తాలాంకనందినీపరిణయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాలాంకనందినీపరిణయము

ద్వితీయాశ్వాసము

కం.

శ్రీమహిళామలహృత్పుట
ధామా! ధామనిధిధామ! దళితారిజన
స్తోమా! దోర్దండబల
స్థేమా! శేషాద్రిధామ! దేవలలామా!

1


కం.

జయ జగదీశ్వర జనమే
జయజనపతి యడుగఁ బైలజటి బల్కెఁ దదా
శయ మెఱిఁగి మృదువచస్సం
చయమృదుమధురసుధ లధికఝరులై బొరలన్.

2


శా.

కుంతీసూనుల నిట్లరణ్యమునకుం గ్రోధాత్ముఁడై బంపి ని
శ్చింతం జెంది సుయోధనుం డతులితశ్రీగర్వదుర్వార వి
భ్రాంతాపస్మృతి మిన్ను మన్ను వివరింపన్ లేక నుద్యన్మదా
క్రాంతుండై కురురాజ్యసంపదల నేకచ్ఛత్రుఁడై యేలఁగన్.

3


చం.

శమనతనూజుఁ డిట్లనుప సాధ్వి సుభద్ర సుతోదయప్రమో
దము విడి మేఘనాదముదితంబగు గేకి ధనుర్ధ్వనిం భయ
భ్రమవడి బాఱినట్లరిగెఁ బట్టిని దోడ్కొని బుట్టినింటికిన్
రమణవియోగసాగరతరంగవిభంగనిజాంతరంగయై.

4


కం.

ఈరీతి వెతల సౌనా
సీరసతీమణి కుమారశేఖరుతో నా
ద్వారవతి కరుఁగుదెంచిన
సీరియు శౌరియుఁ బ్రియంపుఁ జెల్లెలఁ గనియున్.

5

ఉ.

కొమ్మరొ! దీనికి న్వెతలఁ గుందఁగ నేటికి బాండవుల్ త్రిలో
కమ్ములఁ బూజ్యు లట్లగుటఁ గౌరవకృత్సమయత్రయోదశా
బ్దమ్ములు శీఘ్రతం గడపి దజ్జయలక్ష్మి వరించి వత్తు రో
యమ్మ సుభద్ర నీహృదయమందున నమ్మగదమ్మ సమ్మతిన్.

6


మ.

అదిగాకన్ భవదాత్మజుం డధికశూరాగ్రేసరుండై శుభా
భ్యుదయస్ఫూర్తి రహించఁగా గలఁడు వేరొం డేమియున్ లేక నీ
పదమూఁడేడు లిట న్వసింప నటపై బాలుం డఖండప్రభా
స్పదుఁడై పాండుకులప్రదీపకుం డగున్ శాతోదరీ! సోదరీ!

7


కం.

అని తరలనయన నీగతి
ననితరలాలన మృదూక్తు లాడిన సతియం
తన దనయనుమతితోడం
దనతనయుఁడుఁ దాను సమ్మదమ్మున నిలిచెన్.

8


ఉ.

తల్లియు నౌ యశోదయు మొదల్గల యాదవభామినుల్ మనం
బుల్లసిలం గవుంగిళుల నొత్తుచుఁ జెక్కున జెక్కుఁ జేర్చి-మా
తల్లి సుభద్ర! నీమది వెత ల్గననేటికి నాడు తోడులం
దెల్ల విధంబుల న్నెనరు లింతుల కొక్కటి గావె జూడ సం
పుల్ల సరోజనేత్రి యని బుజ్జగిలం బలుకం బ్రమోదియై.

9


కం.

అన్నలు వదినెలు నీగతి
నున్నతి దను గారవింప నొక పాటిగ, దా
నన్నరు మీది [1]మరు ల్మదిఁ
గొన్నిదినంబులకు మరుపుఁ గొనినటు లుండెన్.

10


కం.

ఇభనిభశుభగమన రమా
విభుని సమాదరణవలన వెతనుడిగి మహా

విభవ భవభూతిఁ దనరఁగ
నభిమన్యుఁడు పూటపూట కభివృద్ధిఁ గనెన్.

11


మ.

పులిగోరుం బతకంబుఁ గంఠమున సొంపున్ గుల్క ఫాలంబునన్
నెలరా ల్బచ్చలరావిరేక కటిపై నిద్దంపు బంగారుకెం
పుల మొల్ నూల్ రవగుల్కు టందియలు నింపుల్మీర పాదంబులం
దులకింపున్వడి తప్పట ల్నడచు దాదు ల్కేలు లందీయఁగన్.

12


మ.

మెలతల్ రుక్మిణి సత్యభామ మొదలౌ మేనత్తలుం దాము - క
న్నులు చేమోడ్చుక చక్కనయ్య యితఁడేనో వచ్చె మాయప్పడం
చెలిమిన్ జెల్వగు నంగున న్నడచి పైకేతెంచఁగా - సంబరం
బులచే నక్కున జేర్చి నవ్వుదురు సొంపుం బెంపు వాటిల్లఁగన్.

13


కం.

ఈలీల బాల జాబిలి
పోలిక దినదినము వృద్ధిఁ బొందెటి తఱిలోఁ
గేలంది పుచ్చుకొను గతి
పాలించిన చెఱకుపండు బండినకరణిన్.

14


మ.

అలరుల్ బుట్టుచునే సుగంధజనకం బైనట్లు- బాలుండు కో
మలలీలం బచరించు నంతటనె రమ్యం బొప్ప నయ్యింటనే
గలిగెం భాగ్య మటంచు లోకులు సమగ్రప్రీతి భాషింపఁగా
బలభద్రాంగనయైన రేవతికి గర్భం బేర్పడెన్ రమ్యమై.

15


సీ.

తరుణతాగర్వసాగరమందరాగంబు
     మంజుమధ్యమ నిధానాంజనంబుఁ
దతకపోలస్వర్ణదలపారదం బభి
     లాషలతాలవాలస్థలంబు
సౌగంధ్యమృత్తికాశకలయాచ్ఞాంకురం
     బలసదావన్య మంత్రౌషధంబు

సకలభూషణతిరస్కారవిజ్ఞానంబు
     ఘనమాంద్యసంధానకరణితరువు


తే.గీ.

దీవ్రనిశ్వాసభవనశంకుప్రతిష్ఠ
ప్రబలనిద్రాగతాంకురార్పణమహోత్స
వం బగుచు నంతకంతఁ బ్రలంబవైరి
యువిద కేర్చడె నపుడు గర్భోదయంబు.

16


మ.

తరణీమధ్యమృగేంద్రడింభము వయోదంతావళంబున్ మహో
ద్దురత న్మెక్కి తదీయగర్భగరిమం దోచంగ దచ్ఛేషమౌ
కరముల్ కుంభములట్ల కప్పు దనరంగా గుబ్బచందోయి యా
రురహి న్మించెను బంకజాననకు [2]నారు ల్జూచి మోదింపఁగన్.

17


చం.

బిగిగల చన్గవల్ సడలి బిట్టువ జారఁగఁ బేదకౌను పె
ల్లుగ నభివృద్ధి గాంచ వళులు న్దళుకు ల్వడి మాయనింపు పెం
పుఁ గని బయల్పడం దలముబోవిడి మక్కులుఁ జార నారుసో
యగమున మించె నౌకలిమిహాధర లేమియు లేమి కల్మియౌ.

18


మ.

చెలిచెక్కుల్ తెలుపెక్కెఁ, జిట్టెములు చేజేతం బ్రవేశించె, చ
న్నుల ముక్కుల్ నలుపయ్యె, పెం పెసఁగె కౌను న్లేనడల్మాంద్యమై
యలరెం గోరిక లెక్కువయ్యె, నునునూగా రంతకు న్నిక్కెఁ, గ
న్ను లనిద్రాగతి జెందెఁ బోటికిని జెన్నున్ మీర నానాఁటికిన్.

19


చం.

గరితకుచంబు లెంతొ గమకంబని గాచుకయున్నగౌను న
త్తఱి కడకొత్తఁ దత్కపటతన్ తనలేమిడివీడి సత్వము
న్నెరపిన మధ్యమంబుఁ గని నెవ్వగచేఁ దము దామె మెత్తనై
బరఁగెను జన్గవల్ కఠినభావుల కిట్టివెకా స్వభావముల్.

20


తే.గీ.

మంచిదని మధ్యమము నాశ్రయించియున్న
వళుల విడనాడెఁ దాను సత్వమును బలసి

గలిమిగలనాఁడు మిత్రులకడకు ద్రోయు
టహహ! కౌనుదె గాక సాహసము జగతి.

21


సీ.

స్వర్ణభూధరశృంగసంగతాభ్రము లట్ల
        లలిచూచుకములు నైల్యము వహించె
సితకైరవభ్రమాగతశశిద్యుతు లట్ల
        విమలాక్షిమోము వెల్వెలఁగఁ బారె
జఠరాంతగతశిశుచ్చాయ పెంపగురీతి
        రమణినెన్నడుము గౌరవము దాల్చె
యౌవనరాజ్యజయస్తంభగరిమచే
        కాలికచ్ఛవిని నూఁగారుఁ దనరె


తే.

మట్టిరుచిఁబుట్టి చిట్టెముల్ బెట్టు లగుచు
నుట్లచట్టిని బాల్తోడు బెట్టినట్టు
పొట్ట బిగబట్టి యిట్టట్టు చిట్టికుట్టు
లుట్టు పొలఁతికి ప్రసవ ముద్యుక్తమయ్యె.

22


క.

అల నిండుచందురుని వె
న్నెల నిండిన బగిది కమలనేత్రికి మైవ
న్నె లలిం దేలఁగ దొమ్మిది
నెలలుం బరిపూర్ణమగుచు నిండిన పిదపన్.

23


మ.

తరణీందుప్రముఖగ్రహంబులు శుభస్థానంబులం దున్నవే
ళ రహిన్ శీతలవాతపోతములు లీలన్ వీవఁగా భవ్యసు
స్థిరమౌహూర్తికలగ్నమందున శుభాప్తిన్ క్షీరవారాశి నిం
డిర జన్మించినరీతి రేవతికి పుత్రీరత్నముం గల్గినన్.

24


క.

ఆపురుటియింటి మణిమయ
దీపమువలెఁ జెలఁగు రేవతీసుతవిలస
ద్రూపంబు గాంచి విస్మయ
లై పౌరాంగనలుఁ గౌతుకాయత్తమతిన్.

25

చ.

నెలఁతలు గోరువెచ్చకలినీటను జిల్కుచు బొడ్డుఁ గోసి చె
క్కులు సరినొత్తి దిద్ది, తలకున్ మెయికిన్ జము రంటి చేటలో
పల నవరత్నధాన్యములపైఁ దెలిపొత్తులమీద వజ్రపు
త్తలికనుబోలు రేవతిసుతం బవళింపఁగజేసి కూరిమిన్.

26


క.

ఆమదనమోహనాకృతి
గోముదనంబునకు వెఱఁగుగొని దమదమ చే
తోముదమున వీక్షింపుచు
నాముదమున వ్రేలు గుడిపి రంభోజముఖుల్.

27


చ.

చెలఁగుచుఁ జెక్కుల న్నులిమి సీత్కృతులం గిలగొట్టి లేతన
వ్వొలయఁగ జేసి మోములర యొంచుచు మాటికి ముద్దుముద్దనిన్
బలుకుచు మోవికెంజిగురుబట్టి బయల్గొని ముద్దువెట్టి చ
క్కిలిగిలగింత లిచ్చి నెరకేరఁగ జేసి హసింతు రొక్కటన్.

28


క.

ఏణాక్షులెల్ల శిశువును
మాణిక్యపుఁ దొట్టె నునిచి మధురమధుసుధల్
రాణింపఁ జోలఁబాడిరి
వాణీవీణాక్వణారవంబులు నెసఁగన్.

29


క.

జోజో! శిశుశశిబింబా
జోజో! తనువిజితజంబ సుగుణకదంబా
జోజో! తటిదుపబింబా
జోజో! రుచిరావలంబ! శుభనికురుంబా!

30


వ.

అని వచింపుచు-

31


క.

చేతోజాతప్రీతిస
మేతులునై దత్తదుచితమితదినముల న
ప్పోతోత్తమకు హితంబుగ
జాతం బొనరించి రపుడు శాస్త్రోక్తవిధిన్.

32

క.

బలకృష్ణసాత్యకీము
ఖ్యులు కౌతుకమున ననుంగుకూఁతురునకుఁ నిం
పొలయ శశిరేఖయనఁగా
కలితశ్రీదనర నామకరణం బిడియున్.

33


ఉ.

ఆశశిరేఖ నామమె యధార్థముగా నజుఁ డాననంబునన్
వ్రాసినరీతిగా దినదినంబు కళాభ్యుదయప్రపూర్ణమై
పేశలరుక్మిణీముఖరభీరువులెల్ల సుభద్రహర్షచి
త్తాశయమ ట్లెఱింగి వికచాననలై వచియించి రొక్కటన్.

34


ఉ.

కొమ్ము! సుభద్ర! నీకనుఁగుఁగోడలుఁ గల్గె గదమ్మ! మాకు మో
దమ్ము లభింప నీయభిమత మ్మొనగూడఁగఁ గుందనంపుఁగీల్
బొమ్మయు రేవతీరమణిపుత్రిక కీయభిమన్యుఁడే ప్రియుం
డిమ్మెయి ధాతఁ గూర్చుటిది యింటినిధానముగాదె కోమలీ!

35


మ.

తనుదానే జలకమ్ము లార్చి యటమీఁదం గావు బొట్టుంచి మె
ల్లన బంగారఁపుదొట్టెలో నునిచి లాలిం బాడుచో “రేవతీ
తనయా! యోయభిమన్య దృక్కుముదచంద్రస్వాననా నిద్రబొ
మ్మ"ని జో కొట్టుచు నిద్రఁ బుచ్చి మురింపెం బందుం దదైకారతిన్.

36


తే.

తల్లిచనుఁబాలు గ్రోలుటే దక్క నితర
పోషణాదికకృత్యవిశేషములును
దినదినం బాసుభద్రాసతీలలామ
తానె సవరించుఁ దనకోడలౌ నటంచు.

37


వ.

ఇట్లవ్వనజలోచన మవ్వంటు నివ్వటిల్ల బోషింపఁ బ్రతిపచ్చశిరేఖనుం
బోలి యాశశిరేఖ దినదినప్రవర్ధమానంబుగాఁ బెరుగుచున్న సమ
యంబున.

38


ఉ.

పంచాబ్దమ్ముల రేవతీతనయకుం బ్రాయంబు సంధిల్ల, భ
ర్యాంచత్సప్తశరత్సమాన్వితుఁడునై యప్పార్థసూనుండు య

త్కించిద్భేదము లేక శైశవశుభక్రీడావిహారంబుల
న్మించెం బంచశరప్రభాగరిమఁ బేర్మిం జెందె నానాటికిన్.

39


ఉ.

బొమ్మలపెండి లంచు విరిపుప్పొడిఁ దిన్నెలు బన్నియాడ మే
ల్బొమ్మయె నీకుఁ గోడలని బుత్తడి యీమొగబొమ్మ నాసుతుం
డిమ్మెయి దంపతీప్రతిమ లేర్పడఁగా మనకే సతీపతీ
త్వమ్ము లభించె నంచుఁ బ్రమదం బెనయంగ హసింతు రొండొరుల్.

40


ఉ.

లీలను బొట్టె చేడియలు లేగలపిండని తొంగియాడ నే
మేలగు కోడెదూడనని మేకొని రంకెలు వైచుచుం దమిం
బ్రేలుచు నందులోన శశిరేఖయే బల్సెలషెయ్య యంచుఁ బై
వ్రాలి యెదం బడుంగతిని బైకొను శైశవవేళ నీక్రియన్.

41


చ.

మఱియు నొకానొకప్పు డభిమన్యుఁడు నాశశిరేఖఁ జేరి క్రొ
మ్మెఱుఁగులపెన్నెఱు ల్ముడిచి మిన్నతిగా సిగవేసి తావిపూ
సరములుఁ జుట్టి బంగరుపిసారుజిలుంగుపయెంటఁ జేర్చి నీ
టరసి 'భళీరె' యంచు ముదమంది పసం దొనరించు నవ్వుచున్.

42


శా.

ఈలీలం జిఱుప్రాయఁపుం జెలులతో నిచ్ఛావిహారంబుఁగాఁ
బాలక్రీడలు సల్పుచుండఁ గని దత్పౌరాంగనల్ వేడ్క ని
బ్బాలారత్నము కీతఁ డీతనికి యీబాలామణిం దైవ మి
ల్లాలుంగాఁ దగకూర్చు టబ్బురమె యం చానందముం జెందఁగాన్.

43


ఉ.

పుత్తడిబొమ్మలో! పగడఁపు న్నునుదీవెలొ! క్రొమ్మెఱుంగులోఁ
జిత్తజుఁబువ్వుఁదూఁపులొ! శశిద్యుతులో! తులితస్వరూపసం
పత్తిని గాంచినట్టి బలభద్రసుభద్రతపఃఫలంబులో
నుత్తము లీకిశోరు లని యుత్సవమొందుదు ఱెల్లచూపరుల్.

44


45 నెం. పద్యము నుండి - 85 నెం. పద్యము నాల్గవచరణము సగ భాగము వరకు తా. ప్రతి శిథిలముగా గలదు.

ఉ.

ఎల్లజనుల్ నరాత్మజున కీశశిరేఖయె పత్నియౌను మే
నల్లుఁ డితం డనందగు నదంతియెగాక సమానరూపసం
పుల్లతనూవిలాసములఁ బొందిక జెంది రటంచు ఱోళ్లరో
కళ్లను బాడుచుండ మురఘస్మరుఁ డిన్విని యూరకుండఁగన్.

45


ఉ.

లోకులవార్తలు న్విని బలుం డభిమన్యుని రూపవిభ్రమా
స్తోకవిలాససంపదలఁ జొప్పడు నీశశిరేఖకే తగుం
గాక యటంచు నెంచి తనగాదిలిచెల్లెలితో సుధాప్రవా
హాకలితోక్తులం దనదయామతి తేఁటపడంగ నిట్లనెన్.

46


క.

ఓ! విమలగుణవతీ! నీ
వేవిధములఁ దలఁచి తటులనే సమకూడెన్
దైవానుకూలమున 'య
ద్భావం తద్భవతి'యను శుభస్మృతి సరళిన్.

47


క.

కోడలికి కొడుకు కొడుకుకు
కోడలు తగినటుల రూపగుణవిభవములం
దీడుం జోడుం గలుగుట లా
డంబోయినను దీర్థమబ్బుట గాదే.

48


మ.

వనితా నీదు మనోరథంబునకు దైవప్రేరణం బౌచు నా
తనయారత్నము నీకుమారునకు యాథార్థ్యంబుగాఁ బెండ్లికూఁ
తునుగాగన్ సృజియించె నవ్విధి మనస్తోషంబు జెందం దగున్
జనవాక్యంబె ధ్రువం బటంచు ధరణిన్ శాసించవే శాస్త్రముల్.

49


వ.

అని యిట్లు సోదరిన్ మేదురాసుమోదానువాదంబుల నాదరింపుచుఁ జేతో
జాతప్రీతిం గూతుం జామాత కొసంగుతెఱం గెఱుంగుబడం బలుక
నమ్మచ్చకంటి నిచ్చ నిచ్చ న్మచ్చికలెచ్చన్ బొచ్చెంబులేక నయ్యభిమన్య
శశిరేఖ లనన్యగతిం బోషింపుచున్న సమయంబున.

50

మ.

తనుజీవంబులభాతిఁ బువ్వులను నెత్తావుల్ బలెం బాలునీ
ళ్ళనుబోలెన్ వరచంద్రచంద్రికలలీలన్ శబ్దశబ్దార్థరీ
తిని భాస్వత్కులశీలసంగతిని బ్రీతిం జంటగానంటి య
ర్జునసంకర్షణపుత్రపుత్రికలు కోర్కుల్ మీఱఁ గ్రీడింపఁగన్.

51


ఉ.

అంతకుఁ గొన్నినా ళ్ళరుఁగ నాయభిమన్యుఁడు తోడిబాలకుల్
చెంతలఁ గొల్చి రాగ గురుశిక్ష వహించి సమస్తవిద్య లా
ద్యంతము నభ్యసింపఁగ నహర్నిశలు న్మతిభీతిప్రీతిచే
చింతలచే దొణంగె నయశీలుఁడు సభ్యజనానుకూలుఁడై.

52


సీ.

సామాదినిగమప్రసంగము ల్బఠియించెఁ
        దద్రహస్యంబు లాస్థత లభించె
లక్ష్యలక్షణము లెల్లను వే నధికరించె
        విమలషడంగముల్ వెస గ్రహించె
బాణినీయన్యాయభాష్యాదులను నేర్చె
        తాత్వికవ్యాసమతంబు దెలిసె
సాంఖ్యమనస్కాదిసాధనంబు లెఱింగె
        నఖిలపురాణార్థ మాకళించె


తే.

నిఖిలనృపదండనీతుల నేర్పు లరసె
సభ్యనుతమగు వైద్యంబు నభ్యసించె
ఘనధనుర్వేద మఖిల మొక్కటనె జదివె
ధన్యుఁ డభిమన్యుఁ డార్యసన్మాన్యుఁ డగుచు.

53


ఉ.

చారుతరార్థబోధనల శయ్యలరీతుల శబ్దవృత్త్యలం
కారములన్ రసస్ఫురణకల్పనలన్ మృదునర్మగర్భగం
భీరతరధ్వనిస్ఫురణభేదములం గుణదోషసూక్ష్మవి
స్తారములం గ్రహించి కవితల్ రచియించఁగ నేర్చె నేర్పునన్.

54


క.

అష్టాదశవిద్యలు గురు
నిష్టము శుశ్రూషఁజేసి హితమతికృతి వి

స్పష్టముగ మది గ్రహించి వి
శిష్టం బుపపాదనంబు సేయును మగుడన్.

55


క.

కరితురగరథారూఢచ
తురతన్ వివిధాస్త్రశస్త్రతూణీరధను
ర్ధరణశర ముష్టిపుష్టుల్
గుఱుతెఱిఁగె నతండు బదునొకొండవయేటన్.

56


శా.

రాణింపన్ నవశైశవాభ్యుదయసంరంభంబునందే మహా
నాణెంబై దగు గుజ్జు విల్కుఱచబాణాల్ పొట్టికోలల్ మహా
బాణి న్నెట్టనబట్టి చెట్టుగుఱులుం చాటింపుచున్ లోకసం
త్రాణుండై దనమేనమామవలె నుద్యచ్ఛూరుఁడై భాసిలెన్.

57


క.

అకలంకగతిని కురుబా
లకుఁడు చతుష్షష్టివిద్యలను నేరిచి దా
నొకటఁగన కొఱతలేకన్
సకలమణుల్ గలుగు జలధిసరణిం దనరెన్.

58


మ.

సుమిళిందాయితకాకపక్షములతో సోమాభసంస్మేరపూ
ర్ణముఖాంభోజముతో దయామృతరసభ్రాజద్దృశాపాంగసం
భ్రమగండద్వయితో మృణాళనిభశుంభద్బాహుయుగ్మంబుతో
రమణీయంబుగ సంచరించఁ గని దూరం బయ్యె బాల్యం బొగిన్.

59


ఉ.

శ్రీయుతమూర్తియైన నృపసింహునకుం జనియించె యౌవన
ప్రాయము హిండమానపటుబాహుపరాక్రమమేరుశేఖర
ప్రాయము శాత్రవీనిటలభాసురకుంకుమతోయమున్ సదా
శ్రేయము కౌరవప్రకరజిహ్మగసంచయవైనతేయమున్.

60


సీ.

శ్రీకరశృంగారచేష్టాపయోరాశి
        యతనుసంకేతవిహారవనము

సకలాంగపటిమప్రశస్తసంజీవని
        తతముదాలోకనాదర్శనంబు
భావగర్భప్రౌఢభాషణజనకంబు
        కోపహుంకారఘంటాపథంబు
సాహసనిపుణతాసంగ్రామరంగంబు
        భాసురసౌందర్యపణ్యవీథి


తే.

లోకనామాత్రకాముకోద్రేకలోక
లోకనాచంచరీకనాళీకవనము
ఘనముగాగను జెందె జవ్వనము నతని
దినము దినమును జనము నెమ్మనము లలర.

61


సీ.

కెమ్మోవితేనెకై గ్రమ్మిన చిన్ని చీ
        మలలీల నునుమీసములు జనించె
లలిచెక్కు లఱచందురుల గప్పు కప్పు నా
        గమకమై బవిరిగడ్డము దనర్చె
దొలినుండి దన్ను నెంతో గొప్పగను బాల్య
        ముడిగిన గౌనువెంబడె కృశించెఁ
దనురుచిత్రివిభక్తమైనగైవడి నవ
        యవస్ఫురణ వేఱవుచు బలిసె


తే.

గామినీచిత్తశాణచక్రప్రకషణ
జాతశాతశరవ్రాతరీతిఁ దనరె
మంగళాభంగవిలసదపాంగగరిమ
రాజసుతునకు యౌవనారంభవేళ.

62


క.

కుందనమునకుం బరిమళ
మొందినగ్రియఁ జుంటితేనె కొకతఱితేటం
జెందినటుల సంక్రందన
నందననందనుని జవ్వనము భాసిల్లెన్.

63

చ.

కనుఁగొన జంద్రవంశజుఁడు గావున దద్విధుబింబలీల యా
ననమున దత్కళంకరుచి నల్లనిమీసములన్ సుధారసం
బును మృదువాక్కులం, దరుణపుంజిగివాతెఱ, నిండువెన్నెలల్
దనచిఱునవ్వునం బొలయఁ దా జెలువొందె మనోహరాకృతిన్.

64


తే.

సరసునకు నిండుపర్వంబు జవ్వనంబు
జెన్నుమీఱంగ నెఱికౌను సన్నమయ్యె
సూనశరబాణసంపీడ్యమానలైన
చేడియలదృష్టి దాకి కృశించె ననఁగ.

65


సీ.

కొనసాగుశశిరేఖకోర్కె లీగతియన్న
        వడువున బాహువుల్ నిడుదలయ్యె
సతియౌవనోద్భవస్థితిఁ దెల్పఁ జనులీల
        నెగుభుజంబులు చెవుల్దగుల నుబికె
బలభద్రసుత నిందుఁ బవళింప సమకూర్చు
        బలిమికైవడి ఱొమ్ముపటిమ దనరె
విరహాగ్నిశిఖ లిక వెడలు నిట్లనురీతిఁ
        గన్నుల నరుణరేఖలు జనించె


తే.

భావితనుజెందు మోహాబ్ధిపగిదిఁ దోప
చతురవాక్కుల నతిగభీరతఁ దనర్చెఁ
దనను వలచిన రేవతీతరుణి తనయ
నెమ్మనముబోలె నతనిబాల్యమ్ము గడఁగె.

66


ఉ.

గోరునగీరునాము మొకకొంచెముగానిడి పచ్చికస్తురిం
దీరుచు పెన్నెఱు వ్వెనుక దిద్దుచు జారుసిగం ఘటించు వ
య్యారము గాఁగ దానిజిలుఁగంచులమేలురుమాలు జుట్టి జా
ళ్వారుచి దుప్పటంబువలె వాటొనరించు నటించు నీటునన్.

67


ఉ.

ఆనెఱప్రాయ మాసొగసు లాతొడ లానడ లాపిఱుందు లా
కౌనురువార మాకలికికన్నులసోయగ మామెఱుంగుమే

నానుచుచెక్కు లాసొబఁగు లాతల పావల పావయారమే
మానవతుల్ గనుంగొనిన మక్కువ నెక్కొననోడి బోవరే.

68


సీ.

ప్రౌఢతరోక్తులు భాషింపఁగా నేర్చి
        మునుబల్కు ముగ్ధభాషణము లుడిగె
శయ్యాచమత్కృతుల్ జదివి పాడఁగ నేర్చి
        ఘనవేదశాస్త్రముల్ గట్టి పెట్టె
సోగకన్నుల వారజూపు జూడఁగనేర్చి
        సతుల నేమరిజూచు జాడ విడిచె
సరసులౌ జాణలసాంగత్యముల నేర్చి
        పసిబాలురతో నాటపాట మరచె


తే.

దినము దినమొక నీటుగా దిద్దనేర్చి
దాదులు నలంక్రియల్ సేయు తలఁపు మానె
పలుకులో శ్లేష లిమిడించి పలుక నేర్చి
జనులసహజానులాపముల్ వినఁగ దొలఁగె.

69


క.

శివునిం బగఁగొని తా, నవ
యవముల గోల్పోక సురుచిరాంగంబులు గ
ల్గ విహారం బొనరించెడి
నవమన్మథువలెనె జవ్వనము నిండి దగెన్.

70


సీ.

కంఠీరవము నొక్కకౌనుచేతనె గాదు
        ఘనపరాక్రమసమగ్రత జయించెఁ
బద్మారి నొకముఖభ్రమచేతనే గాదు
        తతయశశ్చంద్రికోద్ధతి నడంచెఁ
గలభంబు నొకభుజాబలరూఢినే గాదు
        గంభీరగమనసంగతి నడంచె
జలదంబు నొకదానశౌండీర్యతనె గాదు
        నిగనిగన్నిగల పెన్నెఱుల గెలిచె

తే.

నాభుజాసార మాతోర మావయార
మాశుభాకార మాధీర మానిగార
మామహోదార మాచార మావిహార
మాగభీరవిచారంబు లౌర దెలియ.

71


క.

ఆలోపల శశిరేఖా
నాళికాననకు దినదినం బొకచాయన్
బాలుం బొంగినకైవడి
బోలిచె తారుణ్య మపు డపూర్వరుచిరమై.

72


సీ.

పెదవిరాగమె బెంచి పెఱమాట లనసాగెఁ
        గౌటిల్యగతిఁ బూనె కచభరంబుఁ
గన్నులు సిరులెక్కె గడకంటనే జూచె
        మో మప్పటికె బొమముడి వదల్చెఁ
గుచగర్వమున నెట్టుకొని వచ్చె వక్షంబు
        నంతకంతకు జాడ్యమయ్యె నడితి
మలినమోర్వని సౌకుమార్యంబుఁ గనె మేను
        కడురిత్త దశ జూపెఁ గౌనుదీఁగె


తే.

నాభిమాత్రమె గంభీరతాభిరతిని
బొలిచె నన్నిట మత్ప్రియంబును దొలంగె
నహహ! యిట నుండుటిక ననర్హం బటంచు
వదలి చనుమాడ్కి సతిశైశవంబు దొలఁగె.

73


ఉ.

ఆయబలామణీతనుగృహంబున గాపురమున్న శైశవ
ప్రాయము నమ్మరుండు చలపాదితనంబున నిల్లువెళ్ళఁగాఁ
ద్రోయఁదలంచి తోడుతనె దొంతులకుండ లురంపువాకిటన్
వ్రేయుగతిం గుచంబులు నవీనరుచిం జనియించెఁ బోఁటికిన్.

74


మ.

సమముం బొంకము సోయగంబుబిగియున్ సౌందర్యమున్ వట్రువన్
గొమరుం బింకము లావరి న్నునుపుటెక్కు న్మిక్కుటంబు న్బెడం

గు మెఱుంగుం బొడసిబ్బెపు న్సొగసుజగ్గ న్నిగ్గుచొక్కాట మం
దములుం గల్గు చనుంగవల్ నెగడ నంతంతన్ వయస్సంపదన్.

75


మ.

మరునిం గెల్వ చను ల్గిరీశ్వరుని బ్రేమం గొల్చి బ్రార్థించి ద
ద్గరిమం జెంద సహింపకన్ విషధరాకారంబు నూగారు దా
బరఁగ న్వేనలి నీలకంఠరుచి నొప్పెన్ గౌను పంచాస్యవై
ఖరిజెంద న్నగుమోము సోముఁ డన సంకాశించె నబ్బోటికిన్.

76


క.

భూమిని యౌవనమహిమ ని
కేమని వర్ణించి నిర్ణయించఁదరం బా
సోముని బదియేడవకళ
కాముని యారపశరంబు గతి రంజిల్లెన్.

77


ఉ.

బాలిక కాపితామహుఁడు ఫాలతలం బొకవొంటు బెట్టియున్
మేలగు కర్ణయుగ్మ మెలమి న్నవకంబుల వ్రాసి భ్రూయుగం
బోలి గనంబడం బదునొకం డిట ముప్పదిగా గుణింపఁగా
నాలలిమోము నిండునెలయామిని వర్ణణ సేయు టబ్రమే.

78


చ.

మనసిజుఁ డన్ బురోహితుఁడు మానినియౌవన మన్ సుతుండు సం
జననము గాగ బాల్యమను జాతకకృత్యము దీర్ప స్వస్తివా
చనమునకై సువర్ణకలశద్వయి కుంకుమబూసినిల్పిన
ట్లనె కుచకుంభయుగ్మము జెలంగె జిలుంగుపయంటమాటునన్.

79


చ.

గురుకుధరాభమైన కుచకుంభయుగంబులభార మోపకం
బిఱుదులు నున్నదిన్నియల నిల్చునొ నిల్వదొ కౌనటంచు నా
సరసిజసంభవుండు మది సంశయముం దలపోసి తా నభం
గురగతి యుక్కునారసముగూర్చినకైవడి యారు శోభిలెన్.

80


ఉ.

మారుఁ డనేటికర్షకుఁడు మానిని బ్రాయఁపుఁ బువ్వుఁదోట శృం
గారరసంబు నింప వలిగబ్బిచనుంగవకోడెలెంక నే

మో రచియించి యారనెడి మోకును జేకొని మోటఁడ్రోలు కా
సారమనంగ నొప్పె చెలి చక్కనినాభి గభీరతాగతిన్.

81


క.

వలిగుబ్బ లధికమో పిఱుఁ
దుల బరువధికంబొ దీని తుల జూతు నటం
చలరు విలుకాఁడు పిడికిట
బలుపట్టిన పట్టనంగ భాసిలె నడుమున్.

82


క.

ఆనాతికనులు చారల
చేనైనం గొలువవచ్చు సిబ్బెఁపుఁ గుబ్బల్
వేనలిమి గ్రుచ్చవచ్చును
గౌనున్నదొ లేదొ తెలియఁగారాదు గదా!

83


సీ.

తనసిరుల్ మిన్నందుకొనియున్న కౌదీఁగె
        చేముష్టిమాత్రములో నణంగెఁ
దగనహీనవిభూతిఁ దనరు వేణీభరం
        బున కొకనైల్యమే బొరయుచుండె
దఱుఁగని కొండంత సిరిగల జన్గవ
        కేకాల ముపవాసమే ఘటించె
దినదిన శ్రీసమృద్ధిని జెందు వీనులు
        బోలింప నవతకే పాలు పడియెఁ


తే.

గలితదరహాససంపదాకరములైన
చారుదృష్టికి శుద్ధచంచలతఁ గలిగె
సతతరుచి నాతికాభోగజంఘలకును
నాఁటికిని నేఁటికిని దొక్కులాటలయ్యె.

87


ఉ.

చిన్ననిమోమునం గనులుఁ జేరల కించుక నెక్కుడు న్నెఱా
సన్నపుమోవియం దమృతసారఘటం బతిసూక్ష్మమధ్యభా
గోన్నతసీమయందు కుచయుగ్మముఁ గొండలలీల భారమం
చెన్నక నవ్విరించి సృజియించిన సృష్టికిఁ జిత్రమయ్యెడిన్.

88

సీ.

నవలాకుచములకే నవలాకుచము లీడు
        కురులు బంభరముల కురులుఁబోలు,
బింబంబుతోఁ బ్రతిబింబంబు గెమ్మోవి
        ఘనసార ఘనసార మెనయుఁ గీర్తి
ముఖ మిందుబింబాభిముఖమై ప్రదీపించు
        వళు లబ్ధివీచికావళుల నేలు
పరవంపుఁ బసిఁడిపెం పరవంపు మైఁదీఁగె
        కరము లంబుజశుభంకరము లయ్యెఁ


తే.

గౌను మిన్నతినెన్నజోకౌను మిన్ను
నగ్గళము శంఖసంపద కగ్గలంబుఁ
దమ్ములనునేలు పదము లద్దమ్ము లగుచు
నెంచవేయేల వేయాలకించఁ దగదె.

86


సీ.

దినదినం బధికమౌ చనుగొండలను మ్రోయ
        నోపలేకను దాగియున్నదేమొ!
తను నొత్తుకొనివచ్చు తతనితంబభరంబు
        పొందికగని భయం బందేనేమొ!
నాతి నీవీబంధనము బిగింపున కోర్వఁ
        జాలక భీతిచే జరిగెనేమొ!
ధూమకేతుచ్ఛాయ రోమరాజిని జూచి
        కాలాహియని భీతిగలిగెనేమొ!


తే.

మాటిమాటికి కీల్జడపాటు వ్రేటు
లోరువఁగలేక దానిగంభీరనాభి
కూపమునదూకేనో గాకఁ గొంచెమైన
గానరాకున్నదది యేమొ కౌనుదీఁగె.

87


సీ.

కం'ధరం' బెదిరించి కచభరంబున కోడె
        దెసఁజెడి తనుదానె దిశలు బ్రాకె
రహి కిం'శుకము' పాణి రక్తి గైకొననోడి
        యందందఁ బురివిచ్చి క్రిందఁ గూలె

ల'హరు' లాత్రివళితో సహజంబుగా నోడి
        ప్రతికూల మెనయుచు భంగపడియె
సా'రసం'భావనచ్చాయ నోపక నోడి
        పగలుపెంపున పంకభరిత మయ్యె


తే.

మొదలు వర్ణచ్యుతిని బొంది తుది నురోజ
వాక్య,మధ్యమ,హాస,సంపద లభించె
'నన్యథా చింతితం కార్య' మన్నచోట
'దైవ మన్యత్ర చింతయే' 'త్సరణి గాఁగ.

88


చ.

సకలసుమాళివాసనల సంభ్రమతం గొను బంభరంబు నే
నకట సువర్ణజాతినగు నస్మదుపేక్ష యొనర్చె నంచుఁ బా
యక వనిలోన గంధఫలి హాళి తపం బొనరించి యింతి నా
సికగతి బుట్టఁగా నళులుఁ జేరిన కై వడి యొప్పె నేత్రముల్.

89


సీ.

చారుపద్మసమృద్ధి చరణద్వయంబందు
        పటుకచ్చపచ్ఛాయ ప్రపదములను
మకరసంపత్తి కోమలజంఘికలయందు
        మంగళవరరూప మంగగరిమ
శంఖవిస్ఫూర్తి భాస్వత్కంధరంబందు
        వరరదంబుల కుందవైభవంబు
ప్రకటమహాపద్మభాగ్య మాననమందు
        నీలభాస్వరత వేణీభరమున


తే.

తళుకుటారు ముకుందనందనవిభూతి
నిలిపి యజుఁ డెట్లు సవినయవిధులఁ గూర్చు
లెక్క దెలియఁగ మో మిరుప్రక్కలందు
వ్రాయుగతి వీను లమరు నవ్వనజముఖికి.

90

తే.

మమ్ము కలువలచెలి తుంగమడుగు ద్రొక్కి
కాలరాచెడి వెతఁ బడజాల మనుచు
జలజములు రాహువేణియౌ సతిని శరణ
మనుచు బొందినగతి చిన్నియడుగు లమరె.

91


క.

చెలి యొడికట్టు బిగించిన
బలిమికి నోరువక కృష్ణఫణి నాభిగుహన్
వెలువడుచు కుచగిరీంద్రం
బుల డాగం జనెడురీతి బొలిచె న్నారున్.

92


సీ.

తోయజగంధి ముద్దులపల్కులే కావు
        కచభరంబున గెల్చు కప్పురాలఁ
బ్రబలతనూసౌరభంబుననే గాదు
        సతికంఠమున గెల్చు సంకుమదము
నవ్యకాంతిస్ఫురన్నఖదీప్తినే గాదు
        గమనవైఖరి గెల్చు కలభములను
పాలిండ్లనే గాదు పాటలాధరముచే
        గెలువఁగా జాలుఁ బ్రాఁగెంపుబంతి


తే.

మృదుపదంబులనేగాదు ముదిత పిఱుఁదు
పటిమనెత్తమ్ములను గెల్చు పద్మభవుఁడు
చిత్రగతి నేర్పుదనర సృజించెనేమొ
దాని కెనమైన చానఁ జగాన గాన.

93


సీ.

ముఖ మసాధారణమ్ముగ వంచనము సేయ
        సారసం బెనసె హాసంబుతోడ
కన్నులు ముఖవర్ణగతి నడంచ చకోర
        కములఁ బొల్పొందె చన్గవలతోడ
కచ మధరమునయి కమలధరం బట్లు
        తగు సాటిగనె హస్తయుగముతోడ

కటిసీమ వాదించి కలగింప వసుధయే
        రహిఁ బూనె మధురాధరంబుతోడ


గీ.

భంగపడి నిల్చి మారురూపములనైన
హాసకుచయుగహస్తతలాధరములఁ
బోలెనేగాని యెడబాయజాల వయ్యె
సుదఁతియౌవన భాగ్య మెట్టిదియొ గాని.

94


క.

లికుచంబు లగ్రవర్ణము
లకుఁ జెడినకుచంబులై నెలంతకలరఁ బై
నొకనైల్య మొదవె వర్ణము
నకు జెడువారికి మొగంబు నలుపగు టరుదే.

95


చ.

చెలిముఖకాంతి నవ్విధుఁడు జేకొనగోరి కళాభిపూర్ణుఁడై
నిలిచి తదాననానిలవినీతసుగంధము తన్నులేమికిన్
గలితసదాకులత్వమున కార్ష్యత పాండిమ మొందెగాక భూ
స్థలి బలవద్విరోధములు తాము దలంచుట హాని జెందదే.

96


గీ.

భూధరమ్ములఁబోలు పయోధరములు
పటుపయోధరములఁబోలు భ్రమరకములు
భ్రమరకములనుబోలు నంబకయుగంబు
నంబకయుగంబులనుబోలు నతివ చూపు.

97


క.

ఆగగనతలముకన్న త్రి
భాగమ్ములు కౌను సూక్ష్మభావమ్మని తా
నై గణితరేఖ లజుఁ డిడె
నాగవళిత్రయము నడుము నాతికి నమరున్.

98


క.

వనితామణికిని నెఱజ
వ్వనమున బాహువులు నిడుదవాటిలి పీన

స్తనమేరుమందరావృత
కనకలతాప్రాయమై ప్రకాశము జెందెన్.

99


క.

ఘనచంద్రబింబసామ్యం
బని మోమునుజెప్ప కైశికాంగ మధరముల్
ఘన,చంద్ర, బింబ,సామ్యం
బెనసెం గద యిట్టిచిత్ర మెందును గలదే.

100


చ.

చెలివదనంబు చంద్రుఁడని జెప్పుట రాత్రి రుచించు టంతెబో
వలనుగ నీరజంబన దివంబున గాంతి వహించుటంతెబో
నలఘుతరప్రదీప్తుల నహర్నిశ మభ్యుదయంబు జెందు కో
మలిముఖ మభ్రమం చుభయమధ్యముగా వచియించు టొప్పగున్.

101


క.

కన్నియవీనులు శ్రీకా
రోన్నతిగలవౌట శ్రీల నుల్లంఘింపన్
జన్నదని నిలిచె గావున
గన్నులు తల చుట్టుఁ దిరుగఁగా జనకున్నే.

102


గీ.

భావిబాధితమన్మథబాణవర్ష
సూచకప్రాప్తధమ్మిల్లమేచకాభ్ర
జనితసుత్రామవరశరాసనములట్లు
మొలకనగుమోమునను బొమల్ దళుకుమీఱె.

103


చ.

అల శశి సైంహికేయుని మహార్తికి నోడి నభంబు వీడియున్
నెలఁతముఖస్వరూపముననే జనియింప నతండు వెండియున్
విలసితవేణికాకపటవేషగతిం గబళించ నిల్చిన
ట్లలవడె పూర్వవైర మహహా! కడఁద్రోయ వశంబె యేరికిన్.

104


చ.

కడలి జనించు చంద్రునిముఖప్రభతోడ జయించి యచ్చటం
బొడమిన ముత్తెము ల్తలను బూనె వధూమణి "లోకమందు నె

వ్వడుపున బ్రాజ్ఞులున్ సుగుణవంతుని మిక్కిలియాదరింపుచుం
జడమతులౌ కళంకులను జాలతిరస్కరణం బొనర్పరే".

105


మ.

ఘననాభీసరసిన్ మరుం డతివశృంగారంపునీరంపుతో
నునునూగారను వల్లరిం బెనుప పైనూల్కొన్నబూఁగుత్తులో
యన బర్వంపుఁజనుంగవ ల్బొడమఁగా నందొప్పు సారంబు గ్రో
ల నటన్ వ్రాలినగండుఁదుమ్మెదలలీలం జూచుకంబు ల్దగెన్.

106


ఉ.

తాను సువర్ణమంచు వనితామణి నిద్దఁపుమేనితావిఁ దాఁ
బూనదలంచి యగ్నిఁబడి పొంగి పుటంబులఁ దప్తమై లవం
బైన సుగంధసంపదల నందక పొందక యుండె నౌర మే
లీనిఖిలావనిం బరసమృద్ధులకోర్వనివారి కబ్బునే.

107


సీ.

చనుదోయి నాభిహస్తతలంబు లొకరీతిఁ
        దళుకొత్తుకోకనదములఁ గెల్వఁ
దనువుగెమ్మోవియాననలీల నొకరీతి
        చంద్రబింబచ్చాయ చౌకళింపఁ
గచభారకటివచోనిచయంబు లొకరీతిఁ
        ఘనసారరుచితిరస్కరణఁ జేయ
హసనకందరనఖవిసరంబు లొకరీతిఁ
        దారకంబులదీప్తి తారసిల్ల


గీ.

నురుచరణయానజంఘిక లొక్కరీతి
సుమకరినిభంబు లగుచు విస్ఫురణఁ దనర
దమకు దమలోన నైకమత్యంబు గలుగు
చున్నవా రెన్నటికి భంగ మొందగలరె.

108


సీ.

పొలతిపయోధరమ్ములు 'రసమంజరి'
        నయనముల్ 'కువలయానంద'మహిమ
మేచకాలకపంక్తి 'మేఘసందేశంబు'
        విమల 'చంద్రాలోకనము' ముఖంబు

దరహాస మసమ‘సిద్ధాన్తకౌముది’ లస
        త్సుధమహాగంభీర‘సూక్తి’లీల
శ్రీరుచిత్రివళి‘శృంగారతరంగిణి’
        సాకల్య ‘సుగుణరత్నాకరంబు’


గీ.

కామినులలోన నదియె శిరోమణియును
గాన యీబూచాన సకలకళానిధాన
యగుట నభిమన్యునకె జోడుదగిన దాల
తాంగి యంగజపుషితమాయాకురంగి.

109


గీ.

ధన్యు లాశశిరేఖాభిమన్యు లిట్లు
బాల్యము దొలంగి యౌవనస్థల్యు లగుటఁ
దొల్లి తమమౌగ్ధ్యభావంబులెల్లఁ దొలఁగి
రసికతానందశృంగారరసము లెసఁగ.

110


క.

అటువలె యౌవన మత్యు
త్కటమగుతఱిఁ బార్థసుతుని గాంచినచో యె
చ్చటనుండి గల్గెనో గద
కుటిలాలక కపుడు క్రొత్తక్రొత్తని సిగ్గుల్.

111


శా.

ఇన్నాళ్లన్వలె నాతఁ డిట్లెదురుఁగా నేతేఱఁగాఁ దళ్కువా
ల్గన్ను ల్వాలిచి వానిసోయగము క్రీగంటం గనుం జెంతలే
కున్నం జింతిలుఁ దల్పుచాటుఁగొని యత్యుత్సాహతం గాంచు నె
న్నెన్నో చిన్నతనాన గొన్నబను లూహించుం దదైకారతిన్.

112


వ.

ఇట్లు నిరంతరనిశాకాంతవసంతజయంతనలమహీకాంతనితాంతకాంత
సుందరతానిశాంతుండును దోర్వీర్యదూరీకృతకుమారుండును నగణ్య
లావణ్యసింధురాట్కుమారీకుమారుండును చండవేదండతుండాయమాన
బాహుదండపాండితీశౌండీర్యగాండీవికుమారుండును నైననయ్యభిమన్యునిం
గాంచి, యక్కాంత దురంతలతాంతకుంతసంతానసంతాపితస్వాంతయై
చింతిలుచు దనమనంబున.

113

ఉ.

పాయనిబ్రేమచేఁ జిఱుతప్రాయమునుండి యితండు నేపయ
స్తోమములట్ల మైత్రిఁగొన దోడనె దత్ఫలపాత్రమై వయః
ప్రాయము సంభవించె బలభద్రుఁడు పెండిలటంచు సేయునో
సేయఁడొ! శంబరారిఋణశేషవిముక్తి లభించు టెన్నఁడో.

114


సీ.

మొలకతేనియకావిమోవి యున్నఫలంబు
        కొసరి యీతని ముద్దుఁగొనఁగవలదె
గబ్బిసిబ్బెఁపుగుబ్బకవ గల్గిన ఫలంబు
        యితనిపే ఱెదగ్రుచ్చి యెత్తవలదే
మరికప్పు మెఱుఁగొప్పు నెఱిగొప్పుగల ఫలం
        బితని సందిటిలోన నిముడవలదె
కనకంబు జిగిడంబు కాయంబుగల ఫలం
        బితనిమేనున జేర్చి యలయవలదె


తే.

మిసమిసబొసంగు జవ్వనం బెసఁగుఫలము
దినము నీతనిశయ్య నిద్రించవలదె
పిన్ననాట్నుం డితనిగూడియున్న ఫలము
పంచబాణునికేళిఁ గ్రీడింపవలదె.

115


చ.

అనుచు దలంచు గుట్టు బయ లందగనీక నణంచు గబ్బిచ
న్మొనలను బుల్కరించు మఱిమోహముబెంచు చలించుఁ బ్రేమ నె
మ్మనముననుంచుఁ గోరికల మాటికి రెప్పల నప్పళించు చెం
తను నతఁడున్నవేళఁ దనుదానె హసించు భ్రమించు నెంచుచున్.

116


ఉ.

శైశవవేళనే నతఁడు జెల్వుగ బొమ్మలపెండిలంచు నెం
తోశుభలీల సల్పఁగ సతు ల్పురినెల్లడ పార్థనందనుం
డీశశిరేఖ నింక వరియించగలం డని పాటపాడి
యాశయ మింకమీఁదట యథార్థమొ దంభవృథానులాపమో?

117


ఉ.

ఆరుచిరాననాంబురుహ మాబెళుకుంగను లాగళంబుపెం
పారమణీయబాహుయుగ మాభుజసౌష్ఠవ మాపిఱిందుమే

పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/159 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/160 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/161 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/162 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/163 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/164 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/165 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/166 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/167 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/168 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/169 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/170 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/171 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/172 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/173 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/174 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/175 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/176 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/177 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/178 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/179 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/180 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/181 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/182 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/183 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/184 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/185 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/186 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/187 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/188 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/189 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/190 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/191 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/192 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/193 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/194 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/195 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/196 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/197 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/198 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/199 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/200 పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/201

  1. మరుల్గొన -మూ.
  2. పేరుల్ జూచి మోహింపఁగన్ -మూ.