తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 349

వికీసోర్స్ నుండి

0349-01 గుండక్రియ సం: 04-285 నృసింహ


పల్లవి :

జగతి వైశాఖశుద్ధచతుర్దశి మందవార -
మగణితముగఁ గూడె నదె స్వాతియోగము


చ. 1:

పక్కన నుక్కుఁగంభము పగిలించుక వెడలి
తొక్కి హిరణ్యకసిపుఁ దొడికిపట్టి
చక్కఁగాఁ గడపమీఁద సంధ్యాకాలమున
వక్కలు సేసె నురవడి నరసింహుఁడు


చ. 2:

పిప్పిగాఁగఁ జప్పరించి పేగులు జందేలు వేసి
తొప్పఁదోఁగుచు నెత్తురు దోసిటఁ జల్లె
రొప్పుచుఁ గోపముతోఁ గేరుచుఁ బకపకనవ్వి
తప్పక చూచె వాని నుదగ్రనరసింహుఁడు


చ. 3:

యెదుటఁ బ్రహ్లాదుఁ జూచి యిందిరఁ దొడపై నుంచె
అదన నందరికి నభయమిచ్చె
కదసి శ్రీవేంకటాద్రిగద్దెమీఁదఁ గూచుండె
వెదచల్లెఁ గృపయెల్ల వీరనరసింహుఁడు

రేకు: 0349-02 సౌరాష్ట్రంసం: 04-286 ఉత్సవ కీర్తనలు


పల్లవి :

వీధులవీధుల విభుఁడేఁగీ నిదె
మోదముతోడుత మొక్కరో జనులు


చ. 1:

గరుడధ్వజ మదె కనకరథం బదె
అరదముపై హరి యలవాఁడె
యిరుదెసల నున్నారు యిందిరయు భువియు
పరఁగ బగ్గములు పట్టరో జనులు


చ. 2:

ఆడే రదివో యచ్చరలెల్లను
పాడేరు గంధర్వపతులెల్లా
వేడుకతో వీఁడె విష్వక్సేనుఁడు
కూడి యిందరునుఁ జూడరో జనులు


చ. 3:

శ్రీవేంకటపతి శిఖరముచాయదె
భావింప బహువైభవము లవే
గోవిందనామపుఘోషణ లిడుచును
దైవం బితఁడని తలఁచరో జనులు

రేకు: 0349-03 మాళవశ్రీ సం: 04-287 కృష్ణ


పల్లవి :

శ్రావణ బహళాష్టమి సవరేత్రికాడను
శ్రీవిభుఁడుదయించెఁ జెలులాల వినరే


చ. 1:

అసురల శిక్షించ నమరుల రక్షించ
వసుధ భారమెల్లా నివారింపను
వసుదేవునికిని దేవకీదేవికిని
అసదృశమగు కృష్ణుఁ డవతారమందెను


చ. 2:

గోపికలమన్నించ గొల్లలనెల్లాఁ గావఁగ
దాపై మునులనెల్లా దయసేయను
దీపించ నందునికి దేవియైన యశోదకు
యేపున సుతుఁడై కృష్ణుఁ డిన్నిటాఁ బెరిగెను


చ.3:

పాండవుల మనుపఁగ పదారువేలఁ బెండ్లాడఁగ
నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండఁగా
అండ నలమేల్మంగ నక్కునఁ గాఁగలించఁగ
దండియైయుండఁ గృష్ణుఁడు తగ నుతికెక్కెను

రేకు: 0349-04 వసంతం సం: 04-288 కృష్ణ


పల్లవి :

కోలలెత్తుకొని గోపాలులునుఁ దాను
లీల సోదించె యీతఁడే కదవే


చ. 1:

జన్నెవట్టి వుట్టి జక్కఁగఁ బెట్టిన
వెన్నదిన్నవాఁడు వీఁడు గదె
పన్నారుదొంతులపాలుఁబెరగులు
యిన్ని నారగించె యీతఁడు గదవె


చ. 2:

మెఱసి యట్టుగమీఁదిచక్కిలాలు
వెఱఁజి కైకొనె వీఁడె కదె
కఱమి కఱిమి నమలు గంపల నురుగులు
యెఱిఁగి దొంగిలె యీతఁడే కదవె


చ. 3:

శ్రీవేంకటాద్రి దాఁచిన తేనెలెల్లా
వేవేగ సాధించే వీఁడే కదె
కావించెల మేలుమంగపతెయి మమ్మేలె
యేవంకఁ జూచినా యీతఁడే కదవే

రేకు: 0349-05 శుద్ధవసంతం సం: 04-289 కృష్ణ


పల్లవి :

ఈడ నిందరికి నేలికై వున్నాఁడు
వాడలరేపల్లెవాఁడా వీఁడు


చ. 1:

భారపువుట్ల పాలుఁబెరుగులు
వారలు వట్టినవాఁడా వీఁడు
కోరి గొల్లెతల కొలనిలోపల
చీరలదీసిన శిశువా వీఁడు


చ. 2:

ఆవులఁ బేయల నందరియిండ్ల
వావిరిఁ గాచినవాఁడా వీఁడు
వావు లొక్కటిగా వనితలఁ గూడి
వేవేలు నేర్చినవిటుఁడా వీఁడు


చ. 3:

అరుదై శ్రీవేంకటాద్రిమీఁదనుండి
వరములిచ్చేటివాఁడా వీఁడు
మరిగెలమేల్మంగతో మమ్మేలె
సరసుఁడై వుండేజాణా వీఁడు

రేకు: 0349-06 శంకరాభరణం సం: 04-290 అద్వైతము


పల్లవి :

ధర్మమునకే మము దయఁ గావవే యిఁక
నిర్మలుఁడవు నిను నే మెరిఁగేమా


చ. 1:

కాయధారులము కర్మలోలులము
మాయ కగపడిన మనుజులము
పాయపుమదమున భ్రమసే మా మనసు
నీయెడఁ దగులై నిలిచీనా


చ. 2:

చాపల్యగుణము జడులమన్నిటాను
పాపపుణ్యసంబద్ధులము
పైపైఁగోర్కుల ప్రబలేమా బ్రదుకు
యేపనులకు నీకెక్కీనా


చ. 3:

అతిప్రాకృతులము అహంకారులము
సతతంబునుఁ జంచలులము
హితవుగ శ్రీవేంకటేశ యేలితివి
తతితో నీభక్తి తగ మరచేమా