Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 351

వికీసోర్స్ నుండి

రేకు: 0351-01 శ్రీరాగం సం: 04-297 వేంకటగానం


పల్లవి :

చేరి కొల్వరో యాతఁడు శ్రీదేవుఁడు
యీరీతి శ్రీవేంకటాద్రి నిరవైన దేవుఁడు


చ. 1:

అలమేలుమంగ నురమందిడుకొన్నదేవుఁడు
చెలఁగి శంఖచక్రాలచేతి దేవుఁడు
కలవరదహస్తముఁ గటిహస్తపు దేవుఁడు
మలసీ శ్రీవత్సవనమాలికల దేవుఁడు


చ. 2:

ఘనమకరకుండలకర్ణముల దేవుఁడు
కనకపీతాంబర శృంగార దేవుఁడు
ననిచి బ్రహ్మాదుల నాభిఁగన్నదేవుఁడు
జనించెఁ బాదాల గంగ సంగతైన దేవుఁడు


చ. 3:

కోటిమన్మథాకార సంకులమైన దేవుఁడు
జూటపుఁగిరీటపు మించుల దేవుఁడు
వాటపుసొమ్ములతోడి వసుధాపతిదేవుఁడు
యీటులేని శ్రీవేంకటేశుఁడైన దేవుఁడు

రేకు: 0351-02 పళవంజరం సం: 04-298 కృష్ణ


పల్లవి :

ఇతఁడొకఁడే సర్వేశ్వరుఁడు
సితకమలాక్షుఁడు శ్రీవేంకటేశుఁడు


చ. 1:

పరమయోగులకు భావనిధానము
అరయనింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కాఁగిటి సౌఖ్యము
సిరలొసఁగేటియీ శ్రీవేంకటేశుఁడు


చ. 2:

కలిగి యశోదకు కన్నమాణికము
తలఁచినకరికిని తగుదిక్కు
అలద్రౌపదికిని యాపద్బంధుడు
చెలరేఁగినయీ శ్రీవేంకటేశుఁడు


చ. 3:

తగిలినమునులకు తపములసత్ఫలము
ముగురువేలుపులకు మూలము
వొగి నలమేల్మంగకొనరిన పతితఁడు
జగిమించిన శ్రీవేంకటేశుఁడు

రేకు: 0351-03 వసంతం సం: 04-299 తేరు


పల్లవి :

నిండెను లోకములెల్ల నెరి నితనికరుణ
పండి రాసులాయఁ గీర్తిప్రతాపములెల్లను


చ. 1:

గరుడవేగమునఁ గదలె విజయరథ-
మిరవై యందు దేవుడేఁగుచుండఁగా
సొరిదిఁ బట్టుకుచ్చులు చుక్కలతో సందడించ
గరిమఁ బైఁడికుండలు గగనముదాఁకను


చ. 2:

అనిలవేగమున నదెవెడలె రథము
అనిమిషులు పగ్గములందుకొనఁగా
తనుఁదానె ఘనశంఖధ్వనులు దిక్కులనిండ
సునిసి చక్రము దనుజుల సాధింపఁగను


చ. 3:

వెలయ మనోవేగాన వేంచేసీ మగిడి రథ-
మెలమిఁ దమదాసులు యేచి పొగడ
అలమేలుమంగ దనకటు విడెమియ్యఁగాను
బలిమి శ్రీవేంకటాద్రిపతి మించీనిందును

రేకు: 0351-04 బౌళి రామక్రియ సం: 04-300 రామ


పల్లవి :

దేవతలఁగాచిన దేవుఁ డితఁడు
వేవులు ప్రతాపముల వీరరాముఁడితఁడు


చ. 1:

రావణుఁజంపి పుష్పకరథ మెక్కి సీతతోడ
ఠావుగా నయోధ్యను పట్టముగట్టుక
వావిరి సుగ్రీవాదివానరకోట్లు గొలువ
చేవమీరి పొగడొందు శ్రీరాముఁ డితఁడు


చ. 2:

వసుధ యింతయునేలి వసిష్ఠాదులు వొగడ
యెసగ నశ్వమేధాలెల్లాఁ జేసి
పొసఁగఁ గుశలవుల పుత్రులగా నటుగాంచి
రసికత మించు దశరథరాముఁ డితఁడు


చ. 3:

అలర రుద్రునెదుటనటు విశ్వరూపు చూపి
లలి బ్రహ్మవట్ట మనిలజుని కిచ్చి
యిల శ్రీవేంకటాద్రినిరవై నిలిచినాఁడు
చలము సాధించిన జయరాముఁ డితఁడు


రేకు: 0351-05 మాళవశ్రీ సం: 04-301 రామ

పల్లవి:

నమో నమో దశరథనందన మమ్మురక్షించు
కమనీయ శరణాగతవజ్రపంజరా

చ. 1:

కోదండదీక్షాగరుఁడ రామచంద్ర
ఆదిత్యకుల దివ్యాస్త్రవేది
సోదించుమారీచునితలగుండుగండ
ఆదినారాయణ యసురభంజనా

చ. 2:

ఖరదూషణ శిరఃఖండన ప్రతాప
శరధిబంధన విభీషణవరదా
అరయ విశ్వామిత్రయాగసంరక్షణ
ధరలోన రావణదర్పాపహరణ

చ. 3:

పొలుపొంద నయోధ్యపుర వరాధీశ్వర
గెలుపుమీరిన జానకీరమణ
అలఘుసుగ్రీవాంగదాది కపిసేవిత
సలలిత శ్రీవేంకటశైలనివాసా


రేకు: 0351-06 కేదారగౌళ సం: 04-302 శరణాగతి

పల్లవి:

నిలచినవాఁడవు నీవేకాక దైవమా
నెలవై ప్రకృతి నేను నీలోనిసొమ్ములము

చ. 1:

తఱి నిరువదేను తత్వములుండఁగాను
యెఱఁగని యజ్ఞానానకెవ్వరు గురి
నెఱిఁ జైతన్యమెల్లా నీసొమ్మై వుండఁగాను
యెఱుకవొక్కటేకాక యెవ్వరున్నా రీడను

చ. 2:

దినలెక్క లూరుపులు తెచ్చి తెచ్చి వొప్పించఁగ
యెనలేని జన్మములకెవ్వరు గురి
వునికై బ్రహ్మాండము వొళ్ళునీకై వుండఁగాను
యేనసే ఆనందమేకా కెవ్వరున్నా రీడను

చ. 3:

అచ్చపు సుముద్రవంటాత్మ లణువైయుండగా
యిచ్చఁ గామక్రోథాల కెవ్వరు గురి
నిచ్చలు శ్రీవేంకటేశ నీవేలికవై యుండఁగా
హేచ్చేటిదాస్యమేకాక యెవ్వరున్నా రీడను