తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 205

వికీసోర్స్ నుండి


రేకు: 0205-01 శంకరాభరణం సం: 03-025 అధ్యాత్మ

పల్లవి:

అతఁడే సకలము అని భావింపుచు
నీతితో నడవక నిలుకడ యేది

చ. 1:

యెందునుఁ జూచిన యీశ్వరుఁ డుండఁగ
విందుల మనసుకు వెలితేది
సందడించే హరిచైతన్య మిదివో
కందువలిఁక వెదకఁగ నేది

చ. 2:

అంతరాత్ముఁడై హరి పొడచూపఁగ
పంతపు కర్మపు భయమేది
సంతత మాతఁడే స్వతంత్రుఁ డిదివో
కొంతగొంత మరి కోరెడి దేది

చ. 3:

శ్రీవేంకటపతి జీవుని నేలఁగ
యీవల సందేహ మిఁక నేది
భావం బీతఁడు ప్రపంచ మీతఁడు
వేవేలుగ మరి వెదకెడి దేది


రేకు: 0205-02 సాళంగనాట సం: 03-026 వైష్ణవ భక్తి

పల్లవి:

అద్దిరా వోయయ్య నేనంతవాఁడనా! వొక-
కొద్ది నీ దాసుల సేవ కోరఁగల గాక

చ. 1:

హరి నీమాయలకు నే నడ్డము చెప్పేవాఁడనా
అరిదైన దదియు రాచాజ్ఞ గనక
పరమపదాన కాసపడుటయు ద్రోహము
సారిది నీ భండారము సొమ్ము గనక

చ. 2:

పంచేంద్రియముల నేఁ బారఁదోలేవాఁడనా
ముంచి నీవు వెట్టినట్టి ముద్ర కర్తలు
అంచల నా విజ్ఞాన మది దలఁచవచ్చునా
నించి నీవు పాఁతినట్టి నిధాన మది

చ. 3:

వొట్టి సంసారపుమోపు వోపననేవాఁడనా
వెట్టి మమ్ము జేయించేటి వేడుక నీది
గట్టిగా శ్రీవేంకటేశ కదిసి నీ శరణంటి
ఱట్టుగ నేఁ జెప్పేనా మీఱఁగ నీ రహస్యము


రేకు: 0205-03 రామక్రియ సం: 03-027 అంత్యప్రాస

పల్లవి:

ఇచ్చలోఁ గోరేవల్లా ఇచ్చే ధనము
అచ్చుతనామమె పో అధికపు ధనము

చ. 1:

నారదాదులు వొగడే నాలుకపయి ధనము
సారపు వేదములలో చాటే ధనము
కూరిమి మునులు దాఁచుకొన్నట్టి ధనము
నారాయణ నామమిదే నమ్మినట్టి ధనము

చ. 2:

పరమపదవికి సంబళ మైన ధనము
యిరవై భక్తులకెల్లా నింటి ధనము
పరగ నంతరంగాన పాఁతినట్టి ధనము
హరినామ మిదియ పో అరచేతి ధనము

చ. 3:

పొంచి శివుఁడు కాశిలో బోధించే ధనము
ముంచిన ఆచార్యుల మూలధనము
పంచి శ్రీవేంకటపతి పాలించే ధనము
నించి విష్ణునామ మదే నిత్యమైన ధనము


రేకు: 0205-04 శ్రీరాగం సం: 03-028 శరణాగతి

పల్లవి:

ఇతనికంటె ఘను లిఁక లేరు
యితర దేవతల యిందరిలోన

చ. 1:

భూపతి యీతఁడె పొదిగి కొలువరో
శ్రీపతి యీతఁడే చేకొనరో
యేపున బలువుఁడు నీతఁడే చేరరో
పైపై వేంకటపతి యైనాఁడు

చ. 2:

మరుగురుఁడితఁడే మతి నమ్మఁగదరో
పరమాత్ముఁ డితఁడె భావించరో
కరివరదుఁ డితఁడె గతియని తలఁచరో
పరగ శ్రీవేంకటపతి యైనాఁడు

చ. 3:

తల్లియు నితఁడే తండ్రియు నితఁడే
వెల్లవిరై యిఁక విడువకురో
చల్లగా నితని శరణని బ్రతుకరో
అల్ల శ్రీవేంకటహరి యయినాఁడు


రేకు: 0205-05 లలిత సం: 03-029 అధ్యాత్మ

పల్లవి:

చూడ వేడుకలు సొరిది నీ మాయలు
తోడనే హరిహరి దొరసీనిదివో

చ. 1:

పుట్టేటి జీవులు పొదలేటి జీవులు
జట్టి గొని రిదియే జగమెల్లా
కట్టిడి కర్మము కాయజు మర్మము
నెట్టుకొన్న దిదె నిఖిలంబెల్లా

చ. 2:

ములిగేటి ధనములు మోచేటి ధనములు
కలిమి మెరసె లోకంబెల్లా
పొలసి వేగుటలు పొద్దు గుంకుటలు
కలిగిన విదివో కాలంబెల్లా

చ. 3:

తగిలేటి పురుషులు తమకపు కాంతలు
బగి వాయనిదీ బదుకెల్లా
అగపడి శ్రీవేంకటాధిప నీ కృపఁ
దెగని జీవనము దినదిన మెల్లా


రేకు: 0205-06 దేవగాంధారి సం: 03-030 ఉపమానములు

పల్లవి:

ఎన్నఁడొకో నేఁ దెలిసి యెక్కుడయి బ్రదికేది
పన్నిన నా గుణమెల్లా భ్రమత పాలాయ

చ. 1:

ధనమద మిదె నన్ను దైవము నెఱగనీదు
తనుమద మెంతయిన తపముఁ జేయనీదు
ఘనసంసారమదము కలుషముఁ బాయనీదు
మనెడి నా మనువెల్ల మదము పాలాయ

చ. 2:

పొంచి కామాంధకారము పుణ్యము గానఁగనీదు
కంచపు జన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతమము పెద్దల నెరఁగనీదు
చించరాని నా బుద్ధి చీఁకటి పాలాయ

చ. 3:

శ్రీవేంకటేశ్వరు మాయ చిత్తముఁ దేరనీదు
యేవంకా నీతఁడే గతి యిన్నిటా మాకు
యే వుపాయమును లేక యీతని మఱఁగు చొచ్చి
దేవుఁ డంతర్యామియని తేజముఁ బొందితిమి