తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 363

వికీసోర్స్ నుండి


రేకు: 0363-01 మాళవి సం: 04-369 వైష్ణవ భక్తి

పల్లవి:

ఇదియే వేదాంత మిందుకంటె లేదు
యిదియే శ్రీ వేంకటేశుని మతము

చ. 1:

విరతియే లాభము విరతియే సౌఖ్యము
విరతియే పో విజ్ఞానము
విరతిచే ఘనులైరి వినకవారెల్ల
విరతిఁబొందకున్న వీడదు భవము

చ. 2:

చిత్తమే పాపము చిత్తమే పుణ్యము
చిత్తమే మోక్షసిద్దియును
చిత్తమువలెనే శ్రీ హరి నిలుచును
చిత్త శాంతి లేక చేరదు పరము

చ. 3:

యెంత చదివినా యెంత వెదికినా
యింతకంటె మరి యిఁకలేదు
యింతకంటె శ్రీ వేంకటేశుదాసులౌట
యెంతవారికైన యిదియే తెరువు


రేకు: 0363-02 గుండక్రియ సం: 04-370 వైరాగ్య చింత

పల్లవి:

జీవుఁడు నిత్యుఁడు యీ చింత లెట్టు దొరకెనో
భావించ నిది యేఁటి ప్రచారమో

చ. 1:

తనువు మోచితినంటా తరుణుల పొందులంటా
దినదిన రుచులంటాఁ దిరిగేము
మొనసి సంసారమే మోహినీగజమై
వెనకఁ దలఁచ మేటి వికారమో

చ. 2:

కడుపు నిండినదంటాఁ గమ్మర నాఁకలియంటా
వెడఁగు భోగములంటా వెదకేము
వుడివోని యాసలే వుబ్బుఁగవణములై
విడువదు మతి కేటివిచారమో

చ. 3:

దివము రాతిరి యంటా తెలివంటా నిదురంటా
భువిఁ గాఁపురములంటాఁ బొరలేము
ఇవల శ్రీ వేంకటేశ యింతలో నీ దాసినని
వివరము గంటి నెట్టి వివేకము


రేకు: 0363-03 వళవశ్రీ సం: 04-371 వైరాగ్య చింత

పల్లవి:

ఇందుకుఁగా నా యెరఁగమి నేమని దూరుదును
అందియు నిను నేఁదెలియక అయ్యో నేనిపుడు

చ. 1:

ఆతుమలోననుండి యఖిలోపాయములు
చేతనునకు నీవే చింతించఁగాను
కాతురపడి నేను కర్తననుచుఁ బనులు
యీతలఁ జెప్పఁగఁబూనే నిస్సిరో

చ. 2:

తను విటు నీ వొసఁగి తగు భాగ్యము నీవై
అనువుగ జీవుని నీయటు నీవేలఁగను
తనియక నే వొరులు దాతలనుచుఁ బోయి
కనుఁగొని వేడఁగఁ దొడఁగేఁ గటకటా

చ. 3:

శ్రీవేంకటాద్రిపై నుండి చేరి కన్ను లెదుటను
సేవగొని యిట్టే కృపసేయఁగాను
సోవలఁ గన్నవారెల్లాఁ జుట్టములంటా నేను
జీవులతోఁ బొందుసేసేఁ జెల్లఁబో


రేకు: 0363-04 సామంతం సం: 04-372 నృసింహ

పల్లవి:

ఇట్టిదివో హరికృప యెంచినను
గట్టిగా నాహరి కృపే కలదువో మాకు

చ. 1:

బలుహిరణ్యాక్షుఁడు ప్రహ్లాదునిబట్టి
జలధి వేసిన నీరుచట్టై తేలె
కలుషించి కమ్మరాను కడునగ్నిఁ దోసిన
నిలువెల్లఁ జల్లనినీరై తొలఁకె

చ. 2:

దిట్టయై యేనుగులచే దీకొలిపిన వాఁటి
నట్టె కొమ్ములు తమురైపోయను
పట్టియెత్తి రాలమీఁద బలుమారు వేసిన
బట్టబయలే దూదిపానుపులై నిలిచె

చ. 3:

కడసారెఁ గంభములోఁ గలఁడంటేఁ గలిగి
చిడుముడి రక్కసులఁ జీరివేసె
జడియు శ్రీ వేంకటాచల నారసింహుఁడై
పొడచూపి మాకు దిక్కై పొదలించె నేఁడు


రేకు: 0363-05 శ్రీరాగం సం: 04-373 శరణాగతి

పల్లవి:

అది బ్రహ్మండఁ బిది పిండాండం -
బుదుటు జీవులము వున్నార మిదివో

చ. 1:

వుదయాస్తమయము లొనరినవలెనే
నిదురలు మేల్కను నియమములు
కదిసి త్రిసంధ్యాకాలంబులవలె
గుదిగొను దేహికి గుణత్రయములు

చ. 2:

పుడమి నస్యములు పొదలినవలెనే
వొడలిరోగము లున్న వివే
వుడుగని వెలుపటి వుద్యోగమువలె
కొడిసాగేటి మితి కోరికలు

చ. 3:

వెలుపలఁగల శ్రీ వేంకట విభుఁడే
కలఁ డాతుమలో ఘనుఁ డితఁడే
చలమున నీతని శరణాగతియే
ఫలమును భాగ్యము బహుసంపదలు


రేకు: 0363-06 గుజ్జరి సం: 04-374 మాయ

పల్లవి:

ఏమిసేయవచ్చు హరియెలయించే మాయ లివి
వేమరు నాతనిఁ గొల్చి వీడుకొంటగాక

చ. 1:

పాయమే పరచైతేఁ బట్టఁగ నెట్లవచ్చు
రోయుదాఁకా నందులోఁ దిరుగుటగాక
కాయపువోడ తప్పుగాలి విసరినవేళ
పోయినట్టే పోనిచ్చి పొనుఁగుటగాక

చ. 2:

మనసే మలినమైతే మఱుఁగెట్టు సేయవచ్చు
వొనర విరతిదాఁక నోర్చుటగాక
తన యంతరంగపుటద్దము మాసితే నది
మినుకు విజ్ఞానాన మెరుఁగిచ్చుటగాక

చ. 3:

మెచ్చునాలుకఁదీపు మింగ కెట్టుమానవచ్చు
కొచ్చి కొచ్చి సారె రుచిగొనుటగాక
నచ్చుల శ్రీ వేంకటేశు నామము నోరనుంటే
పచ్చి తనభాగ్యమంటా బ్రదుకుటగాక