Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 316

​రేకు: 0316-01 గుజ్జరి సం: 04-090 భగవద్గీత కీర్తనలు


పల్లవి :⁠

సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను
సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతి యే వుపాయము

⁠


చ. 1:⁠

తానని యెడి బుద్ధి దైవంబందు నునిచి
తానే తనమతి మరచిన సుఖ తత్వానందమిది
మేనని యెడి బుద్ది యీ మేదిని ప్రకృతి యందు
ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు

⁠


చ. 2:⁠

పొరలి జగమనే బుద్ధి మాయపై నునిచి
పరగిన యింద్రియముల గెలిచినదే పరమపు యోగంబు
పొరిఁ గర్మపు బుద్ధి పుట్టువుపై నునిచి
వెరపునఁ బాపము బుణ్యము విడుచుట వివేకమగు దుదిపదము

⁠


చ. 3:⁠

వెలి దోచిన బుద్ధి వేగమే లోనునిచి
చలమున చంచల ముడిగి యుండుటే సమాధి లక్షణము
పలు భావపు బుద్ధి భక్తి వొకట నునిచి
యెలమి శ్రీ వేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ

⁠

​రేకు: 0316-02 లలిత సం: 04-091 అధ్యాత్మ


పల్లవి :⁠

తలఁపులోని వెలితే దైవము వెలితౌ
కలిగిన ఇదియే కారణము

⁠


చ. 1:⁠

యెదిటీ యాసలకు నెడిసి తొలఁగుటే
తుద నరకములకుఁ దొలఁగుట
వదలక ఇంద్రియవర్గము గెలుచుటే
పదపడి తనపాపముల గెలుచుట

⁠


చ. 2:⁠

మగటిమి సంసారమాయ దాఁటుటే
తగుభవవారిధి దాఁటుట
జగములోపలను శాంతిగలుగుటే
అగణిత మోక్షమునందుఁ బొందుట

⁠


చ. 3:⁠

మహి ఇంతా హరిమయముగఁ గనుటే
విహితపు జ్ఞానము వెసఁ గనుట
ఇహమున శ్రీవేంకటేశు శరణనుటే
సహజపు జన్మము సఫలం బనుట

⁠

​రేకు: 0316-03 రామక్రియ సం: 04-092 వైరాగ్య చింత


పల్లవి :⁠

మరుగుచుఁ జేసీ మానదుద్యోగము
నరహరి నీ కృపే నాగతి గలదు

⁠


చ. 1:⁠

అనుపమ మైన భయంబున నరకము
వినియెదఁగాని వెరచి విడువను
మనియెడి జీవుల మరణ భవంబులు
కనియెదఁగాని కలంగదు మనసు

⁠


చ. 2:⁠

రాసుల మలమూత్రపు సోదనలిటు
సేసీఁగాని చీ యనదు తనువు
ఆసల నర్ధపుటార్జన యలపుల
వేసరదుఁగాని విరతి నిలుపను

⁠


చ. 3:⁠

నిరతముఁ దలపఁగ నిదురయుఁ దెలివియు
తొరలీఁగాని తారలనీదు గుణము
యిరవగు శ్రీవేంకటేశ్వర నీవే
పరమాత్మవు ననుఁ బాలించఁగదే

⁠

​రేకు: 0316-04 సాళంగనాట సం: 04-093 భగవద్గీత కీర్తనలు


పల్లవి :⁠

వెలినుండు లోనుండు విశ్వమింతటనుండు
జలజాక్షు శరణమే సాధనము సుండీ

⁠


చ. 1:⁠

మిక్కిలిఁ జేసే పాపమే మీఁద నరకమై తోఁచు
నిక్కి తానే అద్దములో నీదైనట్లు
వొక్కట మొదలులేక వుంటేఁ గొనాలేదు
గుక్కకిహపరములు కోరినంతే సుండీ

⁠


చ. 2:⁠

మహిఁ దొల్లి చూచినూరే మతిలోన దోచీని
గహనపు కాఁపురమే కలయైనట్లు
సహజమై పుట్టులేక చావులేదెవ్వరికి
విహిత సుఖ దుఃఖములు వేఁడినంతే సుండీ

⁠


చ. 3:⁠

యెండగానే బయటనే యెక్కువ వెన్నెలగాసీ
దిండురేయిఁ బగలొక్క దినమైనట్లు
నిండు జీవుఁడు లేకుంటే నిక్కపు దేవుఁడు లేఁడు
అండ శ్రీవేంకటేశుఁడే అంతరాత్మ సుండీ

⁠

​రేకు: 0316-05 పాడి సం: 04-094 భగవద్గీత కీర్తనలు


పల్లవి :⁠

పుట్టుభోగులము నేము భువి హరి దాసులము
నట్ట నడమి దొరలు నాకియ్యవలెనా

⁠


చ. 1:⁠

పల్లకీలు నందలాలు పడివాగెతేజీలు
వెల్లవిరి మహలక్ష్మివిలాసములు
తల్లి యాకె మనినే దైవమని కొలిచేము
వొల్లఁగే మాకేసిరులు వొరు లియ్యవలెనా

⁠


చ. 2:⁠

గ్రామములు రత్నములు గజముఖ్యవస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు
భామిని యాకెమగని ప్రాణధారి లెంకలము
వోమి మాకాతఁడే యిచ్చీ వొరులియ్యవలెనా

⁠


చ. 3:⁠

పసగల పదవులు బ్రహ్మనిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుఁడు
యెసఁగి యాతఁడే మమ్ము నేలి ఇన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా

⁠

​రేకు: 0316-06 రామక్రియ సం: 04-095 వైరాగ్య చింత


పల్లవి :⁠

దైవము నీవే దయదలఁచుట గా
కావలఁ బ్రాణికి యాసే దయ్యా

⁠


చ. 1:⁠

ఆస వొకటి యెంతయినాఁ దనియదు
వాసి యొకటి తనవంతులు మానదు
యీసొకటీ శాంతమెరఁగని దిదె
మోసపుదేహికి ముక్తి యే దయ్యా

⁠


చ. 2:⁠

పాపమొకటి భవబంధముఁ బాపదు
దీపమొక్కటి ధీరత యొల్లదు
చూపొక టింద్రియసుఖముల గెలువదు
యేపునఁ బ్రాణికి యెఱకే దయ్యా

⁠


చ. 3:⁠

పాయమొకటి చాపలములు మానదు
కాయమొకటి తనకర్మము విడువదు
యీయెడ శ్రీవేంకటేశ్వర నీసేవ
సేయని యాత్మకు సెలవే దయ్యా

⁠