తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 338

వికీసోర్స్ నుండి

రేకు: 0338-01 బౌళి రామక్రియ సం: 04-220 అధ్యాత్మ


పల్లవి :

కైకొన్నకొలఁది కర్మము
వాకుచ్చి తనతోనే వగవఁగనేలా


చ. 1:

తలఁచినకొలఁదేదైవము తన
కలపుకోలుకొలఁదే కడనరులు
బలువుకొలఁదియే పంతము
తొలఁగ యితరుల దూరఁగనేలా


చ. 2:

మచ్చిక నొడివినంతే మంత్రము
అచ్చపుభక్తి కొలఁదే యాచార్యుఁడు
నిచ్చలుఁ గోరినయంతే నిజమైనలోకము
పచ్చివెచ్చిచదువుల భ్రమయఁగనేలా


చ. 3:

నెమ్మది జాతెంతే నియమము
సమ్మతించినంతే సంతోసము
యిమ్ముల శ్రీవేంకటేశుఁడిచ్చినంతే యిహపర -
మెమ్మెల కిది మరచి యేమరఁగనేలో

రేకు:0338-02 వరాళి సం: 04-221 వైరాగ్య చింత


పల్లవి :

ఇన్నిజన్మము లెత్తిన యిందుకా నేము
పన్నిన సంసారములబంధమే మిగిలెను


చ. 1:

తీరెఁ దీరె అన్నములు దినదినకోరికలు
కోరఁబోతే యాసలెల్ల కోటానఁగోటి
సారెఁ గొన్నరుచులెల్ల చవితో మేనిలో లేవు
ఆరితేరిబతుకఁగా నాసలే మిగిలెను


చ. 2:

పోయఁబోయ స్వర్గాదిభోగములు వెనకకే
సేయఁబోతే పుణ్యములు సేనాసేన
ఆయమంటి వెతకితే నాతుమలోనా లేవు
కాయముతో వెంట వెంట కర్మమే మిగిలెను


చ. 3:

అందెనందె మోక్షము హరిదాసులవల్లను
ముందు వెనకెంచితేను మూలమే హరి
గొందిఁ జిక్కె నరకాలు కోపముఁ బాపముఁబాసె
యిందు నందు శ్రీవేంకటేశుఁడే మిగిలెను

రేకు:0338-03. బౌళి సం: 04-222 నృసింహ, హరిదాసులు


పల్లవి :

ఏమిటికిఁక నితరపుణ్యములు
తాము దామె హరి దాసుఁడ నేను


చ. 1:

దురితములు హరి తొల్లే తను
శరణన్నపుడె చాలించినాఁడు
నరకములు మరినాఁడే
తిరుమంత్రముచేఁ దీరిచినాఁడు


చ. 2:

పుట్టుగులు హరి భువి మునుపే
గట్టిముద్రలనే కడపినవాఁడు
నట్టుకొను అజ్ఞానము వెనకకే
పట్టి గురునిచేఁ బాపినవాఁడు


చ. 3:

యిహపరము లివియును నపుడే
సహజధర్మమున జరపినవాఁడు
విహితముగా శ్రీవేంకటపతి నను
బహుదాసులలోఁ బాలించినాఁడు

రేకు: 0338-04 ఆహిరి సం: 04-223 అధ్యాత్మ


పల్లవి :

ఆపదలులేని సుఖ మదియెపో విరతి
వోపితేనే కైకొంట వొల్లకుంటే మానుట


చ. 1:

అలిగించు ములిగించు నంతలోనే భ్రమయించు
కొలఁది సంసారపుగుణ మీది
మలసి రాలుదింటా మలిగండ్లననేల
వొలిసితేఁ గైకొంట వొల్లకుంటే మానుట


చ. 2:

ఆపపెట్టు మోసపెట్టు నంతలోనే వాసిపెట్టు
గాసిల నీసిరులకు గల దిది
వేసరి చానిపిఁ జవి వెదక నదిఁకనేల
పూసివాసిఁ గైకొంట వొల్లకుంటే మానుట


చ. 3:

మరపించుఁ దలపించు మరి యేమైనాఁ జేసు
మరియును దనకర్మమహిమిది
గురిగా శ్రీవేంకటేశుఁ గొలిచినవారి కిది
పుఱకైనఁ గైకొంట వొల్లకుంటే మానుట

రేకు:0338-05 సాళంగనాట సం: 04-224 శరణాగతి


పల్లవి :

నీటముంచు పాలముంచు నీచిత్త మిఁకను
చాటితి నీకృప గురి సంసారమునకు


చ. 1:

హరి నీవే గురి నాయాతుమలోపలికి
అరిది శంఖచక్రాలే యంగపుగురి
పరమపదమే గురి పట్టిన వ్రతమునకు
తిరుమంత్రమే గురి దిష్టపు నాలికకు


చ. 2:

గోవింద నీపాదపూజే గురి నాదాస్యమునకు
తావుల నాభక్తికి నీదాసులే గురి
ఆవల నాకర్మమున కాచార్యుఁడే గురి
దేవ నీశరణు గురి దిష్టపు జన్మానకు


చ. 3:

నగుశ్రీపతి గురి నన్ను రక్షించుటకును
తగుసంకీర్తన గురి తపమునకు
తెగనిజ్ఞానమునకు తిరుమణులే గురి
మిగుల శ్రీవేంకటేశ మించి నీవే గురి

రేకు: 0338-06 లలిత సం: 04-225 గురు వందన, నృసింహ


పల్లవి :

బంటుకు బంటవుదురా పాపముగాక నీ-
బంటుకు బంట్లమై బదికేము నేము


చ. 1:

పాతాళముననున్న బలివాకిలి గాచేవు
దూతవై పాండవుల పొందున నుంటివి
యీతల యేలిక బంటు యీవరుస దప్పె నిఁక
చేతనే నిన్నుఁ గొలువఁ జింతయ్యీ నిందుకే


చ. 2:

పాండవులదూతవై పనిసేసితివి వారు
అండ నీదూతలయ్యేది అమరుఁగాక
నిండి గురు దైవమనే నియమము దప్పె నిదే
మెండు నీదాసులకెల్ల మేర మితి యేదయ్యా


చ. 3:

పరగ నౌలే నీవు భక్తవత్సలుండ వౌదు
తిరమై యెరఁగకాడితిమి యిందాఁకాను
అరుదైన శ్రీవేంకటాద్రీశుఁడవు నీకు
సిరులనే శరణంటిఁ జేసినట్టు సేయవే