తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 207

వికీసోర్స్ నుండి


రేకు: 0207-01 భైరవి సం: 03-037 వైరాగ్య చింత

పల్లవి:

వెఱ్ఱివారిఁ దెలుపుట వేవేలు సుకృతము
ముఱ్ఱుఁబాల మంకే కాని ముందు గాన దైవమా

చ. 1:

ఇంతక తొల్లిటిజన్మ మెటువంటిదో యెరఁగ
పొంతనే ఇటమీఁదటి పుట్టు వెరఁగ
అంతరానఁ బెరిగే కాయమే నాకు సుఖమై
సంతసాన మురిసేను సంసారమందును

చ. 2:

వొడలి లోపలి హేయ మొకఇంతాఁ దలఁచను
బడి నెదిటి దేహాల పచ్చి దలఁచ
సుడిసి పై పచారాలే చూచి సురతసుఖాన
పడఁతులఁ బొందిపొంది పరిణామించేను

చ. 3:

పాపమూలమున వచ్చే బలునరకము లెంచ
యేపునఁ బుణ్యపుబుదద్ధి ఇంచుకా నెంచ
దీపనపు జంతువునుఁ దెచ్చి పావనుఁ జేసితి
చేపట్టి నన్ను రక్షించు శ్రీవేంకటేశుఁడా


రేకు: 0207-02 సామంతం సం: 03-038 అధ్యాత్మ

పల్లవి:

ఎందరితోఁ బెనఁగేను యెక్కడని పొరలేను
కందర్పజనక నీవే గతిఁ గాక మాకు

చ. 1:

నిక్కి నా బలవంతాన నే నే గెలిచేనంటే-
నొక్కపంచేంద్రియముల కోపఁగలనా
తక్కిన సంసారవార్థి దాఁటఁగలనో మరి
దిక్కుల కర్మబంధము తెంచివేయఁగలనో

చ. 2:

పన్నుకొన్న పాయమున పరము సాధించేనంటే
యెన్న నీ మాయ కుత్తర మియ్యఁగలనా
వన్నెల నా మనసే పంచుకోఁగలనో మరి
కన్నట్టి యీ ప్రపంచమే కడవఁగఁ గలనో

చ. 3:

వుల్లములో నిన్ను ధ్యాన మొగి నేఁ జేసేనంటే
తొల్లిటి యజ్ఞానము తోయఁగలనా
ఇల్లి దే శ్రీవేంకటేశ యెదుటనే నీకు మొక్కి
బల్లిదుఁడ నౌదుగాక పంద నఁ గాఁగలనా


రేకు: 0207-03 ఆహిరి సం: 03-039 వైరాగ్య చింత

పల్లవి:

అయ్యో నా నేరమికే అట్టే యేమని వగతు
ముయ్యంచు చంచలాన మోసపోతిఁ గాక

చ. 1:

కాననా నావంటివారే కారా యీ జంతువులు
నానాయోనులఁ బుట్టి నడచేవారు
మానక నా గర్వమున మదాంధమున ముందు
గానక భయపడిన కర్మ నింతేకాక

చ. 2:


చదువనా నేఁ దొల్లి జన్మజన్మాంతరముల
ఇది పుణ్య మిది పాప మింతంతని
వదలక నా భోగవాంఛలే పెంచిపెంచి
తుద కెక్క వెదకని దుష్టుఁడ నేను

చ. 3:


విననా నేఁ బురాణాల వెనకటివారినెల్ల
మనెడి భాగవతుల మహిమ లెల్లా
యెనయుచు శ్రీవేంకటేశు కృపచేత నేడు
ఘనుఁడ నయితిఁ గాక కష్టుఁడఁ గానా


రేకు: 0207-04 సాళంగనాట సం: 03-040 అద్వైతము

పల్లవి:

తాము స్వతంత్రులు గారు 'దాసోహము' ననలేరు
పామరపుదేహులకు పట్టరాదు గర్వము

చ. 1:

పరగు బ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు
హరికే మొరవెట్టేరు ఆపదైతేను
ధరలో మనుజులింతే తామే దయివమనేరు
పొరిఁ దాము చచ్చి పుట్టే పొద్దెరఁగరు

చ. 2:

పండిన వ్యాసాదులు ప్రపంచము కల్లనరు
కొండలుగాఁ బురాణాలఁ గొనియాడేరు
అండనే తిరిపెములై అందరి నడిగి తా-
ముండుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు

చ. 3:

సనకాది యోగులు శౌరిభక్తి సేసేరు దు-
ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా
నినుపయి శ్రీవేంకటేశ నినుఁ జేరి మొక్కుతానే
అనిశము నిరాకారమనేరు యీ ద్రోహులు


రేకు: 0207-05 శంకరాభరణం సం: 03-041 వైరాగ్య చింత

పల్లవి:

ఎట్టు మోసపోతి నేను యివియెల్ల నిజమని
నెట్టన హరినే నమ్మ నేరనయితిఁగా

చ. 1:

దేహమిది నాదని తెలిసి నమ్మివుండితే
ఆహా నే నొల్లనన్నా నట్టే ముదిసె
వూహల నా భోగ మెల్లా వొళ్లఁబ ట్టేనంటా నుంటే
దాహముతోడ నినుముదాగిన నీరాయఁగా

చ. 2:

మనసు నాదని నమ్మి మదిమది నే పెంచితి-
ననుఁగుఁ బంచేంద్రియములందుఁ గూడెనా (ను?)
యెనసి ప్రాణ వాయువులివి సొమ్మని నమ్మితి
మొనసి లోను వెలినై ముక్కువాత నున్నవి

చ. 3:

ఇందుకొరకె నేను ఇన్నాళ్లు పాటుపడితి
ముందు వెనకెంచక నే మూఢుఁడ నైతి
అంది శ్రీవేంకటేశ్వరుఁడంతటా నుండి నా-
చందము చూచి కావఁగ జన్మమే యీడేరె


రేకు: 0207-06 నాట సం: 03-042 శరణాగతి

పల్లవి:

ఎందరైనఁ గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందులో నే నెవ్వఁడ నీ వాదరించే దెట్టో

చ. 1:

పెక్కు బ్రహ్మాండములు నీ పెనురోమకూపములఁ
గిక్కిరిశున్న వందొక కీటమ నేను
చక్కఁగా జీవరాసుల సందడిఁ బడున్నవాఁడ
ఇక్కువ నన్నుఁ దలఁచి యెట్టు మన్నించేవో

చ. 2:

కోటులైన వేదములు కొనాడీ నిన్నందులో నా-
నోటి విన్నపము లొక్క నువ్వుగింజంతే
మాటలు నేరక కొఱవలి వాకిట నుండ
బాటగా నీదయ నాపైఁ బారుటెట్టో

చ. 3:

అచ్చపు నీదాసులు అనంతము వారలకు
రిచ్చల నేనొక పాద రేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్నుఁ దలఁచుక
మచ్చికఁ గాచితి నన్ను మఱవనిదెట్టో