తాలాంకనందినీపరిణయము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాలాంకనందినీపరిణయము

తృతీయాశ్వాసము

క.

శ్రీరమణీకుచయుగఘన
సారమృగీమదసుగంధచర్చితవక్షా!
చారుసుమశరసదృక్షా
సారససదృశాక్ష శేషశైలాధ్యక్షా!

1


క.

అవధారయ! జనమేజయ
నవధామనిధిప్రతాపునకు పైలుం డ
వ్యవధానముగ సుధాధా
రవిధాయకసూక్తు లాదరంబున బలికెన్.

2


క.

అంతట శశిరేఖ గృహా
భ్యంతరమున కుసుమతల్పమందు నొఱిగి య
క్కంతుశరకుంతసంతతి
కెంతో మది చింతనొందు నింతటిలోనన్.

3


చ.

నునుజిగురున్ ఫిరంగి సుమనోరజమన్ వడియందు నింపి గ్ర
క్కున విరిగుత్తిగుం డొకటి గూర్చి పరాక్రమ మగ్నిఁ జేసి యం
గనకుచదుర్గసీమ గుఱిగా వలరాజుసిఫాయి వైచె ఫె
ళ్ళున శుకశారికాదిభటులున్ వడి లగ్గలకెక్కి యార్వఁగన్.

4


క.

ఆయేటున కోర్వక నహ
హా! యని తమిసోలి దుర్భరాయాసమునన్
జేయు నుపాయములేక ని
జాయతనము వెడలి చెలుల కగపడకుండన్.

5

చ.

పనిగలరీతి మంచ మొకపట్టియ చేతుల నూత జేసి ఓ
వ్వున వడిలేచి మేల్ముసుఁగు బొందిక వైచి కటిం జెలింపు వీ
డిన నెదకొప్పు వీఁపున నటింపఁగ లేఁజెమటల్ దొఱంగ త
న్వెనుకొను కీరశారికల వేసరిదిట్టుచు నూర్పు లొట్టుచున్.

6


క.

వెఱపు విడి తానొకర్తుక
యురుతరవేదనల నంతికోద్యానమునం
జరియింత మను దలంపున
దరలెం దరళాక్షి మన్మథప్రేరితయై.

7


క.

ఆరామపుత్రి యనదఁగు
నారామామణి గృహాంగణారామమునం
ధారాధరమ్ములోపల
నైరమ్మదలతిక జొచ్చినట్టులఁ జొచ్చెన్.

8


సీ.

పిడుఁగులవలె వనప్రియరావ మదలింప
        పులులట్ల కేకు లద్భుతము నింప
సుమపరాగము కంటకములై యడుఁగు లంట
        సుమములు మన్మథాస్త్రముల గెంట
గండుతేంట్లు తుపాకిగుండులై యెదఁ దాక
        నలసమీరము సోఁకుఁడగుచుఁ బ్రాక
పల్లవంబులు వాడి జల్లీటలై గ్రుచ్చ
        వలిగప్పురము ధూలివలెనె హెచ్చ


గీ.

తిరిగి తిరిగినచోట్లనే యరిఁగి యరిఁగి
తడసి బెడసిన గతి యుడ్డుకుడిసి జడిసి
గొదల బొదలుచు మల్లెపూఁబొదల మొదల
దీనగతి కోర్చి యొక్కచో మేను జేర్చి.

9


చ.

ఉలుకుచు నుస్సురంచుఁ దలయూచుఁ దగన్ వలవంతఁ జెందు బె
గ్గిలు మదిలోన బొక్కు బులకించు నగుం బ్రలపించు స్రుక్కు ని

శ్చలత వహించు చెమ్మటలు జారఁగ నూర్చు చలించు గద్గగా
కులత వహించు నుల్కు వెతఁ గుందుఁ గనుంగవ నించు బాష్పముల్.

10


క.

ఇటు లనివారితవిరహో
త్కటజనితశ్రమను మదిని కటకటఁబడి య
క్కుటిలాలక దిటమోపక
సొటసొట కన్నీరు వడపుచుం దనలోనన్.

11


సీ.

మొగిలిరేకుకటారిమొన నాట రొమ్మున
        గ్రుమ్మి ప్రాణమ్ము బోజిమ్ముదాన
తుంగమై బొంగు గొజ్జంగి కాలువలోన
        నుంకి గుభీలున దుంకుదాన
బూవుదండకు గుజ్జుమానికి నురిగూర్చి
        కొంచక మెడ బిగియించుదాన
తేఁటతేనియలోన గాటమౌ కపురంబు
        మెదపి సాహసముచే మ్రింగుదాన


గీ.

గాక యీకోకిలబలాకలోకకేకి
కోకమదచంచరీకశారీశదంబ
మేకమై పైకొనుచును జికాకుఁజేసి
దాక యీకాక కెటు ముందు దాళుకుందు.

12


క.

బెడిదమగు తుంటవిల్తుని
యడిదంబుల కోర్వలేక నారటచే ని
క్కడ కేఁగుదెంచు టమ్ములు
వెడలిచి కొఱ్ఱొత్తినట్టి విధమై దోచెన్.

13


క.

ఈలీల వియోగానల
కీలాజాలానువేలకీలితయౌ త
ద్బాలామణిఁ బొడఁ గానక
నాలో నెచ్చెలులు భయసమాకలితమతిన్.

14

ఉ.

అచ్చటి రత్నపంజరములందలి చిల్కలు కాంతవార్త వా
క్రుచ్చి వచింపఁగా మదిని కేవల మార్తిని వారిలోన వా
రచ్చెరువందుచుం గటకటా పసిబాల గృహంబు బాసి నేఁ
డెచ్చటికేఁగెనో మన కి కేమి యుపాయ మటంచు నెంచుచున్.

15


క.

అయ్యనుఁగుంజెలు లందఱ
లయ్యయ్యో మోసపోతి మని బెగ్గిలి దా
మెయ్యెడల నిలువనోపక
తొయ్యలి నందంద వెదుకదొణగిరి వనిలోన్.

16


మ.

చెలి యీకప్రఁపుఁదిన్నె లెక్కి పవళించెం జూడుడీ గుజ్జుమా
వులనీడం జరియించె గాంచుఁ డిదిగో పున్నాగకుంజాంతరం
బుల గూర్చున్న దెఱుంగుఁడీ యిట విధుప్రోద్యచ్ఛిలావేదిక
న్నిలిచెం గన్గొనరమ్మ జాడ లిటు నిర్ణిద్రాప్తి జూడందగున్.

17


సీ.

సౌపానముల నెక్కజాలనిబాల యీ
        కృతకాద్రు లెట్టు లెక్కియుఁ జరించె
సుమరిత ల్బొరయ నుస్సున నూర్చుబోఁటి యీ
        మరుఁగుపూఁబొదరిండ్లు జొరఁగనోపె
వల్లకీధ్వని దల్లడిల్లుముద్దియ యెట్లు
        కోకిలల్ పెల్లాక్చు ఢాకకోర్చె
సురఁటీల విసర వేసరటజెందెడి ముగ్ధ
        యీగాలిధూళుల కెట్టు లోపె


గీ.

ముంపునిద్దంపుసొంపు తా కెంపుటిండ్లు
జొచ్చి కనువిచ్చి మెచ్చనిమచ్చకంటి
బెట్టుకలిగొట్టుచెట్టుల చుట్టుముట్టు
లెట్టు దిరిగెనొ బొట్టి రాపట్టి యిపుడు.

18


సీ.

మూఁకలై పధికహృద్భీకరంబులు గాఁగ
        కోకిలానీకముల్ గేక లేయ

తుమ్మెద ల్బలుదుమారమ్ము లేపుచు బయల్
        గ్రమ్మి ఝమ్మని తలది మ్మొనర్పఁ
బిల్లతెమ్మెరలు మేనెల్ల చిల్లులు వోవ
        చల్లనై బెల్లుగా నల్లుకొనఁగఁ
గప్పురంబుల బూదిపుప్పొడు ల్గొప్పలై
        ఱెప్పలా గుప్పున నప్పళింప


తే.

నింటను చిరంటు లెవరు లేకుంటవలన
జంటవిడి యొంటరిగ కోనవెంట దిరిగి
తుంటవిల్బంటతూఁపుల నంటి యెంతఁ
గంటకించెనొ గదరె వాల్గంటులార!

19


సీ.

లలితమృణాళనాళమ్ము లచ్చట జూచి
        చెడుగుఁ జిల్వ లటంచు జడిసెనేమొ!
కోకిలంబులకూక లాకులంబు లొనర్పఁ
        బెనుభూతము లటంచు బెదరెనేమొ!
కారుపూఁబొదల మయూరంబులను జూచి
        సోఁకుమూఁక లటంచు సొలసెనేమొ!
గుంపుమావిజిగుళ్ళజొంపంబు గనుఁగొని
        వనహుతాశనియంచు వణఁకెనేమొ!


గీ.

లీలచేనైన క్రొన్ననవాలుజోలి
మూల మెఱుఁగని యిప్పసిబాలకీవి
రాళిఁ దూలగజేసె యీవేళ గోల
నెందు వెదకుదమని భయం బంది గుంది.

20


సీ.

సురపొన్నమ్రాఁకుల జోడుల నీడలఁ
        జెలువొందు కలిగొట్ల చెట్లపట్ల
పాటలద్రుమముల తోఁటలమాటుల
        లలితవాసంతికాలతల జతల

సురభితసురసాలతరువుల మరుపులఁ
        గ్రీడావినిర్మితగిరుల దరుల
సారసప్రథితమౌ సరసుల సరసులఁ
        బుష్పాసవములొప్పు పొదలఁ మొదల


గీ.

నారయుచు వేర నొకమేర సౌరభప్ర
పూరలతీకాకుటీరవిస్ఫారచారు
సారసుమనోరజాప్తశృంగారవేదిఁ
జేరి బొగలెడి సీరికుమారి నెదుట.

21


మ.

ముసుకుం బాయఁగ ద్రోచి నల్గడల నెమ్మో మెత్తి వీక్షించి లో
నుసురంచు స్మరునంపచిచ్చఱకు నిట్టూర్పు ల్విడంబింప దృ
గ్బిసజాతంబుల బాష్పము ల్దొరగ కంపీభూతసర్వాంగయై
యసిధారాపథరీతి దల్లడిలు నయ్యబ్జాక్షినిం దవ్వులన్.

22


క.

కాంచి యుదంచితధైర్యస
మంచితమతి యంచలంచ లటఁ బొంచి నిదా
నించి సమీపించి సతీ
సంచయము లొకించుకన్ విషణ్ణహృదయలై.

23


సీ.

ముత్యపుఁజిప్పలఁ బొలుచు కెంపులరీతి
        కనుఁగవ లరుణత గాంచు టేమి?
హేమకుంభముల మోసెత్తు నీలము లట్లు
        పాలిండ్లపులక లేర్పడుట లేమి?
శంఖరాజము వజ్రశకలఘు ల్గనులీల
        గళమున ఘర్మాంబుకణము లేమి?
కప్పుమబ్బున మరకతము లుట్టినభంగి
        జడవీడి వెండ్రుకల్ జెదురు టేమి?


గీ.

యనుచు విస్మయమున నహహా! యటంచుఁ
దర్జనీన్యస్తనాసికాతలము లమర

నతివిషాదభయావృతస్వాంత లగుచు
చుట్టుచుట్టుక వెఱుఁగంది చూచి చూచి.

24


సీ.

వెడవిల్తుని ఫిరంగి వెడలు నీరనజారు
        కన్నీరు పన్నీటఁ గలయఁ దుడిచి
తమి మిక్కుటంబై న తలకెక్కి సుడిఁ గొను
        గతినున్న పెన్నెఱుల్ గలయ దువ్వి
చనుజక్కవలుబెట్టు పెనుగ్రుడ్డులో యన
        జిక్కుజెందిన సరు ల్చక్కఁజేసి
యహరహం బనురాగలహరి బయల్పొంగు
        పగిది జారిన కావిపైట దిద్ది


గీ.

జివురులవ్వట్టి మావిని జెంగలించు
సరణి జెదిరిన మణిసరు ల్సవరపఱచి
కౌఁగిట గదించి బొదవుచు గారవించి
చనువు నొనరించి తనుతాపమును హరించి.

25


తే.

ఫలము లలరులు కింజల్కములును గొన్ని
మించుఁబోఁడికి మైసురాళించి వైచి
బొమలసందున గపురంపుబూది వెట్టి
కంఠసీమను కురువేరు గట్టి యనిరి.

26


చ.

కులుకుమిటారి గబ్బివలిగుబ్బలు గ్రాగి మెలంగనేల క్రొం
దళుకుపసిండివన్నెల సడల్చెటిమేను గలంగనేల క
న్నుల నునుగెంపు చెంపల బెనుంగఁగనేల మెఱుంగుకప్పు వే
నల జెదరంగనేల లలనా నగుబాటిదిగాదె బోఁటికిన్.

27


క.

తెలుపఁగరాదో మా కది
తెలియంగా రాదొ! తెలిసితే పనిగాదో?

తెలియుటకు మాకు వలదో!
తలఁపునకున్ రాదొ! తెలుపతగ వదిగాదో?

28


ఉ.

ఇమ్మెయి ముమ్మరంపువెత నేటికి గుందెదవమ్మ యవ్వనాం
తమ్మున హంతకమ్మున పదమ్ములు నొవ్వఁ జరించెదమ్మ చొ
క్కమ్మగు నెమ్ముగమ్ము కసుగందెగదమ్మ రయమ్ము లెమ్ము మా
యమ్మ మనమ్ము నుమ్మలిక నందక సమ్మతిలమ్మ కొమ్మరో?

29


సీ.

చండాలు లౌచు కుజనసంగతి మధు
        పానదుర్మత్తు లీభ్రమరకములు
పాంథభీతిప్రదార్భటు లొనర్చుచు హరి
        ప్రద్వేషులైన యీబర్హిణములు
కాలాకృతిని పలుగాకులలోఁ బుట్టి
        పంచమరీతు లీపరభృతములు
ఘనవిముఖత్వంబు గని విషావాసులౌ
        జాలపదంబు లీసరసిజములు


తే.

పుణ్యతరులను ఫలభంగముల నొనర్చు
పక్షపాతంబు లీశుకప్రకరములకు
భావమున భీతిలేక నీ వేవిధమున
ధీరమతి నుంటివమ్మ బంగారుబొమ్మ!

30


చ.

మదససమానమూర్తి యభిమన్యుఁ డనన్యమనీషి యెల్లి నేఁ
డిదె నిను కూర్మి బూని వరియించగలండు నిజమ్ము నమ్ము మో
మదకలహంసయాన వినుమా! యనుమానము మాని పూలుగో
యుద మిక లెమ్ము రమ్ము వని నుత్సవలీల జరింపఁగా దగున్.

31


క.

అని యనుఁగుంజెలు లావని
తను తనుతాపంబు దీర్పదగు మాటల నె
మ్మన మనుమతింప నన జ
వ్వని వనితలతోడఁ గూడి వనిలోఁ జొచ్చెన్.

32

సీ.

తేటకాటుకదీటు మేటికొప్పులనీటు
        తేటికూటువుల జంఝాట మణఁప
తళ్కుకప్రము లొల్కు కల్కిపల్కుల కుల్కు
        చిల్కపిల్కలకు మేనుల్కజూపు
సిరిప్రాఁపులను జూపు నెఱజూపు సుమచాపు
        తూఁపురూపుల నేపు మాపుజేయ
నివ్వటి ల్మవ్వంపునవ్వులై యవ్వల
        దవ్వుల పువ్వుల రవ్వజేయ


గీ.

లతలకన్నను తనుమృదులతలు గొన్న
వనిత లందరు జొచ్చి యవ్వనితలమున
నిరతిశయమానసానందనిరతి జెంద
జూడ నొకవింత విహరింపుచుండి రంత.

33


సీ.

దిగువరాలినపండ్లు దేరిజూడక నుండె
        పతితవస్తుస్పర్శ పాప మనుచు
సుమనికుంజంబులఁ జొచ్చి మెచ్చక నుండె
        చండాలులకు నివాసంబు లనుచు
చేముట్టి కుసుమముల్ జిదుముగోరక నుండె
        రహి రజస్వల నంటరా దటంచు
తలిరుటాకుల పందిరులను నిల్వక నుండె
        గురుమధుప్రియసక్తి గూడదనుచు


గీ.

తలఁచియో లేక నాథుని వలచియో, మె
ఱుంగుబోఁడి వనక్రీడకుం గడంగ
కున్న భావం బెరింగి యక్కన్నె లెల్ల
వనవిహారంబునకు బాళిమొనయఁ జేసి.

34


ఉ.

తేఁటులఁ బారద్రోలి విరితేనెరుచు ల్లని గ్రోలి పూఁబొదల్
మాటికిదూరి సౌరభసమగ్రసుమమ్ముల నేరి పుప్పొడుల్

వేటులనాడి యొండొరులు వేడుక గూడి మరాళకోటిస
య్యాటలఁ గొల్పి యవ్వనవిహారము సల్సి రనల్పలీలలన్.

35


చ.

చెలువగు డాకపందిరులచెంగటి క్రొన్నెలరాలదిన్నెప
జ్జల నెరిగుజ్జుమావిగమి చక్కనిగొజ్జఁగితేఁటనీటివా
కలదరి కుందకుంజలతికానికరంబులనీడ గుంపుగుం
పులు గొని వేడుక ల్నిగుడ ప్రోడలు క్రీడ యొనర్చి రవ్వనిన్.

36


సీ.

ఎలుగెత్తి యొండురు ల్గలయ దా బిల్చుచో
        కలకంఠకలకంఠముల నదల్చి
మందప్రచారలై యదంద మెలఁగుచో
        కాదంబకాదంబగర్వ మణఁచి
పచరింపుచో కుచపాళి పైట దొలంగ
        చక్రచక్రస్ఫురచ్ఛాయ నొంచి
వాతెఱ ల్గదల వాక్చాతురుల్ జిల్కుచో
        ప్రతిబింబప్రతిబింబపటిమ నెరపి


తే.

ఒక రొకరి గేరుచో పకాపకను నగవు
లలర దాళిమములబోలు నలరదాళి
కాంతలు జెలంగ మెలఁగి రక్కాంత లధిక
యౌవనోత్సాహమున జేసి యవ్వనమున.

37


సీ.

మరుమావుపిండ్లు గ్రుమ్మరు మావిపం డ్లనే
        కములు గారాపట్టి కాన్కబట్టి
గములు గా నలరు పూగముల గోసి పడంతి
        భావం బెరింగి 'యుల్ఫా' లొసంగి
కేసరంబుల నొప్పు కేసరంబులు కొన్ని
        నాతికోరిక మెచ్చి 'నజరు' లిచ్చి
కోకిపల్లవమంట గొననిపల్లవ మంట
        పంబు లెల్లను జూపి భ్రమత రేపి,

గీ.

యిదిగొ గొజ్జంగిపన్నీటియేటితేఁట
నీట నానాట నాటు పూఁదోట మాటు
చోటులనుచును జూప నచ్చోటు వెడలి
వని జరించెను ప్రోడ జవ్వనులతోడ.

38


క.

చలితాంఘ్రిద్వయనూపుర
కలనాదార్భటులు విమలకాసారచర
త్కలరాజహంసవితతుల
చెలిమిం గొనజేర బిలుచు చెలువు దలిర్చెన్.

39


సీ.

ఈచంపకద్రుమం బెక్కి పూల్గోయవే
        ఖంజనేక్షణ నీకు గలదు బ్రీతి
యీదాడిమఫలంబు లెక్కి చేనందవే
        శుకవాణి నీకు నించుక యపేక్ష
యీగుజ్జులేమావి యిగురులే గోయవే
        కోకిలమృదువాణి నీకు కోర్కె
యీపూపుఁబొడిదిన్నెపై పవ్వళింపవే
        యలివేణి నీకు మహాదరంబు


గీ.

కొమ్మ మీకోర్కె గని తెల్ప కోప మేమి
పై కెగయ నేమి?ముఖ మెఱ్ఱబార నేమి?
యిటుల కన్నుల కెంపుదయింప నేమి?
మఱి మొరయ నేమి? పోరె మీ మనసుకొలఁది.

40


క.

వనితామణు లేగతి య
వ్వనితావుల నెరయు కోర్కె వాటిల్లని కుం
జనితాంతవిమలసౌరభ
జనితానందమున బ్రొద్దు జరుపుచు క్రీడన్.

41


సీ.

శుకవాణి మావికొమ్మకు తారసిలె బిం
        బోష్ఠి నీ వచ్చోట నుండకమ్మ

గజయాన విరిమ్రాఁకు గవిసెను శతపత్ర
        నేత్రి నీ వచ్చోట నిల్వకమ్మ
ఘనవేణి క్రీడానగము జేరెను మరాళ
        యాన నీ వచ్చోటి కరుగకమ్మ
భుజగరోమాళి యిప్పుడె తొగల్ గొననేఁగె
        చంద్రాస్య నీ విందు జనకుమమ్మ


గీ.

యనెడు సతితోడ వేరొకవనిత జూచి
మోస మిక నేమి? సాంకవామోద లసమ
సింహమధ్యలు పావనచిత్రచరిత
లబ్జవదనలు వీరి కేమనుచు బలికె.

42


సీ.

కొందఱు కౌఁదీఁగె లందంద జలియింప
        లతికావితానముల్ లాగి లాగి
కొంద ఱున్నతకుచగుచ్ఛంబులు వడంక
        మంచిపూఁగుత్తులే ద్రుంచి ద్రుంచి
కొంద ఱడుంగు జిగుళ్లు తొట్రుపడంగ
        కిసలయంబుల నెల్ల గిల్లి గిల్లి
కొందఱు భుజమూలగురుహేమరజ మొల్క
        పుప్పొడు ల్బయలంట గుప్పి గుప్పి


గీ.

పాణికిసలాధరోష్ఠబింబభుజనాళ
ముఖసరోజంబులకు తూగి మూఁగు పైక
శుకమరాళాళులకు భీతి జొక్కి జొక్కి
సతులు పుష్పోపచయకేళి సల్పి రపుడు.

43


చ.

ముగుద యొకర్తు సూనశరముల్ చెఱుకున్విలుఁ బూని బొడ్డునం
దిగురుకటారి దాలిచి యహీనశుకాలిమరాళకోటిలో
నెగురుచు నే మనోభవుఁడనే యని కామినులెల్ల భీతిజెం
దగ బెదిరించె యౌవనమదప్రమదంబున ద్రుళ్ళి యాడుచున్.

44

చ.

కురులు జడల్ బడం గలయ గూఱిచి పుప్పొడిధూళి మేన న
చ్చెరువుగ దాల్చి దానఱుతచిక్కనిమల్లెసరాలు బూని క
ప్పురము లలాటపట్టికను బూతి దల న్విరిగుత్తి నించి నే
హరుఁడ నటంచు దాని భయ మందఁగజేసె నొకర్తు గ్రమ్మరన్.

45


సీ.

చరణాహతి నశోకతరువు నొక్కపడంతి
        పొదిగిఁట కురవకంబును నొకర్తు
నూరువుచే సింధువారమ్ము నొకలేమ
        కనుచూపులను తిలకంబు నొకతె
చేజాచి సహకారభూజంబు నొకయింతి
        యుమియుచు వకుళంబు నొక్కబోఁటి
గానంబొనర్చి ప్రేంకణము నొక్కవధూటి
        పకపక నగి పొన్న నొకలతాంగి


గీ.

ముఖవిదీప్తిని చంపకమ్ము నొకభామ
కలికి పలుఁకులగోఁగు నొక్కపికవాణి
యలరు లెత్తించి రాయావిహారగతుల
బయలుపడనీక దోహదక్రియలు నెఱపి.

46


క.

మఱి యవ్వన మెల్లను ద్రి
మ్మరి యౌవనగరిమ జెలఁగ మహిళామణు ల
వ్విరిబొదల బొదలు మహిమలు
విరిబోణికి వేరువేర వినబల్కి రొగిన్.

47


సీ.

మల్లికావల్లికాతల్లజమంజరీ
        మధుమదానందితమధుకరములు
సహకారఫలపూరసారసుధాహార
        చంచద్వనీశుకసంచయములు
కాండజాతాహీనషండజాతగ్రాస
        లోలమత్తమరాళబాలకములు

నవరసాంచితసుపల్లవరసాస్వాదనా
        కాకలీకృతమదకోకిలములు


గీ.

కృతగిరిస్రవనిర్ఝరోద్ధుతనినాద
వనదగర్జభ్రమానటద్వనమయూర
వితతులను జూడు మంగళవిమలగాత్రి
పంకజాయతనేత్రి తాలాంకపుత్రి.

48


క.

మంగళము లలరు నీవా
లుంగనులకు శంబరంబులోఁబడి భీతిం
జెంగునను బఱచె చూడుమి
రంగద్గంగాతరంగరమ్యత్రివళీ.

49


తే.

భవదధరసీమ బింబవిభ్రాంతి దోఁచి
శుకనికాయంబులెల్ల గాఁచుకొని తిరుగు
చున్నవిక జూడుమమ్మ నీ కన్ను లెత్తి
కుందకుట్మలరదన రాకేందువదన.

50


ఉ.

కాయజుఁ డవ్వియోగులకు గల్గు రుజన్ హరియింప డాగులన్
ప్రేయనిజప్రతాపశిఖి వ్రేల్చు సలాకులలీల ర క్తిమ
చ్ఛాయలపల్లవంబు లతిసాంద్రములై తరులం జనించె చూఁ
డీయెడ పద్మపత్రరుచిరేక్షణ సుందరతావిలక్షణా.

51


చ.

హరుఁ డలనాఁడు ద్రుంచు కుసుమాస్త్రుఁడు క్రమ్మఱఁగా జనించు సం
బరమున మన్మథుండు మును బ్రార్థన మ్రొక్కిన గండదీప మి
త్తటి తలనెత్తెనో యనువిధంబున బుష్పితచంపకద్రుమం
బరుదుగ శోభిలెం గనుమి హల్లకబంధుజయాననాంబుజా!

52


క.

ఈరీతి న్వనమహిమలు
నారీతిలకంబునకు మనం బలర సుధా

సారాతిరీతిఁ దెల్పుచు
కోరకకుసుమాళి ద్రెంచు కోరిక లూరన్.

53


సీ.

సుందరీమణి యోర్తు కుందమ్ములను ద్రుంచె
        కలికి యొక్కతె చంపకముల డులిచె
నెలఁత యొక్కతె ఫుల్లనీరేజముల్ నేర్చె
        చెలి యోర్తు భాండీరములను గొనియె
పొలతి యొక్కతె పొన్నపూవులనే గోసె
        మొగలిపూవుల నొక్కముగుద జిదిమె
తరుణీమణి యొకర్తు దాసనంబుల రాల్చె
        లలన యొక్కతె పాటలముల ద్రెంచె


గీ.

వనిత లట యౌవనోత్సాహమున స్వకీయ
రదననాసాంఘ్రిభుజనాభివదననిర్మ
లాధరాంగసుగంధమహావిభూతి
సాటిరావని నిరసించు సరణి దోప.

54


సీ.

రసదాడిమము జేరరాకు సాంకవగంధి
        కీరధ్వనుల నాలకింపవలయు
గుజ్జుమావికి జేరకుమి చంచలాలోక
        విమలపికార్భటు ల్వినఁగవలయు
సుమనికుంజంబుల జొరకు చంపకగంధి
        చంచరీకముల నీక్షించవలయు
కమలాకరములవంకకు రాకు ఘనవేణి
        సొగసైన యంచల జూడవలయు


గీ.

నంతియేగాక వాని కాహారమైన
ఫలము లలరులు విరులు తూడులును బాప

పాపమేగాని దాన లాభంబు గలదె
పోదమిక రారె మనము సమ్మోదనమునను.

55


వృషభగతిరగడ.

వనితరో యీ వనితలంబున
ననతిదూరము జనితివే మది
ఘనతరప్రేంఖణతరుద్యుతి
యనితరప్రియవినుతి యైనది.

కన్నె యింతటికన్న మిన్నతి
కన్నెగేఁదగి యున్నచోటికి
క్రొన్ననలు గైకొన్నసతి దా
కొన్నదని బైకొన్నతేటికి.

తమ్ములను మొత్తమ్ముగా త్రుటి
తమ్ముజేయ హితమ్ము గాదని
తమ్ము పికజాతమ్ము లనవర
తమ్ము గలిసిన నమ్మరాదని.

కోరికలు చేకూర కాంచన
కోరకమ్ముల నేరికోయకు
సారసముల విసారముల ని
స్సారమని వేసారి ద్రోయకు.

మారుఁ డిట పలుమారు మెలగు సు
మారుగని యామారుకేఁ గుమి
వేరుగని నవ్వేరు నీనెల
వేరుకొని కురువేరు లాగుమి.

రంగుదనర కురంగనయనల
రంగమే బహిరంగ మయ్యెను

వంగి వంగి లవంగలత నొ
వ్వంగ చేనది వంగదీయను.

మించుఁ బోఁడుల మించి నీవు గ
మించి వనిని భ్రమించె దేలను
మంచితావులు మించు కౌమ్మల
వంచి క్రొవ్విరి ద్రుంచు లీలను.

ఇందుముఖి నీ విందువిరుల ప
యిం దురాశ మెయిం దలంపకు
కుందరద మనకుం దగిన మా
కందరసముల క్రింద నొంపకు.

నేరుపున గన్నేరుఁబూవుల
నేరుకొన బూనేరు మాటికి
మీర లెటులో వేరు సారెకు
మేరమీరు సమీరుధాటికి.

కందములు మాకందములు కురు
విందములు కనువిం దొనర్చెను
తుందముల సుమరందములు సుమి
ళిందములు ప్రియమంది చేర్చిను.

కాంత యీలతికాంతమున రతి
కాంతుఁ డతివల నింతి నొంచెను
సంతతంబు వసంతుఁ డీ వా
సంతిలతికా సంతసించెను.

కమ్మవిల్తుని గమ్ముకొన్న శు
కమ్ము లీబింకమ్ము మానవు
నిమ్మళముగా నిమ్మ యీ గజ
నిమ్మకొమ్మ ఫలమ్ము గానవు.

యేటికో యీ బోటుగునకై
మాటికిటు లారాట మొందెదు
బోఁటిరో యీపాటలం బొక
వ్రేఁటు కేటికొ సూటిఁ జెందదు.

తాముదము జతనాముకొను తా
మరలు గోతాముగా యని
రామ యీ యారామము న్విడి
రామి కింత విరామ మాయెను.

మావుల న్మరుమావు లొక్కట
ప్రోవులై వాపోవు మానక
తావులుంగల తావులకు బో
తావు మునుపటి తావు గానక.

కోరినట్లు చకోరనయనల
కోరకమ్ముల నేరుకొమ్మను
వారిజాక్షరొ! వారి దరిగని
వారి త్వరఁగను వారిరమ్మను.

56


మ.

వనకేళీవిభవంబునం దనిసి యవ్వామాక్షు లెల్లం దనూ
జనితస్వేదకణప్రశాంతికరచంచత్సారసానూననూ
తననిష్యందమరందబిందుచయప్రోద్యద్బాలవాతూలశో
ధనసౌరభ్యసరోవిహారవికసద్భావంబునం గుంపులై.

57


సీ.

విరహిణీజనచిత్తవికలీకరణశంబ
        రారాతిబాణతూణీర మనఁగ
వనరమామణిమాధవప్రియార్పితమణి
        ప్రకటనీరాజనపాత్ర యనఁగ
చక్రాంగయుగపంచశరకేళికక్రియ
        కల్పితమృదుసుమతల్ప మనఁగ

నవనీసతీరాజహంసార్థవిరచిత
        తతరత్నకంబళాస్తరణ మనఁగ


గీ.

సరిదధీశ్వరు డభ్రనిర్ఝరిణి కొసఁగు
సకలమణిగణభరితపేటిక యనంగ
బరగు పథికశ్రమవిమోచి బహుళవీచి
సరసిరుహరోచియగు సరోవరము జూచి.

58


సీ.

సలిలపూరితకమండలుసమప్రతిభగా
        లలితమరందోత్పలము జెలంగ
హస్తలంబితనలినాక్షమాలిక భంగి
        వనజాగ్రగతమధువ్రతము లలర
కటితటకాషాయపటము కైవడి గళ
        త్తటతరుజీర్ణచ్ఛదంబు లలర
ఘనజటాపటలంబుగతి ప్రసూనపరాగ
        జాలసచ్ఛన్నశైవాల మమర


గీ.

తరుణినాభిగభీరతఁ దా ధరింపఁ
గోరి తాపసవేష మిక్కొలను బూని
వని తపం బాచరించెనో యన జెలంగె
ననుచు చెలు లెల్ల విస్మయం బావహిల్ల.

59


సీ.

వరపద్మశంఖమకరకచ్ఛపాన్వితం
        బై ధనేశ్వరుగేహ మనుకరించె
పటుశంఖచక్రవిభ్రాజితంబై రమా
        పతికరద్వయిరీతి పరిఢవిల్లె
అనిమిషామృతపరివ్యా ప్తమై పాకారి
        మందిరప్రతిభ నానంద మందె
నంచితఘనరాజహంససంకాశమై
        తారకాపథదీప్తిచే రహించె

గీ.

కుముదవరపుండరీకాదివిమల మగుచు
లాలితం బయ్యె దిఙ్మండలంబు కరణి
ననుచుఁ దత్సరసీతటంబునను జేరి
వసనమణిభూషణము లొకవడి సడల్చి.

60


ఉ.

కుచ్చెలు బిగ్గగట్టి కుచకుంభయుగంబులబంటి నీటిలో
జొచ్చి యొకుమ్మడిం దరుముచుం దమలో దము నోలలాడుచు
న్విచ్చలవిడి నీదుచు నవీనవిహారవినోదలీలలం
బెచ్చుపెరింగి యొక్కొకఱి జేర్కొనుచు న్విహరించి ఱత్తఱిన్.

61


చ.

ఒకగజయాన వెంటఁబడి యొక్కమృగేంద్రసుమధ్య నీటిలో
నికి బడగ్రుంగఁదీయ గని నిత్యముఁ దానములందు భృంగకై
శిక లొకకొంద ఱెచ్చటికొ జేరిరి మేలున జేరువార లో
పికఁగొని యాపద ల్గలుగువేళల చెంతలకైన వత్తురే!

62


తే.

ఉవిద యొక్కతె వెతికిలనుండి యీద
గోఁటిపోటుల చనులుఁ గన్గొనఁగనయ్యె
నంకుశక్షతరేఖల నలరు మరుని
మత్తమాతంగకుంభయుగ్మంబు పగిది.

63


చ.

సరఁగున షట్పదావళులఁ జంపకగంధి యొకఱ్తు జోపఁగా
నఱిముఱి యంచబోదలఘనాలక పెంపఱసేయఁగా బిసో
త్కరముల నొక్కమత్తగజగామిని ద్రుంపఁగ చక్రవాకులం
దరిమెను చంద్రబింబసమతాముఖి యొక్కతె చిత్రలీలలన్.

64


మ.

తమనీడ ల్సరసిం గనుంగొనినమాత్రన్ చిల్వరాకన్నెలన్
భ్రమచే కౌఁగిట చేర్పఁబోవుపగిదిన్ బాహాలత ల్జాపి నీ
రమునం దీదుచు లోనింగి తమి మీర న్నల్గడ ల్గాంచి రి
త్తమతిం దేలుచు నిల్చి రట్లితరకాంతల్ కొంద ఱగ్గింపఁగన్.

65


ఉ.

చేత మృణాళనాళ మొకచిమ్మనగ్రోవిగఁ బూని యొక్క సం
గాతపుచేడె మీఁదబడఁగా తనపుక్కిటినీరు జిల్కి త

ద్భీతిని నీటిలో మునుగవీడిన దానికచం బటంచు నా
నాతిసతుల్ హసింప నొకనాచును బట్టుకలాగె వేగమున్.

66


సీ.

ముఖసరోజభ్రాంతి ముసరెడి తుమ్మెదల్
        నాసికాచంపకోన్నతిని జూచి
భుజమృణాళభ్రమ బొరయు హంసావళుల్
        జలదసదృగ్వేణిచయము జూచి
ఘననాభికాసరోగతరథాంగంబులు
        విమలాననేందుబింబముల జూచి
భాసురాధరబింబధీసమాగతకీర
        తతి సాంకవామోదతనులు జూచి


గీ.

మొఱలిడుచు వెల్లనై మిన్నుముట్ట నెగసి
కనులరక్తిమ గొనుచు చికాకు చెంద
సతులు జలకేళికాసముత్సాహ లగుచు
మెలఁగు తద్వైభవము వేరె దెలుఁపనేల.

67


సీ.

శశిముఖీ! పద్మలోచనతో కలహమేల
        వీక్షింపు మది రాహువేణి సుమ్ము
పగయేల కలకంఠి! పల్లవాధరితోడ
        నది విమర్శింప రామాంగి సుమ్ము
గజయాన! పద్మాక్షికడ పంతగింపకు
        మిథ్యగా దది హరిమధ్య సుమ్ము
వరటియాన! మృణాళవల్లికాభుజతోడ
        కనలకు మది తటిద్గాత్రి సుమ్ము


తే.

యనుచు నునుజూడ్కులను మైత్రి బెనుచుకొనుచు
కలికిచిలుకల కొలుకులు గలసి మెలసి
సరసిసరసీవినోదము లరసి మురిసి
తలఁపునింపున జలకేళి సలిపి రపుడు.

68

ఆ.

చాన యొకతె యప్పులోన మునింగియు
తేలలేక సుడిని దిరుగ జూచి
పడఁతి యొకతె కొప్పుఁ బట్టుక దిగిచె నే
'డప్పులందు బడిన యటులగాదె'.

69


చ.

సరసీరుహంబుల న్మెలఁగు షట్పదకోటుల నొక్కబోఁటి స
త్వరగతి జోపి తద్వదనవారిరుహంబున వ్రాల, హస్తపం
కరుహముల న్విదిర్ప విడగాగ బెనంగెటి వాటి కొప్పునం
గరము రహించు సంపెఁగల గాటఁపుపుప్పొడి గుప్పె గుప్పునన్.

70


సీ.

కమలాక్షి నీగజగమన గాసియొనర్చె
        సింహమధ్యమ బుద్ధిజెప్పవమ్మ
చక్రవక్షోజ నీచంద్రాసన గలంచె
        నహిరోమరాజి నీ వడుగవమ్మ
సుకరబింబోష్ఠి నీశుకవాణి యడలించె
        శుభగసాంకవమోద చూడవమ్మ
ననఁబోణి నీపికస్వని వంచన మొనర్చె
        రామాంగి నీవైన రాగదమ్మ


తే.

యనుచు సరసోక్తులను మేలమాడుకొనుచు
కలితకలకంఠకలరవకలకలంబు
లాజలక్రీడ గన వేడుకై జెలంగెఁ
గరము జెలువొందుఁ బంకజాకరమునందు.

71


తే.

చిరశిలీముఖసంతతిచే మునింగి
నట్టి పద్మిని ఘనశరఘట్టనముల
భంగమొంది కలంగి శుంభద్దళముల
విరిసె నిట నుండవలదని వెడలి రపుడు.

72


తే.

అటుల వెలువడి కాసారతటమునందు
నిలువ కచభారముల జారు నీరుజూడ

క్రొన్నెఱు ల్మేఘసంపద గొన్నకతన
లీల వర్షించెనేమొ ధారాళగతిని.

73


క.

అంతట శశిరేఖామణి
నెంతయుఁ గైదండ నొసఁగి యింతులు పవనా
భ్యంతరము జేర్చి యొకళశి
కొంతమణిస్థగితవేదికాస్థలమందున్.

74


సీ.

ఒకబోఁటి మేన్దడియొత్తె మెత్తనిచేల
        తనువున విసముంటఁ దగ దటంచు
నొకసతి తడివల్వ లుంచక సడలించె
        కపటముండుట మేలుగా దటంచు
నొకకాంత మేనపొందికగ పావడ దీర్చె
        నప్పుదీరిన భాగ్య మొప్పు ననుచు
నొకలేమ కురులార్చి యొప్పుకొ ప్పమరించె
        ఘనరసం బౌదల నెనయ దనుచు


తే.

నొకరొకర లిట్టు లఖిలవిధోపచార
ములను మణిభూషణంబుల నలవరించి
మంచికస్తురి కపురమ్ము మైనలంది
బొదలు నెత్తావి విరులు కొప్పునను దుఱిమి.

75


క.

కొమ్మా సమ్మతి మున్నుగ
నిమ్మెయి జలకేళి సలిపి తికమీదట న
క్కమ్మవిలుతుఁ బూజింతము
రమ్మని దోడ్కొనుచు హర్షరస ముప్పతిలన్.

76


మ.

చలువల్ దేరెడి క్రొత్తగొజ్జఁగివిరుల్ జాల్కొన్న పన్నీటివా
కలచెంతం గపురంపుమ్రాఁకుల తడిం గన్నట్టి లేఁగున్నపొ
న్నలపైఁ బెన్గొనుమాధవీలతలక్రిందం పుప్పొడిందిన్నెపై
యెలమిం క్రొంబదనైన గస్తురిరజం బింపొందఁ బై జల్లియున్.

77

గీ.

కదళికాండములను నల్గడల నిలిపి
మల్లెపువుపందిరుల నుల్లసిల్ల నల్లి
కేతకీదళముల దళ్ళు గీలుకొల్పి
తలిరుటాకుల తోరణమ్ములు ఘటించి.

78


చ.

గమకఁపు కప్పురమ్మున చొకాటఁపు మ్రుగ్గులు దీర్చి సౌరభో
త్తమలవలీదళమ్ములను దర్పకునిన్ రతినిన్ లిఖించి, యా
హిమకరముఖ్యతద్బలము లీతల నాతల వ్రాసి వేదియం
దమరిచి ధూపదీపకుసుమాక్షతలాదిగ షోడశోపచా
రము లొనరించి కాంతలు నిరంతరభక్తి నుతించి రొక్కటన్.

79


సీ.

దండంబు కుసుమకోదండపాణికి నమ
        స్కారం బదృశ్యతాకారునకును
వందనం బిదె శుకస్యందనునకును ప్ర
        ణామంబు రతివధూకాముకునకు
శరణు త్రిలోకసంచరణసాహసునకుఁ
        బ్రాంజలి విటవిటీభంజనునకుఁ
బ్రణుతి భృంగస్వనక్వణితానుమోదికి
        నతిసమంచితపరభృతవితతికి


గీ.

సకలకాముకజనమనస్సప్తదీప్త
కీలికీలాసమిత్ప్రాయకేవలప్ర
తాపసుమచాపునకు వివిధోపచార
మనుచు నొక్కట వినుతించి యతిశయించి.

80


సీ.

కనులెఱ్ఱఁగొనక హుంకారించు భటకోటి
        మేన గాయంబు గానీని తూఁపు
మొద్దున చిగురాకు మొలిపించు సేనాని
        యిందందు నిలక మిన్నందు రథము
ఖండించినను వేళ్ళుగలయ మొల్చెడి విల్లు
        సంచరింపుచు ఝంకరించు నారి

గంభీరఘనరసాకలితమౌ టెక్కెంబు
        పండ్లు గీటుచు తోడబలుకుతేజి


తే.

యిట్టి సిరిపుట్టివై పుట్టినట్టి జట్టిఁ
గంటిమే మున్నుతిగకంటి కంటిమంట
నంటి పెనఁగిన తుంటవిల్బంటు వీవె
చిరవిరహిజీవనత్రాత చిత్తజాత.

81


ఉ.

ఇంక భవత్ప్రతాపము నుతింప దరంబె త్రిమూర్తుల న్నిరా
తంకము గాఁగ నొక్కొకరిఁ దార్కొని మేను సగం బొనర్చి ని
శ్శంకత ఱొమ్ము దట్టి బెలుచందగు నేర్పున నోరుగట్టి య
భ్రంకషకీర్తి గన్న నిను బ్రార్థన జేసెద మో మనోభవా!

82


ఉ.

ఇన్ని వచింపనేల నిపు డీశశిరేఖను బార్థనందనుం
డున్నతి మీర నీపనుల నుత్సుకలీల మెలంగు సౌఖ్యసం
పన్నత గల్గెనేని సులభంబుగ నీకును నీభటాళికిన్
మిన్నతిగా మహోత్సవ మమేయత జేయుదుమయ్య మన్మథా.

83


క.

అని వినుతింపుచు వనజా
నన నాననవిల్తునకు మనం బలర ప్రియో
క్తిని వేడుకొను మటంచును
చనువున బోధించి రుచితసమ్యక్ఫణితిన్.

84


సీ.

దర్శింపవమ్మ గంధవహుమహాస్యంద
        నుని కప్పుకొప్పువాసనలు నిగుడ
నుతియింపవమ్మ సంతతశుకారోహిని
        కుల్కుచక్కెర లొల్కు పల్కుఁజిల్క
సేవింపవమ్మ నెచ్చెలి నెలయల్లుని
        కలవలనెనయు కన్గవలు నిలిపి
మొక్కవమ్మా! శిలీముఖగుణధన్విని
        విమలకోమలకరకమలములను

గీ.

నింకమీఁదట గల భవదీప్సితంబు
సఫల మొందింపు నాళీకసాయకునకు
చిత్తకమలసమర్పణ జేయవమ్ము
రేవతీపుత్రి ఫుల్లశిరీషగాత్రి.

85


క.

ఈచందంబున కామిను
లాచరితవ్రతసకలఫలావాప్తిగ వా
గ్వైచిత్ర్యగతిని బొగడి య
థోచితగతి మెలఁగుచున్ సముత్సాహమునన్.

86


చ.

తొలుత వనీవిహారమున దూలి తుదిం జలకేళి దేలి య
వ్వల వలరాజుపూజ లనివారితభక్తి నొనర్చి పైపయిం
బలువగు మోహదాహ మొకపాటిగ నెమ్మది నుజ్జగించి యా
నలినముఖిన్ విహారభవనంబునకుం గొని దెచ్చు నంతటన్.

87


గీ.

మెలఁత విరహానలజ్వాల మిన్నుముట్టి
తనమయూఖానలోష్మంబు నెనసినపుడె
భానుమండల ముష్ణ ముష్ణేన శీత
ల మ్మనెడిరీతి ప్రొద్దు చల్లగను దోఁచె.

88


గీ.

తనదు జనకుని మందేహ దనుజవరులు
దినము బొడువఁగ యమునానదీజలములు
వెంటఁబడి వాని దఱిమెడి విధము దనర
ఛాయలెల్లను బశ్చిమాశకు గమించె.

89


సీ.

కుముదకుట్మలముల కొనలు మెత్తగిలంగఁ
        దనమది మెత్తనై దడబడంగ
కమలంబు లఱమోడ్పు గని నెవ్వగల జెందఁ
        దనగన్ను లఱమోడ్పుఁ గనుచు డింద
శశికాంతలు గఱంగి సరగున జాల్వార
        తనచిత్తము గఱంగి తాపమూర

హరిదశ్వమణికాంతు లఱవేడిమిని గ్రుంగ
        తనమేను నఱవేడిమిని గలంగ


గీ.

విన్నదనమును గలిగి మైవన్నె దొలఁగి
జిగిబిగి సడల్చి తనవాసి చెడు టదల్చి
మగని తొలఁగిన మిగులనెవ్వగలఁ బొగిలి
చంచలింపుచు వెతనొక్క చక్రవాకి.

90


మ.

పవలుం బుష్పిణియైన బద్మిని వరింపం బూని దా లోకబాం
ధవుఁడై సద్ద్విజకోటులం దరిమి దిక్తాపంబు జూపించె నీ
రవి యంచుం జనులాడు నిందలకు నోర్వన్ లేమికం బశ్చిమా
ర్ణవమధ్యంబున దూకినం గువలయారాతిత్వముం దీసెనే!

91


సీ.

సూర్యోపలచ్చవి సుమధన్వి కడ జెందె
        సుమధన్విజడత కోకముల బొందె
కోకసంఘముదీప్తి కువలయంబుల నొప్పె
        కువలయశ్రమ కంజకోటి గప్పె
తమ్ములును చకోరతండమ్ము లన నొప్పె
        నెసచకోరులకాక విటుల నొంచె
విటజనావళి మనఃకుటిల మింతులఁ జేరె
        నింతుల సిగ్గు లంతంత జారె


గీ.

నఖిలఖగకోటి నీరము లరసి జొచ్చె
మిన్ను లేఁసంజకెంజాయ మిగుల హెచ్చె
బలసి చీఁకట్లు చిగురించి బయలుబొంగె
జఠరభానుండు పశ్చిమజలధి క్రుంగ.

92


శా.

ఏ నుష్ణాంశుఁడ రాజు వెందవిలె నేఁ డెట్లేఁగి యెట్లొచ్చునో
గాన న్నేనిఁట నుండనం చపరదిక్కంధిం బ్రవేశించిన
ట్లానీరేజహితుండు నస్తగిరిశృంగాగ్రంబునం దొప్పె నె
ట్లైనం దీక్ష్ణుఁ డనంగినం గువలయాహ్లాదంబు సంధిల్లదే.

93

మ.

సలిలాధీశ్వరుదిక్సతీమణి నిజస్థానంబునం భానుమం
డలముం జేర బ్రియంబునం జనులనిండం గుంకుమంబూని కెం
పుల మిన్నామినుకుల్ ధరించి యరుణంపుం బట్టుపుట్టంబు మై
ని లలిం దాల్చి కనుంగొనం గతినిబూనె న్సాంధ్యరాగచ్యుతుల్.

94


సీ.

ఇనుఁ డపరాంబుధి కేగఁగా నెదురేగు
        బడబాగ్నిశిఖిశిఖాపటల మొక్కొ?
కోకదంపతులపై కుసుమాస్త్రుఁ డరిబోయు
        నతులితాగ్నేయబాణార్చు లొక్కొ?
గగనాటవీసహకారభూజంబున
        జనియించు పల్లవచ్ఛాయ లొక్కొ?
దినకరుం డరుఁగువెంటనె దిక్సతుల్ జేర్చు
        ముఖముపై మేల్కమ్మిముసుఁగు లొక్కొ?


గీ.

పద్మకుముదాప్తు లిరువురపాలుఁ దెగిన
మహి నహోరాత్రముల నడిమధ్యమమున
బాతుపొలిమెరకెంపుఁగంబంబు లొక్కొ
యనఁగ లేఁసంజకెంజాయ లెనసె దిశల.

95


ఉ.

రాజగుఁగాక, సత్కళల రంజిలుగాక, బుధానుకూలుఁడై
భ్రాజిలుఁగాక, విష్ణుపదవర్తన నొందెడుగాక మత్ప్రియుం
డాజలజాప్తుఁడే తపనుఁడైన ఘనుండను సాధ్విమాడ్కి నీ
రేజము లవ్విధుంగన భరింపకనే ముకుళించె నొక్కటన్.

96


మ.

గగనేభేంద్రము యామినీమదము సోకం బెల్లుగా గెర్లి య
స్తగిరీంద్రంబున బొద్దుడు మావుతును ద్రోచం దత్తనూభిన్నమై
నొగులు న్నెత్తురు గ్రక్కెనో యనఁగ కన్ను ల్గోరగింపంగఁ బో
ల్పుగ జూపట్టి దిశాచతుష్టయము దీప్తు ల్సాంధ్యరాగద్యుతిన్.

97


సీ.

అహరంబుధిని బ్రదోషాగస్త్యముని గ్రోలు
        బాదున గనుబట్టు పంకిలంబొ

యామినీవహ్ని యస్తాద్రి రవుల్కొన్న
        గలిగిన దట్టంపు కారుఁబొగయొ
కడలిలో తనమణి బడిబోవ వెదకఁగా
        జగము ద్రిమ్మరుచున్న గగనతలమొ
తారకారూపకందర్పశాసనలిపుల్
        జూపట్ట నిడు మషీలేపనంబొ?


గీ.

యలజరావారకామినీయౌవనాంగ
వేషసంధానకరణదివ్యౌషధంబొ
యనఁగ బెంపొందె గనుఁగొన నంతకంత
కంధకారంబు నిఖిలదిగ్బంధురంబు.

98


చ.

దినకరుఁ డస్తమింపఁగను దీనత పద్మిని కవ్వియోగవే
దన నతిశీతవాతరుజ దార్కొన కాలభిషగ్వరుండు పో
సిన బలుమందుమాత్రలు నజీర్ణములై యుదరంబు నిండెనో
యన కమలాంతరాళములయందలి బంభరడింభము ల్దగెన్.

99


క.

ఈవసుధ యువజనాళికి
భావభవాహవము లీవిభావరి నగునన్
భావమున దుర్నిమిత్తఁపుఁ
గావురులం గప్పి యంధకారము బొలిచెన్.

100


సీ.

పెనుచీఁకటిమొగుళ్ళపెంపుచే గుంపులై
        బడిన వర్షోపలప్రకరము లనఁ
గోకదంపతులఁ జికాకుచేయ విధుండు
        కరనాళముల నూరు ఖండము లన
గగనాపగాతరంగముల నొండొండుదా
        కఁగ జించు నమృతంపుకణగణమన
జగములొక్కట గెల్వ జనుదెంచు మగనిపై
        రతి జల్లు పుష్పలాజతతులె యన

గీ.

నరుణతరుణాతపమున నంబరవధూటి
బొగలు నెమ్మేనిచెమ్మటబొట్టులె యన
తెలివి బొడసూపి చీఁకటి తెగలడాపి
చుక్క లొక్కట దిక్కుల పిక్కటిల్లె.

101


చ.

అపుడు రథాంగసంచయము లార్తిని గూయదొడంగె మింట రా
జిపు డిదె రాగలం డని దినేందిరయుం దనఱేని నీగతిం
దపనుఁ డటంచు నోరువకఁ దజ్జలరాశిని ద్రోసిరంచు వి
ష్ణుపదము నంటుచున్ వెతను శోకిలుచున్నతెఱంగు దోఁపఁగన్.

102


చ.

మఱుగుల కిగ్గి సొక్కుగొను మచ్చులు జల్లి భ్రమింపజేసి లో
నెఱవివరంబు సొచ్చి కడునేర్పున యిక్కువలంపుశయ్యలన్
మఱిఁగినవేళ గాంచి ధనవంతులసొమ్ములు దోఁచుకొందు ఱి
వ్వరుసను దస్కరు ల్మిగులవారవిలాసిను లొక్కటం దమిన్.

103


క.

తనరాకమేలుకథ కుము
దినులకును జకోరములకు దెలుపఁగ మునుమున్
వనజారి బనుచు నెచ్చెలి
యనఁగా తూరుపున బాండిమాకృతి బొలిచెన్.

104


సీ.

పతిరాకకును నిశాసతి ప్రేమ నెదురుగా
        నడుఁగుల మడుఁగులు నిడియె నేమొ!
ప్రాక్సతి శశిని గర్భముదాల్ప దన్ముఖ
        బింబంబుగను పాండిమంబు లేమొ!
రాజు రా గని విహారమునకై సమకూర్చు
        పగడంపుమణిమంటపంబు లేమొ!
యంబుధీశుఁడు పుత్రాగమంబున బొంగు
        తరఁగల బెరిగిన నురుఁగు లేమొ!


గీ.

యనఁగ బ్రాగ్దిశ శుభ్రమౌ నంతలోన
కాలముని విష్ణుపదము నివ్వాళి యొసఁగు

మిణుఁకుకర్పూరహారతికళికవలెను
శ్రీకరుం డౌచు బొలిచె సుధాకరుండు.

105


సీ.

అమరనాయకవధూహర్మ్యాగ్రవిలసిత
        కనకమణిప్రభాకలశ మనఁగ
బ్రాగ్దిశాకామినీఫాలభాగంబున
        పొంకమౌ ఘసృణపంకాంక మనఁగ
దర్పకదండయాత్రాసూచకంబైన
        షకలాతుడేరా నిషాని యనఁగ
ఘననిశాకాంతాముఖప్రభాలోకనా
        ర్థము బూను మించుటద్దం బనంగ,


గీ.

చీఁకటు లణంగ సారసశ్రీ దొలంగ
కలశనిధి బొంగ జక్కవకవ దొలంగఁ
గోర్కె లలరంగ తూరుపుకొండమీఁద
డంబుమీరంగ నిందుబింబంబు పొడమె.

106


గీ.

తపను సాహస్రకిరణసంతప్తమైన
గగనలక్ష్మికి చంద్రికాగంధ మలఁది
ప్రాక్సతీమణి వీవ చేపట్టినట్టి
తాళవృంతంబుగతి సుధాధాముఁ డలరె.

107


చ.

కలువలు విప్పఁ బద్మినులకాంతులు దప్ప రథాంగదంపతీ
కులములు మోము ద్రిప్ప సురకోటులు విందుల నొప్ప వారిరా
సులు పయికుప్ప వెన్నెలలసొక్కులు దిక్కులు గప్ప వింతగా
చలువవెలుంగుకుప్పరుచి సాంద్రత తూరుపుతిప్ప నొప్పఁగన్.

108


గీ.

సరసమై వసుగంధప్రసక్తి బూని
శతభిషక్రియ మౌచు సత్సంగతి దగి
వివిధరుఙ్మండలు హరించి కువలయప్ర
మోదము నొసంగె పూర్ణచంద్రోదయంబు.

109

సీ.

వితతచకోరికావితతి దాహము దీఱె
        జతవీడి కోకదంపతులు బారె
చిమ్మచీఁకట్లు నొక్కుమ్మడి దిగజారె
        విమలాబ్జమణులలో చెమటలూరె
విరహులపై మరుం డరిదికైదుపు నూరె
        వివిధతస్కరకోటి వెతల బారె
కులటాంగనలకు మిక్కుటఁపుభేదం బూరె
        కుముదిని కొకవింత కొమరు మీరె


గీ.

తమ్మిమొగడలతేటి మొత్తమ్ము దూరె
తరుణదంపతులకు మనస్తాప మారె
విటవిటీజను లలుక లొక్కటనె దీరె
పండువెన్నెల జగమెల్ల నిండి బారె.

110


వ.

ఇ ట్లఖండితప్రభావిడంబితం బగుచుండు పండువెన్నెలలు మండితపుండరీక
భవాండకటాహంబున న్నిండి తండోపతండంబులుఁగా మెండుకొని శచీ
సీమంతినీకాంతుచతుర్ధంతదంతావళంబుతో సంతంతమంతనం బొనరిం
పుచు సారకర్పూరపటీరడిండీరహీరతారశారదమందారశరమరాళజాలం
బుల పగిది నదభ్రశుభ్రవిభ్రాజితంబై యుదయగిరిపరిసరచరద్వరముని
నికరతరణికిరణధిక్కరణసటాపాటలత్వంబుసు మాటిమాటికి న్మీటుచు,
చటులకిటిపటలవికటాహవనటనఘటనపాటవోత్కటసమయా౽న్యోన్య
కఠోరదంష్ట్రోద్ఘట్టనంబున మిట్టువడి యిట్టట్టుజారిన కట్టాణిముత్తియం
బుల విట్టలంపుకట్టుల నిట్టట్టుం బొరలి చిటికొటారంబులం గ్రీడించు
విటవిటీజనంబుల మదనకదనత్వరితంబునం జిక్కువడు హీరతారహారం
బులం బేరజంబుఁ జేయుచు ననూనమానసానుమోదంబున నహీనసూన
విమానవితానంబులం దారోహించి యించువిల్కాని పంచశరసంచలిత
హృదంచితులై సంచరించు వేల్పుమించుబోణులన్ రాణించు సుమనో
హరంబులగు సుమనస్సుమనఃప్రకరంబుల నదలింపుచు క్రొన్నెల
వెన్నెలలకన్న మున్నుమున్ను నుపనాథులం గన్నుసన్నల న్వెన్నుకొనం
బన్ని యతులితచతురతలం బతుల నితరేతరజను లెఱుంగని మఱుం

గులుం గల వాడవాడలఁ బైడిమేడగోడనీడలం గ్రీడించు చేడియల
వేడుక లూడన్ సద్యోలజ్జాజనితకారణంబై యిండ్లిండ్ల న్మగనాండ్లు
కండ్లపండువులుఁగా తోడిప్రోడలంగూడి పాయసకలమాన్నంబు లిడుకొని
ముసిముసినగవులం ధిశల బసలెసఁగ మెసఁగుకలధౌతపాత్రలం
దిడియిడనిక్షీరధారాకారంబులై నిద్దంపునెలఱాలం దిద్దిన గద్దియలఁ
దద్దయుం బొరలు ముద్దియల మేనులందలి యందియలందలి
చందనం బనం దనఱి నితాంతవనాంతలతాంతంబుల వికసింపక
వికసించినతెఱం గెఱుంగఁజేయుచు రతిపతియశఃప్రతాపంబు లేకీభవించి
జగంబుల బొగడ నెగడె నన యమునానదీసంగతగంగాతరంగంబులకు
కోరికలు తీర తారాపథంబునం జారిన క్షీరధారాపరంపరలలీల
తనరాక కడలిముఖవికాసంబును దొలంగు బద్మినిం గని సుధాకరుండు
హసించెనో యను యనువునం జెలంగి యశేషశృంగారవేషవిశేషంబులకుఁ
గన్నులబండువై నిండుకొనియుండె నప్పుడు.

111


ఉ.

ఆసమయంబున న్మదనుఁ డాహవదిగ్విజయార్థియై సము
ల్లాసమునన్ వసంతుఁ డకళంకగతిం దనుకొల్వ బాణబా
ణాసనతూణము ల్గొని పికాళి మరాళ మయూర కీరశా
రీసముదాయ మార్భటుల హృద్యముగా నడచెన్ హుటాహుటిన్.

112


సీ.

డంబౌమృణాళనాళంబులే యిరుసులు
        బలితంపుఁ దెలిదమ్మి బండికండ్లు
కొదుమగేదంగిరేకుల చిక్కని పరమ్ము
        తొగతీవియల మేలిబిగువు నొగలు
మేఁటిగొజ్జఁగిపూల గాటంపుకాడియు
        కప్పురంపు టనంటి చప్పరంబు
కెర్లి దూకెడి రాజకీరంబులగు ఱాలు
        నిగ్గైన కురువేరు పగ్గములును


గీ.

మలయు తనరథమున నెక్కి మత్తవిరహ
చిత్తవృత్తులు మెత్తనె తత్తరిలఁగఁ

గ్రొత్తముత్తెఁపుఁగుత్తులకత్తి కేల
హత్తి చిత్తజుఁ డదిగొ దండెత్తి వెడలె.

113


సీ.

గంధసింధురదానగంధబంధురుఁడైన
        గంధవహుండు మార్గంబు జూప
సంతతకాంతవనాంతలతాంతని
        శాంతవసంతుండు చెంత నడవ
కోకిలాశారికాకేకీశుకానీక
        మేకీభవించి పరాకు దెల్ప
గంగాతరంగానుషంగస్వనోత్తుంగ
        భృంగసంగీతప్రసంగ మెసఁగ


తే.

బెండువడియుండు పాంథుల గుండెలెల్ల
భేదిలంగను డాంఢమీనాద మొదవఁ
బ్రబలకందర్పబహుదురీపాదుషాహి
వెడలె రణరంగధీరాంకవీరుఁ డగుచు.

114


లయవిభాతి.

పొంగుచును సింగముతెఱంగునను దూకి బహు
భంగుల మెలంగఁ బొదలం గలసి వేగన్
ముంగలికి వంగి కనశింజిని ఖణింగున బొ
సంగగను మీటుచు జెలంగి యతివేడ్కన్
హంగుగను మేటి గొజ్జంగిపువుతూఁపులు నీ
షంగము వెడల్చుచు తరంగములలీలన్
రింగున సడల్చియును నుత్తుంగగతి నార్చుచు న
నంగుఁడు నభంగురజయంగతి నెనంగెన్.

115


ఉ.

వెన్నెలకాకకే మిగులవేసట జెంది వియోగవేదనా
పన్నత దల్లడిల్లు బలభద్రతనూజకుచాగ్రదుర్గముల్

భిన్నము జెందునట్లు వెఱపించుచు పెంజడివానరీతిగా
గ్రొన్ననవింటిజోదు 'శలగో శలగో'యని గ్రుమ్మె నిమ్మడిన్.

116


క.

పొంచి వెనువెంటనే మే
న్వంచి విరింగోల వింటనుంచి గుఱిం బా
టించి. సవరించి పై లం
ఘించి సరాయించి తమి మొగించుక మించెన్.

117


క.

ఆకోల యేటుపాటున
కోకిల లొక్కుమ్మడిగను 'కో'యని కూయన్
పైకి ధువాళింపఁగ నా
కోకిలమృదువాణి యుడ్డు గుడుచుచు బలికెన్.

118


ఉ.

అమ్మకచెల్ల! యీబలుగయాళిమరుం డతిదుండగీడు పై
గ్రుమ్మెడు నంపచిచ్చఱకు కమ్మనితెమ్మెర బమ్మరింపు నొ
క్కుమ్మడి జిమ్మిరేగి నెఱిహుమ్మని ఱొమ్మున నమ్ము గ్రుమ్మె దే
హమ్ము నిజమ్ముగా నిలువదమ్మ యికేమని తెల్ప నావెతల్.

119


సీ.

తనసహోదరుఁ డంచు దలఁపక గ్రూరుఁడై
        కూఁతుతో నెనయఁగా గూర్చె నితఁడు
తనకగ్రజనకుఁ డం చనక తాపససాధ్వి
        పై మరుల్ గొల్పిన పాపి యితఁడు
తనపుత్రకుఁ డటంచు తర్కింపక తపంబు
        జెరిచి యోషాసక్తి జేర్చె నితఁడు
తన మేనమామ యౌ ననక దుర్వృత్తిచే
        గురుతల్పగమనాప్తిఁ గొల్పె నితఁడు


గీ.

ప్రబలు లదిగాక తనదేహబాంధవులగు
వారికే రోయ డీశంబరారి యహహ!
యూరకే నన్ను బాధింప కుండగలడె
యింక దైవేచ్ఛ యెటులున్నదేమొ కాని.

120

క.

అని తనలో తను ఝషకే
తను తనుతాపమున మిగులతహతహగొను జ
వ్వని వనితలెల్ల గవిసి వ
చనరచనాసౌహృదప్రసక్తి నెఱపుచున్.

121


ఉ.

కొమ్మ నరాత్మజుం దలఁచుకొంటివొ? మేన్పులకల్ జనించే సు
మ్మిమ్మెయి మున్నువోలె మనసిచ్చి ప్రియమ్మున బల్కరించవే
మమ్మ, భవన్ముఖంబు విరహభ్రమ జూపె గదమ్మ, దాచనే
మమ్మ! వచింపుమమ్మ! వికాచాంబుజపత్రవిశాలలోచనా!

122


చ.

చనువుగ నంచలం గనులసైగలనైనను జేరఁ బిల్వవే
మనిశము కీరశారికలకై నను బద్యము జెప్పవేమి? పెం
చిన ఫణిభుక్కిశారములు జేరిన చెక్కిలి గొట్టవేమి?యో
వనజదళాక్షి యిట్టు వలవంతల చింతిల నేమి హేతువో?

123


వ.

అని యనేకప్రకారంబులం బలుకు నెచ్చెలులపలుకు లచ్చెలువ వ్రీడాభరం
బునం బరాకు చేసికొని చిఱుచెమట గ్రమ్మిన నెమ్మొగమ్ము మరంద
బిందుసందోహకందళితారవిందంబుచందంబునం దనర నిట్టూర్పులు
నిగిడించుచుఁ గళవళించుచున్న సమయంబున.

124


సీ.

అంతకంతకు నుదయాద్రివహ్ని జనించు
        వేడివెన్నెల జూపి విధుఁడు జెలఁగ
నుగ్రాక్షు కనుచిచ్చు నోర్చి నిగ్గునదేలు
        యలరువేడిమితూఁపు లతనుఁ డేయ
బెనుబాముకోఱల బెనఁగి కంపము సూపు
        కడువిసవిత్తులే గాడ్పుసోక
పోటుజెందిన గట్టుబొఱియలలో దూఱు
        ఘనభీతి వెలిపుల్గుగములు బొదవ


గీ.

నింతి యంతింత యనరానివంత బూని
వలఁపువెన్నానితోడి నెచ్చెలులతోడ

భాషణముమాని యరవిరిపాన్పుపైని
నిమ్మెయిని చెమ్మటలు గ్రమ్మ సొమ్మసిల్లె.

125


క.

అది గని బెదఱినమడి ప్రియ
సుదతీమణులెల్ల చుట్టుచుట్టుకొని నయం
బొదవ మదిరాక్షి కౌఁగిట
బొదవుచు వెంజఱచి మేను బుణుకుచుఁ బ్రీతిన్.

126


ఉ.

పిన్నతనాన మున్ను మురిపింపఁగ జూపిన మత్ప్రియుం దయా
సన్నత నేఁడు జూపుమని సన్నిహితంబున దీనవృత్తిచే
నున్నవిధంబు దోప మెయినుండిన ఠావులు మాని బ్రాణము
ల్కన్నియకన్ను లన్నిలిచె గన్గొనరే యని భీతచిత్తలై.

127


సీ.

పడఁతి మనోవార్థిఁ బడి మునింగెనో యేమొ
        తతబాష్పజలబుద్బుదంబు లవిగొ,
పొలఁతి యాశాలతల్ బుష్పించెనో యేమొ
        తనుఘర్మజలమరందమ్ము లవిగొ
యువిదవాంఛాధుని యుప్పొంగెనో యేమొ
        మేన పాండిమఫేన మూనె నదిగొ
లలనకు విరహానలము జనించెనో యేమొ
        నిట్టూర్పుబొగలు జూపట్టె నవిగొ


గీ.

యక్కటా!యివి సామాన్యమని దలంప
వలయు నికనైన గాపాడవలయు పడఁతి
నట్టుగాకున్న కన్నె నిట్టట్టు జేయ
ధూర్తగతి జొచ్చు మన కపకీర్తి వచ్చు.

128


సీ.

మధుపకోటికి బ్రణామము జేసి దెచ్చుమ
        రందమ్ము మధురాధరమున జిల్కి
గంధవాహికి నమస్కరణఁ జేసి గ్రహించు
        పూవుగుత్తులు కుచంబుల నమర్చి
బిసభుక్తతికి దండమొసఁగి తెచ్చిన మృణా
        కంబులు భాహువల్లరుల గూర్చి

కిసలయగ్రసనాళికిని మ్రొక్కిడీ లభించు
        తలిరుటాకులు పదమ్ముల ఘటించి


గీ.

తరుణి యివి పంచశరదేవతాబలంబుఁ
దత్ప్రసాదంబు లీపదార్థములవలన
వెఱఁపుదీరు నటంచు గావించి రపుడు
చతురరచనల శిశిరోపచారవిధులు.

129


సీ.

అలరులు గుములునంచని చింతపడకు వే
        కలకంఠిపదములు గప్పవమ్మ
యుడుకునంచని వెతనొందకు మలివేణి
        సుమములు కొప్పున జుట్టవమ్మ
వాడునంచని భీతివలవ దండజయాన
        బాహులందు బిసాళి బన్నవమ్మ
కన్నులఁ జేర్పవే కమలముల్ చెడునంచు
        కోకస్తనీ వంత గుందకమ్మ


గీ.

వీటి నాహారమని చూడ పాటిగాదు
చెలిమికొఱ కెంతపనియైన జేయవచ్చు
గాని యిది కొంచెమౌ పనిగాని దెఱిఁగి
జేరి శైత్యోపచారముల్ జేయవలయు.

130


సీ.

చందనం బలఁదవే శైలవక్షోజ క
        ర్పూరం బొసంగు రంభోరుయుగళ
హిమజలం బిడవె తుహినమయూఖనిభాస్య
        చిగురుటాకులు గూర్పు మిగురుఁబోణి
ముత్తియమ్ములహారములు వైచు ఘనవేణి
        కాశ్మీరమును బూయగదె శుభాంగి
మకరందబిందువు ల్మయిజిల్కు పూఁబోణి
        పుప్పొడుల్ జల్లు మంభోజగంధి

గీ.

యనుచుఁ దమతమ కనుకూలమైనపనుల
నొకరినొక రుచ్చరింపుచు నోపినటుల
గూర్చి శశిరేఖతనుతాప మార్చుకొఱకు
సకలశిశిరోపచారము ల్సలిపి రపుడు.

131


చ.

సరసిజనేత్ర లింతి యుపశాంతికినై శిశిరోపచార మీ
కరణి యొనర్పఁగా సురభిగంధము పెట్టి పరాగమై ధరం
దొరిగె జిగుళ్లు క్రొవ్విరులు తుత్తుముఱయ్యె బిసంబులెల్ల భం
గురగతి వాడె మైనినికె గొజ్జఁగినీరు. మనోజవేదనన్.

132


క.

తోడిచెలు లెట్లొనర్చిన
నాడాడకు స్రుక్కువార లందరిలో బల్
నాడెమగు చేడి యొక్కతె
నాడి పరీక్షించి గుంభనంబున బలికెన్.

133


సీ.

అంతకంతకు తాప మధికమై చెలిమోహ
        ముడుగదే 'పూర్ణచంద్రోదయము'న
మఱిమఱి ప్రబలమై మది గలంచునుగదే
        యింతికి 'మదనకామేశ్వరము'న
మాటిమాటికిని యారాట మొందునుగదే
        రమణీమణికి 'వాతరాక్షసము'న
గడెగడె కింక వెక్కసము జెందునుగదే
        సతి 'నీలకంఠరసంబు'వలన


గీ.

దినదినం బెక్కువగుఁగాని తీరదే 'వ
సంతకుసుమాకరంబు'న సకియలార
'భూపచింతామణి'ని గాని పొలఁతి విరహ
దారుణజ్వరదోషంబు దీరదమ్మ.

134


సీ.

మరువక నిక నుగ్రమంత్రము ల్బఠియించి
        తనుహీనభూతమ్ము దరుమరమ్మ

సత్తమోపాసనల్ సలిపి గురుద్వేషి
        యగు నిశాచరపీడ నణఁపరమ్మ
వెస నహీనక్రియావిధు లొనర్చియు పెను
        గాలిసోకుడుల బో గడపరమ్మ
ఘనుల ప్రార్థించి పంకప్రచారవిజాతి
        గణముల కావరం బణఁపరమ్మ


తే.

యటులగాకున్న మదనశశాంకగంధ
వహమరాళాదులకు తాళవచ్చు నటరె
యనుచు రంభాదళోచితవ్యజనములను
బూని విసరుచు నుపచారములు ఘటింప.

136


గీ.

అప్పు డొక్కింతతడవున కవ్వధూటి
యులికిపడి లేచి పవళించి కళవళించి
కలవరించి బయల్గాంచి కౌఁగిలించి
యింతులను గాంచి దుఃఖించి యిట్టు లనియె.

136


సీ.

అల విరు లని జెప్పి యగ్నికణంబు లీ
        వడగాడ్పులకు తోడు నిడఁగదగునె
పన్నీరటని కాచియున్ననూనియ మేని
        వలకాకలకు దోడు జిలుకదగునె
గోవకప్పురమంచు క్రొత్తసున్నంబు వె
        న్నెలవేడికిని తోడు నిడఁగదగునె
చిగురాకులని యంపతెగలను మరుకైదు
        వులకుఁ దోడుగ నెద నిలుపఁదగునె


గీ.

యకట చెలులార తొంటినెయ్యం బొకింత
దలఁప కిరీతి పగదీర్చఁదలఁచినారొ!
గాకయుండిన వీటికి కాకలేల
యనుచు విలపించు మదినోడి యలరుఁబోఁడి.

137

వ.

అంత నయ్యింతి లతాంతకుంతనియంత్రితస్వాంతయై యంతింతనరాని
చింతాభరాక్రాంతంబున నంతకంతకుం దొంతరిలుచు చెంతన్మెలంగు
మంతనంపుటింతులం గనుంగొని యిట్లనియె.

138


సీ.

తలదిమ్ములొసఁగు గద్దఱితుమ్మెదల గొల్చి
        చేయరే కనకాభిషేకమైన
కెర్లివర్లెడు రాజకీరంబులకు మ్రొక్కి
        గడపరే సాంకవగంధపూజ
కలగించు జక్క వగమిని సన్నుతిజేసి
        యర్చించరే నిర్మలాబ్జములను
వెఱపించు కాదంబవితతిని బ్రార్థించి
        సలుపరే ఘనమహోత్సవవిభవము


గీ.

గాకయుండిన మదచంచరీకశౌక
కోకకలమానసౌకంబు లేకమై చి
కొకు బైకొనె మరు నంపకాక కోప
తరము గాదమ్మ దీని బోఁదరుమరమ్మ.

139


వ.

అని పలికిన కలికి కలికిపలుకుల కులికి యక్కలకంఠకంఠు లొక్క
మొగి శశిశుకశారికాచంచరీకకేకీమలయపవనమరాళసమేతుండగు మనో
భూతు నుద్దేశించి యిట్లనిరి.

140


సీ.

గుబ్బలపై బయల్గొన్న చెమ్మటబొట్ల
        పరిమళసలిలార్ఘ్యపాద్య మొసఁగి
విరహానలోగ్రసంజ్వరతాసముత్పన్న
        పాండిమశ్రీగంధపంక మలఁది
తాపాతిరేకనిద్రాహీనశోణదృ
        గ్జలజాతపుష్పాంజలుల నొసంగి
మహితనిశ్శ్వాసధూమశ్రేణికాఘ్రాణ
        తర్పణధూపసమర్పణ లిడి

తే.

పూజ గావించుచున్న దీపువ్వుబోణి
చిత్తమున నీవు గల్గుట జేసి గాదె
మ్రొక్కదలఁచిన చేతులు చెక్కఁదలఁచు
సామె తాయెను నీపూజ యోమనోజ.

141


సీ.

శిరముపై గేదంగివిరితురాయియె గాని
        తిలకింప చంద్రమండలము గాదు
అఱుతను వలఁపుకస్తురిపట్టియే గాని
        కాలకూటప్రభాగరిమ గాదు
కాయంబునను గంధకర్దమంబే గాని
        పాటింప బూదిలేపనము గాదు
చెలియవీఁపున జారుసిగముడియే గాని
        భయదభాస్వజ్జటాభరము గాదు


తే.

కాని నీపాంథమారకక్రమము గనిన
విలయకాలోగ్రమూర్తిగా దలఁపబడియె
నకట నీ కిది తగ దోరి శుకవిహారి
సకలనారీమనోహారి శంబరారి.

142


గీ.

మదనభవదంబసదనసంపద నణంచు
శశిని యర్మిలి యొనరింప జనునె శాస్త్ర
రీతులను 'సర్వనాశాయ మాతుల' యని
దెలియఁగా లేదొ! యికనైన దెలియరాదొ!

143


చ.

హరితనయాఖ్యచే హరునహంకృతి బైకొని కాలరూపునం
గరము రహించియు న్విషమకాండనిరూఢి నఖండధర్మవి
స్తరత వహించి లోకభయదాతనువృత్తిజనవ్యథోచితా
చరణత జెందు కాలయమసామ్యుఁడ వైతివి నీవు మన్మథా.

144


సీ.

జనకఁ డంతకు పుణ్యజనపీడన మొనర్చు
        తల్లిచాంచల్యవర్తన మెలంగు

కన్నతండ్రికి భంగకార్యం బిడెడు మామ
        తెలిసి కూతురును వర్తించునన్న
ప్రజలనోటను రద్దిపాలౌ వదినగారు
        సతతజాతివిరోధి సంగ డీఁడు
మధుపానవివశదుర్మదులు బంటుబలంబు
        పథ మెఱుంగక మండిపడియె దీవు


తే.

యిట్టి నీవంగడంబుపే రెత్తియైన
పిన్నపెద్దల కిక నోటబెట్టదగునె
మానినులకెల్ల తలవంపులైన బ్రతుకు
గోర నేటికి నీరూప మార మార.

145


చ.

నెఱి విషజాతులంపగమి నీటులొ జాడలుదీయు టెక్కెమున్
మొరసెడి నారి నల్లగమిమూఁక తునింగిన మొల్చువిల్లు నొం
డొరులకు గానరాని తనువుంగొని పాంథమనోధనంబు లీ
కరణి రహించు తస్కరశిఖామణి వీవె కదా మనోభవా!

146


సీ.

ఒకపాటివాఁడైన చికిలిబాకు ధరింప
        చివురుటాకును బూన సిగ్గు గాదె
హేనుఁడైన తురంగ మెక్కఁగా చిల్కత
        త్తడి నీవు గొన కొంచెదనము గాదె
కొఱగానివాఁడైన కోదండము ధరింప
        లలి తుంటవిలు దాల్ప లజ్జ లేదె
తనువులు ప్రాణు లందథికుండఁగా ననం
        గుడవౌచు బ్రతుకుట కొఱత గాదె


గీ.

కాన గతిలేని యభిమానహీనవృత్తిఁ
బతుల నెడబాయు సతులపై యమలగతుల
మెత్తవిరిగుత్తికత్తుల నొత్తఁదగునె
యమలితాభంగశృంగార హరికుమార.

147

సీ.

పిట్ట నెక్కే యింత మిట్టిపడియెద వేమి
        యది గుఱ్ఱమైతే మిన్నందె దేమొ!
చెఱకువి ల్గొని యిన్నిచేష్టలు చేసేవు
        యది చాపమైతె మాటాడ వేమొ
యిగురుకోలకె యింత యెగసిపోదలిచేవు
        యది వజ్రమైతె త్రుళ్లాడె దేమొ
తనువు లేకనె యింతదర్పంబు జూపేవు
        యదియున్న శివమెత్తి యాడె దేమొ


గీ.

గాకయుండిన దుర్మదోద్రేకవృత్తి
దాకి పైకొనుటిది లజ్జలేక గదర
విరహిణీమార! శంబరాసురవిదార
మథితసుకుమార! మార! కల్మషవిచార.

148


సీ.

తుంటలై నీవిల్లు ధూళిలోన నణంగఁ
        బొలుపొందు నీమేను బూదిగాను
నీయంపగమి విచ్చి నేలపాలై చన
        మురయు నీరథి మొక్క మూలఁ గూల
చెడుగు నీసారథి యడవిలోపలఁ జేర
        నీటైన నీటెక్కె మేట గలవ
నిను మ్రోసెడి తురంగమును సంకెన ల్వేయ
        నీమేటిచెలికాని పాము కరవ


గీ.

చెట్టు కొకటూచు నీసేన లట్టె గిట్ట
నయ్యయో నీవు 'పాపీ చిరాయు' వనెడి
నీతి నీరీతి విరహిణీఘాత వైతి
వింక మకరాంక చెలి నేచు టేమి శంక.

149


తే.

అనుచు వనజాననలు మనోజుని కినుకను
తనవి సనకను జెనఁకి యాతనివెనుకను

జేరి యానారిగారించు నీరజారి
సారెసారెకు జలపోరి దూరఁగోరి.

150


సీ.

బుధనుతుండగు క్షీరనిధి కుమారుండవు
        ఘనుఁడైన లోకబంధునకు హితుఁడ
వాదానవారి నెయ్యంబైన మఱఁదివి
        శంకరస్వామి చూడాంకమణివి
దక్షునియోజకు దగిన యల్లుండవు
        విబుధక్షుధలు దీర్పు వెన్నకడివి
యసమాస్త్రునకు ఘనంబగు మేనమామవు
        శ్రీదేవికిని బ్రియసోదరుఁడవు


తే.

నట్టిసత్కులజాతుండవై దనర్చి
వరవియోగులపై వేడి బఱఁపదగునె
భవ్యచారిత్ర విరహిణీపాంథజైత్ర
గురుసుధామయమృదుగాత్ర కుముదమిత్ర.

151


చ.

మనమున నీతి లేక గురుమానిని బొందినద్రోహి వంచు నీ
చెనఁటితనం బెఱింగి సిగ జేర్చెను శంభుఁడు లింగధారివం
చనెడి హితంబు గాంచి గద హా! ధర నెట్టి దురాత్మునైన త
న్ననిశము గొల్చినంతనె మహాధికు జేయుఁ బురారి యల్పుఁడై.

152


సీ.

కువలయావనకీర్తి గొనినందుకు ధరిత్రి
        చక్రవిద్వేషంబు సడలలేదు
విబుధానుకూలప్రవీణుండవై యుండి
        మది గురుద్వేషంబు మానలేదు
ఘనవిష్ణుపదసక్తకరుఁడ వైనందుకు
        నీనిశాచరవృత్తి మానలేదు
ద్విజరాజవిఖ్యాతి దీపించుటకును స
        త్సంతతి పెంపోర్చు టింతలేదు

తే.

వసుధ వర్జింప ఘనమార్గవర్తి వగుచు
రాజకాంతావళులను గలంచబూను
నేజయు నీరాజశబ్దంబు నేతిబీర
కాయ గదరోరి! శశధారి! కమలవైరి!

153


సీ.

తోయధిఁ బడబాగ్నితో మొద ల్జన్మించి
        హాలాహలా౽న్యోన్య మగుచు బెరిగి
నిలిచి యుగ్రాక్షునినెత్తిమీఁద నటించి
        యుదయాద్రిధవశిఖి నొరసి మెఱసి
యలరాహుదంష్ట్ర విషాగ్నితోడ బెనంగి
        తపసుని నెలనెల తారసిల్ల
భావింప నత్రితపోవహ్నిచేఁ గ్రాఁగి
        గురుశాపశిఖిశిఖాకులతఁ బొరలి


గీ.

నట్టి చలపాదివైన నిన్నజ్ఞు లెల్ల
శీతకరుఁడని మిథ్యాప్రతీతి దనరి
బాలికామణులను నేచనేల రోరి
కామినీమానధనహారి! కమలవైరి!

154


సీ.

భగినిపుట్నింటి సంపదలెల్ల బోకార్చి
        పగఁబూని జనకు భంగగతు జేసి
బలిమి మేనల్లుని భస్మంబు గావించి
        తలపఁ మఱందిచిత్తము గలంచి
తమ్ములపై విరోధమ్మున బెంపొంది
        సత్సంతతులపెంపు సడలఁజేసి
సరిలేనిగురుని సంసారహాని యొనర్చి
        దేవుఁడౌ హరుని నెత్తిననె జేరి


గీ.

చెలిమిఁ గుజనుల నభివృద్ధి జెందఁజేసి
చావు గానని బలు నిశాచరుఁడ వీవు

బ్రతికియుండుట విరహిణీప్రాణహాని
కోకకులజైత్ర కువలయినీకళత్ర.

155


చ.

నిను బెనుబాము మ్రింగ నిక నీనిలువెల్లను నీఱుగాను నీ
తనువు పదాఱుతుంటలయి దారుణకార్శ్యత నీఱు నీరుగా
దిన మొకచాయ గ్రుంక సుదతీమణులం గలగించు పాపమే
గునగునకాళ్ళవ్రేళ్ళ బెనఁగుం దొలిగింపవశంబె చంద్రమా!

156


క.

అని పలికి మదనునకు వెను
కొను మలయసమీరకేకికోకశుకపికా
ళినికాయములను గనుఁగొని
వనితామణు లనిరి రుచికవచనరచనలన్.

157


సీ.

ఒకమహాబిలమున నుద్భవించి గిరీంద్ర
        మార్గంబునను బయల్ నిర్గమించి
కాంతారభూము లంతంతన జరియించి
        కాఱుపూఁబొదరిండ్లు దూరి వెడలి
సతతప్రభంజనస్థితి జీవులకు జూపి
        దివము రాత్రిని సదాగతి వహించి
పాంథహృద్వేదనప్రకటగీతి గమించి
        నవ్యమహాబలోన్నతిని మించి


గీ.

భువిని సాక్షాత్కరించు బెబ్బులివి నీవు
సాధుబాధ లొనర్చు టాశ్చర్య మేమి
నిను జగత్ప్రాణుఁడని బిల్వ నీతియగునె
పాంథజనమారణోత్సాహ గంధవాహ.

158


క.

చలము గొని నిన్ను విషధర
ములు మెఁసఁగఁగ వానిలేశము న్వంచింపం

దలఁపడక విషధరాఖ్యత
నలరు ఘనులఁ దరుముటకు మహాబలివి గదా!

159


గీ.

మొదల నీమే నదృశ్యమై మూలబట్ట
నరసి బెనుకొండత్రాచు నిం దరిమి కరువ
నీప్రచారంబు ధూళియై నింగి కెగయ
తుదికి నీమేను తునియలై బొదల దూఱ.

160


సీ.

నిను సంకెల ల్వేయ నిలువక మిన్నంట
        నెగసిపోయెద వేమి పొగరుజిల్క
నీ యిల్లు మొదలారి బోయిన కనులెఱ్ఱ
        గొని చూచె దదియేమె కోకిలంబ
నీత్రుళ్ళుగుణమునం దేతూపు లెక్కిన
        ఝంకరించెద వే మదింక తేఁటి
నీపింఛ మణఁగి వన్నియ చెట్లుపాలైన
        [1]కేకలీడెదు కానబోక కేకి


తే.

పాండురుగ్భారమున దాగియుండియైన
ఘనల గననోడె దదియేమొ మరాళ
యని నిజార్థంబు లొకకొన్ని హాస్యసరణి
బలికి యంతట బోక కోపమున గెరలి.

161


సీ.

ఱేఁచి యీబింబాధరిని జేరకుమి కీర
        కమలాక్షి సాంకవగంధి సుమ్మి
కమలాక్షి యని నీవు గదియకు మధుప యీ
        ననఁబోణి చంపకనాస సుమ్మి
ననఁబోణి యని భ్రాంతి గొనబోకు పిక యీబి
        సాంచితబాహురామాంగి సుమ్మి

యాశించి బిసబాహయని తూఁగకు మరాళ
        యీభామ ధారాధరాభవేణి


గీ.

గాన వచనాలకస్వరగమనములను
సాటివారలు మీరు మామాట వినక
యెగసిపోనేల ఝంకృతు లిడఁగనేల
యొరలఁగానేల బొరె డాగియుండనేల.

162


క.

అని బిత్తఱికత్తియ ల
మ్మనసిజశశిగంధవహసమాజమును ప్రియో
క్తిని దూరి రేవతీసుత
కనుకూలముగా వచించి రనుపమలీలన్.

163


సీ.

తనువు ఫాలాక్షనేత్రమహాగ్నిచే క్రుంగె
        తుంటలై చాపంబు మంటగలిసె
మకరధ్వజము తుంగమడుగులోన నణంగె
        శరములు పురినిచ్చి ధరణిగూలె
చెట్టుచెట్టున జేరి చెదఱెను నీమూఁక
        మొదటినుండి రథమ్ము మూలఁబడియె
చెలికాఁడు దెఁసఁజెడి జేరె కాఱడవులఁ
        బక్షియై తురగంబు బయలు బట్టె


తే.

నింక మరుఁ డేడ మన మేడ యితనివలన
తలఁపు నిలుపకు మమ్మ బెగ్గిలకు మమ్మ
నీమనోరథసిద్ధియై నెగడు నమ్మ
కొమ్మ వినవమ్మ యోముద్దుగుమ్మ లెమ్మ.

164


శా.

ఈరీతిన్ శిశిరోపచారముల నయ్యేణాక్షి మోహానలా
సారంబెల్ల నణంపుచు న్విహితవాక్చతుర్యమాధుర్యముల్
మీరం బ్రొద్దులుబుచ్చుముచ్చటల పేర్మిం దెల్ప నారాత్రి నిం
డారన్ యామచతుష్టయం బరిగె నుద్యచ్చంద్రికాపూర్ణమై.

165

ఉ.

అంతటిలో కనుంగొనఁగనయ్యె రథాంగయుగీదురంత దుః
ఖాంతము, సంతతాతనుసుఖానుభవశ్రమతాస్వకాంతబా
హాంతరసుప్తికాశ్రుతిపుటాంతరదుస్సహవామ్రచూడకా
త్యంతనినాదపూరితదిగంతము నైన నిశాంత మెంతయున్.

166


గీ.

కామినీమణు లతనుభోగములవలన
పతుల నుపరతులను దేల్చు చతురతలను
గాంచి మది మెచ్చి తలయూచుగతిన దీప
కళిక లల్లార్చుచును సికల్ గదలదొణఁగె.

167


శా.

మారూపంబున శక్రుఁడే మును మహామౌనీంద్రు వంచించె, క్రౌం
చారాతిధ్వజమౌట మేమె స్మరవిద్యాభ్యాసిగాఁ బాణినిన్
శూరుం జేసినవారు మత్కులజు లంచున్ సత్కులాస్థానముల్
దారై దెల్పెడిరీతి కుక్కుటమహాధ్వానంబులున్ రాజిలెన్.

168


గీ.

ఇనుఁడు ఘనతమిస్ర మనెడు కాటుకపుల్గు
సమితి బొదవ కిరణజాలసూత్ర
మిడగఁ దారలెల్ల నడలుచుఁ దముదామె
కళదొలంగె దాము ఖగము లౌట.

169


చ.

కమలములెల్ల నిక్క నుడుకాంతుని సత్కళలెల్ల స్రుక్క కో
కములకు గర్వమెక్క గృహకార్యుల నిద్రలు వెన్కజిక్క దుః
ఖమున జకోరదంపతులు గళ్వలమందుచుఁ జొక్క దిక్కులన్
విమలత జిక్కి తూరుపున వేగురుజుక్క జనించె బొక్కమై.

170


గీ.

తమిని బద్మిని నిదురించి తమ్ములమున
గొనిన బుక్కిటిమృగనాభిగుళికలెల్ల
వేఁకువను లేచి యుమిసినవిధము తేఁటి
గములు నీరేజముకుళాంతరములు వెడలె.

171

సీ.

కనుల నిందిందిరకజ్జలంబును దీర్చి
పైపరాగము పచ్చిపస పలంది
కుసుమమరందమ్ము ఘసృణాంకము ఘటించి
రహిపత్రికాలంకరణ మొనర్చి
శృంగారకర్ణికాభంగసద్భూషియై
భాసురహంసికాప్రాప్తిఁ దనరి
విమలోర్మికాకంకణములను ధరియించి
డంబుగా నుదయరాగంబు దాల్చి


గీ.

మిసిమితరఁగల పయ్యంటముసుఁగు దాల్చి
మురిపె మొక్కింత మోమున నొఱపు నెఱప
మొదలఁ బద్మిని దనమిత్రు నెదురుగొనియె
నేటిపద్మినిజాతి కీరీతి గాదె.

172


ఉ.

ప్రాకటమోదనాదముల పక్షిరవంబు జెలంగునంతలో
వేఁకువబోఁటి ప్రాక్శిఖరి వేడ్క మెలంగుచు దోహదక్రియం
గైకొన గోఁగుబువ్వు గొలుకం బలుకు న్రచియించెనో యనం
గోకతతు ల్జెలంగ తొలిగొండ నినుం డుదయించెఁ దీప్తుఁడై.

173


క.

ఆయవసరమున శశిరే
ఖాయతలోచనను జేటికాంగనలు నొగిం
బాయక మెలఁగి రటన్నను
శ్రీయుతుఁడౌ ఫైలు నవలఁ జెప్పు మనుటయున్.

174

ఆశ్వాసాంతము

సోష్ఠ్యనిరోష్ఠ్యము

చ.

పురపరిపంథమౌళిభృతపూతపదాపగభక్తమాన్యపా
మరపరిపాలభూరమణమానవరూపతపస్థపూజ్యపా
మరమదమర్షబాలవిధుఫాలపరాత్ప పుష్టివాసవా
పరమతభేదభూరిభయదారవిరామరమేశ మాధవా.

175

మాలిని.

విమలకమలనేత్రా వీరదైతేయజైత్రా!
సుమశరసమగాత్రా! సూరిహృత్పద్మమిత్రా!
భ్రమితవిషమనేత్రా! పద్మజాతాకళత్రా!
దమితవిషమగోత్రా! తాపసస్తోత్రపాత్రా!

176


మ.

ఇది శ్రీవాసగురుప్రమోదివృషశైలేశప్రభావాత్తసం
పదుదారస్ఫుటభాషనార్యసుతదీప్యద్రాఘవార్యానుజా
భ్యుదయప్రాభవబంధనాటకకృతిప్రోద్యన్నృసింహార్యధీ
వదతాలాంకసునందినీపరిణయాశ్వాసతృతీయం బిలన్.

177

గద్య
ఇది శ్రీమచ్ఛేషధరాధరసౌధవీథీవిహరణ వేంకటరమణ
చక్షుర్విలక్షణాక్షీణకృపాకటాక్షవీక్షణాపరిలబ్ధలక్ష్య
లక్షణానవద్య విద్యావిలాస శ్రీనివాస గురు
చరణస్మరణాభ్యసనరసనావికాస నిస్తుల్య
కల్యాణసాకల్య మౌద్గల్యగోత్రపవిత్ర
భావనాచార్యపుత్ర పర్వత్రయకైం
కర్యవిధాన వేంకటనృసింహార్యా
భిధాన ప్రణీతంబైన తాలాంక
నందినీపరిణయం బను
మహాప్రబంధంబునందు
తృతీయాశ్వాసము.

178
  1. కోనలీడెదు కానబోక కేకి - మూ