Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 219

వికీసోర్స్ నుండి


రేకు: 0219-01 దేసాక్షి సం: 03-102 వేంకటగానం

పల్లవి:

ఏ లోకమున లేఁడు యింతటి దైవము మరి
జోలిఁ దవ్వితవ్వి యెంత సోదించినాను

చ. 1:

మంచిరూపున నెంచితే మరుని గన్నతండ్రి
ఇంచుకంత సరిలేదు ఇతనికిని
మించు సంపదలనైతే మేటిలక్ష్మీకాంతుఁడు
పొంచి యీతనికి నీడు పురుఁడించఁగలరా

చ. 2:

తగఁ బ్రతాపమునను దానవాంతకుఁ డితఁడు
తగుల నీతని మారుదైవాలు లేరు
పొగరు మగతనానఁ బురుషోత్తముఁ డితఁడు
వెగటై యీతనిపాటి వెదకిన లేరు

చ. 3:

పట్టి మొదలెంచితేను బ్రహ్మఁ గన్నతండ్రితఁడు
మట్టున నింతటివారు మరి వేరి
ఇట్టే శ్రీవేంకటేశుఁడీగికి వరదుఁడు ట్ట
కొట్టఁగొన నితరుల గురిసేయఁగలరా


రేకు: 0219-02 బౌళి సం: 03-103 శరణాగతి

పల్లవి:

అవాప్తసకలకాముఁ డనుమాట నీకుఁ జెల్లె
వివేకించఁ బురుషార్థవిధి మా యందేది

చ. 1:

మరిగి నీపై భక్తి మాకుఁ గలుగుటెల్లాను
అరసి నీవు రక్షించే ఆసకొరకే
హరి నీవు భక్తవాత్సల్యము మాపై జేయుటెల్ల
ఇరవైన నీకు నిరుహేతుకమే

చ. 2:

కొసరుచు నిన్ను నేము కొలిచినదెల్లాను
వెస మా భారము నీపై వేయుకొరకే
వసముగా నీవు నన్ను వలెనని యేలుటెల్ల
యిసుమంతైన నిరుహేతుకమే

చ. 3:

శ్రీవేంకటేశ్వర నీకుఁ జేయెత్తి మొక్కుటయెల్ల
నీవే మావాఁడవై మన్నించుకొరకే
ఆవటించి అంతర్యామివై నీవుండుటయెల్ల
యేవలఁ జూచిన నిరుహేతుకమే


రేకు: 0219-03 బౌళి సం: 03-104 అధ్యాత్మ

పల్లవి:

మఱచిన వెఱచిన మఱి లేదు
యెఱిఁగిన సులభుఁడు యీ హరి యొక్కఁడే

చ. 1:

అతుమ తొల్లొటిదే అంతరాత్మ తొల్లిటిదే
నీతితో యీదేహములే నిత్యకొత్తలు
యీతల నేర్పరులకు నిందే యిహపరములు
చేతిలో నున్నవి యిది చింతించరో జనులు

చ. 2:

కాలము నెందూఁ బోదు కర్మము నెందూఁ బోదు
జాలిఁబడ్డ మనసే సావివోయను
పోలింప వివేకులకు పుణ్యమునుఁ బాపమును
వేళవేళనే వున్నవి వెదకరో జనులు

చ. 3:

ఆఁకలినిఁ దీరదు అన్నమునుఁ దీరదు
తేఁకువ తన ధైర్యమే తీరెఁగాని
తాఁకక శ్రీవేంకటేశుదాసులై తేఁ జాలుఁగాని
కాఁక దీరు నిందరికిఁ గనుకోరో జనులు


రేకు: 0219-04 రామక్రియ సం: 03-105 అధ్యాత్మ

పల్లవి:

చవులకుఁ జవి సంసారము
భవము నానాఁటికి పచ్చిదే

చ. 1:

దైవికము మా స్వతంత్రముతోఁ గూడె
సావివోదెన్నఁడు సంసారము
పూవుపిందెవలెఁ బొడమివున్నవి
యేవల యీరెండు నేకమే

చ. 2:

పాపముఁ బుణ్యము పైపైఁ గూడుకొని
చాపకింది నీరు సంసారము
రేపుమాపు వలె రెట్టించి వున్నవి
యేపొద్దు నీ రెండు నేకమే

చ. 3:

మాయ గొంత నిజమార్గమునుఁ గొంత
చాయ దప్ప దిదేసంసారము
చేయిచ్చి వున్నాఁడు శ్రీవేంకటేశుఁడు
యీయెడ నీరెండు నేకమే


రేకు: 0219-05 దేవగాంధారి సం: 03-106 అధ్యాత్మ

పల్లవి:

ఒరసి చూడఁగబోతే నొకటి నిజములేదు
పొరల మేను ధరించి పొరలఁగఁ బట్టెను

చ. 1:

పాతకములట కొన్ని బలుపుణ్యాలట కొన్ని
యీతల స్వర్గనరకాలిచ్చేవట
యేతుల నందుఁ గొన్నాళ్లు యిందుఁ గొన్నాళ్లు
పోతరించి కాతరించి పొరలనే పట్టెను

చ. 2:

పొలఁతులట కొందరు పురుషులట కొందరు
వెలుఁగును జీఁకట్లు విహారమట
కలవరింతలు గొంత ఘనసంసారము గొంత
పొలసి జీవులు రెంటాఁ బొరలఁగఁ బట్టెను

చ. 3:

వొక్కవంక జ్ఞానమట వొక్కవంకఁ గర్మమట
మొక్కి ఇహపరాలకు మూలమిదట
తక్కక శ్రీవేంకటేశుదాసులై గెలిచిరట
పుక్కట నిన్నాళ్లు రంటాఁ బొరలఁగఁ బట్టెను


రేకు: 0219-06 భూపాళం సం: 03-107 ఉపమానములు

పల్లవి:

మదించిన యేనుగను మావటీఁడు దిద్దినట్టు
త్రిదశవంద్యుఁడ నీవే తిప్పఁగదే మనసు

చ. 1:

నేరమి సేసినవాఁడు నిక్కపుటేలికఁగని
తారితారి యిందునందు దాఁగినయట్టు
తీరని పంచేంద్రియాల దిమ్మరియై తిరిగాడి
కోరి నీపై భక్తియంటే కొలుపదు మనసు

చ. 2:

పగసేసుకొన్నవాఁడు బలు మందసములోన
వెగటు జాగరముల వేగించినట్టు
మిగుల వేదమార్గము మీరి పాపమునఁ జిక్కి
జిగి నిన్నుఁ జేరుమంటే జంతించీ మనసు

చ. 3:

నిరుఁబేదయైనవాఁడు నిధానము పొడగని
గరిమ భ్రమసి యట్టే కాచుకున్నట్టు
యిరవై శ్రీవేంకటేశ యిట్టే నిన్నుఁ బొడగని
వెరవున నీగుణాలు వెదకీని మనసు