తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 372

వికీసోర్స్ నుండి


రేకు: 0372-01 శ్రీరాగం సం: 04-422 నామ సంకీర్తన

పల్లవి:

విన్నప మిదే నీకు వేవేలు విధముల
నన్నుఁ గావవే హరి నమో నమో

చ. 1:

నీగుణము నేనెరిఁగి నిన్నుఁ గొలువనేర
నాగుణము నీవెరిఁగి నన్ను నేలుకొనవయ్య
సాగరము నీవు దచ్చి సతిఁ దెచ్చుకొన్నట్టు
నాగశయనుఁడ హరి నమో నమో

చ. 2:

నీవున్నచో టెరిఁగి నిన్నుఁ దలఁచనేర
నావున్నచో టెరుఁగుదు నన్ను నీవు దలఁచవే
కోవిదుఁడ నారఁ బేరుకొన్నవానిఁగాచినట్టు
నావొడయ హరిహరి నమో నమో

చ. 3:

మనసులో నున్న నిన్ను మరవకుండ నేర
మనసులోని నీవే నామరపు దెలుపవయ్య
పనివడి యహల్యఁ బాదమునఁ గాచినట్టు
ననిచి శ్రీ వేంకటేశ నమో నమో


రేకు: 0372-02 సామంతం సం: ౦4-423 శరణాగతి

పల్లవి:

ఇన్నివిధాలు యిఁకనేల ప్ర -
పన్నుఁడై మీఁద బహువిధులేలా

చ. 1:

సతతభూతదయ సత్యవాక్యము గలితే
కుతిలపు ధర్మాలగొడవలేలా
ప్రతిలేనివిజ్ఞానభావశుద్ధి గలిగితే
మతకపుఁ గర్మాలు మరియేలా

చ. 2:

పొందుగ నిన్నిటను సమబుద్ధి నిలిచితేను
సందడిలోఁ దీర్థాచరణలేలా
నిందమాని యాసమాని నిర్మలచిత్తులయితే
వందడైన వుపవాస వ్రతము లేలా

చ. 3:

శ్రీ వేంకటపతి చింతనము గలిగితే
పావనపు శాస్త్రాల పఠనలేలా
ఆవల నీతని దాసులందుఁ బ్రేమ గలిగితే
కావరపుటితర సంగతులేలా


రేకు: 0372-03 లలిత సం: 04-424 సంస్కృత కీర్తనలు

పల్లవి:

తథాకురుష్వ ముదా మామద్యేవ
అధోక్షజస్తే అనుదాసోహం

చ. 1:

తవాస్మి శరణం దహరాహం
భవదురితాని భంజ మమ
భువి కృతం చ యా పురా ప్రతిజ్ఞాం
జవన దదామి సర్వేభ్య ఇతి

చ. 2:

వ్రజామి శరణం వరద తవాహం౦
త్యజితానుబంధ దర్మ మమ
భుజకృతాం పురా ప్రతిజ్ఞాం
వృజినై ర్మోక్షయిష్యామీతి

చ. 3:

చింతితం మయా శ్రీ వేంకటేశ
కింతు త్వం మయి కృపాంకురు
తంతుహి పురాకృతం ప్రతిజ్ఞాం
అంతగతిం నయామీతి మహి


రేకు: 0372-04 భూపాళం సం: 04-425 నామ సంకీర్తన

పల్లవి:

నీనామమే మాకు నిధియు నిధానము
నీనామమె యాత్మనిధానాంజనము

చ. 1:

నమో నమో కేశవ నమో నారాయణ
నమో నమో మాధవ నమో గోవింద
నమో నమో విష్ణు నమో మధుసూదన
నమో త్రివిక్రమ నమో వామనా

చ. 2:

నమో నమో శ్రీధర నమో హృషీకేశ
నమో పద్మనాభ నమో దామోదర
నమో సంకర్షణ నమో వాసుదేవ
నమో ప్రద్యుమ్నతే నమో యనిరుద్దా

చ. 3:

నమో పురుషోత్తమ నమో యధోక్షజ
నమో నారసింహ నమో యచ్యుత
నమో జనార్దన నమో ఉపేంద్ర
నమో శ్రీవేంకటేశ నమో శ్రీకృష్ణా


రేకు: 0372-05 రామక్రియ సం: 04-426 అంత్యప్రాస

పల్లవి:

ఎంతలేదు చిత్తమా యీఁతలేల మోఁతలేల
వంతులకుఁ బారనేల వగరించనేలా

చ. 1:

దక్కనివి గోరనేల తట్టుముట్టు పడనేల
చిక్కినంతకే సంతసించరాదా
ఒక్కమాఁటే వుప్పుదిని వుపతాప మందనేల
చక్కజాడఁ దగినంతే చవిగొనరాదా

చ. 2:

పారి పారి వేఁడనేల బడలిక పడనేల
మీరి దైవమిచ్ఛినంతే మెచ్చరాదా
వీరిడై పొడవెక్కి విరుగఁబడఁగనేల
చేరి యందినంతకే చేచాఁచరాదా

చ. 3:

జీవులఁ గొలువవేల సిలుగులఁ బడనేల
శ్రీవేంకటేశుఁ డాత్మఁ జక్కివుండఁగా
దావతి పడఁగనేల దప్పులం బొరలనేల
కైవశమైనందుకే గతిగూడరాదా


రేకు: 0372-06 వరాళి సం: 04-427 రామ

పల్లవి:

శ్రీపతి నీ కెదురుచూచేనాకు నిట్లనే
దాపై నేఁడిపుడె ప్రత్యక్షముగావే

చ. 1:

పదునాలుగేండ్లును బాసి నీ కెదురుచూచే
యదన గుహునికిఁ బ్రత్యక్షమైతివి
కదిసి నీ శరణంటే కరి రాజు నెదుటను
అదివో తొల్లియుఁ బ్రత్యక్షమైతివి

చ. 2:

ప్రక్కన నహల్య శాప విమోచనముగాఁగ
అక్కర తోడుతను బ్రత్యక్షమైతివి
చక్మఁగాఁ దపము సేసే శబరియెదుట నీవు
అక్కడ నాఁ డందునుఁ బ్రత్యక్షమైతివి

చ. 3:

భావించినట్టు మతిఁ బరమ యోగులకెల్ల
తావుకొని నిచ్చలుఁ బ్రత్యక్షమైతివి
శ్రీ వేంకటేశ నిన్నుఁ జింతించు మాబోంట్లకు
దైవమవై యిప్పుడే ప్రత్యక్షమైతివి