తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 206
రేకు: 0206-01 సాళంగనాట సం: 03-031 రామ
పల్లవి:
అని రావణుతల లట్టలుఁ బొందించి
చెనకి భూతములు చెప్పె బుద్ది
చ. 1:
కట్టిరి జలనిధి కపిసేన లవిగో
చుట్టు లంక కంచుల విడిసె
కొట్టిరి దానవకోట్ల తలలదే
కట్టిడి రావణగతియో నీకు
చ. 2:
యెక్కిరి కోటలు యిందరు నొకపరి
చిక్కిరి కలిగిన చెరయెల్ల
పక్కన సీతకుఁ బరిణామమాయ
నిక్కె(క్క?)ము రావణ నీకో బ్రదుకు
చ. 3:
పరగ విభీషణుఁ బట్టము గట్టెను
తొరలి లంకకును తొలుఁదొలుతే
గరిమెల శ్రీవేంకటగిరిరాముఁడు
మెరసెను రావణ మేలాయఁ బనులు
రేకు: 0206-02 దేవగాంధారి సం: 03-032 అధ్యాత్మ
పల్లవి:
దైవమ నీవే యిఁక దరి చేరుతువుఁ గాక
జీవుల వసము గాదు చిక్కిరి లో లోననే
చ. 1:
పుట్టుట సహజ మిది పొదలే జీవుల కెల్ల
గట్టిగా జగమునందు కలకాలము
నట్టేటి వరదవలె నానాటి నీ మాయ
కొట్టుక పారఁగఁజొచ్చె కూడిన విజ్ఞానము
చ. 2:
పాపమే సహజము బద్ధసంసారుల కెల్ల
కాఁపురపు విధులలో కలకాలము
తేపలేని సముద్రము తెరఁగున కర్మమెల్లా
మాపురేపు ముంచఁజొచ్చె మతిలోని ధైర్యము
చ. 3:
లంపటమే సహజము లలి దేహధారులకు
గంపమోపుకోరికెల కలకాలము
యింపుల శ్రీవేంకటేశ ఇదె నీ దాసులని
పంపుసేసి బ్రదికించె ప్రపన్నసుగతి
రేకు: 0206-03 గుండక్రియ సం: 03-033 అద్వైతము
పల్లవి:
ఇట్టి నాస్తికుల మాట యేమని నమ్మెడి దిఁక
పట్టి సములమంటానే భక్తుల దూషింతురు
చ. 1:
వేదములు చదువుతా విశ్వమెల్లాఁ గల్లనేరు
ఆ దెస తాము పుట్టుండి అదియును మాయనేరు
పాదగు విష్ణుడుండఁగ బయలు తత్త్వమనేరు
లేదు జీవత్వమంటా లేమలఁ బొందుదురు
చ. 2:
తిరమై తమఇండ్ల దేవపూజలు సేసేరు
ధరలోన తముఁ దామే దైవమనేరు
అరయఁ గర్మమె బ్రహ్మమని యాచరించేరు
సరి నదే కాదని సన్యసించేరు
చ. 3:
అందుక పురుషసూక్త మర్థముఁ జెప్పుదురు
కందువ నప్పటి నిరాకార మందురు
యిందులో శ్రీవేంకటేశ యిటె నీ దాసులుఁ గాక
మందపు రాక్షసులాడే మతము నడతురు
రేకు: 0206-04 వసంతవరాళి సం: 03-034 వైష్ణవ భక్తి
పల్లవి:
ఇహముఁ బరముఁ జిక్కె నీతని వంక
అహిశయనుని దాసులంతవారు వేరీ
చ. 1:
సిరి కలిగినవారు చింతలిన్నిటనుఁ బాసి
నిరతపు వర్గ(గర్వ?) ముతో నిక్కేరటా
సిరికి మగఁడయిన శ్రీపతి యేలి మ-
మ్మరయుచునున్నాఁడు మా యంతవారు వేరీ
చ. 2:
బలవంతుఁడైనవాఁడు భయము లిన్నిటఁ బాసి
గెలిచి పేరు వాడుచుఁ గెరలీనటా
బలదేవుఁడైన శ్రీపతి మా యింటిలోన
అలరి వున్నాఁడు మా యంతవారు వేరీ
చ. 3:
భూము లేలేటివాఁడు భోగములతోఁ దనిసి
కామించి యానందమునఁ గరఁగీనటా
సేమముతో భూపతైన శ్రీవేంకటేశుఁడు మాకు
ఆముకొనివుండఁగా మాయంతవారు వేరీ
రేకు: 0206-05 మాళవిగౌళ సం: 03-035 వేంకటగానం
పల్లవి:
అన్నియు నీతనిమూల మాతఁడే మాపాలఁ జిక్కె
కన్నుల వేడుకకు కడయేది యిఁకను
చ. 1:
కామధేనువు గలి(గి?)తే గర్వించు నొక్కరుఁడు
భూమి యేలితే నొకఁడు పొదలుచుండు
కామించి నిధి గంటె కళలమించు నొకఁడు
శ్రీమంతుఁడగు హరి చిక్కె మాకు నిదివో
చ. 2:
పరుసవేదిగలి(గి?)తే పంతములాడు నొకఁడు
ధరఁ జింతామణబ్బితే దాఁటు నొకఁడు
సురలోక మబ్బితేను చొక్కుచునుండు నొకఁడు
పరమాత్ముఁడే మా పాలఁ జిక్కెనిదివో
చ. 3:
అమృతపానము సేసి యానందించు నొకఁడు
భ్రమను దేహసిద్దిఁ బరగొకఁడు
తమి శ్రీవేంకటేశుఁడే దాఁచిన ధనమై మాకు
అమరి నా మతిఁ జిక్కె నడ్డములే దిదివో
రేకు: 0206-06 దేవగాంధారి సం: 03-036 కృష్ణ
పల్లవి:
పట్టరో వీదులఁ బరువులు వెట్టి
పుట్టుగులతో హరి పొలసీ వీఁడే
చ. 1:
వేవేలు నేరాలు వెదకేటి దేవుడు
ఆవులఁ గాచీ నలవాఁడే
పోవుగ బ్రాహ్మలఁ బుట్టించు దేవుఁడు
సోవల యశోదసుతుఁడట వీఁడే
చ. 2:
ఘనయజ్ఞములకుఁ గర్తగు దేవుఁడు
కినిసి వెన్న దొంగిలె వీఁడే
మునుల చి త్తముల మూలపుదేవుఁడు
యెనసీ గొల్లెతల యింటింట వీఁడే
చ. 3:
నుడిగి నారదుఁడు నుతించు దేవుఁడు
బడి రోలఁ గట్టువడె వీఁడే
వుడినోని వరము లొసఁగెడు దేవుఁడు
కడఁగిన శ్రీవేంకటగిరి వీఁడే