తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 362
రేకు: 0362-01 లలిత సం: 04-363 అంత్యప్రాస
పల్లవి:
హరిహరి యిందరికి నబ్బురముగాని యిది
పరగ నీ దాసుఁడే పరతత్వవేది
చ. 1:
పొలసి మశకమండుఁ బొడమేటి జీవుని
తలఁపు బ్రహ్మాండాలు దాఁటిపోయీనీ
నిలువెంత నీఁటెంత నీమాయ లివి భువి
బలిమిఁ దెలియువాఁడె పరతత్వవేది
చ. 2:
తగిలి చూచిన నాత్మఁ దనుఁ గానరాదుగాని
జగమెల్ల దానైతే సరి గనీని
చిగురెంత చేగెంత శ్రీపతి యిందులో నీ -
పగటు దెలియువాఁడే పరతత్వవేది
చ. 3:
యేవంకఁ దనబుద్ది యెక్కడనుండునోకాని
శ్రీ వేంకటేశ నిన్నుఁ జింతించీని
పూవెంత ఫలమెంత పురుషోత్తముఁడ నీ -
భావమెరుఁగువాఁడె పరతత్వవేది
రేకు: 0362-02 సామంతం సం: 04-364 దశావతారములు
పల్లవి:
అల్లదెకో విజయధ్వజము జగ -
మెల్లఁ జేకొనియె నీతఁడు
చ. 1:
తొక్కనిచోట్లు దొక్కెటి తురగపు
రెక్కలమీఁదటి రేవంతుఁడు
చక్కుగ నసురల సంహరించి యిదె
దిక్కులు గెలిచెను దేవదేవుడు
చ. 2:
వోడక శంఖము నొగి చక్రముతో
సూడుకుఁ దిరిగేటి శూరుఁడు
యీడనుండి సురలిందరిఁ గాచెను
మేడెపు మన లక్ష్మీ విభుఁడు
చ. 3:
శరణన వారలఁ జయ్యన గాచిన
శరణాగత రక్షణ ఘనుఁడు
తిరమై యింతకు దిక్కె నిలిచెను
గరిమెల శ్రీ వేంకట విభుఁడు
రేకు: 0362-03 రామక్రియ సం: 04-365 కృష్ణ
పల్లవి:
ఎక్కడ నీ వుద్యోగ మెటు విచ్చేసేవయ్యా
యిక్కువ నీమహిమకు నెవ్వ రెదురయ్యా
చ. 1:
పల్లించి గరుడనిపై నీ వుబ్బుననెక్క
అల్లనాఁడె పారిజాత మడవికెక్కె
పల్లదపురుద్రుఁడును బాణునివాకిలి దొక్కె
చుల్లరి రాక్షసమూఁక సురసుర సుక్కె
చ. 2:
గరుడినిపై నీవు కడుఁబేరెములవార
ధరజలధరుల నమృతములు దేరె
నిరతిఁ గంసాదులనెత్తురు టేరులు వారె
పరులు నీకెదిరిన పగయెల్ల దీరె
చ. 3:
బంగారు గరుడనిపై నీవు వీదులేఁగ
చెంగట శ్రీ వేంకటేశ సిరులుమూఁగె
సంగతి నలమేల్మంగ సంతసాన విఱవీగె
పొంగారు దేవదుందుభులు పై పై వాఁగె
రేకు: 0362-04 వరాళి సం: 04-366 భగవద్గీత కీర్తనలు
పల్లవి:
సమమతినని నీవే చాటుదువు
రమణ నేరుపు నేరము లెవ్వరిని
చ. 1:
రావణాదులైన రాక్షసమితిలో
నీవే, దేవతలలో నీవేకావా
భావింప నసురలు పగ నీకు నేలైరి
యీవల సురులెల్ల హితులైరి
చ. 2:
సకల జంతువులకుఁ జైతన్యుఁడవు నీవే
వొకరు నీకుపరాక మొనరించేరా
అకట కొందరిఁ బాపాత్ములఁగాఁ జేసి
వెకలిఁ గొందరిఁ బుణ్యవిధులఁ జేసితివి
చ. 3:
అటుగాన ఇట్టాయ నట్టాయనననేల
యిటు నీచిత్తముకొలఁ దింతేకాక
గటియించి శ్రీవేంకటపతి నీదాసు
లిటువలె ఘనులై రిదివో నీకృపను
రేకు: 0362-05 ఆహిరి సం: 04-367 నామ సంకీర్తన
పల్లవి:
నే నవగుణి నైన నీకుఁ బోదు భువి
లోన భక్తవత్సలుఁడ వటు గాన
చ. 1:
పరమ పురుషా భవరోగ వైద్య
ధరణీధర మాధవ కేశవా
అరిది సంసారాన నలసితి నినుఁగను -
తెరు వేదొ వెర వేదొ తెలియ నే నిపుడు
చ. 2:
భువనాతీతా పుండరీకేక్షణ
నవనీతప్రియ నారసింహా
యివల నాయపరాధ మెంతైనఁ గలదు నా
వివరము చింతించి వెసఁ గావరాదా
చ. 3:
అగుణాసగుణా యాద్యంతరహితా
అగణిత శ్రీ వేంకటాద్రినాథ
నిగమగోచర నేను నీయాధీనమ నింతే
నగుఁబాటు గాకుండ ననుఁగావుమిపుడు
రేకు: 0362-06 కన్నడగౌళ సం: 04-368 మాయ
పల్లవి:
తల లేదు తోఁక లేదు దైవమా నమాయలకు
తెలిసియుఁ దెలియక తిరిగేము నేము
చ. 1:
తను వేఁటిదో యీ తలపోఁత లేఁటివో
యెనయు సంసార సుఖ మిది యేఁటిదో
వెనక ముం దేఁటిదో వివేక మెరఁగక
దినదినమును నేమో తిరిగేము నేము
చ. 2:
పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో
ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో
మట్టులేని హరి నిర్మాణ చక్రములోన
దిట్టలమై యేమేమో తిరిగేము నేము
చ. 3:
నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో
వూరకే నీ దాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే