Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 373

వికీసోర్స్ నుండి


రేకు: 0373-01 రామక్రియ సం: 04-428 వైరాగ్య చింత

పల్లవి:

తతిగాని యీపాటు దైవమా విచారించవే
కతలాయఁ జెప్ప నేఁడు కలికాలమహిమ

చ. 1:

తుటుములై భూసురుల తుండెములు మొండెములు
యిటువలె భూతములు యెట్టు మోఁచెనో
అటు బాలుల రొదలు ఆకాశమె ట్టోరిచెనో
కట కటా యిట్లాయఁ గలి కాల మహిమ

చ. 2:

అంగలాచే కామినుల యంగ భంగపు దోఁపు
లింగితాన మింట సూర్యఁ డెట్టుచూచెనో
పొంగు నానాజాతిచేత భువనమెట్లానెనో
కంగి లోకమిట్లాయఁ కలికాలమహిమ

చ. 3:

అరుదు గోహత్యలు సేయఁగ దూడ లంగలావ
సరి ధర్మదేవతెట్టు సమ్మతించెనో
పరధన చూరకెట్టు పట్టాయనో లక్ష్మి
కరుణ యెందణఁగెనో కలికాలమహిమ

చ. 4:

దేవాలయాలు నానాదేశములెల్లాఁ జొచ్చి
దేవఁగా నెట్లుండిరో దేవతలు
తావులేలే రాజులకు దయ గొంత వుట్టదాయ
కావరమే ఘనమాయఁ గలి కాలమహిమ

చ. 5:

నిరపరాధులఁ జంపి నెత్తురు వారించఁగాను
తెరల కెట్టుండిరో దిక్పాలులు
విరసవర్తనలుండే విపరీతకాలమున
గరువాలుఁ గపటాలే కలికాలమహిమ

చ. 6:

వుపమించి దంపతులు వొకరొకరినిఁ జూడ
చపల దుఃఖములతో సమయఁగాను
తపములు జపములు ధర్మము లెందణఁగెనో
కపురుఁబాపాలు నిండెఁ గలికాలమహిమ

చ. 7:

తలలు వట్టీడువఁగా తల్లులు బిడ్డలవేయ
తలఁపెట్టుండెనో యంతర్యామికి
మలసి ముక్కలుగోయ మరుఁడెట్టు వోరిచెనో
కలఁకలే ఘనమాయఁ గలికాలమహిమ

చ. 8:

దీనత లోఁబడి గుండెదిగు లసురుసురులు
వానినెట్లు లోఁగొనో వాయుదేవుఁడు
గూను వంచి తల్లి చూడఁ గొడుకుఁ గుత్తిక గోయఁ
గానఁబడె నింతేసి కలికాలమహిమ



చ. 9:

పలుమారు నమ్మించి ప్రాణములు గొనఁగాను
యిలఁ దమలోఁ బ్రాణాలెట్లుండెనో
నెలవై శ్రీ వేంకటేశ నీవే యెరుఁగుదువు
కలుషమే ఘనమాయఁ గలికాలమహిమ


రేకు: 0373-02 లలిత సం: 04-429 వైష్ణవ భక్తి

పల్లవి:

నీవు నాసొమ్మవు నేను నీసొమ్ము
యీవల నీవెపుడు మాయింటనుండఁ దగవా

చ. 1:

హరి నీరూపము నాకు నాచార్యుఁడు మున్నె
కెరలి నాపాల నప్పగించినాఁడు
నరహరి నిను నే నన్యాయమునఁ దెలియను
పొరఁబడి నీ కెందుఁ బోఁదగునా

చ. 2:

జనని నీదేవి లక్ష్మి జనకుఁడవు నీవె
తనువులు నాత్మబాంధవము నీవె
అనయము నేనెంత యపరాధినైనాను
పనివడి నీవు నన్నుఁ బాయఁదగునా

చ. 3:

బహువేదములు నిన్ను భక్తవత్సలుఁడవని
సహజబిరుదు భువిఁ జాటీని
యిహమునఁ శ్రీ వేంకటేశ యిది దలఁచైన
విహితమై నాకడకు విచ్చేయవే


రేకు: 0373-03 బౌళి సం: 04-430 భక్తి

పల్లవి:

ఇందిరారమణుఁ దెచ్చి యియ్యరో మాకిటువలె
పొంది యీతనిఁ బూజించ బొద్దాయనిపుడు

చ. 1:

ధారుణి మైరావణు దండించి రాముఁదెచ్చి
నేరుపుమించిన యంజనీతనయా
ఘోరనాగపాశములఁ గొట్టివేసి యీతని
కారుణ్యమందినట్టి ఖగరాజ గరుడా

చ. 2:

నానాదేవతలకు నరసింహుఁ గంభములో
పానిపట్టి చూపినట్టి ప్రహ్లాదుఁడా
మానవుఁడై కృష్ణమహిమల విశ్వరూపు
పూని బండినుంచుకొన్న పొటుబంట యర్జునా

చ. 3:

శ్రీ వల్లభునకు నశేషకైంకర్యముల
శ్రీ వేంకటాద్రి వైన శేషమూరితీ
కైవసమైన యట్టి కార్తవీర్యార్జునుఁడా యీ
దేవుని నీవేళ నిట్టె తెచ్చి మాకు నియ్యరే


రేకు: 0373-04 తోడి సం: 04-431 భక్తి

పల్లవి:

స్వతంత్రుఁడవు నీవు సరిలేని దొరవు నే -
నతికమై యాడినట్లు ఆడఁబోయేవా

చ. 1:

యెంత నీ మనసును యెట్టుండె నట్లనే
అంతయుఁ జేయవయ్య మాకదే చాలు
అంతకంటే నెక్కుడు నేమంటిమివో యటమీఁదఁ
జెంతల మా చెప్పినట్టు సేయఁబోయేవా

చ. 2:

కమ్మి నీవు మునుప సంకల్పించినట్లనే
కిమ్ముల నా రీతిఁ జిత్తగించవయ్య
అమ్మరో నేమందుకుఁ గాదనినను నీవు
సమ్మతించి మాతలఁపు సాగనిచ్చేవా

చ. 3:

పొంచీదేహమున మమ్ముఁ బుట్టించినట్లనే
పెంచి నీపై భక్తిమాకుఁ బెనచవయ్య
నించిన శ్రీవేంకటేశ నేనే పదరితిఁగాక
మంచితనములు నీవు మానఁబోయేవా