రేకు: 0350-01 భంగాళం సం: 04-291 విష్ణు కీర్తనం
పల్లవి : |
భావించి తెలుసుకొంటే భాగ్యఫలము
ఆవలీవలిఫలములంగజ జనకుఁడే
|
|
చ. 1: |
దానములలో ఫలము తపములలో ఫలము
మోనములలో ఫలము ముకుందుఁడే
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
నానాఫలములును నారాయణుఁడే
|
|
చ. 2: |
వినుతులలో ఫలము వేదములలో ఫలము
మనసులోని ఫలము మాధవుఁడే
దినములలో ఫలము తీర్థయాత్రల ఫలము
ఘనపుణ్యముల ఫలము కరుణాకరుఁడే
|
|
చ. 3: |
సతతయోగ ఫలము చదువులలో ఫలము
అతిశయోన్నత ఫలము యచ్యుతుఁడే
యతులలోని ఫలము జితకామిత ఫలము
క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుఁడే
|
|
రేకు: 0350-02 మధ్యమావతి సం: 04-292 నృసింహ
పల్లవి : |
చిత్తజగురుఁడ వో శ్రీ నరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా
|
|
చ. 1: |
సకలదేవతలును జయపెట్టుచున్నారు
చకితులై దానవులు సమసి రదే
అకలంకయగు లక్ష్మి యటు నీ తొడపై నెక్కి
ప్రకటమైన నీ కోపము మానవయ్యా
|
|
చ. 2: |
తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుఁ డభయమడిగీ నదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుఁ గూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా
|
|
చ. 3: |
హత్తి కొలిచే రదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు.
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మీదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా
|
|
రేకు:0350-03 నారాయణి సం: 04-293 మాయ
పల్లవి : |
హరి హరి నీ మాయామహిమ
సరవి దెలియ ననుఁ గరుణించఁగదే
|
|
చ. 1: |
తలఁతును నా పాలిదైవమవని నిను
తలఁతును తల్లివిఁ దండ్రివని
మలసి యంతలో మఱతును తెలుతును
కలవలె నున్నది కడ గనరాదు
|
|
చ. 2: |
మొక్కుదు నొకపరి మొగి నేలికవని
మొక్కుదు నీ వాదిమూలమని
వుక్కున గర్వించి యుబ్బుదు సగ్గుదు
కక్కసమైనది కడ గనరాదు
|
|
చ. 3: |
చూతును నీమూర్తి సులభుఁడవనుచును
చూతు జగములకు సోద్యమని
యీతల శ్రీవేంకటేశ నన్నేలితివి
కౌతుకమొదవెను కడ గనరాదు
|
|
రేకు: 0350-04 నాగవరాళి సం: 04-294 శరణాగతి
పల్లవి : |
దైవము నెరఁగము తత్వముఁ దలఁచము
చేవై హరి రక్షించీ నిదివో
|
|
చ. 1: |
పాపముఁ బుణ్యముఁ బైకొను దేహము
కోపము శాంతపుగుణములది
వోపికవోపము లుదుటు చూపెడిది
చేపట్టుక యిటు చెలఁగే మిదివో
|
|
చ. 2: |
వెలికిని లోనికి విడిసేటిప్రాణము
చలువలు వేండ్లు చల్లెడిది.
తెలివికి నిదురకుఁ దేపై యున్నది
బలిమిఁ జేపట్టుక బ్రదికే మిదివో
|
|
చ. 3: |
పరమును నిహమునుఁ బట్టినజీవుఁడ
పొరుగుకు నింటికిఁ బొత్తైతి
గరిమల శ్రీవేంకటపతి శరణని
నిరతపు మహిమల నెగడే మిదివో
|
|
రేకు: 0350-05 శోకవరాళ సం: 04-295 రామ
పల్లవి : |
ఓవో రాకాసులాల వొద్దు నుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో
|
|
చ. 1: |
జగములో రాముఁడై జనియించే విష్ణుఁడదె
అగపడి లక్ష్మి సీతయై పుట్టెను
తగు శేష చక్ర శంఖ దైవసాధనములెల్ల
జగి లక్ష్మణభరతాంచితశత్రుఘ్నులైరి
|
|
చ. 2: |
సురలు వానరులైరి సూర్యుఁడు సుగ్రీవుఁడు
మరిగిఁ రుద్రుఁడే హనుమంతుఁడాయను
సరుస బ్రహ్మదేవుఁడు జాంబవంతుఁడైనాఁడు
వెరవరి నలుఁడే విశ్వకర్మ సుండి
|
|
చ. 3: |
కట్టిరి సేతువపుడె ఘనులెల్ల దాఁటిరి
ముట్టిరి లంకానగరము నీదళము
యిట్టె శ్రీవేంకటేశుఁ డితఁడై రావణుఁ జంపె
వొట్టుక వరము లిచ్చీ నొనర దాసులకు
|
|
రేకు: 0350-06 బౌళి సం: 04-296 వైరాగ్య చింత
పల్లవి : |
జీవుఁడూ నొక్కటే చిత్తమూ నొక్కటే
వేవేలు మాయలచే వెలయుఁ గొన్నాళ్లు
|
|
చ. 1: |
వొక్కటే దేహము వూరకే బాల్యావస్థ
యెక్కడౌతా నెరఁగడు యిటు గొన్నాళ్లు
చక్కఁగ నంతటిలోనె జవ్వనసాయమునాఁడు
మిక్కిలి పోకలఁ బోయి మెరయుఁ గొన్నాళ్లు
|
|
చ. 1: |
ఆఁకలీ నొక్కటె యటు జనించిననాఁడు
వోఁకరెన్నఁడో దాఁగి వుండుఁ గొన్నాళ్లు
కాఁకల నంతటిలోనె కమ్మరఁ బుట్టినప్పుడే
వేఁకమై పలురుచులు వెదకుఁ గొన్నాళ్లు
|
|
చ. 1: |
దేవుఁడూ నొక్కఁడే తెలియుదాఁకాఁ బెక్కు-
దేవతలై భ్రమయించు దేహము గొన్నాళ్లు
చేవమీర నంతలోనె శ్రీవేంకటేశుఁడై
సేవ గొని సుజ్ఞానిఁ జేసుఁ గొన్నాళ్లు
|
|