తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 217
రేకు: 0217-01 దేసాక్షి సం: 03-090 కృష్ణ
పల్లవి:
కన్నవిన్నవారెల్లా కాకు సేయరా
వున్నతుఁడవైన నీకీ వొచ్చములేలయ్యా
చ. 1:
దేవతలఁ గాచినట్టి దేవుఁడ నీకుఁ బసుల
నీవలఁ గాచితివనే హీనమేలా
కావించి పాలజలధిఁ గాఁపురముండినయట్టి-
నీవు పాలదొంగవనే నింద నీకేలయ్యా
చ. 2:
కాలమందు బలి దైత్యుఁ గట్టివేసినట్టి నీకు
రోలఁ గట్టువడినట్టి రోంఁత నీ కేల
పోలించి లోకాలకెల్ల పొడవైన దేవుఁడవు
బాలుఁడవై రేపల్లెలోఁ బారాడనేలయ్యా
చ. 3:
పాముమీఁదఁ బవ్వళించి పాయకుండినట్టి నీకు
పాముతల దొక్కినట్టి పగలేలా
కామించి శ్రీవేంకటాద్రి కడపరాయఁడ నీవు
భూమి మాయలణఁచి నేర్పుల మాయలేలయ్యా
రేకు: 0217-02 వరాళి సం: 03-091 అధ్యాత్మ
పల్లవి:
చేసినట్టే సేసుఁ గాక చింత మాకేలా
వాసీవంతూ నతనిదే వట్టి జాలి యేలా
చ. 1:
కర్మమూలమైనవి యీ కాయపువర్తనలెల్లా
ధర్మమూలమైనది యీ దైవికము
మర్మమైన వాఁడొక్కఁడే మనసులోనున్న హరి
నిర్మిత మాతనిదింతే నేర నేనెంతవాఁడ
చ. 2:
ధనమూలమైనది యీ తగిన ప్రపంచమెల్లా
తనువు మూలమైనది యీ తపసులెల్లా
ననిచి యీ రెంటికిని నారాయణుఁడే కర్త
కొనమొద లాతనిదే కొసరు మాకేల
చ. 3:
భోగమూలమైనది యీ పొందైన సంసారము
యోగమూలము విరతి కొక్కటైనది
యీ గతి శ్రీవేంకటేశుఁ డెట్టు వలసినఁ జేసు
బాగులుగా నీతని శ్రీపాదమే మా దిక్కు
రేకు: 0217-03 పాడి సం: 03-092 వేంకటగానం
పల్లవి:
ఎదురేది యెంచి చూడ నితని ప్రతాపానకు
పదిదిక్కులను భంగపడిరి దానవులు
చ. 1:
యెక్కువగా వినోదాన కితఁడు తేరెక్కితేను
యెక్కిరి దైత్యులు కొఱ్ఱు లిందరుఁ గూడి
చక్కఁగా నితఁడు చేత చక్రమెత్తిన మాత్రాన
దిక్కులఁ బరువెత్తిరి దిమ్మరిఅసురలు
చ. 2:
దట్టమై యీతని భేరిఁ దగ నాదు వుట్టితేను
పుట్టె నుత్పాతాలు వైరిపురములందు
అట్టె గరుడధ్వజ మటు మిన్నుముట్టితేను
కిట్టి దనుజుల కపకీర్తి తుదముట్టేను
చ. 3:
అలమేలుమంగవిభుఁడటు వీధులేఁగితేను
ఖలు లేఁగిరి యమునికట్టెదిరికి
యెలమి శ్రీవేంకటేశుఁ డేపుమీరఁ జొచ్చితేను
ములిగి దైత్యసతులు మూలమూల చొచ్చిరి
రేకు: 0217-04 సాళంగనాట సం: 08-093 తేరు
పల్లవి:
కన్నులపండుగ లాయఁ గడపరాయని తేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు
చ. 1:
కదలెఁ గదలెనదె గరుడధ్వజుని తేరు
పొదిగి దేవదుందుభులు మ్రోయఁగా
పదివేలు సూర్యబింబము లుదయించినట్లు
పొదలి మెరుపు వచ్చి పొడచూపినట్లు
చ. 2:
వచ్చెవచ్చె నంత వింత వాసుదేవుని తేరు
అచ్చుగ దేవకామిను లాడిపాడఁగా
ముచ్చటతో గరుడఁడు ముందట నిలిచినట్టు
మెచ్చుల మెరుఁగులతో మేఘము వాలినట్టు
చ. 3:
తిరిగెఁ దిరిగెనదె దేవదేవో త్తము తేరు
వరుస దేవతలెల్ల జయవెట్టగా
విరివిఁ గడపలో శ్రీవేంకటేశుఁడు తేరుపై
నిరవాయ సింహాసన మిదేయన్నట్లు
రేకు: 0217-05 బౌళి సం: 03-094 రామ
పల్లవి:
రామా దయాపరసీమా అయోధ్యపుర
ధామా మావంటివారి తప్పులు లోఁగొనవే
చ. 1:
అపరాధియైనట్టి యాతని తమ్మునినే
కృపఁ జూపితివి నీవు కింకలు మాని
తపియించి యమ్ముమొన దారకుఁ జిక్కినవాని
నెపానఁ గాచి నిడిచి నీ వాదరించితివి
చ. 2:
సేయరాని ద్రోహము సేసిన పక్షికి నీవు
పాయక అప్పటి నభయ మిచ్చితి
చాయ సేసుకొని వుండి స్వామిద్రోహిఁ జెప్పనట్టి-
తోయపుటేటెని మంచితోవనే పెట్టితివి (?)
చ. 3:
నేరము లెంచవు నీవు నీదయే చూపుదుగాని
బీరపు శరణాగతబిరుద(వు?) నీవు
చేరి నేఁడు నిలుచుండి శ్రీవేంకటాద్రిమీఁదఁ
గోరిన వరములెల్లా కొల్ల లొసఁగితివి
రేకు: 0217-06 ఆహిరి సం: 03-095 వైష్ణవ భక్తి
పల్లవి:
ఎట్టయినాఁ జేసుకో ఇఁక నీ చిత్తము నన్ను
పట్టిచ్చె మా గురుఁడు నీ పాదాలు విడువను
చ. 1:
పోఁడిమి నా నామములు పొద్దువొద్దు నుడిగీని
వీఁడేమడుగునోయని వెఱవకుమీ
నాఁడే నా యాచార్యుఁడు నాకు నన్నీ యిచ్చినాఁడు
నేఁడిదేలంటే నతని నేమము నే మానను
చ. 2:
ప్రేమతో వీఁడు నన్నింటఁ బెట్టుక పూజించీని
యేమి గారణమోయని యెంచుకోకుమీ
కామించి యాచార్యుఁడే కారణము నీకు నాకు
యీ మరులేలంటే నాతఁడిచ్చిన సొమ్మే నేను
చ. 3:
పలుమారు వీఁడు నాపై బత్తిచేసీ నేఁటికని
వెలయ శ్రీవేంకటేశ వేసరకుమీ
యెలమి నాచార్యుఁడిదే పని చేసినాఁడు
నిలిచెఁ గలకాలము నీకు నాకుఁ బోదు