తాలాంకనందినీపరిణయము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాలాంకనందినీపరిణయము

పంచమాశ్వాసము

క.

శ్రీమత్కౌస్తుభమణిసుష
మామయ వక్షోవిశాల మంటపసాక్షా
ఛ్ఛ్రీమంగాంగన నయన
క్షేమంకరరూప శేషగిరిమణిదీపా!

1


తే.

చిత్తగింపుము జనమేజయోత్తమునకు
పైలుఁ డిట్లని బల్కె శుంభత్ప్రతాపుఁ
డౌ ఘటోత్కచుఁ డచలగృహాంతరమున
నుండి గని పెట్టియుండె ముహూర్తమునకు.

2


ఉ.

అచ్చట ద్వారకానగరమందు కురుక్షితినాథుఁ డంపగా
వచ్చిన విప్రయుగ్మము వివాహముహూర్తము నిశ్చయించి వా
క్రుచ్చిన రేవతీరమణుకోరిక వీడ్కొని రాజరాజు కీ
ముచ్చట దెల్ప హస్తిపురముం దగజేరి కుతూహలోన్నతిన్.

3


ఉ.

స్వామి భవన్ముఖప్రథితశాసనముం దలదాల్చి ద్వారకా
నామకరాజధానికి జనన్ బలభద్రుఁడు కూర్మి జేసి మీ
క్షేమము మాటిమాటికి వచింపఁగ కౌతుక మందుచో కుమా
రీమణి లక్ష్మణాఖ్యుఁడు వరింపఁగగోరు ప్రశంసజేసినన్.

4


క.

స్వామీ యేమని దెల్పను
ప్రేమన్ బెన్నిధినిగన్న బేద తెఱఁగునన్
రాముండు సంతసించెను
మీమీయనురక్తులందు మేలెట్టిదొకో!

5

క.

సతి నొసఁగవలయునని తన
మత నతికౌతుకము నంది మంత్రిహితపురో
హితతతిని బిలిచి సుతఁ గురు
పతిసుతున కొసంగు తనదుభావము దెలిపెన్.

6


క.

వశుఁ డగుచు రౌహిణేయుఁడు
నిశితబలోపేతుఁడైన నీతనయునకున్
శశిరేఖ నొసఁగ రేపటి
దశమికిని ముహూర్తనిశ్చితం బయ్యె నృపా.

7


ఉ.

దానికి కొన్నివిఘ్నములు దానవవైరి సుభద్రసాత్యకుల్
బూని వచింప దత్సరణి బుద్ధి దలంపక సీరపాణి మా
తోననె వీరి వీరి మదిఁదోచినయట్లు వచింప నిమ్ము యె
ట్లైన కురుక్షితీశతనయాగ్రణికిన్ శశిరేఖ నిచ్చెదన్.

8


క.

ఇప్పగిది నీతిరీతుల
చొప్పెటఱుఁగక నెందఱె ట్లసూయతపడినం
దప్పదు నాపలు కితరులుఁ
దెప్పిన వగ పేమి యలిగితే భయమేమీ?

9


ఉ.

కావున లగ్నకాల మవకాశము లే దటుగాన కౌరవ
క్ష్మావరు బంధుసంయుతముగాఁ జనుదేర నొనర్పు మన్నచో
దేవరచెంత కే మరుగుదెంచితి మీదశమి న్ముహూర్తమౌ
వావిరి మంగళార్థరసవర్గములున్ సమకూర్పఁగా దగున్.

10


చ.

అన దుర్యోధనుఁ డంతరంగమున నాహ్లాదింప దుశ్శాసనా
ద్యనుజన్ము ల్విన బల్కె సీరధరుతో నత్యంతబాంధవ్య మి
ట్లనుకూలించుట యాదవు ల్మనసహాయంబైనచో పాండునం
దనులున్ ఱెక్కలులేని పక్షులవలెన్ దైన్యంబు పాటించరే!

11


క.

యాదవులున్ మన మొక్కటి
గా దొరకొని నపుడె దీనగతి నడవులలో

భేదమున నడలఁగా నట
మీఁదఁట నిరసింపజేయమే పాండవులన్.

12


క.

కావున నాలస్యం బిక
గావింపఁ బనేమి బంధుగణములనెల్లన్
రావించి పుర మలంకృతి
గావింతము తత్తదుచితకార్యానుగతిన్.

13


క.

అని దుశ్శాసనుఁ డన్నకు
వినయమునం దెల్ప నగరవీథుల నెల్లం
బనిబడి శృంగారింపఁగ
జనులకు విశదంబుగాగఁ జాటించుటయున్.

14


క.

వేడుకతోడుత నారా
ఱేఁడిగతిసాట తత్పురీజనులెల్లన్,
వాడల మేడల గోడల
తోడ నలంకృతులుఁ జేయఁ దొడగిరి ప్రీతిన్.

15


క.

సకలపదార్థము లెల్లను
శకటానడ్వాహకలభసముదయముల
క్ప్రకరముల కనచి గూఱిచె
నొకనిమిషములోన సముచితోత్సాహుండై.

16


క.

ధరణీసురులను సన్ముని
వరులను హితబాంధవప్రవరులను ధాత్రీ
వరులను హితవరులను నుతి
పరులను పిలిపించెఁ బ్రమదభావము మీఱన్.

17


సీ.

అపుడు భీష్మద్రోణు లది గనుంగొని సుయో
        ధన యీప్రయోజనం బనుచితంబు

కన్యకామణి కభిమన్యుఁడే పతియంచుఁ
        బుట్టినపుడే పేరు బెట్టియుండె
నది గాక మాధవుం డచట పాండవపక్షి
        బలుఁ డొక్కఱుఁడె మనపట్టు గలగి
నిలిచి యీశపథంబు నిర్వహింపగలండె
        హరికోపమే కార్యహాని యగును


తే.

నందు నభిమన్యుఁ డధికశౌర్యాన్వితుండు
చర్చ సేయక నిది జూచి యోర్చగలఁడె
గాన మనలక్ష్మణునకు నిక్కన్య నొసఁగు
టుడిఁగి యొండొక సతిఁ గూర్చు టుచితమయ్య.

18


ఉ.

నావిని వ్రేటునాటు మృగనాథుని రీతి పృషద్ఘృతోజ్జ్వల
త్పావక ర్తియై యదిరిపాటున లేచి వచించె పాండుపు
త్రావళి పక్షపాతమతులౌట యెఱుంగనె మిమ్ము మున్ను మేల్
దీవన లచ్చటం గెఱలి తిట్టుట లిచ్చట సంతతంబు మీ
జీవము లిచ్చటం జెలిమి సేయుట లచ్చట మీకు నై జముల్.

19


క.

నే నేది దలంచినచో
దానికి విఘ్నములు సేయఁగలపడు టంతే
గాని కురువృద్ధు లగుటకుఁ
బూని మదీయానుగతిని బొందఁగవలదా!

20


క.

పొం డనిన బోయి రడవికి
పాండుతనూజాతు లిట్లు పట్టుకపడిరే
కొండాటములకు మీరే
పండితులై యుంటి రరులపక్షము బలుకన్.

21


క.

మాటికి మాటికి నిటువలె
పోటరిబంటులకు పిఱికిబుట్టించెడు మీ

మాట లికేటికి పాండవ
కోటికి సాటికిని మే మగుదుమే దలఁపన్.

22


చ.

బలీయులు కర్ణసౌబలులుఁ బల్కరె మీవలె నెన్నఁడైన దు
ర్బలవచనంబు లిట్లు యదువర్గము మాహితులైన పాండవా
వళి యననేమి యాత్రిపురవైరియు నేమి బిడౌజుఁ డేమి మ
త్కులిశగదాప్రఘాతమునకుం బొడరంగలరే కనుంగొనన్.

23


చ.

పలుమఱు లీనిషేధములు బల్కకు, డింతట మామనంబు రం
జిల కనకాభిషేకములు జేసినయట్లు భవత్ప్రియోక్తులం
జెలిమిని చెవ్వియొగ్గిన వచింపుడు పెండిలిమేలుఁ జూడకో
ర్కెలు గలవేని రండు యిది కీడని దోచిన రాకుఁ డింతటన్.

24


క.

పలుఁ బల్కు లనఁగ నేటికి
బలరాముం డొకఁడు మాకు పట్టైయున్నం
బలియులగు పాండవేయుల
దల నెత్తఁగనీక బాఱ దఱుమఁగలేమే.

25


క.

అని యుల్లసోక్తు లాడఁగ
విని భీష్మద్రోణు లవనివిభున కని రయో
జననాథ! కోప మేటికిఁ
గనియెదుగా కింక కార్యగతఫలసిద్ధిన్.[1]

26


ఉ.

కాలము దేశముం దెలియకన్ వచియించెడి వారినెల్ల మే
ల్మేలని మెచ్చె దీ విపుడు మీ రటు హాని దలంప నీమతిం
బేలరొ! పాండవోత్తము లహీను లటంచు దలంచె దించుకన్
తాలిమిలేక నీకు తలఁదాకిననాటి కెఱుంగ నయ్యెడిన్.

27

ఉ.

ఇక్కరణిన్ వచించి దమయిండ్లకు నేగెటి ద్రోణభీష్ములం
దక్కఁగ దక్కు కౌరవహితప్రదులెల్లఁ దదాజ్ఞబూని దా
మొక్కమొగిన్ వివాహసమయోచితకృత్పరతంత్రు లౌచు న
ల్దిక్కుల ధారుణీకులసుధీజనులం బిలిపించి వేడుకన్.

28


చ.

పురము నలంకరించుటయు భూసురభూపవణిగ్జనాదు ల
ప్పరిణయదర్శనప్రమదభావమునం జనుదెంచుటన్ శుభం
కరవరభేరికామురజకాహళనాదము లుగ్గడించుటల్
కర మనురక్తితోడ గని కౌరవనాథుఁ డతిప్రమోదుఁడై.

29


క.

సాధుమతి సకలభూసుర
యూధమునకు భక్ష్యభోజ్యయుక్తముగ సమా
రాధనము జేసి పూర్వని
శీధిని పైనమున కాజ్ఞఁ జేసిన యంతన్.

30


వ.

అప్పు డప్పురంబున గలుసౌజన్యమాన్యులగు రాజన్యకన్యలును
కరుణాగభీరసింధువులగు బంధువులును బంధుసమాదరులగు
సోదరులును వినిర్జితక్రోధులగు యోధులును నిఖిలకార్యానుగతస్వ
తంత్రులగు మంత్రులును శరీరసుకుమారేందిరాకుమారులగు
రాకుమారులును మంగళభాజనంబులు నగుపుణ్యాంగనాజనంబులును
వినిర్జితవిటమానధనంబులునగు విలాసినీజనంబులును, శర్మతరకర్మ
ధర్మాచరణభాసురులగు భూసురులును, శిబికాందోళికాకరితురగరథారూఢు
లై దన్నుఁ బరివేష్టించి కొలువ పురంబు వెడలె. నంత.

31


సీ.

కృపవివింశతియజ్ఞకేతుసుషేణులు
        బలసి ముందర బరాబరులు సేయ
తపననందనజయద్రథబాహ్లికాదులు
        విచ్చుకత్తులు బూని వెన్క నడవ

శకునిదుశ్శాసనాశ్వత్థామముఖ్యులు
        జాగ్రదుద్వృత్తి పార్శ్వముల నేఁగ
నైరావణోన్నతస్ఫారద్విరద మెక్కి
        కడఁగి మధ్యమున లక్ష్మణుఁడు సెలఁగ
తాను మణిగణకాంచనస్థగితరథము
నెక్కి తనయునిచేరువ ప్రక్క నిలిచి
వారివారికి ప్రియమైన వాహనముల
నెక్కివచ్చుటఁ జూచుచు వెడలె పురిని.

32


సీ.

దంతావళంబు లంతస్థశైలంబులై
        యుద్యత్తురంగంబు లూరులయ్యు
హాటకద్యుతి నొప్పు నరదము ల్దీవులై
        చటులభటుల్ నక్రచయము లయ్యు
తతహేతిసంతతిప్రతతి మీనంబులై
        చక్రముల్ జలచక్రజాల మయ్యు
కరఖేటకంబులు ఘనకచ్ఛపంబులై
        భటహుంకృతులు జలార్భటము లయ్యు
చంద్రవంశజరాజరాజేంద్రురాక
కలరి చతురంగసైన్యమహార్ణవంబు
యదుజనామరనిది తన్ను నెదురుకొనఁగ
సరసశరజాలములతోడఁ బరఁగె నడచె.

33


క.

వందిజనుల్ వైతాళిక
బృందములుం బొగడ దుందుభీతూర్యములం
దందవడి మ్రోయ రాజపు
రందరుఁ డాద్వారకాపురముకడ విడచెన్.

34


మ.

బలభద్రుండు నృపాలురాక విని సద్భందుయుక్తంబుగా
విలసత్కాహళతూర్యనాదములు వేవే ల్మ్రోయ నుద్యత్కుతూ

హలుఁడై తోడను బుణ్యభామినులు డాయంగా నెదుర్కొంచు వే
డ్కలచే పువ్వులచప్పరంబు విడి దిండ్లం జేర్చె వేవేగమున్.

35


క.

వారల కనుభవయోగ్యం
బారసి కసనిఖిలసత్పదార్థంబులు వి
స్తారగతి నొసఁగి దత్త
త్ప్రారంభవిజృంభమాణభావుకమతియై.

36


క.

ఆమీఁదటఁ బుణ్యాంగన
లామోదము మీఱ లక్ష్మణాభిఖ్యనృప
గ్రామణికిని పరిణయదీ
క్షామంగళమజ్జనంబు గావించి రొగిన్.

37


సీ.

నీటైన గొజ్జంగినీట జల్కము లార్చి
        కురులు గోరున గీరి కొండె దీర్చి
ఘనకిరీటము మస్తకమున శృంగారించి
        సమధికవస్త్రభూషణము లొసఁగి
మృగనాభినామంబు నగుమొగంబున దీర్చి
        వన్నెపావడ వల్లెవా టొనర్చి
కటకాంగుళీయముల్ కరముల గీలించి
        యుఱుతారహారంబు లఱుత వైచి


తే.

విమలమణిమయసింహాసనమునఁ జేర్చి
నవ్యమంగళనీరాజనం బొసంగి
విధివిధాయకమున ధర్మవేద్యు లెల్ల
వెస సమావర్తనాదికవిధులుఁ దీర్చి.

38


మ.

బలభద్రుండు ధరామరప్రతతికిన్ భక్షాజ్యసూపప్రధా
నలసద్యోజనభాజనక్రియల సన్మానించి మాల్యాంబరం
బుల సద్రత్నవిభూషణంబులఁ బ్రియంబు న్మీఱ నర్పించి య
వ్వల పుత్రీమణిఁ బెండ్లికూఁతు నొనరింపంగా నియోగించినన్.

39

చ.

మును శుకరాజముం దెలుపు ముచ్చట నమ్మి ముహూర్తవేళ గ్ర
క్కున నభిమన్యు గాంతునని కోరిక లీరికలెత్త చేటికా
జనులకు దెల్పకన్ గుసుమశయ్యను నిద్దురజెందు బాలికా
మణిని బ్రియాంగన ల్గలిసి మాటికి బుజ్జగిలంగ లేపియున్.

40


సీ.

కలిక యొక్కఱిత ముక్కాలిపీట యమర్చె
        కొమ యోర్తు గంధతైలము తలంటె
రమణి యొక్కతె కప్పురము మేన నలుఁగిడె
        సకి యోర్తు గంధామలక మలందె
మగువ యొక్కతె శిరోమజ్జనం బొనరించె
        పొలఁతి యొక్కతె తడిబోవఁ దుడిచె
చేడె యొక్కతె చల్వజిలుఁగుపావడ దీర్చె
        వరవర్ణి యొకతె పెన్నెఱుల నార్చె


తే.

నగరుధూపంబు లొకయింతి యనువుపఱచెఁ
గురులు జడఁదీర్చి యొకలేమ విరుల జుట్టె
చెక్కుల జవాది నిడె నొకచిగురుఁబోణి
రతనములకంచుకం బొకరమణి దొడఁగె.

41


ఉ.

పాపెటబిందియల్ పసిడిపావడ లందియలు న్మెఱుంగుని
దాపవడంపుఁజీకటులు దండెకడెంబులు బాజుబందు లు
ద్దీపితతారహారములు తేఁటగుకమ్మలు బావిలీలు మి
న్నాపనిమేల్బులాకి రతనంబులబేసరి దీర్చి రెంతయున్.

42


ఉ.

కన్నుల కజ్జలం బునిచి కస్తురినామము గోట నీటుగా
నెన్నొసటం ఘటించి రమణీయమృగీమదచందిరంబులం
జన్నుల చెక్కుల న్మకరసంజ్ఞల పత్రికరేఖ లుంచి య
త్యున్నతహేమపీఠమున నుంచిరి లోకవిమోహనాకృతిన్.

43

క.

కన్నియ నిటు వయ్యారముఁ
జెన్నాడఁగ బెండ్లికూఁతుఁ జేసిరి పడతుల్
గన్నులఁ గన కన్నుల వి
ల్మన్నెవతంసుని హుమావునకు మారొడ్డుగతిన్.

44


చ.

పరిణయవేళ వచ్చెనని బంధుజను ల్పరిచారకుల్ హితుల్
పరిమళవస్తువు ల్గొనుచు బర్విడుచందములోన దాము వే
గిరిపడుచుండు టెల్లఁ బరికించి మదిన్ శశిరేఖ సాధ్వసా
తరళితచిత్తయై శుకవతంసవచస్సరణిం దలంచియున్.

45


క.

చిలుక మును కొన్నివార్తలు
దెలిపిన నిజమనుచు నమ్మితం గాని విభుం
డెలమి నిక యేల వచ్చును
కలిబోసిన యట్లవంక గనుఁగొననేలా.

46


క.

ఇది యెదురుకోలునకు గా
గదలుచు నున్నా రరణ్యగతులకు నేని
ట్లెదిరెదిరి చూడఁబడు నా
మది వెఱ్ఱితనంబునకు విమర్శలు గలవే.

47


ఉ.

ఎక్కడి లక్ష్మణుండు వరియించుట లెక్కడ జేకురున్ వృధా
వెక్కురుసౌఖ్య మే ననుభవించుట లెక్కడ పార్థనందనుం
దక్కి బెనంగ కోరిక వెతావెతలై చనె నింకమీఁద వే
రొక్కనిబొందుకంటె మెయినుండిన జీవ మడంప మేలగున్.

48


క.

కలకాలము ఘనతరులన్
ఫలభంగ మొనర్చు పక్షపాతములగు యీ
చిలుకల మెలఁకువ లెఱిఁగి వి
మలమతినౌ మదవివేకమతి ననవలెగా.

49

సీ.

స్వప్నలబ్ధములైన సౌఖ్యసంపద లట్లు
        [2]జలముపై వ్రాయు నక్షరములవలె
చిత్తారుప్రతిమల సింగారములభౌతి
        త్యాగభాగవిహీనధనముభంగి
విపినంబులను నిండువెన్నెలపోలిక
        [3]వెలివానిపై మోహవేదనగతి
చిరకృతఘ్నునకు జేసిన యుపకృతిచాడ్పు
        దారిద్ర్యుని మనోరథము తెఱఁగు


తే.

చౌటభూమిని జల్లుబీజములవిధము
పథ మెఱుంగని మన్మనోరథములెల్ల
నిష్ఫలమెగాక తథ్యమై నెగడగలవె
వానితో పొందు నావంటిదాని కెందు.

50


చ.

అని తలపోసి దుఃఖవివశాకులచిత్తముతోడుతన్ చివా
లున వెసలేచి యాపెరటిలో నొకకుందనికుంజమందిరం
బున బవడంపుమంచమున పువ్వులసెజ్జను బవ్వళించి నె
మ్మనమున మాటిమాటి కభిమన్యుని చింతనజేయు చున్నెడన్.

51


ఉ.

అంత ఘటోత్కచుం డడవియందుననుండియు ద్వారకన్ ప్రలం
బాంతకునింట లగ్నసమయంబును దాకొనఁగా నహస్కరుం
డంతట గ్రుంకుటం గని లయాంతకునిం బలె దోషవహ్ని యం
తంత జెలంగఁ దమ్మునకు నమ్మలకుం దెలియఁగ జెప్పియున్.

52


క.

గగనతలమునకు చివ్వున
నెగసి ఘటోత్కచుఁడు యదుకులేశ్వరుభవనం

బగు ద్వారకాపురముకడ
డిగి మెల్లన సందెచీఁకటిం బురిసొచ్చెన్.

53


చ.

ఎలమిని దా నదృశ్యత వహించి పురంబును జొచ్చి వీథివీ
థులు బరికించి కాహళికదుందుభితూర్యము లాలకించి యా
బలుని నిశాంతముం జొరఁగ బాఱి వివాహమహోత్సవత్వరన్
మెలఁగెడువారి సందడు లమేయకృధారసదృష్టి గన్గొనన్.

54


సీ.

కవగొన్న మణిదీపకళికలకడ నిల్చి
        యెలిమి నొండొరు లంద మెన్నువారి
మొనసి పన్నీటిచెంబులు నింపి వియ్యంపు
        టిరుగడ దొరల కందిచ్చువారి
సుమగుళుచ్ఛములు కస్తూరీకరాటముల్
        బూని హర్షమున నుప్పొంగువారి
నెమ్మి సంపెగనూనియబుడ్ల నటుడించి
        సొమ్ముల నాణెముల్ జూచువారి


తే.

వచ్చిరదె పెండ్లివారు సవాఁరి జూడ
పదుపదుండని తోదోపు లొదుగువారిఁ
గినిసి గని పండ్లు పటపట గీటుకొనుచు
రాక్షసేశ్వరుఁ డంతఃపురమున వెదకి.

55


మ.

ఒకచోటం దనతోటిచేడియల సంయోగంబు వర్ణించి నా
యకచింతావివశాత్మయై కుసుమశయ్యం జెందు తాలాంకపు
త్రిక నీక్షించి సుభద్ర మున్ను తన కర్థిం దెల్పురీతిం దొలం
గక చూడన్ శుభలక్షణంపు శశిరేఖాకన్యగా నెంచియున్.

56


క.

తరుణీమణి నాతమ్ముఁడు
వరియింపఁగ నిట్టు లుండవలదేయని సం
బరమొంది నైజమాయా
పరవశమున నిదురఁగొను నుపాయమొనర్చెన్.

57

చ.

మఱదలి ముట్టగూడదని మంచముతోడనె లేవనెత్తి కొం
బరవరశక్తిచే దివి సుపర్వులు నార్వఁగ నభ్రమార్గసం
సరణి వినిర్గమించి యనుజన్ముఁడు తల్లులు విస్మయంబుచే
నరయఁగ మంచముం బొలఁతి నగ్గిరిసీమను డించి యిట్లనెన్.

58


ఉ.

కాంచనగాత్రి నిచ్చటికి గైకొని దెచ్చుట పెద్దగాదు క్రో
ఛాంచితగర్వులై పరిణయత్వరనుండిన కౌరవావళిం
జించి చికాకుజేసి నృపశేఖరులెల్ల గనుంగొనంగ నొ
క్కించుక దుర్దశం బఱప కింతట నూరకయుంటఁ బాడియే.

59


క.

నరపతులెల్ల గొల్వ కురునాథుఁ డవారితగర్వధుర్యుఁడై
పరిణయలోలతన్ మిడిసిపాటున నుండినవాఁడు గాన నే
కరణి సహింతు నేడు తఱిగల్లెను మజ్జనకాళిసౌఖ్యముం
దెఱలగజేయు నాటివగఁ దీర్చక నే విడనాడవచ్చునే!

60


చ.

అనుచు సుయోధనోన్నతుల నన్న వచింప ధనంజయాత్మజుం
డనలములో ఘృతం బిడినయట్లుగ ణర్లుచు లేచి యచ్చటం
దను నిలువంగనోపక నతంద్రశరాసనబాణపాణియై
దనుజుని జూచి యిట్లనె మదద్విరదప్రతిబృంహితధ్వనిన్.

61


క.

మనమిరువుక మొక్కటియై
జనకులపగఁ దీర్ప నిదియె సమయం బయ్యెన్
నను డించిపోవఁగా నీ
యనువున నొదిగుందునటనె యాడుదిబోలెన్.

62


క.

కౌరవపతి గర్వసమా
బారము విన్నపుడె మానసం బఱనిముసం
బూరకను నిలువనొల్ల ది
కేరీతిని నైన వత్తు నే నీవెంటన్.

63


క.

భీమార్జును లెనసినగతి
గా, మన మిరువురము గలిసి కౌరవులను సం

గ్రామమున మద మణంచి మ
హామహిమ న్సతిని బెండ్లియాడుట యొప్పున్.

64


చ.

అనిన ఘటోత్కచుం డతని హస్తతలంబులు బట్టి పల్కె ని
ట్లన బనియేమి కౌరవులహుంకృతి మాన్పఁగ నేనొకండ జా
లును, నతఁ డాజి మద్బలము లోగొనలేఁ డదిగాక వారి గీ
టణపఁగ వల్దటంచు భవదంబనియామక మున్నదే గదా!

65


క.

ఇంతన నేటికి వారల
గంతులు వేయించి తికమక న్గడుపగ నే
డింతియెగాని తదీయుల
నంతము నొందింప దలఁప నది యట్లుండెన్.

66


తే.

నీవు మేనల్లుఁడవు, రౌహిణేయుమీదఁ
గత్తిగట్టుట న్యాయంబుగాదు తండ్రి,
పోయి కురురాజు నిరకటంబునను ద్రోయ
జాలుదునుగాని నీపైన మేలనయ్య.

67


క.

అదిగాక కాననంబున
ముదితలని, క్రూరసమరమున కిరువురమున్
గదియుట లధర్మమని నీ
మది నెఱుఁగవె రాజనీతిమర్మము లెల్లన్.

68


క.

అని యనుజు నూఱడించుచు
దనుబట్టిన కేలు విడిచి దనుజేంద్రుఁడు గ్ర
క్కున బొబ్బ లిడుచు చివ్వున
వినువీథికి నెగసె సురలు విస్మయమందన్.

69


గీ.

అపుడు శశిరేఖ దనుజమాయాసుషుప్తి
నెడలి కన్నులువిచ్చి నల్గడలుఁ జూచి

గగనపరిచుంబితద్రుమాకలితగహన
వాటిపొడసూడ యబ్బురపాటుతోడ.

70


క.

బలభద్రతనయ యెదుటం
బలవిక్రమరుచిసమాజు పార్థతనూజుం
దిలకించి విస్మయము బా
టిలఁగ సుభద్రాసతిన్ హిడింబిని గనియెన్.

71


ఉ.

ఎక్కడిద్వారకాపురము, నెక్కడియీవిపినంబు కన్నుగూ
ర్కెక్కడ నిద్ర మేలుకొను టెక్కడ, దవ్వుననుండు మత్ప్రియుం
డెక్కడ, నేఁడు నేను గను టెక్కడ, మున్ను శుకంబుపల్కె న
మ్మక్క ముహూర్తవేళ నభిమన్యుని జూచెదవంచు నిక్కముల్.

72


గీ.

అనుచు దిగ్గునలేచి మేనత్తపాద
ములకు మొక్క ననుంగుకోడలిని దిగిచి
శిరము మూర్కొని కౌఁగిటఁ జేర్చుకొనుచు
హితవచోరూఢి నలయించి యిట్టు లనియె.

73


మ.

మును మాయన్న యనాదరోర్తులను నిర్మోహంబుచే వన్యభూ
మిని నే నీయభిమన్యుతోడఁ జనగా మీబావ మాబావకుం
దనయుండైన ఘటోత్కచుం డిచటి కాంతారాశ్రమంబందు నుం
డిన నన్సోదరు సోదరింపఁ బొడగంటి న్నిన్ను చంద్రాననా!

74


క.

అనుజునికొఱకై గాదే
నిను మాయానిద్ర బుచ్చినేఁ డిట దెచ్చెన్
వనితా నీ తలిదండ్రుల
గనియెద విక నేఁటినాలుగవనాటి కొగిన్.

75


చ.

అని శశిరేఖ సమ్మతిల నయ్యభిమన్యు నపాంగదృష్టిచే
గని యనురాగ మగ్గలముగా గనురెప్పల నప్పళించుచున్

మును దనునోచినట్టి వ్రతము ల్ఫలియించె నటంచు నెంచుచుం
దనతలిఁదండ్రులన్ హితులఁ దల్పకయుండె తదేకమోహియై.

76


చ.

అపు డభిమన్యుఁ డత్తరుణియంగవిలాసముఁ జూచి చూచి మో
హపరవశంబునన్ మనసిజాస్త్రవికంపితుఁడై ఘటోత్కచుం
డెపు డరుదెంచునో యని నిరీక్షణ సేయుచు మన్మనోరథం
బిపుడు ఫలించెనేమొ తరళేక్షణ గంటినటంచు మెచ్చఁగన్.

77


చ.

అవల ఘటోత్కచుండు గగనాధ్వమునం బటుసాహసప్రభా
జవమున నిర్గమించుచుఁ గుశస్థలి జేరి సురద్విషోచిత
ప్రవిమలశక్తిచే నొకయుపాయముఁ బన్ని బలాత్మజాకృతిం
భవనము జొచ్చి యొక్కెడల బంగరుమంచమునం బరుండియున్.

78


చ.

వెఱవక దైత్యమాయ నెఱవిద్యను తచ్ఛశిరేఖరీతిగా
కరము లురంబు గండమును కన్నులు చన్నులు మోము కంఠమున్
శిరము పదంబులు న్నడుము చెక్కులు ముక్కులు మాల్యభూషణాం
బరము లనన్యభూజనవిభాసితమై గనుపింపనున్నెడన్.

79


తే.

కన్నుగూర్కునట్లు కడుభీతి గొనినట్లు
చిన్నఁబోయినట్లు జెలఁగినట్లు
దవిలియున్న సిగ్గు తల కెక్కినట్లుగా
మోము వంచియుండె ముగ్ధపగిది.

80


క.

బలభద్రుండు ముహూర్తము
దెలిసి సుయోధనునికడకుఁ దెలియుటకై వి
ప్రులఁ బంప వార లతిముద
మలరగ భూషణవిభూషితాంగులు నగుచున్.

81


సీ.

ఘనమురజాదిమంగళమహావాద్యముల్
        కకుబంతములు నిండి పికిలపాఱి
కొనల ముత్తెఁపుజంపు గొడుగుల పడగల
        తుదలభ్రములను తోదోపులాడ

బాణతూణకృపాణపాణులౌ భటకోటి
        పదఘట్టనల దిగిభములు మ్రొగ్గ
వేణువీణానాదవిభవముల్ రంభాది
        నిర్జరాంగనలు నిర్ణిద్ర గొలువ


తే.

కమ్రదంతావళమున లక్ష్మణుని నునిచి
ఘనరథారూఢుఁడై దాను కౌరవేంద్రుఁ
డాత్మతనయునిముండట ననుగమించె
వసుధ దిగివచ్చు జంభారివైభవమున.

82


సీ.

కర్ణాదియోదనికాయంబు లొకవంక
        కర్ణోత్సవంబుగ గదిసి పలుక
గాయకవందిమాగధసూతు లొకవంక,
        బద్యగద్యాదులఁ బ్రస్తుతింప
ధరణీసురశ్రేణితాపసు లొకవంక
        జయజయస్వస్తివాచన మొనర్ప
ప్రజ లద్భుతం బంద నిజకాంత లొకవంక
        ఘనవాహనము లెక్కి కదిలి చనఁగ


గీ.

తనుజు లనుజులు బంధువుల్ దవిలి నడువ
భటులు దౌవారికులు వేత్రపాణు లగుచు
పటుతరార్భటులను బరాబరులు సేయ
నడచె రారాజు పురవీథి కొడుకుతోడ.

83


క.

కరదీపికాసహస్రము
లరుదుగ శోభిలఁగ వేశ్య లాటల నాడం
బురవీథి కెదురుకోలున
కరుదేరన్ రౌహిణేయుఁ డంతటిలోనన్.

84


చ.

పరిణయవస్తువుల్ కనకపాత్రములం దొనగూర్చి పుణ్యసుం
దరులు పిఱుంద కొందఱు జనన్ వసుధామరు లాగమధ్వనుల్

నెఱిముఱిగా వచింప ధరణీవరకన్యలఁగూడి రేవతీ
తరుణియు వెంటరా నడిచెఁ దత్కురురాజు నెదుర్కొన న్మతిన్.

85


గీ.

సారణానిరుధ్ధసాంబోద్ధనాక్రూర
చారుదేష్ణముఖ్యు లీరసములు
మదిన దగి విలంబమందక పోరామి
వలన పెండ్లి జూడ వచ్చి రపుడు.

86


క.

హరి సాత్యకియుం దక్కఁగ
పురమున గల సకలయాదవులతోగూడన్
బురికొల్పి రౌహిణేయుఁడు
కురురాజుకుమారు నెదురుకొనఁగా నేఁగెన్.

87


చ.

అనఘుఁడు రేవతీరమణుఁ డంతిపురం బటు నిర్గమించి వా
ద్యనినదముల్ జెలంగఁ గలశాంబుధిఁ బొంగినయట్లు సంబరం
బున నృపపుంగవుల్ బుధులపూర్వహితుల్ దగ వారివారివా
హనముల నెక్కిరాఁ గదను హాటకదీప్తరథాధిరూఢుఁడై.

88


మ.

దివిటీల్ వెన్నెలపంతియల్ మెఱుపుబత్తీ ల్కాగడా లారతుల్
భువనద్యోతులు మంచుబుడ్లు బిరుసు ల్మోంబత్తు లొక్కొక్కచా
లు వెయిల్వెల్గ సుయోధనుం డెదురుకో ల్కూడంగ నేతెంచె బం
ధువితానంబులు విప్రసంఘములు దోడ్తో వెంట నేతేరఁగన్.

89


క.

యమునానదీప్రవాహం
బమర దీపూర మెనసినట్లు పరీవా
రము దాము నెదుర్కొను కురు
సముదయమున్ వాహనములసరగు నడిగియున్.

90


తే.

విరులు గంధవళ్లు విమలశుభాక్షత
లొకరికొకరుఁ జల్లుచుండునంతఁ

దత్పరాగమునను ధరణీతలం బెల్ల
చిత్రలేఖనావిచిత్ర మయ్యె.

91


మ.

పునుఁగుం గస్తురి క్రొవ్విరుల్ సురభి కర్పూరంబు జవ్వాది ప్రే
మను నొండొర్ల కలంకరించుకొని సన్మానంబుగా నాదర
ప్రణతాశీర్వచనానులాపముల సంభావింపుచున్ వారివా
రిని యాలింగన మాచరించి వినయప్రీతిన్ సుఖాసీనులై.

92


క.

అపుడు కృతవర్మ ముఖ్యులు
కృపసైంధవకర్ణశకునిగురునందనులన్
విపులమతిఁ బూజజేసిరి
కుపితమతిం బ్రజలు మెచ్చుకొఱకు నరేంద్రా!

93


ఉ.

యాదవకౌరవప్రమద లందలముల్ డిగి యొండొరు ల్మహా
హ్లాదము మీఱు చందనసుమాక్షతలుం బ్రియమొప్ప నిచ్చుచో
మేదురనర్మగర్భరసమేళనసూక్తులు సఖ్యతాసము
త్పాదనగా వచింపుచు హితక్రియఁ బూజ లొనర్చి రెంతయున్.

94


ఉ.

ఆయెడ రేవతీరమణి యర్జునసూనున కాత్మపుత్రికం
బాయక నిత్తు నన్పలు కబద్ధము నౌటకు నెమ్మదిం బగిం
బాయని చింతతోడ నిజధర్తనియోగమునం గురుక్షితీ
నాయకపత్నినిం గలిసి నవ్వుచుఁ బూజ లొనర్చె నర్మిలిన్.

95


చ.

ఇరుదెసవారలుం గవిసి యీగతి మంగళతూర్యనాదముట్
మొఱయఁగఁ బుణ్యభామినులు ముందట నాట్యము సల్ప వేత్రసం
భరణభటావళుల్ పథము బాపి బరాబరిజేయ సీరి మం
దిరమునకుం గమించిరి మదించి గజేంద్రము లట్లు మెల్లగాన్.

96


క.

ఇరువు రల భాగ్యవైఖరి
పురజను లీక్షించి తాము బుద్ధిని తర్కిం

చీరి హలికి తగునె యీదు
ష్కరకౌరవనందనునకు కన్యక నొసఁగన్.

97


సీ.

తనసహోదరితోడ తగ నమ్మబల్కిన
        మాటనేటులు నేఁట నేటఁ గలిసె
హరిసాత్యకులనీతు లవ్వలఁ బడద్రోసి
        యల్లుని జెల్లెలి నడవి కనిచె
ఘనుఁ డర్జునునియెడ కసిఁబెంచి తలిదండ్రు
        లెల్లభంగులఁ జెప్ప నీసడించె,
దారిద్ర్యులని పాండుతనయుల నిందించి
        బలుఁడౌ సుయోధను కలిమి వలచె


తే.

కోరి యపకీర్తి వెలఁబెట్టి కొనఁగదలఁచె
గాని, కలకాల మొకరీతిఁ గలవె సిరులు
ధర్మవిదులైన పాండునందనుల వలన
జెలిమి దప్పించె నిదియేమి చేటు హలికి.

98


క.

అని గుంపుగుంపులై పుర
జను లచ్చట నచ్చటం బ్రశంసలు సేయన్
మనుజాదినాథుండుం దా
నును కౌరవభోజయదుజనులతో నడచెన్.

99


ఉ.

లీలను లక్ష్మణాహ్వయునళిందధరాతలమందు మత్తశుం
డాలము డించి, ద్వారనికటంబులఁ జిత్రితశాలలం సము
త్తాలగరుత్మదోపలవితానసమంచితతోరణంబులన్
వేల నతిక్రమించి శుభవేదికయందున జేర్చి తూర్ణతన్.

100


చ.

తరతమభావరీతులను దామును వారును చిత్రకంబళా
స్తరణముల న్వసింప వసుధాదివిషజ్ఞను లాగమోచితా
చరణశుభక్రియ ల్సలుప సంభ్రమతం గరదీపికాసహ
స్రరుచిరమై జెలంగు శుభసద్మము కన్నులపండువై దగెన్.

101

చ.

సరసిజలోచనుం డపుడు సాత్యకియుం దను గొల్చిరాగ ద
త్పరిణయమంటపంబునకు దానయి దా నరుదెంచి యొక్కచో
స్థిరమణిపీఠియందు నివసించి కనుంగొనుచుండె నందుకొం
దరు యదువృద్ధులుం తదుచితస్థితు లారసి ముచ్చటాడఁగన్.

102


చ.

అపుడు సుయోధనుండు దనుజాంతకుఁ డున్నతెఱం గెఱింగి త
త్తపనతనూభవాదిమప్రధానుల గన్గొని గంటిరే హరి
న్నిపుణత పాండవాత్మజులనింద యొనర్చు ప్రలంబవైరిపై
గుపితమనస్కుఁ డౌచు పగగొన్నదెఱంగున నున్నవాఁ డిటన్.

103


క.

తన పూనిక దప్పెనటం
చని మనలం జూడనోడె నటుగాకున్నన్
తనుదానె పెక్కుఁబోకల
పనులుం గొని విఱ్ఱవీఁగి బాల్పడకున్నే.

104


క.

ఇతఁడే ప్రాపని కుంతీ
సుతు లతులితగర్వమతిని జూచుచునున్నా
రితరములు మాని మన మ
ద్భుతగతి దరుమంగలేమె పొలిమెరదాటన్.

105


మ.

తనతో మంచితనంబు జేయుటకునై మౌనాప్తి నున్నాఁడు నే
కనుసైగం బిలువంగ వచ్చుగతిగా గన్పట్టె నే నేల నీ
తని బిల్వం బనియేమి కాగలపనుల్ దప్పించునే యంచు సం
జనితాక్రోశమున న్వచింప విని యాసైనేయుఁ డత్యుగ్రతన్.

106


క.

కురుపతిని దద్బలంబును
బరిమార్చెద నంచు రోషపరవశమున భీ
కరమూర్తి యగుచు లేచిన
హరి గనుఁగొని యుపశమంబునగునటు బల్కెన్.

107


ఉ.

కాగలకార్యముల్ కనులగాంచక నింతటిలోన నీమదిన్
వేగిరపాటుఁ జెంద నిది వేళయుగాదు దురానులాప మీ

లాగువచించు నందు కవిలంబముగా ననుభావ్యకాల మె
బ్లాగతమౌనొ దాని నఱయందగుఁ దాల్మి వహింపఁగాదగున్.

108


గీ.

తడవులేదిక నీసుయోధనముఖులకు
డాయు పడుబాట్లు నీవె చూడంగలాపు
కార్యము తెఱంగు గానక గర్వమునను
ద్రుళ్లెదరు వీరు దుష్టబాంధవులుగాన.

109


క.

హరి యీలాగున సాత్యకి
కెఱిఁగించిన తాల్మిచే గ్రహించి పరిణయాం
తరభావికార్య మరయుచు
పెఱిగిన రోషానలంబు పెల్లడఁగించెన్.

110


క.

అంతన్ రాజపురోహితు
లెంతయు లక్ష్మణుని సుమణిహితపీఠమునన్
వింత ల్గులుకఁగ నునిచి య
నంతరనియతోపకరణనయమార్గవిధిన్.

111


చ.

రయమున నాచరించుచు విరామములేదు ముహూర్త మంతరా
లయముననున్న కన్య నవలంబముగా గొనిదెం డటన్న ద
త్ప్రియమతి చేటికల్ కపటవేషమునం బవళించుబోఁటి ని
శ్చయశశిరేఖగా గని హసన్ముఖలై వచియించి రర్మిలిన్.

112


క.

నీ వత్తింటికి జన బల
దేవుండును మేము నిన్నతిప్రేమ గనన్
వేవేగ వచ్చుచుందుము
మావలని దయాప్తి నెట్లు మనచెదొ తరుణీ.

113


ఉ.

వీని వరించితేని యరవిందదళేక్షణ రాజకాజు స
న్మానము సేయు నిన్ను కురుమండలికిం దొరసాని వౌదు భా

గ్యానుభవంబులం గొఱఁతలందని సౌఖ్యము లందె దింక నీ
యాన వివాహమంటపమునందు వసించెను చూడు లక్ష్మణున్.

114


క.

ఈలాగున కాలోచిత
లాలనలం బలుకు చేడెలం గని మాయా
బాలామణి కుపితానుగ
తాలాపముల న్వచించె నందఱితోడన్.

115


తే.

ధీరుఁ డభిమన్యుఁ డడవి కేతెంచినపుడె
గుండుకట్టుక నొకనూత గూలనైతి
నింక నామేలుజోలి మీకేలనమ్మ
నన్ను నిద్దురమేల్కొల్పకున్న జాలు.

116


చ.

మగఁడిక లక్ష్మణాహ్వయుఁడు మామ కురుక్షితినాథుఁడైన యీ
మగువలతోడ నాకు మొగమాట మికేమి ప్రియుండు నాయెడం
దగునెనరంటె నేని హలధారియె గాని విధాత గాని నే
వగలకునైన నింటితలవాకిలి ద్రొక్కఁగనిత్తునే యిఁకన్.

117


క.

మాయింటికోడలే యని
మాయత్తయు మామ నాకు మాఱాడినచో
వాయెత్త నీక నొకయెడ
నేయొత్తిగిలంగఁ ద్రోయనే యడుగంటన్.

118


క.

అనినన్ మాయాకన్యక
యని దెలియకఁ దత్సతీచయము వెల్వెలనై
కనురెప్ప లార్చుచుం దమ
కనుకూలముగా వచించి రచ్చెరువగుచున్.

119


చ.

అలుక లికేల నీవనినయ ట్లొరొనరించెదు గాని లెమ్ము లె
మ్మలికులవేణి నీ విచట నాలసియింపకు లగ్నకాలమ

వ్వల నిదె దాకొనెం దడవు వల్దిక ని న్గొనిదె మ్మటంచు న
బ్బలు డిటు బంపె మాకు పలుబల్కులికేటి కటంచు లేపినన్.

120


తే.

బిట్టు పెనుభూతములు మిమ్ము బట్టినట్లుఁ
పరుల బరువెల్ల మీనెత్తిఁ బడినయట్లు
వచ్చి పలువురు పలునోళ్ల వదఱఁదగునె
యెవరికోపంబు నాకేటి కింతులార.

121


క.

అంగన లందఱ నీగతి
గొంగటిలో రాళ్లు వైచి గ్రుద్దినగతి పల్
భంగులఁ బల్కుచు ధంభకు
రంగేక్షణ లేచె ముఖదరస్మిత మొప్పన్.

122


క.

మగవారి కెన్నడుం దా
నగపడని తెఱంగు దోఁప నతిభీతి మెయిన్
మొగ మవని వ్రాల్చి మదమే
నుఁగ నడక నలరఁగ మేడనుండి దిగివచ్చెన్.

123


ఉ.

కౌను జలింప నెమ్మొగము కాంత వహింప త్రపాతిభీతిమై
యానము మందగింప నయనాబ్జములు న్ముకుళింప నూపుర
ధ్వాన మడంప తోటినెలఁతల్ తనచుట్టును సందడింప నె
మ్మేను జెమర్ప నింపుజెలిమి న్నతిబెంప గమింపఁగాఁ దగెన్.

124


తే.

ఇట్లు జనుదెంచు దంభకుంభీంద్రగమన
నగ్రజన్ములు విధివిధాయకనిరూఢి
తత్తదుచితక్రియలు వధూధవుల కపుడు
ప్రేమ నొనరించి పరిణయపీఠినుంచి.

125


క.

ఇరువురల ప్రాక్ప్రతీచీ
హరిదభిముఖములుగ నిలిపి యంతటిలోనన్

నెఱివట్టు పుట్టమున నొక
తెరపట్టుగ బట్టఁగా విధించిరి విధిగన్.

126


చ.

మురజమృదంగదుందుభులు మ్రోయ శుభోన్నతితోడ వృద్ధభూ
సురవరు లాగమప్రథితసూక్తుల దీవనలీయ వారసుం
దరులును బుణ్యకాంతలు యధావిధి మంగళము ల్వచింప ద
త్కురుకులరాట్కుమారుని వధూమణినిం చెఱచాటు నిల్పినన్.

127


క.

మెప్పుగ లక్ష్మణుఁ డాప్తులు
జెప్పఁగ మునువిన్నకతన చేడియ నిక నే
నెప్పుడు జూతు నటంచని
రెప్పలనిడకం దదైకదృష్టిఁ గనుగొనెన్.

128


చ.

తదుచితగోత్రనామములు తజ్జనకప్రపితామహాదిసాం
ప్రదముల నుచ్చరింప నరపాలురు పౌరులు గుంపుగుంపులై
పొదవుచు వేడ్కఁ జూడ రవిపుత్రజయద్రథసైంధవాదు లిం
పొదవగ నవ్వధూవరమహోత్సవము ల్గనుగొంచు నుండఁగన్.

129


క.

జీరకగుడముల నిరువురు
కోరిక శిరములను నుంచుకొని తెరనెత్తం
గారాబుబలునిపట్టిని
యారాజకుమారుఁ డధికహర్షత జూడన్.

130


క.

కుందనపుబొమ్మవలె జను
లందఱకుం గానుపించి యాలక్ష్మణు డిం
పొంద పొడసూడఁగా నొక
కుందేలై ముసుఁగులోన గునగున నెగిరెన్.

131


సీ.

ఇది యేమొ నే దప్పు నీక్షించితి నటంచు
        గనుఁగొన నొకపిల్లిగతిఁ దనర్చె

వెండి యతం డాత్మ వెఱఁ గంది చూడఁగా
        కోఁతియై తనమ్రోల కొక్కిరించె
బ్రమసితి నంచుఁ దప్పక నిరీక్షింపఁగా
        భీకరాకృతిని భల్లూక మయ్యె
ఇది యద్భుతం బేమి హేతువో యనిదల్చ
        బలుకొండముచ్చురూపంబు జూపె


తే.

తొలుత బంగారుబొమ్మగాఁ దోఁచినట్టి
కలికి మాటికి నొకవింత గానఁబడియె
భ్రాంతియో లేక వలరాజు వలువతనమొ
సిగ్గు మదిమాని యెవరికి జెప్పరాని
కార్య మొదవె నిదేమంచు గళవళించు.

132


ఉ.

ఈతరుణీలలామను మునీంద్రుఁడు ము న్నభివర్ణనీయవా
క్చాతురి మీఱఁ బల్కుడు నిజంబని నమ్మితిఁ గాని నేటి కీ
రీతి ననేకరూపవిపరీతములై గసుపించె నిక్కమౌ
నాలి యిదేని నా కిటు గనంబడనౌనె వికారరూపముల్.

133


క.

ఐనా మన్మదనాతుర
తానిరతిం జూడచూపు దట్టె నిదేమో
కానియని కనులు దుప్పటి
చే నొత్తుచు మగుడ తెలివి జేకొని చూడన్.

134


చ.

గరళము గ్రక్కుచున్ ఫణవికాసము జూపుచు క్రూరదంష్ట్రవి
స్ఫురితకరాళవక్త్రమున ఫూత్కృతులు న్వెడలింపుచు న్విభా
స్వరరసనాగ్రముల్ వెలికిఁ జూపుచు క్రూరభుజంగ మాకృతిం
బెరిగి పయిం బయిం బడిన బెగ్గిలి పం డ్లిగిలించి మూర్ఛిలెన్.

135


చ.

అది గని రాజకాంతలు ధరాధిపులుం దనుజేంద్రు మాయగా
మదిఁ గనలేక లక్ష్మణకుమారుని నష్టవికారచేష్టలం

గదియుట వింతలై వికవిక న్నగఁగా మది సిగ్గుజెంది న
ట్లు దలను వంచె నక్కపటలోలవిలోచనమోహనాకృతిన్.

136


తే.

లక్ష్మణునకునుమాత్ర మీలాగు దోఁచి
నితరజనులకు భువనమోహినితెఱఁగున
గానఁగానయ్యె నింతటిలోన నతఁడు
తెలివినొందిన మతితోడ దేరిఁజూడ.

137


చ.

మునుపటిరూపులంద నను మోసముపుచ్చినభీతిచే గనుం
గొన నొకబెబ్బులింబలెనె కోఱలు గీటుచు భీమహుంకృత
ధ్వను లెసఁగం గరాళతరవక్త్రము జాపి చివాలునం బయిం
బెనుగొని దూకినట్లయిన భీతిలి పెద్దయెలుంగుతో ననెన్.

138


ఉ.

పాపఁపు గబ్బిబెబ్బులిని బత్ని యటంచని బెండ్లి జేసి నా
రూ పణఁగించ నేటికి మొరోమొరొ పెండిలికూఁతు గా దయో
యీపగిది న్యదువ్రజము లిండ్ల మెలింగెడి పెద్దదేవరం
జూపి వివాహమంచు పెనుసోకుడుపాల్ నను జేతు రయ్యయో.

139


క.

కలమేన బ్రాణముండిన
బలుసాకుఁ న్మెసఁగియైన బ్రతికెద నిక న
న్నిలుజేర్చుము తండ్రీ నా
తలపై పడివేలయేండ్లు ధరణిన్ మనవే.

140


ఉ.

ఎక్కడి పెండ్లికూఁతు రిక యెక్కడ సుద్వహ మింతలోన నం
ద్రొక్కి వధింపదే యడుగు దొల్లగనిచ్చునె మేనబ్రాణముల్
దక్కినజాలు రాజ్యసుఖదంబులు కామినులేల మీకు నే
మ్రొక్కెద నన్నలార పులిముందఱ ద్రోయక పోవనీయరే.

141


గీ.

తొలుతఁ గన్నులబండుపై దోఁచి తుదకు
కోఁతికొండెంగ కుందేలు గుడ్డివెలుగు

పెద్దపులులట్ల యాదవుల్ బెంచియున్న
దయ్యముల జూపి నను జంపదలఁచిరేమొ.

142


క.

నే మొఱ్ఱో యని వఱలఁగ
పాముల గాములను దెచ్చి బలవంతముగా
కామినియని జూపెద రది
సేమమె నాపెద్దపెండ్లి జేసెదరేమో!

143


క.

అన్నారదువచనంబులు
విన్నదిగా మొదలు ప్రీతి వెస మజ్జనకుం
డిన్నాళ్లు నన్ను బెంచి మ
హోన్నతశార్దూలభుక్తి కొసఁగు నిజముగన్.

144


క.

అని వాచఱచెటి కురురా
ట్తనయుని గని జనము లద్భుతమున సమీపం
బున కేఁగి వెన్ను జఱచుచు
సనయత మాయాబలాత్మజాతం జూడన్.

145


చ.

పలుచనిమోవితో మెఱుఁగుబంగరుమేనితొ సోగముక్కుతో
తెలినగుమోముతో కనులదీర్చినకాటుకనిగ్గుతో తళ
త్తళరుచివేణితో మృదుపదంబులతో చిఱునవ్వుతోడ సి
గ్గొలయఁగ జూచువారి నయనోత్సవమై గనిపించె నత్తఱిన్.

146


చ.

అది గని యచ్చటం గల జనావళి యచ్చెరువంది పల్కి రీ
సుదతి మనోహరాకృతిని జూడఁగనోడి మనోజవేదనన్
గుదిగొని వెఱ్ఱివానివలెఁ గూయదొడంగెను యిట్టి దుర్దశా
స్పదునకు సుందరాంగిని యొసంగఁగ నెట్లు విధాత గూర్చెనో!

147


తే.

కాంచనమునకు మణి యలంకారమైన
పూడ్కి, శశిరేఖ కయ్యభిమన్యుఁ డుండ
వీఁ డనుభవింపఁగోరుట వెఱ్ఱిగాదె
లక్ష్మణుఁడు గాడు వీఁ డవలక్షణుండు.

148

ఉ.

అందుకుఁ గర్ణముఖ్యులు మహాద్భుత మందుచు బల్కి రిట్లు మే
ల్కుందనఁపున్ సలాకు వగ గుల్కెడు కన్యను జూచి లోకు లా
నందముఁ జెంద నీవు మదనత్వర నున్మదివై దురూక్తులన్
నింద యొనర్ప నీకు దగునే యిటు చక్కని రాజకూఁతురిన్.

149


క.

పెనుభూతము నిను సోకెనొ
కనులం గనుఁగొనవొ కన్యకామణి రూపుం
గని కళవళించెదో పులి
యని యెలుఁగని భూతమని మహార్భటు లేలా.

150


క.

చెలు లెల్లఁ జూచి రోయం
బలభద్రుని మనసు నొవ్వ బంధులు నొవ్వన్
గలవార లిట్లు వదఱుట
తలవంపులు గావె నీకు తలిదండ్రులకున్.

151


క.

నిను చుట్టుముట్టి మే మీ
యనువున గాపాడుచుండునంతటిలోనన్
మినుతూఁటు బుచ్చుకొని వ
చ్చెనె బెబ్బులి వినఁ గన న్విచిత్రము గాదే!

152


క.

ఐనా యింకొకసారి ని
దానింపుచుఁ జూడు మనుచు తరుణీమణికై
వాని మరల్చి కనుంగవ
చే నీరును నొత్తి బుద్ధి జెప్పిన నతఁడున్.

153


తే.

బంధుజను లిట్లు దెల్పి నిర్బంధమునను
గడుభయంబున మూసిన కనులు దెఱచి
గడగడ వడంకి పెదవులు దడపుకొనుచు
గ్రమ్మఱను జూడ దనుజుఁ డుగ్రగతితోడ.

154


క.

మిడిగ్రుడ్లుం బెడకోఱలు
కడువిపులశిరంబు తొట్టికడుపు న్నిడుపుం

జడలుం బిగియొదలుం గల
బెడిదఁపుభూత మయి పయిఁ గభీలున దూకెన్.

155


చ.

కనుఁగవ విస్ఫులింగములు గ్రక్కుచు శూలము కేల ద్రిప్పుచుం
గినుకను నోట నెత్తు రొలకింపుచు కోఱలు గీటుచు న్మహా
ధ్వనుల భయావహంబుగ నదల్చుచుఁ బై నొకభూతమై చివా
ల్నను బడిదూకిన ట్లయిన లక్ష్మణుఁ డార్చుచు భీతచిత్తుఁడై.

156


తే.

మేన తలగుడ్డ మొలగుడ్డ మాని పుడమిఁ
బడుచు గిజగిజ కొండొకతడవుఁ బొరలి
లేచి వడఁకుచు చేతులు జాచి నిఖిల
బంధుతతి జూడ నిట్లనె భయముతోడ.

157


చ.

పొలతియె గాదుగాదు పెనుభూతమే గాని మదీయమృత్యువై
దలఁపడు టింత గానక హితప్రతతింబలె గుంపుగుంపులై
పలుమఱు చుట్టుముట్టి నను బాధలు బెట్టఁగ నేల నయ్యయో
నెలకొని మేన బ్రాణములు నిల్చిన జాలిక పోవనీయరే!

158


తే.

చెలిమె నీరు ద్రావి చెట్లాకు దుంపలు
మెక్కు మౌనిమాట నిక్క మనుచు
నమ్మి పెండ్లిజేయ నాతండ్రి సమకట్టె
నిచట నాదుప్రాణ మేగవలసి.

159


చ.

అని శుభవేది డిగ్గి జను లందఱు త న్వెరగంది జూడ స
య్యన నొకగుంపులోఁ బడి దిగంబరుఁడై వడిఁ బాఱ వెంటనే
దనుజుఁడు భూతమౌచు వెనుదౌలుక నార్వఁగ భీతమానసం
బున దలిదండ్రులన్ హితుల భోరున బిల్చుచు కంపితాంగుఁడై.

160


చ.

అసురుఁడు భీతభూతభయదాకృతి నీగతి వెంటనంటఁగా
దిసమొల గంతులేయుచును దీనత కొందఱికాళ్ళవ్రేళ్ళ మా

ఱెసఁగ బెనంగుచున్ మరుఁగుటిండ్లను దూఱుచు వెల్కిబాఱుచుం
బుసబుస రోజుచుం ధరణిఁ బొర్లుచు లేచుచుఁ బాఱుచు న్నెడన్.

161


గీ.

ఆయసురమౌళి తనమహామాయవలన.
విషభుజంగమతతుల వేవే లొనర్ప
నవి భయంకరఫూత్కార మడర వెడలి
విప్రతతివెంటఁ బడ వారు వెఱచి పఱచి.

162


చ.

పరువడి వార లొండొరులపైఁబయి వ్రాలుచు లేచి పౌరులం
దరుగని దల్లడిల్లఁగ బదంబులు దొట్రిల గంతులేయుచున్
నెఱి సిగముళ్ళు వీడగను నెవ్వగ మేనులుఁ జెమ్మరింప దు
ర్భరత మొరో మొరో యనుచు బాఱిరి క్రూరభుజంగభీతులై.

163


క.

అంతట మాయాదనుజుం
డంతంతకు చిత్రగతుల నాశీవిషముల్
వింతలగు వృశ్చికాదిమ
జంతువుల సృజించె సకలజనభయదముగన్.

164


క.

కాకోదరవృశ్చికతతు
లీకరణం బొడమి బ్రజల నిట్టట్టుగ చీ
కాకుపడ వెండనంటె మ
హాకులమతి కామపాలుఁ డచ్చెరువందన్.

165


తే.

శకునిబాహ్లికకర్ణదుశ్శాసనాది
యోధు లాసర్పవృశ్చికబాధలకును
దిగులుమదిజాలి వెడలగా తెఱువుమాలి
నిలిచి నిశ్చేష్టితాకృతుల్ బొలచి రపుడు.

166


క.

ఆయెడ దానవమాయో
పాయమునన్ వృకతరక్షుభల్లంబులనే

కాయుత సంఖ్యలు బొడమఁగ
మాయాశశిరేఖ మాయమాయె గృహమునన్.

166


గీ.

ఆవికారమృగావళి నఖిలజనులు
జూడ లక్ష్మణువంత భూసురులచింత
బలునిధావంత మార్తులౌ ప్రజయలంత
నొగిలె నంతంత ద్వారకానగరమంత.

167


ఉ.

పాములు తేళ్లు జెఱ్ఱులును భల్లము లుగ్రతరక్షుజాల మీ
హామృగము ల్సహస్రములునై జనియించియు వృద్ధి బొంది గో
త్రామరరాజపౌరజనతాపరిపీడన జేయ భీతిమై
వేమరు రామునిం గవిసి వేమరులై పెడబొబ్బ లేయుచున్.

168


సీ.

కాళ్లచేతుల నుగ్రకాలాహులు బెనంగ
        వదిలించుకొనలేక వణకువారు
కఱుకుతేళ్ళును మండ్రగబ్బ లంటించిన
        విదలించుకొనలేక వెదుకువారు
బొబ్బలేయుచు కాలుబెబ్బులు ల్గవిసిన
        వలువలు వీడంగ వఱలువారు
తమ కెదుర్పడు రాజతరుణులతో నైన
        మెడ కౌఁగలించుక మిడుకువారు


తే.

భల్లవృకముల గనుగొని భయము జెంది
యురుకుచో నొక్కరొకరిపై నొఱుగువారు
మోటుమెకముల గని యాటబోఁటిగముల
చింగులమరుంగులోన నణంగువారు.

169


చ.

కఱకుమెకంబులుం గదియఁగా గని భీతిని విప్రు లన్యసుం
దరుల స్వభార్యలే యనుచు దాపునకేఁగి పయంట లిగ్గుచున్
వెఱవకుఁ డంచు వెంజఱచి వేరొకవాడల గోడమాటుకుం
బొరిబొరి వారి నీడ్చుకొనిబోవుచు నుండు దురాత్మవిస్తృతిన్.

170

సీ. ఒడలెఱుంగనిభీతి నొండొరు ల్దాకుచో
        నడియాసమును గ్రుద్దులాడువారు
మెసలనీక భుజంగవిసరము ల్గవయుచో
        పందిటికంబముల్ బ్రాకువారు
తొడిబడి క్రూరజంతువు లడ్డుపడినచో
        ఎదలు మోదుకొని బిట్టేడ్చువారు
నెట్టిహీనుఁడు తమ కెదురేఁగుచున్నచో
        రక్షించుమనుచు బోరగిలువారు


తే.

మఱదు లత్తలు మామలు మగలు జూడ
వెలఁదు లార్తిని గంతులువేయువారు
క్రూరదానవమాయాప్రచారములకు
బీరముల బొరియల దూఱువారు.

171


ఉ.

కౌరవయాదవావళి చికాకున మేనులు ద్రిమ్మరింప వి
స్తారభయాకులత్వమున దల్లడ మందుచు గుంపుగుంపులై
బాఱిరి యందులో నొకఁడు పాండవపక్షముగాన మాధవుం
డూరక జూచుచుండె దనుజోజ్జ్వలమాయ లడంపజాలియున్.

172


క.

దనుజుం డీగతి జననీ
మణి నెవ్వగ మదిఁ దలంచి మాయోపాయం
బున చిందఱవందఱలై
జన నందర గర్వభంగసరణి నడంచెన్.

173


చ.

అపుడు కురుక్షితీశుఁ డరుణాత్మజసైంధవశల్యముఖ్యధీ
నిపుణుల గాంచి యిట్లనియె నెమ్మిని మీర లఖండధైర్యని
శ్చపలత గల్గి భీరువులచాడ్పున నిట్ల చికాకు జెందుటల్
నృపతికి లౌకికంబున కనీతియు లాఘవముం ఘటింపదే.

174


మ.

ఎవఁడో పాండవపక్షపాతమతి నేఁ డీలాగు దుర్వత్తికిం
దవులంబోలు నటంచుఁ దోఁచె మన మీధైర్యంబు బోకార్చుటే

యవమానం బటు గాన సీరిభవనం బందుండి సాధింపఁగా
నవశంబౌ పురినుండి వెల్వడిన బాహాబాహి పోరందగున్.

175


చ.

అని పురికొల్పినన్ సమరథాతిరథాదులు శస్త్రపాణులై
మొన లొనగూర్చి సద్భటసమూహముతో శరచాపఖడ్గసా
ధనములఁ బూని బాహుబలదర్ప మెలర్చ నహంకరింపుచుం
గనుగొనుచుండ చండరవికైవడి కౌరవభర్త వెల్వడెన్.

176


చ.

అటువలె రాజరాజు బలునంతిపురంబు వినిర్గమించి యు
త్కటభటవాజిసింధురరథప్రచయంబు స్వపక్షరాజరా
ట్పటల మొకుమ్మడిన్ నభము బ్రద్దలువాయ వికారహుంకృతా
ర్భటు లెసఁగన్ బురంబు నలుప్రక్కల గ్రమ్మి రనేకభంగులన్.

177


చ.

ఆయెడ భీమసూనుఁ డతియాగ్రహుఁడై దివి నంటి నైజమా
యాయుతశక్తితోడ బ్రళయాంబుదమున్ సృజియింప నల్గడల్
దాయక చిమ్మచీఁకటులఁ బన్ని మహాధ్వని మింట గర్జనల్
జేయుచు చిమ్మిరేగె జనచిత్తభయంకరణైకహేతువన్.

178


చ.

మెఱుపులు గ్రమ్మి చూడ్కి మిఱుమిట్లు గొనంగ తళత్తళద్యుతిం
బెరిగెను నీరదంబు లతిభీమగతిం దశదిక్తటంబులం
దురిమె మహాశనిప్రచయ ముగ్రగతిం ధర గూలె చేటతో
జెఱిగినరీతిమై నురిలె శీతజలాశ్మనికాయ ముద్ధతిన్.

179


సీ.

బలువిడి గుడ్లగూబలు కూత లిడినట్లు
        వరిగొన్న నక్కలు వఱలినట్లు
కఱకుటాంబోతు లొక్కట రంకె లిడినట్లు
        చేలరేగి పులులు ఘోషించినట్లు
గండుఁబిల్లులు గూడి కొట్లాడుచున్నట్లు
        సింగంబు లార్భటుల్ జేసినట్లు
ఘోరభల్లూకముల్ గ్రుద్దులాడినయట్లు
        మొగి సారమేయముల్ మొఱిగినట్లు

తే.

గుంటలో గాండ్రుకప్పలు గూసినట్లు
ధరణి జనులెల్ల గుండెలు తల్లడిల్ల
హల్లకల్లోలముల మింట నెల్లకడల
దవిలి చెలరేగి ఘోషించె దనుజవరుఁడు.

180


చ.

సురుచిరగీతవాద్యములు సుస్వరభాస్వరవేదశాస్త్రవి
స్ఫురితనినాదముల్ ద్విరదఫూత్కృతబృంహితముల్ తురంగఘీం
కరణములున్ ఖరార్భటవికారములుం దివినుఁడి యొక్కమై
మొరసె దిగీభకర్ణపుటముల్ బధిరీకృతభావ మేర్పడన్.

181


సీ.

తొలుదొల్త నుఱిమి నెత్తురువాన లొల్కె నం
        తట వర్షపాషాణతతులు గూలె
ఫెళఫెళధ్వనులచే పిడుగు లిమ్మడిడొల్లె
        చలితేళ్ళమూఁక జల్ జలున రాలె
గండశిలాదిప్రచండపాతము దోఁచె
        కణకణ చటులాగ్నికణము లురిలె
ముసలముద్గరముఖామోఘసాధనలచే
        భటశిరస్తాడనార్భటు లెసంగె


తే.

దనుజుఁ డుద్దండగతి నిట్లు తాండవింప
నపుడు గంధర్వకిన్నరయక్షసాధ్య
గణము లుత్సాహలీల నాకాశవీథి
నుండి కయ్యంబు గనుఁగొనుచుండి రంత.

182


గీ.

అపుడు నారదమౌనీంద్రుఁ డతిప్రయత్న
మల్లనాట్నుండి తాఁజేయునట్టి పనికి
నేఁడు ఫలకాల మిట్లు చేకూరె ననుచు
మానసంబున సంతోషియై నటించె.

183


క.

ఈరీతి దనుజవరుఁ డతి
ఘోరవ్యథఁ జెందఁజేయ కురుబల మొకచో

తారసిలి శింజినీఠం
కారంబు లొనర్చి రౌద్రగతి గర్జిలుచున్.

184


గీ.

కర్ణ సైంధవశల్యవికర్ణశకుని
గురుతనూభవకృపముఖ్యకురుబలంబు
లార్చి పేర్చి నభంబున కభిముఖముగ
మొనసి నిష్ఠురశస్త్రాస్త్రములను బఱప.

185


మ.

దనుజుం డాగ్రహవిగ్రహుం డగుచుఁ దత్తన్మార్గణశ్రేణి తు
త్తునియల్ గా శరఖడ్గతోమరముఖాస్తోకాయుధానీక మ
ల్లన వర్షింపుచు శాంబరీమహిమలీలన్ వారణస్యందనా
శ్వనికాయంబు భటవ్రజం బతులితాశ్చర్యంబుగా బన్నినన్.

186


సీ.

దివినుండి వెడలు దంతివ్రజంబులు కురు
        క్షితినాథుదంతిసంతతిని దురిమె
బొరిటొరి నాకసంబుననుండి బొడమిన
        హరులు కౌరవరాజుహరుల దరిమె
మించి మింటను సంభవించిన రథపంక్తి
        రారాజురథరథ్యరభస మణఁచె
పిడుగులవలె నింగి బొడమిన భటకోటి
        ధార్తరాష్ట్రులభటోద్ధతుల గూల్చె


తే.

నంత విసువక దానవుం డంతకంత
కోలభల్లూకశరభశార్దూలములను
భయదగతి శత్రుసైన్యంబుపైన గఱప
నుఱికి కోలాడ చెండాడుచుండె నపుడు.

187


మ.

ఉరగద్రౌణలులాయసింహశరభవ్యూహంబు లొక్కొక్కవేల్
కురురాట్సైన్యములం దలంపడుచు నుక్కుల్ డొక్కలం జెక్కులున్
శిరముల్ మైనరముల్ కరంబు లురముల్ చెండాడి తూలించి తు
త్తురుముం జేసి హరించె కాల్బలము తోడ్తోడం జికాకొందఁగన్.

188

ఉ.

ఈగతి మాయనొందిన మదేభరథాశ్వభటాదు లొక్కటన్
మూగిన రాజసైన్యములు మ్రొగ్గే తురంగము లార్చుచుం ధరం
దోగె మధేభసంఘములు దుత్తుము రయ్యె రథంబు లుర్వి వే
వేగ దొఱంగె వాసవపవిప్రహతాద్రులభంగి భంగమై.

189


సీ.

భల్లపంక్తులు చిత్తజల్లులై వర్షింప
        తల్లడిల్లుచు నేల దొర్లువారు
మిన్ను జూడఁగ బోవ మెఱుఁగుటమ్ములు నాట
        కనుగ్రుడ్డు లూడి బెగ్గటిలువారు
తలమీఁద పిడుగు లుధ్ధతిగూల తనువులు
        నుగ్గునుగ్గుగ నేల మ్రగ్గువారు
ఖడ్గముల్ బూని లంఘనసేయ గమకింప
        కులిశపాతంబున గూలువారు


తే.

దుష్టజంతుతతుల్ పైకి దూఁకినపుడె
గుండె లవియఁగ నార్చుచు గుబులు గుబుల
కండలును నెత్తురుల్ నోట గ్రక్కువార
లైరి యీరీతి దనుజమాయాతిభీతి.

190


తే.

పఱచువారలుఁ దముగని పఱచువారు
నఱచువారలఁ గూడి వాచఱచువారు
సోలువారలపై దాము సోలువారు
వ్రాలువారలపై దాము వ్రాలువారు.

191


చ.

పొరిపొరి మాయచే దివిని బుట్టిన తద్రథసద్భటాశ్వకుం
జరములు శల్యఖడ్గవృకసైరిభముల్ కురురాజుసేనలం
గరచి బెనంగి డొక్కలును కంఠములుం బెకిలించి చించి దో
శ్శిరము లురంబులు నమిలి చిందఱవందఱఁ జేసి ధౌర్త్యతన్.

192


సీ.

బలితంపుపిడుగు పైఁబడ ఘీంకరింపుచు
        నిలమీఁద నొఱుగు గంధేభములును

పటుకుఠారవ్రాతపాతఘాతకు మేను
        లవసి ప్రోగైన తీవ్రాశ్వములును
ముసలముల్ దివినుండి మ్రోయుచు పైఁబడ
        సమసిన భటవీరసముదయములు
గండశిలావినిర్గళితఘాతాహతి
        చిందఱలౌ మణిస్యందనములు


తే.

నగు రణక్షోణిజనభయం బావహిల్ల,
గ్రూరదనుజుండు వీరాంకవీరుఁ డగుచు
దివిని నటియించె దుష్టకౌరవబలంబుఁ
బొలయఁగా జేసి యంతటఁ బోక గవిసి.

193


సీ.

శతసహస్రవ్యాఘ్రచయములు విడిబడి
        కడిమి నొక్కొకతురంగమును గ్రుమ్మె
లక్షలకొలఁది హర్యక్షంబు లుదయించి
        యొక్కొక్కదంతిపై యురికి బెఱికె
శరభంబు లొకకోట్లసంఖ్యలు జనియించి
        తీరుగా నొక్కొకతేరు డులిచె
బహుళార్బుదముల దుస్సహజంతుసంతతి
        బరదెంచి యొక్కొకభటుని బొదవె


తే.

రణితచటులాశనీనికరం బసంఖ్య
బొడమి యితరజనంబులఁ బొలయఁజేసి
చెలఁగి దానవుఁ డిట్లు గర్జిలుచు మింట
వివిభగతులను మెలగె భూవిభులు బెగడ.

194


క.

మలమూత్రశోణితమ్ములు
పలలోపలములు కరీషపటలంబులు, ఝల్
ఝులున గురిపించె కౌరవ
బలములు వెస నుడ్డుగుడిచి బాఱ కడంకన్.

195

క.

మగధత్రిగర్తమాళవ
భగదత్తవిరాటమత్స్యపాండ్యాదినృపుల్
నొగిలి నిరాయుధు లగుచును
దగుబీరము లుడిగి చనిరి తమతమపురికిన్.

196


చ.

అపుడు వివాహకార్యమునకై బఱతెంచిన కౌరవాప్తులౌ
నృపవరులం బురీషమున నింపి మృగేంద్రలులూయభల్లుక
ద్విపినముఖాగ్రజంతువితతిం బురికొల్పి రథాశ్వసద్భట
ద్విపములనెల్ల ద్రుంప నతిదీనతఁ గొందలమంది కొందఱున్.

197


క.

విచ్చలవిడి దానవుఁడు వి
యచ్చరమార్గమున నిలిచి హత మొనరింపన్
విచ్చిరి నొచ్చిరి చచ్చిరి
మచ్చరమున జనులు మారి మసలినభంగిన్.

198


చ.

పరువడి భీమసత్వములు బైకొన కౌరవసేన నల్గడల్
బఱచెడువారు శస్త్రతతిఁ బాఱగవైచి దిగంబరాంగులై
మొఱలిడువారు రక్తమలమూత్రపురీషనిపాతభీతిమై
మఱుగులఁ దూఱువా రగుచు మ్రాన్పడి రంద రనేకభంగులన్.

199


సీ.

వెండి యతం డభ్రమండలమ్మున నుండి
        తండోపతండప్రకాండకాండ
తండంబు లొండొంట గండభేరుండముల్
        పుండరీకములు దిఙ్మండలముల
కుండలీకృతమై ప్రచండాప్తి నిండియు
        ఖండశోణితకాండమండలంబు
మెండుగా గురిసి బ్రహ్మాండభాండము నిండ
        నండపిండాండముల్ గుండె లవిసి


తే.

బెండుపడియుండ కండలు కొండలువలె
దండదఱిగినగతి మెండు నిండినపుడె

భండనంబున కెదిరింపఁ బెండుపడుచు
నొండుదోఁచక భటకోటిగం డడంగె.

200


గీ.

విరథులును వీతవాహనుల్ వికృతతనులు
విరహితాస్తులు విస్వరుల్ విగతమతులు
వికలితాసులు విధ్వస్తవివిధయత్ను
లగుచు బఱచిరి కురుపక్షమైన నృపులు.

201


క.

గండశిలాఘాతముల న
ఖండాశనిపాతముల వృకద్విపముఖరో
ద్దండమృగపీడనంబుల
వండం దఱిగినటు సైన్యవర్గము మడసెన్.

202


వ.

ఇవ్విధంబున సంబరాడంబరుండై హైడింబుండు యుగనిగమనారంభ
విజృంభమాణశుంభత్సంరంభసంవర్తనాంభోధరగంభీరరవంబులను
విజయసమయసముదితశంకరహుంకారశంకాసంపాదితంబుగా సురాసుర
విసరమథితమహార్ణవోదీర్ణఘూర్ణాయమాననినాదంబున కనువాదంబుగా
ఘల్లుఘల్లున గర్జిల్లుచు కుంతతోమరప్రాసశ క్తిశూలాద్యనేకాయుధంబుల
నిగుడించుచు నగ్నికణంబుల నశనిపాతంబుల నస్త్రాసారంబుల
నఖండగండశిలాపాతంబుల నతివర్షోపలంబుల నమేధ్యంబుల నశ్రాంత
మూత్రధారాపాతితంబుల ప్రతిపక్షబలంబులు బడలుపడ న్నిగుడింప
నబ్బలంబు లబ్బురంబైన రథంబుల న్నిబ్బరంబుగా బఱపుచు లాఘవ
లక్ష్యదృఢత్వంబులు మెఱయ రయంబున నంపఱపరంపరలపెంపున
కోదండపాండిత్యంబు నెఱుపు తత్తత్ప్రహరణంబులు కృతఘ్నోపకృతిం
భాతి నిరర్థకంబుగా బొరయ నతం డంతకంతకుం గోపంబు తాపం
బునం గదుర నభోమండలంబునందుండి యాఖండలాదిదిక్పతిమండ
లంబులుం బెండువడియుండ, మార్తాండప్రభాడంబరవిడంబనుండై
సురాసురవిసరదుర్నిరీక్ష్యంబుగా మాయామేఘమండలంబునం దణంగి
దుష్ణోరగకిలాసత్వంబులం బ్రయోగింపఁ దదీయసైనికానీకంబున
తుండంబులు ఖండంబులై పీనుంగులైన యేనుంగులును, కాయంబులు

గాయంబులై రుధిరధారాతరంగంబులైన తురంగంబులును రథ్యంబులు
వధ్యంబులై హతాంగంబులైన శతాంగంబులును, కపాలంబులు
విపాలంబులై గదాహతులైన పదాతులును, రదంబులు పదంబులు
పగిలి బెరిగె లయ్యును, పాఱులు కృపాణులు తునిసి తుత్తుము ఱయ్యును,
ఉరంబులు శిరంబులు చీలి చిద్రువ లయ్యును, మర్మంబులు చర్మంబులు
వీడి వికలంబు లయ్యును, వెన్నులు చన్నులు వ్రేల దూలియును,
ప్రక్కలు డొక్కలు గూలి వ్రాలియును, వీనులు జానులు నొచ్చి
నొగిలియును, నేత్రంబులు గాత్రంబులు కుమిలి కమిలియును,
ఫాలంబులు కపోలంబులు తునిసి సునిసియును, తొడలు మెడలు విరిగి
యొరిగియును, వ్రేళ్లు గోళ్లు మడసి గెడసియును, అపరిమితరక్త
ధారాసిక్తంబైన సంగరాంగణం బతిఘోరంబై యుండె నప్పుడు.

209


సీ.

చూర్ణితకేశవిస్తీర్ణశైవాలంబు
        ఖండితాననలసత్కమలచయము
పతితభుజాదండపాఠీననికరంబు
        పుంఖీభవత్కంఠశంఖచయము
శిథిలితభూషణసికతామయస్థలి
        ద్విరదకళేబరద్వీపయుతము
భీకరదుందుభీభేకసంకీర్ణంబు
        ఘనతురంగాంగసక్రప్రచయము


తే.

మాంసమస్తిష్క ఘనకర్దమప్రయుతము
నగుచు నెత్తురుటేరులై యవని బొరల
దనుజుఁ డీభంగి నింగి ధూర్తత జలంగి
కౌరవావలి నెల్ల చికాకుపఱచె.

204


ఉ.

అంతట బోక భూతవికృతాకృతి బూని తదీయసైనికా
భ్యంతరమందు జొచ్చి ముసలాగ్రగదాహతిచే శిరంబు లిం

తింతగ వ్రక్కలించి యితరేతరకోటి కదృశ్యరూపుఁడై
యంత వియత్పథంబునకు నాగ్రహుఁడై చనుదెంచి క్రమ్మఱన్.

205


సీ.

మరల కర్ణునిశిరోమధ్యంబున నిగిడ్చె
        సునిశితాస్త్రంబుల శూలములను
పాషాణతతుల దుర్భరగదాహతుల చే
        డ్పడజేసె నంత సౌబలునిబలము
సముదగ్రలీల దుశ్శాసను తనువెల్ల
        పరశుఘాతంబుల బగల నణఁచె
చటులాశనీమహార్భటనిపాతంబుల
        రారాజురథ్యసారథుల దునిమె,


తే.

సైంధవుని కత్తళము ద్రుంచె సకలయోధ
తతిని భూరిశ్రవుని ద్రోణతనయు నొకట
ఘోరతాడనముల మూర్చగొన నడంచె
ఘనతచే మించె నభ్రవీథిని నటించె.

206


చ.

మును తనతో సుభద్ర కురుముఖ్యుల జంపకు మంచు బల్కుటల్
మనమున నెంచి వారివధ మాత్రము మాని తదీయసైనికా
జనముల నొక్కయుద్ధవిడి జంపి పురీషకరీషమూత్రమ
జ్జనమున నమ్మహారథుల శక్తి నణంచె ననేకభంగులన్.

207


క.

ఈరీతి న్మాయాకృత
ధారాధరములను డాగి తత్కురుబలముల్
భీరుపడ భంగపఱచుచు
రారాజుం గూర్చి భీమరవమున బలికెన్.

208


చ.

జనకు లరణ్యభూమి ననిశంబు జరింపఁగ బంపినాఁడ నం
చని మదగర్వహుంకృతిని నయ్యభిమన్యుఁడు గోరియున్న క
న్యను గొఱగాని లక్ష్మయిన కర్థిని గైకొనబూని పాండునం
దనుల పరాక్రమంబు మదిదల్పని దత్ఫల మబ్బె నేటికిన్.

209

చ.

నిను మది నమ్మి వచ్చు ధరణీతలనాథులు మద్భుజావలే
పనఘనబాణజాలదవపావకకీలల మ్రొగ్గి మ్రగ్గి రిం
తను మును మాయజూదమున ధర్మజు రాజ్యము గెల్చి నీ కొసం
గినఘనశూరు సౌబలుని గీటణఁగించెద చూడు మింతటన్.

210


గీ.

ధర్మజాదిమపాండునందనుల కీవు
కీడొనర్చిన ఫలము చేకూరె నేఁడు
శకునిభానుజసైంధవసహితముగను
నిన్ను జంపక మాన నాకన్ను లాన.

211


చ.

అని యతఁ డట్టహాసమున నార్చి నిశాతశరాశ్మవజ్రపా
తనిహతిచే మహారథుల దర్పము లార్పఁగ డస్సి సైనికుల్
జను లతిభీతి బర్వ నిల శక్యము గాక కృపుండు ద్రోణుఁ డ
జ్జనపతితోడ కార్యసువిచారనయోక్తుల బల్కి రొక్కటన్.

212


క.

కురునాథ! యిట్టి నీ వె
క్కుఱుమంత్రాంగమున నింత గూడెను మనతో
డరుదెంచు నృపులు దిశలం
బఱచిరి హతశేషు లగుచు బ్రతికినవారల్.

213


గీ.

మాయగజములచే మ్రగ్గె మనగజములు
మాయహయములచే గూలె మనహయములు
మాయరథములచే డుల్లె మనరథములు
మాయసేనచె మనసేన మాయమాయె.

214


మ.

మొదల న్పాండవపక్షపాతి హరి యేమో వింత గావించె ని
ట్లదిగాకం బురుహూతముఖ్యసుర లత్యంతాప్తులుం గాన నె
య్యది సాహాయ్య మొనర్చిరో తెలియరా దీమాయ లీఛాయ లి
ట్లొదవెం గావున దీనికై ప్రతికృతం బూహింపఁగా దోచదే.

215


మ.

మును భీష్మాదులు నీహితమ్ముకొఱకై ముమ్మారు బోధించి యి
ప్పని సేయం దగదంచు బల్కుట మదిం బాటించఁగా లేక స

త్యనయోపేతుల పాండుసూతులకు దుష్టాలాపము ల్బల్కి చే
సిన తప్పుల్ తలఁదాకినప్పుడుగదా చింతింపఁగా నయ్యెడిన్.

216


క.

నీవుం గర్ణముఖాదిమ
హావీరవరేణ్యు లేకమై మదిఁ గనకం
గోవిందుని నిందించితి
రే వికృతికి మూల మాతఁడే సుమి జూడన్.

217


క.

హరిఁ గొలిచి ధర్మజాదులు
నిరుపమసత్కీర్తిపూర్తి నెగడిరి నీవొ
క్కరుఁడ వహితుండ వగుటకు
కొఱవిం గొని నెత్తి గోకుకొనుగతి గాదే.

218


క.

తలమీఁద ఱాలు పిడుగులు
నిలమీదం దేళ్లుఁ బాము లేకం బగుచున్
నిలనీక దిరిగె మేనులు
మలమూత్రకరీషరుధిరమయ మయ్యె నృపా!

219


క.

ఒకయెడ సింహానికాయం
బొకయెడ భయదాహిజాల మొకచో శరభ
ప్రకరంబు లొకట మదగజ
నికరము లొకదిశ తరక్షునిచయము గవిసెన్.

220


క.

అకటా రథరథ్యాయుధ
వికలులమై ప్రాణ మొండు వేదక్కబలం
బొకటి గనలేక నూరక
నిక యేటి రణంబొ దీన నేటి జయంబో!

221


మ.

అదిగాక న్మనసేనలో నొకఁ డదృశ్యాకారుఁడై జొచ్చి పెన్
గదెచే నందఱ మోదఁగా దొణఁగె నాక్రోశంబునన్ వాని నె

ట్లెదిరింప న్వశమౌ బటానబయలం దెబ్భంగి జీవింప దో
చదు మున్నెప్పటితావు కేగుట విశేషం బంచు దోచె న్మదిన్.

222


ఉ.

నావిని కర్ణశల్యకురునాథు లధైర్యమనీషులై భయం
బావహిలన్ హలాయుధు శుభాలయము న్వెసజొచ్చి కంపితాం
గావయవంబులం జెమట లాముకోనం గళనీతజీవులై
లావు దొలంగి యొక్కెడ నిలంబడుట ల్గని సీరపాణియున్.

223


మ.

శశిరేఖామణి మాయమౌట విషదుర్జంతువ్రజంబు ల్సహ
స్రశతంబుల్ జనియించుటల్ కురుకులక్ష్మానాథసైన్యంబు దు
ర్దశలం జెంచుట లక్ష్మణుండు భయదాక్రందధ్వనిం బాఱుటల్
కుశిగుంపు ల్గొని యాదవు ల్పురజనుల్ ఘోషించుట ల్గాంచియున్.

224


చ.

హలముసలంబుల న్నిజభుజార్గళపీఠి నమర్చియు న్మహో
జ్జ్వలవిలయాంతకాకృతి నవారితభీషణరోషదీప్తుఁడై
బలువిడి శోణనాంగణ మభంగురలీల వినిర్గమించి ది
క్కులు బఱికించి దివ్యభిముఖుం డగుచున్ ముసలంబు ద్రిప్పినన్.

225


క.

అప్పుడు దనుజుం డార్చుచు
తెప్పలుగా పులులు ఫణులు తేళ్లును డాలున్
నిప్పుల కుప్పలు గుప్పున
గుప్పెం బలభద్రుఁ డుడ్డు గుడువఁగ మింటన్.

226


చ.

పిడుగుల పెల్లుగూల్చి వెనువెంబడె ఖడ్గగదాస్త్రశస్త్రము
ల్దడబడ చిత్తజల్లులవిధంబున పైనిగిడింప నబ్బలుం
డడలుచు లాంగలంబు ముసలాయుధము న్వడి ద్రిప్పి వానిపె
ల్లడఁపగ కాలుఁడై నిముస మార్పఁగలేక చలించి ఖిన్నుఁడై.

227


మ.

ఇది యేమో బలువింత బుట్టె వినుతుం డెవ్వండొ దౌర్జన్యుఁడై
యెదురున్ లేక నభంబున న్నిలిచి నేఁ డీలాగు మాయారణం

బొదవింప న్సమకట్టెఁ దత్ప్రతికృతం బూహింపఁగా బుద్ధిదో
చ దటంచుం దిగులొంది శ్రీహరినివాసం బార్తుఁడై చేరియున్.

228


క.

పెదవులు దడపుచు నాగఁటి
గుదెరోకలికోల గోడకు న్వైచి భయం
బొదవ మధుసూదనుని క
ట్టెదుట నిలిచి గాద్గదోక్తి నిట్లని బలికెన్.

229


శా.

శ్రీకృష్ణా యిది యేమొ వింత జనియించెం గాక యీరాత్రి చీ
కాకై లోకులకూత లార్భటులు భూకంపంబుగాఁ దోచె ని
శ్శ్రీకంబై శశిరేఖ గేహమున వీక్షింపగ లేదయ్యె నేఁ
డీకృత్యం బతిఘోరకర్ముఁ డెవఁడో హీనుం డొనర్పందగున్.

230


క.

మొదటన్ లక్ష్మణుఁ డార్తిని
బెదఱుచు మొలచీర సడలి భీమార్భటిఁ బె
ల్లదిఱి చనునపుడె పెండిలి
తుదిముట్ట దటంచు నాకు దోఁచె నిజముగాన్.

231


మ.

పులులున్ సింహములున్ వృకంబులు మహాభూతంబులు న్నల్గడల్
గలయం బర్వగ భూపతు ల్గజతురంగశ్రేణితో వానితో
జలపోర న్సమకట్టి దోర్బలవినిస్సారాంగులై మ్రగ్గి రే
వలన న్నిల్వ వశంబు లే దిఁకను దైవప్రేరితం బెట్టిదో!

232


క.

పెండ్లిం జూడఁగ వచ్చిన
వాండ్లెల్ల మహాశనీనిపాతంబులచే
పండ్లీలగఱచి కొందఱు
గుండ్లపయిం దొఱఁగి నేలఁ గూలి రనేకుల్.

233


చ.

విరిగె రథవ్రజం బఖిలవీరభటావలి గూలె భీకర
ద్విరదము లొక్కట న్మడిసె తీవ్రహయంబులు డుల్లె రాజశే

ఖరులు వధూజనంబులు చికాకున దిగ్వసనాంగులై వడిం
బఱచిరి భూమి నెత్తురులు బాఱెఁ బ్రహహము లౌచు నెల్లెడన్.

274


క.

చీఁకటులు గవిసె మింట న
నేకబలాహకనికాయ మెఁసగి రుధిరధా
రాకలిత మగుచు పిడుగుల
మూఁకలు లోకులు చికాకు మూకొనదాకెన్.

275


క.

ఏ నంతట కయ్యంబున
కై నేగి నభంబు జూడ నతిరౌద్రతర
ధ్వానములు జేయుచుం బ్రళ
యానలకణగణము రాల్ప నవశం బయ్యెన్.

276


క.

కౌరవరాజు వినిర్గత
శూరుండై మేను నొచ్చి శుద్ధాంతమునం
జేరి తడఁబడుచు నున్నాఁ
డారయ తలవంపులయ్యె నచ్యుత నాకున్.

277


మ.

ఇక నేమంచు వచింప క్రూరదనుజుం డెవ్వండొ మాయాబలా
హకపంక్తిం దగ చాటు చేసికొని హాహాకారరోషోగ్రుఁడై
యొకచో గంతులు వేయు నొక్కయెడ నత్యుత్సాహుఁడై గేరు వే
రొకమూలం దిరుగున్ హసించు నొకచో నొక్కొక్కచో నేడుచున్.

278


క.

ఉఱుములు మెఱుపులు పటుభీ
కరగండశిలాశనీనికాయంబు మహో
ద్ధురగతిని బఱప నిల్వఁగ
వెఱ చిట జనుదెంచితిన్ భవిష్యతి దెలియన్.

279


ఉ.

నీ వఖిలార్థవేద్యుఁడవు నేతవు దాతవు నన్ను భ్రాతగా
భావమునం దలంచుట ప్రపంచవిలోకవిడంబనార్థమే

గావున నీ వెఱుంగనిది గల్గునె లోకమునందు నెందు నేఁ
డీవిధ మెట్టిదో తెలుపవే మధుసూదన వైరిభేదనా!

240


చ.

అనిన జనార్దనుండు దరహాసముఖంబున నన్నతోడ ని
ట్లనియె మదగ్రజుండ విటు లాడఁగనేల యెఱింగి మున్ను చే
సినపని నింతలో మఱచి చింతిల నేటికి నీవె సోదరిం
గినిసి పరాభవించుటకు కేవల మిట్లొనగూడు టబ్రమే.

240


మ.

తొలుత న్నీవు పరాభవించుటకు పుత్రు న్వెంట దోడ్కొంచు కే
వలగాఢాంధతమంబునన్ వెడలిపోవం దుర్గమార్గాటనో
జ్జ్వలబాహాబలుఁడౌ ఘటోత్కచుఁ డట న్సాహాయ్యమై వారి న
బ్బలుకోనన్ నిలజేసి నిశ్చలసుహృద్భావంబుఁ బాటించినన్.

241


తే.

వానితోడుత నీవన్న వార్త లెల్ల
దెలుప దానవుఁ డతిరోషదీప్తుఁ డగుచుఁ
దల్లికిని దమ్మునకుఁ బ్రియం బుల్లసిల్ల
పొలఁతి నింతకుమున్నె గొంపోయె నటకు.

243


క.

అతఁ డతులదనుజమాయా
చతురతలన్ విభ్రమించి శశిరేఖాయో
షితరూపము గైకొని భవ
దతులితభవనమున మోహనాకృతి నిలిచెన్.

244


క.

వనితామణి నితరజనుల్
గనుఁగొన శశిరేఖవలెనె గాన్సించుచు ల
క్ష్మణున కతివికృతరూపము
లను జూపెం దనుజమాయలన్ వివిధగతిన్.

245


చ.

జనకులదుఃఖముల్ హృదయశల్యములై మదినాటియుంటచే
దనుజుఁడు లక్ష్మణుం గలచెఁ దత్కురురాడ్బలమెల్ల నార్చి తెం

పున మును జేయు కర్మములు భుక్తము గాక దొలంగు టెట్లు స
జ్జనులగు పాండవాత్మజులశౌర్యము నేఁ డెఱుగంగనయ్యెనే.

246


మ.

అని దామోదరుఁ డాసభాసదుల కత్యాశ్చర్యమై దోఁచ నే
ర్పున బల్కన్ పటురోషభీషణవిదీప్తుండై హరిం జూచి యి
ట్లనియెన్ సోదరి పుట్టినింటికి విరోధాపాదియై యీగతిన్
మనయం దీర్ష్యయు బెంప ద్రుంప నిది ధర్మంబౌనె దర్కింపఁగన్.

247


తే.

మనసుగలసినచోటికి మగువ నొసఁగ
జనుల కెల్లను నిది సుప్రశస్తమయ్యె
కొడుకుతో కొన్నికొండెముల్ నొడివి నన్ను
భూభుజుల నిట్లు బెదరింపఁబూనతగవె.

248


క.

మానిసి సాహసగుణముం
బూనుటయేగాని యికను బుత్రీమణి నె
ట్లైరైన నొసంగుదునే తన
సూనునకుం దనుజుఁ దనికి జొచ్చినమాత్రన్.

249


చ.

వనిత నొసంగ నంచని ధ్రువంబుగ బల్కితిగాని వెళ్లిపొ
మ్మని దన నెవ్వఁ డైనను బ్రయాసల బెట్టెనె నన్ను రద్దిపా
లొనరఁగజేయ నిట్టి చెడునూహలు జేసిన జేయనిమ్ము నా
తనయ నరణ్యమం దెచట దాచిన నే క్షణమందు దెచ్చెదన్.

250


చ.

నరపతులెల్ల నన్ను కని నవ్వఁగ ని ట్లవమాన మొంది యే
కరణి సహించవచ్చు నదిగాక మదాత్మజ నాహరించు దు
ష్కరుని దదీయకింకరనికాయముతోడ వధించి సూనృత
స్ఫురితవచోక్తి నిల్పి కురుసూనున కంగన నిత్తు రూఢిగాన్.

251


మ.

ఇపుడే రక్కసుకోన కేఁగి సకలోర్వీశుల్ నిరీక్షింప పా
పపుదైత్యాధము దుర్మదం బణఁచి శుంభచ్ఛౌర్యధుర్యుండనై

చపలాక్షిం గొనిదెత్తు నం చని యలక్ష్యం బొప్ప భాషించు ధీ
నిపుణున్ రాముని జూచి శౌరి నగుచున్ నేర్పొప్పఁగా నిట్లనెన్.

252


క.

రామా నీవచనంబుల
కేమనగలవాఁడ విహిత మెంచక చెలియ
ల్వేమాఱు వేడ లఘుగతి
గా మునువిదళింప మేలుకలుగునె మనకున్.

253


సీ.

మునుమున్నె నీకూర్మపుత్రి నిత్తు నటంచు
        భగినితో నమ్మికల్ బలుకు టేమి?
యింతలో కురురాజు హీనసంపద గోరి
        వాని కాత్మజ నీయఁ బూను టేమి?
చెలియ తిండికి పంచ జేరియున్న దటంచు
        కర్ణకఠోరముల్ గడవు టేమి?
తతపరాక్రమపాండుతనయుల నిందించి
        పరుషోక్తు లొకకొన్ని బలుకు టేమి?


తే.

తలఁపులో కోర్కె లీభంగి దప్పెననుచు
డెందమున గుంది కొందలం బందు టేమి?
యఖిలవిధముల దైవప్రయత్నమునను
జెడిన కార్యంబునకు జింత సేయు టేమి?

254


మ.

వనిత నొసంగకన్ బరుషవాక్యము లీవు వచించుటల్ నికే
తనమును వెళ్ళద్రోయుటగదా! మఱి వేఱవమాన మున్నదే
యని తనయుండు దాను వికటాటవులం జరియింప దానవుం
డనుజునకున్ సహాయగతి యయ్యె నతం డవిజేయుఁ డౌటచేన్.

255


గీ.

రావణునకన్న మాయాధురంధరుండు
వాని నిర్జించెద నటంచుఁ బూనె దీవు
మనలనందఱ మార్కొని మడియజేయ
కింక నీమేర నిలిచిన నింతె చాలు.

256

చ.

సతి వెత జెందుటల్ సుతు విషణ్ణతయు న్వినెనేని యర్జునుం
డతులితరోషభీషణలయాంతకునింబలె కౌరవాన్వయ
ప్రతతి నొకుమ్మడిం గవిసి భండనగాండివముక్తకాండఖం
డితులను జేసి మీకిక కడిందిమగంటిమి జూపకుండునే.

256


క.

ఒంటరిగ నిలిచి మును ము
క్కంటిని యెదిఱించి యుగ్రకాండము గొని బల్
బంటుతన మెనయు విజయుని
కంటికి కౌరవులు మశకగతిగారె గనన్.

257


క.

ఒకఁడె ఘటోత్కచుఁ డీగతి
తికమక నొందించె కురుపతిన్ భీమసహా
యకుఁ డగుచు ననికి దొరకొన
నిక విజయున కెదుట నిల్వ నెవ్వం డోపున్.

258


క.

నీవు ఘటోత్కచు నాశ్రమ
మేవిధమున జొచ్చి వాని కెదిరింపఁదరం
బీవేళ వానిమాయలు
బోవిడిపించుకొని సాగిపోవ వశంబే.

260


ఉ.

వాని నెదిర్పఁగా విధిశివప్రముఖుల్ దగ రన్నచో చలం
బూని కులాధముండగు సుయోధనుపై మరులొంది యార్యస
న్మానుల పాండుసూనుల నమర్షణబుద్ధి పరాభవించు టె
ట్లైన ననర్హ మంచు మతియందు దలంపక నుంటఁ బాడియే.

261


మ.

మృగధూర్తంబుల గాంచి సింగములు బల్మిన్ వంచనల్ జేయు న
ట్లుగ నీవిట్టి దురాత్మకౌరవుల మేలుం గోరి పాండవ్యులం
బగచే వంచన జేసి సూనృతము తప్పందోఁచుటంగాదె యి
ప్పగిది న్యాదవసత్తముం దగని యాపద్భ్రాంతులై పాఱుటల్.

262


చ.

పలికినమాట బొంకపడు పాతకమున్ మనయందు గల్గి యా
చెలియలి నేర మెంచుటకు జెల్లునె దోర్జయశీలు లాత్మజుల్

గలిగిన వీరపత్ని తనుగావున ని ట్లొనరించె దానవుం
డలఘుపరాక్రముండు భవదాశయ మించుక సాగనిచ్చునే.

263


తే.

దానవుఁడు బూను మాయావిధానములకు
ప్రస్తుతోద్యు క్తసత్కారఫణితి నెఱిఁగి
యుపమచే సంధి గావించు టుచిత మనుచుఁ
బలుకు హరితోడ హలి మాఱుపలుకకుండె.

264


మ.

అవుగా దంచని మాఱుబల్కని ప్రలంబారాతిభావంబు దై
త్యవరేణ్యుండు మదిం గ్రహించి హరిసత్యాలాపముల్ మెచ్చి కౌ
రవనిశ్శేష మొనర్పకున్న హలిసంరంభంబు బోవీడ డం
చు వియన్మార్గమునం దదృశ్యగతుఁడై శుంభత్రృతాపంబునన్.

265


మ.

పునరుత్పాత మొనర్ప దైత్యుఁడు నభోభూగర్భము ల్నిండ చి
ట్లన చీఁక ట్లొనరించి యార్చి భువనాటోపంబు దీపింప ధా
రుణి యక్కుమ్మరిసారెరీతి పలుమాఱుం దిర్దిరం ద్రిమ్మరం
గనులంజూడ భయంకరాకృతిని భూకంపంబు గల్పించియున్.

266


మ.

దివి యొక్కుమ్మడి గ్రుంగి పైఁబడినరీతిం జంద్రమాదిత్యు ల
వ్యవధిం తారలతో ధర న్మెఱుఁగుఛాయన్ సప్తసింధువ్రజం
బవియం జొచ్చినభంగి, జాజ్వలితకీలాభీలదావానల
స్రవకల్పాంతములీల నొప్పె సుర లాశ్చర్యంబుగా జూడఁగాన్.

267


చ.

కినుకను దత్క్షణంబె నిజకింకరకోటిని బిల్వ వార లు
గ్రనిరతి రోషభీషణముఖంబుల నద్భుతశూలధారులై
జనవరసేనలం గవిసి సాహసబాహుసమగ్రగశక్తి బె
క్కొని వడినార్చి బేర్చి 'శలగోశలగో' యని గ్రుమ్మి రొక్కటన్.

268


గీ.

దవిలి బలకృష్ణు లిరువురు దక్క నిఖిల
కరితురంగమరథసైనికానికాయ

సహితముగ రాజవరులను చక్కడంచి
దనుజభటు లిట్లు బీభత్స మొనర జేసి.

269


చ.

పురమున దైత్యకింకరులు బోరున జొచ్చి శుభాలయంబునం
బరగు సమస్తవస్తువులు బల్మి పయోనిధి బాఱవైచి యు
ద్ధురగతి పౌరులం దఱిమి దోర్బలదుర్జయులై గదాహతిం
దురగరథేభసైన్యముల ద్రుంచి చికా కొనరించి రెంతయున్.

270


సీ.

ఒకచోట సైంధవుసిక చేనొడిసిపట్టి
        లోపోటులను గ్రుద్ది యేపుమాపె
నొకచోట సౌబలుముఖము క్రిందుగ దీసి
        కొప్పుబ ట్టీడ్చి చీకొట్టి విడిచె
నొకచోట భూరిశ్రవుకరమ్ములు బిగబట్టి
        బడద్రోసి చెంపలు బగలవైచె
నొకచోట బాహ్లీకు కుత్తుకబట్టి గెట్టించి
        మెదలనీకుండ మేన్ జిదిమి మెదిపె


గీ.

నొక్కచోటను గురుసూను నొడిసిపట్టి
కదలనీకను ఱాళ్ళ మోకాళ్ళ బొడిచె
నొక్కయెడ కర్ణుకర్ణంబు లూత జేసి
మెడలపైకి ధువాళించి మేను జించె.

271


చ.

మును ద్రుపదాత్మజన్ నృపసమూహము జూడఁగ మానభంగ మీ
వొనఱుచు పాపజాతి విదిగో ప్రతికారము ప్రాణభంగ మే
నొనరుతు నంచు దైత్యభటుఁ డొక్కరుఁ డుగ్రత దుస్ససేనుతో
బెనఁగుచు ప్రాణ ముడ్డుకొన భీకరముష్టి నడంచె ఱొమ్మునన్.

272


చ.

బలువున మాయజూదమని బన్ని యుధిష్ఠిరు సర్వసంపదల్
గెలిచి కురుక్షితీశునకు కేవల మాప్తతఁ బెండ్లిపెద్దవై
నిలిచితివే యటంచు శకునిం గని యొక్కసురారికింకరుం
డలఘుతరాశనీతులితమౌ కరముష్టి నడంచె నుగ్రుఁడై.

273

మ.

అమరద్వేషి యొకండు ద్రోణుని కృపాచార్యు న్విలోకించి హీ
నమతిం బెండ్లి గనుంగొనందలఁచి యానందంబున న్వచ్చి క
ష్టరములం బొంది కులాభిమానములు నాశంబొంద హైడింబుచే
సమయం దుస్సమయంబు చేకూఱెగదా సౌజన్యులౌ మీ కిఁటన్.

274


చ.

ముదిమికి ముప్పువచ్చె పెనుమూర్ఖు సుయోధనుమైత్రి నెమ్మది
న్వదలక పొట్టకూటికిని వానికడ న్వసియించు టింక మీ
కిది తగదంచు బల్కి యొకయిఱ్ఱి కళాసము ఫెళ్ళుఫెళ్ళునన్
విదిలిచి పెంటపై బఱచి వేవసియింపుఁ డటంచు బల్కియున్.

275


చ.

ఒకయెడ డాగియుండిన సుయోధనసూనుని బట్టి తెచ్చి యో
వికలితచిత్త పెండ్లిగొనువేడుక వచ్చినవాఁడ వీగతిన్
మొకమిటు నేలవై చికొని మూల్గెదు నీ కడుపాఱ కూటికిం
బొకబొక బొక్కునీకు పువుఁబోణుల సౌఖ్యము తక్కువాయెనే!

276


చ.

ప్రియమున గోరి తెచ్చుకొను పెండ్లికుమారుఁడ వేమొ నీ వనా
శ్రయగతి నిట్లు దుఃఖవివశంబున బ్రేలుటకంటె చచ్చుటే
నయమని తోచెడిం బ్రతికి నల్గురిలో తలనెత్తి యేగతిం
బ్రియమతిఁ జూడనోపెదవు పెండ్లి పెటాకులు జేసి లక్ష్మణా.

277


క.

ఈపగిది విలయకాలవి
రూపాక్షునివలె ననేకరూపముల మహా
టోపమును జూప బలుఁడు భ
యాపాదితుఁ డగుచు హరిగృహంబున కరిగెన్.

278


మ.

చని నిశ్చేష్టితుఁడై నిలంబడిన యాసంకర్షణుం జూచి చ
య్యన దామోదరుఁ డంజలీకరతలుండై స్వామి విచ్చేయు కా
రణ మేమంచు వచింపగాఁ విగతసంరంభంబునం గద్గద
ధ్వని నిట్టూర్పులు బుచ్చుచుం బలికె చింతాక్రాంతచేతోగతిన్.

279


ఉ.

కూఁతురు మాయమయ్యె జనఘోష దిగంతము నిండె వజ్రని
ర్ఘాతశిలాతిపాతముల కౌరవసైన్యము మ్రొగ్గి మగ్గె నీ

రాతిరి తెల్లవారుట దురత్యజమై మదిఁ దోఁచె దీని నే
రీతి శమింపజేసేదొ హరీ! నీవుగాక మఱెవ్వ రీధరన్.

280


చ.

చెలిమిని మున్ను దాస్యములు చేకొనలేదె ఫణీశ్వరాకృతిం
గలిగిన నాతొ రెండవయుగంబున శ్రీరఘురామమూర్తివై
యలరి సహోదరప్రియము లన్ని విధింపవె నేఁటి కగ్రజా
ఖ్య లభితమయ్యెనంచు భవదాజ్ఞ మరల్ప స్వతంత్రమున్నదే!

281


చ.

అవని నశక్తునిం భుజబలాధికు జేయఁగ దోర్బలాఢ్యు ని
ర్జరవగతుఁగా నొనర్ప నతిజాడ్యుని పూజ్యుని జేయ బూజ్యునిం
భవమతిగా నొనర్పఁగ భవన్మహిమ ల్గణుతింప నీరజో
ద్భవభవశక్రముఖ్యుల కభావ్యము గాదె సరోజలోచనా!

282


క.

ఇది యేమొ తెల్పినానని
మది సంశయమిడక మత్కుమారీమణి నిం
పొదవ నగుపఱుచి యీదు
ర్మదదనుజాటోప మణఁచి మనుప దలఁపవే!

283


మ.

అనుచుం దీనముఖాబ్జుఁడై పలుకు తాలాంకు న్విలోకించి యి
ట్లనియెన్ స్వామిటులాడనేల భవదీయాజ్ఞం దలందాల్చి తో
చినరీతి న్వినిపింతు దేవర లుపేక్షింపంగ నూహింప కి
ట్లనుకూలించితిరేని సర్వజనతాహ్లాదంబు బ్రాపింపదే.

284


మ.

మొదల న్నేవినిపించు నీతములనేమో చిత్తమం దన్యథా
స్పదమై తోఁచి కురుక్షితీశ్వరుని సంపన్మోహివై సత్మళా
భ్యుదయుం డయ్యభిమన్యుఁ డెవ్వడని కోపోద్వృత్తిచే సోదరి
న్విదళింపం జెడుబుద్ధి నీకొదవె భావిశ్రీయశోహానికిన్.

285


ఉ.

దానికి పార్థనందనుఁడు దల్లిని దోడ్కొని బోవ కానన
స్థానమునం ఘటోత్కచుఁడుఁ దారసిలం భవదుల్లసోక్తుల

మ్మానిని దెల్పఁగా నతఁ డమర్షత నీర్ష్యను బూని యభ్రపం
ఛానము జేరి కౌరవుల హుంకృతి బాపె నదృశ్యరూపుఁడై.

286


ఉ.

తల్లియు తమ్ముడు న్వెతలఁ దల్లడమందుటచే ఘటోత్కచుం
డుల్లమునన్ సహింపక శుభోత్సవభంగ మొనర్చె కూఁతు మే
నల్లున కిత్తునంచు నికనైన దృఢస్థితి నీవు బల్కితే
నుల్లసితాత్ముఁడై దనుజుఁ డుర్విని దిగ్గి శమించు నింతయున్.

287


చ.

సలలితమౌ మదుక్తికి బ్రసన్నుఁడవై యెలుఁగెత్తి దానవుం
బిలచి తదాశయం బెఱిఁగి బ్రీతి సమస్తజనానుకూలని
ర్మలమతి నాత్మపుత్రి నభిమన్యునకుం భగినీమనోరథం
బలవడ పెండ్లిసేయుట నయం బభయంబు ప్రియం బికెన్నిఁటన్.

288


ఉ.

వ్యర్థమనీషుఁ డౌ కురుగులాత్మజు నర్థి వరించుకంటె ని
ప్పార్థతనూజుఁడే మనకు బాధ్యుఁడు సాధ్యుఁడు నేఁటికైన యీ
యర్థము మీఱ లియ్యకొని యవ్యవధి న్సమకూర్చుటే మహా
సార్థకమంచు దోఁచె మది సంశయమేల ప్రలంబభేదనా.

289


మ.

అనుచున్ శౌరి వచించు సజ్జనహితంబౌ నీతివాక్యంబులన్
విని డోలాయితబుద్ధి కొంతతడవు న్వీక్షించి గోవింద నీ
కనుకూలం బెటు గల్గునో యట జయం బౌ టబ్రమే లోకవ
ర్తనవైశద్యవిభాగనిర్ణయకళాధారుండ వీ వౌటచేన్.

290


క.

ఈవిధమున ననుకూలుం
డై వచియింపుచు నిజానుజానుమతి సుహృ
ద్భావమున నాఘటోత్కచు
నావాహనజేయ నిట్టులని యెలుఁగెత్తెన్.

291


ఉ.

ఓయి ఘటోత్కచా! దివి మహోగ్రపరాక్రమశాలివై జయం
బీయెడ జెంది తీపు తమి నింకిటమీఁద శమించి నీయభి

ప్రాయ మ దెట్టిదో! తెలియఁబల్కితివేని ఫలించు దీన నే
మో యనఁబోకు నీకు మదిమోద మొనర్చెద రమ్ము నమ్మికన్.

292


ఉ.

దానికి దానవుం డతిముదంబున రాముఁడు చేతఁజిక్కె నె
ట్లైన మదీప్సితంబు ఫలియించె నటంచు గణించి పల్కె నో
హో నలినాక్ష! యో హలి! మదుత్కటరోషము నెన్న నేల దు
ర్మాని కురుక్షితీశు నవమానము జేయదలంచి తింతియే
గాని జగద్ధితాత్ము లవికారులు మీ కొకకీడు కూర్తునే.

293


శా.

ఐనా నామది నొక్కకోర్కె గల దెట్లంటేని నేఁ డీకురు
క్ష్మానాథున్ హతశేషసేనలను వీకం ద్వారకాప్రాంత మెం
దేని న్నిల్వఁగనీక బోఁదఱిమితే యేనై భవత్సన్నిధిం
ధ్యానప్రీతిని విన్నవింతు నపరాధక్షాళనార్థోక్తులన్.

294


చ.

అనుచు నదభ్రవిభ్రమమహాభ్రరవభ్ర మనభ్రవీథి భో
రున వడిమ్రోయఁగా విని కురుక్షితనాథముఖావనీశు లా
ర్తిని హతశేషసైన్యవితతిన్ విడనాడి వినిర్గతావలే
పనమతిఁ దా మొకం డొకని బట్టుక నేగిరి హస్తినాపురిన్.

295


మ.

విరథు ల్వీతనిజాశయుల్ విగతదోర్వీర్యు ల్విహీనాయుధుల్
విరసోద్యోగులు విప్రయత్నమతులై నేపాఱుభూపాలి నం
బరమందుండి ఘటోత్కచుండు గని కోపంబెల్ల బోకార్చి గ
హ్వరికిం డిగ్గి హరిన్ హలాయుధుని డాయన్వచ్చి నమ్రాస్యుఁడై.

296


మ.

నిటలన్యస్తకళాంజలుం డగుచు సాన్నిధ్యంబునం జేరి ని
ష్కుటిలప్రీతి పునఃపునఃప్రణమితాంగుండై సభక్తిస్ఫుర
ద్ఘటనం బల్కి నిజాపరాధములు సాకల్యంబు బోకార్ప ధూ
ర్జటిజూటానటదభ్రనిర్జరచరజ్ఝంకారవాచార్భటిన్.

297

శా.

వందే సుందర మిందుబింబవదనం వందారుబృందావనా
నందస్యందిమరందతుందజలజస్పందాక్షవీక్షాంచితమ్
కందాభం దరకుందకంధరరదం నందాదిమందారకం
మందోద్భాసితమందహాస మిహ గోవిందం ముకుందం పరమ్.

298


సీ.

జయయదుకులదీప జయపరాత్పరరూప
        జయధర్మసంస్థాప జయరమాప
జయరుక్మిణీలోల జయజగత్త్రయపాల
        జయచంద్రమయచేల జయసుశీల
జయపాతకవిభంగ జయసత్కృపాపాంగ
        జయపతంగతురంగ జయశుభాంగ
జయపుండరీకాక్ష జయదానవవిపక్ష
        జయభక్తజనరక్ష జయకటాక్ష


గీ.

జయకుశేశయనయన భుజంగశయన
జయపురంజయమిత్ర శశ్వచ్చరిత్ర
జయశయాంచితచక్ర చక్రహతనక్ర
జయవిజయశీల గోపాల సరసఖేల.

299


క.

పరుఁ డవ్యయుండ వాదిమ
పురుషుండ వచిచ్చిదాత్మభూతాంతర్భా
సురుఁ డవతర్క్యుఁడ వజుఁడవు
పరమేశుఁడ వైన నిన్ను బ్రణుతింతు హరీ.

300


సీ.

ధర్మార్థకామసంతతివివర్ధనుఁడవు
        వివిధరాగద్వేషవిరహితుఁడవు
కైవల్యసంధానకారణభూతుండ
        వారూఢతత్వనియామకుఁడవు
నఖిలసముండ వాద్యంతశూన్యుండవు
        నిరతప్రియాప్రియవిరహితుఁడవు

నతినిగ్రహానుగ్రహసమర్థుడవు మహా
        మహుఁడ వాశ్రితదృశ్యమానమూర్తి


తే.

వట్టి నీకు బ్రణామంబు లాచరింతు
త్రిభువనక్షేమశతశతాదిత్యధామ!
రూపజితకామ! నిత్యకారుణ్యసీమ!
సద్గుణస్తోమ! యాదవసార్వభౌమ!

301


సీ.

తాపత్రయాభీలదావాగ్ని జల్లారు
        నేదేవు గుణరసాస్వాదనమున
సలలికసకలార్థఫలలాభము లొసంగు
        నెవని శుభాంగసమీక్షణమున
తాత్త్వికభువనోన్నతిత్వంబు నొందించు
        నేశౌరి చరణసేవేచ్ఛవలన
కౌటిల్యతనుబంధనంబుల విడజేయు
        నేఘను నామోక్తహితమువలన


తే.

నట్టి నీ కేను వందనం బాచరింతు
శ్రీమనోహరి! పోషితాశ్రితవిసారి!
దనుజకులహారి! గరుడవాహనవిహారి!
దోషసంహారి! సుందరవేషధారి!

302


వ.

అని యివ్విధంబున నవ్వృకోదరనందనుం డమందానందకందళితమంద
స్మితముఖారవిందంబున మరందబిందుబృందమ్ములు జిందుచందంబున
వీనులవిందుగా నందనందను నభినందించి ముందటం జెన్నొందు కాళిందీ
భేదను సుందరపదారవిందంబుల కందంద వందనం బాచరించి యిట్లనియె.

303


సీ.

మొదల శ్రీమదనంతమూర్తివై దీపించి
        పిదప రామానుజాభిధత గాంచి

యిఁట రౌహిణేయప్రకటనామము వహించి
        ముసలహలాయుధముల గ్రహించి
వితతకాళిందినీభేదన మొనరించి
        కపటప్రలంబాదిఖలుల ద్రుంచి
యకళంకగతి నచ్యుతాగ్రజాఖ్య రహించి
        రేవతీసతిని వరించి మించి


తే.

నిత్యకరుణామయుండవె నిను గుఱించి
ప్రాంజలి యొనర్తు నన్ను నిప్పాటనుంచి
దయ నిరీక్షించి మదపరాధము లణంచి
కావవే నన్ను నీవానిగా గ్రహించి.

304


చ.

తెలుపఁగనేల వేఱె భవదీయశమక్షమమందు లోకని
ర్మలతరకీర్తిశాలి యభిమన్యుఁడు మీ కతిబాధ్యుఁ డాతనిం
దొలగఁగ ద్రోఁచి కౌరవసుతు న్వరియించుటచే ననర్థ మి
ట్లలవడె నింకనైన భవదాత్మజ నల్లున కిచ్చు టొప్పగున్.

305


గీ.

ప్రీతి నీరీతి వినుతించు భీమసూతి
సద్వినయ మెల్ల మది నిండి సంతసిల్లి
కార్య మూహించి వానిహృద్ధైర్య మెంచి,
బలికె నొకమాట తనదు వాక్ప్రౌఢినాట.

306


మ.

దనుజాధీశ్వర నీమనోరథమె సిద్ధంబయ్యెగాదే! సుయో
ధనముఖ్యుల్ భవదాచరత్ప్రబలబాధాబద్ధులై భూఃపలా
యనులై రింతటనైన సంభరితశాంతాత్ముండవై కన్యకా
మణి నెచ్చోటను డించిరో! తెలిపి నైర్మల్యాత్ములం జేయవే!

307


చ.

మఱి నివు గోరినట్టు లభిమన్యున కిచ్చుట తెచ్చుకోలు చు
ట్టఱికముగాదు సందియపడం బనిలే దది దైవయత్న మీ

త్తెఱఁగున సంభవించె నిక దీర్పఁగ నేరితరంబు భావి ని
ప్పరిణయ మీవొనర్పఁదగు భావమునం దనురాగ మేర్పడన్.

308


తే.

అన్న! యభిమన్యుఁ డెచ్చట నున్నవాఁడొ?
యువిద శశిరేఖ నెట దాచియుంచినావొ?
వార లిటువచ్చుతెఱఁగు భావమున దలఁచి
నీయభిప్రాయమున బెండ్లి సేయవయ్య.

309


చ.

అని బలభద్రుఁ డాడెటి ప్రియాదరణోక్తుల నాదరించి య
దనుజవరేణ్యు డిట్టులనె తావకపుత్రిక నీక సోదరిం ,
గినిసి నిరాకరించుటకు కేవలదైన్యవిషణ్ణచిత్తయై
తనయునితో మహాటవిపథంబున నేగ మదాశ్రమంబునన్.

310


చ.

కనుఁగొన మత్సహోదరుఁడుగా సురసంయమి తేటజేయ, నే
విని భవదుల్లసోక్తులు సవిస్తర మంబ వచించుట ల్మనం
బున సహియింపలేక పువుఁబోణి నదృశ్యత నర్ధరాత్రి గై
కొని జవత న్సుభద్రకడకుం జని కోడలి నప్పగించితిన్.

311


క.

అంతట విసుగక కౌరవ
సంతతి నీగతి మహేంద్రజాలసుశక్తిం
గంతులు వేయించుట
వింతలు గల్పించితిం దివిం భువి బెగడన్.

312


క.

నీమేనల్లుఁ డతం డగు
మామలు మీ రగుదు రతని మాన్యత జేయన్
మీమీర లేకకృతి గొన
మామావ్యాపారములు సమర్థములగునే!

313


తే.

సకలవిధబాధ్యులైన మీసముఖమునను
మేము విజ్ఞాపనము జేయ నేమిఫలము

కడకు నూనియ నూవు లేకంబెకాని
గాండ్లవాఁ డొక్కరుఁడె తేఱగాఁడు కాఁడె.

314


క.

పంచాస్యభోగ్యవస్తువు
కొంచెపుశునకము భుజింపగోరినగతి గా
మించి యభిమన్యుపత్ని న
కించనుఁడగు లక్ష్మణుఁడు సుఖించఁగ వశమే!

315


క.

నీమేనల్లుఁడు సుత భగి
నీమణి యీమువ్వు రెనసి నిరుపమకుతుక
శ్రీమీర మదాశ్రమమున
సేమంబున నున్నవారు చింతిలనేలా!

316


మ.

భవదుత్సాహము మీఱఁ బౌరజనసద్బంధుప్రయుక్తంబు వై
భవలీలం ఘనతూర్యనాదములు మ్రోవన్ వే మదీయాశ్రమా
టవి కేతెంచి సహోదరీమణికి వేడ్కం జెంద కల్యాణ మ
వ్యవధిం జేయఁగ దోడితె మ్మఖిలలోకానందసంధాయివై.

317


తే.

తమ కనన్యుఁడు ఫల్గుణాత్మజుఁడు గాన
వేఱె మాబోఁటు లిది విన్నవింపవలెనె
తల పెఱుంగక నేజేయు ధౌర్త్యములకు
మదపరాధసహస్రముల్ మాన్పవలయు.

318


చ.

అని వినయంబునం దనుజుఁ డాడిన మాటల కచ్యుతాగ్రజుం
డనుమతిఁ బల్కె నీయభిమతార్థము మా కనుకూలమయ్యెఁ గా
వున నిక మాసుభద్ర కిది బోధపడ న్వినిపించి కౌతుకం
బెనయఁగ జేయు కార్యకృతహేతుసమర్థుఁడ వీవె గావునన్.

319


ఉ.

భీమతనూజు యీజగదభేద్యు సుయోధనుశ క్తి నీదుమా
యామహిమం జయించి విజయం బిట జెందితి వింకమీఁద సు

త్రామతనూభవాత్మజు యథాశుభసత్కృతి నిందుఁ దోడితే
నేమఱుదెంతు మీవచటి కేగు విలంబము మాని జాగ్రతన్.

320


మ.

అని వీడ్కొల్పిన వందనం బిడి నిలింపారాతి కౌతూహలం
బున నభ్రంబున కుగ్గళించి దిశ లబ్దుల్ మ్రోయ కోలాహల
ధ్వని గావించి యఱక్షణంబున నిజస్థానంబునం జేరి చే
సిన గార్యంబు సవిస్తరం బెఱుఁగజేసెం దల్లికిం దోడుకున్.

321


సీ.

శశిరేఖ నిటఁ బ్రవేశము జేసి తాదృశ
        రూపంబు బలునింట జూపుటయును
తుది ఘోరవికృతాకృతులు బన్ని లక్ష్మణు
        నగ్నాంగమున బాఱనడుపుటయును
దదుపరి కన్య నంతర్ధాన మొనరించ
        నచ్యుతాగ్రజముఖ్యు లడలుటయును
దాఁజేయు మాయాకదనమున కతిరథ
        సమరథసైన్యము ల్సమయుటయును


తే.

నార్తి బలభద్రుఁ డాహరి నడుగుటయును
దెలిసి యతఁ డియ్యకొనఁగ బోధించుటయును
బూసగ్రుచ్చినరీతి నద్భుతముగాను
సర్వ మెఱిఁగించుచున్నట్టి సమయమునను.

322


చ.

తెలతెలవాఱ తారకల దీప్తులు రాలె రథాంగకోటి నె
వ్వలు మదిలోన దూఱె, కృకవాఙ్నినదంబులు మీఱె, సారసం
బుల ముద మారె, చీఁకటులు భూధరగర్భములందు దూఱె, క
ల్వలయెడ నిద్ర జేరె, రవి ప్రాక్శిఖరిన్ రుచిదేరె తోరమై.

323


మ.

హిమభానుం డుదయంబునంది విధియయ్యె న్మున్ సువర్ణద్యుతి
న్విమలుఁడై యటమీఁద సోముఁ డనఁగా వెల్గొందె శుభ్రప్రభం
గ్రమమొప్పన్ హరిగాన నైల్యరుచి సంకాశించె మూర్తిత్రయా
ఖ్యమహి న్సత్యము సత్యమంచు కృకవాకధ్వానము ల్మోయఁగన్.

324

క.

సతతము సుస్నేహాంచిత
గతిని దమంబెల్ల నడఁచి కలితనిజతపః
స్థితిచే సాత్విక మెనసిన
గతిగా ధవళిమను దీపకళికలు దోఁచెన్.

325


చ.

గుఱుతుగ తమ్మిపూవనెడు కుందెనలో సుమనోరజంబనే
పరిమళరాజనంబులు ప్రభాకరధీధితికాంత లుంచి సం
బరమున ఝుంకృతిధ్వనుల పాటలు బాడుచు దంచుచున్న బం
ధురముసలప్రభాగరిమ దోఁచె తదుత్థితబంభరధ్వనుల్.

326


క.

సంతతదోషాకరుఁడు న
నంతమహారాజ్యపదవి నతిమత్తుండై
యంత నధోగతి డిగెఁ రా
జ్యాంతే నరకం ధ్రువం బటన్న విధమునన్.

327


క.

రాజీవాక్షుఁడు బలుఁ డే
యోజను బరిణయ మొనర్చిరో యనుచుఁ దపో
భ్రాజిష్ణుఁ బైలునిం, జన
మేజయుఁ డవ్వలి కథాప్రమేయ మడుగుటన్.

328

ఆశ్వాసాంతము

క.

లక్ష్మీపదలాక్షారస
సాక్షాచ్ఛ్రీవత్సవక్షసరసిరుహాక్షా
రక్షోగణశిక్షాచణ
రక్షితఫాలాక్షఖలమురప్రతిపక్షా.

329

సుమగుళుచ్చబంధము

TALANKA-NANDINI-PARINAYAMU.pdf

సారాచారా సౌరాధారా
మారాకారా పరాత్పరా
పారాపారా గారాశూరా
హీరాహారా ధరాధరా!

(5-330)
.

సుమగుళుచ్ఛబంధము—

సారాచారా! సౌరాధారా!
మారాకారా! పరాత్పరా!
పారావారా! గారాశూరా!
హీరాహారా! ధరాధరా!

330


మాలిని.

కుమతకులవినాశా! కోటిసూర్యప్రకాశా!
శమదమగుణకోశా! సాధుచేతోనివేశా!
దమితతతపలాశా! దానవారాత్యధీశా!
విమలిననిజదేశా! [4]వృషగిరిశ్రీరమేశా!

331


మ.

ఇది శ్రీశేషధరోపమానసుషమేభేంద్రారిహృత్సర్వబో
ధదశ్రీమత్కనగంటిగోపవిభు బద్ధ శ్రీమఱింగంటికో
విద శ్రీరాఘవవర్యసోదరసుధీవిద్వన్నృసింహార్యశం
వదతాలాంకసునందినీపరిణయాశ్వాసంబు పంచాఖ్యమై.

332

గద్య
ఇది శ్రీమచ్ఛేషధరాధర సౌధవీథీవిహరణ వేంకటరమణ
చక్షుర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్యల
క్షణానవద్య విద్యావిలాస శ్రీనివాసగురు
చరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య
కల్యాణసాకల్యమౌద్గల్యగోత్ర పవిత్ర
భావనాచార్యపుత్ర పర్వత్రయకైం
కర్యవిధాన వేంకటనృసింహాభి
ధానప్రణీతంబైన తాలాంక
నందినీపరిణయం బను
మహాప్రబంధంబునందు
పంచమాశ్వాసము.

333
  1. ఈ పద్యము తరువాతనుండి ‘మును శుకరాజమున్— ’ అను పద్యము
    వరకు 'లి' లో పూర్తిగా లేవు. 'తా'లో అసమగ్రములుగా గలవు.
  2. లిఖియించు జలముపై లిపులమాడ్కి
  3. వెలయాలిపై మోహవేదనగతి - మూ
  4. ఈ భాగమున గణభంగము. ‘విస్తృతాద్రీంద్రవాసా’ అనిన సరిపడును.