Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/నాలుగవ సంపుటం/రేకు 317

వికీసోర్స్ నుండి

రేకు: 0317-01 మలహరి సం: 04-096 నృసింహ


పల్లవి :

కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁగాక


చ. 1:

యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము


చ. 2:

నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్భాషమాఁటలే హితవు


చ. 3:

యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె

రేకు:0317-02 దేవగాంధారి సం: 04-097 నామ సంకీర్తన


పల్లవి :

ఆహా నమో నమో ఆదిపురుష నీకు
యీహల నేనెంతవాఁడ నెట్టు గాచితివి


చ. 1:

లోకాలోకములు లోన నించుకొన్న నీవు
యీకడ నాత్మలోన నెట్టణఁగితి
ఆకడ వేదములకు నగోచరమైన నీవు
వాకుచే నీనామములఁ వడి నెట్టణఁగితి


చ. 2:

అన్నిటా బ్రహ్మాదుల యజ్ఞభోక్తవైన నీవు
అన్నపానములివి యెట్టారగించితి
సన్నుతి పూర్ణుఁడవై జనియించిన నీవు
వున్నతి నాపుట్టుగులో వాకచో నెట్టుంటివి


చ. 3:

దేవతలచే పూజ తివిరి కొనిన నీవు
యీవల నాచే పూజ యెట్టు గొంటివి
శ్రీవేంకటాద్రి మీఁద సిరితోఁ గూడిన నీవు
యీవిధి నాయింట నీవు యెట్టు నిలచితివి

రేకు: 0317-03 బౌళి సం: 04-098 భగవద్గీత కీర్తనలు


పల్లవి :

నీవే నీదాసులని నినుగంటిఁ గంటిని
ఆవలనీవే అంతర్యామివి గాన


చ. 1:

నీదాసుల శిరసులే నీదివ్యశిరసులు
నీదాసులపాదములే నీదివ్యపాదములు
నీదాసులకన్నులే నీదివ్యనేత్రములు
నీదాసులరూపమే నీవిశ్వరూపము


చ. 2:

నీకింకరులగుణాలే నీదివ్యగుణములు
నీకింకరులున్నచోటే నీకు నిత్యవైకుంఠము
నీకింకరుల సేవే నీవు మెచ్చునిజసేవ
నీకింకరుల కూటమే నీకు సర్వాంగములు


చ. 3:

యిందరిలో శ్రీవేంకటేశ నీవే పో యంటే
అంది తల్లిముట్టే యుంటే నంటవచ్చునా
యెందు నజ్ఞానపు ముట్టు యెడసినాత్మలుగాన
నిందలేని నీదాసులే నీవని సేవింతును

రేకు: 0317-04 ధన్నాసి సం: 04-099 అధ్యాత్మ


పల్లవి :

ఆయంబిది తెలియంగల దీయాత్మజ్ఞానంబు
మాయలు యీకాలము కర్మము మాధవునాధీనము


చ. 1:

దేహమునకు నీడ తిరిగినయటువలెనే
శ్రీహరికి కళావిధమై జీవుఁడటు దిరుగు
దేహమునకుఁ గల చైతన్యము తెగి నీడకులేదు.
శ్రీహరికిని గల స్వతంత్రము జీవునికిలేదు


చ. 2:

కలలోపలఁ గల సుఖము ఘనసంతోషము కొరకే
యిల లోపలఁ గలిగిన సుఖము ఇది సంతోషము కొరకే
కలలోపలి విజీవుని సంకల్పన లిన్నియును
ఇల లోపలి ప్రపంచ మింతయు నీశ్వరుసంకల్పము


చ. 3:

చెదరిని బాహ్యపునిషయములు జీవునిపాలిటివి
పదిలంబగు అంతరంగమే పరమపువైకుంఠము
అదనెరిఁగి కాలగాలమున ఆతుమ శ్రీవేంకటపతికి
పొదిగియాతనికి శరణని కొలిచిన పొందగుముక్తికియిది గీలు

రేకు: 0317-05 పాడి సం 04-100 నామ సంకీర్తన


పల్లవి :

పాప పుణ్యముల పక్వమిదెరఁగను
నాపాలిటీ హరి నమో నమో


చ. 1:

మానసవాచక మరి కర్మంబుల
తానకముగ నీదాసుఁడను
పూని త్రిసంద్యల భోగభోగ్యముల
నానాగతులను నమోనమో


చ. 2:

వలనుగ జాగ్రస్వప్నసుషుప్తులు
యిలలో నీకేమి హితభటుఁడ
వెలుపల లోపల వేళా వేళల
నలినాక్ష నీకే నమోనమో


చ. 3:

పుట్టుకతొలుతను పుట్టినమీఁదట
అట్టె నీశరణాగతుఁడ
గట్టిగ శ్రీవేంకటపతి నీకృప
నట్టనడుమైతి నమోనమో

రేకు:317-06 రామక్రియ సం: 04-101 భగవద్గీత కీర్తనలు


పల్లవి :

ఇందరిపై భిన్నభక్తులేఁటికి మాకిఁక
అందరిలో అంతరాత్మ యాతని రూపే


చ. 1:

తల్లియై యుండేవాఁడు తగ నితనిరూపే
యెల్లగాఁ దండ్రైనవాఁడు నితనిరూపే
యిల్లాలై సుఖమిచ్చు నితనిమహిమరూపే
వెల్లవిరిఁ దనము లీవిష్ణునిరూపే


చ. 2:

గ్రామదేశకులములు ఘనుఁడితనిరూపే
కామించునర్థ మీతఁడై కలుగు నీరూపే
దీమపాన నిహపరద్రిష్టము లితనిరూపే
యేమేర దాతయు దైవ మీతనిరూపే


చ. 3:

కాలము నితనిరూపే కర్మము నితనిరూపే
యేలి యాచార్యుఁడు చెప్పే దితనిరూపే
శ్రీలలనాపతి శ్రీవేంకటేశ్వరుఁడే
పాలించఁగాఁ గంటి నే నీపరమాత్మురూపే