Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 374

వికీసోర్స్ నుండి


రేకు: 0374-01 సామంతం సం: 04-432 గురు వందన, నృసింహ

పల్లకి:

వెనకముందరికిఁ బెద్దలకెల్లను వివరపుసమ్మతి యీ వెరవు
వెనుకొని తనగురునాథుని యనుమతి వేదొక్తంబగు నీ తెరువు

చ. 1:

కనకాసక్తుఁడు గాకుండుట మది కైవల్యమునకు నొకతెరువు
వనితల భ్రమలను వలలఁ దగులని మది వైకుంఠమునకు నొకతెరువు
మునుకొపముఁ బెడఁబాసిన మతి మోక్షంబునకును నొకతెరువు
యెనసి యిందుప హరిఁదలఁచినమతి యిన్నిటికెక్కుడు యీ తెరువు

చ. 2:

నిరతి విషయముల నణఁచిన దృఢమతి నిశ్శ్రేయమున కొకతెరువు
విరతితోడ నెలవై నమతి విభవపుఁ బరమున కొకతెరువు
వెరపున నిందరిమీఁదటిసమమతి విష్ణులోకమున కొకతెరువు
యిరవెరిఁ గంతట హరి నమ్మినమతి యిన్నిటి కెక్కుడు యీ తెరువు

చ. 3:

పన్నినకోరిక తెగఁగోసినమతి పరమపదమునకు నొకతెరువు
వున్న విచారములుడిగించినమతి వున్నతపదమున కొకతెరువు
సన్నుతి భగవద్దాసుల దాస్యమె చలమతి ముక్తికి నొకెతెరువు
యిన్నిట శ్రీవేంకటపతిశరణమె హితమతి నెక్కుడు యీ తెరువు


రేకు: 0374-02 గుజ్జరి సం: 04-433 మాయ

పల్లవి:

కూడుదు రూరకె వొకచో గుమి విత్తురు వేరొకచో
యేడకో తెరువులు నడతురు యేఁటిదో హరిమాయ

చ. 1:

కొందరు జీవులు పురుషులు కొందరు కాంతలు
కొందరు గొందరు నానాకువలయజంతువులు
యిందరుఁగూడుక భువిలో వేమోయేమో చేసెద -
రెందును నేమియుఁ గానరు యిట్టిది హరిమాయ

చ. 2:

జననంబులు మరణంబులు జమునుదయాస్త మయంబులు
జనులివిగనుచునె కనకము సరినార్జింపుదురు
పొనుగుచు నిలిచినదేదో పోయినదేదో కానము
యెనగొని వెరగయ్యీనిదె యిట్టిది హరిమాయ

చ. 3:

జీవులకీ బ్రహ్మాండము చీమలపుట్ట విధంబున
కావరమిటు గప్పున్నది కాలత్రయములను
తావుల శ్రీవేంకటపతి దాసులు చొరకిటు నవ్వఁగ
యీవల నావలఁ బొదిగీ నిట్టిది హరిమాయ


రేకు: 0374-03 శోకవరాళి సం: 04-434 గురు వందన, నృసింహ

పల్లవి:

నడవరో జడియక నవ్యమార్గ మిది
మడుఁగిది వైష్ణవమార్గ మిది

చ. 1:

ఘనశుకముఖ్యులు గన్న మార్గ మిది
జనకాదులు నిశ్చలమార్గ మిది
సనత్కుమాఁరుడుజరపుమార్గ మిది
మనువుల వైష్ణవమార్గ మిది

చ. 2:

నలుగడ వసిష్ఠు నడుచు మార్గమిది
యిల వేదవ్యాసుల మార్గం బిది
బలిమిగలుగు ధ్రువ పట్టపు మార్గము
మలసిన వైష్ణవ మార్గ మిది

చ. 3:

పరమమార్గం బిదె ప్రపంచమార్గము
గురుమార్గం బిదె గోప్య మిదే
గరిమెల శ్రీ వేంకటపతి మాకును
మరిపెను వైష్ణవమార్గ మిదే


రేకు: 0374-04 ముఖారి సం: 04-435 అధ్యాత్మ

పల్లవి:

సమ్మతించి కనుకొండ సరుస నిశ్చలబుద్ది
యెమ్మె నెంత బోధించినా నెక్కుడేల కలుగు

చ. 1:

తలఁపులో కొలఁది దైవము, తనవల్ల
గల విరతికొలఁది ఘనసుఖము
తెలిసిన కొలఁదే తేటల విజ్ఞాన, మందు -
నెలమి నెవ్వరికైన నెక్కుడేల కలుగు

చ. 2:

తపము కొలఁదియే తరువాతి ఫలమును
వుపమ కొలఁదియే యోగమును
ప్రపత్తి కొలఁదియే భాగవత భక్తియును
యెపుడు నెవ్వరికైనా నెక్కుడేల కలుగు

చ. 3:

చెంది చేసిన కొలఁదే శ్రీ వేంకటేశు సేవ
అంది పొందిన కొలఁదే యానందము
కందువ నీతని కృప గల కొలఁదే యింతాను
యెందును దక్కిన వారి కెక్కుడేల కలుగు


రేకు: 0374-05 బౌళి సం: 04-436 నామ సంకీర్తన

పల్లవి:

వెదకిన నిదియే వేదాంతార్థము
మొదలు తుదలు హరిమూలంబు

చ. 1:

మునుకొని అవయవములు యెన్నైనా
పనివడి శిరసే ప్రధానము
యెనలేని సురలు యెందరు గలిగిన
మునుపటి హరియే మూలంబు

చ. 2:

మోవని యింద్రియములు యెన్నైనా
భావపు మనసే ప్రధానము
యీవల మతములు యెన్ని గలిగినా
మూవురలో హరి మూలంబు

చ. 3:

యెరవగు గుణములు యెన్ని గలిగినా
పరమ జ్ఞానము ప్రధానము
యిరవుగ శ్రీ వేంకటేశ్వరు నామమే
సరవి మంత్రముల సారంబు