తాలాంకనందినీపరిణయము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాలాంకనందినీపరిణయము

చతుర్థాశ్వాసము

క.

శ్రీస్తనకుసుమస్తబక
న్యస్తవినిస్తులితచందనస్నిగ్ధలస
త్కస్తూరికాంక శుభవ
క్షస్స్థలసంకాశ శేషశైలనివేశా.

1


గీ.

అవధరింపుము, జనమేజయాధిపతికిఁ
బై లుఁ డనవరతాచ్యుతభ క్తిలోలుఁ
డతులవాచాలుఁ డతికృపాన్వితసుశీలుఁ
డఘవిటపజాలవాతూలుఁ డనియె నిట్లు.

2


శా.

ఈలీలన్ మిహిరోదయం బగుటచే నింపొందఁగా వందివై
తాళీకుల్ మృదుగీతవాద్యగతి నుత్థానింప సత్యావధూ
లోలుం డంతట మేలుగాంచి, హితశీలు ల్వెంబడింపంగఁ ద
త్కాలప్రక్రియలెల్ల దీరిచి సభాస్థానంబునం జేరియున్.

3


గీ.

హితులు. భూపతులును, పురోహితులు, వార
సతులు, మంత్రిప్రతతులు, పండితులు, కవివి
తతులు, గాననిరతులు, సన్నుతులు జేసి
యతులగతులను మతుల సూరతులు దెల్పి.

4


వ.

మఱియు నుగ్రసేనవసుదేవబలభద్రసాత్యకిసారణకృతవర్మప్రద్యు
మ్నానిరుద్ధాదియదువృష్టిభోజాంధకబంధుసందోహంబుల న
మస్కృతిపూర్వకంబుగా సంభావించి తత్తదుచితాసనంబుల నాసీను
లుగా నియమించి నిండుపేరోలగం బుండు సమయంబున.

5

సీ. పటుసితాంభోజప్రభాభాసురత మేన
        పాటలచ్చటసటాపంక్తి వ్రేల
హస్తపద్మభ్రమాయాతబంభరడింభ
        జాలవన్నలినాక్షమాల దనర
గంగాద్యనేకాపగానీరపూరమౌ
        వలికేలి ఘనకమండలువు మెఱయ
స్వాంసభాగోపరిస్వరపూరమహతీని
        నాదంబు 'నారాయణా' యనంగ


తే.

తారహీరపటీరడిండీరసౌర
వారణక్షీరకర్పూరశారదాభ్ర
చారుతరశుభ్రదివ్యశరీరుఁడైన
నారదుఁడు తారసిలె నంత శౌరిచెంత.

6


క.

నిలిచిన మౌనీంద్రుని పద
జలజములకు సాగి మ్రొక్కి సద్వినయముగా
వలగొనుచును నిది మేలని
దలఁచి వినమ్రత నుతించెఁ దగుమధురోక్తిన్.

7


సీ.

ఫణినాథుఁడే మౌనిపాటకు ఫణులెత్తి
        యాలించు కర్ణరసాయనముగ,
మున్ను వేదవ్యాసముని యేమహాత్ముని
        భావంబు గని జేసె భాగవతము,
దక్షప్రజాధినేతకు నేమునీంద్రుని
        చే ప్రజాపాలనస్థితి లభించె,
ఘనుఁడు ప్రాచేతసుం డనఘరామాయణం
        బేతపోనిధియాజ్ఞచేత గూర్చె,


తే.

నతతమోక్షార్జనోపాయచతురతఁ దగి
విదితబ్రహ్మాదులను వశంవదులఁ జేయు

నేవరర్షి యతండవు నీవ కావె
సాత్వికాతంద్ర! నారదసంయమీంద్ర!

8


క.

ఓ విబుధమౌని! యిట మీ
రై వేంచేయుటకు నే కృతార్థుఁడ నైతిం
గావున మీకారుణ్యమె
భావుకకారణము లోకపాలురకెల్లన్.

9


క.

అన విని సురసంయమి యి
ట్లనియెన్, హరి నీవు మర్త్యుఁ డాడినటుల ని
ట్లనజెల్లునే పరాత్పరుఁ
డని శ్రుతులం బల్క నించుకైన నెఱుఁగనే.

10


సీ.

సకలచరాచరాత్మకుఁడవై తగు నీకు
        నెల విందు గలదని దెలుప వశమె!
బ్రహ్మాండభాండసంభరణతగల ని న్నొ
        కొంతవాఁడ వటంచు నెంచ వశమె!
శర్వాదులే నిరంజనుఁ డంచనెడు నీదు
        రూప మిట్లని సాటు జూప వశమె!
యవని గుణాతీతుఁడవని బుధుల్ దెల్ప
        నీగుణం బిదిగా గణింప వశమె!


గీ.

తలఁప నీ వాదిమధ్యమాంతరహితుండ
వక్షరుండ వజేయుఁడ వవ్యయుండ
వప్రమేయుండ వాఢ్యుండ వచ్యుతుండ
వైన ని న్నెన్న దరమె సౌఖ్యప్రదాయి.

11


క.

అల వైకుంఠము విడి మీ
రిలలోపల నవతరించుహేతువు మారా

కలఁబోకలందు భవదు
జ్జ్వలసేవ లభింప సుల్లభంబయ్యె హరీ!

12


మ.

అనుచుం గొంత నుతించి శీఘ్రగతిగా నయ్యంబుజాతాక్షు వీ
డ్కొని యంతఃపురిలో జనార్దనవధూకోటి న్విలోకింపఁగాఁ
జన వైదర్భిసుదంతిసూర్యతనయాసాత్రాజితీభద్రల
క్షణభల్లాత్మజమిత్రవిందలు సముత్సాహాన్వితస్వాంతలై.

13


క.

చేడియ సుభద్ర వారల
తోడం జనుదెంచె మెఱుపుతోడం గూడన్
జోడైన చంద్రకళవలెఁ
గోడలి శశిరేఖఁ దోడుకొని మునికడకున్.

14


క.

వచ్చి ప్రణామ మొనర్పఁగ
నచ్చెలువలనెల్ల కుశల మడిగి వెనుక వి
వ్వచ్చుపడంతుకచెంగటఁ
జొచ్చి నిలిచియున్నబలునిసుతను గనుఁగొనెన్.

15


క.

మీకన్య మరునిచేతిశు
కీకరణిం దనఱె దీనికిందగు వరుఁ డే
లోకమున గలఁడొ యని శుభ
లోక నమున దెలిసి బుద్ధిలోఁ దలపోసెన్.

16


ఉ.

ఈరమణీలలామహృదయేశ్వరుఁ డీయభిమన్యుఁ డౌట కం
భోరుహగర్భుఁడే ఘటనబూనునటంచని దోఁచె శౌరి దాఁ
గోరినయిట్టికార్య మొనగూడదె కౌరవపక్షపాతియౌ
సీరధరుండు దీని కొకచిత్రము కల్పన జేయఁగాదగున్.

17


క.

తొలుత కురుపాండవులకుం
గలవైరం బినుమడింపఁగాఁ దగు నాకుం

గలకాల మించుకైనను
కలహంబునులేనిదినము గడపఁగ నేలా.

18


ఉ.

ఈశిరేఖచక్కఁదన మెల్లను విన్న సుయోధనుండు దా
నై శతధాకుమారునకు నంగన నిమ్మని యచ్యుతాగ్రునిం
డాసి వచింపఁగా నతఁ డొడంబడకుండునె యేతదర్ధమై
కేశవుఁ డెల్లభంగులను కేవలవిఘ్న మొనర్పకుండునే.

19


తే.

దాని కొకరీతి కలహమే తారసిల్లు
నల సుయోధనకార్య మట్లడుగుబట్టు
బడలి చిందఱవందఱై చెడుటవలన
నింక మోదంబె గాని నా కేమి చింత.

20


మ.

అని యూహించి విదర్భరాజసుత నెయ్యంబొప్ప వీడ్కొల్పఁగా
జని యాహస్తిపురీవరంబున సభాస్థానంబునం గొల్వుదీ
ర్చిన దుర్యోధనుఁ జేరబోవ నతఁ డర్థిన్ మ్రొక్క భద్రాసనం
బున నేమించి సుగంధమాల్యముల సంపూజ్యంబు గావించినన్.

21


క.

కురునాథ! కుశలమే మీ
గురుబంధుజనానుజాదికోటికిని, శుభం
కరమె నిజరాజ్యమును పరి
చరులు భవచ్ఛాసనంబు సలుపుదురు గదా!

22


చ.

అనిన నృపాలమౌళి దరహాసముఖంబున బల్కె దేవ మీ
ఘనకరుణారసంబున నఖండశుభోన్నతి గల్గు టెంత మీ
యనుగమనం బింకెచ్చటికినై యెటనుండియొ సాదరంబుగా
వినవలతున్ భవత్కృప సవిస్తరరీతిని దెల్పఁగాఁదగున్.

23


వ.

అనిన రాజేంద్రునకు మునీంద్రుం డిట్లనియె.

24


ఉ.

ద్వారకలో యదూద్వహుఁ డుదారయశోవిభవంబులన్ జగ
ద్భారకుఁడై హలాయుధుని బాయక కంసనృశంసముఖ్యసం

హార మొనర్చి సద్బుధజనావనుఁడై చెలువొందుచున్నయా
శౌరిని గాంచి నీ కొకటి చక్కనిమే లొనరింప వచ్చితిన్.

25


క.

మేలనఁగ నేమి దలఁచితొ
తాలాంకున కొక్కకూర్మితనయామణి సు
శ్రీలలరు ద్వారకాపురి
బాలామణులకును మేలుబంతి యనదగున్.

26


క.

భామిని చక్కదనం బిక
నేమని వర్ణింతుఁ గౌరవేశ్వర! చెలి నె
మ్మోము గనుగొన్న మాత్రనె
నామము శశిరేఖయనుచు నామదిఁ దోఁచెన్.

27


క.

చెఱుకునను పండుపండిన
కరణిం జనియించె కన్యకామణి కెనయే
సురకిన్నెరవిద్యాధర
గరుడోరగసిద్ధసాధ్యకాంతలలోనన్.

28


సీ.

గొప్పనీలఁపుకుప్ప లప్పుమోపరి తెప్ప
        లప్పడంతుక కప్పు కొప్పు కొప్పు
మరువాలుఁగమి బోలు మఱివాలుగల నేలు
        కళదేలు చెలివాలుఁగనుల డాలు
కంబుబింకంబు పూగంబు పొంకంబు ని
        క్కంబు బింబోష్ఠి కంఠంబు డంబు
కల్కిచిల్కలకుల్కు మొల్కకప్రఁపుఁబల్కు
        కుల్కుతేనియజిల్కు జిల్కు పల్కు


తే.

తమ్ము లద్దమ్ములను గ్రమ్ము నెమ్మొగమ్ము
మించు క్రొమ్మించు మించు నెమ్మేనినంచుఁ
జక్క వల కెక్కు నుతి కెక్కుఁ జన్నుదోయి
దాని వగజెందు సతిముందు గాన మెందు.

29

సీ.

సతినెఱు ల్నెమిలిపింఛమురీతిని జెలంగఁ .
        గాలాహిని జయింప ఘనత గాదు,
పడఁతిమో మిందుబింబమురీతిని జెలంగఁ
        దమ్ములనెడప చిత్రమ్ము గాదు,
సుదఁతికెంజిగిమోవి శుకతండమును బోల్పఁ
        బక్వబింబము నెంచ భరము గాదు,
కలికిపెందొడ లిభకరములవలె నొప్ప
        నికరంభలను గెల్చు టెచ్చు గాదు,


గీ.

చనులు జక్కవలబెడం గనుకరించ
తమ్మిమొగ్గల జిదుమ చిత్రమ్ము గాదు
తనువు బలుకప్పురఁపుఁదావి నెనసినపుడె
వివిధతాపంబు లార్పుట వింత గాదు.

30


ఉ.

ఎంతని నే నుతింతు తరళేక్షణ చక్కదనం బటుండ ని
మ్మంతటిలో భవత్సుతుఁ డహీనగుణాఢ్యుఁడు లక్ష్మణుండు న
య్యింతికి భర్తగాఁగ నొనరించితివేనియు నీకుఁ గోడలౌ
టింతియగాదు రాజ్యరమ కెంతయు భూషణమై జెలంగెడిన్.

31


క.

ఏమో తెల్పితినని మది
వేమరు సందేహసరణి వెదకకుమ యిదే
క్షేమంకరము నిజముగ
నామదిఁ దోఁచినది యిది యొనర్చుమి వేగన్.

32


క.

అని చెప్పి, సురమునీంద్రుడు
తనరాక నిరీక్ష సేయఁదగుచోటికి చ
య్యన నేఁగె కేశవధ్యా
ననిరూఢి ఘనంబుగా మనంబున బెనఁగన్.

33


క.

అంతట దుర్యోధనుఁ డ
త్యంతముదం బొదవ నాప్తులగువారల నే

కాంతమునకు బిలిచి ప్రలం
బాంతకుపుత్రీకథాసమగ్రము దెలియన్.

34


క.

మునివలన దనకుఁ దెలియుట
తనసుతుఁడగు లక్ష్మణునకు దక్కన్యక పెం
డ్లినిమిత్త మడుగఁగోరుట
వినయమునం బూసగ్రుచ్చువిధమున దెల్పెన్.

35


ఉ.

వారలు సమ్మతింప దగువారలఁ గార్యదురంధరైకవి
స్తారుల విప్రయుగ్మము పదంపడి బిల్వఁగ బంపి మీర లా
ద్వారక కేఁగుదెంచి బలభద్రసుతన్ శశిరేఖకన్యకం
గూరిమిమీర లక్ష్మణునకున్ సతిగా ఘటియించు టొప్పగున్.

36


చ.

అరమర లేని చుట్టము హలాయుధుఁడు న్మనపట్ల మిత్రుఁ డం
దఱివలెఁ బక్షపాత మదిఁ దల్పఁడు గావున మీరు తన్మనో
హరణసమాహితక్రియల నారసి యారసికాగ్రగణ్యుఁ డి
ప్పరిణయ కార్య మాస్తి నొడబాటుగొనన్ సమకూర్చఁగా దగున్.

37


క.

కౌరవనాథుం డిటువలె
గౌరవమున నానతీయఁగా విప్రవరుల్
నేరుపున శీఘ్రగతిచే
ద్వారక కేతెంచి రతులితప్రమదమునన్.

38


సీ.

మగరాలవాకిళ్లు మాణిక్యఁపునగళ్లు
        కనఁకపుదళ్లు నంగళ్లు దాటి
యలరుల ముంగిళ్ల నలరు కేలాకూళ్లు
        గోపురంబుల చాళ్లు గుళ్లు గడచి
సిరిగల మగనాళ్లు సింగారమున చాళ్లు
        దీరుసావళ్లు పందిళ్లు దళ్లు
మగని బాయని జోళ్లు సొగసైన విటకాళ్లు
        తమిమీరఁ ద్రుళ్లు సందళ్లు గాంచి

గీ.

ధీర్లు మణిహార్లు సంసార్లు తెగువవార్లు
వీర్లు రణశూర్లు బంగారుతేర్లు తీర్లు
కలిగి తొలఁగనికలిమిచే జెలఁగుచున్న
ద్వారకాపురి గాంచి మోదమున మించి.

39


మ.

తమరాకం దగువారిచే బలునకుం దాత్పర్య మౌనట్లు యు
క్తముగా దెల్పి తదాజ్ఞ గైకొని గృహాంతస్థానముం జేరి మో
దమునం బూజితులై ధగద్ధగద్ధగితభద్రస్వర్ణపీఠంబులం
గొమరొప్ప న్నివసించి సద్వినయసూక్తు ల్మీర విప్రోత్తముల్.

40


ఉ.

కౌరవభర్త మ మ్మనుపఁగాఁ జనుదెంచితిమయ్య మీ కతం
డారయ శిష్యుఁ డాత్మహితుఁ డర్మిలిచుట్టము గాన నట్టిచో
వేరికలేమి కిప్పు డొకవియ్యముఁ గోరినవాఁడు మున్నుగా
వారును మీరు భాగ్యవిభవంబులఁ దుల్యులుగారె యన్నిఁటన్.

41


క.

రారాజు కౌరవేంద్రుఁడు
మీరును భగవత్కళాసమేతులగుట బం
గారమున సౌరభము చే
కూరిన గతి వియ్యమందుకొన మేల్గాదే.

42


చ.

అతనిసుతుండు లక్ష్మణుఁడునా శుభలక్షణుఁ డొప్పు రూపని
ర్జితశతకోట్యనంగుఁడు రుచివ్రజబాలపతంగుఁ డార్యసం
స్తుతసుగుణానుషంగుఁ డతిదుష్కరవైరిచమూవిభంగుఁ డా
తతవరదానచంగుఁడు సదాకరుణాలహరీతరంగుఁడై.

43


తే.

నట్టులే నట్టి సుగుణముల్ తెట్టెబెట్టి
నట్టి కురుపట్టభద్రుని పొట్టఁ బుట్టి
నట్టి రాపట్టి దిట్ట నీపట్టి చెట్ట
బట్ట కోరిక బుట్టి రాజిట్టు బనిచె.

44

క.

నెయ్యమున మీకు వారికి
వియ్యముఁ దగుఁ గాక నెన్నివిధముల దలఁపన్
వెయ్యనఁగనేల పాలన్
నెయ్యి యొలుకురీతి గణించుట గాదే.

45


చ.

జగతిని గన్నియల్ వరుని చక్కదనంబె గణింతు రమ్మలుం
దగు ధనవంతు నెంచెదరు, తండ్రులు కీర్తిని గోరువారు, బం
ధుగణము సత్కులోన్నతగతుల్ గనుఁగొందు, రితేతరుల్సప
క్వగురుసుభోజ్యసంపదలగాంక్ష యొనర్చెద రుద్వహంబునన్.

46


క.

అదిగాన నిందఱల క
భ్యుదయమనోరథఫలాప్తి నొందఁదగు మీ
రిదె కన్యకామణిని మే
లొదపఁగ లక్ష్మణుని బెండ్లికొసఁగుటవలనన్.

47


మ.

చెలువం బొప్పఁగ విప్రు లిట్లను మృదుక్షేమోక్తు లాలించి యా
హలి కౌతూహలియై ముఖాబ్జమున హాసాలకూరభావంబునం
బులక ల్మేన జనింపఁగా భుజయుగంబుం బొంగ లోసమ్మతిం
దల నంతంత గదల్చి యిట్లనియె వాగ్దాటీసుధాపేటిగాన్.

48


చ.

తొలుతటినుండి దా భగినితో వచియించిన సూనృతోక్తులం
దలఁపక నిట్లు బల్కె, వసుధాసురులార! కురుప్రభుండు దో
ర్బలియుఁడు రాజరాజు ప్రియబంధుఁడు పౌరుషశాలి యాఘనుం
డెలమి దలంచుకార్య మీక నేవిధినైన దొలంగవచ్చునే!

49


శా.

మాకు న్వారల కానుపూర్వమగు ప్రేమ ల్మీరు సంబంధ మీ
లోకు ల్గాంచఁగ సుప్రసిద్ధ మిది యాలోచింపఁగా నేల మే
ల్చేకూరంగ సుయోధనాత్మజునకుం జెల్వొప్ప మత్కన్యకన్
వే కల్యాణ మొనర్తు దైవకృతికిన్ వేరొండు నూహింతునే.

50

తే.

కన్య శశిరేఖ కింక లక్ష్మణుఁడె మగఁడు
గాన బుధులు శుభస్య శీఘ్రం బటంచుఁ
బలుక వినియుండి యెడసేయఁ బాడియగునె
యనుచు వచియించి మదిలోన నతిశయంచి.

51


క.

తనదు పురోహితవర్గం
బును బిలిచి కురుక్షితీశపుత్రుం డగు ల
క్ష్మణసార్వభౌమవరునకుఁ
దనసుత శశిరేఖ నొసఁగు తలఁపుం దెలిపెన్.

52


క.

వా రవ్వధూవరులకుం
దారాబలచంద్రబలహితం బగు లగ్నం
బారసి యారసికునకు మ
నోరథఫలసిద్ధి గాగ నుడివి వినయతన్.

53


గీ.

దేవ నేటికి యాఱవదివసమునను
శుభముహుర్తంబు గన దినశుద్ధి గలిగె
జాగుసేయక దత్కార్యసరణులెల్ల
సాదరస్థితి నొనరింపఁ జాటవలయు.

54


మ.

అనినం గౌతుకచిత్తుఁడై హలధరుం డప్పట్టణం బెల్ల చ
య్యన శృంగార మొనర్చ జాటిన మహాహ్లాదంబునం బౌరు లం
తనె వీథుల్ విపణుల్ వితర్దు లవరోధస్థానము ల్దివ్యకాం
చనదీప్తిం ఘటియించి రంత నయనోత్సాహంబు సంధిల్లఁగన్.

55


వ.

మఱియు గర్పూరకస్తూరికాప్రముఖబహువిధపరిమళమిళితకర్దమ
(విలేపి)తరాజమార్గప్రదేశంబును తరణికిరణప్రకరణధిక్కరణ
మణిగణస్థగితరంగద్గాంగేయశృంగశృంగారితవైమానికానీకంబును,
జంభారికుంభినీకుంభబంభజ్యమానసంరంభోత్తంభశాతకుంభహీర

వారస్ఫారకంఠీరవాకారనిస్తారితబహిర్ద్వారప్రదేశంబును, సకలకళాకలాప
ముక్తాఫలవిచిత్రరంగవల్లికాలంకృతబలభిన్నీలవేదికాసముదయంబును,
పురోపవనఫలఖాదనోన్మాదసంచారితశ్రేణీభూతశుకశుకీనికరభ్రమప్రా
పితగారుత్మతతోరణాలంకృతంబును నై సాక్షాత్కాయజారాతికాయంబు
తెఱంగున సర్వమంగళాన్వితంబై విభావసుసూనుసభాభవనంబు లీల
నీలాంగదాలంకృతసకలపరీవారంబై, సాకేతపురీసదృశంబున రామ
లక్ష్మణప్రశోభితంబై ప్రావృడాగమంబుభాతి ఘనవిచిత్రవ్యాపకంబై
నభోమండలంబుభంగి బుధగురుకవిరాజరాజితంబై యుండె
నంతట.

56


క.

వైవాహికోత్సవమునకు
గావలయు పదార్థములు నగత్యము మీఱల్
వేవేగ గూర్చు డని బల
దేవుం డానతిడ వా రతిత్వరితమతిన్.

57


సీ.

తండులసూపాజ్యతైలామ్లఫలకటు
        క్షారగోధుమముద్గచణకమాష
తిలగుడఖర్జూలఫలనారికేళక్ర
        ముకహరిచూర్ణజీరకమరీచి
దధిమధుక్షీరవివిధశాకనుశలాటు
        కదళీఫలద్రాక్షకందమూల
కర్పూరచందనాగురుసుగంధకచూర
        యేలాలవంగతాంబూలపర్ణ


తే.

ముఖరవైవాహికోచితనిఖిలవస్తు
వర్గము ఘటింపఁగా దగువారలకును
సీరి నియమింపఁ దత్తత్ప్రకారములను
మంతనంబున జతగూర్చి రంతలోన.

58


క.

అనవద్యహృద్యవాద్య
ధ్వని సెలఁగ వివాహవార్తతతపౌరజనుల్

వినజాటినంతలోపల
గనుఁగొని మదిలో సుభద్ర కళవళబడుచున్.

59


క.

వెలవెలనబోయి తాన
వ్వలదోఁచక కొంతవడికి వనజాక్షున కీ
బలుఁ డుద్యోగించిన పెడ
తలఁపుం దెలుపంగ నతఁ డదల్పకయున్నే.

60


వ.

అని నిశ్చయించి.

61


చ.

కనుఁగవ కెంపుఁ బార మది కళ్వళ మంతకు బెంపుదేర హె
చ్చిన తమి మీరఁ జెక్కువగ చెమ్మటజార ప్రలంబవైరిపై
తనకసి దీర పట్టువిడి తాలిమి దూర సరోషభీషణా
నన మలూర నాకమలనాభునిచెంతకుఁ జేరి యిట్లనెన్.

62


క.

తగునా భవదగ్రజుఁ డి
ట్లగు నాయముదప్పి కన్య నన్యులకిడ మే
లగునా? నేటికి మీకుం
దెగు నాపాండవులతోడ నిక బాంధవమున్.

63


మ.

తొలుతన్ మీమగవారు మీర లతియాప్తుల్ బాంధవశ్రేష్ఠులౌ
టలు నూహించిగదా యిట న్మముల నుండంజేసి తా మావన
స్థలి నవ్యాజను సంచరించ జనినంతం బెద్దమాయన్న న
న్నలయింపం దనకూఁతు మత్సుతున కియ్యంగోరి నేడీగతిన్.

64


క.

కలిమి గలవా రటంచని
వలఁచి సుయోధనకుమారవరునకు నొసఁగం
దలఁచె నిది తగవె మీకుం
దెలియని ధర్మములుఁ ద్రిజగతీస్థలి గలవే.

65

గీ.

శిశువు తనకుఁబుట్టి చేటలో బడునాడెఁ
పౌరజనులు హితులు బంధుజనులు
గాంచ మత్సుతునకుఁ గన్య నిచ్చెదనను
బలుకు బొంకజేసెఁ బాపమనక.

66


వ.

అని యంతంత దురంతచింతాధరాక్రాంతసంతాపితస్వాంతయగు
నయ్యింతి న్మంతనంబున నవలోకించి రుక్మిణీకాంతుం డిట్లనియె.

67


ఉ.

ఓవిమలాంగి నీవు వెతనొందఁగ నేటికి దైవయోగమే
యేవిధి సంభవించునొ తదేకఫలాప్తిని ద్రోయఁగా వశం
బే వివరింప నగ్రజునభీష్టము ద్రిప్పఁగ నెవ్వఁ డోపు నై
నా వినవింతముచ్చట వినంబడె దీనికి నేమి సేయుదున్.

68


ఉ.

ఖండిత మాడరా దతని గట్టెదుటన్ సుతకున్ స్వతంత్రుఁ డా
తం డదిగాక కౌరవహితప్రదుఁ డౌట మదుక్తి విన్నచో
పాండవపక్షపాతి యని బల్కిన బల్కఁగనిమ్ము నింక వే
ఱొండని నమ్ము కొన్నిసునయోక్తులఁ జిత్తమెఱుంగ జూచెదన్.

69


క.

కానున్న కార్యమెల్లను
దా నెఱఁగి యెఱుంగనట్లు దగుమాటల న
మ్మానవతి నూఱడింపుచుఁ
దా నేఁగెం బలునికడకు దత్సోదరితోన్.

70


క.

పోయి హలాయుధుకడ దం
డాయితపూర్వకముగా నతాంగుండౌ
నాయకుని లేవనిడి బిగి
బాయమోహమున కామపాలుం డనియెన్.

71


క.

మురహర వార్తలింకే మన
గరుడధ్వజుఁ డిట్లు బలికె గంభీరసుధా

ఝరపూరమధురమధుసం
భరితస్ఫురితోక్తులను సభాజనులు వినన్.

72


శా.

స్వామీ యెన్నఁడులేని ముచ్చట మహాశ్చర్యంబుగా వింటి
భూమి న్సత్యతపోగరిష్ఠులు బుధు ల్పుణ్యార్జితు ల్దానని
ష్ఠామాహాత్మ్యులు సూనృతవ్రతులు నీషన్మాత్రమైనన్ వృథా
ప్రామాణ్యోక్తులు బల్కకుందురుగదా! పాపాతిభీతి న్మదిన్.

73


చ.

మొదల సహోదరీమణి ప్రమోదము నొంద ననుంగుఁగూఁతుఁ న
మ్మదవతిసూనుఁడైన యభిమన్యున కిచ్చెదనంచు సూనృతా
భ్యుదయమతి న్వచించియు సుయోధనుసూతి కొసంగి తుచ్ఛసం
పదలకు మోహమందు టిది పాపముగాదె ప్రలంబభేదనా!

74


గీ.

నీతికోవిదులగు బుధవ్రాత మెల్ల
'సూన్మతా త్పాతకం పరం'బే నిజమని
సత్యశౌచదయాజ్ఞానశాంతరసము
లందు నిత్యము నెడబాయకుందు రవని.

75


ఉ.

చెల్లెలు నమ్మఁబల్కి తుది చేటు లెఱుంగక బొంకు జేసి మే
నల్లుఁడు పాత్రుఁ డుండ నొకఁ డన్యుఁడు కన్యకు భర్తయౌనె యి
చెల్లనికార్యము ల్వినఁ జెల్ల దటంచని నాకు దోఁచె మీ
కెల్లవిధంబుల న్విశదమేగద నీతియనీతిధర్మముల్.

76


చ.

అన విని తోకద్రొక్కిన మహాహివిధంబున భూత్కరింపుచున్
వనజదళాక్షుఁ జూచి యిటువంటివృథావచనంబు లేల ని
వ్వనితను మున్నొసంగ సుఖవారిధి నీగతి నోలలాఁడె నిం
కను శశిరేఖ నిచ్చిన సుఖంబున కేమిట తక్కువయ్యెడిన్.

77


ఉ.

కౌరవు లిట్టిచుట్టములు గారటె నీవు కిరీటిపక్షమై
సారెకు బల్కుచుండి కురుసంతతిపై గనలంగనేల ని

ష్కారణభక్ష్యభోజ్యములు కై నెడద్రోయుచు చేదుకాయలం
గోరి భజించునట్టు లొనగూడదె పాండవబాంధవం బిలన్.

78


తే.

పూర్ణసామ్రాజ్యవిభవసంపూజ్యులైన
వారినెల్లను విడచి దుర్వారగహన
వన్యశైలాగ్రచరుల కిక్కన్య నొసఁగి
వియ్య మందంగ నూహించు వెఱ్ఱి గలఁడె.

79


క.

అనినం గృష్ణుఁడు తనలో
దను గనలుచుఁ బలికె పాండుతనయులయెడలం
గనికరములేక సుత నీ
కనుకూలుల కొసఁగి యూర్జితాప్తిం గనవే.

80


చ.

అది కనుగొందుఁ బాండుసుతు లాగ్రహులై చనుదెంచిరేని సం
పదల మెలంగు కౌరవులపాటు లెఱుంగగవచ్చు నీకు మే
లొదవఁగ నే వచించు వినయోక్తు లెఱుంగవుగాని దైవ మె
య్యది ఘటియించునో దెలియనౌనె మహాత్ములకైన నగ్రజా.

81


చ.

అని హేతుగర్భవచనము
లనుచు సహోదరిని జూచి యమ్మా యిక నీ
తనయునకు సుత నొసంగం
డని దెలియుము దైవయోగ మది యెటుఁగలదో!

82


మ.

అనుచుం దిగ్గున లేచి శౌరి జనఁగా నయ్యంబుజాతాక్షి స
య్యన తాలాంకునిమోము గన్గొనుచు నన్నా నీకు మేనల్లుఁ డౌ
ననిగాదా శశిరేఖ నిత్తునని యాథార్థ్యంబుగా బల్కె నె
మ్మన మాహ్లాదము మీర నిన్నిదినము ల్మాటాడకుంటిం గదే.

83


క.

నీమఱదు లడవి కేఁగిన
దీమొదలుగ వారిశ్రమ సహింపుచు నైనన్
నీమన్ననలకు మురిపెము
చే మనితిం గొడుకుపెండ్లి జేసెద వనుచున్.

84

క.

మాకుగల లేమి జూడకు
మాకురుపతిసంపదలకు నచ్చెరుపడ కీ
చీఁకటి వెన్నెల గాదా!
లోకులసంపదలు క్షణములో జెడు హెచ్చున్.

85


చ.

చెలిమిని గూఁతు నిత్తునని చేతిలొ చెయ్యిడి బాసజేయు నీ
పలుకు లబద్దమైన నను పాండుకుమారులు చుల్కఁజూతు రే
వలనను నీకు నీవె దయవాటిలగావలె గాక నొండు నీ
తలఁ పెడలింప శక్తి గలదా శితికంఠముఖామరాళికిన్.

86


క.

కావున భవదనుమతి గొని
బావల మఱదులను పతిని బాసిన గానిన్
వేవేలవిధుల వాఁ డొక
జీవనమని నమ్మి మిమ్ముఁ జేరితిఁ గదవే.

87


మ.

అని ప్రార్థించు సహోదరిం గని విరూపాక్షుండె బోలెన్ చల
ద్ఘనరౌద్రాకృతి సభ్యు లాబలుని నిష్కారుణ్యుడం చెన్న ని
ట్లనె నే నవ్వులకంచు బల్కుటలు యాథార్థ్యంబుగా బూని తెం
పున న న్ని ట్లరిగట్టఁగాఁ దలఁచెదే పూర్ణేందుబింబాననా!

88


ఉ.

కూటికి పేదలై యొరులకుం గల బిడ్డల నాసజెందు టీ
పాటిఫలంబు నీకుగల భాగ్యములెల్ల భుజింప కోడ లిం
కేటికి, కొంపల న్విడిచి యేకత కాఱడవుల్ జరించు మీ
బోటుల కిచ్చుకంటె తెగుబుద్ధిని నూతినిద్రోయు టొప్పగున్.

89


క.

నీకున్నవారె కన్నచి
కాకులఁ బడి కూడుకోఁక గానక తిరుగన్
సౌకర్యమైన కోడలు
లేకున్నం గొరఁతఁ గళవళించెదవేమో!

90

మ.

ఇలలో పాండవు లెంతవారయిన నేమీ, కౌరవాధీశుతో
తులదూగంగల రాజు లేఁడనుచుఁ దోడ్తో వియ్యమందంగ నా
తలఁపుం బూనుట కింతగా వగవ నీధర్మంబు గాదమ్మ మున్
బలిమి న్ని న్గొనిపోవునాటి ప్రియమౌ బాంధవ్యముం జాలదే.

91


క.

అని కర్ణశూలములుగా
వినిపించిన రోషదుఃఖవివశతచే స
భ్యనికాయ మెల్ల గనుఁగొన
దనుదానె దురంతచింతితాస్వాంతయునై.

92


సీ.

కజ్జలంబు దొఱంగఁగా వెడల్కన్నీరు
        పాలిండ్లకుంకుమ పదను చేయ
నుడుకుగా వెడలు నిట్టూర్పుచే నంతంతఁ
        జిగురాకుమోవి బిట్టగిలి కంద
ఖిన్నతచే కళ ల్సన్ననై యున్న నె
        మ్మోముదమ్మి యొకింత మురువుదప్ప
పవమాననిహతకల్పకవల్లికాభమై
        నెమ్మే న్వడంకుచుఁ జెమ్మరిల్ల


తే.

చింత నెదగూర్చి చెక్కిట చెయ్యి జేర్చి
చాల మదిరోసి బొటవ్రేల నేలరాసి
మొదటి హలిమాటలు దలంచి మోము వంచి
బలికె నొకమాట వాక్ప్రౌఢి బయలునాట.

93


మ.

తలిదండ్రు ల్విబుధు ల్సహోదరులచెంతన్ మున్ను నాకిచ్చు బా
సలు 'నే నవ్వుల కాడినాడ'నని కోసంబోక పల్కంగ ని
చ్చలు ని న్వేడిన లాభమేమి కురురాజశ్రీకి మోహించి పే
దలు కుంతీసుతులంచుఁ బల్కుటలు మీఁదం గానఁగా నయ్యెడిన్.

94


సీ.

ప్రియబంధువుల సంపదయు నుతించితె చాలు
        నొరులలేమి కసహ్య మొందవలెనె?

దొడ్డుకొంచెము లెన్నదొడరెదు నీబిడ్డ
        బొడ్డున మణిగల్గి పుట్టెనేమొ?
తోఁబుట్టువని నీతిదోఁచక పరుషోక్తి
        వచియింతు వీ వన్నవా! తలంప
నీప్రియాన్నంబును నెఱ భుజించుటకంటె
        కారాకు దిని బ్రతుకంగవలదె


తే.

నీనెనఱు జూడ నిట్లంటిగాని రాజ
కన్య లెందైన దగువారు గలరు మాకు
నిన్నిదినములు మిముఁ గోరియున్నపనికి
కన్నె నీయక వర్ధిలుఁ డన్నలార!

95


చ.

వనజభవుండు మున్ను తలవ్రాసినరీతి ఫలించు ధారుణీ
జనములకున్ శుభాశుభము, శాశ్వతమై సిరిదెచ్చుకోతలం
పునుగల నిన్ను బెక్కనుట బుద్ధియె గా దిటమీఁద నీకుఁ దో
చినక్రియ వియ్యమంది సుఖచిత్తుఁడవై మనుమీ హలాయుధా.

96


క.

అని యిట్లగ్రజు దూఱుచుఁ
దనభవనంబునకు జనియె దరుణీమణి క
న్గొనల వెడ లుడుకునీరున
మునిపయ్యెద దడువఁ జరణములు దొట్రువడన్.

97


క.

అంతన్ సాత్యకి యాహలి
నంతక మొనరింతునని మహారోషమన
స్సంతాపంబున గొందఱు
చెంతంగలవారు భీతిఁ జెందఁగ బలికెన్.

98


మ.

హరియున్ సోదరి నిన్ను బ్రార్థనలు సేయన్ వారి నుల్లంఘ్యవా
క్యరసాభాసము సేయఁ బాడియగునే కన్యామణిన్ వారికిం
గుఱిగా నీయక యున్నమానె ఘనులం గోపించు టేనీతి నీ
కురురాజు న్మది మెచ్చుచాలు నితరాక్రోశంబు నీ కేటికిన్.

99

క.

రణపండితులగు పాండవ
గుణమణులం ధిక్కరించి గొఱగాకుండిం
దృణసమము జూతువే, ఘనుఁ
డణుమాత్రము నిలుచునొక్కొ యర్జును నెదుటన్.

100


క.

ఊరికడ నున్ననేమీ
కారడవుల నున్ననేమి కౌరవులను వి
స్తారశరధార గూల్చెటి
వారే వారనుచుఁ దెలియవలయు న్నీకున్.

101


ఉ.

వా రిట కేఁగుదెంచి శరవర్షము నింపిననాఁడు జూడు నీ
కౌరవకోటికన్నకడగం డ్లెపుడాడినభంగి నాఁడు ని
స్సారము సేయు టొప్పు లఘుసంపదలం గరివించియున్నవా
రే రణశూరులం చనెడిరీతి యెఱుంగనిమాట పాడియే.

102


క.

అని కనలి పలికి కురుపతి
పనుపున పనివినిన భూసుపర్వులను గిరు
క్కున మరల చూచి వినయం
బెనయ సభాసదులు మెచ్చ నిట్లని బలికెన్.

103


క.

సిరి స్వతంత్రుఁడు గావున
గూరిమి మీయెడల గలిగి కూఁతురు నొసఁగం
గారణమది యట్లుండని
మీరాక విచిత్రమౌ సుమీ నామదికిన్.

104


చ.

జనవరబాలు రందఱకు చక్కనివాఁ డభిమన్యుఁ డర్మిలిన్
మునుకొనియున్న మేనఱికముం గొన నల్లుఁడు బాధ్యుఁ డున్నచో
కినుకను పాండవేయులకు గీడొనరించు సుయోధనుండు దాఁ
బనిచిన మీరలైన హితపద్ధతి బుద్ని జెప్పు టొప్పదే.

105

ఉ.

ఏసతి నేవరుండు వరియించ సృజించె విరించి హేతు వ
ట్లే సమకూరుగాక నితరేచ్ఛల దుర్మతు లెన్నియూహలుం
జేసిన నిష్పలం బగుట సిద్ధ మటంచు నెఱింగి యీవృథా
యాసము మీరు జెందు టికనైనను మీదట గాన నయ్యెడిన్.

106


క.

ఇత్తెఱఁగున సాత్యకి కఠి
నోత్తరములు కొన్ని బలుకుచుండగ సత్రా
జిత్తనయ రుక్మిణీమణు
లత్తఱి విని వినయ మెనయ నని రాతనితోన్.

107


మ.

అల సౌభద్రుఁడు మీకుఁ గృష్ణునకు మేనల్లుండొ? తాలాంకున
ర్మిలిమేనల్లుఁడు కాఁడొకో? నెనరులేమి న్మీర లీఖండితో
క్తులు బల్కం దమకేల కన్నియకు బాధ్యుల్ తల్లిదండ్రాదులుం
గలరుం గావున వారిసమ్మతము లింకం ద్రోయ నెవ్వండగున్.

108


చ.

అని యిటు లంద ఱన్నిగతు లాఁడుటకుం బలభద్రుఁ డించుకై
నను తడబాటులేక కురునాయకుఁ డంపిన విప్రయుగ్మముం
గనుఁగొని గంటిరే కమలనాభుఁడు సాత్యకియుం గురుక్షితీ
శునియెడ కిన్కయు న్నెనురు జొప్పడు పాండవపక్షవాక్యముల్.

109


ఉ.

వీరలు వెఱ్ఱులై పలుకువింతలు మీరుఁ దలంపనేల దు
ర్వారబలారివారమదవారణవారనివారణోరుకం
ఠీరవుఁడౌ సుయోధను గడిందిమగంటిమి నే నెఱుంగనే
మీర లతిత్వరం బ్రియము మీఱఁగ వీటికి నేఁగఁగా దగున్.

110


క.

సుముహూర్తవేళకును భూ
రమణుని వరయుక్తముగను రావింపుడు వే
గమె యనుచు రత్నభూషణ
విమలాంబరముల నొసంగి వీడ్కొల్పుటయున్.

111

ఉ.

అంతకుమున్ సుభద్రను హలాయుధుఁ డట్లు నిరాకరింప నం
తంత దురంతచింతితహృదంతరయై దివసాంతవేళ శు
ద్ధాంతముఁ జేరి యొక్కకఠినావనికంకటిశయ్యపైని మే
నెంతయుఁ జేర్చి లోవెతల నేరికి దెల్పక కుందుచున్నెడన్.

112


సీ.

తగటుగిండేదారుతలపాగ మెలచితీ
        ర్చిన కసీదాకోరుశిస్తుతోడ
చినుకుబూసల తురంజీచెరంగులరంగు
        నీటు మీఱిన వల్లెవాటుతోడ
మగరాతిపనిహొయల్ బిగిమొసల్వాకట్టు
        కత్తిహత్తిన వామకరముతోడ
గొనఁబురాచిల్కముక్కునదీర్చు పిడిబాకు
        జుట్టుతాఫ్తాదట్టు కట్టుతోడ


తే.

సకలమృగయావినోదాలసతనుఁ డగుచు
ఘనహజారంబుననె తురంగంబు డిగ్గి
వచ్చె తనతల్లియున్న నివాసమునకు
భద్రభుజబలరతుఁడు సుభద్రసుతుఁడు.

113


క.

తటుకున భవనాంగణమున
నిటునటు నల్గడలనెమకి యేకతమున కం
కటియ్య చటులకోపో
త్కటగతి వెతనొందు జనని గనుఁగొని బలికెన్.

114


క.

అమ్మా ముమ్మరమైన భ
రమ్మున నీమేను గళ దొఱంగినగతి నా
నెమ్మదిని దోఁచుచున్నవి
ధమ్మేమో దెల్పవమ్మ దాచకుమమ్మా.

115


ఉ.

అయ్యల కాపద ల్గలిగినట్టు వినంబడెనో మఱేమి యిం
కెయ్యెడ నెట్టివింత జనియించెనొ మామలుఁ గూర్మితోడ రా

దియ్యక వెగ్గలించిరొ సతీమణి నా కెఱింగింపవమ్మ నే
నెయ్యము మీఱ నీకుగల నెంజిలి బాపెదనమ్మ నెచ్చెలీ.

116


క.

చండప్రోద్బలబాహా
దండమహాభండనైకతాండవకేళీ
గాండీవపండితుని తన
యుండను నేనుండియుండ నొండననేలా!

117


క.

అని వినయ మెనయ బల్కెటి
తనయుని ననయోక్తు లమృతధారలుగా నె
మ్మనమున బెనఁగొనఁగా
దనకన్నులు విప్పి గద్గదస్వర యగుచున్.

118


క.

అన్నా మీయయ్యలకత
విన్నదనుక యున్నదటవె విను మిచ్చటనే
యెన్నెన్నొ గలవు మాపె
ద్దన్న నను న్నిన్ను గూర్చి యన్నలఘూక్తుల్.

119


క.

మును దనకుఁ గూఁతు గలిగిన
దినముననే సకలజనులు దెలియఁగ నభిమ
న్యున కిత్తుననుచు రూఢిగ
నను నమ్మఁగ బల్కె నేఁ డనాదరబుద్ధిన్.

120


చ.

మనకు విపక్షుఁడైన గురుమండలభర్త తనూభవుండు ల
క్ష్మణుఁ డనువానికిం బలునికన్నియ నీయఁగ విప్రయుగ్మముం
బనిచిన యంతలోన బలభద్రుఁడు పెన్నిధిగన్న పేదలీ
లను మదినుబ్బి యిత్తుననె లగ్నము నిశ్చయమయ్యె పుత్రకా.

121


క.

అందులకు హరియు సాత్యకి
కొందల మందుచును కొన్నికొన్నివినీతుల్

బొందింప నతఁడు పాండవ
నిందాస్పదమైన వాక్ఫణితి దొఱకొనుటన్.

122


ఉ.

ఏ నతిదీనతన్ హలి ననేకవిధంబుల వేడఁబోవ స
న్మాన మెఱుంగ కిట్టు లవమానముగా కురురాజ్యసంపదల్
దానె వహించినట్లు ప్రమదంబున 'సింగఁడు బుఱ్ఱఁడైన చం
దా'నను విఱ్ఱవీగి కుపితప్రకటోక్తులు బల్కె నిర్దయన్.

123


మ.

మును నే నవ్వుల కంచు బల్కుటల కేమో గట్టిగాబట్టి క
న్య నొసంగం బలుమాఱు వేడుటకు నాయంబౌనె మీవారలె
లను దుర్యోధనుదాడి కోడి వనులెల్లన్ సంచరింపంగ నీ
కును కోడల్ కొఱఁతాయె నంచు మది సంకోచించెదేమో యనన్.

124


మ.

పట్టెడుకూటికి న్మొలకు బట్టకు నీడ బరుండ కొంప లే
పట్టునలేక కౌరవులు పట్టపగల్ యిలు వెళ్లగొట్టఁగా
నట్టడవుల్ జరింపుచు ననాథలరీతి మెలంగువార లీ
కొట్టు దొలంగినప్పటికిఁ గోడలు మేడలుఁ గల్గవా యనెన్.

125


క.

కొడుకు న్నీవును కూడుం
గుడుచుటయేకాక నింక కోడలు మాపై
బడియుండవలె నటంచును
గడువేడుక గల్గెనేమొకో యని బల్కెన్.

126


మ.

పని బూనం ధనవంతులైన బదివేల్బంధువ్రజంబైన నీ
యనఘుండౌ ధృతరాష్ట్రనందనుని వియ్యంబందుకంటెం ఘనుం
గన నందైనను కూటిపేదల కొసంగం బూనుట ల్మాని మే
ల్లన నూతం బడఁద్రోయ మేలని దురాలాపంబు లాడెం జుమీ.

127


చ.

నను గినియంగ నాడి కురునాయకుఁ డంపిన విప్రయుగ్మముం
గనుఁగొని నేటి కాఱవదినంబున రాత్రికి లగ్ననిశ్చయం

బని పతితోడ బల్కియు రయంబున వారలఁ దోడితెం డనిం
బనిచెను నేటితోటి బలభద్రతనూజ సుభద్రకోడలౌ
ననెడు జనానులాపము వృథాయె నటంచు గృశింతు పుత్రకా.

128


తే.

సత్యకథనంబు మాని యౌద్ధత్య మూని
మనల దారిద్ర్యులని చూచి మదిని రోసి
కలిమిగల కౌరవుల మెచ్చె కన్య నిచ్చెఁ
బేదతన మిట్టిదియెగాన బృథ్విలోన.

129


శా.

చాపల్యాంకుర మార్తికారణము భాషావ్యత్యయప్రాప్తి దు .
ర్వ్యాపారాశ్రయ, మాప్తదూషితము, దైన్యాలాపజన్యంబు, హృ
త్తాపోపస్మృతి, బంధుసౌహృదవిఘాతంబైన దారిద్ర్య మి
ట్లాపాదించిన మిత్రులైన నెడసేయం బూను టాశ్చర్యమే.

130


క.

ఘనులగు పాండవు లిచ్చటి
కనుమానింపకను మనల నంపెడివేళన్
వనమునకు వారితో మన
మనుగమియించక వసించు టనుచితమయ్యెన్.

131


క.

చేటెఱుఁగని పనిజేసియు
మాటల పసియేమి దిక్కుమాలినగతి ని
చ్చోట వసింపఁగ నేటికి
నేటగు నాయాశలన్ని నేటికి దీరెన్.

132


క.

అని జనని దెలుప తనలో
దను గనలుచు సవ్యసాచితనయుఁడు రోషా
ననజనితఘనతరోచ్చ్వా
సనిరూఢసభీషణోగ్రసముదగ్రగతిన్.

134


తే.

దండతాడితమౌ మృగేంద్రమ్ము లీలఁ
బదహతంబైన గృష్ణసర్పంబు పగిది

ఘృతవినిక్షిప్తపావకాకృతిని గెరలి
ధీనిధిక్రోధజాజ్వల్యమానుఁ డగుచు.

134


శా.

ఏమేమీ బలభద్రుఁ డిట్లనియెనా! హీనోక్తి మాయయ్యలౌ
ధీమత్పాండుసుతప్రభావములు బుద్ధిం దల్పలేదేమొ మ
త్సామర్థ్యం బిదె చూడు యాదవకులధ్వంసంబు గావించి సు
త్రామాద్యష్టదిగీశు లడ్డుపడినం దర్జించి భర్జించనే.

135


క.

ధరణీతలముం గ్రుంకిన
హరిహరచతురాననాదు లడ్డంబైనం
గిరులుం బొరలిన యాదవ
విరహిత మొనరింతుఁ జూడు విశ్వం బెల్లన్.

136


మ.

బలుఁడే గాదు కృతాంతుఁడైన యెదుటం బ్రాపించినన్ మద్భుజా
ర్గళసాటోపధనుర్విముక్తబలవత్కాండప్రచండానలో
జ్జ్వలకీలాహతి ద్వారకానగర శశ్వజ్జంతుసంతానమున్
శలభప్రాయముగా నొనర్చెదను మత్సామర్థ్యముం జూడవే.

137


మ.

భువి నాతోడ నెదిర్చి బాహుబలిమిం బోరాడఁగా నోపు శూ
రవరేణ్యుం బరిమార్చి సంగరజయారంభేందిరన్ రేవతీ
ధవపుత్రీమణి నొక్కలగ్నమున నుద్వాహంబు గైకొందు యా
దవులుం గీదవు లెందు డాగెదరొ చూతా మంచు నత్యుగ్రుఁడై.

138


సీ.

మహితరోషాగ్నిధూమముపైని సుడిగొన్న
        చెలువున తనకొండెసిగ వెలుంగ
దిగ్దంతితుండప్రదీప్తదీర్ఘానర్ఙ్య
        ఘనబాహుదండయుగంబు సెలఁగ
తతపరాక్రమదేవతాదంష్ట్రలన కప్పు
        కోరమీసముల వయ్యార మమర

నడయాడుకొండపై యడరు శృంగము లట్లు
        నెగుభుజంబులు చెవుల్ దగుల నుబుక


గీ.

ధనువు నెక్కించి కనులరౌద్రంబు బెంచి
సాహసం బెంచి చివ్వున చౌకళించి
శూరతను బెంచి చన నెంచు సుతుని గాంచి
దిగ్గన సుభద్ర చింతించి దగ్గఱించి.

139


క.

అన్నా తామసి తామసి
యన్న వినీతిని దలంప వత్యుగ్రుఁడవై
యున్నన్ మాన్పగ వశమే
సన్నుతరణశూర! సవ్యసాచికుమారా!

140


ఉ.

కౌరవులుం దురాత్మకులు గాపున వారికి వశ్యుఁడైన యీ
సీరీకుమారినే సతిగ జేకొనకున్న గౌఱంతయౌనె శృం
గారగుణాభిరామలగు కన్నియ లెందఱు లేరు తండ్రి ని
ష్కారణవైర మేల నుడుగందగు నింతటనై న బుత్రకా!

141


శా.

ఏలోకంబులయందునైన గలదే యీలాఁటి దుష్కృత్య ము
త్తాలోగ్రాకృతి మేనమామలపయిం దండెత్తి భంజింప నీ
లీలం గూడచు తండ్రి కన్నియను చెల్మి న్నీకు నీకుండినన్
మేలాయెం జనదూష్యమైన పని సుమ్మీ కోపమే పాపమౌ.

142


చ.

అనుచు సుభద్ర కూర్మి తనయాగ్రణిచేతులు బట్టి భీతిమై
తనువు వడంక గద్గదికత న్వచియించు వినీతిబోధనో
క్తిని నిశితాంకుశంబులగతిం దగి మత్తగజంబురీతిగా
వెనుకకు ద్రొక్కి తామసము వీడక నిట్లనె తల్లితోడుతన్.

143


మ.

ధరణీభోగములెల్లఁ బోవిడిచి మాతండ్రు ల్మహారణ్యసం
చరులై పోవ పిఱుంద నీవు జననిచ్చన్ లేక మీయన్న లా

దరతం గౌరవ మెంతురం చని ప్రమోదం బంది పుట్నింట నీ
కరణిన్ నిల్చుట చుల్కజూడరె మహాగర్వోన్నతుల్ యాదవుల్.

144


క.

అమ్మా కోపము వలదని
నెమ్మదిలో నీకు దోఁచెనేని యిచటి హై
న్యమ్మునకు నోర్చి నిలువు, ము
దమ్మున నే జనెదఁ బాండుతనయులకడకున్.

145


మ.

అనినం గన్నుల బాష్పము ల్దొరుగ మాయన్నా! పతిం బాసియై
నను నిక్షేపమురీతి నిందలఁచి యిన్నా ళ్లిచ్చటన్ నిల్చి తిం
కను నీవే గన రక్షణం బయిన శక్యం బౌనె నీవెంట నే
జనుదెంతు న్మది సమ్ముదమ్మున ధనుర్జ్యావల్లి సళ్లింపవే!

146


క.

అని కొంత వంత దీఱఁగ
జననీమణి బల్క నతఁడు సమ్మతిగొని ద
త్క్షణ మర్ధరాత్రి వేళం
దన వెంటం దల్లి నడువఁ దత్పురి వెడలెన్.

147


క.

భూపాల యేమి జెప్పుదు
నాపార్థసుతుండు శరశరాసనయుతుఁడై
కోపాగ్నిశిఖలు వెడల వి
రూపాక్షునిరూపమున నుఱుప్రథ నఱిఁగెన్.

148


మ.

తనయునితో సుభద్ర వెనుదౌలుచు నేఁగుచు నించుకేనియుం
జనకుని దల్ప దన్నల ప్రశంసల నెన్నదు, తల్లినైన బే
ర్కొనదు మహాంధకారమునకున్ భయమందదు, రాచకూతు నె
మ్మనమున వెగ్గలం బగుచు మార్కొనురోషరసం బదెట్టిదో!

149


తే.

ఎండకన్నును నీడక న్నెఱుఁగకుండ,
బాదముల ముద్దరా లొత్తఁ బరగుసతికి

ఎండకన్నును నీడక న్నేకమగుచుఁ
బాదముల ముద్దఱా లొత్త పథిగమించె.

150


క.

ఈరీతి నర్ధరాత్రిని
ఘోరాటవిలోన జొచ్చి కొడుకుం దాన
య్యేఱులు పల్లేరులు న
ల్లేఱులుఁ బొదలెల్ల గడచి యేఁగెటివేళన్.

151


గీ.

సతతవంశానువర్తనోన్నతయశునకు
సతతవంశానువర్తనోన్నతి లభించే
వితతసద్విజనికరానువృత్తునకును
వితతసద్విజనికరానువృత్తి గలిగె.

152


చ.

చని చని కాంచె ముందట రసాల, తమాల, విశాల సాల, చం
దన, కృతమాల కౌశుక , రథద్రు, కపిత్థ, కురంట కాభయా
ర్జున, వకుళామ్ల, పీతనఖరోచనతాల, కదంబ, నింబ, కాం
చన, కరవీర, వీర, జల, జైత్ర, వట ప్రముఖద్రుమావళుల్.

153


ఉత్సాహ.

రాకుమారశేఖరుం డరణ్యభూమి గాంచె భ
ల్లూకము ల్వనౌకము ల్జలూకము ల్బలాకముల్
ఘకము ల్మహాకులోగ్రకోకముల్ నిహాకముల్
దాకిమూఁకలై చికాకు దాకొనంగ బైకొనెన్.

154


క.

ఈరీతి జనగ చనగా
తూరుపు తెలతెల్లవారెఁ దోయజముకుళా
గారములు వెడలె మధుపము
లారవి యుదయాద్రిశిఖర మధిరోహించెన్.

155


చ.

అపు డభిమన్యుఁ డగ్గహనమందున హల్లకతల్లజస్ఫుర
ద్విపులసరోవరంబు గని వేగమె తత్తటమం దహర్ముఖా

భ్యుపచితకృత్యము ల్గడపియుం జననీమణి తాను గొంత పా
పపువిధి దూఱుచుం ద్వయితవన్యపదభ్రమణానుతాపియై.

156


చ.

జనకులు నుండు చొప్పెఱుఁగజాలక గాఢతరుప్రకీర్ణకా
ననగతసింహభల్లహరిణవృకశంబరశల్యముఖ్యస
త్వనికరఘూర్ణితధ్వనులు తల్లికి దల్లడమండ మామజే
సినయవమానశల్యమది చిత్తము పెళ్ళగిలం బెకల్పఁగన్.

157


మ.

విలునమ్ము ల్దనజోడువీరులుగ హృద్వీథి న్మహాధైర్యని
శ్నలుఁడై కాఱుపొదల్ నదుల్ విపినముల్ శైలంబులుం దాటి య
వ్వల నొచ్చోట ఘటోత్కచ్చాశ్రమము క్రేవన్ గండభేరుండసిం
హలులాయవృకశంబరాద్యఖిలసత్వార్బాటఘోరాటవిన్.

158


మ.

తనయునితో సుభద్ర జవతం గమియింపఁగలేక నుస్సురం
చని యడుగుల్ దడంబడ ముఖాజ్జము బిట్టుగలుగఁ జెమ్మటల్
బెనఁగొని దప్పిచే గళవళింపుచు నిద్దుర మేనదూగఁగా
గని యభిమన్యుఁ డవ్యవధిగా జని యొక్క సరస్తటంబునన్.

159


క.

చల్లనితోయంబులు తన
తల్లికి దాహంబు లిడి లతాకుంజములన్
మొల్లమగు మృదులతలమున
బల్లవము ల్విరులు పాన్పు బఱచి ప్రియమునన్.

160


క.

పవళింపఁజేయు తనయుని
సవినయసకలోపచారసౌఖ్యంబుల మై
నెవదీఱి కంటనిద్దుర .
దవిలి వసింపఁగ మనోవ్యథాకలితుఁడై.

161


మ.

అకటా! దైవనియోగముం గడప శక్యం బౌనె గాకున్న
నొకటిం దల్పఁగ దైవ మొండొకవిధం బూహంచె తాలాంకపు

త్రికపై మోహవిదాహతం బొరలు టింతెగాని తద్భోగ మిం
చుక చేకూరని హేతునన్ జనని కిచ్చో వెచ్చనూర్చంబడెన్.

162


క.

అహహా! యీబలుకోనల
బహుళవ్యథ స్రుక్కె గమనభరమున నేఁ డీ
మిహిరాకరాస్య నెటువలె
గహనంబున ద్వైతవనముకడ జేర్పనగున్.

163


తే.

మామ నను జేయు యీయవమానమునకు
తామసంబున వెడలునంతనె పిఱుంద
యేటి కరుదెంచె యీమృగార్భాటములకు
మనునె యీరాత్రి సుమసుకుమారగాత్రి.

164


సీ.

పదములఁ గర్కశోపలము లొత్తినవేళ
        సొటసొటబోయి యుస్సురని స్రుక్కు
మిటమిట నెండలొక్కట మిక్కుటంబైన
        మిగులపెం దగల నెవ్వగల నొగులు
బెడిదంపువడగాడ్పు లుడుకులై యెదురెక్క
        సుడిఁబడి యక్క డక్కడనె నిల్చుఁ
బెల్లాకటను దల్లడిల్లి పెల్లున బేలి
        బహుళమార్గాయాసభరము జెందు


గీ.

నిట్టి సుకుమారి నెటువలె నెట్టుకొనుచు
నడచి కౌంతేయులున్న వనంబు గాంతు
నని వితర్కించు ధైర్యంబు ననుకరించుఁ
దల్లివెత లెంచు మదిలోన దల్లడిల్లు.

165


సీ.

రమణీయమందిరారామసౌఖ్యము మాని
        ఘోరాటవులను సంచార మొదవె
కేళీసరోవరక్రీడాసుఖము వీడి
        పంకాలవాలవిభ్రమణ దవిలె

కమనీయతరతూలికాతల్పముల డించి
        చటులశార్కరిలభూశయ్య గలిగె
కాంచనమయడోలికానిద్రలు దొలంగి
        కంటకవల్లికాకషణ మొదవె


తే.

శారికాపికశుకరవశ్రవణ దొలఁగి
కఠినతరఝల్లికారవాకర్ణన దగె
నహహ విధికృత్య మింక నే మనఁగవచ్చు
మామజేసిన యపకృతి వలన మాకు.

166


మ.

అనుచుం బెక్కువిధంబులం జనని మార్గాయాస మూహించి యం
తనె ధైర్యంబు ఘటించి వన్యమృగసంత్రాసప్రదోద్యద్ధను
ర్గుణఠంకారమహాధ్వను ల్దిశల బెక్కు న్మ్రోయ సన్నద్ధమా
ర్గణుఁడై తల్లికెడ న్వసించి శశిరేఖం జిత్తమం దెంచుచున్.

167


ఉ.

హా విమలాంగి! హాలలన! హా మధురాధరి! హా తలోదరీ!
హా వనజాతనేత్రి! దరహాసముఖీ! హరిమధ్య! హా సతీ!
హా విరిబోణి! హా రమణి! హా తరుణీ! శశిరేఖ నేడు నన్
హా విడనాడితే యహహ! హా! విధి యింతగ హాని జేసెనే.

168


ఉ.

పిన్నతనాననుండి యొకపెన్నిధి గన్న సమున్నతోన్నతిం
గన్నియ నిన్ను మిన్నగొని కన్నెదనంబును వెన్నుదన్ని వై
సెన్నఁడు వచ్చునంచు మదినెన్నుచు నున్న విపన్ను నన్ను నీ
క్రొన్నన వింటిమన్నెపయి గొన్నను కన్నెడసేయ న్యాయమే!

169


మ.

మదనాయాసము తెల్ల దెల్పి చెలి నన్ మన్నించుమంచు న్మహా
పదచే మ్రొక్కఁగ నన్ను నెత్తి కుచకుంభంబు ల్వడిం గ్రుచ్చి క్రొం
బెదవిం బానక మిచ్చి నాకొఱకు నొప్పిం జెందితౌ నాథ! యం
చు దయాదృష్టిని మేను చే నిమిరినన్ సొక్కించు టింకెన్నఁడో.

170


ఉ.

మామకహృత్ప్రభేదియగు మారునకుం గడుమిక్కుటంబులౌ
కోమలిగబ్బినిబ్బరపుఁ గుబ్బ లురమ్మున గ్రుచ్చి కౌఁగిటం

బ్రేమ ఘటించి నావగలబెం పణఁగించి సుధాధరంబుచే
వేమరు లంచమిచ్చి యరవిందదళాక్షి రమించు టెన్నడో.

171


సీ.

చేగొనుమని బండుటాకుల మడుపుల
        నధరంబుపై జూపి యాస గొలిపి
యది గ్రహించుటకు నే గదియగానీ కను
        గికురించఁ బొలయల్క గినుకనెవ్వ
గలఁ బొందు నన్ను జెక్కిలిగొట్టి బలిమిచేఁ
        దమి బెనంగ జెలంగి తమల మిచ్చి
మొనపంట చుఱుకంట మోవినొక్కుచు గబ్బి
        గుబ్బ లురమున జేర్చి గుస్తరించి


గీ.

యేలరా నన్ను, యీకోప మేలరా య
టంచు మదనుని ధైర్యంబు లెంచి మించి
మమత రెట్టించి మన్నించి మదిగరంచి
యించువిలుకేళి నన్ను లాలించు టెపుడొ!

172


క.

మాకులమున కాద్యుం డగు
రాకాశశియే నిరాదరంబున బ్రేల్చెన్
లోకమున బలిమి జెడిన న
హా కూరిమిబంధువర్గ మహితు ల్గారే!

173


మ.

అని చింతించిన యంత నతటనె ధైర్యం బుంచి ప్రోద్యద్ధను
ర్గుణనాదంబున దల్లికి న్నిదుర మేల్కోనౌనొకో యంచు ద
వ్వున దానిల్చి మదేభసింహశరభవ్యూహంబులం జేరనీ
కను బాణాసనబాణము ల్గొనుచు జాగ్రద్భావుఁడై నిల్చినన్.

174


ఉ.

అంతట ద్వారకానగరమం దభిమన్యసుభద్ర లిట్టు ల
త్యంతవిషాదచిత్తమున నర్ధనిశీధి నరణ్యగాములౌ
టంతయు పౌరులుం జనకుఁ డంతిపురంబున సత్యరుక్మిణీ
కాంతలు విన్నమాత్రమున గళ్వళమందుచు శోకమగ్నులై.

175

తే.

అయ్యయో! మున్ను పతి బాసినప్పుడైన
వెతల నెఱుఁగని యిమ్మానవతికి నేఁడు
దుర్గమంబైన కాంతారమార్గములను
కొడుకుతో గూడి వెతలెట్టు గుడిచె నొక్కొ.

176


సీ.

నెలఁతవాల్చూపు లేణీదృశంబు లటంచుఁ
        బెబ్బులుల్ పైబడి బెనఁగెనేమొ!
కోమలిపాలిండ్లు కుంభికుంభములంచు
        బెఱకి సింహములు పైకుఱికెనేమొ!
పడతియూరువులు రంభాస్తంభము లటంచు
        వేదండములు ద్రుంచివేసెనేమొ!
లేమజంఘికలు శాలీగర్భము లటంచుఁ
        గ్రోడము ల్గవిసి కోలాడెనేమొ!


తే.

తోడెవరులేక పసిబిడ్డతోడ నఱిగె
నహహ గుణవతి కింత ఘోరార్తి గలిగె
నేమి సేయుద మేమంద మెందు గంద
మక్కటా! యింతజేసెనే హలధరుండు.

177


వ.

అని యనేకప్రకారంబుల న్విలపించుచు సద్గుణవతియగు
రేవతిం జూచి యిట్లనిరి.

178


చ.

తగునటనమ్మ మేనఱికధర్మము లుండఁగ లౌకికంబులం
దగవు లెఱుంగనట్లు మఱద ల్నిఱుపేద యటంచు నాథునిం
దగ నెసగొల్పి యిల్వెడలుదాక గలంచితి రాడుబిడ్డ ని
ట్లగడుపడంగ ద్రోచి సుత నన్యులకీయగ కోర్కె గల్గెనో.

179


మ.

అదిగాక న్మును గూఁతు నిత్తునని సత్యాలాపము ల్కొన్ని మా
యెదుటం బల్కుట లింతలో మరచి నేఁ డీతుచ్ఛకౌరవ్యసం
పద కాశించి యనన్యమాన్యుఁడగు సౌభద్రుం డనర్హుండటం
చదయాప్తిన్ నడురేయి కాఱడవిపాలై ద్రోయఁగా బాడియే.

180

చ.

అని తనుకర్ణశూలముగ నాడెడి రుక్మిణిసత్యభామలం
గనుఁగొని రేవతీరమణి గాద్గదికన్ వచియించె నయ్యయో!
మనమున మత్కుమారి నభిమన్యున కీయక నన్యరాజనం
దనున కొసంగువార్త శతధా కలనైన నెఱుంగ నక్కటా!

181


క.

భూనభము లగ్రసాక్షిగ
నే నెన్నం డిట్టివార్త లెఱుఁగను ననుమే
ల్బోనాడి నింద సేయఁగ
మీనో రెట్లాడెనమ్మ మెలఁతుక లారా!

182


క.

ఏ భామతోటి సాటిగ
మీబావ మదాజ్ఞ మేర మీఱి నడువఁ డే
మో భామలార మీమది
నాభావ మెఱింగి దెప్పనగునటనమ్మా.

183


చ.

మదనసమానమూర్తి యభిమన్యుఁడె యిల్లిటపల్లుఁడంచు నే
మ్మది ముద మందుచుండి యొకమాయ నెఱుంగని నన్ను నూర కి
ట్లదయమతిం గతాగతము లన్ని యెఱింగి యెఱుంగనట్- నా
కిది యొకలేనిపాపముల నిట్లొడగట్టకుఁడమ్మ మ్రొక్కెదన్.

184


క.

దవిలిన బాంధవ్యము విడి
యవివేకముతోడ కన్య నన్యుల కొసఁగన్
ధవుని కిటు బోధజేతునె
యువిదల పుట్టింటియాశ లొక్కటిగావే!

185


క.

అని పలికి బాష్పభరితా
ననయై శోకింపుచున్న నాతి వినిర్దో
షనిరూఢభావముం గని
పనితలు చెలిఁగూడి వెతలువడుచున్నయెడన్.

186


ఉ.

అంతిపురంబునందు చెలులందఱు లొక్కట గుంపులై, ప్రలం
అంతకుఁ డాకురుక్షితివరాగ్రణిపక్షముగాన కూతు న

క్కంతుసమానుఁ డల్లునకు గాదని లక్ష్మణనామధేయుఁ డ
త్యంతహితుండుగాఁ బరిణయం బొనరింపు తలంపు బూనుటన్.

187


చ.

చెలియలి నిందసేయుట కృశింపుచు నాసతిపట్టితోట ని
ల్వెలువడి దుర్గమాటవులవెంట గమించుట నేటరేపటం
దలఁపడి లక్ష్మణాఖ్యునకు దన్నునొసంగెడివార్త లించుకన్
వెలఁదులచే నెఱంగి మది వేదనతో శశిరేఖ యిట్లనున్.

188


చ.

ఇది యొకవింతబుట్టె బలుఁ డింతటిదాక సహోదరీసుతున్
మది నొకపెన్నిధానము సమానము జూచి మరుద్వహంబు సొం
పొదవఁగ వానికే శుభమహోన్నతి జేతునటంచు బల్కి నే
డిది కడఁద్రోచి యీధనమదాంధసుయోధనసూతి కిచ్చినం
బదఁపడి ప్రాణమైన నెడబాసెద నయ్యభిమన్యు బాతునే!

189


చ.

పరమదయాళుఁడైన హరి పాండవపక్షుఁడె గాన సీరి యా
హరివచనంబు మీరఁడు యథార్థముగా నభిమన్యుఁడే ననుం
బరిణయమంద గూర్చు ననుభావముచే నొగిబాయలేని సం
బరముననుండు నన్ను నెడబాపునొకో విధి నేఁడు డైవమా!

190


చ.

తలఁపగ పాండవేయు లతిధర్మవివర్ధకు అందులో మహా
బలుఁ డభిమన్యుఁ డంగజితపంచశరుం డదిగాక వానిపై
తలఁపువహించి యేను బ్రమదంబున నుండ బలుండు నేఁడు కే
పల మవినీతబుద్ధిఁ బెఱవారల కీయదలంచె నక్కటా!

191


మ.

మతిలో కొండొకనాటనుండి యతిప్రేమ ల్మీర మాలోన మే
మతికౌతూహలవృత్తుల నెంగ తాలాంకుండు దుష్కృత్రిమా
న్వితుఁడై వాని కొసంగ సమ్మతిలక న్వేరొండు నూహించె నా
బ్రతుకుం గోరి సుఖించుకంటే బలవత్ప్రాణాంతమే మేలగున్.

192


క.

మాట లిక జల్లుపొల్లులు
కోటి యనం దగదు వానికూటమి విడువన్

యేటితొ నీటితొ త్రాటితొ
నేటితొ తోటిసతు లఱయ నే మృత నౌదున్.

193


మ.

అనుచుం గన్నులు మూయు విప్పు తడబాటౌ పాన్పునం బండు లే
చును గూర్చుండు నగుం భ్రమించుఁ దలయూచుం దత్తరించుం జలం
బునలో నుస్సు రటంచు బెగ్గిలు నభంబుం గౌఁగిలించున్ మనో
జనితాంతవ్యథబూని మత్తగజహస్తగ్రస్తపద్మాకృతిన్.

194


క.

అంతటిలోపల దను ము
న్నంతిపురంబునను బెంచినట్టి చిలుక య
క్కాంతవెత దీర్ప పచ్చల
బంతివలె న్వ్రాలె నంసభాగముమీఁదన్.

195


ఉ.

పిన్నతనంబునుండి తను బెంచినబ్రేమ జెలంగఁ బల్కె నో
వన్నెలచిల్క నీ విపు డవశ్యము నాయెడ కేగుదెంచు మే
లెన్నదరంబె దీని కొకహేతువు నామదిలోని కోరికల్
ము న్నభిమన్యుపైఁ గలుగు ముచ్చట లిచ్చట నీ వెఱుంగవే.

196


ఉ.

అందున నొక్కవింత ముసలాయుధుఁ డాకురురాజుభూతి కా
నందము నొంది న న్నతనినందను కీయఁగ కొంతసమ్మతిం
బొందుట మన్మనోహరునిపొం దెడలించుట దానజేసి పౌ
రందరసూతి చింతిలి యరణ్యము కేఁగుట వింటి కీరమా!

197


ఉ.

శైశవవేళ గూడిన ప్రశంసలు మాటికి నెన్నుచున్న నా
యాశలు నేటితో విఫలమౌ తఱిగల్గెను నేఁటికైన బ్రా
ణేశునిచెంత కీవు జని యే ననినట్లు వచించి నేఁడు నా
గాసి సడల్చి నావిభుని గైకొని రాగదె నీకు మ్రొక్కెదన్.

198


ఉ.

ఉత్తముఁ డన్నివిద్యలఁ బ్రయోజకుఁ డుజ్జ్వలరూపశాలి లో
కోత్తరసద్గుణాఢ్యుఁడు మహోగ్రబలుం డదిగాక నాకు మే

నత్తకుమారుఁ డంచు హృదయంబున నమ్మిన నన్ను పాపపుం
జిత్తజుబారి బాపుమని చిల్కమృదూక్తుల జిల్క బల్కవే.

199


క.

తా నెత్తఱి జనుదెంచునొ
కో నుత్తమకుసుమశయ్య నొయ్యన దనతో
నే నత్తమిల్లి యెన్నఁడు
మేనత్తసుతుం బెనంగి మే నెత్తుదునో!

200


సీ.

మదిగుట్టు జెడనీక నిదురింతమని జూడ
        దడదడ గుండెలో దల్లడిల్లుఁ
దల్లడం బుడుప నంతట లేచి పచరింప
        నట్టె వెన్నున నెట్టినట్టులౌను
నటులాయెనని గన్ను లఱమోడ్చి కూచున్న
        తనుదానె మే న్గుదించినట్టు వడకు
వడఁకుచో మై కొంతవడికి యూరటజెంద
        సివమెత్తినట్లనే చిత్త మడలు


తే.

నడలుటయెగాని యొకవెఱ్ఱికైన గొంత
వడికిని వివేకమును మహావనధిబడిన
వాని కొకనావయును దైవవశత నొదవు
గాని నారీతి దుర్నీతి గాననైతి.

201


ఉ.

ఇన్ని వచింపనేల నిక నెన్నియుపాయములైన బన్ని నే
నన్నవిధమ్ము లన్ని డెలియ న్నరనాథుని కూర్మి రంజిలన్
విన్నప మాచరించి యతివేగమె ద్వారక జేరఁ జేర్పు నీ
కన్న మదాప్తు లెవ్వరను గానను మాటికి మాట లేటికిన్.

202


క.

మరు నంప చిచ్చఱకు నే
కరణిం బ్రాణములు నిల్పగల నీవైనం
గరుణించు.మిక 'నహింసా
పరమో ధర్మ' మను శాస్త్రపద్ధతి వినవే!

203

క.

సకలోపయుక్తుల న్వా
నికి నా కొనగూర్చునేర్పు నీ వెఱుఁగవె యిం
కొకనూరు కల్ల లాడిన
నొకపెండ్లి యొనర్ప ధర్మమున్నది చిలుకా!

204


తే.

వాని నెందేని వెదకి తేబూనితేని
బ్రేమ నీకును నీకులస్వాములకును
బానకంబును వడపప్పు పంచదార
బంతి సాగించి విం దొనరింతు చిలుక.

205


చ.

ఉపమగ నిట్లు బల్క వినయోక్తుల కాశుక మీయకొన్నదై
రెపరెప ఱెక్కలార్చియు పరిభ్రమణంబున గొంతసేపు న
చ్చపలమృగాక్షికిం గమనచాతురి జూపి యతిత్వరం జనెన్
విపులమహాటవిన్ గగనవీధిని నయ్యభిమన్యుపాలికిన్.

206


చ.

చని యొకచో నికుంజసుమశయ్యను నిద్దురజెందు తల్లిచెం
తను ధనురంబకంబుల నుదగ్రగతిం గొని యుజ్జ్వలద్ధను
ర్గుణరవ ముగ్రసత్వముల గుండెలు వ్రక్కలుగా బెకల్చు ఫ
ల్గుణసుతు నొక్కచెట్టు కొనకొమ్మననుండి గనెం బ్రియంబుగన్.

207


గీ.

అంత నొక్కింతతడవు నవ్వింతచిలుక
జూచి చేజాచి యాసవ్యసాచిసుతుఁడు
పట్ట సమకట్టి మది కోర్కె లట్టెబుట్టి
పొంచి హర్షించి మించి వర్ణించఁదొడఁగె.

208


క.

ప్రతిలేని చిలుక యిది భా
రతిచేగల శుకమొ లేక రతిచేశుకమో
సతతము మాశశిరేఖా
సతిచేతిశుకంబొ కాక సతిచేశుకమో!

209


క.

అని పొంచి పొదలమాటున
తనువొంచి తదేకదృష్టి దగనుంచి జివు

క్కున చౌకళించి తనుజా
చిన చెయ్యంకించి యొడిసి చిలుకం బట్టెన్.

210


క.

పట్టుబడి జాతిచేష్టల
నిట్టట్టుం గొట్టులాడి యెట్టనకను రా
పట్టు పనిదిట్ట పఱపఁగ
బట్టిన గుట్టునను మనుజభాషల ననియెన్.

211


క.

పక్షులవంటి మముం గృప
రక్షింపుమటన్న నృపులు రక్షింపరె నే
సాక్షాత్పక్షిని గద నీ
వక్షమమతి బట్టుకొన ననర్హముగాదే.

212


సీ.

సర్వకాలం 'బహింసా పరమో ధర్మ'
        మని బల్కు శాస్త్రంబు లవియు వినవె
నిరతంబు 'పాపాయ పరపీడన' మటంచు
        తెలివి జెప్పుటలు బుద్ధిని దలఁపవె
సతతమ్ము 'నాత్మవ త్సర్వభూతాని' యన్
        ధర్మవర్తనలపద్ధతులు గనవె
సుప్రసిద్ధిగ 'నధర్మః ప్రళయం యాతి'
        యని నీతికోవిదు లన నెఱుఁగవె


గీ.

హింస కుభయంబుఁ బరపోషణేచ్ఛ భూత
సమత ధర్మానుకూలనాసక్తి గలుగు
నీవు నను బట్టినట్టి దుర్భావ మేమి
ధన్య యభిమన్య సకలరాజన్యమాన్య.

213


క.

అని వినయ మెనయ బలికెటి
తనచేతిశుకంబు మేను దగ నిమిరి చురు
క్కని మనము గలఁగి యిట్లను
దనదు వచోనిచయ మమృతధారలు గాఁగన్.

214

క.

నీ పుట్టు మొదలు దెలియక
జేపట్టితి నింతెగాని చిలుకా యికనే
చేపట్టిన నీపట్టున
పాపం బించుక దలంచి పట్టుటగాదే!

215


తే.

ప్రేమచే వ్యాసనందన పేరు మోసి
యాదిలక్ష్మీసుతునకు వాహనమ వగుచు
ఘనతరులఁ గూడి ఫలలాభమున జెలంగు
శుకవతంసమ నిను హింసజొనుపఁ దగునె.

216


చ.

అన విని యాదరోక్తు లిటులాడెడు నయ్యభిమన్యుతో శుకం
బనియె నృషాగ్రణీ భవదుదంచితబుద్ధికి సంతసించి నీ
మన మరయంగ నేననెడి మాటలమాత్రమెగాని నీ ప్రియాం
గన శశిరేఖ బెంచిన శుకంబను నిన్ గన నేగుదెంచితిన్.

217


తే.

ఇంతి యంతంత కుంది లతాంతకుంత
తాంతసంతాపచింతితస్వాంత యగుట
లింత గానక యిటుల నేతెంతురయ్య
యింతవాఁడవు తగుదు వీ వెంతకైన.

218


క.

బెండంతపనికి నీవొక
కొండంత న్మదిని బెంచుకొని వచ్చినచో
చెండాడకున్నె మరుఁ డతి
చండాలులతో మెలంగు సాహసిగాడే?

219


క.

నరవర నిను మది దలఁచిన
తరుణికి రణమయ్యె పరభృతధ్వనులు నిశా
చరుఁ డయ్యె కుముదమిత్రుఁడు
మఱిమఱి పెనుసోఁకుఁ డయ్యె మరుదంకురముల్.

220

సీ.

ఒకవేళ మరుశరాళికి భీతిని వడంకు
        నొకవేళ శశిదీప్తి కుడ్డు గుడుచు
నొకవేళ తనుదానె యుస్సురంచని స్రుక్కు
        నొకవేళ సఖుల జీరక నదల్చు
నొకవేళ భవదాకృతికి చిత్తమున మెచ్చు
        నొకవేళ తనుసుఖాప్తికిని రోయు
నొకవేళ బ్రాణముల్ బెకిలించ నూహించు
        నొకవేళ జనకు నూరక శపించు


గీ.

నొక్కవేళను తసమేడ నెక్కి నిక్కు
నిక్కి నీరాక గోరి నల్గిక్కు లరయుఁ
బిన్నతనమున మీరున్న వన్నె లెన్ని
కన్నెతమి గొన్న చిన్నె లెన్నెన్నొ గలవు.

221


చ.

ఎవరికి దెల్పరా దనుచు నింతి మనోవ్యథచే గలంగు నిం
కెవరికి దెల్పకున్న గత మెట్లని చింతిలు తెల్పవారు వా
రెవరి కెఱుంగజేసెదరో యిట్టి వినిష్ఫలితప్రచింతనల్
వివర మెఱుంగరంచు ధృతివీడును యెప్పుడు వేడు దైవమున్.

222


గీ.

అతివ తపియించు విరహాగ్ని కౌషధంబు
నీదు ముఖబింబపూర్ణచంద్రోదయంబు
నీకుగల్గు వియోగరుఙ్నిచయ మణఁప
తరుణిమధురాధరంబె చింతామణియును.

223


ఉ.

అంగన నిన్ను చిత్రపటమందు లిఖించు, లిఖించి కోర్కె లు
ప్పొంగఁగ జూడుఁ, జూచి వలఁపుంగొని మెచ్చును, మెచ్చి నీపరి
ష్వంగమె గోరు, కోరి వలవంతలఁ జింతిలు, చింతిల న్మన
స్సంగతి నూర్చు, నూర్చి సరసంబు విసంబుగ దా గనుంగొనున్.

224


ఉ.

ఇంతి భవద్వియోగదశకే విలపింపఁగ నంతకన్న న
త్యంతవిషాదసంజనకమైనదిగాదె సుయోధనాత్మజుం

డింతటిలో వరింపఁగలఁ డెల్లి వివాహ మటంచు వార్త వి
న్నంతనెగాన నీవు క్షణమాలసియించ హితంబుగా దికన్.

225


క.

కౌరవవారము నీశర
ధారాసారమున బాఱదరిమి యశోవి
స్తారమున రేవతీసుత
సారసలోచనను రాక్షసమున గొనఁదగున్.

226


చ.

అని సకలంబుఁ దేటపడ నాడు శుకంబును జూచి బల్కె నో
వనజశరాశ్వరత్నమ! భవత్కరుణన్ శశిరేఖ సేమమున్
వినఁబడె నింక నాహృదయవేదన నేమని దెల్ప నేఁటికై
నను నినుగాంచు కారణమునందను నిల్చిన దింతె మేలగున్.

227


ఉ.

ఎన్నడు రాణివాసమున నింతి వసించెనొ నాఁటనుండి య
త్యున్నతమోహవేదనల నొంద సుయోధససూతి కింతలో
కన్నియ నీయఁగా దలఁచు కర్ణకఠోరపుదుష్టవార్త నే
విన్నదిగా మొదల్ హృదయవేదన నేమని జెప్ప కీరమా!

228


మ.

మును నాకున్ శశిరేఖ నిత్తునని రాముం డర్థి సత్యోక్తి మ
జ్జననీరత్నము నమ్మ బల్కి యిపు డాచందంబు పాథోవిలే
ఖనముం జేసి సుయోధనాత్మజునకుం గన్యామణిన్ బెండ్లి సే
యను యూహించిన వార్త విన్న క్షణమైనా నిల్తునే కీరమా!

229


ఉ.

కావున నింకమీఁదట నఖండబలోన్నతులైన పాండుపు
త్రావలిలోన నేగలసినంతట చూడుము యెల్లి నేఁడు దు
ర్భావులఁ గౌరవాన్వయుల భజ్జనజేసి యదువ్రజంబులన్
వావిరి నొంచి రాక్షసవివాహమునన్ వరియింతుఁ గన్యకన్.

230


చ.

తను నెడబాసి వచ్చిన మొద ల్మరునంపల కాక, కేకికా
గణముల కేక, కోకిలశుకభ్రమరంబుల ఢాక, యోషధీ

శుని బలురాక తెమ్మెరులు సోక, తదేకవిలోకనైకజృం
భణమున నున్నవాఁడ ననుమా యనుమాసములేక కీరమా!

231


చ.

కనకగిరీంద్ర మిట్టటులుఁగా చలియించఁగ భూనభంబులం
తనుదను దానె దాకినను తారలు ఝల్లన నేల వ్రాలినన్
వననిధు లింకినన్ జలజవల్లభుఁ డస్తగిరిం జనించినం
దన నిక నేవరించు టిది తథ్య మటంచు వచించు కీరమా!

232


క.

బంగరుచిలుకా నీవలె
నింగితము లెఱుంగు జాణ లెవ్వరు నీవా
క్సంగతుల నేర్పు దనర కు
రంగాక్షికి దెల్పు పోయిరమ్మని బనుపన్.

233


క.

రివ్వునను యెగసి చని చని
యవ్వనజాతాక్షిసౌధమందున డిగినన్
నెవ్వగల బొగలు నచ్చెలి
నవ్వుచు చేసాచి యెదురునడచి ప్రియమునన్.

234


క.

ఓయి శుకరాజ వచ్చితి
వా! యెచ్చట గంటి వర్జునాత్మజు నీవుం
బోయిన కార్యం బెల్లను
కాయో పండో వచింపఁగాదగు వేడ్కన్.

235


క.

కంటివె మత్ప్రాణేశ్వరు
వింటివె తన్మధురతరనవీనోక్తులు నీ
వంటివె నేననినట్టుల
నంటివె తద్భావమరసి యని కొంతవడిన్.

236


చ.

అనిన శుకంబు బల్కె భవదాజ్ఞను నాతలఁదాల్చి భూరికా
ననము లతిక్రమించి విజనస్థలమైన ఘటోత్కచాశ్రమం

బున సుమశయ్యపై నిదురఁబోయెడి తల్లికడ న్వసించు న
మ్మనసిజదృక్శరీరు నభిమన్యకుమారుని గంటి నక్కరో!

237


క.

కని యానతనై నేనా
తనితో నతినీతి ననిన తనుదానే న
న్నెనలేని నెనరుగను మన
మున గనుఁగొని యనియె వినయమును బెనఁగొనన్.

238


చ.

నిను మది సంస్మరించుకను నిద్దురలేక తపించు తాళలే
నని భ్రమియించు సౌఖ్యముల నన్ని త్యజించు వియోగసాగరం
బున బడి తల్లడించు నినుబోలు సతిం గననంచు నీరు నిం
చిన కను లప్పళించు నిక జెప్పెటిదేమి కురంగలోచనా!

239


మ.

ఇదిగో నేఁడె వివాహలగ్న మనఁగా నేతెంతుఁ గౌరవ్యదు
ర్మదహంకార మడంచి యాదవుల సంరంభంబు బోకార్చి య
భ్యుదయాప్తిం జయలక్ష్మితో నెనసి ని న్నుద్వాహముం జెంద నె
మ్మది నుద్యుక్తతనున్నవాఁడ ననెనమ్మా! నమ్మవమ్మా సఖీ!

240


క.

క్రిందటినుండియు దను నా
యందుం దనయందు నేను నలరెడి ప్రియముల్
డెందమున మరవవలదని
పొందికగా జెప్పిరమ్ము పొమ్మని బలికెన్.

241


ఉ.

కావున నీవు గోరినటుగా ఫలకాలము సంభవించె న
మ్మా విను మింక నిన్ను నభిమన్యుని యాపరమేష్టి దంపతీ
భావమునం సృజించుట ధ్రువంబు భవచ్ఛుభలగ్నవేళయం
దేవిధినైన వాని వరియింతువు గాంతువు నిక్క మింతయున్.

242


క.

అని సత్క్రమంబుగా పో
యినపని వివరింప కుతుక మెసఁగగ చిలుకం

గని ముద్దుగొని బ్రియంబున
వనజాయతనేత్రి హర్షవార్ధిని దేలెన్.

243


చ.

అట నటవిం ధనుర్గుణమహారవ మభ్రధరాతలంబు లు
త్కటముగ నిండి మ్రోయ దనతల్లికడ న్వసియించు భూపధూ
ర్జటి నభిమన్యు దత్పరిసరస్థనిజాశ్రమదుర్గమార్గప
ర్యటన మొనర్చుచుం గనె భయంకరమైన ఘటోత్కచుం డొగిన్.

244


చ.

పెటపెట పండ్లు గీటి యతిభీమపరాక్రమకంఠకాహళా
ర్భటి దశదిక్తటుల్ బెటిల బ్రద్దలుగాఁగ హుటాహుటిస్వదో
స్తటపటుధాటన ల్సెలఁగ దర్జనభర్జన జూపుచు న్నటన్
నిటలతటాక్షునిం బలెనె నిర్భయుఁడై చనుదెంచి యిట్లనెన్.

245


ఉ.

ఎవ్వఁడ వీవు నిర్భయత నిట్లడవిం బటుక్రూరసత్వముల్
నెవ్వగ జెంద చాపగుణనిస్వనము ల్ప్రకటించుకొంచు క్రొం
గ్రొవ్వున నిల్చినాఁడ వళుకున్ మడిలేక యనన్యభాజనం
బివ్వనవాటి నీవెఱుఁగవేమొ ఘటోత్కచునాశ్రమంబుగన్.

246


క.

నీమదిని మీఁదెఱుంగ వి
దేమొ, మదాశ్రమము జొచ్చి యెవ్వఁడు మును సు
త్రామముఖరామరాళుల
మామకబాణానలార్చి మ్రగ్గక జగతిన్.

247


క.

తులలేని గర్వమున నొక
విలునమ్ములు బూని పెద్దవీరునివలె నే
పొలమెల్లఁ ద్రిమ్మరిలె దిదె
గలిగెను కాలంబు డింభకా నిను మ్రింగన్.

248


ఉ.

కావున దైవయత్నమున గల్లెను నేఁడు నరామిషంబు మ
ద్భావము సంతసించెఁ బలుపల్కు లికేటికి నేఁటికూటికే

నీవనవాటి దాటి జననిత్తునె నిల్వు మటంచు బల్కినం
గేవలరోషభీషణదృగీముఖుఁ డౌచు బిరాన లేచియున్.

249


సీ.

ముఖబహిర్గతకోపశిఖిశిఖాతతు లట్లు
        జతఁగొను పల్లమీసములవాని
కెరలిన బ్రళయాగ్నికిరణజాలముభంగి
        రహి నించు దంష్ట్రాంకురములవాని
విలయమృత్యుంజయవీక్షణద్యుతిమాడ్కి
        మిడిగ్రుడ్ల మిరుమిట్లు మెఱయువానిఁ
గల్పాంతకాలభాస్కరపరిధిక్రియ
        వికటభ్రుకుటితటాలకమువాని


తే.

క్రొవ్వి నడయాడు కాటుకకొండపగిది
మేన నల్లనిఛాయల మించువాని
భుజగమునుబోలు నొకవిల్లు బూనువాని
జూచి యిట్లని బల్కె నారాచపట్టి.

250


శా.

ఏరా యెవ్వఁడ వీవు మద్భుజబలా౽హీనప్రతాపంబు నిం
డారం గానక దుర్మదప్రథితదుష్టాలాపముల్ బల్కు టే
శూరు ల్మెత్తు రనం జయించి జయముం జూపించితే చాలదే
వేరే నీవు నుతించుకోవలెనె దోర్వీర్యప్రతాపోన్నతుల్.

251


మ.

అనినం దైత్యుఁ డహంకృతిం గెరలి సైరా! వీనివాగ్ధైర్య మే
మనఁగా వచ్చు మదీయగర్జనల కింతైనం భయంబందఁ డీ
ఘనగర్వుం బరిమార్చి వీనితనువుం ఖండించి మచ్ఛాసనం
జున వర్తించెటి భూతకోటి కితనిం బూర్ణాహుతిం జేసెదన్.

252


వ.

అని తలంచి విజృంభించి యభిమన్యుం గాంచి యిట్లనియె.

253


ఉ.

వేళకు కూరలేక పలవించెటివానికి వంటయింటికుం
దేలును గాంచి నట్లఱుఁగుదెంచితి వీవు మదాశ్రమంబునన్

వ్రాలిన నెవ్వఁడేని సమవర్తిపురిం దనుదానె జేరు నా
భీల ఘటోత్కచుం డనెటిపేరు వినం జగముల్ వడంకవే!

254


తే.

నిదురబోయెటిసింగము న్గెదిమినట్టు
లట్టి నిను జూచి కోపంబు బుట్టె నాకు
నింక విలునమ్ములును గొని బింకమునను
బ్రేలఁగానేల రమ్మని బిలువ నతఁడు.

255


క.

దనుజుండను పరుషోక్తికిఁ
గనలుచుఁ గోపంబు రూపుఁగైకొనిన ట్లం
ధనురంబకతూణీరము
లను సవరింపుచును నిట్టుల న్వచియించెన్.

256


క.

డింభకుడని జూడకు నను
దంభోళి యదెంత? భూమిధర మెంత?జయా
రంభహరి యెంత మదవ
త్కుంభీంద్ర మందెంతదొడ్డు కొంచెముగలదే!

257


చ.

సమరచణుండవై, నిఖిలశక్తులు గల్గినవాఁడవైన స
త్క్రమమున నీపరాక్రమముఁ గన్నులజూపుటె సాక్షిగాక తు
చ్చములగు వాక్ప్రచారములు సజ్జనసమ్మత మౌనె సంగరా
ధములగువార లీగతి వృథావచనంబులు బల్కు టొప్పగున్.

258


మ.

అనినన్ రోషకషాయితాక్షుఁ డగుచున్ హైడింబు డుద్యద్ధను
ర్గుణఠంకార మొనర్చి యార్చి దిశలుం ఘూర్ణిల్ల కోలాహలం
బున నాశీవిషతుల్యశల్యముల నాభూపాలువక్షఃస్థలం
బున నాటం గురిజూచి యేసె వినయంబుం బెంపు శోభిల్లఁగన్.

259


క.

అంత నృకాంతుఁడు విలయకృ
తాంతునిగతి గెరలి పటుతరాంబకమున న

ద్ధ్వాంతచరు నిశితబాణము
లింతింత న్శకలములగ నిరిచియు కినుకన్.

260


మ.

పటునారాచము వింటనెక్కిడి నభోభాగంబు గంపింప ది
క్తటముల్ మ్రోయ శిలోచ్చయంబుల ప్రతిధ్వానంబు గల్పింప నె
క్కట నాకర్ణతలాంతమంద గొని వీఁకన్ వ్రేయ హైడింబు హృ
త్పుటము న్నాటె మహేంద్రుఁ డద్రినిడుదంభోళిప్రభాభాసమై.

261


ఉ.

దానికి భీమనందనుఁడు దల్లడమంది మహాశనీసమం
బైన శరత్రయంబు విజయాత్మజు రొమ్మున నాటనేయ రో
షానలదీప్తుడై బదియు నైదుశరమ్ముల నొక్కపెట్టు సం
ధానముజేసి వ్రేయ నవి దాకె ఘటోత్కచు కీలుకీలునన్.

262


క.

అందున దానవుఁ డలిగి పు
రందరపౌత్రుని భుజాంతరాళంబున నం
దంద ఖరశరపరంపర
కొందల మందంగ నుడ్డు గుడువఁగ నేసెన్.

263


మ.

అపు డామార్గణజాలముల్ తృటిని మాయంజేసి సౌభద్రుఁ డ
స్రపబాహాయుగ ముగ్రబాణముల లక్ష్యం బుంచి హుంకించి దో
ర్నిపుణత్వంబు సెలంగ నవ్యవధిగా నిర్భీతి నేసెం ద్రివి
ష్టపసంచారులు మిట్టిపాటున నఖండధ్యానము ల్సేయగన్.

264


క.

ఈకరణి నొకరి కొకరు చి
కాకు పడ న్వేయు చండకాండప్రహతిం
బైకొన్న మేనిగాయఁపు
మూఁకలు జల్లెడను రంధ్రముల గతి నొప్పెన్.

265


ఉ.

ఈరసము ల్దొలంగక నహీనగతిం దము దాము బోరు త
ద్ఘోరశరానలార్చి గనుఁగ్రొన్న బగల్వలె నొప్పె రాత్రి యా

శూరులమేన నెత్తురులు జొత్తిలె నత్తఱి కాననంబునన్
భూరి వసంతకాలమున బూచిన మోదుగులట్ల చిత్రమై.

266


క.

కరభుజగళచుబుకములన్
ధర గండభ్రూలలాటతలనాభీకం
ధరజానుజంఘ్రివక్షో
దరముల నిరువురకు బాణతతి నిండుకొనెన్.

267


శా.

ఆవీరప్రబలాట్టహాసములు నాయాశింజినీనాదముల్
దేవవ్యూహజయధ్వనుల్ వినిన భీతి న్నిద్రలో కంపితం
బై వామాక్షి సుభద్ర మేల్కని సుతుం డాభీలకల్పాంతవీ
రావేశప్రమథాధినాయకునిఛాయం బోరుట ల్గాంచినన్.

268


క.

తనుజుఁడు దనుజుం డీగతి
ననిలో ననిలోపమానులుగ తీక్షణులై
పెనుఁగు పెనుగాయములు దను
గనుఁగొని కనుఁగొనల బాష్పకణగణగతయై.

269


క.

కట్టా యీపసిబిడ్డం
డిట్టుల సంగ్రామరంగ మెన్నఁ డెఱుఁగ డీ
పట్టుననె దారసిలె నిక
నెట్టుల గానున్నదో రమేశ్వరు నాజ్ఞన్.

270


క.

ఏలా హలిపై నలిగితి
నేలా వికటాటవులకు నేతెంచితి నిం
కేలాగు బ్రతుకు నీపసి
బాలుం డాలమున భీమబలదనుజులతోన్.

271


సీ.

తామసం బెవరికి దగదంచు దెలసి మా
        యన్నకూఁతురును నే నడుగుటేమి?

కూఁతును రారాజుకొడుకు కీయఁగ వెఱ్ఱి
        తెఱఁగున మగుడ బ్రార్థించు టేమి?
ప్రార్థించితే నన్ను బలుఁడు తూలాడంగ
        కూడుగ్గబట్టి నేగునియనేమి?
గునిసి నాలోన నే గుములుచు నుండక
        తెలియనిసుతునకు దెలుపుటేమి?


తే.

తెలుప కోపించి యీతఁ డేతెంచు టేమి?
తడయ కితని వెంట నే దవులు టేమి?
దవుల నన్యాయదౌర్త్యవాదం బిదేమి
బాపురే దీనికింక నుపాయ మేమి?

272


క.

బలునియెడ కినుకచే నే
నిలు వెలువడి కొడుకుతోడ నేతెంచుటచేఁ
బలునోటం బలుమాటలు
బలుకరెఁ గయ్యాళి యీసుభద్ర యటంచున్.

273


చ.

తగుప్రా పెవ్వఱులేక నొక్కరుఁడు కాంతారంబునం దుండఁగా
పగదీఱం గురురాజు మత్సుతుని జంపం బంపెనో వీని యీ
జగదుత్పాతమహాహవంబు గన నాశ్చర్యంబుగా నున్న దె
ట్లగునో గాని నిశాచరాధములమాయల్ మబ్బుచాయల్గదా!

274


క.

హితు లెవరులేని తఱి ని
ర్జితశత్రుండైన తండ్రి చేరువనున్నన్
సుతునిపయి నీఁగ బొరయునె
యతిభీకరదనుజు లెంద ఱడ్డంబైనన్.

275


క.

కనురెప్ప లిడక బెగ్గిలి
తనయునిబలవిక్రమప్రథం గనుచుండెం
దనయుఁడు జగదద్భుతముగ
నని సేయుచునుండఁ దల్లి హర్షత గనియెన్.

276

చ.

అపుడు హిడింబి పార్థతనయప్రకటాహవధైర్యధుర్యదో
ర్నిపుణత గాంచి యాత్మసుతునిన్ రణకేళి నితం డకారణం
బిపుడు వధించునం చనెటిహేతువు నామది దోఁచుచున్న దీ
యపరిమితోగ్రమూర్తి విలయాంతకుఁ డాకృతిబూని వచ్చెనో?

277


క.

మును దైవనిర్ణయం బి
ట్లనుకూలంబై లభించె నదిగాకను నా
తనయుండు గెల్వనేర్చునె
యని పెక్కుగతు ల్గణించి యడలెడువేళన్.

278


మ.

దనుజుం డంతటబోక భీకరధనుర్ధ్వానంబు గావించి ది
గగిన రోషానల మెల్ల వక్త్రమున గ్రక్కన్ సింహనాదార్భటిం
గినుకం బాడబతుల్యజాజ్వలన మాగ్నేయాస్త్ర మెక్కించి గ్ర
క్కున సౌభద్రుని వేసె భూనభము లాక్రోశింప రౌద్రాకృతిన్.

279


ఉ.

ఏసిన భగ్గుభగ్గున నహీనతరాగ్నికణంబు లొల్క ఘో
రాశనిరీతి రా గని రయంబున నవ్విజయాత్మజుండు దోః
కౌశల మొప్ప దాని శతఖండములై చన కాలదండసం
కాశితవారుణాస్త్రము నఖండగతిం గురి జూచి యేసినన్.

280


క.

ధారాళమైన సలిలా
సారములఁ దదస్త్రజనితసంతాపము చ
ల్లారిచియు భీమసేనకు
మారుఁడు దుడుకుడువనంబుమయముగ జేసెన్.

281


ఉ.

అంత ఘటోత్కచుండు వరుణాస్త్రజబాధ లణంచుకొంచు క
ల్పాంతకృతాంతునిం బలె మహాగ్రహుఁడై భుజగాస్త్ర మెత్తి క
ర్ణాంతముగా ఘటించి విజయాత్మజు రొమ్మున గ్రుమ్మ దాన న
త్యంతవిషాహిజాలకసహస్రములై తనువెల్ల గ్రుమ్మినన్.

282

క.

తమి నభిమన్యుఁడు గరుడా
స్త్రము నభిమంత్రించి వేయుతథిని శతసహ
స్రములైన పన్నగాశన
సముదయ ముదయించె చిత్రసంకాశముగాన్.

283


క.

కొన్నింటి జించి పదహతిఁ
గొన్నిఁటి విదళించి తుండకులిశాగ్రమునం
గొన్నిఁటి జించి భుజంగాల్
ఛిన్నాభిన్న ములుగాఁగ జేసి మెఱసినన్.

284


క.

అది గనుఁగొని హైడింబుం
డదయమతిన్ రాక్షసాస్త్ర మరిబోసి భయా
స్పదసింహనాదముల పె
ల్లొదరుచు హుంకించి మించి యురువడి నేసెన్.

285


సీ.

ఆశస్త్ర మసురమాయామోహితం బౌట
        శరభసింహవ్యాఘ్రశల్యభుజగ
పరశుతోమరశరప్రాసఖడ్గస్థూల
        పాషాణముఖభయాస్పదము లెల్ల
గురియింపుచుంట గన్గొని సుభద్రసుతుండు
        తదుపసంహతచికిత్సానిరూఢి
తడవు యోచించి గంధర్వాస్త్ర మరిబోసి
        విధివిధాయకమున వ్రేయ నదియుఁ


తే.

బెక్కుగతులను ద్రిజగదాభీల మగుచుఁ
బ్రళయకాలానలజ్వాలబగిది దోప
మింటమంటను మంట లొక్కంట నంటి
దనుజమాయామయోద్ధతుల నణఁచె.

286


క.

పొరిపొరి బెబ్బులు లట్టుల
నిరువురబలములను దక్కువెక్కువ లేకన్

కరి కరియుం గిరి గిరియున్
హరి హరియుం బెనఁగినట్టు లాహవ మయ్యెన్.

287


క.

అంతం దెలదెల వేగుట
లెంతయు గని దనుజుఁ డలిగి యిదిగో నిను ఖం
డింతునని యార్భటింపుచు
పంతంబున నెక్కుబెట్టె బ్రహ్మాస్త్రంబున్.

288


ఉ.

ఆమహదస్త్ర మెక్కిడుట నర్జునసూనుఁడు జూచి యుగ్రుఁడై
ధీమతి వజ్రఖండమును ద్రెంపఁగ వజ్రమెగాన దీనిను
ద్దామ మణంపఁగా నదియ దక్క మఱొండుశరంబులే దటం
చామితధైర్యధుర్యతఁ దదస్త్రము నెక్కిడునంతలోపలన్.

289


క.

ఆబ్రహ్మస్త్రము లిరువురు
చేఁబూనిన దిశలు చిట్లు చీఁకట్లమయం
బై బడబవహ్నికీలల
నాబహుళతరాగ్నికణము లవనిన్ రాలెన్.

290


చ.

ధరణితలంబు దద్దఱిలె తారలు గూలె సభంబు దిద్దిరం
దిరిగె సురాంశుభాస్కరుల దీధితి క్రుంగెను బ్రద్దలై దిశల్
దెరిచెను పచ్చిగోడలగతిం జతురంబుధు లింకె నద్రులున్
మొఱసె నభంబునన్ సురసమూహము లార్చె విమానపంక్తి త
త్తరమున డుల్లె వాయువు ధ్రువం బణఁగెం బ్రళయాంతసూచనన్.

291


ఉ.

ఆసమయంబునన్ మునికులాగ్రణి నారదమౌని యాగమో
ల్లాసుఁడు కోటిభాస్కరవిలాసుఁడు మాధవసత్కథాసుధా
భ్యాసుఁ డనారతాంచదుపవాసుఁడు వారలముందటం దయా
భాసురమూర్తియై నిలిచి బల్కె ననాగతవేది గావునన్.

292


శా.

ఓహో విక్రమధుర్యులార తగు నుద్యోగంబు బాటిల్లె ని
స్సాహాయ్యంబున నన్నదమ్ము లిటులన్ సంగ్రామముం జేయు ని

ర్మోహప్రక్రియ లెందు గానము గదా! మూర్ఖాళిసంభావ్య మీ
యూహ ల్జాలుడు గుందు వైరము మదీయోక్తు ల్విన న్మేలగున్.

293


క.

మీరలు భీమార్జునులకు
మారులు రణరంగజితకుమారులు మీలో
మీరు కలహింప దుర్జయు
లీరసములు మాని యుపశమింపుడు శరముల్.

294


క.

భవదగ్రజనకుఁడై దగు
పవమానసుతుండు దనుజభామ హిడింబిం
దవిలి చరింపఁగ తద్ద్యుతి
భువిని ఘటోత్కచుఁ డనంగ బుట్టె నితండున్.

295


క.

నీ వర్జునువలన గుణ
ప్రావీణ్యత దనరు కృష్ణభగిని సుభద్రా
దేవి జఠరాంతరంబున
నావిర్భవమొందినాడవౌ నభిమన్యా!

296


క.

మీ రన్నదమ్ములై యీ
ఘోరాహవమునను బోరగూడ దటొండెన్
ధీరులు రణశూరులు దో
స్సారులు నొకరొకఱి గెలువ శక్యం బగునే.

297


మ.

అనుచు న్వారలవావులు న్వరుస లిట్లన్యోన్యసౌహార్దసం
జనితప్రక్రియ తేఁటఁగాఁ దెలిపి స్వేచ్ఛాగామియై వల్లకీ
ధ్వని నారాయణశబ్దముం గొలువ నంతర్ధాసముం జెంది నం
తనె నిర్విణ్ణమనోగతిం దడవు చైతన్యక్రియాశూన్యులై.

298


క.

మును దెలిపిన వచనంబుల
కనుతాపముఁ జెంది శరశరాసనములు స

య్యన నేల వైచి యాలిం
గనమొనఱిచి కనుల బాష్పకణగణ మెనయన్.

299


ఉ.

అన్నవు నాకు నీవు దనుజాగ్రణి నే ననుజుండ నయ్యయో
మున్నిటు నే నెఱుంగమిని మోసము వచ్చెను నీతిమార్గమం
చెన్నక నీపయిం దొడరి తింతటిలో సురసంయమీంద్రుఁ డా
పన్నశరణ్యుఁడై తగవుఁబాపి నిను న్నను బ్రోచె నర్మిలిన్.

300


క.

అనిన ఘటోత్కచుఁడుం గు
బ్బున గౌఁగిటఁ జేర్చి విజయపుత్రుని మేనం
గను గ్రొత్తగాయములు చే
బునుకుచుఁ గనుగొనల నీరు పొటపొట దొరఁగన్.

301


క.

మాయన్న దీన నీకు న
పాయము నిసుమంతయైన బ్రాపించిన నా
కాయం బికేల ధీరో
పాయం బిక నేల ధర్మపద్ధతు లేలా!

302


శా.

తండ్రుల్ కౌరవకైతవప్రబలబాధాబద్ధులై యున్నచో
వేండ్రంబైన మనోవ్యథం బొరలు నీవీరప్రతాపంబులం
దీండ్రింపం దిననీక నిష్క్రియత వర్తింపంగ నే నూరకే
తండ్రీ నే డొకకీడు జేసితిగదా ధర్మేతరాచారినై.

303


క.

పావనుఁడౌ సురముని మన
లావు లెఱింగించి దుష్టవార ముడిపి స
ద్భావమున శరణ మయ్యెం
గావున మన మిపుడు బ్రతుకు గంటి మవరజా.

304


చ.

అనుచు ఘటోత్కచుండు నెనరాముకొన న్వచియించు నంతఁ ద
జ్జనని హిడింబి నారదవచస్సరణిం దనతోటికోడలౌ

ననుచు సుభద్రనుం దెలిసి యాదరవృత్తి పయంటకొంగునం
గనుఁగవ నీరు బోఁదుడిచి గాద్గదికధ్వనితోడ నిట్లనున్.

305


చ.

చెలియల నీమది న్వెతల జింతిలనేలఁ దనూజు లీగతిం
దలువని తల్పుఁ బోరుటలు దైవకృతంబగు చిత్ర మీగతిం
దలఁపడ దీనికి న్వగవ ధర్మమె నారదుఁ డన్నదమ్ములన్
పొలుపుగ దెల్పఁగా మరలబుట్టినచందము లిద్ద ఱిద్ధరన్.

306


చ.

ఇరువుర లింకఁ బోరిన మరేమగునో దలపోయ నెన్నిటన్
సురమునివంటి బాంధవుని జూడము మేలిదె చాలుఁ జాలు కీ
డెఱుఁగక నాసుతుండు మిము నిట్లొనరించె నటన్న నేరముల్
మరువుము తల్లి వీరల శమం బొనరించుట నీతి యన్నిఁటన్.

307


క.

అని యిట్టు లూరడిల్లగ
ననుకూలనఁయోక్తి దెలిపి యతివయు దానున్
మన మలర మెలఁగుతఱి న
ద్దనుజుండు సుభద్ర గని పదంబుల కొఱిగెన్.

308


మ.

జననీ యెన్నఁడు రానిదాన విటు లాశ్చర్యంబుగా నేఁడు నీ
తనయుం దోడ్కొని రాగ మత్కలుషచిత్తప్రక్రియన్ సోదరుం
డని యూహింపక నేనెదిర్చినవిధం బాధర్మరాజాది మ
జ్జనకు ల్విన్న నిసీ! ఘటోత్కచుఁడు దౌర్జన్యుం డటం చెన్నరే.

309


క.

కావున తమ్ముం డితఁడని
భావమునం దెఱుకలేని పనిజేసితి నీ
వేవలననైన నేరము
గాపు మటం చతఁడు మ్రొక్కఁగా నిట్లనియెన్.

310


శా.

అన్నా నీ వడలంగ నేమిటికి దైవాయత్త మిట్లయ్యె ము
న్నెన్నం డీతఁడు నిన్ను నీ వితని మున్నీక్షించి మీలోన మీ

రన్నల్దమ్ములుగా నెఱుంగమిని యిట్లన్యాయవైరంబు లా
సన్నంబై మునిరాట్కృపామతి పునర్జన్మంబు నొందె న్సుతా.

311


శా.

నీ వి ట్లజ్ఞునిరీతిగా బొగలఁగా నీతమ్ము డత్యంతదుః
ఖావాప్తిన్ వగవం దొణంగె నిక శూరాగ్రేసరు ల్లోకమం
దేవేళన్ వెతనొందఁగాదగునే తండ్రీ నేఁటికైన న్మహా
భావజ్ఞుండగు మౌని కీ ల్దెలిపి మీప్రాణప్రదుం డాయెఁగా.

312


క.

అని పెక్కువిధము లాసతి
తను నూఱడిలంగఁ బల్క దనుజాగ్రణి నె
మ్మనమునను కలఁతవీడి త
మ్ముని కౌఁగిటఁ జేర్చి మోదమును బెనఁగొనఁగన్.

313


క.

కడువేడ్క వార లిద్దఱు
కొడుకు లగుట తాము తోడికోడం డ్రగుటల్
జడదారివలన గని మది
నెడలేని ప్రియంబు జేసి రిం పెసలారన్.

314


చ.

అపుడు ఘటోత్కచుం డనుజు నజ్జననిం దనయాశ్రమంబునం
డపరిమితద్యుతి ప్రచురమౌ నొకశైలగుహాంతరంబునన్
విపులచిరత్నరత్నమయవేదికయందున జేర్చి సందియం
బుపశమనం బొనర్చుచు నయోక్తుల నిట్లనియెన్ సుభద్రతోన్.

315


క.

ఓ తల్లి మున్ను వింటిని
ద్వైతవనంబునను ధర్మతనయుఁడు దెల్పన్
నీతనయునితో ద్వారక
కేతెంచుట నీదుకుశల మిఁటమీఁ దెఱుఁగన్.

316


క.

ఇది యేమి వింతకార్యం
బొదవెనొ? నడిరేయివేళ నుగ్రాటవిలో
బెదు రెదురులేక నీగతి
సుదతీ విచ్చేయఁదగునె సుతుఁడు న్నీవున్?

317

చ.

చెలు లిలుబాసి వచ్చుటల శీలముగాదె ముకుందుఁ డీసడిం
దెలిసిన మిమ్ము నట్టడవి ద్రిమ్మఱనిచ్చునె యిట్టి సాహసం
బులు దలపోయ నేమి పనిబుట్టెనొ దాచక దెల్పవమ్మ ను
మ్మలికలకేల నేను నభిమన్యుఁడు నీసుతు లుండియుండఁగన్.

318


మ.

అన నిట్టూర్పులు బుచ్చుచుం గనుల బాష్పాసారము ల్దొల్క నా
ననము న్వెల్వెలబార చెమ్మటలు మేనం గ్రమ్మ దైన్యంబు సి
గ్గును రోషంబు జనింప గాద్గదిక నెల్గుం దోప కెమ్మోవి య
ల్లన గంపింపఁగ మోము వంచి విగతోల్లాసంబుగా నిట్లనెన్.

319


క.

విను మన్నా! మాకత లే
మని తెల్పం బిడియ మగును నలరారు భవ
జ్జనకు లనుపంగ ద్వారక
కును నేఁగుట నీవుఁ దెలిసికొన్నవియగదా!

320


సీ.

ఆద్వారవతిలో మదగ్రజుఁ డైనట్టి
        హలికిని శశిరేఖ యనఁగ నొక్క
కూతురు త్రిభువనాతీతసౌందర్యవి
        ఖ్యాతిచేఁ దనరు నక్కన్య నతఁడు
మనయభిమన్యునకు నొసంగెద నంచు
        నెమ్మి నాతో మున్ను నమ్మబలికె
జను లెల్ల విని మహోత్సాహంబునను జెంద
        నంతఃపురీకాంత లతిశయింప


తే.

సుదతి నాట్నుండి యభిమన్యుసొ మ్మటంచుఁ
గోరి యాబాలగోపాలకులు వచింప
నది మొదల్కొని నాకోడ లౌనటంచుఁ
బ్రేమ నానాట ముప్పూటఁ బెంచుచుంటి.

321

క.

ఆలోపల కురుపతి యా
బాలామణి నాత్మసుతుని బరిణయమునకై
తాలాంకుని యడుగుటకు దు
రాలోచన జేసి బనిచె నవనీసురులన్.

322


ఉ.

అందుకు కన్య నిచ్చుటకునై హలి మి న్నఱచేత నొడ్డి న
బ్లెందున లేని మోదము వహించెను లగ్నము నేఁట రేపటం
బొందెను దానికై యదువిభుండును సాత్యకి గూడదంచు కా
ళిందివిభేదను న్మది జనింపఁగ జేయగలేక యుండినన్.

323


క.

నే యేమి కీ డెఱుంగక
మాయన్నగదా యటంచు మఱి నేవేడం
బోయిన నామదిలోఁ బగ
బాయని పరుషోక్తు లాఁడె పాండవులయెడన్.

324


క.

ధృతరాష్ట్రసుతుఁడు సముపా
ర్జితయశుఁ డతివైభవుం డజేయుం డత్యూ
ర్జితవిహితబంధుఁ డాతని
సుతునకు మత్కన్య నొసఁగ శుభముం గాదే.

325


క.

ధనవంతుఁడు కురుపతినిం
బొనఱ జయించెదరె పాండవులు గీండవులుం
గనుఁగొనఁగ వెన్నముద్దకు
మునుకోఱలు వచ్చి దూలములు గంకునొకో.

326


చ.

అతఁ డిలు వెళ్ళగొట్టఁగ మహాటవులం జరియించి కూటికిం
గతి జెడి యాలుబిడ్డలును గొనక వర్తిలువారితోడ నే
హితమతి వియ్యమంది సుఖియించుటకన్నను పెద్దనూతిలోఁ
జతికిలఁ ద్రోయ మేలని విషప్రచురోక్తులఁ బల్కెఁ బుత్రకా.

327


క.

అడవుల కారాకులు దిను
బడుగులు పాండవులతోటి బాంధవ్యము నీ

కొడుకు న్నీవును గూటికి
బడియుండఁగ కోడ లొకతి పైఁబడవలసెన్.

328


మ.

అని యిట్లాడినవాక్యముల్ హృదయశల్యప్రాయమై నిల్వలే
కను నే నయ్యభిమన్యుతో దెలుపఁగా కంఠీరవాకారభీ
షణరోషంబున నర్ధరాత్రి జను లీషన్మాత్రముం గానకుం
డను నం దోడ్కొనివచ్చె నీకరణి వేండ్రంబైన ఘోరాటవిన్.

329


చ.

నిలయమునుండి వెల్వడియు నేఁటికి నాల్గుదినంబు లాయె నీ
నెలవున నీవనంబునకు నిన్నటిరాతిరి వచ్చి నిద్ర నే
నొలసి పరున్నవేళ ననుజుఁడును నీవు మహాహవంబునన్
మెలఁగెడి భీకరధ్వనుల మేల్కని లేచితి చూచి తింతయున్.

330


క.

అకటా సురసంయమి నై
జకటాక్షమువలన మఱల జనియించిన య
ట్లుక మిమ్ము జూడఁబడె నిం
తకుమించిన మేలుగలదె దనుజవరేణ్యా.

331


సీ.

ఇక నీసహోదరుం డెవరిప్రా పెఱుఁగక
        మగువపై యాపన్నుఁ డగుచు నుండి
యల యెండమావుల నాశించు మృగ మట్ల
        మామచే సుతుఁ డవమాన మొందె
కోమలి కురురాజుకోడ లైపోయె మా
        యన్నమాటలు శూల మగుచు దవిలె
నన్న! ని న్నెఱిఁగిన యప్పాటనుండి
        తలఁపు నొక్కింత చింతలు దొలంగె


తే.

నీదినంబున కిట్టమే లింతె చాలుఁ
దలఁచి వేదన బడనేల దైవవిధికి
దడ వికేటికి నడవి మీతండ్రులున్న
పథము జూపించి మము వేఁగ మనుపుమయ్య.

332

క.

అని బాష్పనిష్పతితలో
చన యగు సుభద్ర తనవిచారము దెలుపన్
విని రోషభీషణాకృతిఁ
గనలుచు హైడింబు డంతకప్రతినిధియై.

333


సీ.

మొదల కౌరవుల రాముఁడు మెచ్చె నన్నచో
        రవరవ రోషాగ్ని రవులుకొనియె
నాతి నయ్యభిమన్యునకు నీయఁ డన్నచో
        వేడిపొగ ల్మేన వెడలదొడఁగెఁ
దుది పాండుపుత్రుల దూషించె ననినచో
        కణుకునిప్పులు నోట గ్రక్కఁబడియెఁ
గన్య లక్ష్మణున కింక నొసంగు నన్నచో
        చటులాస్యనిర్గతజ్వాల లెసఁగె


తే.

నంతకంతకు నిశ్వాస మధిక మగుచుఁ
బ్రళయకాలకృతాంతుని బగిదిఁ గెఱలి
పటపటన పండ్లు గీఱి దర్పంబు సూపి
పలికె నిట్లని యతఁడు సుభద్రతోడ.

334


క.

ఏమేమీ బలభద్రుఁడు
నీమహి నొవ్వంగ బలికెనే హైడింబుం
డీమహిని యున్న దెఱుఁగడు
గామోలు కురుక్షితీశుగర్వబలమునన్.

335


సీ.

మత్కోపదావాగ్నిమహిమ విశ్వంబెల్ల
        దర్పించి భస్మం బొనర్పజాలు
మనతరమన్ముప్టిఘాతాశనిపాత
        కులగిరుల్ భిన్నమై కూల్పజాలు

మత్సత్త్వ మఖిలభూమండలం బాచక్ర
        వాళాద్రిసహిత మార్పంగజాలు
మత్పాదఘట్టన మహితహేమాచల
        శృంగభంగంబు సేయంగజాలు


గీ.

దేవతిర్యఙ్మనుష్యాదిజీవతతికి
నుడ్డు గుడిపించఁజాలు నాయోగమాయ
నిట్టి నను కన్నుగానక హీనుఁడైన
కౌరవాధము నుతియించెఁగా బలుండు.

336


క.

తనతనయను గైకొన నా
యనుజుండేగాక యితరుఁ దగునే కుంతీ
తనయులను గినిసి బలికిన
యనుభవ మిక దోడుతోడ నగుపడు హలికిన్.

337


మ.

మనకు న్యాదవకోటికిన్ బెడయు దుర్మంత్రాంగముం జేయు దు
ర్గుణు దుర్యోధను ద్రుంచి, సైంధవుని గర్ణుం ద్రోణు దుశ్శాసనుం
ఘనముష్టిప్రహతిన్ వధించి బలుఁ డాకంపింప కౌరవ్యయో
ధనికాయంబుల నొక్కపెట్టుననె మూర్ధ్నంబుల్ దెగం గోసెదన్.

330


శా.

మాతండ్రుల్ బహుళవ్యధ ల్గొని వనీమార్గంబులన్ మెల్గ వీఁ
డే తాదృగ్విభవంబునం ధరణి దా నేలంగ నెట్లోర్తు మ
ద్ఘాతప్రక్రియచే గిరుల్ శకలము ల్గావించి లోకత్రయిం
భూతిం జేతు బలుండు దీనముఖుఁడై బోలించి నం జూడఁగన్.

331


శా.

తల్లీ నీకు ఘటోత్కచుం డనెటి పుత్రగ్రామణిం గల్గ నీ
యుల్లంబు న్వెతనొంద నేమిటికి మాయోపాయము ల్బన్ని నేఁ
డెల్లిం గన్నియ నిందు జేర్చి భవదీయేచ్ఛాగతిం బెండ్లి శో
భిల్లం జేసెద నీతనూజునకు సంప్రీతి న్విలోకింపవే!

340

మ.

కొడుకుం గోడలు నిన్ను దోడుకొని యాకుంతీతనూజాతు లుం
డెడుచోట న్నిను డించెదం జనని నేఁడే చూడనౌ రేవతీ
శుఁడు కన్యామణి నెట్లు లక్ష్మణున కిచ్చుం దానివై నంబు నే
పొడసూడం దగు నాకు సెల్వొసఁగు మంభోజాతపత్రేక్షణా.

341


ఉ.

పౌరులు బాంధవుల్ వినఁగ బల్కినబల్కు లబద్ధ మిప్పు డే
తీరున నౌనొ చూడు సుదతిం గొని నే నిటఁ దెచ్చునంతకున్
మీరు సుఖాప్తి నిందు శయనించుఁ డటంచు వచించి కోపహుం
కారసమగ్రుఁ డౌచు చనఁగా సమకట్ట సుభద్ర యిట్లనెన్.

342


క.

అసురేంద్ర కోప మేటికి
వసుధను దానంబు దాతృవశమన వినమే
ముసలాయుధుండు కన్యక
నొసఁగని హేతువున వెతల నొందఁగనేలా!

343


ఉ.

కౌరవకోటి పాండవు లగాఢబలోన్నతచండబాహువి
స్ఫారధనుర్విముక్తపటుబాణపరంపర గూర్పఁగా జగ
ద్వీరప్రతిజ్ఞ సేయుటకు వేగిరపాటున నీవు గూల్చితే
శూరులు పాండవోత్తముల చుల్కనగా గణియింపరే ధరన్.

344


ఉ.

కావున వారిగర్వ ముడుప న్సదుపాయ మొనర్చి కన్య నేఁ
డేవిధినైన తమ్ముని కహీనతఁ బెండ్లి యొనర్పు నేర్పు నీ
భావమునం దలంచు టిది బాగని దోచె మఱొండుహేతువన్
నీ విట నాలసింపకుమి నేఁటికి మూఁడవనాడు లగ్నమౌ.

345


చ.

అది గనుకన్ ముహూర్తసమయంబున కచ్చటి కేఁగు టొప్పు గా
కిది సమయంబు గా దచటిహేతు వెటేఁగి యెటొచ్చునో! ముదం
బొదవఁగ నంతదాక ను సహోదరు గూడి యిట న్వసింపు మం
చొదివిన కూర్మితో బలుకుచున్న సుభద్ర కతండు నమ్రుఁడై.

346

మ.

జననీ నీనియమప్రకారమున రోషంబెల్ల బోకార్చి యొం
డనక న్నీకడ నిల్చి లగ్నసమయం బందేఁగి తాలాంకనం
దన నిచ్చోటికి జేర్చి నీమదికి మోదం బందఁగా జేసి దో
డ్తనె కౌరవ్యుల కార్యము ల్చెరచి మీదాపుం బ్రవేశించెదన్.

347


చ.

అనుచు సుభద్ర సమ్మతిలునట్లు వచించి సహోదరుఁడు తా
నును జననీమణు ల్గనక నూత్నమణిద్యుతి నొప్పు కందరం
మ్మున వసియించి కందఫలమూలరసాదుల దృప్తి జేసి యి
చ్చను శశిరేఖ పెండ్లిదివసంబునకై కనుబెట్టి యుండగన్.

348


క.

గతకాలవార్త లెన్నుచు
హితగోష్ఠి న్మెలఁగుచుండి రిట, మీఁదటిసం
గతి దెల్పుమని ధరణీ
పతిఁ గనుగొఁని పైలుఁ డమృతభాషల ననియెన్.

349

ఆశ్వాసాంతము

క.

సురుచిరశరరుహచరణా
దరిదరకరభరణదురితహరణాజిచణా
స్ఫురదరినికరవిదారణ
గిరిధరకరికరణ శేషగిరివరశరణా.

350


కవిరాజవిరాజితము.

కరుణాసేచన! కంజవిలోచన!
        కలుషవిమోచన! గానహితా!
సురరిపునిగ్రహ! సుందరవిగ్రహ!
        శుభసదనుగ్రహ! సూరినుతా!
గురుజనపోషణ! కోమలభాషణ!
        కుమతవిభీషణ! గోపసుతా!
తరణివిలోచ ! తత్వవివేచన!
        తాపససూచన! భక్తిరతా!

351

సోష్ఠ్యత్ర్యక్షరకందము

మాపాభూభామాపా
 మాపై పైబ్రాముబాము మాపుమి ప్రాపై
 మీప్రేమ బాప మీపై
మాపాపపుమోపు బాపుమా మాబాపూ.

352


మ.

ఇది శ్రీశ్లేషకుభృచ్ఛిరస్తటకుటీరేచ్ఛానువర్తిప్రధా
మృదుశ్రీవాసగురుప్రసాదకలనామేయాఢ్యమౌద్గల్యవం
శ్యదయాసంయుతభావనార్యజనిశశ్వఛ్ఛ్రీనృసింహార్యమో
హదతాలాంకసునందనోద్వహచతుర్థాశ్వాస మొప్పు న్భువిన్.

353

గద్య
ఇదిశ్రీమచ్ఛేషధరాధర సౌధవీథీవిహరణ చక్షు
ర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్యలక్ష
ణానవద్య విద్యావిలాస శ్రీనివాస గురు
చరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య
మౌద్గల్య గోత్రపవిత్ర భావనాచార్య
పుత్ర పర్వత్రయకైంకర్యనిధాన
వేకటనృసింహార్యాభిధానప్రణీ
తంబైన తాలాంకనందినీ
పరిణయంను మహా
ప్రబంధంబునందు
చతుర్థాశ్వాసము. 354