తాలాంకనందినీపరిణయము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాలాంకనందినీపరిణయము

షష్ఠాశ్వాసము

క.

శ్రీతరుణీతరుణోరో
జాతాలయనీతపూతచందనవక్ష
స్స్ఫీతశరజాతజాతసు
గీతప్రియచేతశేషగిరిమృగపోతా.

1


క.

చిత్తావధాన పైలుం
డత్తఱి జనమేజయున కనంతకథ వా
గ్వృత్తమది దెలియఁబలికె వి
యత్తటినీవీచికామహత్తరఫణితిన్.

2


చ.

అపు డరుణోదయం బగుట నంతకుమున్నె ప్రభాతగీతివా
ఙ్నిపుణనినాదమోదితమనీషులునై బలకృష్ణు లా సుశు
ప్తి పరవశంబులం గలంకదేఱి సమంచితకాల్యకృత్యముల్
విపులమతి న్సభ క్తి నెరవేర్చి సభాభవనంబుఁ జేరియున్.

3


తే.

వన్నెలజిలుంగుతాప్తాతివాసిపైన
సొన్నమఖమల్గలీబపై బన్నియున్న
దక్కియలనాని కొలువుండి రక్కజముగ
హితపురోహితసుతమిత్రతతులు గొలువ.

4


సీ.

ఒకచోట నృత్యగాయకకూట మనురక్తి
        కాలతాలక్రియాగతి నటింప,
నొకవంక విద్వాంసు లకళంకగతి నహం
        పూర్వ మహంపూర్వముగ వచింప

నొకక్రేవ సంతతోత్సుకభావపౌరాణ
        కథకులు చిత్తవైఖరులు దెలుప
నొకయోర మాగధాదికవార మతిభక్తి
        జయవిజయీభవచ్చాయఁ బొగడ


గీ.

మేలిమికడాని నిండుపేరోలగమున
శౌరితోఁ జేరి కొలువుండి సీరపాణి
సుమధుమధురసుధారసస్ఫూర్తి లహరిఁ
దోలు చిట్లని సాత్యకితోడ బలికె.

5


చ.

మునుపటినుండి నీకు యదుముఖ్యులకుం బ్రియమైనరీతిగా
మనశశిరేఖ నిప్పు డభిమన్యున కీయఁగ మన్మనోరథం
బెనసె ఘటోత్కచాశ్రమము కేగి వధూవరయుక్త మిందు స
గొయ్యన గొనివచ్చి యిప్పరిణయం బొనరింత మనన్యభావనన్.

6


క.

జాగేల పురి నలంకృతి
గాఁ గయిచేయుటకు జాటఁగా వలయును వే
వేగమున నిఖిలబంధుస
మాగత మొనరింపు నీవనన్యమనీషన్.

7


గీ.

కానిపో నిదొకటి కళ్యాణమని మున్ను
పుర మలంకరింప బొసఁగ నిట్లు
రక్తజలపురీషసిక్తమౌట పునఃప్ర
యత్న మొనరుటొప్పు నూత్నరుచిని.

8


క.

అని యుక్తరీతి దెలిపిన
సనయోక్తుల నాలకించి సాత్యకి మదిలో
ననురక్తి నీయఁగొని దా
పునరుక్తి వచింపకం బ్రమోదహృదయుఁడై.

9


చ.

పురజనకోటికిం దెలియ భూరితర్భాటదుందుభీధ్వనుల్
మెఱయఁగ జేసి పట్టణ మమోఘశుభాప్తి నలంకరించుఁ డి

త్తఱి (మన)బాలభద్రికి హితంబుగ నయ్యభిమన్యశౌరికిం
బరిణయమెల్ల దాకొనియె పౌరజను ల్వినఁగా దగుం జుమీ.

10


తే.

అవిన పౌరులు కర్ణరసాయనముగ
విని యఖర్వముదంబు హృద్వీథి బర్వ
కోటలను పౌధపంక్తులఁ గ్రొత్తడముల
విపణివీథుల శృంగారవిధు లొనర్చి.

11


మ.

భవనములన్ వితర్డుల సభాస్థలుల న్విపణివ్రజంబుల
న్నవఘనసారసిక్తమృగనాభిజలంబుల జిల్కి మేలిక్రొం
బవడఁపు గుజ్జుఁగంబములఁ బచ్చలతోరణముల్ ఘటించి సాం
కవరసకుంకుమాగురుసుగంధిలధూపము లుంచి రెత్తయున్.

12


సీ.

సాంకవపాటీరపంకమేళనమైన
        కాశ్మీరచూర్ణంబు గలియ నలికి
పన్నీట ముత్తెంపుసన్నంపుసున్నంపు
        టలుకుచిలుకులు రంగుదొలుక జిలికి
కమనీయకస్తూరికాకర్దమము నిండు
        సాదుపట్టెల సాలు సంఘటించి
కర్పూరచందనకలితమౌ గొజ్జంగి
        పూవునీటను కలాపులను జల్లి


తే.

ముంగిట బయళ్ల ముత్యాలమ్రుగ్గు దీర్చి
బంగరుజిలుంగుటనఁటిగంబముల నిలిపి
తళుకుమరకతతోరణముల నమర్చి
యపు డలంకృతి గావించి రప్పురంబు.

13


గీ.

పురుషు లతివ లఖిలభూషణవస్త్రమా
ల్యానులేపనముల నలరి వివిధ
హృద్యవాద్యతతు లవచ్యమై మ్రోయ మ
హోత్సవమున పురము నొప్పె కరము.

14

మ.

పుర మిబ్భంగి నలంకరింప బలదేవుం డచ్యుతుం డర్థి భూ
సురసంఘంబుల గాంచి యిట్లనిరి పూజ్యు ల్మాకు మీరౌట మ
ద్వరపుత్రీమణి నర్జునాత్మజున కీయన్ బుద్ధి దోచెన్ శుభ
స్థిరమౌహూర్తికలగ్న మవ్యవధి యోచింపందగు న్సత్కృపన్.

15


క.

అనిన హలి నిజమృదూక్తుల
కనురాగము నొంది విపులందఱ లిది మే
ల్పని యని యనుకొని మునుకొని
కనుగొని యనుఁగెనయ వినయగతి బల్కి రొగిన్.

16


చ.

తరుణికి పంకజప్రియహితంబు పదంబులయందు, తారకా
వరవరమైత్రియు న్నఖరపంక్తిని, మంగళశాలిదీప్తి వి
స్ఫురతరజంఘల, న్రుచిరవేణిని రాహుహితంబు చన్గవ
న్గురుసుకరావలోకనము గూడె నిదే సుముహూర్త మెల్లియున్.

17


చ.

అనుటకు సంతసింపుచు నృపాఢ్యులకున్ శుభలేఖ లంపు మే
ల్కనకఁపుఁ గాగితంబులను కస్తురిసారపునిగ్గు శాయిచే
సనయతగా లిఖించి తనచక్రమునన్ మొహరొత్తిపంపె న
వ్వనజదళాక్షుఁ డాత్మజవివాహసమాగతసూచనార్థమై.

18


క.

ఆశుభలేఖల భటు లవ
నీశుల కెల్లెడలవారి కిచ్చిన హరి ని
ర్దేశమని హర్షమానసు
లై శీర్షములం ధరించి యతివేగమునన్.

19


మ.

హలికన్యాప్రదుఁ డర్జునాత్మజుఁడు మేనల్లుండు బాధ్యుండు ద
త్ఫలసంధాయకుఁ డౌ చతుర్భుజుఁడుగా భావించి యీమేలువా
ర్తలు విన్నంతఁ గుతూహలం బెనయఁ దత్తద్దేశభూపాలమం
డలి విచ్చేసిన బంగరంపువిడిదిండ్ల న్నింపె సైనేయుఁడున్.

20


చ.

మును పరుదెంచినట్లు మునిముఖ్యులు రాజులు విప్రులుండ ద
క్కినసకలావనీజనులు కేవల మీయభిమన్యుపెండిలిం

గనుఁగొను కోరిక ల్నిగుడఁగా జనుదెంచిన వారలం గన
త్కనకగృహంబుల న్విడిదిగా నియమించి బహూకరింపుచున్.

21


చ.

మన యదువృష్ణిభోజకులమండలితోడ ఘటోత్కచాశ్రమం
బున కరుదెంచి వేగ బలపుత్రిక నయ్యభిమన్యుని న్సుభ
ద్రను గొనితేఱగావలయు దంతిరథాశ్వభటాంగముఖ్యసా
ధనము లలంకరించుమని దానవభేదనుఁ డానతీయఁగన్.

22


గీ.

పతి నియోగింప సాత్యకిప్రముఖు లెల్ల
వేణువీణామృదంగనిస్సాణతూర్య
దుందుభీనాదములు మింట నంది మ్రోయ
తత్క్షణమునందె కట్టాయితం బొనర్చి.

23


సీ.

పటురథాంచితచిత్రపటపటపటరవం
        బటఘంటికామహార్భటుల నెసఁగ
భటపటలీసముత్కటహుటాహుటిధాటి
        పటహతమ్మటలజంఝటల నొదుగ
చండవేదండప్రకాండఘీంకరణ మా
        ర్తాండమండలమెల్ల నిండియుండ
వరతురంగమఖరఖరఘర్షణధ్వని
        భీషణహేషాతిఘోష నెనయ


తే.

చలితచతురంగబలమహాకలకలముల
నిలకులాచలజాలముల్ దొలకి పొరలఁ
గేశవుండు ప్రలంబవినాశనుండు
పయనమౌచున్నతఱిని జూపట్టెఁ బురిని.

24


చ.

హితులు పురోహితు ల్వసుమతీశులు మౌనితతు ల్విలాసినీ
వతులు చిరంటికాసతులు వందిభటప్రతతుల్ నిజాహితుల్
వితతనుతుల్ మహోన్నతు లవీరత ధీరతశూరతాదివా
గతులితరీతిఁ దెల్పఁగఁ బ్రయాణములై బలకృష్ణు లున్నతిన్.

25

గీ.

సాంబకృతవర్మసాత్యకీప్రసారణప్ర
ముఖుల కుచితాశ్వగజవాహముల నొసంగి
నడుమ వసుదేవు నుగ్రసేనప్రముఖుల
గలసి తామొక శతాంగమున నెక్కి.

26


సీ.

భటకోటికహకహార్భటులచే సన్నద్ధ
        శస్త్రులై యుభయపార్శ్వముల నడవ
గద్యపద్యముల మాగరు లుగ్గడింపుచు
        రమణీయమణిచామరములు వీవ
ఢాంఢమీఢక్కాహుఢక్కాడివాద్యని
        నాదంబు దశదిశల్ భేదిలంగం
బుణ్యాంగనామణుల్ పణ్యాంగనాజనుల్
        గంధపుష్పాక్షత ల్కాన్క లొసఁగ


తే.

గిరుల నిరులను బోల్మత్తకరులు హరులు
సురలు మరులొందు సంగీతపరులు వేత్ర
ధరులు భూవరు లనుకూలపరులుఁ దాము
నడచి రాసీరిశౌరి కాననముదారి.

27


చ.

చని పురతస్స్థలిం గనిరి సాలతమాలకపిత్థవంజుళా
ర్జునవకుళామ్లనీపవటరోచనపాటలనాగరంగచం
దనకృతమాలతిందుకరథద్రుమనింబలవంగలుంగకాం
చనకరవీరముఖ్యతరుషండవినిర్గమదుర్గమార్గమున్.

28


మ.

తురగస్యందనకుంభినీతతికి దోడ్తోడై వడిన్ మ్రోసె శం
బరకంఠీరవఖడ్గకోలచమరీభల్లూకశార్దూలకా
సరశల్యవృకముఖ్యసత్వములు పర్జన్యధ్వనిన్ లోకదు
ర్భరమాయాఘటుఁడౌ ఘటోత్కచుని జేరంబోవు మార్గంబునన్.

29


సీ.

ఇదిగో దరులయంద మదిగోధికాబృంద
        మెదగోలుజెంద పెల్లొదరుచుండ

తండోపతండవేదండప్రకాండ ము
        ద్దండమై యిక్కొండనిండ నుండ
నల్లదే భయభూతభల్లఝల్లీవ్రాత
        హల్లధ్వనులఁ దల్లడిల్లఁజేయు
నాలంబునను టోరి జాలంబులై దూరి
        కోలంబు లీదారి గోలలాడ


తే.

గాన యీకాన కెనయఁగా గానమనియ
నూనతామనసానుమోదానుగతిని
సానువులమంజుకుంజవితానములను
గడచి కతిపయదినశీఘ్రగతుల నడచి.

30


చ.

అని యిటుల న్నుతించి వికటాటవి మించి గమించి మించి భీమనం
దనునిగుఱించి చిత్రఘటితక్రియ లెల్ల దలంచి విస్మయం
బున మది నుత్సహించి నిజపుత్రిఁ గనుంగొను వాంఛ నుంచి య
ల్లన జనుదెంచి తద్ఘనబిలస్థలి గాంచి రుదంచితంబుగాన్.

31


ఉ.

అంతకుమున్ ఘటోత్కచుఁ డహార్యగుహాంతరసీమఁ జేరి దా
నెంతయుఁ బోయివచ్చు తెఱఁ గెల్ల సుభద్రకు దెల్పుచుం బ్రలం
బాంతకుఁ డచ్యుతుండు సుత నల్లుని దోడ్కొనిపోయి పెండి ల
త్యంతముదంబునన్ సలుప నర్థిని వే జనుదెంతు రెల్లియున్.

32


మ.

అని యాద్యంతము దెల్పుచో హృదయమం దయ్యర్జునుం డెట్టు లీ
తని కల్యాణమహోత్సవంబు గనుసందర్భంబు బాటించునో!
యని యాఖండలుతో సుధర్మసభయం దర్ధాసనాసీనుఁడై
యునికిం గాంచి యుపాయ మొక్కగతి దా నూహించె నుత్సాహియై.

33


శా.

శ్రేయోభూతము గాగ నుద్వహశుభశ్రీలేఖికల్ వ్రాసి నా
వాయవ్యాస్త్రము కంటగట్టి దినము న్బాటించి నేసూటిగా

వ్రేయన్ వాసవవాసవీప్రముఖుల న్వీక్షించి వేగం బిటం
డాయె న్వచ్చెద ఱింతకన్న మదిజూడన్ లే దుపాయం బికన్.

34


చ.

మది నిది నిశ్చయించి యభిమన్యసుభద్రల కిత్తెఱంగు స
మ్మద మొనరించి యుద్వహసుమంగళపత్రికయున్ లిఖించి నె.
మ్మది ననిలాస్త్రమం దనుపమానముగా ఘటియించి వేసె నా
త్రిదశసభన్ బిడౌజముఖదేవగణం బతిచిత్ర మందఁగన్.

35


ఉ.

ఆమహదస్త్రరాజ మపు డర్జునుఁడున్ శతమన్యుఁ డున్న చిం
తామణిభద్రపీఠిని ద్రుతంబున వ్రాలిన నంతలోన సు
త్రామముఖామరాళి ప్రమదంబున గన్గొని తన్నిబద్ధమై
ప్రేమ నలంకరించు శుభలేఖను గైకొని వేవచింపఁగన్.

36


ఉ.

"శ్రీకరసర్వదిగ్వరవశీకరబాహుబలిప్రతాపుఁ డౌ
పాకవిభేదిసన్నిధికి ప్రాంజలుఁ డౌచు ఘటోత్కచుం డనే
కైకనమస్కృతోక్తి లిఖియించిన విన్నపపత్రిక న్మదిం
గైకొని మన్మనోరథ మఖండగతి న్నెరవేర్చ వేడెదన్.

37


చ.

మది ముదమందగా నిపుడు మాయభిమన్యుని పెండ్లికై సమ
స్తదివిజులన్ బృహస్పతికృశానుముఖాఖిలదిగ్వరు ల్ప్రియం
బొదవఁగ నర్జును న్సుతమహోత్సవలగ్నవిలోకనార్థమై
సదయత బోధఁజేసి తమసన్నిధితోడుక రాదగుం జుమీ.”

38


క.

ఈరీతిం జదివి సునా
సీరుం డర్జునుఁడు వెఱగు జెందెటివేళన్
ద్వారావతినుండి మహో
దారుఁడు నారదుఁడు తనకుతాఁ జనుదెంచెన్.

38


ఉ.

వచ్చిన సంయమీంద్రునకు వజ్రి శచీసతితోడ గూడి వి
వ్వచ్చుఁడు దా నెదుర్కొని సువర్ణమణిస్థగితాసనంబునన్

మెచ్చ వసింపఁజేసి మతిమించిన భక్తి నుతించి కూర్మిమై
నచ్చుపడ న్ముఖాంచితకరాంజలుఁడై వచియించె నమ్రతన్.

40


ఉ.

దేవర లెందునుండి చనుదెంచితిరో! గత మేమొ! పాండుపు
త్రావలి సంపద ల్గొని యహంకృతితోడ సుయోధనుండు స
ద్భావుకుఁడై సుఖించునెగదా ! విజయం డిట నున్నవాఁడు యిం
కీవల చిత్రమేమొ వచియింపఁగదే సురసంయమీశ్వరా!

41


చ.

మఱి యిదిగాక నిప్పు డభిమన్యుని బెండి లటంచు దానవే
శ్వరుఁడు ఘటోత్కచుండు త్రిదశప్రయుతంబుగ నన్ను నర్జునున్
బరువడి రమ్మటంచు శుభపత్రిక వ్రాసినవాఁడు నేఁడు యి
త్తెఱఁ గెటువంటిదో! మదికి తేఁటపడన్ వివరింపవే దయన్.

42


ఉ.

ఎక్కడివార్తయో దనుజుఁ డేగతి నీశుభకార్య మెన్న డే
దిక్కున నాచరించునో సతీమణి యెవ్వరికూఁతు రెట్టులీ
చక్కి బొసంగునో యనుచు సందియమొందుచు సవ్యసాచి నే
నెక్కడ దోఁచకంగలగ నింతటిలో మిముగంటి మున్నతిన్.

43


క.

ఇది వినినప్పుడె మోదా
స్పద మయ్యెంగాని దీని సాకల్యముగా
మది దెలియకున్న ద్రిజగ
ద్విదితాత్ములు మీకు విన్నవింపఁగవలసెన్.

44


చ.

అనిన సురర్షి యిట్లనియె నద్రీనిసూదన కౌరవేశ్వరుం
డనుపమభోగవైభవము లందెను దాని నటుండనిమ్ము సొం
పెనయ ఘటోత్కచుండు లిఖింయించిన యీశుభలేఖ భావమే
పనిబడి నీకు పార్థునకు బాల్చడి తెల్పఁగ నేగుదెంచితిన్.

45


సీ.

ఆద్వారకను సుభద్రాభిమన్యులు నుండ
        బలునకు శశిరేఖ గలుగుటయును
దాని మేనల్లున కే నొసంగెద నంచు
        భగినీమణికి నమ్మబలుకుటయును

తఱువాత కురురాజతనయునకును కన్య
        నీయఁగా నొకలగ్న మిడుటయును
నందుకు తల్లి దా నర్ధరాత్రిని లేచి
        యభిమన్యుఁ డడవుల కరుగుటయును


గీ.

నట ఘటోత్కచుఁ డనుకూలుఁడైన పిదప
దానవుఁడు ధౌర్త్యమాయావిధానములను
తరలివచ్చిన కౌరవతతులనెల్ల
వెతలఁ బెట్టుటఁ దెల్పెద విను బిడౌజ.

46


తే.

అన్న యన్న మాట కర్ధరాత్రమునందు
కొడుకుతో సుభద్ర యడవి కఱుఁగ
విల్లునమ్ము లరసి వీరుఁ డంచని పార్థ
సుతునితో ఘటోత్కచుండు గవిసె.

47


ఉ.

ఆయభిమన్యుఁడు దనుఁజుఁ డన్నలు దమ్ములు నౌ టెఱుంగమిం
బాయని రోషభీషణత బాహుబలంబులఁ బోరునంత నే
నాయెడ కేగుదెంచి యుభయత్రల చుట్టఱికంబు దెల్పఁగా
నాయువుదక్కి వారికి ప్రియంబున సౌహృదభావ మేర్పడెన్.

48


మ.

తనయుండైన ఘటోత్కచుం గని సుభద్రాదేవి యాసీరి త
న్నును నిర్మానుషవాక్యము ల్దెలుప నుగ్రాకారుఁడై తత్క్షణం
బున ద్వారావతికేగి యాహలిగృహంబున్ మాయచే జొచ్చి క
న్య నదృశ్యాకృతి తోడిదెచ్చి యభిమన్యస్వామి కొప్పించియున్.

49


క.

ఆకన్యకాకృతిం దా
గైకొని లక్ష్మణుని లగ్నకాలంబున దు
ర్భీకరరూపము జూపి చి
కాకున వా డచఱి పాఱఁగా వడి దఱిమెన్.

50


క.

మాయాకన్యక నంతట
మాయము గావించి యభ్రమండలమున దు

ర్జేయగతి నిలిచి నిఖిలో
పాయములం గౌరవుల విభంగ మొనర్చెన్.

51


సీ.

శరభసింహలులాయశార్దూలముఖదుష్ట
        జంతుసంతతు లార్చుఁ కొంతసేపు
భటరథద్విరదాశ్వపటలమహార్భాట
        మంతంత గల్పించుఁ గొంతసేపు
గండశిలాశనీకరకానలాసార
        ఘోరకృత్యము జూపి కొంతసేపు
మాంసమస్తిష్కాస్త్రమలమూత్రకర్దమా
        క్రాంతంబుగ నొనర్చి కొంతసేపు


తే.

కురుబలంబుల నిట్లు గగ్గోలుపఱచు
నట్టి వార్తలు మననోట బెట్టరాదు
తెలిసికొ మ్మిక నొకమాట బలికెద విను
యమపురంబున లేదంత శ్రమకరంబు.

52


చ.

కురుబల మీగతిం జెడుటకున్ భయమంది జనంబు హస్తినా
పురమునకున్ పలాయనము జెందుటచే బలభద్రునిన్ రమా
వరుఁ డొడబాటుజేసి వరవర్ణిని నయ్యభిమన్యశౌరికిం
బరిణయ మాచరింప మతిబాల్పడి రెల్లి ముహూర్త మయ్యెడిన్.

53


మ.

తనయ న్సోదరి నల్లునిం బురికి మోదం బొప్ప దోడ్తే జనా
ర్దనతాలధ్వజసాత్యకీప్రముఖు లుత్సాహంబునం ద్వారకా
జన మాబాలయదుప్రయుక్తముగ భాస్వన్మంగళాచారవా
ద్యనినాదంబులు మ్రోయ నేఁ డఱిగి రాస్తన్ బంధుయుక్తంబుగన్.

54


చ.

కనుక ఘటోత్కచుండు కుతుకం బెనయన్ శుభపత్రికాముఖం
బున దెలియంగజేయఁ దనపుత్రుని పెండ్లికి నర్జునుండు ని
న్గొని తనురాగలం డనెడికోరిక నుండినవాఁడు నీవు నీ
యనుచరు లర్జునుండు క్షణ మాలసియింపఁగ నేగఁగా దగున్.

55

క.

తడవాయె నిన్నినాళ్ళకు
కొడుకు వివాహంబు జూడకోరికచే క
వ్వడి వచ్చి నాకుఁ గన్నులఁ
బడునేమో యని సుభద్ర ప్రలపించుసుమీ!

56


చ.

దివిజమునీంద్రుఁ డిప్పగిది తేటపడ న్వచియించి స్వేచ్ఛ న
వ్యవధి ముకుందకీర్తనలు బాడుచు నాడుచు నేగి నంత వా
సవధిషణార్జునాదిదివిషజ్జను లిట్టి ఘటోత్కచుండు కౌ
రవబల మాహరించిన ధురంధరవృత్తికి సంతసింపుచున్.

57


సీ.

చెలి నెత్తుకొనిపోయి చెలిరూపు తానయ్యె
        నన్న విస్మయరసం బావహించె
నాలక్ష్మణుండు దిగంబరుండై పాఱె
        ననిన హాస్యరసంబు ననుకరించె
రౌద్రజంతువులు కౌరవులఁ బ్రేల్చెనటన్న
        సరణి భీభత్సరసంబు వొడమె
తమను కర్ణుండు నిందలు వచించె నటన్న
        బెలుచ వీరరసంబు బిక్కటిల్లె


గీ.

తుదకు రాముఁడు కన్య నిత్తునని బల్కె
నన్న శాంతరసంబు మైచెన్ను మిగిలె
పెండ్లికి సుభద్ర నినుజూడ ప్రేమఁగోరె
ననిన శృంగారరస మంతకంత జెలఁగె.

58


చ.

హరిహయుఁ డర్జునుండు పరమాద్భుత మందుచు దైత్యుఁ డా వృకో
దరసుతుఁ డౌటకుం దగినదైర్యము శౌర్య మయారె యంచు న
త్తఱి నభిమన్యు బెండ్లి గను దత్పరతం దిగధీశకోటి న
ప్సరసల నమర్త్యులన్ భటుల పైనమొనర్చెటి యంతలోపలన్.

59


మ.

పదిరెండేడు లరణ్యవాసనియతిం బార్థుండు చింతించి నె
మ్మది నూరం జొఱ సూనృతంబునకు ధర్మం బౌనె కీర్తిక్షయా

స్పదముం గాదె మదగ్రజుండు విని తాపం బందఁడే చూడ నా
కిది లోకత్రయదూషితం బనిన దేవేంద్రుండు దా నిట్లనెన్.

60


శా.

ఏమీ ఫల్గుణ వెఱ్ఱివై పలికె దీ వీలాగు నీపుత్రుఁ డ
త్యామోదంబున బెండ్లియాడ నెనఱింతైన న్మదిన్ లేక నే
మేమో న్యాయము లెంచి రాననుచు నూహించేవు నీముచ్చటల్
మామా! చా లిటువంటి సంగతుల కేమాయె న్వితర్కింపగన్.

61


చ.

ధరణికి డిగ్గ కేను సతతంబు నభశ్చరవృత్తి నుండి యీ
పరిణయలోకనభ్రమను బొల్పడి యేగఁగ నాఁడు వెంట నీ
వఱుఁగుటచే యశోనియతహాని యటంచు దలంచనేల శ్రీ
హరిగలఁ డచ్చట న్మనల కన్నిట నెన్న శుభప్రదాయియై.

62


చ.

హరి యఖిలార్థవేద్యుఁ డగు టంతియెగా కతఁడున్నభూమియే
పరమపదం బనన్యజనభాజన మవ్యయ మద్భుతంబు నౌ
టెఱిఁగి తదంఘ్రిసేవనము కేగిననేమి కొఱంత యిప్పు డీ
సురపురిఁ జేరఁ దత్పురము జొచ్చుట ధర్మవిరుద్ధ మాయెనే.

63


చ.

పదఁపడి తత్పదాంబుజప్రపత్తి యొనర్చుటచే ప్రతిజ్ఞలె
ల్లఁ దిరముగా నొనర్చినఫలంబు లభించదె ద్వారకాపురం
బది యొకపుణ్యభూమి యది యక్షయమోక్షనిధాన మంచు నా
రదసనకాదిమునులు తిరంబుగ వచ్చుచుఁ బోవుచుండరే.

64


క.

హరిసేవ కఱుఁగ దనయుని
బరిణయ మొనగూడ చూడ ప్రాప్తంబగు ని
తైఱఁగెల్ల మాని రమ్మని
నరుఁ డియ్యకొనంగ నాకనాథుం డలరెన్.

65


ఉ.

ఆవిధిగా నొడంబఱచి హారకిరీటవిభూషియై శచీ
దేవియుఁ దాను ఫల్గుణుం డతిత్వర దంతచతుష్టయాభ్రదం

తావళ మెక్కి, వెంట విబుధప్రతతుల్ త్రిదశత్రికోటి సం
భావన సేయ స్వర్గ మతిభాసురవైభవలీల వెల్వడెన్.

66


క.

సురలోకభోగ్యమై దగు
పరిమళవస్తుప్రచయము బరిచారులు బం
గరుపళ్లెరముల గొని తే
నరుదుగ నియమించె వృత్రహరుఁ డతిప్రీతిన్.

67


సీ.

శక్రుఁ డప్సరవధూసంగీతసంస్తుతి
        నిగమస్వరానందనియతి వహ్ని
సకలధర్మప్రశంసధ్వని శమనుండు
        పుణ్యజనస్తవంబుల పలాశి
వరుణుండు వాహినీవరమహారవముల
        లలితవేణుస్వరంబుల ననిలుఁడు
కిన్నరీగానసంకీర్తన రారాజు
        డమరుకారవములఁ బ్రమథరాజు


తే.

నొక్కమొగి మించి నడవఁగా నుత్సహించి
హితవరుల గాంచి దగుపను లేర్పఱించి
పృథులదంభోళి ఝళిపించి బీర మెంచి
శౌరి నెదనుంచి భీమజాశ్రమముఁ గాంచి.

68


క.

హాటకగర్భుఁ డొనర్చిన
సూటికి చిత్రము ఘటోత్కచుం డున్న వనీ
వాటికి నబ్బలసూదను
వీటికి సూత్ర మిడినట్లు వెసఁ జని రమరుల్.

69


చ.

కతిపయదూరమందె సురకాంతుని గాంచి ఘటోత్కచుండు హృ
ద్గతపరితోషియై యెదుఱుఁగా జని తోడుకవచ్చి సన్మణి
ప్రతతవిభావిభాసురప్రపాతమునన్ విడియించి గౌరవ
స్థితి ఫలమూలభాజనవిశేషములం బరితృప్తు జేసినన్.

70

చ.

మరుదధినాథుఁ డర్జునుఁడు మక్కువతో నభిమన్యుఁడున్న ద
ద్గిరిగుహ కేగఁగా నతఁడు గేవలభక్తి నమస్కరించినం
గరముల లేవనెత్తి చుబుకంబు బుణుంకుచు హర్షబాష్పముల్
దొఱయఁగ కౌఁగిలించి దయ దొట్రిల నంకములందు జేర్చియున్.

71


శా.

అన్నా నీ విటు మామపై నలిగి ఘోరారణ్యమార్గమ్ములం
దెన్నం డొందని బాధలం బొరయ నేఁ డిచ్చోట హైడింబుఁ డా
సన్నంబై యనుజప్రియాప్తి నలయించ న్నీవు నీతల్లియున్
మన్నారింతయె జాలు తండ్రి యిది సేమంబయ్యె నీనాఁటికిన్.

72


చ.

అని ప్రియభాషలం బలికి యవ్వల నాశశిరేఖనున్ సుభ
ద్రను గనుగొంచుఁ దత్తదుచితస్థితు లేర్పడ నాదరించి యం
తనె దనుజేంద్రునిం బొగడి దద్దయు వారును వారు మైత్రినె
మ్మన మలరన్ సుగంధసుమమంజులకుంజముల న్వసింపఁగన్.

73


చ.

అదె బలకృష్ణసాత్యకులు హస్తిరథాశ్వభటార్భటీజగ
ద్విదితము గాగ బంధుపరివేష్టితులై కలశాబ్ధివీచికా
భ్యుదయగతి న్వధూవరుల నొయ్యన దోడ్కొనిబోవ వచ్చిరం
చు దనుజకింకరు ర్టెలుప శూరవరుండు ఘటోత్కచుం డొగిన్.

74


చ.

సురలను హెచ్చరించి బలసూదను లెమ్మని విన్నవించి ఖ
ద్విరద మలంకరించి దిగధిప్రభులం గని వివరించి వా
ద్యరవము లుగ్గడించి పినతండ్రి కిరీటిని కౌఁగిలించి స
త్వరగతి మించి సీరిహలధారి నెదుర్కొనఁగా దలంచియున్.

75


సీ.

పాండురవేదండహిండచున్నతపీఠి
        గాండీవియాఖండలుండు జెలఁగ
మేషాదిసత్వరోన్మేషవాహము లెక్కి,
        హుతభుజప్రముఖదిక్పతులు నడవ
చటులాశనీసముత్కటహుటాహుటినట
        త్పటుభటార్భటులు దిక్తటము లొరయ

గద్యపద్యాదివైశద్యవాద్యనిరూఢి
        సాధ్యవిద్యాధరస్తవము లెసఁగ


తే.

ధరణి యీనినగతి సురాసురబలములు
శ్రీరమణునకు నారేవతీరమణున
కెదుఱు నడచి మనోమైత్రి కుదుకుపఱచి
తోడుకొనివచ్చి నిఖిలసంస్తుతు లొనర్చి.

76


ఉ.

ఉన్నయెడన్ బలుండు హరియున్ శశిరేఖను జేరనేగి యో
కన్నులకల్కి రమ్మనుచుఁ గౌఁగిటజేర్చి నిజాంకసీమయం
దున్నతి నుంచి కన్గవలినొప్పెడు హర్షజలంబులన్ శిరం
బు న్నెనరంట మూర్కొనుచు బుజ్జగిల న్వచియించి రర్మిలిన్.

77


శా.

తల్లీ తల్లులఁ బాసి యేపగిది సంతాపించితో దైత్యుఁ డు
ద్యల్లీల న్నడిరేయి నిన్ గగనపంథానంబునం దెచ్చి యీ
భల్లోలూకభయంకరాటవిని జేర్ప న్నీవు భీతి న్మనః
కల్లోలంబున నెంత తల్లడిలితో కంజాతపత్రేక్షణా.

78


క.

ఐనా వగ పేటికి నీ
మేనత్తకడ న్వసించి మెలఁగుటచే ని
త్యానందమైన ద్వారక
లోనున్నటులగాదె లోలలోచన నీకున్.

79


మ.

శరజాతాంబకరూపశాలియగు నీజంభారిపౌత్రుండు ని
న్వరియింపంగలఁ డర్జునుం డతులితవ్యామోహతం గోడలం
చు రహి న్సంతస మందఁగా కొఱత లిచ్చో గల్గునే నీకు ని
త్తఱి గల్యాణ మొనర్పఁగా దలఁచి మాతల్లీ యిట న్వచ్చితిన్.

80


చ.

సుత నిటు లూరడించి నిజసోదరి నల్లుని గాంచి మీమన
స్స్థితహితకార్య మిప్పటికిఁ జేకురె మత్కృతవాక్ప్రచారసం

గతుల దలంపకన్ బ్రకృతకార్య మెఱుంగుట నన్యబంధుసం
తతి కిదియే హితం బఖిలధర్మము లార్యులు జెప్ప గానమే.

81


ఉ.

అంతట నర్జునుండును సురాగ్రణియు న్మలభద్రరుక్మిణీ
కాంతలకుం బ్రదక్షిణముగాగ నమస్కృతు లాచరింప వా
రెంతయు సంతసించి హితహేతునయోక్తుల నాదరించి ధీ
మంతు ఘటోత్కచుం బొగడి మాటికి మాటికి నుత్సహింపుచున్.

82


క.

కురురాట్కుమారునిఁ దా
నరలేకం గోరి తెచ్చినందుకు నసితాం
బరుఁ డించుక సంకోచం
బఱిముఱిగొని మగుడ మఱచినట్టుల నుండెన్.

83


చ.

వనజదళాక్షుఁ డద్దనుజవల్లభు గాంచి మహాద్భుతంబు నీ
వొనరిచినట్టికార్య మొహొహో బలవిక్రమశాలి వీవు పె
క్కన బనియేమి తల్లివెత లన్నియుఁ బాపి బలాత్మజాతఁ ద
మ్మున కొనగూర్పఁబూనితి వమోఘయశోనిధివౌ ఘటోత్కచా.

84


క.

నీవలన పాండవులకుం
గేవలసత్కీర్తియు న్నిఖిలధనవిభవం
బివేళ గలిగె మామా
భావంబులు జెలఁగె నీప్రభావమువలనన్.

85


క.

తమ్మునివైవాహికము హి
తమ్మున నొనఱింపఁగా ముదమ్మున భటబృం
దమ్ములతో నమ్మలతో
రమ్ము భరమ్మనక సత్వరమ్మున నెమ్మిన్.

86


చ.

హరి యిటు లానతీయ దనుజాగ్రణి చేతులు మోడ్చి స్వామికిం
కరుఁడ ననుం ఘనుం డనుట కారణ మేమి భవత్కటాక్ష మె

వ్వరియెడ గల్గగా నతఁ డవార్యపరాక్రముఁ డౌచు నెట్టిదు
స్తరమదవైరినైన బలదర్ప మడంచి వధించు టబ్రమే!

87


ఉ.

పాండుసుతు ల్భవచ్చరణపద్మములే నెఱనమ్మి గాదె స
త్పాండురకీర్తిసంపదల భాసిలి రట్లభిమన్యశౌరికిం
బెండి లొనర్చఁగా భవదభిప్రియమైనను నేనొకండ రా
కుండిన నేగొఱంత యగునో! మధుసూదన వైరిభేదనా!

88


గీ.

అనుట యభిమన్యుఁ డన్నరాఁ డనుట దెలిసి
విన్ననై యున్న యాసన్న వెన్నుఁ డెఱిఁగి
దనుజునికరమ్ము తనకరమ్మునను బట్టి
బలికె నిట్లని కపురంపుఁబలుకు లొలుక.

89


మ.

తనకల్యాణము కీవు రావనెడి చింత న్సోదరుం డున్నవాఁ
డెనయ న్నీవిటు దల్ప తమ్మునకు ప ట్టెవ్వండగుం దండ్రు ల
వ్వనిలో నుండఁగ నీవొకండ వనుకంపన్ వచ్చితే వారలె
ల్లను విచ్చేసినరీతి మామదిని నుల్లాసంబు సంధిల్లెడిన్.

90


క.

అడుగో చూడుమి నీత
మ్ముఁడు నీవటరానిభావము గని మదిలో
నడలుచును మౌనమున ధృతి
జెడి చింతిలు వాని కేమి జెప్పెదు హితవుల్.

91


చ.

అనిన సురద్విషాగ్రణి నిజానుజుఁ డున్నతెఱం గేఱింగి యి
ట్లనే నభిమన్య నే నురకనాడితిగాని భవద్వియోగముం
క్షణము సహింతునే జనకసంతతి నీకడలేనివేళ వే
రణమున కేనురాక మదిరంజిల నిచ్చట నుండనేర్తునే!

92


క.

జనకులగు ధర్మముఖ్యులు
గనకుండుట మన యభాగ్యకర్మంబున కే
మననచ్చు ననుచు నాలిం
గన మొనరింపుచును బ్రమోదకలితుం జేయన్.

93

చ.

రమణి సుభద్ర బావలు మఱందులు లేని సుతోద్వహంబు వి
క్రమముగ జేయఁగావలసెగా యని గన్నుల నీరునింప శ్రీ
రమణుఁడు సోదరిం గని దరస్మితుఁ డౌచు వచించె పాండవుల్
సమయప్రతిజ్ఞ నుండి యవశంబున రామికి చింతఁ జేతురే.

94


క.

ఎప్పటిమే లప్పుడె దగు
దప్పెఱుఁగక చింతజేసి శుభకార్యవిధిం
దప్పింప నెవరివశమగు
నప్పాట 'శుభస్య శీఘ్ర'మని యన వినవే!

95


ఉ.

కాననసీమ వెల్వడి సుఖంబుగ పాండవు లేగుదెంచి న
ట్లైనను కోడలిం గొడుకు నారసి వేడుక జెందరాదె మే
లైన బ్రయోజనంబునకు నౌనని మీఁదట మెత్తు రింతియే
గాని నిజాప్తబాంధవులు గారటె యాదవులెల్ల సోదరీ.

96


క.

అనుచు సుభద్రామణి న
వ్వనజోదరుఁ డూరడించి వాసవముఖదే
వనికాయ మెల్ల సత్వర
మున పైనమొనర్ప దేవముఖ్యుం డంతన్.

97


చ.

అనుజుని బెండ్లికై దగు నిజానుచరు ల్మణిపాత్రలం గన
త్కనకవిభూషణాంబరనికాయము చాలినరీతి కానుక
ల్గొని తనవెంట రాగ సురకోటుల కద్భుతముల్ ఘటింపఁగాఁ
దనవిపులోన్నతాకృతిని దాలిచి సత్వరితప్రయాణుఁడై.

98


ఉ.

అందఱ లిత్తెఱంగున ప్రియంబు నయం బెనయంగ రోహిణీ
నందను నాజ్ఞ బూని పయనంబునకు న్సమకట్టి వారణ
స్యందనఘోటకప్రముఖశశ్వదలంకృతవాహనంబు లిం
పొంద ఘటించి శీఘ్రగమనోన్ముఖులై రతులప్రమోదతన్.

99


మ.

చతురంగంబుల నిత్తెఱంగు నిలుపం జంభారి పౌలోమితో
నతిమోదంబున నభ్రశుభ్రగజపృష్ఠారోహియైన న్మణి

ద్యుతిః దీండ్రించు రథంబున న్బలుఁ డుపేంద్రుం డర్జునుం డెక్కి ధీ
హితు సౌభద్రుని చెంత నుంచుక ప్రమోదైకాగ్రచిత్తాబ్జులై.

100


తే.

అల ఘటోత్కచుజననితో నాసుభద్ర
పెద్దముత్తైదువలు మీరు పెండ్లి జూడ
రావలయునంచుఁ గేల్బూని లేవనెత్తి
ఘనతరాందోళికల నెక్కి కదలి రపుడు.

101


గీ.

ప్రమదదంతావళంబులపై దనర్చు
డాంఢములు మ్రోసె కమలజాండంబు నిండ
సకలదిగ్భాగముల వర్ష సమయమునను
గర్జనలు సేయు కాలమేఘములకరణి.

102


సీ.

ఘణఘణాద్భుతఘంటికాసహస్రాంచిత
        కుంజరపుంజంబులుం జెలంగ
చెంగున గుప్పించి చిందులాడెడి తురం
        గంబు లాచరమభాగమున దనర
సైనికాంభోధిమధ్యేనటన్మందరా
        గమమూర్తులై శతాంగంబు లొప్ప
ఘనవజ్రశకలసంకాశులై కపకహా
        ర్భటసురాసురయదుభటులు నడవ


గీ.

డమరుడిండమతమ్మటడాంఢమీహు
డుక్కఢక్కాదివాద్యము ల్బిక్కటిల్ల
పాలమున్నీటితరఁగ లేర్పడినయట్లు
నిర్గమించిరి ద్వారకామార్గమునను.

103


సీ.

ఘనసుస్వరానందగంధర్వగానంబు
        ఘనసుస్వరానందకలిత మయ్యె

హితసముత్తాలశోభితమృదంగధ్వనుల్
        హితసముత్తాలశోభితము లయ్యె
లలితాప్సరోనర్తనలు గోచరము లౌట
        నవి గోచరంబులై యతిశయిల్లె
భాషావిలాసశోభనదేవసంతతుల్
        భాషావిలాససంభరిత మయ్యెఁ


తే.

జూడ చిత్రంబుగా జను లాడుకొనఁగ
శంఖకాహళపటహనిస్సాణరవము
లొక్కమొగి దిక్కులకు నెక్కి పిక్కటిల్లఁ
బురికి నేతెంచి రవ్వధూవరులతోడ.

104


చ.

పురవరకాంత లుజ్జ్వలితభూషణముల్ ధరియించి సౌధముల్
బరువడి నెక్కి హస్తతలభాస్వరకంకణకింకిణీధ్వనుల్
మెఱయఁగ లాజలుం గుసుమము ల్వెదజల్లిరి యాత్మదృక్పురం
దరమణియుక్తమౌక్తికసుదామము లాస్తి నొసంగుకైవడిన్.

105


చ.

అతివ యొకర్తు మంజులసహస్రదళాబ్జము కేల ద్రిప్పుచుం
ద్రుతగతితోడ జూడ నఱుదెంచిన గానఁగనయ్యె యిట్టిదం
పతులను గాంచ నిక్కమలపత్రములం బలె వేయిగన్ను లా
శతధృతి నా కొసంగినను జాలపటంచని జూపుకైవడిన్.

106


చ.

తిలకము దిద్దుచో నొకసతీమణి యుద్దము కేలఁ బూని వా
రలఁ గన నేగుచెంచె ముకుళంబిదె జూడుడి మన్ముఖద్యుతుల్
దలపడి దా హరించుటకు తస్కరవృత్తిని జొచ్చె దీనినే
ర్పలర విమర్శ సేయఁదగునం చని పట్టుకవచ్చినట్లుగాన్.

107


ఉ.

ఆనననీరజాతరుచిరాధరబింబఫలాంఘ్రిపల్లవా
శానిరతి న్మదాళిశుకశారిపికావలి వెంటనంటిరా
చాన యొకర్తు వారిఁ గన సయ్యన వచ్చె మరుండు బంపఁగా
దానయి దాను దద్బలహితంబుగ వచ్చెడి మోహినీక్రియన్.

107

సీ.

ఎంతవింతను ఘటియించెనో ధాత యీ
        భానుతేజునకు నీపద్మనయన,
యేరీతిఁ జేసెనో భారతీనాథుఁ డీ
        విమలేందుముఖున కీకుముదనేత్రి
యేలీలఁ గూర్చెనో నాళికగర్భుఁ డీ
        ఘనచూడునకు నీశిఖండిగమన
నేవిధి గావించె నీవిధి ప్రౌఢ యీ
        కమలాంఘ్రునకు నీమధుకరసువేణి


తే.

యహహ దాంపత్య మిట్లుంట సహజమండ్రు
గాని కానిది కొనసాగ నౌనె యనుచుఁ
బురవరారోహలెల్ల సంబరము మీఱఁ
గూడి యాడాడ ముచ్చట లాడుకొనఁగ.

109


చ.

మగకులమం దితం డనుపమానశరీరుని గాగ యీసతి
న్మగువలలో గణింప నసమానముగా రుచిరాంగసంపద
ల్దగునటు సృష్టిఁజేసి ప్రమదంబున గూర్చు విధాత కింక కే
ల్మొగిచి తదున్నతక్రియకు మ్రొక్కగవచ్చునటంచు నెన్నుచున్.

110


సీ.

ధవళచతుర్దంతదంతావళముపైన
        వనితయుఁ దానున్నవాఁడు జూడు
జాతరూపకతాళకేతనమణిమయ
        వరరథారూఢుఁడౌ వాని జూడు
గారుడధ్వజశతాంగంబుపై నిక్కి పా
        వనమూర్తియై వచ్చువాని జూడు
హనుమదాంకస్యందనారోహణ మొనర్చు
        పూనిక బఱతెంచువాని జూడు


గీ.

మదిగొ పాకారి సీరి మురారి సురారి
మనసుభద్రామనోహారి యనుచు నొకరి

కొకరు కేల్జాపి జూపుచు యువతులెల్ల
సంతసించిరి హేమసౌధాంతరముల.

111


వ.

ఇవ్విధంబున నయ్యదుత్రిదశదనుజసముదయంబు రయంబున సంబరం
బంబరం బంద సవధూవరంబుగా బురంబు జూడం బొరయు
సమయంబున తాదృశశ్రీకరమహోత్సవాలోకనానేకబలాహకానీకంబుల
క్రైవడి మవ్వంపుజవ్వను లివ్వలవ్వలం జివ్వుజివ్వున న్విసరుస్వచ్ఛచమన
పుచ్ఛంబు లవిచ్ఛిన్నంబులై మెఱయ, స్వకులప్రదీపకుం డయ్యభిమన్యుం
డని దదీయకల్యాణవిలోకనకుతూహలసమాగతుండగు హిమాంశుకిరణ
ప్రకరంబుకరణి చంద్రజ్యోతు లిరుగడల మెఱుంగుబఱంగఁ
దదనుచరగ్రహగణప్రముఖతారకానికరంబు సాక్షాత్కరించినచందంబున
చిరంటికాకదంబంబు లిరుగడల న్నిలచి మణిగణవ్యంజనంబులన్
వీవ సారసౌరభాపూరకర్పూరగంధసారకాశ్మీరకస్తూరికాదివిస్తారస
మస్తవస్తుస్తోమంబులు విమలమణిమయ[1]భూషణంబులు వివిధ
చిత్రాంబరంబులు పసిండిపళ్లెంబుల నిడుకొని కొంద ఱిందువదన
లానందకందళితహృదయారవిందలై యందంద సందడింప
శ్రీకృష్ణుని మనోరథం బిప్పాట ఫలించెనని తదీయాస్త్రరాజంబగు
సుదర్శనం బనేకరూపంబుల నతికుతూహలంబున నెదుట నటించిన
భంగి భీక్ష్ణబాణంబు లందంబులై వెలుంగ నచ్చరమచ్చకంటు లచ్చ
టచ్చట న్ముచ్చటదీఱఁ బచ్చవిల్తుని మచ్చరంపుఁ బను లుచ్చరింపు
చుం బెచ్చుఁ బెఱిగి, యిచ్చమెచ్చం గ్రుచ్చులాడు వసంతగంధసార
సారంబుల నామూలసార్ద్రకంబులై వికసించు కనకలతాసుమంబుల
సమంబులై మెఱయు బిరుసు లఱుదు పఱప నెడనెడ శిఖావళగమన
లతిమధురషడ్జస్వరానులాపంబులం గర్పూరనీరాజనంబులం బాటలుం
బాటిల శంఖకాహళపటహడిండిమనిస్సాణజర్ఝరవేణువీణానినాదం బను
మోదంబున సంవాదింప మహావిభవంబునం జని కురంగట నుత్తుంగ
మంగళాలంకృతప్రతిగృహప్రాంగణంబును బ్రవర్ధమాననిఖిలానవద్య
గీతవిద్యావైశిద్యహృద్యవాద్యనాటకాభినయశోభితంబును పరిణయ
మహోత్సవసమాగతసౌజన్యమాన్యరాజన్యమూర్ధన్యచండవేదండశుండా

దండపదమండలీవిగళన్మదధారాసౌరపరిషిక్తరథ్యాసముదయంబును,
శుభసూచనాలంకృతరంభాస్తంభశాతకుంభవిజృంభమాణమండపసౌరభ
సంరంభకుంకుమపటీరమృగీమదకర్పూరాగరుధూపదీపాదిపరివేష్టితం
బును అసమసుసరసకుసుమకిసలయవసనవిసరమణిగణతోరణవిరాజిత
వివిధవితర్దికాకవాటగేహళీప్రకోష్ఠవలభీవిటంకప్రముఖంబును, విచిత్రపట
కేతనాలంకృతరథసౌధాట్టాలకంబు నగుపురంబుఁ బ్రవేశించి, బహిర్ద్వా
రంబునం గజహయాందోళికస్స్యందనావతరణం బొనర్చి, కక్ష్యాం
తరంబులుఁ గడచి, యభ్యంతరమందిరంబునం బ్రవేశించి యప్పుడు.

112


చ.

హరిహయముఖ్యనిర్జరుల కర్హములౌ విడిదిండ్ల నిర్మలా
స్తరణలు తారతమ్యనియతంబు లెఱింగి బహూకరింపఁ ద
త్పరిణయశాల నిండి ప్రమదంబు జెలంగ వసించియుండు న
త్తఱిఁ గననయ్యె నచ్చటను ధర్మసభాసమభాసమానమై.

113


ఉ.

కూరిమితో సుభద్ర తనకోడలిఁ దోడ్కొని తల్లిదండ్రులం
జేరి నమస్కరింప దయజిల్కఁగ లేవఁగనెత్తి కౌఁగిటం
జేరిచి నేత్రబాష్పములు జిప్పిల కూఁతురు నూరడించి వే
మారు మనోగతవ్యథను మాన్పఁగ నిట్లని బల్కి రున్నతిన్.

114


శా.

తల్లీ నీ విటు లన్నపై యలిగి సంతాపించుచుం బట్టితో
భల్లోలూకభయంకరాటవి గమింపన్ భీతిమై నెట్టు లీ
కల్లోలంబు సహించితో యిక మనఃకౌటిల్యముం బాసి హృ
త్సల్లాపంబున రాము నెగ్గులనక న్సంతోషివై యుండుమా.

115


క.

మున్నెన్ని మీర లెట్లను
కున్నను వేరున్నదటవె యూహింపఁగ మీ
యన్నగు సీరాయుధుఁ డీ
వెన్నిట సోదరి వపోహ యేటికి తనయా!

116

చ.

అని సుత నూఱడించుతఱి నర్జునభీమతనూజు లార్తి మ్రొ
క్కిన గని దీవనోక్తు లిడి కేవలమైత్రిని తండ్రి మిమ్ములన్
గనుఁగొన నేటికిం గలిఁగెఁగా యన కన్నుల హర్షబాష్పముల్
బెనఁగ శిరంబు మూర్కొనుచు బిగ్గన కౌఁగిటఁ జేర్చి రర్మిలిన్.

117


చ.

అనఘుఁడు రేవతీరమణుఁ డంతట పుత్రిని పెండ్లికూఁతుఁగా
నొనరుప నాజ్ఞ సేయ వివిధోన్నతశంఖమృదంగభేరికా
ధ్వనులు సెలంగ విప్రవనితామణు లాశశిరేఖనున్ గన
త్కనకవితర్దికామణులగద్దియపై వసియింపఁజేసియున్!

118


క.

మంగళనీరాజనము లొ
సంగి సుమాక్షతలు చాలఁ జల్లుచుఁ బ్రియమొ
ప్పం గౌరీకల్యాణమ
నం గడువేడుకను దీవనల నిడిపి దగన్.

119


ఉ.

వ్రేలెడుతారహారములు వెన్కకు వ్రాల్చి వడంకుకౌనుకుం
గీలుజడం బిగించి దులకించు చనుంగవ గెంటనీక పై
మేలిపయంట చేలఁ బిగిమెల్చి మెఱుంగుచెఱుంగు బొడ్డునం
గ్రాలఁగ జెక్కి యొక్కకలకంఠి తలంటెను వాలుగంటికిన్.

120


చ.

చను లొరయంగ నూర్పులు బొసంగ మొగమ్మున గ్రమ్ము చెమ్మటల్
మినమిన బొంగ మధ్యగతి మేఖలఘంటలరం తెసంగ హా
రనిచయము ల్దొలంగ మణిరంజితకంకణముల్ ఝళంఝళ
ధ్వని మెఱయంగ గంధఫలితైలమునన్ శిరసంటె బోఁటికిన్.

121


చ.

ఒకతనుమధ్య సన్మణిగణోజ్జ్వలపీఠిని దా వసించి యిం
చుక నిరుప్రక్కలం దొడలు సోకఁగ హత్తిలఁజేసి వెన్ను చూ
చుకముల నాని పెన్నెఱులు చుల్కన చిక్కులు వీడదీసి నా
తికి ఘనసారతైలమున తిన్నఁగ దువ్వి ఘటించె క్రొమ్ముడిన్.

122


గీ.

సప్తతాళభేదనాప్తిసదంబక
రమ్య మగుచు రాగరసము నెఱపి

సుదతి శిరము నంటె సుగ్రీవమైత్రిని
గనుగొనంగ రామకథ యనంగ.

123


చ.

హితకరరాగసంభృత మహీనసుఖాంచితపారవశ్యసం
గతముకుళీకృతాంబకయుగంబు, గళచ్చలకేశబంధ మా
తతపుటకీకృతాంగక ముదంచితనిశ్వసనావిలాసమౌ
రతిసుఖతుల్యమై దగె శిరంబున సంపెఁగతైల మంటఁగన్.

124


గీ.

కమ్మతేనె వెడలగ్రక్కు భృంగము లట్లు
సురభితైల మంట కురులు దనరెఁ
బుష్పధూళి దొఱయు పూవుటమ్మన బచ్చి
పసపుటటక లిడఁగ బడఁతి దనరె.

125


క.

కుటిలాలకకును గందపు
టటకలు పన్నీరు కురులయందు జిలుకుచుం
గిటగిటను నులిమె కరయుగ
కటకరటఝళంఝళత్ప్రకటరవ మెసఁగన్.

126


మ.

సమశీతోష్ణసుగంధజీవనములం జల్లింపుచుం గొంద ఱిం
దుముఖు లొరులఁ జిక్కు వాపుచు లసద్ద్యోవాహినీవారికుం
భములం బంగరుచెంబు ముంచుచు లసత్ప్రౌఢస్థితిన్ రేవతీ
రమణీపుత్రికి జల్కమార్చిరి శుభారంభక్రియాలోలలై.

127


సీ.

ఆననేందుద్యుతి నలమి దృగ్జలజముల్
        దెప్పఱిల్లఁగనీక గప్పి గవిసి
భాసురతాటంకభాస్కరదీధితుల్
        ధారాళకీలాలధార ముంచి
బుడ్డిచెంబులు ముంచు బుడబుడాత్కారముల్
        ఘనగర్జితధ్వను ల్గలయఁ బర్వి
బాహుమూలప్రభాబహులచకచ్చకల్
        మెఱుపులై వక్షోజగిరుల గ్రమ్మి

తే.

తరళదృశపెన్నెఱుల కప్పుటిరుల గెరలి
తేటగాటంపుగొజ్జంగినీటివాన
గురియుచో నంగదేశంబు నెరయ గ్రమ్మి
బొడ్డుబొడ్డెన బావి యుప్పొంగి పొరలె.

128


క.

అత్తఱి నొకబిత్తఱి తడి
యొత్తుచు పావడ సడల్చె నొయ్యన తనలో
హత్తిన క్రొత్తని సిగ్గున
జిత్తము తత్తఱిలుచున్న సీమంతినికిన్.

129


తే.

జలరుహానన కీరితి జలకమార్చి
చలువవలువల తడినొత్తి సంభ్రమింపఁ
బ్రేమ సౌవర్ణమణిమయపీఠమునను
జల గడిగినట్టి ముత్తెమువలెనె నిలిచె.

130


క.

తలనీరార్చుచు కురులం
జెలు వలరఁగ దువ్వి జారుసిక వేసిన న
క్కలకంఠకంఠి మధులి
ట్కలితలలితకిసలయానుగతలతవోలెన్.

131


క.

ఒకనీరజాక్షి నవచం
పకదామము సికను ముడిచి బాటింప చక
చ్చకితతటిదావృతబలా
హకమాలికభంగి రమ్యమై భాసిల్లెన్.

132


సీ.

ఈపద్మలోచన హిత మెఱింగి యొసంగు
        కలికిరో యుదయరాగంపుచీర
యీమానినీరత్న మామోద మౌనట్లు
        హేమభూషణములు నిడవె తరుణి
యీసైకతశ్రోణి కిష్టమైయున్నట్టి
        గురుహంసతతు లొసంగుమి శుభాంగి

యీకల్వపూఱెమ్మ కిచ్చజెందిన చంద్ర
        కావి యొసంగు మో కమలనయన


గీ.

గ్రందు ముత్యాలపందిరిక్రింద నిందు
మానినీమణి నీలతకూన నునిచి
చిలుక పిలుకలు బింబోష్ఠిఁ జేరకుండ
కావలిగ నుండు సాంకవగంధి నీవు.

132


సీ.

ఒకకాంతచెంతఁ బాయఁక పువ్వు సురఁటిన
        పెన్నెఱు ల్దడియార్పఁ బ్రేమ విసరె
నొకమత్తగజయాన చికురము ల్మెల్లన
        కొనగోళ్ల గీటి చిక్కులు సడల్చె
నొకలేమ దంతంపుచికిలిదువ్వెన బూని
        కుటిలాలకలు తళ్కుమనఁగ దిద్దె
నొకమానినీమణి చకచకత్కచపాళి
        నగరుసాంబ్రాణిక్రొంబొగలఁ జొనిపె


గీ.

కురులజడబడఁగను నల్లికొండె దీర్చె
కొప్పు సవరించె నొప్పులకుప్ప యొకతె
తాళుతాళుమటంచుఁ బూదండ దురిమి
మించుదద్దంబు నెదుట జూపించె నొకతె.

134


చ.

ఘనత ననంటికంబఁపు చొకాటములైన మిటారి పెందొడ
ల్గనుపడనీక చందిరపు కావిమెఱుంగుల వల్వగట్టి బి
గన వలిగబ్బిగుబ్బలను కంచుక ముంచి పయంట దిద్ది నే
ర్పున విరిదమ్మికైవడి మెఱుంగులచింగుల కుచ్చు దీర్చినన్.

135


గీ.

రమణి కవ్వేళ నుదయరాగంపుచీర
చింగు లొనరించి కనుగొన రంగెసంగె
బాలలేఁదొడ లనఁటికంబంబు లగుట
కలరుబూసిన మొగ్గలో యనెడి గతిని.

136

సీ.

తళుకుల మగఱాల గిలుకు మట్టియలకు
        పదనఖాగ్రద్యుతు ల్కొదువదీర్ప
చొక్కమౌ కెంపుల ముక్కుముంగరకాంతి
        నధరారుణచ్ఛవి నడ్డగింప
నలరుపాపడఁ జేరి హరినీలములదీప్తి
        కుప్పించ నొప్పు ముంగురులు మెఱయ
లాటంకమౌక్తికధళధళద్రుచులను
        మందస్మితచ్ఛాయ మాటు సేయ


తే.

బహుళపుటపాకకాంచనాభరణములకు
నిగ్గునెమ్మేనికాంతి వన్నెల నొసంగ
భూషణములకుఁ దనమేను భూషణంబు
గా రహింపుచు నుండె నక్కీరవాణి.

137


వ.

ఇవ్విధంబున నవ్వధూతిలకంబునకు న్మవ్వంపుపువ్వుఁబోణు లభంగ
మంగళానుషంగశృంగారతరంగంబులుం బొసంగు సింగారంబుం దొంగి
లింప, నుద్దామసౌదామినీధామస్తోమప్రతీమంబుగా కోమలసుషమాడంబర
విడంబితంబై ముఖహిమకరకబళనాయాతవేణీవిధుంతుదవదనాంతని
ర్యాంతసారసుధారసధారాయితంబై, యసమకుసుమవిసరమాలికాజాలం
బులు వ్రేల సీమంతినీలలామంబున కంతంత దురంతమోహచింతాభర
ధ్వాంతంబుం దలకెక్కి ఘనీభవించిన తెఱంగున న్మెఱుంగుదొఱంగుకచ
భరంబునం బ్రచురంబై, కాశ్మీరసౌరభ్యసమ్మిళితసీమంతముక్తాహారంబు
లాసనేందుబింబంబునం దొఱయ దొఱకొను నుడుగణంబుల వడువుననడరు
చేర్చుక్కకుం బ్రక్కల గ్రొక్కారు నన్నిక్కు శక్రధనుర్లతాగతిం జతురత నతిశ
యిల్లు భ్రూవల్లికల తుదలం దుల్లసిల్లు నఖముఖాలిఖితమకరికాపత్రంబు
లచే నిద్దంబులైన చెక్కుటద్దంబులం దద్దయుం బ్రతిఫలించు తాటంకంబులచే
నలంకృతంబై, శ్రీకారంబుల న్మొకారించు సుదీర్ఘకర్ణంబుల నవతీర్ణం బొన
ర్చుచాడ్పున ధగధ్ధగితంబులైన కజ్జలాంచద్దృగంచలకనీనికాతళత్తళల
చంద్రికాసందర్భంబున నిందుబింబంబునం బొందు రోహిణీసుందరీ
చందంబునం బఱంగు మెఱుంగుముంగరంగల గ్రొత్తముత్తియంపు

నెమ్మెలం జిమ్ముకెమ్మోవి కమ్మదనంబునకుం దీటూటకు న్మెలంగి యలిగి
యలిగి యధోగతంబగు బెల్లంపుటచ్చుబిళ్లయుం బోలి హెచ్చున
న్మెచ్చఁదగు చుబుకంబునం దవిలి విరళపరిమళచందనచర్చితసుందర
తరానుకారంబై నిజవర్తులతాస్నిగ్ధగంభీరరవంబుల దరమునదర దఱు
ముచు రేఖాత్రయశాసనప్రసిద్ధప్రకటం(బు) బిరుదుగట్టినచందంబున
నందంబుగా బిత్తరంపుముత్తియంబులసరంబులచే కరంబు తిరంబై
మాటునం జటిముత్తియంపుల ఱవికకుట్లుం జిట్లున బికిలించు సిబ్బెంపు
గబ్బిగుబ్బలం గుబ్బతిలు సాంకవకుంకుమామోదంబునం బాదుకొను
బాహుమూలముకురంబులకు న్మెఱుంగులొసంగు కేయూరపద్మరాగమణి
గణఘృణు లకుంఠితపద్మరాగానురాగఝుంకారితనిష్కలంకకంకణకింకిణీ
మంజుశింజారవాంచచ్చంచరీకసమంచితనాదంబులం బొలయు బాహుబిస
షండమండితమనస్సరోవరంబునం తానం బొనర్చి యనూనసూనప్రధాన
బాణుండు వళిత్రయసోపానపంథానంబునం గట్టిగా తడియార గట్టిన నీలి
పట్టు సికచుట్టుతాడు పోడిమినమీఱ నూగారుకారుచీమలబారుం జేరు
బొడ్డుపుట్టం గొట్టిమెట్టాడు వయోవేదండశుండాదండంబుల న్మండితం
బగు దృష్టిదండల డంబువిడంబించు చంచద్ఘంటికాసమంచితకాంచీగుణ
మరకతతోరణం బమరించు మీనకేతననికేతననికర్షణభూతలంబున నూత
నంబగు శుంభదూరుయుగశాతకుంభరంభరంభాస్తంభంబుల బైపొఱలు
నెఱయు తెఱంగునం బరంగు రంగుచలువచెంగావిదువ్వలువ చింగులుం
బొసంగ పదాంగుళంబులం దరహసనపరిధవితహిమకరకరణంబులు శర
ణం బని చరణంబుల నెఱుంగుభంగిం గరంబు సుకరంబగు నఖముఖం
బులం దనఱి యిక్షుధనుస్సాక్షాత్కృతజగన్మోహనమంత్రాధిదేవతయుం
బోలి మవ్వంపుజవ్వను లివ్వలవ్వలం గైదండ యొసంగ వేణీశ్రోణీభారం
బున మందగింప నొక్కమణిగణవేదికాస్థలంబునకుం దోడ్కొని వచ్చి ఱంత.

138


సీ.

గౌరవర్ణవరాంగఘననితంబచ్ఛాయ
        ధవళాంశుకచ్ఛాయ నవఘళింప
గజ్జెలు మ్రోయఁ దిగ్గనలేచి నడచుచో
        గబ్బిసిబ్బెఁపుగుబ్బ లుబ్బి పొరలఁ

దనను బిల్వఁగ గిరుక్కున మోము మరలింపు
        బెళుకులేఁజూపు ముద్దులు నటింప
వలపలవంక చెల్వలరఁ దిద్దిన కొప్పు
        విరిసరు ల్భుజమున వ్రేలిదూల


తే.

తావిచెంగావివిడెఁపుఁ గెమ్మోవిఠీవి
శారికాకీరపంక్తి నోరూఱఁ జేయు
తొయ్యలు ల్మెల్లమెల్లన దోడితేచ్చి
విమలమణిమయసింహాసనమున జేర్చి.

139


ఉ.

మానిను లిత్తెఱంగు నభిమన్యుని బెండ్లికుమారుఁ జేయఁగా
బూని యవద్యవాద్యములు బోరుగలంగ చిరత్నరత్నసం
ధానితహేమపీఠిని ముదం బలరంగను జేర్చి గౌరి క
ల్యాణ మటంచుఁ బాడుచు శుభాక్షత లిచ్చి రతిప్రమోదలై.

140


సీ.

కటకకంకణఝణత్కారానుకారమై
        కరకంజములు నృత్యగతి నటింప
కరకంజములు నృత్యగతి మేళవింపఁగా
        గబ్బిసిబ్బెఁపుగుబ్బ లుబ్బి యాడ
గబ్బిసిబ్బెఁపుగుబ్బ లుబ్బ నిబ్బరమునఁ
        గ్రొత్తముత్తెఁపుసరుల్ బిత్తఱింపఁ
గ్రొత్తముత్తెఁపుసరుల్ బిత్తఱింపఁగ నోప
        లేక లేఁగౌను మెల్లన వడంక


తే.

శతమఖోపలరుచి చకచ్చకితములగు
సోగకురులకు చాంపేయసురభితైల
మలఁది యుత్సాహమున నొక్కవెలఁది యెదట
నంటి యభిమన్యునకు శిరసంట దొణఁగె.

141


చ.

సురచిరకేతకీచ్ఛదవిశుద్ధములై న నఖాగ్రపంక్తిచే
కురులను బాయ గీఱి మెఱుఁగు ల్గొనచిక్కులు దీసి హస్తపం

కరుహఝళంఝళాకలితకంకణనాదము లుల్లసిల్ల బం
ధురతరసౌరభామలకతోయమునం బులిమెన్ శిరోజముల్.

142


చ.

కనకఁపుభద్రపీఠిని నృకాంతుని జేరిచి జారుపయ్యెదన్
వెనుకకుఁ జెక్కి చన్గవలు నిక్కఁగ మోము జెమర్ప కాంచికా
గుణరవముం జెలంగ నొకకోమలి నవ్వుచు బాహుమూలసం
జనితచకచ్చక ల్వెలయ సయ్యన మజ్జనమార్చె వానికిన్.

143


సీ.

ఒకలేమ తడియాఱ నొత్తె కుంతలములు
        వలిపెంపుచలువదువ్వలువఁ బొదవి
యొకకాంత చిక్కుఁబో జికురము ల్సవరించెఁ
        బచ్చికస్తురినూనె పదనునంటి
యొకబోఁటి సొగసుతీరికె కొండె సిక వేసి
        మల్మలీజిలుఁగురుమాలుఁ జుట్టె
నొకవధూటి మెఱుంగుచికిలిబంగరురంగు
        పట్టుపుట్టము మేన గట్ట నొసఁగె


తే.

నొక్కసతి వజ్రములముద్దుటుంగరాలు
మేలుమగఱాలదండకడేలు సరిఫి
ణీలు పోంచీలు బన్నసరాలు కుండ
లాలు హారాలు వాని కలంకరించె.

144


క.

విమలార్ధచంద్రఫాలము
న మృగీమదతిలక మిడియె నరపుత్రున కా
సుమశరునిధనుర్దండము
నమఱుచు నీలోత్పలాస్త్రమన రుచి బొసఁగెన్.

145


చ.

రమణి యొకర్తు మిన్నమగఱాలను జెక్కిన తాళిబిళ్లతో
నమరిన మౌక్తికప్రథితహార మలంకరణం బొనర్పఁగా
విమలభుజాంతరాళమున వేడుక జూడఁగనయ్యెఁ దారకా
సముదయమధ్యవర్తియగు చంద్రునిభంగి బొసంగి సంగతిన్.

146

ఉ.

లాలితరత్నకుండలములన్ మకరస్థితనేత్రయుగ్మమున్
లీల మహోత్పలప్రతిభ లేమొగ మైందవమైత్రి కైశికా
జాలవినీలిమచ్ఛటలు చంచదుదంచితకంకణప్రభల్
గ్రాలుపయోధి నిట్టిగుణరత్ననిధిన్ మరులొందు టబ్రమే!

147


చ.

అతివ యొకరు దర్పణగృహంబున రాసుతుఁడున్న హస్తసం
భృతసితచామరంబునను వీవఁగ దద్రుచిరాంగలోకనా
న్వితవివశంబు నొంది ప్రతిబింబితవిగ్రహమున్ భ్రమించి యం
చితగతి వీవ చేడెలు హసించిరి దానికి సిగ్గు దోఁపఁగన్.

148


సీ.

వృత్తనితంబ నీవిత్తఱి గురుప్రీతి
        మన్నించి యుత్పలమాల నొసఁగు
ముత్ఫలప్రియముఖీ సత్పథంబు గ్రహించి
        లలిఁ జేయు మంబరాలంకృతంబు
నంబరతులితమధ్యా ఘనురాలవా
        సారంబుఁ గని ఘనసార మొసఁగు
ఘనసారగంధి చక్కనిదాన వౌదువు
        రణితానుకూలకంకణము లొసఁగు


తే.

మనుచు నర్మప్రయుక్తరసానుకూల
వచనరచనాచమత్క్రియాభ్యుచితగతుల
సూనశరమూర్తి రాజసూనునకును
లలి నొనర్చిరి పరిణయాలంకృతంబు.

149


ఉ.

తోయజగంధు లీగతి వధూవరుల న్సదలంకృతాప్తిఁ గై
సేయఁగ సేరి యాననకుశేశయము న్వికసింపఁ బ్రోల్లస
త్కాయజసుందరాంగుఁ డగు కవ్వడిపట్టిని ధౌమ్యముఖ్యసు
శ్రీయుతవిప్రవర్యులు హసింపుచుఁ దోడుకవచ్చి ఱచ్చటన్.

150


సీ.

అతిచిత్రవస్త్రసమావృతకాంచన
        మణిమయస్తంభతోరణకాలితము

నకళంకమౌక్తికప్రకరసూనానూన
        దీప్రకాంచనఝల్లరీప్రయుతము
లలితపలాశపల్లవసుశాల్యక్షత
        ప్రకటకాంచనపాత్రభాస్వరితము
కుళలాజగోఘృతకుసుమప్రముఖదివ్య
        సౌరభ్యవస్తువిస్తారహితము


గీ.

భవ్యసమిదగ్నికుంభవిభ్రాజితంబు
బహుళకళకళవిప్రసంభాషితంబు
నైన కల్యాణవేదికాస్థానమునకు
జేర్చి మణిమయపీఠికాసీను జేసి.

151


గీ.

అనఘ ధౌమ్యప్రముఖవిప్రాననాబ్జ
సుకరనిగమప్రసిద్ధవచోమరంద
బృందసానందజనదృగీందిందిరముల
సుందరం బయ్యెఁ గల్యాణమందిరంబు.

152


క.

సురసరణివిమానము లన
గరికర మరుదైన హర్మ్యగణములయందు
న్వరమతి సురతతి పురసతు
లురుతరగురుతరత గురిసి రొగి విరులజడిన్.

153


క.

సూరిజనసమ్మతమున శు
భారంభహితోపవిధుల నలఱిచి నిగమా
చారకృతహోమకర్మము
లారూఢి నొనర్చఁ బూని రభ్యుదయమునన్.

154


క.

ఆవేళ విప్రవర్యులు
'దేవీం వాచ మజనయన్త దేవా' యనుచు
న్వేవేగ నుచ్చరించి య
థావిధి శుభకార్యధుర్యతత్సరు లగుచున్.

155

క. భూసురపుణ్యాహధ్వని
భాసురవీణామృదంగపటహధ్వని యా
రాసుతుల కంకణధ్వని
భూసురవర్త్మములు నిండి భోరున మ్రోసెన్.

156


చ.

సరఁగున లగ్నకాల మదె సన్నిహితించె నటంచు నద్ధరా
మరులు వచింప రాముఁ డభిమన్యునకు న్విధియుక్తిగా మహా
చరణసుఖాసనార్ఘ్యమధుపర్కసుగంధసుమాక్షతాదిస
త్పరిణయమంగళార్థహితపద్ధతిఁ బూజ లొనర్చి యంతటన్.

157


ఉ.

తోడనె పెండ్లికూఁతు నిట దోడ్కొనిరమ్మని యాజ్ఞ సేయఁగా
చేడియలెల్ల కౌతుకముచే శశిరేఖను జేరి కూర్మి యా
మ్రేడితమై జిలుంగలరు మేలిముసుంగు ఘటించి యారతు
ల్వేడుక బాడుచు న్సుమణివేదికకుం గొనితెచ్చు నంతటన్.

158


చ.

వలపుమెఱుంగు క్రొన్నెఱుల వన్నెలచె న్నలరారు నెన్నొస
ల్తిలకము రంగెసంగ ముయిదేఁట మిటారఁపుఁ గప్పురంపు మే
ల్కలపము తావి ఘుమ్ము రనఁగా సరిగంచుల చల్వపల్వ చిం
గులు దొలకింపఁగా బలునికూఁతును దోడుక వచ్చి రంతయున్.

159


సీ.

నూత్నకాంచనదీప్తి రత్నభూషణకు నె
        మ్మేనికాంతి వన్నియల నొసఁగ
కందర్పసాయకాకరనేత్రద్యుతు
        ల్గండద్వయంబులఁ గాంతి నింప
తరళకాంతిస్ఫురత్తారహారమ్ములు
        గుబ్బచన్నులఁ జెలంగుచు నటింపఁ
బదసరోజన్యాసవద్యసమీచీన
        ధాత్రి లాక్షారసచిత్ర మెనయ

తే.

బంగరుమెఱుంగుచేల ముసుంగువైచి
యిరుగడల నిల్చి బోటు లెచ్చరిక దెలుప
నతులితవ్రీడ తనమందగతులఁ బెనఁగ
కొమరు దళుకొత్తవచ్చె నాభ్రమరవేణి.

160


గీ.

ఒకరి కొకరి ప్రేమ లుత్కటం బగుటకు
మొనసి దృష్టిదోష మెనయు ననుచు
మాటినట్టు వారిమధ్యన నొకతెర
పట్టుపుట్టమునను బట్టి రపుడు.

161


ఉ.

మానిను లిట్లు దంపతులమధ్యను బంగరువన్నెపుట్టముం
బూని తెర న్ఘటింపఁగ మనోగతరాగరసంబు నిండి మో
పై నిగుడించి రెండుదెసలందు వెలుంగుచు దూఱి పాఱె నా
సూనశరుం డట న్ముఖముజూడని చుట్టఱికం బొనర్పఁగన్.

162


క.

సరఁగున తెరయెత్తిన న .
వ్వరవర్ణిని ముఖవిదీప్తిఁ బాటించినచో
శరదభ్రము విడి వెలువడు
పరిపూర్ణశశాంకబింబభాస్వర మయ్యెన్.

163


గీ.

పెండ్లికూఁతురువలన నప్పెండ్లికొడుకు
పెండ్లికొమరునివలన నప్పెండ్లికూఁతు
విమలమణిబంధముల మనఃకమలములను
ఘనత ధరియించిరో కౌతుకద్వయంబు.

164


చ.

సరఁగున లగ్నకాల మదె సన్నిహితించె నటంచు మున్ను ము
న్శిరములయం దొకళ్ళొకరు జీరగుడంబు లిడ న్విధిజ్ఞభూ
సురవరు లాగమప్రథితసూక్తుల తత్తదవశ్యమం గళా
చరణవిధు ల్ఘటింపుచు నొసంగిరి తన్మధుపర్క మయ్యెడన్.

165


క.

కమలాస్త్రుని రణజయశం
ఖము గెలచెడికొరకు బిరుదుగట్టిన గతి నా

రమణీమణి గళమున ను
త్తమమంగళసూత్రమును హితంబున గట్టెన్.

166


చ.

చెలియపదంబు రాజకులశేఖరుఁ డాత్మకరాంబుజంబున
న్మెలకువ బూని సన్నెకలుమీఁదను సప్తపదంబు లుంచఁగా
నలఘుగతి న్నడంపె పొలయల్కల దీర్చెడినాటి కిట్లనే
యలవడునంచు వావిగల యంగనలెల్ల హసించి పల్కఁగాన్.

167


మ.

ధరణీదేవసువాసిను ల్ధవళగీతధ్యానము ల్సేయుచో
కరకంజంబుల నాణేముత్తెముల[2] చొక్కంబౌ తలంబ్రాల ప
ళ్ళెరముం బూనుక నీవలావల గుబాళింపంగ దోయిళ్ల నిం
పి రయం బొప్ప తెర న్సడల్చి ఫలితప్రీతి న్విలోకింపఁగన్.

168


చ.

సలలితబాహుమూలరుచి జగ్గులు నిగ్గులు దేర గబ్బిగు
బ్బలపొగ రుబ్బి గుబ్బతిల భామ యొకించుక నిక్కి నిక్కి క
న్గలువల సిగ్గు వెగ్గలముగా పతిపై తలఁబ్రాలు వోసె మం
జులకరకంకణక్వణవిశుద్ధనినాదవినోదలీలలన్.

169


గీ.

ఆణిముత్యాల తలఁబ్రాల నతివమౌళిఁ
బ్రియుఁడు దోయిట ముంచి కుప్పించి నించె
భ్రమరములు డొల్చు కుందకుట్మముల భాతి
మెఱుఁగుక్రొమ్ముడి దొఱుఁగుట లెఱుకపఱప.

170


క.

వైవాహికమౌహూర్తిక
మీవిధి నెరవేర్చి ధౌమ్యహితగతి విప్రుల్
దీవింపుచు శుభవేది వ
ధూవరులం జేర్చి రఖిలతూర్యము లొలయన్.

171

మ.

గురురత్నంబుల గూర్చి దంపతుల కొంగు ల్ముళ్లు బంధించి భూ
సురకాంత ల్కపురంపుటారతులచే సొంపొంద వీణారవ
స్ఫురణ న్మంగళ మంచు వ్రీడ నగుమోము న్వంచి దీవించి పా
డిరి హస్తాంబుజకంకణక్వణనిరూఢిం దాళమానంబుగన్.

172


తే.

దినచతుష్టయ మిట్లు విధిప్రయుక్తి
వివిధమంత్రాహుతుల వ్రేల్వ వీతిహోత్రుఁ
డతులగతి దక్షిణావర్తనార్చి యగుచు
వెలిఁగె నుద్వాహసమ్మోదకలితుఁ డగుచు.

173


సీ.

నేత్రము ల్మెయినిండ నిండిజూచె బలారి
        యగ్ని తేజోమయుండై జెలంగె
కాలుఁ డుద్దండసంకాశుఁడై హర్షించె
        యాతుధానుఁడు తమిం బ్రీతినొందె
భువనోన్నతవిభూతి బొందె నవ్వరుఁణుండు
        ప్రవిమలామోదుఁడై పవనుఁ డలరె
కిన్నరేశ్వరుఁ డుబ్బె పెన్నిధి గనుమాడ్కి
        భవుఁ డుత్సవమున తాండవ మొనర్చె


తే.

నమరస ముదయ మెల్ల మిన్నంది బొంగె
నిలువుగన్నుల నప్సరోనివహ మరసె
భూనభోంతరముల నసమాన మగుచు
ఘనత జెలువొందుఁ బరిణయకాలమందు.

174


గీ.

వరుస నిబ్భంగి లౌకికవైదికప్ర
ధానహోమాదికర్మము ల్దగ నొనర్చి
హితపురోహితసుతమిత్రతతికళత్ర
సహితముగ భోజనోత్సవాసక్తు లగుచు.

175

మ.

సరసాన్నంబులు సూపముల్ ఘృతములు న్సౌరభ్యశాకంబులుం
బరమాన్నంబులు పిండివంటలు నపూపంబు ల్దధిక్షీరముల్
వరలేహ్యంబులు చోష్యము ల్మధుఫలవ్రాతంబులు న్మీగడ
ల్పరిపూర్ణ ప్రియత న్భుజించి రపు డాబాలాదు లామోదులై.

176


సీ.

ఇదె తృష్ణ దీర్ప నీయెద గల్గియున్న నిం
        పునఁ బయోధరకుంభముల నొసంగు
మదభిలాష లెఱింగి మన్నింపఁదలఁచితే
        లతిసుధారసఫలంబుల నొసంగు
నచ్చఱువయ్యె నాయిచ్చలో నీయెడఁ
        గల దతిరసరుచి తెలిసికొనఁగఁ
దగినట్టులున్నది తలఁచి చూచితిసుమా
        కారంబు నెచ్చట గానమిట్టు


గీ.

లనుచు నిజభాగగర్భోక్తు లినుమడించి
భుక్తిగొనువార లలర నర్మోక్తు లొసఁగి
సకలజనులకు భక్ష్యభోజ్యములఁ దృప్తి
గాగ వడ్డించి రాబోసకత్తె లపుడు.

177


మ.

పరిమోదంబున బండుటాకు మడుపు ల్బాగాలు పచ్చాకు న
త్తరుపన్నీరును జాపురా న్పునుఁగుగందంబు న్మృగీనాభి క
ప్పురము న్మేలగు సారసౌరభములు న్భూషాంబరంబు ల్ధరా
మరరాజోరుజశూద్రకోటికి బహూమానంబుగా నిచ్చియున్.

178


గీ.

మితదినాంతరమున తద్ధితపుణితిని
యిష్టకులదేవతాపూజలెల్లఁ దీర్చి
ప్రతిసరంబును విడి నిజబంధువృద్ధ
వితతికి నమస్కరించి దీవెనలు గాంచి.

179

ఉ.

దేవవిభుండు దిక్పతు లతిప్రమదంబున సీరితోడ సం
భావితులై జనార్దనుని బ్రస్తుతిఁ జేసి ధనంజయాత్మజుం
దీవెనలిచ్చి యప్సరసతీజనసంయుతుఁ డౌచు నర్జును
న్వే వెనువెంటఁ దోడ్కొని త్రివిష్టపము న్వెసజేరె నున్నతిన్.

180


క.

[3]లౌకికవైదికకర్మల
నీకరణిం దీర్చి ప్రౌఢలెల్లను గుములై
యాకాంతాకాంతులకు ని
షేకోత్సవముం ఘటింపఁ జెలఁగుచు పేర్మిన్.

181


సీ.

పవడంబు సకినెలపట్టెమంచము దోమ
        తెర గలీఫా పట్టుదిండ్లు హంస
తూలికాతల్పంబుఁ దూగుటుయ్యెల రత్న
        దీప ముల్వటవ్రేళ్ళతేఁటసురటి
కపురంపుఁబరణి బంగారుముక్కలిపీట
        నిల్వుటద్దంబు పన్నీటిగిండి
చిలుకపంజరము మేల్చిటిచాప దువ్వెన
        గందమ్ము కుడుక బాగాలడబ్బి


గీ.

పునుఁగుజవ్వాదిచందువ ల్పూలబంతు
లగరుసాంబ్రాణిధూపంపుఁబొగలు పసిడి
గిలుకపావాలు వీణె రంజిలుచుఁ జూడ
నందమౌ నొక్కకేళికామందిరమున.

182


ఉ.

అంతకుమున్నె గొందఱుఁ బ్రియాంగన లయ్యభిమన్యు జేరి సు
స్వాంతములం గుతూహలము జాల్కొన పుష్పసుగంధమాల్యము

ల్వింత నలంకరించి యతివేగమె తన్మహనీయదివ్యశు
ద్ధాంతమునందు కేళిభవనాంగణముం దగ జేర్చి యంతటన్.

183


వ.

ఇత్తెఱంగున నందు కొంద ఱిందువదన లమందానందకందళితహృద
యారవిందలై యమ్మందగమన లందంచుం గవిసి బొదివి తోడుకొనిరా
నయ్యిందువదన మందస్మితసుందరవదనారవిందంబుతో ధారాధరవినిర్గ
మితతటిల్లతాప్రతిభ నతిశయిల్లుచు సుధాకిరణుం గికురించి చరించు
హరిణీడింభంబుతెఱంగున సురాసురవిసరమథితపాథోనిధిం జనియించు
మంగళదేవతయుం బోలి సుందరతరారవిందబృందంబులం బొంది యం
దందమందగతిం గమించు మారాళబాలికానుకారంబున గుబ్బలుల నెబ్బు
గబ్బిసిబ్బెంపుగుబ్బలనుబ్బునిబ్బరంపుభరమ్మున గడగడ వడంకునె
న్నడుముతో కంకణకింకిణీవలయభద్రముద్రికాపుంజరంజితమంజుమణిగ
ణకిరణస్ఫురణసుషమాప్రశస్తంబగు హస్తంబున నొక్కవేదండయాన
కైదండ నొసంగ నిద్దంపునెలఱాలం దిద్దిన గద్దియం డిగ్గి చంచత్కాంచన
సమంచితకాంచీగుణఘంటికాఘణఘణనినాదం బనుమోదసంపాదకంబుగా
మండితమణిఖచితకుండలంబుల డంబు విడంబింపుచు చొకాటంపు
గండద్వయంబులం దాండవింప శుంభదంభోజసౌరభసంరంభంబుచే
విజృంభించు బంభరడింభంబుల చెలువున ముఖమండలంబున మాటిమాటికి
న్మెఱుంగుటుంగరంపుముంగురులుం జెలంగ దిశల బసలెసఁగ ముసి
ముసినగవుల నసదృశలజ్జాభరం బాచ్ఛాదింప శోణాధరమణిఘృణి
గణంబులు దంతకుందకుట్మలంబుల కనురాగం బొనర్ప చేతోజాతాతత
నూతనకేతనంబుభాతి జంటనంటిన పయంటగెంటెంబు వ్రేల గ్రొత్తము
త్తియంబుల నొరబెఱికి ధళధళ న్మెరపించుచు చిత్తజుం డెత్తిన పువుగుత్తి
కత్తులమొత్తంబుగతి నభంగురశృంగారతరంగితాపాంగవిలోకనంబు
చూపరులమనంబులు మిరుమిట్లుగొలుప నయ్యిక్షుధనుస్సాక్షాత్కృతవీర
మోహినితెఱంగునం బరంగు నబ్బాలికామణిం గాంచి.

184


క.

నేరుపునం బ్రౌఢాంగన
లారమణి న్విభునిశయ్య కంపఁగ మదిలో

కోరిక చేకూరఁగ శృం
గారరసోక్తులను హర్షగతమానసలై.

185


సీ.

చెలువుండు బట్టిన బెదఱకుండఁగ జుట్టు
        మమ్మ ధమ్మిల్లమ్మునందు విరులు
ఘర్మాంబుకణముల గరగకుండఁగను క
        స్తురిబొట్టు దిద్దుచేర్చుక్క నడుమ
నేరీతి బెనఁగిన నిట్టట్టుఁ జెడకుండ
        గందంపుఁ గుంకుమ గలయ నలఁదు
ప్రియుఁడు సయ్యాటలఁ బెనఁగిన విడకుండ
        నీవిపై మొలకట్టు నెఱి బిగింపు


గీ.

నెలఁత మీ కిచ్చు కానుక ల్నిజ మటంచు
ప్రోడలైనట్టి వారలతోడ దెల్సి
సతికి నూతనసంగమోచితములైన
బొలుపు దీర్చిరి రేవతీపుత్రి కపుడు.

186


క.

కొమ్మా ప్రియునకు నేఁడు వి
డె మ్మియ్యఁగవలయు నిప్పుడే కోపమున
న్మమ్ము బెనంగెద వేమిటి
పిమ్మట నీవల్లభునితొ పెనఁగుమి తరుణీ.

187


సీ.

వల్లభుం డనుకూలవశుఁ డౌచు పిలువఁగా
        మఱి వానితో మారు మసలకమ్మ
వెసపండుటాకుల విడె మిచ్చెనా ప్రీతిఁ
        జేచాచకను కక్కసించకమ్మ
హితవుగా తొడలపై నిడ బాఱఁజూచితే
        పొలయల్క నిట్టట్టుఁ బోవకమ్మ

వేడుక నీమాట వినఁగోరి పిలిచితే
        మాఱుబల్కక మోము మలపకమ్మ


గీ. చెలువుఁ డొకవేళ కొంత సిగ్గులకునైన
మందలించనివాని నెమ్మన మెఱింగి
కట్టెదు టొకింత నిలక నిట్టట్టు కడల
తలగిపోకమ్మ తొలకరితళుకుబొమ్మ.

188


తే.

చెప్పవలసి మేము చెప్పితి మింతయే
గాని మీరు మీరు గలసినపుడె
మనసు నిలుపగలరె మామాహితోక్తులు
గట్టిపెట్టలేరె గుట్టు విడచి.

189


సీ.

నివుగాక నితరులు నేర్పితే పలుకు దా
        చిలుకతో ప్రొద్దుబుచ్చెద విదేమి
పనిగల్గుగతి గలీఫా తీసి యింతలో
        మేళవింపుచు వీణె మీటవలెనె
చిత్రశాలలఁ దీర్చు శృంగారములనెల్ల
        నింతలో నీక్షింప నేగె దేమె
యసదృశాలంకారమౌ కవిత్వము నేఁడె
        తోఁచె నంచును మిన్ను జూచె దేమి!


గీ.

తడవులేదు ముహూర్తంబు తారసిలె న
టంచు వచియించు పలుకు లాలించవేమి?
టమ్మ లెమ్మన తత్తల మనెదదేమి
బాల యీలీల జపమేలఁ బలుకవేల?

190


చ.

మును తను గోరియుండిన విభు న్గవయం దఱి గల్గునప్పు డీ
యనువున సిగ్గుజెందు చెలి యంగన నెక్కడనైన లేదయో

వినఁగ విచిత్ర మిప్పగిది వింతలు పల్కెడివారె రేపె పో
పెనిమిటి బై పెనంగొనఁగ బిగ్గన లగ్గలకెక్కువారలున్.

191


క.

తగు నొకమాట రహస్య
మ్ముగ చెప్పుదుమో సదస్యముగ జెప్పుదుమో
మగువా నీమది కోపం
బగునేమో యనుచు సందియం బౌను మదిన్.

192


శా.

నీపుట్టింట బ్రియుండు పెంపుఁ గనఁగా నిత్యోత్సవం బేర్పడ
న్నీపై ప్రేమ నతండు నాతనిపయి న్నీప్రేమ సంధిల్లఁగా
నేపట్ల న్మన సేగతిం జెదఱెనో యేకాంతమం దెట్లు మీ
చూపు ల్మేపులు మీనంబు లెఱుగు న్మోధింపలేముం గదా.

193


మ.

మరునిం జూచిన తీవ్రచిత్తుఁ డిక మోమోటంబు చూడండు నీ
వరునిం జూడఁగ నంతకన్న నతితీవ్రప్రాజ్ఞుఁడౌ వారలి
ద్దఱ నేలంగల తీవ్రపాకి వికమీద న్నీకు నీసిగ్గుదొం
తర లెచ్చోట నణంగుచో గన నహో తన్వీ కురంగేక్షణా.

194


చ.

ఇక మము కోపగించి కను లెఱ్ఱన జేయుచు చేవిదిల్చి నె
మ్మొక మటు మల్పి కన్బొమలు మోడ్చిన కాదననేల నీకు వా
నికి మన సొక్కటైనగతి నెమ్మది మాకెఱుగంగనయ్యె నీ
విక పదివేలబాసలు పయింబయి జేసిన నమ్మ మమ్మరో.

195


ఉ.

మంచిదిగాని దచ్చనలమాటల నవ్వితి మింతెగాని చా
లించెద మిట్టి హాస్యరసలీలల కే మికనైన జాగుగా
వించక లెమ్ము సమ్మతిన వేమఱు నీమది గోరినట్లు నే
కం చటువంటి కాపురము గల్గెగదా కొదువేమి నీమదిన్.

196


చ.

అని యిటు లూరడించి యొకయంగనయుం గయిదండ నీయ నొ
క్కనలిననేత్రయు న్నఖముఖంబుల పెన్నెఱు లంటదువ్వ శో

భనమని యొక్కచంద్రముఖి పాటలుఁ బాడఁగ వచ్చె మున్ను బే
ర్కొను తన మందయానమునకు న్నెఱిముప్పిరి తో డొసంగఁగన్.

197


చ.

మనమున ధైర్యముం దొలిఁగి మాటికి కంపభయప్రమోదము
ల్బెనఁగొన మోమునం జెమటబిందువు లల్లుకొనంగ మెల్లమె
ల్లన నడగొంక పద్మముకుళస్తని వచ్చె ధనాఢ్యుపాలికి
న్మనవి యొనర్పవచ్చు ఘనమానుషశాలివలె న్నతాస్యయై.

198


ఉ.

అండజయాన కేళిభవనాంగణ మీగతి జేరవచ్చుచో
నిండె సువాసన ల్మణివినిర్మితగేహములందు దట్టమై,
నిండె తదంగకాంతులు ఘనీభవమై దశదిక్తటంబుల
న్నిండె నృపాలమౌళికి మనీషను మోహపుఁగోర్కె లెక్కువై.

199


సీ.

లలన లివ్వల నవ్వలను గ్రమ్మి నడిపింప
        రిక్కలనడి చంద్రరేఖఁ టోల్చు
పటుహాటకస్తంభపంక్తి మర్వున నిల్వ
        మరునికీల్బొమ్మవైఖరి జెలంగు
సిగ్గున తెరచాటు జేరుచో జలధర
        తతి సమావృతతటిద్గతి దనర్చు
చెలులు కట్టెదుట జేర్చిన పద్మినీబృంద
        గతహంసడింభకాకృతిని మెలఁగు


గీ.

కేలు లందించి పాన్పు నెక్కింప నిగుడ
గిరిసమారోహబర్హిణీక్రియ నొసంగు
సరసునకు దన్ను సమకూర్చు సమయమునను
గొంత లజ్జను తలవంచి సంతసించి.

200


క.

చనుచో ననుమానించెటి
వనజేక్షణ నరసి చూడవలెనని కోర్కు
ల్గన మాటు నృపుని నరసియు
వనితామణు లనిరి ప్రౌఢవచనరచనలన్.

201

మ.

చెలియా యెవ్వరికోస మీవగల నాక్షేపించె దేమమ్మ త
త్తలు మంచున్వెసనంటి యవ్విభునిచేత న్నిల్పఁగా మారుఁ డ
వ్వలఁ బోనీయక నానబెట్టుగతి క్రేవ న్నిల్చి నమ్రాస్యయై
తలపై కెక్కిన సిగ్గు భారమగుటం దా మోయలేనట్లుగన్.

202


క.

తీరిచిన మరునితత్తడి
తీరున చెలువొందు యీసతి న్నెఱవిద్దెం
దీరుచుకొని లేఁగేదఁగి
తీరుదొరఋణం బికెట్లు దీరుచుకొనెదో!

203


చ.

ఇదివరదాక నిట్టిగొడ వేమి యెఱుంగనిగోల సుమ్మి ని
న్గదిసెడికోర్కె దక్క పలుగంటుల కోర్వదటం చెఱింగి నె
మ్మది నెనరంటఁగా నడుపుమా రసికాగ్రణి పుష్పగుచ్ఛసం
పద గలయింతి గబ్బిచనుబంతులు నీయఱచేతిసొమ్మగున్.

204


తే.

వనితయెడ నవ్యశృంగారవైభవములఁ
దెలిసి భోగింపఁదగు నహో ధీవరేణ్య
రసికుఁ డిదె మెచ్చి తాంబూల మొసఁగినపుడె
నవ్వు మొగమెత్తి గని గైకొనంగరాదె.

205


చ.

మదనసమానమూర్తి యభిమన్యుఁడు నీప్రియుఁ డయ్యె నింక నీ
కొదువ లికేలనమ్మ! మదిఁ గోర్కెలుఁ దీరుగదమ్మ! గుట్టుమై
నొదగకుమమ్మ! వాని రసికోక్తులమర్మ మెఱుంగుమమ్మ! జె
ప్పఁదగిన మర్మము ల్మునుపె పల్కఁగలేదటవమ్మ కొమ్మరో.

206


క.

అని వనితామణికర మా
తనికరమున నిడెడు చతురతం గని నరనం
దనుఁడు మదిమెచ్చు సమయ
మ్మున నెనయు ముహూర్తకాలముం దాకొనఁగన్.

207

సీ.

గడెలెన్ని యాయెనో గనివచ్చెద నటంచుఁ
        దలుపు గిఱ్ఱునదీసి దాటె నొకతె
పోయిన చెలిరాకపోయెఁ బిల్చెదనంచు
        సతుల నిట్టటుఁ ద్రోసి జారె నొకతె
కుంకుమబరణి గైకొన నే మరిచితి నిదె
        తెచ్చెదనంచు నేతెంచె నొకతె
నెలఁత యెచ్చటికేఁగె నే బోయెద నటంచు
        దాని వెన్కకు నెట్టి దాటె నొకతె


గీ.

సకియ లొక్కొకపేరు బెట్టుకొని పోవు
నంతవారలతోడనే కొంత సిగ్గు
జనుట సన్న లెఱింగి యాసరసమౌళి
చెంత రాదీసి విడె మిచ్చు నంతలోన.

208


క.

దంతఁపుఁ దలుపు తటాలున
నింతులు గికురించి మూసి యిట్టటు కెళవు
ల్కొంతవడి బొంచి కని యే
కాంతసమయ మగుట తూర్ణగతి జని రంతన్.

209


గీ.

కాంతుఁ డంతంత తాల్మి యొక్కింతలేక
నించువి ల్వంచి యిరువురఁ గాంచి పొంచి
నారి నెక్కించి కుప్పించి బీరమెంచి
సూటి బాటించి ఱొమ్మున నాట నేసె.

210


గీ.

కాంతుఁ డపుడు కుచాగ్రదుర్గముల నంటి
మధ్యదేశంబునం గల మర్మము గన
కాఁగల దిదేమొ వలరాజు కయ్య మనుచు
వరజఘనభూమి గడగడ వణకదొణఁగె.

211

సీ.

పెదవి నానునటంచు పెడమోము మల్పఁగా
        నిద్దంపుఁజెక్కిలి ముద్దులందు
బిగిగుబ్బలంటున న్భీతి నొత్తిగిలంగ
        చక్కిలిగింతల జళుకుదీర్చు
చేఁజాప చెక్కిలిఁ జెనఁకునో యని తొడ
        ల్గదియింప కళ లంటి గరుగజేయు
దగ్గఱించె నటంచు సిగ్గున కనుమూయఁ
        బాటించి నయనచుంబన మొనర్చు


తే.

నతను పరవశుఁ డభిమన్యుఁ డనుటగాదు
బడుగుజడతరి వడయుల కడిమిజెడగ
నడుచు వెడవిల్తుపువుటంపుఁజడికి నుడికి
సుడిని తడఁబడ నితరులఁ దడవనేల.

212


సీ.

సరసతరప్రభాకరమనోహరములౌ
        జక్కవలను మాట నిక్కమయ్యె
కనుఁగొన మకరలాంఛనమనోహరములౌ
        దర్పకశ్రీ లన తథ్యమయ్యె
సంతతశృంగారసరసోన్నతంబులౌ
        లకుచంబు లనుటయే లక్ష్యమయ్యె
బ్రీతి పయోధరాఖ్యంబులౌ పూర్ణకుం .
        భద్వయం బన గుఱుతులయ్యె


గీ.

ననుచు వర్ణించి చూపెడునట్ల చనుల
నంట గమకించు తీర్చి పయంట నుంచు
మణిసరు ల్చిక్కు సడలించు మదిఁ గలంచుఁ
దాల్మి మది నుంచు నంతంత దగ్గఱించు.

213


తే.

ఒడయఁ డయ్యింతిచెయి బట్టి విడువకున్న
చిడిముడిన కొంత పెడమొగం బిడెడు నంతఁ

బెనఁగి డాతొడఁ గూర్చుండబెట్టె నపుడు
సిగ్గు కడదేఱ చెలువుండు చెలువుమీఱ.

214


క.

చనుబంతు లంటఁటో సి
గ్గున కరముల భుజము లబ్బుకొని గప్పుకొన
న్ననవిల్తు కయ్యమునకు
న్వనిత భుజాస్ఫాలనంబు వాటించుగతిన్.

215


సీ.

తేనె లొల్కఁగ బల్కితే చాలదే ఘన
        సారంపుబాగా లొసంగవలెనె
గోట నీచెక్కులు మీటితే చాలదే
        తెలియాకుమడుపులం వీయవలెనె;
కిసలయాధరము నీ వొసఁగితే చాలదే
        మెత్తనిచే నంఘ్రు లొత్తవలెనె
వలపుటూర్పులు మేన నొలసితే జాలదే
        విరుల దీవెనలచే విసరవలెనె


తే.

సౌఖ్యరతి నన్ను నేలితే జాలదే స
మస్తసేవావిధుల వెత మాన్పవలెనె
తడవు జేసెదవేల నే తాళజాల
కరుణ నీవేళఁ గౌఁగి లీగదవె బాల.

216


చ.

అని తమి నిల్పలేక చరణాబ్జము లొత్తెడి బాలికామణిం
దనయురమందుఁ జేర్చుకొని తద్దయు నిద్దపుప్రక్క నుంచునం
తనె సతి కంచుకంబు తనుదానె ముడి న్సడలంగ దంపతీ
తనువులు పుల్కరించె సుమధన్వుఁడు నించిన ముల్కులో యనన్.

217


సీ.

నెనఱున మెఱుఁగొప్పు నెఱిగొప్పు నమరఁగా
        కమ్మచెమ్మట చెక్కుగవ జనించె
చెక్కులు మునిపంట నొక్కగా గమకింపఁ
        బులకాంకురములు గుబ్బల బొసంగె

గుబ్బ లక్కున జేర్చి గుస్తరించెడునంత
        నెఱిపొక్కిలినయంటు నీవి సడలె
నీవిచేనంట కన్నియమేన తనుదానె
        జలదరింపుచు వివశతను జెందె


తే.

నంత కాంతుఁడు కెమ్మోవి యానినపుడె
కేళినీలీలఁ దేలెనో లోలనయన
కెరుకలేని మహామోహభరము గప్పి
కనుల నఱమోడ్చి సౌఖ్యసాగరము దేలె.

218


క.

తెలిపెటిదే మిక నవ్వల
నల పార్థతనూభవుని సుఖాలింగన మ
క్కలకంఠకంఠి కలయిక
లెలమి మహానందవిభవ మిడె నిర్వురకున్.

219


చ.

తనుమృదుభావ మెన్నక నెదం గఠినంబుగ జేర్చి పల్లవం
బున కెనయైన మోవి జిగి బొక్కఁగ నొక్కి, యలంచి చన్గవ
న్గనలు నటంచు నెన్నక నఖంబుల గ్రుచ్చి దయావిహీనుఁడై
వనితను గోరె ధాత్రి మగవారు స్వకార్యధురంధరుల్ గదా!

220


సీ.

నవఘర్మకణగణస్రవణకాశ్మీరాంగ
        రాగం బరుణమృత్పరాగ మనఁగ
మహితగాఢలింగనహితసన్మేళన
        లమితబాహాబాహి ననుకరింప
నధరసమాకర్షణాన్యోన్యరదపంక్తు
        లిక నౌడు గఱచుట లెరుకఁజేయ
లసదురోఘటనగల్లరిచపేటాదుల
        నినదము ల్ముష్టితాడనము దెలుప

గీ.

కోపుచూపుల బింకము ల్కూజితములు
దీర్ఘనిశ్వాసములు మనస్తీవ్రగతులు
సమము లౌచును మల్లయుద్ధమును బోలె
రతుల దేలిరి సతిపతు లతులగతుల.

221


సీ.

వేనలిబాసి క్రొవ్విరి దండ బెనఁగొన
        గస్తూరితిలకింబు కడల జెదజ
తావి దక్కఁగ సుగంధము మేన విడిటోవ
        కవగుబ్బ లిట్టట్టుగా చలింప
వగ గుల్కు ముంగురు ల్వదనాంబుజము గప్ప
        నఱమోడ్పుగందోయి యొరపు నెఱప
చిఱుచెమ్మటలు తళ్కుచెక్కుల బదనెత్త
        తావి నిట్టూర్పుల మోవి గదల


గీ.

మనసు గుదిరించి ప్రేమ నిమ్మడిగ బెంచి
కళలఁ గదలించి నేర్పున గారవించి
సొక్కి సొక్కించి కౌఁగిట నుక్కళించి
కలయికన వోఢ నిటు ప్రౌఢగా నొనర్చె.

222


సీ.

ముహు రప్రయత్ననిర్ముక్తనీవీబంధ
        మవిభక్తసంశ్లేషితాంగయుగళ
మాసాంతపరిగృహీతాధరపల్లవ
        మనురాగసంవర్ధితాంతరంగ
మతికుతూహలబాష్పగతలోచనద్వంద్వ
        మనువేలదంతక్షతాంతగండ
మధికసీత్కృతమణితాదిసుఖానంద
        మాలింగితభుజాలతాకూల


తే.

మభినచోద్దాముకామజలాభిరామ
మసమసుఖపారవశ్యశయ్యానిపాత

మంచితభ్రూలతాసమాకుంచితాస్య
మై దనర్చెను నూత్నసమాగమంబు.

223


గీ.

కులుకు వలిగబ్బిగుబ్బలు ల్గోట నదిమి
తొడలనంటుల నిట్టట్టుఁ దొలగ నడచి
సుడికొలంకు గలంచి యర్జునతనూభ
వాఖ్య కందర్పగందేభ మపుడు జెలఁగె.

224


క.

ఇరువుర లీగతి సరిసరి
పరిరంభవిజృంభమాణభావంబులచే
నెఱి గుఱిగ నురువడించిరి
పరికింపం గుసుమసౌరభన్యాయమునన్.

225


ఉ.

ఆలలనామణిన్ నృపకులాగ్రణి యీగతి సౌఖ్యసంపదన్
దేలిచె కండచక్కెరల తియ్యని కెంజిగురాకు మోవియున్
గ్రోలి మేటలుంగుఁ బూమొగడ గుబ్బల నొక్కట నొక్కి పొక్కిలిం
గేల నమర్చి చెక్కులను గీటి నవోఢరతి న్విలోలుఁడై.

226


చ.

నరసుతుఁ డీగతి న్మితదినత్రితయం బతిప్రీతిఁ గేళికా
భిరతిని దీక్షమై గడపి పిమ్మటఁ దచ్ఛశిరేఖభోగసం
భరణకుతూహలాప్తి బిగిబాయక జంభవిభేదిసౌఖ్యవి
స్ఫురణ నఖండసంపదలఁ జొక్కుచు వర్తిలుచుండి ఱంతటన్.

227


సీ.

పాకారికుంభికుంభములు చేగొనినట్లు
        పడతివక్షోజకుంభములు గొనుట
నరువుగా హరిచందనం బలందిన యట్లు
        నాతి గాఢాలింగనంబు గొనుట

గంధర్వవీణాసుగానము ల్వినినట్లు
        సుదఁతి సన్మణితాదిసూక్తి వినుట
బహుళసుధారసపాన మబ్బినయట్లు
        సతితావికెమ్మోవి చవులుగొనుట


గీ.

సంతసంబున సంతతం బింతితోడఁ
గవయుట(ను) స్వర్గబోగసంకాశ మగుచుఁ
బ్రీతి నీరీతిఁ బ్రతిబలారాతిభాతి
ధన్యుఁడై యొప్పె నయ్యభిమన్యవిభుఁడు.

227


మ.

నరనాథుండు క్రమక్రమంబునను తన్నారీశిరోరత్నము
న్సరసక్రీడలఁ గేళికావనుల భాస్వచ్చంద్రశాలాపరం
పరల న్సారసరోవరంబులను శుంభద్రత్నగేహంబులం
బరిరంభింపుచు గారవింపుచు మనోభావంబు లీడేర్చుచున్.

228


సీ.

చెనక నంటఁగనీక చిడిముడి కొన్నాళ్లు
        కోర్కెదాఁ బొసఁగుట కొన్నినాళ్లు
బిలిచిన సిగ్గుచే బెనఁగుట కొన్నాళ్లు
        గుఱిని దాపున నిల్చి కొన్నినాళ్లు
ప్రౌఢోక్తులకు మాఱు బల్కమి కొన్నాళ్లు
        కోడిగంబు లొనర్చి కొన్నినాళ్ళు
బలవదాలింగనాకలితము ల్గొన్నాళ్లు
        గురుస్వయంగ్రహణము ల్గొన్నినాళ్లు


గీ.

నంతకంతకు కాంతు విభ్రాంతితోడ
రసముల నెఱింగి గాఢానురక్తితోడ
సతిగుణోపేత తాలధ్వజాత్మజాత
వ్రీడఁ బోనాడె నానాఁడు ప్రోడ యయ్యె.

229


శా.

ఈలీల న్బహువాసరంబు లతిభోగేచ్ఛావిహారంబులన్
తాలాంకాత్మజతో మెలంగు నటమీఁదం బాండుసూను ల్జయ

శ్రీలం జెంది త్రయోదశాబ్దముల బాఱిం దేరి సౌభద్రు ను
త్రాలప్రక్రియ తల్లితో మగుడ నింద్రప్రస్థముం జేర్చియున్.

230


చ.

కొడుకును కోడలిం గని యకుంఠకుతూహలు లౌచు నక్కులం
దిడుకొని ధర్మజప్రముఖు లెంతయుఁ దాము వివాహకాలమం
డెడపడయుంటచే మది నొకింతఁ గొఱంతను నుత్తరాసతిం
దడయక పెండ్లి సేయఁగను దానికి గల్గె పరీక్షితీశుఁడున్.

231


క.

ఆతఁడె భవజ్జనకుండై
యతులితభరతాన్వయంబు నలఱించెను ద
త్ప్రతినిధివి నీవు నిఖిల
క్షితిపాలనజేయు సుప్రసిద్ధుఁడవు గదా!

232


క.

ఆయావృత్తాంతము వాక్
శ్రీయుక్తి సవిస్తరముగఁ జెప్పితి మునుపే
వేయువిధంబుల నీమది
నేయెడ మఱుపొందునే మహీతలనాథా!

233


క.

ఈపగిదిం జనమేజయ
భూపతికిం బైలుఁ డమృతపుంజరసోక్తుల్
జూపట్టఁ దెలిపి తత్పతి
చే పూజితుఁడై నిజేచ్ఛచే జనుదెంచెన్.

234

ఫలశ్రుతి

క.

శేషాద్రినాథభక్తిమ
నీషం దాలాంకనందినీపరిణయముం
భాషించిన విని వ్రాసిన
దోషములఁ దొలంగి ముక్తి తుది లభియించున్.

235

సీ.

భానుఁ డెందాక నభ్రగతుఁడై జరియించు
        చంద్రుఁ డెందాక తేజస్వి యౌను
ధరణి యెందాక సుస్థిరరూపమున జెందు
        గగన మెందాక నూర్థ్వగత మొందు
నుడుగణం బెందాక నడుచు హేమాద్రిపై
        జ్వలనుఁ డెందాకఁ జాజ్వుల్యుఁ డౌను
మహిని నెందాక రామాయణంబు బఱంగు
        ధర విభీషణుఁడు నెందాక నేలు


తే.

నిగమసారంబు లెందాక నెగడుచుండు
భూమిభారంబు నెందాక బూనునయ్య
నంత నామఫణీశ్వరుం డంతదాక
బఱగు తాలాంకనందినీపరిణయంబు.

236

ఆశ్వాసాంతము

క.

తుంగపతంగతురంగా
రంగత్కరుణాయతాంతరంగా! మదసా
రంగావనమంగాహృద
యాంగణవినివేశ వేంకటాద్రిరమేశా.

237


ఉ.

వైరివిఫాలఫాలదృశవందితనిర్మలభావభావజా
కారవికారదూరదరకంధరకంధరదేహదేవదే
వారవినేత్రనేత్రహితధర్మవృషాచలపాసవాసవా
ధారహరాజరాజబలిదానవదానవహానుమోదనా.

238


భుజంగప్రయాతము.

మదారాతికుంభీంద్రమాన్యన్మృగేశా!
 పదాబ్జానతాజేశబర్హిర్ముఖేశా!
ముదాలోకనాదత్తముక్తిప్రకాశా!
సదాసంచరచ్ఛేషశైలప్రదేశా.

239

మ.

ఇది ధారాళమరందమాధురివచో౽హీనప్రదారాఘవా
ర్యదినేశానుజభావనార్యతనుజప్రౌఢాంకమౌద్గల్యభూ
విదితోద్వేల్లితకీర్తిసారసరమాద్వీనారసింహార్యపా
పదతాలాంకసునందినీపరిణయాశ్వాసంబు షష్ఠం బగున్.

240

గద్య
ఇది శ్రీమచ్ఛేషధరాధరసౌధవీథీవిహరణ వేంకటరమణచక్షుర్విలక్ష
ణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్యలక్షణానవద్యవిద్యా
విలాసశ్రీనివాసగురుచరణస్మరణాభ్యసనరసనావికాసనిస్తు
ల్యకల్యాణసాకల్యమౌద్గల్యగోత్రపవిత్ర భావనాచార్య
పుత్ర పర్వత్రయకైంకర్యవిధాన వేంకట
నృసింహార్యాభిధాన ప్రణీతంబైన లాలాంకనందినీపరి
ణయంబను మహాప్రబంధంబునందు సర్వంబును
షష్ఠాశ్వాసము

241

కలియుగ శాలివాహనశ
        కంబులు వేదరసాచలేందు సం
ఖ్యలఁ జన నందు నాంగిరస
        హాయనభాద్రపదా౽సితాష్టమిన్
గలిత మృదూక్తి నీ సరస
        కావ్యము పూర్ణముగా రచించె న
త్యలఘుఁడు శేషశైలశిఖ
        రాగ్రవిహారి లసత్కృపామతిన్.”

శ్రీమతే రామానుజాయ నమః
ఆస్మగ్గురుభ్యో నమః
శ్రీశ్రీశ్రీ

  1. ఇచ్చటనుండి 116 పద్యముచివరివఱకు ‘తా’ భ్రష్టము.
  2. చొక్కొటంపు తల్బ్రాలు ‘తా’
  3. లౌకీకవైదికంబుల - (తా)