తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 337

వికీసోర్స్ నుండి

రేకు: 0337-01 హిందోళ వసంతం సం: 04-214 శరణాగతి


పల్లవి :

దైవమొకఁడే మాతలఁపు నొకటే
పావనమైతిమి పదరేమా


చ. 1:

హరి యెటు దలఁచిన నటయీని
పరుగుఁ గోరికల పనులేలా
ధర నభయ మొసఁగు దైవముబంట్లము
మరలి యితరులకు మఱి వెరచేమా


చ. 1:

పురుషోత్తమానతిఁ బుట్టినవారము
అరిదిసిరులకై యలపేలా
సరి లక్ష్మీపతి శరణాగతులము
అరయఁగ నితరుల నడిగేమా


చ. 1:

శ్రీవేంకటపతిచేఁత జీవులము
దావతి నితరము తగులేలా
వావిరిని కరివరదుని వారము
తావున బంధాలఁ దగిలేమా

రేకు: 0337-02 నాగవరాళి సం: 04-215 శరణాగతి


పల్లవి :

చాలుఁ జాలు నీసటలఁ బొరలితిమి
వాలి కొంత వెరవకుమనలేవు


చ. 1:

కలవు లోకముల ఘనమంత్రంబులు
అలరి ముక్తి యియ్యఁగలేవు
సులభానఁ గలరు సొరిది దేవతలు
వలగొను పాపము వారించలేరు


చ. 1:

వున్నవి పుణ్యము లూరకె యివిగో
పన్నిన హరిఁ జూపఁగలేవు
సన్నితి నున్నవి సకళ శాస్త్రములు
కొన్నైన భవములకొన గన నీవు


చ. 1:

ధరలో సేనలు ధనధాన్యంబులు
పరమజ్ఞానవిభవ మిదు
అరుదుగ శ్రీవేంకటాధిపుఁడే మము
ఇరవై కావఁగ యీడేరితిమి

రేకు: 0337-03 శోకవరాళి సం: 04-216 మనసా


పల్లవి :

విడువుము మనసా వీరిడిచేఁతలు
తడయక శ్రీహరిఁ దలఁచవొ యిఁకను


చ. 1:

నానాఁడే యెనఁబది నాలుగు లక్షలు
యోనుల వెడలితి నొక్కఁడనే
ఆనిన భోగములందలివే పో
కానము యిఁకనేమి గడియించేము


చ. 1:

నలుగడ నటు పదునాల్గు లోకములు
వెలయఁ జొచ్చితిని వెడలితిని
కలిగినదేదో కలుగనిదేదో
తెలియ దేమిటికిఁ దిరిగేవమో


చ. 1:

భువిలోఁ జేసితి పుణ్యముఁ బాపము
కవిసి యాఫలము గైకొంటిని
యివల శ్రీవేంకటేశుఁడింతలో
తవిలి యేలఁగా ధన్యుఁడనైతి

రేకు: 0337-04 గుండక్రియ సం: 04-217 దశావతారములు


పల్లవి :

ఇరువుగా నిన్నెరిఁగిరి యిదివో నీదాసులు
పరదైవములమీఁద నొల వేయనేల పనిలేవు నీమాయలు కరుణానిధీ


చ. 1:

ముంచెను నీపాదములు మూఁడులోకములయందును
యెంచెను నీ వేయినామాలు యిలలో వేదవ్యాసుఁడు
చంచులఁ దలఁచిరి నిన్ను మున్నే సనకాదియోగీంద్రులు
పొంచి యింకా నీకు దాఁగఁ జోటు లేదు యిందు బొడచూపవే యింకవెడమాయలేలా


చ. 2:

కొనెను నీపాదతీర్థము బ్రహ్మ కోరి నీపాదము గడిగి
వినుతించె నీమహిమ తొల్లె వేయినోళ్లుగల శేషుఁడు
అనిరి నిన్నెక్కుడనుచు మొదల శుకాది మునీంద్రులెల్లా
పొనిగి నీవు మాయ సేయఁ జోటు లేదు మమ్ము పొసఁగి యేలుకోవె పురుషోత్తముఁడా


చ. 3:

యెక్కెను ధ్రువుఁడు పట్టము యిదివో నిన్నుఁ గొలిచి
చిక్కెను నీశరణాగతి నేఁడు శ్రీవైష్ణవులచేతను
గక్కన శ్రీవేంకటేశుఁడా యిట్టె కాచితివి మాటకే మమ్ము
యిక్కడ నీమాయసేయఁ జోటులేదు నిన్నునెలఁగిరి నీదాసులిందిరారమణా

రేకు: 0337-05 హిజ్జిజ్జి సం: 04-218 అధ్యాత్మ


పల్లవి :

పాపముఁ బుణ్యము పరగ నొకట నదె
వోపినవారలు వొడిఁగట్టెడిది


చ. 1:

నాలుకతుదనే నానారుచులును
నాలుకవే హరినామమును
పోలింప నొక్కటి భోగమూలము
మూల నొకటది మోక్షమూలము


చ. 2:

మనసున నదివో మగువలమోహము
అనుగుమనసుననె హరిచింత
పనివడి యొక్కటే ప్రపంచమార్గము
కొన నొకటే వైకుంఠమార్గము


చ. 3:

వెలుఁగుఁ జీఁకటియు వెస నొకనాఁడే
కలిగె నట్ల నివి కలిగినవి.
యిలలో శ్రీవేంకటేశు మా యొకటి
తలఁప నొక టతనిదాసులసుగతి

రేకు: 0337-06 సౌరాష్ట్రం సం: 04-219 నృసింహ, హరిదాసులు


పల్లవి :

హరిదాసులే మాకు నడ్డమై కాతురుగాక
శరణంటి వారికి నే సకలోపాయములు


చ. 1:

పెరుగఁబెరుఁగఁగానే పెద్దలాయ నింద్రియాలు
యిరవైనమాబుద్దు లిందుగొల్పీనా
తిరిగితిరిగి మాకు ద్రిష్టమాయ జన్మములు
దురితాలుఁ బుణ్యాలుఁ దోసేమా యిఁకను


చ. 2:

కూడఁగూడ నానాఁటఁ గొనకెక్కెఁ గోరికలు
వీడనిబంధము లన్నీ విడిచీనా
పాడితో నీడా నాడఁ బ్రాణములుఁ దీపులాయ
యేడనున్ననేము నేమే యెరిఁగేమా యిఁకను


చ. 3:

చింతించఁ జింతించఁ జేతికి వచ్చె మనసు
అంతలో శ్రీవేంకటేశుఁ డంది కాచెను
దొంతులై తిరుమంత్రము తోడనే నాలుక నంటె
మంతనాన గురుసేవ మరచేమా యిఁకను