తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 364

వికీసోర్స్ నుండి


రేకు: 0364-01 లలిత సం: 04-375 నృసింహ

పల్లవి:

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ
వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా

చ. 1:

అల్లదివో వోఁగునూఁతులౌభళేశు పెద్దకోవ
వెల్లి పలనీటిజాలు వెడలేసోన
చల్లనిమాఁకులనీడ సంగడిమేడలవాడ
యెల్లగాఁగ నరసింహుఁడేగీ నింతితోడను

చ. 2:

సింగారపుమండపాల సింహాలమునిమంద-
లంగపు తెల్ల గోపుర మదె మిన్నంద
చెంగట నాడు వార్లు చేరి పన్నిద్దరుఁగొల్వ
సంగతిఁ దాఁగొలువిచ్చీ జయనరసింహము

చ. 3:

కందువ శ్రీ వేంకటేశు కల్యాణములవేది
అందమై భూములకెల్లా నాదికి నాది
మందల పాలకొండమలకు నట్టనడుమ
విందగు దాసులతోడ విహరించీ దేవుఁడు


రేకు: 0364-02 లలిత సం: 04-376 శరణాగతి

పల్లవి:

ఇతరమెరఁగ గతి యిదియె శరణ్యము
సతతపూర్ణునికి శరణ్యము

చ. 1:

సర్వలోకముల సాక్షైకాచిన -
సర్వేశ్వరునకు శరణ్యము
వుర్వికి మింటికి నొక్కటఁ బెరిగిన -
సార్వభౌమునకు శరణ్యము

చ. 2:

శ్రీకాంత నురముచెంగట నిలిపిన -
సాకారునకును శరణ్యము
పైకొని వెలిఁగేటి పరంజోతియై -
సౌకుమారునకు శరణ్యము

చ. 3:

తగనిహపరములు దాసుల కొసఁగేటి
జగదీశ్వరునకు శరణ్యము
నగు శ్రీ వేంకటనాథుఁడ నీకును
సగుణమూర్తి యిదె శరణ్యము


రేకు: 0364-03 దేవగాంధారి. సం: 04-377 వైరాగ్య చింత

పల్లవి:

ఏదైన దేవుఁడు ప్రాణికియ్యక లేదు
పాదుగ నాతనిమీఁది భక్తే సాధనము

చ. 1:

దేహమునకు ఫలము తెగని యాలుబిడ్డలు
దేహాంతరాత్మకును దేవుఁడొకఁడే ఫలము
దేహమే బంధకము దేవుఁడింతే మోక్షము
వూహల రెంటికి మనసొక్కటే సాధనము

చ. 2:

పుట్టినందుకు ఫలము పొందగు భోగములే
పుట్టుగే గెలుచుటకు భువి జ్ఞానమే ఫలము
పుట్టుటకు గర్మము పోవుటే యకర్మము
వెట్టే యీ రెంటికిని విరతే సాధనము

చ. 3:

చింతించుటకు ఫలము సిరులెల్లఁ జేకొనుటె
చింత వీడుటకు ఫలము శ్రీ వేంకటేశు సేవే
చింతలే దుఃఖములు నిశ్చింతములే సుఖములు
కొంత దాఁచనేల శ్రీ గురుఁడే సాధనము


రేకు: 0364-04 ధన్నాసి సం: 04-378 శరణాగతి

పల్లవి:

శరణాగత వజ్రపంజర బిరు దది నీది
కరుణానిధివై కావవే నేఁడు

చ. 1:

ప్రళయకాలమునాఁడు బ్రహ్మాండకోట్లు
సొలవక నీకుక్షి చొచ్చినట్టు
చెలఁగి నీమరఁగున శ్రీ వేంకటాద్రిమీఁద
యిల నరలోకమెల్ల నెక్కెఁ గావవే

చ. 2:

అసురబాధకుఁగా నఖిలదేవతలును
కొసరుచు మొరవెట్టగూడినట్టు
ముసరి కోనేటిదండ మూఁకలు మూఁకలుగట్టి
విసిగి ప్రాణులు విన్నవించేరు గావవే

చ. 3:

జీవులఁ బుట్టించునాఁడు చేరి యా యా నెలవుల
నీవలన జనులెల్ల నిలిచినట్టు
శ్రీ వేంకటేశ నిన్నుఁ జేరినట్టివారి నెల్ల
తావుల నిలిపి యిట్టే దయఁగావవే


రేకు: 0364-05 నారాయణి సం: 04-379 నామ సంకీర్తన

పల్లవి:

కావఁగ నీకే పోదు కరుణానిధివిగాన
భావించి నీవని తుదపదమే యెక్కితిమి

చ. 1:

కరి రాజ వరద నీకడనున్నవారికి
కరిరాజభయము లెక్కడాఁ బొందవు
సిరుల నీయర్థమే చింతించి చింతించి
నరలోకమెల్ల నీనగమె యెక్కితిమి

చ. 2:

కాళింగమర్దన నిన్నుఁగని మనువారికి
కాళింగభయములెక్కడా లేవు
తాలిమితో నిదియే తలపోసి తలపోసి
కేలి మనుజులము నీగిరియె యెక్కితిమి

చ. 3:

కందువ శ్రీ వేంకట కటకేశ నీవద్ద -
నెందుఁ గటకేశభయమిఁక లేదు
యిందుకే పో జగమెల్లా నిటు శరణని మూల
కందువ నీదండ శ్రీ వేంకటమె యెక్కితిమి


రేకు: 0364-06 దేశాక్షి సం: 04-380 శరణాగతి

పల్లవి:

అతఁడే రక్షకుఁ డందరి కతఁడే
పతి యుండఁగ భయపడఁ జోటేది

చ. 1:

అనంతకరము లనంతాయుధము--
లనంతుడు ధరించెలరఁగను
కనుఁగొని శరణాగతులకు మనకును
పనివడి యిఁక భయపడఁజోటేది

చ. 2:

ధరణి నభయహస్తముతో నెప్పుడు
హరి రక్షకుఁడై యలరఁగను
నరహరికరుణే నమ్మినవారికి
పరఁదున నిఁక భయపడఁజోటేది

చ. 3:

శ్రీ వేంకటమున జీవులఁ గాచుచు
నావల నీవల నలరఁగను
దైవ శిఖామణి దాపగు మాకును
భావింపఁగ భయపడఁజోటేది