటి కొలఁదే ఆహారమెల్ల
ముందువెనక చూడక మొక్కలపు పరువేల
అందని మానిపంటికి నాసపడవచ్చునా

చ. 3:

శ్రీవేంకటేశ్వరుఁ గొలిచిన కొలఁదియే మేలు
భావించ నాతఁడిచ్చేది భాగ్యమెల్లాను
వేవేలు మొక్కులేల వెస నానాఁటికి నెల్ల
తోవగాని తోవఁ బోతే తుదకెక్కఁగలదా


రేకు: 0218-02 సామంతం సం: 03-097 శరణాగతి

పల్లవి:

ఈ తగవే నాకు నీకు నెంచి చూచితే
కాతరపు జీవులకుఁ గలదా వివేకము

చ. 1:

భారము నీది గనక పలుమారుఁ బాపములే
చేరి మొక్కలాన నేఁ జేసితిని
పేరడిఁ దల్లిదండ్రులు బిడ్డ లేమి సేసినాను
వోరుచుక ముద్దు సేసుకుందురు లోకమున

చ. 2:

కావ నీవు గలవని కడదాఁకా నేరములే
వేవేలు సేసితిని వెఱవక
భావించుక యింటిదొర పసురము దెంచుకొని
యేవిధిఁ బైరుమేసినా నెగ్గుసేయఁ డతఁడు

చ. 3:

పుట్టించేవాఁడవు నీవు పొదలేవారము నేము
యెట్టుండినా నీకుఁ బోదు యెన్నటికిని
వొట్టుక శ్రీవేంకటేశ వోడఁగట్టిన దూలము
అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు


రేకు: 0218-03 లలిత సం: 03-098 అధ్యాత్మ

పల్లవి:

ఏఁటి నేను యేఁటి బుద్ధి యెక్కడి మాయ
వీటిఁ బొయ్యే వెఱ్ఱిఁ గాను వివేకిఁ గాను

చ. 1:

ఆరసి కర్మము సేసి అవి(ది?) నన్నుఁ బొదిగితే
దూరుదుఁ గర్మము గొంది దూరుచు నేను
నేరక లంపటములు నేనే కొన్నిగట్టుకొని
పేరడిఁ బరులనందుఁ బెట్టరంటాను

చ. 2:

యెక్కుడు నా దోషములు యెన్నైనా వుండఁగాను
వొక్కరి పాపము లెంతు వూరకే నేను
తిక్కవట్టి నాకు నాకే దేవతలకెల్లా మొక్కి
వొక్కరివాఁడఁ గాకుందు వుస్సురనుకొంటాను

చ. 3:

విరతిఁ బొందుదుఁ గొంత వేరే సంసారముఁ జేతు
యెరవులవాఁడనే యెప్పుడు నేను
అరిది శ్రీవేంకటేశుఁ డంతలో నన్ను నేలఁగా
దొరనైతి నధముఁడఁ దొల్లే నేను


రేకు: 0218-04 భైరవి సం: 03-099 వైరాగ్య చింత

పల్లవి:

ఆతఁడు భక్తసులభుఁ డచ్యుతుఁడు
రాతిగుండెవాఁడుగాఁడు రంతు మానుఁ డిఁకను

చ. 1:

జీవుఁడా వేసరకు చిత్తమా జడియకు
దైవము గరుణించఁ దడవు గాదు
తోవ చూపె మనకు తొల్లే ఆచార్యుఁడు
కావలసినట్లయ్యీఁ గలఁగకుఁ డిఁకను

చ. 2:

కాలమా వేగిరంచకు కర్మమా నన్నుమీరకు
పాలించ దైవానకు నే భార మిఁకను
ఆలించి తిరుమంత్రమే ఆతని నన్నుఁ గూరిచె
వేళగాని అందాఁకా వేసరకుఁ డిఁకను

చ. 3:

వెఱవకు దేహమా వేసరకు ధ్యానమా
యెఱిఁగి శ్రీవేంకటేశుఁ డెడసిపోఁడు
తఱి నిహపరము లితనిదాసు లిచ్చిరి
గుఱియైతి నిన్నిటికిఁ గొంకకుఁడీ ఇఁకను


రేకు: 0218-05 సాళంగం సం: 03-100 శరణాగతి

పల్లవి:

పలువిచారములేల పరమాత్మ నీవు నాకు
గలవు కలవు వున్నకడమ లేమిటికి

చ. 1:

నీ పాదముల చింత నిబిడమైతేఁ జాలు
యే పాతకములైన నేమి సేసును
యేపార నీ భక్తి ఇంత గలిగినఁ జాలు
పైపై సిరు లచ్చటఁ బాదుకొని నిలుచు

చ. 2:

సొరిది నీ శరణము చొచ్చితినంటేఁ జాలు
కరుణించి యప్పుడట్టే కాతువు నీవు
సరుస నీముద్రలు భుజములనుంటేఁ జాలు
అరుదుగాఁ జేతనుండు అఖిలలోకములు

చ. 3:

నేరక వేసినఁ జాలు నీ మీఁద నొకపువ్వు
కోరిన కోరికలెల్లఁ గొనసాగును
మేరతో శ్రీవేంకటేశ మిమ్ముఁ గొలిచితి నేను
యేరీతి నుండినఁ గాని యిన్నిటా ఘనుఁడను


రేకు: 0218-06 బౌళి సం: 03-101 శరణాగతి

పల్లవి:

ఇందుకంటే మరి యిఁకలేదు హితోపదేశము వో మనసా
అంది సర్వసంపన్నుఁడు దేవుఁడు ఆతని కంటే నేరుతుమా

చ. 1:

కల దొకఁటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది
తలఁకక మీ శరణు చొచ్చి మీ దాసుడ ననెడి దొకమాఁట
వలవని జోలే యింతాను వడి నిదిఁ గాక యేమిసేసినను
సులభ మిందునే తొల్లిటి వారలు చూరలుగొనిరదే మోక్షంబు

చ. 2:

మొదలొకటే యిన్నిటికి ముందర వెనకా వచ్చేది
వొదుగుచు గోవిందుని దాసులకు నొక్కమాటే మొక్కినఁ జాలు
తుద కెక్కనివే యితరములు దొరకొని మరేమి సేసినను
బదికి లిరిందునే పరమవైష్టవులు పలు చదువులలో వినరాదా

చ. 3:

తగులొకటే విడువరానిది తతి నెన్నటికినిఁ జెడనిది
వొగి శ్రీవేంకటపతి నామజపము వొకమాటే అబ్బినఁ జాలు
నగుబాటే యింతాను నానాఁటి కేమేమి సేసినను
తగు నీ బుద్ధుల నడచిరి మున్నిటి దైవజ్జులు పూర్వాచార్యులును