Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 334

వికీసోర్స్ నుండి

రేకు: 0334-01 సామంతం సం: 04-196 శరణాగతి


పల్లవి :

ఊరకే వెదకనేల వున్నవి చదువనేల
చేరువనె వున్నది చెప్పరాని ఫలము


చ. 1:

కోపము విడిచితేనె పాపము దానే పోవు
దీపింప సుజ్ఞానముతెరు విదివో
లోపల మనిలుఁడై లోకముమెచ్చుకొరకు
పైపైఁగడిగితేను పావనుఁడౌనా


చ. 2:

ముందరికోరిక వోతే ముంచిన బంధాలు వీడు
కందువ నాస మానితే కైవల్యము
బొందిలోన నొకటియు భూమిలోన నొకటియు
చిందు వందు చిత్తమైతే చేరునా వైకుంఠము


చ. 3:

కాంతల పొందొల్లకుంటే ఘనదుఃఖమే లేదు
అంతరాత్మ శ్రీవేంకటాద్రీశుఁడు
అంతట మాటలే యాడి హరి శరణనకుంటే
దొంతినున్నభవములు తొలఁగునా వివేకికి

రేకు: 0334-02 లలిత సం: 04-197 అధ్యాత్మ


పల్లవి :

ఎప్పుడూను నడచేవె యేకాలమైనాను
కప్పి నిష్ఠూరమేల కట్టేరయ్యా


చ. 1:

శ్రీపతి యాణాజ్ఞచేతఁ జిక్కనది జగము
యేపున మా యాణాజ్ఞ లేఁటీవయ్య
కోపగించుకొనుటింతే కొంకక లోకాలు నేము
మాపుదాఁకా మానుమంటే మానఁబొయ్యీనా


చ. 2:

నరహరి రక్షణమే నడచీని లోకము
యిరవై నేము రక్షించే దేఁటిదయ్య
పొరలే గర్వ మింతె బూతులసంసారము
మరలి నేమూరకుంటే మానఁబోయ్యీనా


చ. 3:

సృష్టికిఁ గుర్తైనవాఁడు శ్రీవేంకటేశుఁ డింతే
యిష్టానిష్టము మాకు నేఁటిదయ్య
నష్టి లేదు నడచేది నడవక మానరాదు.
తష్టి గట్టుకొంటిఁగాక తా మానఁబోయ్యీనా

రేకు: 0334-03 బౌళి సం: 04-198 వైష్ణవ భక్తి

పల్లవి :

{{Telugu poem|type=చ. 1:|lines=<poem>


పల్లవి :

ఇంత లేకుంటే నది యెక్కడి సుజ్ఞానము
దొంతుల తనజన్మము తొల్లిటిదే కాదా


చ. 1:

యెదిటి వారెరిఁగితే యేమీ ననక మరి
చెదరకుండుటే పో శ్రీవైష్ణవం
కదిసినకాంతలను కనకము వొడగంటే
పదరకుండుటే పో పరమసాత్వికము


చ. 2:

క్రియయెరఁగనివారు కీడు సేసితేఁ దాను
దయఁ జూచుటే హరిదాస్యఫలము
రాయమునఁ దామసము రాజసము గలిగితే
భయపడి తొలఁగుటే ప్రసన్నగుణము


చ. 3:

వొరసి యెవ్వఁడు దను నుబ్బించి పొగడిన
నిరతితొ వీఁగనిదే నిచ్చలబుద్ది
యిరవై శ్రీవేంకటేశ్వరుదాసులఁ గని
శరణని మొక్కుటే సర్వజ్ఞగుణము

రేకు: 0334-04 మలహరి సం: 04-199 హరిదాసులు


పల్లవి :

పరమోపకారులు ప్రత్యక్షదైవములు
హరిదాసు లిత్తురు బ్రహ్మానందసుఖము


చ. 1:

పాపుదురు లోకములో పాపపంకమెల్లాను
దీపించ శ్రీపాదతీర్థమున
వోపుదురు హీనుల వున్నతులఁగాఁ జేయ
చేపట్టి కన్నులెదుటిసేవామాత్రమున


చ. 2:

చెఱుతు రజ్ఞానమెల్లా జనులు తమ్ముఁజేరిన
మఱియుఁ దమప్రసాదమహిమవల్ల
తెఱచిత్తురు మోక్షము తెరువు ప్రాణులకెల్లా
మొఱఁగి మూలనుండి మొక్కినమాత్రమున


చ. 3:

చెల్లఁబెట్టుదు రెందైనా చిల్లరకులమువారి
తెల్లమిగా మంత్రోపదేశమున
యిల్లిదె శ్రీ వేంకటేశ యెక్కుడుసేసిరి మమ్ము
సల్లాపనల తమసహవాసములను

రేకు:0334-05 ధన్నాసి సం: 04-200 శరణాగతి


పల్లవి :

నాకుఁ గలపని యిదె నారాయణుఁడ నీవు
శ్రీకాంతుడవు నాకు సిద్ధించుకొరకు


చ. 1:

జలధివంటిది సుమీ చంచలపు నామనసు
కల వింద్రియముల నేటిజలచరములు
వొలసి భక్తినెడి వోడ యెక్కితి నేను
జలశాయి నీవ నేటిసరకు దెచ్చుటకు


చ. 1:

కొండవంటిది సుమీ కొనకెక్కు నామనసు
వుండుఁ గామాదులను వురుమృగములు
వుండి నీశరణమను వూఁత గొని యెక్కితిని
కొండలప్ప నీవనేటి కొనఫలముకొరకు


చ. 1:

టీవులను ధరణివంటిది సుమీ నామనసు
నీవె శ్రీవేంకటేశ నిక్షేపము
వావాత నీవనేటి వసిదవ్వి కైకొంటి
భూవిభుఁడ నీవనేటి పురుషార్థము

రేకు: 0334-06 కాంభోది సం: 04-201 గురు వందన, నృసింహ

పల్లవి:

అంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి
వంతుకు వాసికి నతనివాఁడనంటేఁ జాలు

చ. 1:

బంతిఁగట్టి నురిపేటి పసురము లెడ నెడఁ
బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
చెంతల సంసారము సేయు నరుఁడందులోనె
కొంత గొంత హరి నాత్మఁ గొలుచుటే చాలు

చ. 2:

వరుసఁ జేఁదు దినేవాడు యెడ నెడఁ గొంత
సరవితోడుతఁ దీపు చవిగొన్నట్టు
దురితవిధులు సేసి దుఃఖించు మానవుఁడు
తరవాత హరిపేరు దలఁచుటే చాలు

చ. 3:

కడుఁ బేదైనవాఁడు కాలకర్మవశమున
అడుగులోనే నిధాన మటు గన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరఁగక గురునాజ్ఞ
పొడగన్నవానిభక్తి పొడముటే చాలు