Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 335

వికీసోర్స్ నుండి

రేకు: 0335-01 నాగవరాళి సం: 04-202 అధ్యాత్మ

పల్లవి: దైవమా నీవే దయాధర్మము దలఁచు టింతే
వావిరి నౌఁగాదన నవ్వల నిఁక నెవ్వరో

చ. 1: యెంచఁగ నీదేహమిది యింద్రియాదులకుఁ జరఁ
వంచనతో విడిపించువారలెవ్వరో
పంచభూతాలకుఁ జర బ్రదికేటి బ్రదుకెల్ల
యించుకంత దయఁజూడ నిఁక నెవ్వరో

చ. 2: పోరచి నామన సిది పుణ్యపాపాలకుఁ జర
మారుకొని విడిపించ మరి యెవ్వరో
తీరని నాజన్మ మిది దినభోగాలకుఁ జర
యీరీతి విడిపించ నిఁక నెవ్వరో

చ. 3: ఆతుమ యనాదినుండి హరి నీభక్తికిఁ జర
ఆతల నెవ్వరికైనా నరుహమౌనా
యీతల శ్రీవేంకటేశ యిటు నీవే కాతుగాక
ఘాతల నీదాసులకు గతి యెవ్వరో

రేకు: 0335-02 నారాయణి సం: 04-203 అధ్యాత్మ

పల్లవి: ఏలికవు నీవట యింకా దైన్యమేల
తాలిమి నీచేఁతలకుఁ దగవు గాదనరా

చ. 1: ఘనకర్మానుభవమే కావలె నొండె నాకు
వనజాక్ష నీసేవే వలె నొండె
కినుకఁ బూఁటయు సంకెలయు రెండు నేల
ననిచి యిందుకు నిన్ను నవ్వేరుసుమ్మీ

చ. 2: పైకొని నేఁ జేసినపాపమె కావలె నొండె
తూకొని నీనామముచేఁ దుంచుట యొండె
సాకిరి చంకదుడ్డు శరణార్తి రెండు నేల
మేకొని యీవట వింటే మెత్తురా నిన్నును

చ. 3: యిరవుగా మరపొండె యెరుక గావలె నొండె
సరస రెండును నైన సంగతౌనా
గరిమ శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను
సరిబేసి జంటమాట జరపకు మిఁకను

రేకు: 0335-03 బలహంస సం: 04-204 వైరాగ్య చింత

పల్లవి: ఏమి సేతు నిందుకు మందేమైనఁ బోయ రాదా
సామజగురుఁడ నీతో సంగమొల్ల దేఁటికే

చ. 1: మాయలసంసారము మరిగిన కర్మము
ఈయెడ నిను మరుగ దేఁటికో హరి
కాయజకేలిపైఁ దమిగలిగిన మనసు
కాయజుతండ్రి నీపైఁ గలుగ దిదేఁటికే

చ. 2: నాటకపుఁగనకము నమ్మినట్టిబదుకు
యేఁటికి నీభక్తి నమ్మదేలే హరి
గూఁటఁబడే పదవులు గోరేటిజీవుఁడు
కూటువైననిజముక్తి గోరడిఁది యేఁటికే

చ. 3: పాపపుణ్యములకె పాలుపడ్డ నేను
యేపున నీపాలఁ జిక్క నేలకో హరి
శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుఁడ
నీపేరివాఁడ నాకు నిండుమాయ లేఁటికే

రేకు: 0335-04 దేసాళం సం: 04-205 వేంకటగానం

పల్లవి: తల్లియుఁ దండ్రియు మరి దైవము నాతఁడే కాక
యెల్ల జీవులకు మరి యెవ్వరింక దిక్కు

చ. 1: యీ సంసారమునకు యితఁడె దిక్కు నేఁ-
జేసేటిచేఁతలకెల్ల శ్రీపతే లోను
పాసిపోఁడెప్పుడు నన్ను బందువుఁడితఁడే నాకు
దాసుఁడైనవాఁడు హరిఁ దగదు దూరఁగను

చ. 2: చావుఁబుట్టుగులవేళ సతము నీతఁడే
సావి భోగములకు నిచ్చకుఁడీతఁడే
భావములోపల నుండుప్రాణ మీతఁడే నాకు
దైవము దూరగనేల తనకేమి వచ్చినా

చ. 3: తలఁపులోపలికి యీదైవమే తోడు
యిలఁ గలిమిలేములు కీతఁడే తోడు
పలుకులోపల నుండుభాగ్య మీతఁడె నాకు
కొలిచి శ్రీవేంకటేశుఁ గొసరఁగనేఁటికి

రేకు: 0335-05 సౌరాష్ట్రం సం: 04-206 విష్ణు కీర్తనం

పల్లవి: విడువ విడువ నింక విష్ణుఁడ నీపాదములు
కడఁగి సంసారవార్ధి కడుముంచుకొనిన

చ. 1: పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను
ధరణిపైఁ జెలరేఁగి తనువు వేసరినాను
దురితాలు నలువంకఁ దొడికి తీసినను

చ. 2: పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుఁ బోదు

చ. 3: యీదేహమే యయిన ఇఁక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేఁగినా
శ్రీదేవుఁడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమె చొచ్చితి నే నిఁకను

________________

శరణాగతి రేకు:_0335-06 -భంగాళం సం:_04-207

పల్లవి: చెప్పినంతపనీ నేఁ జేయగలవాఁడ నింతే
అప్పటి నపరాధమా ఆదరించవలదా
చ. 1: నీయాజ్ఞ దేహము నే మోచితినింతే
యీయెడ విజ్ఞానమేల యియ్యవయ్యా
వేయి వేలై వేగుదాఁక వెట్టిసేసి యలసితి
వోయయ్య కొంతైన వూరడించవలదా
చ. 2: నీవు సేసేకర్మము నేఁజేయువాఁడ నీంతే
యీవల నానందసుఖ మియ్యవయ్యా
కోవరమై వెంట వెంటఁ గొలిచినబంట్లకు
తావులఁ గొంత వడైనా దప్పిదీర్చవలదా
చ. 3: మతిలో శ్రీవేంకటేశ మనికయినవాఁడ నీంతే
తతి నాపాటుకు దయదలఁచవయ్య
యితవై పనిసేసేటి యింటి పసురమునకు
వేతదీరఁ బాలార్చి వెడ్డు వెట్టఁదగదా