తాతా చరిత్రము/వస్త్ర పరిశ్రమ : స్వదేశీ అడ్వాన్సు మిల్లులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

5. వస్త్ర పరిశ్రమ : స్వదేశీ అడ్వాన్సు మిల్లులు.

పదేండ్ల నిరంతర కృషిపైన, ఎంప్రెసు మిల్లువలన తాతాకు చాల ద్రవ్యము చేరెను; అంతట దానితో జంషెడ్జి మరొక రీతి మిల్లును పెట్టదలచెను; అప్పటి కింకను బొంబాయి మిల్లులన్నియు ముదుకునూలువే; సన్ననూలుకు, ఆయంత్రములు, ప్రత్తిగూడ, మారవలెను. ఆంగ్లదేశపు మాంచెస్టరులో వాడు కండెలు మగ్గములు సున్నితములు; అవి హెచ్చు కిమ్మతువి; మరియు తమ వాడుకలో లేని కొత్తయంత్రముల దెచ్చుటకు బొంబాయి మిల్లుదార్లు వెనుదీయుచుండిరి. కాళిదాసు కాలమునుండి హెచ్చరిక కల్గుచున్నను అన్ని విషయములందును పూర్వపద్ధతులన్న మనకు విశేషాదరము.*[1] విదేశమున సన్ననూలు వచ్చు కొత్తయంత్రముల దెప్పించి వాడుదు మని తాతా ప్రోత్సహించెను; కాని తక్కిన మిల్లుదా ర్లందుకు సిద్ధపడరైరి.

మన దేశమున సామాన్యముగ పండించు ప్రత్తిపోచ పొట్టిది; దానినుండి సన్ననూలు వచ్చుట కష్టము. తెగకుండ సాపుగ సన్ననూలు నిచ్చు ప్రత్తిరకముల పండించుట యవసరము. ఆరకములు అమెరికా ఈజిప్టులలో వాడుకలో నున్నవి. తాతా మొదట నీజిప్టువెళ్ళి, అందుండి మంచిదూదిని తెప్పించి పరీక్షించి, అంతట నచ్చటి మంచివిత్తుల దెచ్చి, అనుకూలమగు పొలములందు స్వయముగ మంచి ప్రత్తిని పండించెను. ఆదూదితో మంచి సన్ననూలు వచ్చెను; అంతట మాంచస్టరుమిల్లుకు తీసిపోని మిల్లును బొంబాయి ప్రాంతమున స్థాపించి సన్ననూలు తయారు చేయుటకు జంషెడ్జి నిశ్చయించెను.

బొంబాయినగరముకు 9 మైళ్ళ దూరమందున్న 'కుర్లా'లో ఒక పాతమిల్లు యేలముకు వచ్చెను; దాని యజమాను లప్పటికి నాలుగుసార్లు దివాలా దీసిరి. అది అచ్చిరాదని, ఇతరులు పాట వేయలేదు. తాతా దానిని 1886 లో చౌకగ కొనెను; కాని దానిముఖ్య యంత్రములు సన్ననూలు పనికి సరిపోనివి. ఆచుట్టుపట్ల తగు కార్మికులును లేరు; కాని ధీరుడగుటచే, తాతా వెనుదీయక, ఆప్రాతమరలను పనిముట్లను తీసివేసి, ప్రశస్తమగు కొత్తరకపు యంత్రముల నింగ్లండునుండి తెప్పించి, అందమర్చెను. ఈకొత్తయంత్రాలయముకు 'స్వదేశీ మిల్స్‌' అని పేరిడెను.*[2] ఈమిల్లులో 1892 సం. నుండియు 80 వ నెంబరుకు సరిపోవు సన్ననూలు తయారగుచున్నది. మొదట కొంతసొమ్ము నష్టమువచ్చినను, క్రమముగా నది యార్థికముగాను జయప్రదమై యెంప్రెసు మిల్లువలె నయ్యెను. అంతట మరికొన్ని కంపెనీల వారును దాని ననుకరించిరి. అందు కొంకొక కారణమును తోడ్పడెను.

ఇదివరలో బొంబాయిలో 20, 30, వ నెంబరుకు లోపగు ముదుకనూలే తయారగుచుండెను. (ఎంప్రెసుమిల్లుది మాత్రము నె 45 రు వరకుండెను.) ఆబట్టలను మనదేశమున బీదలే కట్టుచుండిరి. నవనాగరికత హెచ్చినకొలదిని, మనవారిలో చాలమంది సన్నబట్టలనే ధరించుచున్నారు; అవి విదేశపు వై యుండెను. అందువలన మన మిల్లుదార్లు తమ సరుకులలో చాలభాగము (ఇచట విడుదల కానందున) ఓడలపైన చీనా జపాను దేశముల కెగుమతిజేసి, ఆదేశీయులకు విక్రయించు చుండిరి. ఇట్లుకొన్నియేండ్లు జరిగెను; కాని యింతలో జపానులో పెద్ద పరివర్తనము జరిగెను.

చీనాజపానులు చాలకాలము పశ్చిమదేశములతో సంబంధము నొల్లకుండెను. 1867 లో జపానులో నీస్థితిమారి, నూతనశక మారంభించెను. జపానీయులు యూరపు అమెరికాలు ఆర్థికాభివృద్ధి జెందుచుండుట కనిపెట్టి, ఆనవనాగరికతను తామునవలంబించిరి; తమ చక్రవర్తి ప్రోత్సాహముతో, జపానీయయువకులా విదేశముల కేగి, అందుకర్మవిద్యలను యంత్ర పరిశ్రమపద్ధతులను నేర్చుకొని, జపానులో మంచిమిల్లుల నేర్పర్చిరి. అంతట జపానులోనే మంచివస్త్రములు చౌకగ తయారుకాజొచ్చెను. మనదేశమునుండి వస్త్రముల గొనుటమాని, ఆద్రవ్యమును జపానీయులు తమదేశమందే నిల్పుకొనగల్గిరి. ఆపరిశ్రమ లేర్పడుటవలన జపానీయుల యార్థికస్థితి చాల బాగుపడి, ఆజనుల సంపద వృద్ధి యాయెను. జపాను వ్యాపారులిట్లు క్రమముగా తమమిల్లులను వృద్ధిజేసి, ఇకముందు చీనాకును బట్టల నెగుమతిచేయ దొడగిరి.

అప్పటి జపాను చక్రవర్తియగు 'ముత్సోహితో' ప్రజాక్షేమముకొర కాదేశపు పరిశ్రమల యభివృద్ధికై చాలకృషిచేసెను. శీతలము గిరిమయము నగు జపానులో ప్రత్తి పండదు. ఆ ప్రభుత్వమాధునిక పద్ధతివగు మంచి నౌకల గొనియు, నిర్మించియు, తమనౌకాబలము వృద్ధిజేసెను; జపానీయ వ్యాపారనౌకలకు సాయముచేసెను. ఈనౌక లమెరికానుండియు మనదేశమునుండియు దూదిని చౌకగ తేగా, మిల్లుదా ర్లాదూదితో జపానులో బట్టల దయారుచేసుకొందురు; అట్టినౌకలను వారు చీనాకును పంపదొడగిరి. మనదేశపుమిల్లుల కట్టి ప్రభుత్వ సహాయము లేదు.†[3] జపానునౌకలవలెగాక, మనకు స్వంతమగు నౌకలు లేవు; పోటీ లేక మనసరకుల గొనిపోవు బ్రిటిషు నౌకలవారు బొంబాయివర్తకులనుండి యెగుమతికి చాల హెచ్చురేటు కేవును వసూలుచేయుచుండిరి. జపానులో, ఆవిరియంత్రములకు వలయు నేలబొగ్గు చౌకగ నామిల్లులదగ్గరనే దొరకును. బొంబాయిప్రాంతమం దట్టిగనులు లేవు. దూరపుగనులనుండి రైలుపై తెచ్చుబొగ్గుకు రైలుకంపెనీలు చాల హెచ్చురేటు బాడుగ వసూలుచేయుదు రు*[4] మరియు చీనాకు జపాను చాలదగ్గర; ఆరెండుదేశములవారు నేకజాతీయులు. జపానీయులు సులభముగ చీనాలో వసించుచు, అచటిజనులకు రుచించు రకముల వస్త్రములదెచ్చి, అందు వ్యాపింపజేయుదురు. ఇట్లు మనదేశమునుండి జపానుకుండిన యెగుమతి నిల్చిపోవుటయే గాక, జపానుతో పోటీచే, చీనాకును మన బొంబాయిబట్టల యెగుమతి క్రమముగా తగ్గు చుండెను. కొంతవరకు తూర్పుఆఫ్రికా పారసీకములందు బొంబాయిబట్టలకు చలామణి యుండెను. కాని అచటను క్రమముగ పోటీ కలుగవచ్చును. విదేశముల కొనుబడిపైననే ఆధారపడు వ్యాపారము ఎన్నడును సందిగ్ధమే. అందుల ఆధారము నేనమ్మి పరిశ్రమల వృద్ధిజేయుట భావ్యముకాదు. మనదేశీయుల కిష్టమగు సన్నబట్టలనే మన మిల్లులందు తయారుచేయుట క్షేమకరము. అందుచేత మనవ్యాపారముకు నిలుకడగల్గును. నిత్యావసరములగు బట్టలకై పరదేశాధీనత తొలగును; మన దేశీయులును బాగుపడుదురు. ఈవిషయమున జంషెడ్జి దూరదృష్టితో చరించెనని తక్కిన మిల్లుదార్లును గ్రహించిరి; తరువాత వారిలో కొందరు సన్ననూలుతీయు మిల్లులనే ఏర్పర్చిరి. ఈ'స్వదేశిమిల్సు'లో జంషెడ్జి తాతాయు ఆయన కుమాళ్ళునే ముఖ్యభాగస్వాములై, వారే ఏజెంట్లుగ దానినడుపుచుండిరి.†[5] బొంబాయి తరువాత మనదేశమున హెచ్చుమిల్లులు గుజరాతులోని అహమ్మదాబాదుపురమం దేర్పడినవి. అచటి మిల్లులకు మార్గదర్శకమగుటకు జంషెడ్జితాతా అహమ్మదాబాదులోను ప్రశస్తమగు మిల్లును పెట్టదలచెను. అందుకై, ఆపురమందలి 'అడ్వాన్సుమిల్లు' అను ప్రాచీనపద్ధతి మిల్లు నొక దానిని కొని, దానియంత్రములగూడ పూర్తిగామార్చి, మాంచస్టరుమిల్లురీతిగ జేసెను. 12 ఏండ్లు అపారకృషిచేసి తాతా యామిల్లులను, ఆపరిశ్రమను, ఉచ్చస్థితికితెచ్చి, లాభకరముగ జేసెను.

మనదేశమందలి మిల్లుల యేజెంట్లు ఆమిల్లులందు ఎంత సరుకు తయారగునో దాని అంతటి కిమ్మతుమీదను నూటి కింత యని 'కమిషను' సొమ్ము తీసుకొనుట రివాజు అయినది. ఆ సరుకులు సరిగా అమ్మకము కాకున్నను, కంపెనీ వాటాదార్లకు లాభము రాకున్నను, సరుకులు తయారైనంతనే ఆసరుకుల కిమ్మత్తుకు తగిన కమిషను ఏజెంట్లకు ముట్టును. అందుచే నా మిల్లుల నడుపు ఏజెంట్లు సరుకుల హెచ్చుగ తయారుచేయుట యే ముఖ్యముగ గమనింతురు; కాని ఆసరుకులు దేశమున విడుదలయగుటకు, అవి లాభకరముగ నుండుటకు తగుశ్రద్ధ వహింపరు. ఈపద్ధతి మిల్లుల వాటాదార్లకు జనులకు గూడ తుదకు అనర్ధకమగునని తాతా కనిపెట్టి, తాను ఏజెంటుగా నడుపు మిల్లులలో అట్టిపద్ధతిని తొలగించెను. కంపెనీకివచ్చు నికరపులాభముపైననే ఆయనకమిషనును, మితముగ, తీసుకొను చుండెను. అందువలన తాతాగారి యాజమాన్యమన్న జనులకు వాటాదార్లకుగూడ హెచ్చు నమ్మిక, గౌరవము, ఏర్పడెను. ఇట్లాయన స్వార్థపరతలేకుండ, వ్యాపారవృద్ధినే ప్రధానముగ చేసికొనెను; ఈపద్ధతిచే మొదట కొన్ని యేండ్లాయనకు నష్టము కల్గెను; కాని క్రమముగా, ఆయనమిల్లులు ప్రసిద్ధమై చాల వృద్ధియై, ఆయనకు తుద కందుండి చాల లాభమే కల్గెను.

తనమిల్లులందు తాతా యవలంబించిన యింకొక కొత్త పద్ధతి రాత్రులందును మిల్లు పని జరుపుట; తక్కిన ఫాక్టరీలవలె గాక, దూదిమిల్లుల కగ్నిస్పర్శయైనచో, అపారనష్టము కల్గును. రాత్రులందు మామూలుదీపముల నుంచుటచే, నిప్పు దూదికిని ఆ సరుకులకును తగులవచ్చును. ఈభయమున హెచ్చుపనిగల సమయములందును బొంబాయిమిల్లుదార్లు రాత్రులందు తమ యంత్రముల తెరువరైరి. ఆంగ్లదేశమందు 'ఎలక్ట్రికు' (విద్యుత్) దీపములతో రాత్రులందును మిల్లుల బనిచేయ దొడగిరి.

ఆపద్ధతిని స్వయముగ జూచి, ఈరీతిగ రాత్రులందును మిల్లులను భద్రముగ నడుపవచ్చునని మనదేశమున తాతాయే మొదట కనిపెట్టెను. అప్పటి కింకను మనదేశమున విద్యుద్దీపముల వ్యాప్తి లేకుండెను. కాని ఆసౌకర్యలాభమును ఇంగ్లండులో గమనించిన తాతా తన ఎంప్రెస్సుమిల్లులందు ముందుగా ఎలెక్ట్రికు దీపములబెట్టి, ఆమిల్లులను అవసరమైనప్పుడు రాత్రులందును నడిపి, చాల హెచ్చుసరుకుల దయారుచేసెను. తరువాత దానినిజూచి, ఇటీవల తక్కిన మిల్లుదార్లును కొంద రా పద్ధతి నవలంబించిరి.*[6]

_________
  1. * 'పురాణ మిత్యేవ నసాధు సర్వం, నచాపి సర్వం నవమిత్యవద్యం: సంత:పరీక్ష్యావ్యతరద్భజంతే, మూఢ: పరప్రత్యయ నేయ బుద్ధి:' కాళిదాసుని మాళవికాగ్ని మిత్రము; కాళిదాసు జీవించి యిప్పటికి అథమము 1500 వత్సరములై యుండును.
  2. * అప్పటికి 'స్వదేశి' ఉద్యమ మారంభించలేదు; అందువలన 'స్వదేశి' పదము కంతగా ప్రచారములేదు. కాని విదేశవస్త్రముల దిగుమతిని తగ్గించి, అట్టి సన్ననివస్త్రములనే స్వదేశీయములను జనుల కందించుట కామిల్లు నుద్దేశించినందున, తాతా దీనికట్లు పేరిడెను.
  3. † మనదేశపు సన్ననూలుపై నిచ్చటనే పన్నుగూడ విధింపబడెను.
  4. * తరువాత తాతా మొదలిడిన జలవిద్యుచ్ఛక్తి యుత్పత్తిచే బొంబాయికి చౌకయగు చోదకశక్తి యేర్పడి, బొగ్గుబాధ తప్పినది.
  5. †వారియనంతరము దాని నిప్పుడు నడుపుచున్న తాతాకంపెనీలో తాతాగారి బంధుమిత్రులు సభ్యులుగ నున్నారు.
  6. * విద్యుచ్ఛక్తి కాంతినిచ్చుటకే గాక, పంకాతో గాలి విసురుటకు, ఆవిరికిబదులుగ ఇంజను నడపుటకును గూడ, ఉపయోగించును. నాగపుర ప్రాంతమున జలపాతములేదు. అచట ఆవిరిమూలముననే తాతావారు విద్యుచ్ఛక్తిని పుట్టించి, దానితోనే కొంతవరకు మిల్లులగూడ నడుపుదురు. కనుమల నుండి జలపాతముతో తాతావారే తరువాత విద్యుచ్ఛక్తిని జనింపజేసిరి. దానితో నిప్పుడు బొంబాయిలో మిల్లుల నడుపుచున్నారు.