తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 371

వికీసోర్స్ నుండి


రేకు: 0371-01 బౌళి. సం: 04-416 శరణాగతి

పల్లవి:

అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
తడతాఁకులతాపత్రయము మానుపుటకు

చ. 1:

శరణు శరణు వోసర్వేశ్వర నీకు
మరణభయములెల్ల మానుపుటకొఱకు
మొరయొ మొరయొ నీకు ముకుంద మాధవ
దురితములిన్నియుఁ దొలఁగించుటకు

చ. 2:


దండము దండము నీకు దైవశిఖామణి
పండియుఁ బండని మతి పాకముసేయు కొరకు
అండనే దాస్యము దాస్యము నీకు నేనైతి
నిండు నీకరుణ నాపై నించేటి కొరకు

చ. 3:

అభయ మభయము శ్రీయాదినారాయణ
వుభయకర్మము నాకు నూడుచుట కొరకు
విభుఁడ శ్రీ వేంకటేశ వినుతి సేసెద నిన్ను
శుభములన్నియు మాకుఁ జూపేటి కొరకు


రేకు: 0371-02 గుండక్రియ సం: 04-417 అధ్యాత్మ

పల్లవి:

నీచమైననావల్ల నెరవై దైవమా
చీ చీ యిన్నివిధులఁ జిక్కువడె బదుకు

చ. 1:

యెదుటివేమైనఁ గోరు నింతలోనే మనసు
అది సంభవించకున్న నలమటపడుఁ దాను
కదిసి చేకూరితేను ఘనమై హర్షించు
వెద నీరువంక తుంగ విధమాయ మనసు

చ. 2:

యెక్కడికైన నేఁగు నెరఁగక తనువు
అక్కడ దుర్లభమైతే నంతలో వేసారు
దక్కి యందే సుఖమైతేఁ దానే విఱ్ఱవీఁగు
గక్కున రొంపలోని కంభమాయఁ దనువు

చ. 3:

యెందుకైన సమ్మతించు నిరవైన జీవుఁడు
చెందిన పసిఁడికి చెలులకే మత్తుఁడౌను
కందువ శ్రీ వేంకటేశ కరుణించవయ్య యింక
పొంది పూటచెలమాయఁ బుట్టుగుల సివము


రేకు: 0371-03 లలిత సం: 04-418 శరణాగతి

పల్లవి:

హరి నీమయమే అంతాను
అరసి నీకు శరణనియెద నేను

చ. 1:

యెదుట నెవ్వరిఁక నేమాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుఁడవని నిన్ను
పొదలి చదువులు పొగడీఁగాన

చ. 2:

యెవ్వరిఁ బొడగని యెక్కడనుండిన
నివ్వటిల్ల నది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుఁ
డెవ్వల నని శ్రుతులెంచీఁ గాన

చ. 3:

భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీ వేంకటేశ నాచింత యిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీఁ గాన


రేకు: 0371-04 బౌళిరామక్రియ సం: 04-419 శరణాగతి

పల్లవి:

కలిగె మాకిదె కైవల్యసారము
ఫలించె నాడెదఁ బాడెద నేను

చ. 1:

నీ పాద తీర్థము నీరజ భవుని
పై పై కమండల పానీయము
చేపట్టి శంభుని చిరు జడలలో
దీపించు గంగా తీర్థరాజము

చ. 2:

ఘన నీ నామమె గౌరి నాలికపై
పనిగొన్న మంత్రపాఠము
అనుఁగువాణికి నాదిచదువులఁ
ఔనఁచే మొదలి బీజాక్షరము

చ. 3:

శ్రీ వేంకటేశ్వర చేరి నీ దాసుల
సేవ నా పాలిఁటి జీవనము
ఆవిటించి శరణాగతులకును
త్రోవయైన దిదె దోషహరము


రేకు: 0371-05 కన్నడగౌళ సం: 04-420 దశావతారములు

పల్లవి:

ధరలోను జనహితము నానా భక్తరక్షణము నడపఁ గదయ్యా

చ. 1:

హరీ నీకు నాగపాశబంధనమది నీమహిమకు నటు వెలితా
తరవాతను రావణాది యసురల తలలు నరకుట ప్రతాపముగాదా

చ. 2:

మును నీపై నొక భూతము నడచిన మొగి నీమహిమకు నది వెలితా
ఘనహుంకారము మాత్రమున డచినందు నే కడకుఁ దరముట ప్రతాపముగాదా

చ. 3:

కలియుగమున శ్రీవేంకటగిరిపైఁ గదిసిన నీమహిమకు వెలితా
కలిమల మథనుఁడ కల్క్యవతారము గయికొనుటచటఁ బ్రతాపముగాదా


రేకు: 0371-06 దేవగాంధారి సం: 04-421 అంత్యప్రాస

పల్లవి:

హరి నీకేనే రుణ మత్తుఁగాక తగవైతే
వొరిమ నొకరియ్యఁగ నొకరికి దిద్దుటా

చ. 1:

మొలచు జననలోకమునకు నుదుట వ్రాసే
బలుఁడ నీచే నేఁ బత్రసాల మందుకొంటి
పెలుచు దేవతలకు పితరులకు రుణము
యిల నత్తునట యివి యేనాటి రుణము

చ. 2:

యేయెడ నేమిసేసి యేలోకమందున్నా
పాయని నీవే నాకు ప్రాణబంధుఁడవైతి
కాయపుఁ జుట్టరికాలు ఘన కరుణానుబంధ
మీయెడఁ గలిగెనట యేనాటి రుణము

చ. 3:

శ్రీవేంకటేశ నీవీ చిక్కులఁబెట్టి నాకు
కావిరిఁ గర్మాలు మెడఁ గట్టితివిగా
సోవల నీ శరణము చొచ్చిన నాకు నివి
యేవూరి కేవూరు యేనాఁటి రుణము