తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 315

వికీసోర్స్ నుండి

రేకు: 0315-01 సామంతం సం: 04-084 శరణాగతి


పల్లవి :

పట్టిన వ్రతమే పంతము హరితో
గుట్టున శరణని కొంకఁగఁదగవా


చ. 1:

అవ్వల రోసినయన్నము గుడిచిన
నెవ్వరు నవ్వరు యిఁకనేలా
రవ్వగ నొల్లక రాజసము విడిచి
దవ్వులఁ జేకొనఁదగవా మనకు


చ. 1:

విడిచినభూతము వెస మరలించిన
యెడయని యేహిత విఁకనేలా
యిడుమలఁ బిలుచుచు నిచ్చిన నొల్లక
అడుగఁ బోయితే నమరునె మనకు


చ. 1:

శ్రీవేంకటపతి సేవ వారమై
యీవిధిఁ బరులసే విఁకనేలా
కైవస మితఁడు కంటి మితనికృప
యీవల నావల నెదురా మనకు

రేకు: 0315-02 సాళంగనాట సం: 04-085 హనుమ


పల్లవి :

ఎక్కడ నెదురు లేక యీరేడులొకములందు
వొక్కఁడే నిలిచెనమ్మ వుగ్రహనుమంతుఁడు


చ. 1:

పెట్టినజంగదండ పిడికిటి మొలచేయి
అట్టె వలచేయెత్తిన యాయితము
తొట్టిన పెంజమటలు తోడనె బుసకొట్టులు
పుట్టీపడీఁ జూడరమ్మ వుగ్రహనుమంతుడు


చ. 2:

నిక్కినకర్ణములు నింగిమోఁచినబొమ్మలు
చక్కశిరసుపైఁ బారఁజూచిన తోఁక
చుక్కలు మొలపూసలు సూదులు వాఁడి రోమాలు
వుక్కుమీరెఁ జూడరమ్మ వుగ్రహనుమంతుడు


చ. 3:

పుట్టుఁగౌపీనము మహద్భుత యజ్ఞోపవీతము
గుట్టుచూపని కనకకుండలములు
పట్టపు శ్రీవేంకటేశు బంటయి ప్రతాపమెల్ల
వొట్టీ విజయనగరపు వుగ్రహనుమంతుడు

రేకు: 0315-03 శంకరాభరణం సం: 04-086 వైష్ణవ భక్తి


పల్లవి :

పరమవైష్ణవుల భాగ్యంబిదివో
నిరతి వారలకే నే మొక్కెదను


చ. 1:

తలఁచ రొకప్పుడు ధరణి భోగములు
తలఁచ రితరమతదైవముల
తలఁతు రొకటి హరిదాసులదాస్యము
తలఁపు మోక్షములతగులమిగాన


చ. 2:

కోరరు బ్రహ్మదిగురుతరపదములు
కోరరు మేరువుకొనసుఖము
కోరుదురు తదియ్య కోట్ల సంగము
కోరిక భక్తితోఁ గూఁడీగాన


చ. 3:

వొల్లరు కర్మము లొల్లరు పుణ్యము
లొల్లరహంకార మొకపరియు
పుల్లము శ్రీవేంకటోత్తము శరణని
యెల్లందుఁ దుదిపద మొక్కిరిగాన

రేకు: 0315-04 ముఖారి సం: 04-087 నామ సంకీర్తన


పల్లవి :

ఇందులోనఁగల సుఖమింతే చాలు మాకు
నిందు వెలియైన సిరులేమియు నొల్లము


చ. 1:

ఆదిదేవు నచ్యుతు సర్వాంతరాత్మకుని
వేదవేద్యుఁ గమలాక్షు విశ్వపూర్ణుని
శ్రీదేవు హరి నాశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటి మన్యము నేమొల్లము


చ. 2:

పరమాత్ముఁ బరిపూర్ణు భవరోగవైద్యుని
మురహరు గోవిందు ముకుందుని
హరిఁ బుండరీకాక్షు ననంతు నభవుని
పరగ నుతించితిమి పరుల నేమొల్లము


చ. 3:

అనుపమ గుణదేహు నణురేణు పరిపూర్ణు
ఘనుఁ జింరంతనుని కలిభంజను
దనుజాంతకుని సర్వధరు శ్రీవేంకటపతిఁ
గని కొలిచితిమి యేగతులు నేమొల్లము

రేకు: 0315-05 వరాళి సం: 04-088 శరణాగతి


పల్లవి :

హరికే మొఱపెట్టు టంతేకాక
గరిమ వేరోకటను గతి గానవచ్చునా


చ. 1:

పాపపుణ్యాలంపటాలఁ బరగిన జీవునికి-
నోపననవచ్చునా వొడలి మోపు
కోపపు శాంతము చేతఁ గొట్టువడ్డప్రాణికి
తాపపు కర్మపువెట్టి తప్పంచుకోవచ్చునా


చ. 2:

ఆఁకటి నీరువట్టుల కగపడ్డదేహికి
తోఁకసంసారపుటాజ్ఞ తోయవచ్చనా
సోఁకుసుఖదుఃఖములఁ జొచ్చినజంతువునకు
మూఁకల లోకపులగ్గములఁ బాయవచ్చునా


చ. 3:

సారె రాత్రిఁ బగటాను చచ్చిపుట్టేజంతువుకు
భారపుటాసల లోనఁ బాయవచ్చునా
యీరీతి శ్రీవేంకటేశు నిటు శరణన్నఁగాక
ధారుణిఁ బంచబాణము దప్పుకొనవచ్చునా

రేకు: 0315-06 బౌళి సం: 04-089 కృష్ణ


పల్లవి :

అడ్డములేనినాలిక నాడుదురుగాక భూమి
దొడ్డవాఁడేమి సేసినా దోస మందు నేది


చ. 1:

ఆతుమలో మదనుఁడవయ్యే వాఁడవు నీవే
ఆతల నాలిమగఁడువనే వాఁరలు నీవే
ఘాతల పరాంగనఁ గలసితివని నిన్ను
తోతో మునుల కిఁక దూరఁ జోటేదయ్యా


చ. 2:

దేహము లోపలనున్న దీపనాగ్నియు నీవే
దాహము నాఁకలి నీవే తగురుచులెల్ల నీవే
ఆహా శబరియెంగి లారగించి తనుమాట
సోహల నిందించి నవ్వఁ జోటిందు నేది


చ. 3:

పుట్టుగు లోపలనున్న భోగము లన్నియు నీవే
ఇట్టే ఆచారములు హీనాధికములు నీవే
గుట్టున శ్రీవేంకటేశ గొల్లఁడవై పుట్టినందు-
కుట్టిపడి యెవ్వరికి నూహించఁజోటేది